June 14, 2024

అంతరంగం

రచన: శ్రీకాంత గుమ్ములూరి

ఆరేళ్ళ అప్పూ అమ్మ కోసం అన్ని దెసలా వెతికాడు. అమ్మ కన్పించలేదని ఏడ్చి ఏడ్చి అలిసిపోయాడు.
ఇంటా బయటా వాడంతా వెతికి వెతికి వేసారిపోయాడు . తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటివైపుకి నడిచాడు. చిమ్మ చీకట్లు. చీకట్లో చింత చెట్టు చింతాగ్రస్తంగా చిరుకొమ్మల్ని అటూ ఇటూ కదలిస్తోంది. మనసంతా అంధకారం అయోమయం. నిజంగానే అమ్మ తననలా ఒదిలిపెట్టి వెళ్లి పోయిందా? తాను చేసిన పనికి కోపం వచ్చే అలా వెళ్లిపోయిందా? అమ్మ కనబడగానే చెప్పాలి, మరి ఇంకెప్పుడూ ఏదీ కావాలని మారాం చెయ్యనని, తననెప్పుడూ ఒక్కణ్ణీ ఒదిలేసి వెళ్లి పోవద్దని. ఆకలి , భయం , ఆవేదన అన్నీ కలిసి చుట్టుముట్టేసరికి శోష వచ్చి ఇంట్లో నేలమీదికి ఒరిగి పోయాడు. నిద్రలోకి జారి పోయాడు. తెల్లవారవస్తోంది. ఒంటరితనం వెన్నుతట్టి లేపగానే లేచి వీధిలోకి నడిచాడు.
అమ్మ మీద అలిగి తాను విసిరేసిన ఎర్ర బంతిలా సూర్యుడు పైకి లేచాడు !
తనకు కావాల్సింది వెదురుబుంగ! అమ్మ తన వద్ద అన్నిడబ్బులు లేవు మరొకసారి కొంటానులే ఇప్పుడు ఈ ఎర్ర బంతితో ఆడుకొమ్మని ఇది కొనిచ్చింది.” దీని బదులు దానినే కొనచ్చుగా ! నాకేం ఇది వద్దు.” అంటూ గట్టిగా ఏడుపు మొదలెట్టాడు. అమ్మ బుజ్జగింపుకి ఏమాత్రం లొంగలేదు. వాడితో పాటుగా ఒక జోరీగ ‘ఊ ఊ ఊ … ‘ అంటూ విదిలించినా వెళ్ళకుండా శబ్దం చేస్తూ చుట్టూ తిరుగుతోంది వాడి బుర్రలోని వదలలేని కోరికలా వాళ్ళమ్మని పట్టి పీడిస్తున్న పేదరికపు దుర్భాగ్యంలా!
ప్రతిరోజూ ప్రొద్దున్నే వీరూ కాకా బెలూన్లు, బొమ్మలు, బంతులు , వెదురు బుంగలు అన్నీ అమర్చిన తన బల్ల చెక్కస్టాండుని భుజానికి ఆన్చుకుని, చంకతో అదిమి పట్టి, వెదురుబుంగని పెదవుల దగ్గర ఆన్చి పెట్టి, రెండు చేతివేళ్ళతోనూ కన్నాలను మూస్తూ తెరుస్తూ ఎంత చక్కగానో వెదురుబుంగని ఊదుకుంటూ మంచి మంచి పాటల్ని దానిమీద వాయిస్తాడు . పొట్టకూటికోసం వీధిన పడతాడు . శ్రావ్యమైన ఆ వేణువు ధ్వని ఈ చిన్నారి హృదయానికి ఎంతగానో హత్తుకుపోయింది! ప్రతి ఉదయం అంత దూరం నించి వేణువు ధ్వని వినబడగానే గబగబా తమ పాకలోనుంచి పైకి పరుగెత్తుకు వచ్చి చింతచెట్టు బోదె నానుకుని, కాకా వీధి మలుపు తిరిగి వెళిపోయేదాకా, వేణుగానం తన కర్ణపుటాల కందనంత దూరం వెళ్ళేదాకా మైమరచే ఆనందంతో అక్కడే నిలబడతాడు. అమ్మ పిలుపు వినబడే దాకా అలానే ఊహాలోకాల్లో విహరిస్తాడు. తనూ కాకా లాగానే వేణువు నూదాలి. అమ్మకి తన పాట వినిపించి ఆనంద పెట్టాలి. ఆదమరచిన అనురాగంతో అమ్మ తనను అక్కున చేర్చుకుని ముద్దాడితే తన ఆనందానికి అవధులుండవు!! ఆ భావనా ప్రపంచంలో, ఆకాశంలో ఒక పెద్ద మేఘం ఒక పిల్ల మేఘం ఒకదాని నొకటి తరుముకుంటూ, చల్లగాలిలో తేలియాడుతూ పరుగులు పెడుతున్నాయి వాడి ఊహల కనుగుణంగా !
బయటికి నడిచిన అప్పూ చింత చెట్టుకి అల్లంత దూరంలో వున్న బండరాయి మీద బోర్లా పడుకున్నాడు బరువైన ఆలోచనలతో. పక్కనే వున్న ప్రహరీ గోడపైనించి తొంగి చూసాయి మందారాలు ఎర్రబడ్డ ముఖాలతో. పసివాడి అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ, కన్నీటిని జలజలా కురిపించాయి. పారిజాతాలు సానుభూతితో. వెచ్చటి సూర్య కిరణాలు తాకాయి వాడి వీపుని అమ్మ స్పర్శతో.
ఆత్మ విచారం, అంటే ఆత్మ సంబంధమైన భావనలు మనలోనే కాకుండా మన బాహ్య ప్రపంచంలో కూడా ప్రకటమవుతాయి. ఆ భావనల కాది మూలమైన స్వరూపం మన చుట్టూ వున్న పరిసరాల్లో ప్రస్ఫుటమవుతూ వుంటుంది – జంతువులలో, చెట్లలో, మనుషులలో, రాళ్ళలో ! ఆ సమయంలో ఆ ఆలోచనలన్నీ మనవి కావు వాటివి అవే మాట్లాడతాయి ! జంతువులూ, చెట్లూ,పక్షులూ మొదలైనవి , అవే మన అంతః ప్రపంచంలోని భావనలకి అద్దం పడతాయి. ఒక్కోసారి చీకట్లో చెట్లన్నీ గుసగుసలాడుతూ రహస్యమయమైన గాధల్ని వివరిస్తాయి. పారమార్ధికమైన వివేకం మనకి ఉండి వాటిని అర్ధం చేస్కోగలగడం మన అదృష్టం .
సూర్యుడు తీక్షణమైన వేడితో నెత్తిని చురచురలాడించాడు.అప్పూ కడుపులో ఆకలి నక నక లాడింది. అమ్మ ఎందుకలా అంతర్ధానమైందో అంతుపట్టని వాడి ఆలోచన వెరవెరలాడింది. తన క్రింద నున్న బండరాయి బాగా వేడెక్కడంతో దాని మీద పాకుతున్న ఒంటరి నల్ల చీమ గిలగిల్లాడింది. ఆ రోజుకి తన పని ముగించుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటిముఖం పట్టిన వీరూ కాకా మండుటెండలో బండరాయి మీద పడుకున్న అప్పూని చూసాడు. వాడి హృదయం విలవిల్లాడింది.
“సంతలో తాను విన్న సంగతి ఈ పసివాడికెలా చెప్పడం? వీడి బ్రతుకేమైపోతుంది?” వీరూ కాకా వీడి గురించే ఆలోచిస్తున్నాడు. “ఎటువంటి అనుబంధమూ లేని వీడి పై తనకెందుకు జాలి? తనలాగా వాడుకూడా ఒంటరిగాడైనందుకా? ఆరేళ్లకే అమ్మని పోగొట్టుకున్నవాణ్ణి ఆదుకునే వాళ్లెవ్వరనే చింత తన బుఱ్ఱని దొలిచేస్తున్నందుకా?ఆపదలో ఉన్న అసహాయుడికి తన చేతనైన సహాయం చెయ్యాలనే మానవత్వం తనలో మిగిలి ఉన్నందుకా?” ఆ క్షణంలో ఆ చిన్నవాడిపై మైత్రీభావం పెల్లుబికింది.
రోజూ తాను ఆ వీధి నించే వెళ్తాడు. తాను వేణువు ఊదుకుంటూ వెళ్తుంటే మెరుస్తున్న వాడి కళ్ళు తనను వెంటాడడం తనకు తెలుసు. వేణువు కొనమని మారాం చేస్తే, వాడి అమ్మ విసుక్కుంటూ, అర్ధరూపాయికి అన్నిట్లోకి చవకదైన ఎఱ్ఱ బంతి కొనిచ్చింది గీచి గీచి బేరం చేసి. బోణి బేరం కిట్టుబాటు కాని బేరం. ఇటు తనకి, అటు పిల్లాడికి, వాడి అమ్మకీ – ముగ్గురికీ సంతృప్తి కలగ లేదు. అప్పూ గట్టిగా ఏడుస్తూ బంతిని విసిరేసాడు. కనీసం చిన్నవాడికైనా సంతోషాన్ని ఇవ్వలేకపోయానన్న నిస్పృహతో వీరూ కాకా నిష్క్రమించాడు.
ఏ దిక్కూ లేనివాడికి దేవుడే దిక్కు కదా! తనే వీడి పాలిట దేవుడవాలని ఆ దేవుడే నిర్ణయించాడా? తన ప్రమేయం లేకుండానే తన కాళ్ళు తనని చింత చెట్టు వైపుకి నడిపించాయి. కన్నీటి చారలతో మట్టి కొట్టుకున్న ముఖం పైకెత్తాడు అప్పూ. “ఆకలేస్తోందా ?” అన్నాడు కాకా. వాడు తలూపాడు. కాగితం పొట్లంలోనించి , తనకోసం కొనుక్కున్న దాన్లోంచి సగం తిండి వాడికిచ్చాడు. పైన ఒక నల్లమబ్బు మండుతున్న సూర్యుడికి గొడుగులా అడ్డు వచ్చింది. ఆత్మారాముడు శాంతించాడు. గలగలలాడుతూ చింతాకులు చిన్న గాలిని వాడివైపు తోస్తూ సేద తీర్చటానికి ప్రయత్నించాయి.
కాకా మౌనంగా వాడి చేతిలో ఒక వెదురు బుంగ నుంచాడు !!
వాడు మెరుస్తున్న కళ్ళతో దాన్ని అందుకుని పెదవుల కాన్చి గట్టిగా ఊదాడు.
“అప్పూ!!” ఆర్తితో అమ్మ పిలుపు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *