April 20, 2024

వామ్మో! పుట్టినరోజు

రచన: సతీష్ కుమార్

నాన్న, తమ్ముడి బర్త్ డే పార్టీ కి, మా ప్రెండ్స్ కూడా వస్తున్నారు.
ఇంటిలో అడుగు పెడుతోంటే మా పెద్దాడు, పదేళ్లవాడు నాకు చెప్పిన సంగతి అది.
సరే, అని తల ఊపి , లోపలికి నడిచాను
చిన్నాడికి డ్రెస్ కొనాలి గుర్తు చేసింది నా అర్ధభాగం.
వాడి పుట్టినరోజు ఇంకా వారం రోజులు తరవాత కదా, అప్పుడు చూసుకోవచ్చు అని ఊరుకున్నాను.
ఆ వారంలో ఎదురొచ్చిన ఆదివారం, నా బ్రతుకు షాపింగ్ మాల్ పాలిట పడేసింది.
***
ఇది తీసికో బాగుంది. అన్నాను కళ్ళకు జిగేలుమని మెరిసిపోతున్న ఒక మోడీ డ్రెస్ చూపించి,
రేట్ చూడండి జేబు చిరుగుతుంది, అంది నాలో సగం
అప్పటికే షాప్ డిస్ ప్లేలో ఉన్న అన్నీ డ్రెస్ లు కిందకి వచ్చేశాయ్
ఇంతకన్నా మంచివి లేవా సేల్స్ మెన్ ను అడుగుతూ , డబ్బులు పెట్టినా మంచి బట్ట కావాలి కదండి అంది నాతో
నాకు అర్ధం అయ్యింది , అక్కడి నుంచి ఇంకో షాప్ సందర్శన భాగ్యం కలిగింది అని.
ఆరేళ్ళ బాబుకి , వెయ్యిలోపు ధరలో రెండు డ్రెస్ లు మంచివి చూపించండి అంటే అక్కడ వేలాడుతున్న వాటిలో చూసుకోమన్నాడు ఆ షాప్ వాడు
ఆ బాక్స్ లలో వున్నవి చూపించండి, నాలో సగం ఆర్డర్ !
వాడు చిత్తం అని నొసటితో విసుక్కుని, నోటితో నవ్వి బాక్సులు దింపాడు.
చేతికి అందిన డ్రెస్ తీయకండి నన్ను హెచ్చరించి, తక్కువలోనే తీసుకుందాం అంటూ సముదాయించి,
చూపిస్తున్న బట్టలు చిందర చేయడం మొదలు పెట్టింది తను.
ఇంతలో నాన్న, తమ్ముడికి ఫుల్ సూట్ కావాలంట అంటూ షాప్లో స్కేటింగ్ చేస్తూ వచ్చాడు మా పెద్దాడు.
చిన్నాడు, ఎక్కడో ట్రయిల్ రూమ్ లో అద్దాలు, లైట్స్ చూస్తుంటే లాక్కొని వచ్చి, నా యజమానురాలు ముందు నుంచో పెట్టాను.
సెలక్ట్ చేసిన డ్రెస్ వాడికి తొడిగి చూడు, క్రిందటి సారిలాగ డ్రెస్సులు మార్చడానికి పొద్దునే నేను వెళ్ళను గట్టిగా చెప్పడానికి కొంచెం ధైర్యం చేసాను.
సరే, వరం ఇచ్చింది నా దేవత.
తరవాత నాలుగవ గంటకు నా చేతిలో బిల్లు ఉంచి కట్టిరండి అంది మా రాణి.
ఆ బిల్లు చూసితిని, యుద్ధంలో గెలిచి సంబరాలకు డబ్బులు లేని రాజులా అయ్యింది నా పరిస్తితి.
నేను ముందర చూసిన జిగేలుమని అన్న డ్రెస్సు ధరకన్నా నాలుగు రెట్లు ఉంది ఆ బిల్లు, తీసినవి రెండు డ్రెస్సులు !
ఈసారి కేక్ కటింగ్ లేదు అంది మా సామ్రాజ్ఞి బయటకు వస్తూ
పెద్దాడు ప్రెండ్స్ కూడా వస్తున్నారట? అన్నాను ఆవిడ భావం నాకు బోధపడక.
ఒక చాక్లెట్ పేకెట్, రస్నా పేకెట్, పావు కిలో మిక్షర్ తీసుకుందాం, ఆ రోజు సేమియా చేస్తాను చాలు, అమ్మగారి ప్లాన్ చెప్పారు, అయ్యగారు ఆ మూటలతో ఇంటికి చేరారు.
***

హ్యాపీ బర్త్ డే, మెనీ మోర్ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, అని మా చిన్నాడిని బర్త్ డే విషెస్ తో నిద్దుర లేపుతున్న నా ఇల్లాలిని చూసి తెల్లబోయి మంచం దిగాను.
వాడి పుట్టినరోజు రేపు కదా !? అంటూ
రేపు స్కూలుకి సెలవు, అందుకే ఇవాళే చాక్లెట్లు పంచుతాడు స్కూల్లో, నాకు సమాధానం వచ్చింది.
హడావిడిగా తయారు అయ్యి పిల్లలను స్కూల్లో వదిలి ఆఫీసుకు పరుగెత్తాను.
సాయంత్రం కేకు కట్ చేయకపోయినా హల్లో బెలూన్లు ,రిబ్బనులు అయినా కట్టకపోతే వాడు ఏడుస్తాడు
ఒకరోజు ముందుగా చెప్పినా పర్మిషన్ దొరకదు, అప్పటికి అప్పుడే అంటే ఎలా?
ఎంతో బతిమాలితే, హాఫ్ డే లీవ్ కట్ చేసి, గంటన్నర పర్మిషన్ ఇచ్చాడు మా బాసాసురుడు!
ఆ బాధని ఆఫీస్ డెస్క్ కి అతికించి, బెలూన్లు, రిబ్బనులు తీసుకుని ఇంటి బాట పట్టాను.
***
తను బయటకు వెళ్ళినట్లు, నన్ను వెక్కిరిస్తున్న తాళంను చెవితో సంహరించి కోటలో జోరబాడ్డాను!
మనకు రాని పనినే అందరూ మెచ్చేట్టు చేయాలని , మా రాణీ వారి ఉవాచ గుర్తు వచ్చి
బెలూన్లు, రిబ్బన్లు హల్లో దండాలుగా కట్టాను.
సబ్భాషో అని మురిసిపోయేలోపే,
రేపటి పార్టీకి ఇప్పుడే తొందరా? అంటూ మా గృహలక్ష్మి నన్ను అయోమయంలోకి నెట్టింది.
తరవాత తీరిగ్గా ఆలోచిస్తే మా చిన్నడికి రెండు డ్రెస్సులు తీయటంలో దూరాలోచన నాకు బోధ పడింది అప్పుడు?
దేముడికి చిన్న బ్రహ్మోత్సవాలు లాగ మా చిన్నడికి ఆ ఏడు రెండురోజులు పుట్టినరోజు పండుగ అని !
అసలే డబ్బుతో వచ్చే ధైర్యం నాకు కలిగి మూడు వారాలు అయ్యింది.
దివాళా తీసిన ప్రభుత్వ ఖజానాకు తక్షణ వరద సహాయం కోసం వచ్చిన అర్జీలా ఉంది ఆ పరిస్థితి.
నేను రేపు ఆఫీస్ లో పర్మిషను తీసుకోను కచ్చగా చెప్పాను ,హాఫ్ డే లీవ్ కట్ గుర్తుకు వచ్చి,
మరేం పర్వాలేదు, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి రాణీగారు నా అభ్యంతరం తోసిపుచ్చింది.
***
తరువాత రోజు సాయంత్రం
నేను మా బాసాసురుడు పాలిట పడి ఆ వారానికి సరిపడా అక్షంతలు వేయించుకుని, బయటకు వచ్చి
మొబైల్ ఫోన్ చూసుకుంటే ఇంటినుంచి మూడుసార్లు పిలుపు తప్పిపోయింది.
ఏమి ములిగిందో అని తిరిగి ఫోన్ చేస్తే
ఏమండీ ! ఇంటికి వచ్చేప్పుడు ఇంకో కిలో మిక్షర్ పట్రండి అని రాణీగారు హుకుం
జీ జీ అని జేబులో తడుముకుంటే, వంద చిల్లులు పడిన ఐదు వందల కాగితం నన్ను దీనంగా చూస్తోంది!
నీకు రెక్కలు ఇస్తున్నాను అనుకుంటూ కిలో పొట్లం తో ఇంటికి చేరి, బరువు దింపుకుందాం అనుకునే సరికి
మా పెద్దాడు వచ్చి నిన్ను కేకు తెమ్మనింది అమ్మ అని ఆ బరువు తీసుకుని లోపలికి వెళ్ళాడు.
ఉస్సూరు మని కేకు తీసుకుని వచ్చాను

హాల్లో చూద్దును కదా, నిండా పిల్లలతో కొత్త సినిమా టికెట్ కోసం కొట్టుకుంటున్న వారిలా ఉంది పరిస్తితి.
మా ఇల్లేనా అని నాకు సందేహం వచ్చింది.
మా గృహలక్ష్మి పిలుపుతో లోపలికి నడిచాను.
మీ పెద్దాడు చేసిన నిర్వాకం ఇది అంది తను, నేను మాట్లడేలోపు
తప్పు నాదే అన్నట్లు
ఆ వచ్చిన వాళ్ళలో కొందరే మా చిన్నాడి ఫ్రెండ్స్
మిగిలిన వారు ఎవరోకానీ ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు !
ఆవేశంతో మా పెద్దాడిని పక్కకు తీసుకుని వెళ్లాను, గట్టిగా రెండు తగిలిద్దామని ఆగి,
ఏమిటిది ? వాడి బర్త్ డేకి నీ ఫ్రెండ్స్ ఎందుకు గట్టిగా మొరిగాను.
వాడు ముందు భయపడినా మెల్లిగా సంగతి బయట పెట్టాడు
నా బర్త్ డే అయ్యాక వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు.
మరి నా బర్త్ డేకి వీళ్ళని పిలవాలంటే ఇంకా బోల్డు రోజులు ఉంది కదా,
అందుకని, తమ్ముడి బర్త్ డేకి వీళ్ళని పిలిచాను
ఏమి గిఫ్టులు తేవాలో ముందే చెప్పానుగా
ఒకవేళ రెండు గన్లు వచ్చాయనుకో నాకు ఒకటి ఇస్తాడు కదా
అయినా వాడికి వచ్చిన అన్నీ గిఫ్స్ట్ తమ్ముడే ఆడుకోడుకదా?
ఎక్కువ మంది వస్తే ఎక్కువ గిఫ్ట్స్ కూడా వస్తాయి
వాడి వాదన ముగించాడు

మా శ్రీమతి తెల్లబోయింది.

వాడి తెలివికి నా జీతం తెల్లారింది

3 thoughts on “వామ్మో! పుట్టినరోజు

  1. దివాళా తీసిన ప్రభుత్వం ఖజానాకు తక్షణ వరద సహాయం కోసం వచ్చిన అర్జీ
    Baagundi

  2. ధన్యవాదాలు , నా కథను ప్రచురించినందుకు, మరిన్ని చదవగలిగే కధలు వ్రాయడానికి , నాకు ఇది ఒక టానిక్ 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *