April 20, 2024

యే దోస్తీ హమ్ నహీ చోడెంగే – ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: మణి వడ్లమాని

“హే స్వాతీ ! నా హెయిర్ స్తైల్ ఎలా ఉంది” అంది స్వప్న
“బావుంది కాని కాస్త లూజ్ చెయ్యి” అంది స్వాతి.
అలాగే ఇంకా ఏవేవో టిప్స్ అడుగుతూ ఉంది. స్వాతి చెబుతూనే ఉంది.
ఆ విధంగా అరగంట గడిచింది.
అంతలో ఏమయిందో ఏమో ఆల్ ఆఫ్ సడన్ “ ఏమి బాగా లేదు. నేను నాలానే లేను అసలు ఇంత అగ్లీగా చేసావో అందరూ నన్ను పిచ్చిది అనుకుంటారు పార్టీ లో. ఇదంతా కావాలనే చేసావు ” అని స్వాతి మీద కోపంగా అరచి వేరే హెయిర్ స్టైల్చేసుకొని. డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోయింది స్వప్న.
ఇదంతా స్వప్న ఫ్రెండ్ శీతల్ ముందు జరిగింది. ఆంటీ అదే శ్రవణ్ మమ్మీ ఉంటే ఇలా జరిగేది కాదు. అరె తను అడిగింది కదా అని హెల్ప్ చెయ్యబోతే తన్ని ఇన్సుల్ట్ చేసి వెళ్ళిపోతుందా” అని స్వాతి కి ఒళ్ళు మండి పోయింది. ఆ కోపం తో కిందకి కూడా వెళ్ళకుండా గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలో స్వింగ్ ఊగుతూ ఫోన్ చూసుకుంటూ ఉంది.
“హాయి డార్లింగ్ “అంటూ బాల్కనీ లోకి వచ్చాడు శ్రవణ్. ఊగుతున్న స్వింగ్ ని ఆపి స్వాతి మీదకి దగ్గరగా వంగి ఏదో చెప్పబోతున్న శ్రవణ్ ని వెనక్కి నెట్టేసింది కోపంగా
“ఆడువారి మాటలకు అర్ధాలు వేరేలే. ’అంటూ పాడుతూ మళ్ళీ దగ్గరగా వెళ్ళాడు. ఈమాటు తనని తోయకుండా ముందే జాగ్రత్తపడ్డాడు స్వాతి చేతులు పట్టుకొని. “ఏమైంది రా అసలు” అని బుగ్గలు నిమురుతూ అడిగాడు.
ఆ చిన్నపాటి కన్సర్న్ కే స్వాతి మొహంలో కన్నీళ్ళు వచ్చేసాయి. అది చూసిన శ్రవణ్ కి ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. “మమ్మీ. మమ్మీ” అని పిలుస్తున్నాడు. ఇంకోసారి పిల్వబోతున్న అతన్ని ఆపేసింది.
“పోనీ నాతోనే అసలు సంగతి ఏంటి చెప్పు” అన్నాడు.
అప్పుడు అతని చేయి పట్టుకొని “నువ్వు ఏమి అనుకోకూడదు. నేను ఏదో కంప్లైంట్ చేస్తున్నాను అని అంది.
“అలాగే! అసలు సంగతి ఏమిటో చెప్పు ముందు”
“స్వప్న తనకి ఏదో పార్టీ ఉందని తనకి నాలా హెయిర్ స్టైల్ చేయమని అడిగింది. ఇంకా కొద్దిగా మేక్ అప్ టిప్స్ అడిగింది చెప్పాను. తయారయింది. మరి ఏమైందో తెలియదు. ఛీ ఛీ నువ్వు అస్సలు సరిగ్గా చెయ్యలేదు అంటూ ఆ శీతల్ ముందే ఎన్నెన్నో మాట్లలు అంటూ అన్ని విప్పేసి. మళ్ళీ తయారయి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నాకు యెంత ఇన్సుల్ట్ గా ఉందో తెలుసా?” అంటూ చెప్పింది.
అంతా విన్న శ్రవణ్ “ఓస్ ఇంతేనా! దాని మొండితనం. నోటి దురుసు నీకు తెలుసు కదా! నువ్వే ఎడ్జెస్ట్ అయిపో అంటూ కమాన్. మనం కూడా బయటకి వెళ్దాం” అంటూ తొందరపెట్టాడు.
బయటకి అనగానే తూనీగలా పరిగెట్టి తయారయి వచ్చింది. జీన్స్ అండ్ వైట్ షీర్ స్లీవ్ లెస్ టాప్ హెయిర్ భుజాల మీదుగా వదిలేసింది. లైట్ గ లిప్ స్టిక్. ఒక చేతికి పెద్దపెద్ద గాజులు వేసుకుంది. మంగళ సూత్రం చైన్ లోపలకి తోసేసింది. పెద్ద హీల్స్ వేసుకొని రెడీ అయింది. చేతిలో మొబైల్ స్వాతి డ్రెస్సింగ్ చూసి శ్రవణ్. మూడు కరెక్షన్స్ చెప్పాడు. టాప్ మార్చేయ్యమన్నాడు. బొట్టు పెట్టుకోమన్నాడు. అంత హీల్స్ వద్దు. మమ్మీ. డాడ్ చూస్తే బావుండదు అని అన్నాడు.
అప్పుడే కాస్త సంతోషంగా ఉన్న స్వాతికి. శ్రవణ్ మాటలు వినగానే మెదడు మొద్దుబారింది. అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు. కొత్తగా వింతగా అనిపిస్తోంది.
ఇవి నేను ఎప్పుడూ వేసుకునేవి కదా ! అందులో నేను ఏమి చీప్ గా డ్రెస్ చేసుకోలేదు. టాప్ పల్చగా ఉన్నా. లోపల camisole వేసుకున్నా కదా! అలా అంటాడేమిటి. ఈ డ్రెస్ మీద బొట్టు బాగోదు కదా! ఇప్పుడు ఇలా కన్సర్వేటివ్ గా మాటలాడుతున్నాడు అని దుఖం ముంచుకు వచ్చి గిర్రున తిరిగి గదిలోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుంది.
“అదేంటి బయటకు వెళ్ళాలి కదా” అన్నాడు
“నేను రాను కావాలంటే నువ్వెళ్ళు” అంది
ఆ మాటలకి కోపం వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మనసులో అనుకున్నాడు ఏంటి ఇలా తిక్కతిక్కగా చేస్తోంది అని
శ్రవణ్ అడుగుల చప్పుడు వినిపించింది. దగ్గరగా రాబోయి. మళ్ళీ వెనక్కి తిరిగి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని లాప్టాప్ చూసుకుంటున్నాడు. పక్కనే మంచం మీద పడుకున్న స్వాతి దగ్గరగా వచ్చి తన్ని బతిమాలతాడు శ్రవణ్ అనుకుంది. కానీ ఆ పక్కకి వెళ్ళిపోయి కూర్చోవడం చూసి ఉడికిపోసాగింది
కొత్తగా పెళ్లయింది. అత్తగారు వాళ్ళు తెలిసినవాళ్ళే. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగారు అందరు. స్వాతి . పెత్తల్లి ఆడపడచు కొడుకే శ్రవణ్. అందరూ ఒక్క చోట ఉండటం వల్ల కలిసి సరదాగా తిరిగేవారు. చుట్టరికంకన్నా స్నేహం ఎక్కువగా ఉండేది. స్వప్న కూడా అంతే. కానీ పెళ్ళయిన ఈ కొద్ది రోజులలో మొదట స్వప్నలో తరువాత శ్రవణ్ లోను మార్పు కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. అనుకుంది స్వాతి.
ఎంతకు శ్రవణ్ స్వాతీ కిందకి రాకపోవటంతో పైకి వచ్చిన శోభ యెడమొహం పెడమొహంతో ఉన్న ఇద్దరినీ చూసింది. అనుభవజ్ఞురాలైన ఆమెకి అర్ధమయింది ఏదో జరిగింది అని. ఎలాగైతేనేం ఇద్దరినీ కిందకి తీసుకొని వచ్చింది. శేఖర్ కూడా ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. శోభ. శేఖర్ ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. సో డైనింగ్ టేబుల్ దగ్గర జస్ట్ జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. వీళ్ళ డిన్నర్ అవుతుండగా వచ్చింది స్వప్న. వాళ్ళు నలుగురు కబుర్లు చెప్పుకోవడం చూసి. ”ఏంటి నేను లేకుండా మీరు నలుగురు ఎంజాయ్ చేస్తున్నారా?” అని అడిగేసింది
అది విన్న స్వాతి చప్పున స్వప్న వైపు చూసింది.
“శ్రవణ్ మాత్రం చ చ అదేం లేదు. అయినా నువ్వు లేకుండానా తల్లీ” అన్నాడు
“అన్ని వట్టిదే. నువ్వు మారిపోయావు” అంది.
అప్పుడు గమనించింది శోభ. స్వప్న, స్వాతి కూడా మాట్లాడుకోవటం లేదు. ఏదో అయి ఉంటుంది వీళ్ళతో మాట్లాడాలి అనుకొంది ఆ మొహాలు చూసి. గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళబోతున్న శ్రవణ్ ని “కొంచెము ఆగరా నీతో మాట్లాడాలి” అంది. పైకి వెళ్ళబోతున్న శ్రవణ్ తల్లి వైపు ఏంటి విషయం అన్నట్టు చూసాడు.
“ స్వాతీ నువ్వు కూడా” అంది
“అలాగే ఆంటీ” అంది స్వాతి
అది చూస్తున్న స్వప్న. ”ఈ స్వాతి మమ్మీని భలే బుట్టలో వేసేసింది” అని కసిగా అనుకుంది.
“స్వప్నా డ్రెస్ చేంజ్ చేసుకొని రా” అని చెప్పింది శోభ.
“అబ్బ మమ్మీ. మళ్ళీ ఎందుకు రావటం. ఇక పోయి నా లాపీ లో ఏదో మూవీ చూసుకుంటాను”. అంది. “అలా కాదు నువ్వు రావాలి” అని గట్టిగా చెప్పింది. “సరే “ అని విసుక్కుంటూ వెళ్ళింది. కొంచెము సేపు అయ్యాక వచ్చిన స్వప్నతో అంది శోభ “ నువ్వు, స్వాతి మాట్లాడుకోవటం లేదా? అంది
దానికి సమాధానంగా ఏదో నసిగింది స్వప్న.
అప్పుడు స్వాతి వైపు చూసి “ఏం ఇద్దరూ పోట్లాడుకున్నారా? నేను గమనిస్తున్నాను ఇద్దరినీ
ఇంతకుముందు మీరిద్దరూ జాన్ జిగ్రీలు కదా. మరి ఇప్పుడేమైంది అంది!” శోభ అలా డైరెక్ట్ గా అడగటంతో ఇద్దరూ ఖంగుతిన్నారు.
అప్పుడు స్వాతి “ఏమో ఆంటీ !మేము హనీమూన్ నుంచి వచ్చినప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది” అంది.
“నేను కాదు నువ్వే. ఇంతకూ ముందు మనం ముగ్గురం భలే సరదాగా ఉండేవాళ్ళము. మీ పెళ్ళయినప్పటి నుంచి ఇద్దరూ మారిపోయారు. నన్ను అసలు పట్టించుకోవడం లేదు అంది” ఉక్రోషంగా అంది స్వప్న.
ఇంతలో శ్రవణ్ ఏదో చెప్పబోతుంటే. శేఖర్ ఆపేసాడు “ముందు మమ్మీని మాట్లాడనీ. ఇలాంటివి మనింట్లో రాకూడదు అనుకున్నా అన్ ఫార్ట్యునేట్లీ అది వచ్చింది. ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలి” అన్నాడు సీరియస్ గా.
“కేర్ ఫుల్ గా వినండి. మన లైఫ్ లో రకరకాల రిలేషన్స్. అందులో వెరీ ఇంపార్టెంట్ పెళ్ళితో ఏర్పడే రిలేషన్. సీరియస్ లీ! ఆడవాళ్ళైన. మగవాళ్లైనా ఇన్ లాస్ తో కార్దియాల్ రిలేషన్ నిలుపుకోవాలి. ముఖ్యంగా దానికి కావలసినది స్నేహం. అంటే స్నేహంలో ఎప్పుడూ ఎక్కువ తక్కువ ఉండవు. అన్ని షేర్ చేసుకుంటారు. ఇన్ హాబిటేషన్స్ ఉండవు. అందుకని అది కలకాలం నిలబడుతుంది. స్నేహం పైకి కనిపించే పదార్ధం కాదు. ఒక కంఫర్ట్ . స్వచ్చంగా. ఓపెన్ గా ఉండగలగటం.
నిజానికి మీరిద్దరూ స్నేహితులయ్యాక చుట్టరికం ఏర్పడింది. సో మీరు ఇంకా బాగా కలిసిపోయి ఉండాలి. అలాంటిది మీమధ్య దూరం పెరిగింది. కారణం ఇగో. నేను ఆడపడచును అని. నేను వదిన్ని అనుకోవడం వల్ల. అంటే మన మైండ్ సెట్స్ అలా ట్యూన్ ఆయిపోయాయి. అసలు వస్తే గిస్తే నాకు రావాలి. అత్తగారిగా కానీ వెరైటీ గా మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
అవి రావడానికి గల కారణాలు చెప్పాలి ఇద్దరూ ఫ్రాంక్ గా ! స్వాతీ . స్వప్న అలోమోస్ట్ దాని కారణం అది ఇందాక చెప్పింది. అది దాన్ని పక్కకు తోసేసినట్లు అనుకుంటోంది. నీ కారణం చెప్పు అంది” శోభ.
“ఆంటీ. పెళ్లి కాకముందు అంటే ఓకే కాని . పెళ్లయ్యాక మేం ఇద్దరమూ బయటకు వెళ్ళాలి అనిపిస్తోంది. అది అసలు తెలుసుకోకుండా వెంటనే మాతో వచ్చేస్తుంది. అలాగే డ్రెస్ చేసుకోవడంలో కూడా అది ఎలాంటి డ్రెస్స్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం వేసుకోకూడదు నేను చిన్నప్పటి చూసిన అంకుల్ కదా! ఇపుడు నాలో మార్పు ఏం వచ్చింది. ఆ డ్రెస్ వద్దు. ఇది వద్దు అంటాడు శ్రవణ్. అందుకు నాకు ఉక్రోషం వస్తోంది. నా ముందే అది వేసుకుంటుంది నేను మాత్రం వేసుకోకూడదు. ఇది అన్యాయం కదా! నా పర్సనల్ స్పేస్ లాగేసుకుంటుంటే నాకు తెలియకుండానే కోపం వస్తోంది”. అని చెప్పింది
“స్వప్నా! ఇలారా నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకో ఫోర్ మంత్స్ లో నువ్వు కూడా అత్తవారింటికి వెళ్తావు. నీకు కూడా ఆడపడచు ఉంది. ఐ మీన్ అదే సుష్మ . మరి స్వాతి కి వచ్చిన ప్రాబ్లెం నీకు వస్తే? ఒక్క సారి ఆలోచించు అంది”. శోభ
“సారీ మమ్మీ ! నేను అది ఆలోచించలేదు”.
“అందుకే థింక్ అవుట్ అఫ్ ది బాక్స్ అనేది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్. MNC లో చేస్తున్నారు. టీం లీడ్ చేస్తారు. అవి ఇంట్లో కూడా అప్లై చెయ్యండి. అక్కడ రిజల్ట్స్ వస్తే హోదా. డబ్బు పెరుగుతుంది. ఇక్కడ రిజల్ట్స్ ఫ్యామిలీ రిలేషన్స్ గట్టిగా నిలబడతాయి. ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండి. సపోర్టివ్ గా ఉంటే యు కెన్ డు వండర్స్ ఇన్ ది వర్క్ ప్లేస్ అంటే హండ్రెడ్ పెర్సెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలరు అవునా కాదా! సో నేను చెప్పేది ఇద్దరూ ఇగో ని బయట కు తోసేసి కూల్ గా ఆలోచించండి” అనేసరికి
స్వప్న. స్వాతి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఫ్రెండ్స్ అంటూ ఇద్దరూ హగ్ చేసుకున్నారు . “
“ఎస్ మమ్మీ. ” “ ఎస్ ఆంటీ” ఇక మేం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని ఒక్కసారే అన్నారు
“ఒరే శ్రవణ్. నేను డాడీ పెట్టని కండీషన్లు నువ్వు పెడుతున్నావేంటి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొట్టెస్తాను. జాగ్రత్త” అంది
“అంటే పెళ్లయ్యాక అలా తను అలా ఉండకూడదేమో అనుకున్నాను మమ్మీ” అని అన్నాడు శ్రవణ్.
“అది కొన్నిరోజులు పోయాక వాళ్ళే తెలుసుకుంటారు. ఆ తెలివితేటలు వాళ్ళకి ఉన్నాయి అని అంది”
“సరే సరే మమ్మీ. రేపు నేను స్వాతి డిన్నర్ కి హోటల్ ఆవాసకి వెళుతున్నాము అని గట్టిగా స్వప్న వైపు కన్ను గీటుతూ. అన్నాడు.
వెంటనే స్వప్న “పోవోయి ఆల్రెడీ రేపునేను మమ్మీవాళ్లతో RADDISON BLUకి వెళుతున్నాను డిన్నర్ కి అని వెక్కిరించింది అన్నగారిని
“అవునా! డాడీ అని అడిగాడు.
“ఊ!. ఆఫీస్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ ఉంది” అన్నాడు శేఖర్
“హే స్వాతీ పోవే పైకి. వాడు అప్పటి నుంచి నన్ను మింగేసేలా చూస్తున్నాడు” అని స్వప్న స్వాతిని తోసింది.
“నీకు ఆవేశం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం తల్లి” అంది శోభ.
ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళాక. అప్పుడన్నాడు శేఖర్. “నిజంగా నీకు ఎలాటి సిట్యుయేషన్ హేండిల్ చేయడం బాగా తెలుసు. గ్రేట్ శోభా! నిజమే నువ్వు అన్నది ప్రతివాళ్ళకి చిన్న పెద్ద ఎవరైనా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. దాన్ని గౌరవించినప్పుడే స్నేహం. సఖ్యత. అభిమానం. ఆత్మీయత అన్ని ఒకదాని వెంబడి ఒకటి వస్తాయి. ఇది చూడటానికి చిన్న విషయమే కాని అది గుర్తించకపోతేనే పెద్దదిగా అవుతాయి. నిజంగా మా చెల్లాయిలతో నీకున్న ఫ్రెండ్ షిప్ చూస్తే నాకు భలే ముచ్చట వేస్తుంది. ఇన్ని రోజులు మన సంసారం లో పెద్దగా ప్రాబ్లెంస్ రాకపోవడానికి నువ్వు అవతల వాళ్ళని అర్ధం చేసుకునే తీరు. అదే కాపాడింది. మొత్తానికి హెచ్ ఆర్ హెడ్ వి అనిపించావు సుమీ” అని నవ్వాడు.
“అవునండీ స్నేహంతో కూడిన ఏ బంధమైనా అన్నోన్యత ని పెంచుతుంది. ఈ జీవన ప్రయాణంలో ఎన్నో బంధాలు. అందులో కొన్ని ముఖ్యంగా జీవితాంతం ఉండేవి. అవి నిలబడాలంటే ప్రేమ. అనురాగం స్నేహం. కావాలి అదే చెప్పాను వాళ్ళకి అంది తృప్తిగా.
******

విశ్లేషణ: డా.మంథా భానుమతి

ఒక కుటుంబం హాయిగా ఉండాలంటే సభ్యులందరి మధ్యా స్నేహ బంధం ఉండాలి. చిన్నతనం నుంచీ ఆడుతూ పాడుతూ పెరిగిన స్నేహితులు బంధుత్వం ఏర్పరచుకుంటే ఆ స్నేహం ఎందుకు తగ్గాలి? వదిన అయ్యాక స్వాతితో స్వప్న స్నేహబంధం ఎందుకు బలహీనపడిపోయింది? ప్రాణస్నేహితురాలి అన్నని పెళ్ళి చేసుకుంటే. జీవితం ఎంతో బాగుంటుందనుకున్న స్వాతి. పెళ్ళయ్యాక స్వప్న నిష్ఠూరాలనీ. భర్త శ్రవణ్ ఆంక్షలనీ భరించలేకపోతోంది. వీరి సమస్యని సానుకూలంగా పరిష్కరిస్తుంది స్వాతి అత్తగారు శోభ.
చక్కని కుటుంబ వాతావరణం కావాలంటే ఒకరి నొకరు అర్ధం చేసుకోవాలని సభ్యులందరూ మంచి స్నేహితుల్లాగా ఉండాలనీ చెప్తుంది.
కుటుంబంలో చిన్న చిన్న అలుకలు. అపార్ధాలూ వస్తూనే ఉంటాయి. అవి పెద్దవి చేసుకోకుండా కలసి మెలసి ఉండాలని. స్నేహం అనేది సహృదయతకి మారు పేరని మణి వడ్లమాని ఈ కథలో చెప్తారు.
మణీ వడ్లమాని రచనలు చేపట్టిన కొద్ది కాలంలోనే మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. చక్కని కథా వస్తువుల నెంచుకుని అందంగా. భావుకతతో కథల నల్లడంలో దిట్ట. నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలనే ఇతివృత్తాలుగా తీసుకుని కథగా మలుస్తారు.

3 thoughts on “యే దోస్తీ హమ్ నహీ చోడెంగే – ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *