May 26, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 12

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య.

sahasra-deepalankarana-seva

భక్తుడు ఏకులం వాడు? ఏమిచేసే వాడు? అన్న బేధం భగవంతునికి లేదు. భక్తి గలిగి ఉంటే చాలు. జీవుడు ఎలాంటివాడు అని కాకుండా జీవుడు తన అంతరాత్మలో నిత్యం భగవంతుని స్మరిస్తే చాలు పాపాలు పటపంచలవుతాయి. భగవంతుడు భక్తునికి కైవశమౌతాడు అని బోధిస్తున్నాడు అన్నమయ్య.

పల్లవి: పరుస మొక్కటే కాదా పయిడిగా జేసేది
అరయ లోహమెట్టున్నా నందుకేమీ
చ.1. వనజనాభుని భక్తి వదలకుండిన జాలు
మనసు ఎందు దిరిగినా మరియేమి
మొనసి ముద్రలు భుజముల నుండితే జాలు
తనువెంత హేయమైనా దానికేమి ||పరుస||
చ.2. శ్రీకాంతు నామము జిహ్వ దగిలితే జాలు
ఏ కులజుడైనాను హీనమేమి
సాకారుడైన హరి శరణు జొచ్చిన జాలు
చేకొని పాపములెన్ని చేసిననేమి ||పరుస||
చ.3. జీవుడెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మ
శ్రీవేంకటేశునా కాచింత యేమి
యేవలన బరమైన ఇహమైన మాకు జాలు
కైవశమాయ నతడు కడమలింకేమి ||పరుస||
(ఆ.సం.1- 78వ రేకు. కీ.సం.373)
విశ్లేషణ:
పల్లవి: పరుస మొక్కటే కాదా పయిడిగా జేసేది
అరయ లోహమెట్టున్నా నందుకేమీ…

అన్నమయ్య ఆవిష్కరించిన చక్కని ఆధ్యాత్మిక, వైరాగ్య దీపిక ఈ కీర్తన. పరుసవేది మణి మాత్రమే కదా సకల లోహాలను బంగారంగా మార్చే గుణమున్నది. ఆయా లోహాలు ఎలా ఉంటే ఏమిటి? పరుసవేది తాకితే చాలు అవన్నీ బంగారంగా మారిపోతాయి అని పరుసవేదిని భగవంతునికి, జీవులను అధమ లోహాలకు అన్నమయ్య “ప్రతీక” గా వాడుతున్న విధానం అత్యద్భుతం.

చ.1. వనజనాభుని భక్తి వదలకుండిన జాలు
మనసు ఎందు దిరిగినా మరియేమి
మొనసి ముద్రలు భుజముల నుండితే జాలు
తనువెంత హేయమైనా దానికేమి.

వనజనాభుని మీద భక్తి తత్త్వం నిరంతరం వదలకుండా ఉండాలి, మనసు పరిపరివిధాలపోయినా దాన్ని సమర్ధించే శక్తి ఆ భగవంతుడే మనకు ఇస్తాడు. వైష్ణవ ముద్రలు భుజాలపై ధరిస్తే చాలు తనువెటువంటిదైనా పరమ పవిత్రంగా మారిపోతుంది. భక్తే అతి ముఖ్యమైనది. తనువు, మనసు ఆ భగవంతుడే నియంత్రించుకునే శక్తిని ప్రసాదిస్తాడని అన్యాపదేశం.

చ.2. శ్రీకాంతు నామము జిహ్వ దగిలితే జాలు
ఏ కులజుడైనాను హీనమేమి
సాకారుడైన హరి శరణు జొచ్చిన జాలు
చేకొని పాపములెన్ని చేసిననేమి

భక్తుడు ఏకులం వాడన్న ప్రసక్తి లేదు. ఏ కులమూ, వర్ణమూ హీనం కాదు. ఆ భక్తుడు హరి శరణు జొచ్చే గుణం ఉండిన వాడైతే చాలు. శ్రీకాంతుని నామం నాలుకకు తగిలితేనే చాలు. శ్రీవేంకటేశ్వరుని నామం స్మరిస్తే చాలు, పాపాలెన్ని చేసినా అవన్నీ పటాపంచలైపోతాయి అంటున్నాడు అన్నమయ్య. అలా అని పాపాలు చెయ్యమని సందేశం కాదు. నామ స్మరణచేస్తున్నట్లైతే ఆ పాప పంకిలమైన ఆలోచనలన్నీ కనీసం కొంత కాలానికైనా దూరం అవుతాయని అన్యాపదేశం.

చ.3. జీవుడెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మ
శ్రీవేంకటేశునా కాచింత యేమి
యేవలన బరమైన ఇహమైన మాకు జాలు
కైవశమాయ నతడు కడమలింకేమి

జీవుడు ఎలా ఉన్నా..ఎలాంటి జీవనం గడిపేవాడైనా పర్వాలేదు. జీవునిలోని అంతరాత్మ మంచిదైతే చాలు. శ్రీవేంకటేశ్వరునికి ఆ చింతలు ఏమీ ఉండవు. ఎటువంటి కొరతయూ లేక మనలను సం రక్షిస్తాడు. గజేంద్రుని రక్షించలేదా? ఇహపరాలలో రెండిటిలో చింతలేని సుఖసంతోషాలను మనకు ప్రసాదించేది ఆ శ్రీవేంకటేశ్వరుడే! ఆ మూర్తి భక్తులకు కైవశమౌతాడన్న సత్యం గ్రహించరా మానవుడా! అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య.

విశేషాంశాలు:
ముద్రలు: శంఖు, చక్ర ముద్రలు రెండు భుజాలపై వేయించుకొన్న వారు వైష్ణవులు. అన్నమయ్యకు అట్టి ముద్రలను, తిరుమలలో ఘనవిష్ణువు అనే యతి పంచ సంస్కారాలను గావించి వైష్ణవునిగా మార్చాడు.
పంచ సంస్కారాలు:
1. శరీరం విూద చక్రాంకితాలు వేయడమనే తాపక్రియ,
2. పుండ్రధారణ,
3. వైష్ణవ నామకరణ,
4. తిరుమంత్రోపదేశం,
5. యజ్ఞాధికార ప్రదానం.
ప్రతీక: పాశ్చాత్యవాదాల ప్రభావం ఆధునిక కవిత్వంపై ఎక్కువైన తరుణంలో, 1940 దశకం అనంతరం ఆధునిక కవిత్వాన్ని బాగా ప్రభావితం చేసినవాదం సింబాలిజం లేక “ప్రతీకవాదం”. ప్రతీకలు కవి భావాలకు సంబంధించినవి. వైయుక్తికమైనవి. అంటే “సమగ్ర భావమయ ప్రపంచం” ప్రతీకలలో మనకు దర్శనమిస్తుంది. ప్రతీకలో ఒక విషయం మరో విషయానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. ఆ ప్రాతినిధ్యం ప్రత్యక్షంగా కాక, స్ఫురించే రీతిలో ఉంటుంది. ప్రతీక అంటే సులభంగా చెప్పాలంటే… అసలు వస్తువు కాకుండా, దాని బదులు మరో వస్తువును చెప్పి అసలు వస్తువుకి సంబంధించిన భావాంశాన్ని స్ఫురింపజేస్తే అది “ప్రతీక” అవుతుంది. మన అలంకారాల లోని ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకాలతో చాలా కొద్దిగా సాదృశ్యం ఉన్నా బేధం మాత్రం చాలా ఎక్కువే! “ఆమె పుష్పంలా ఉంది” అంటే అది ఉపమాలంకారం అవుతుంది. “ఆమె పుష్పం” అంటే అది రూపకాలంకారమౌతుంది. “ఆమె” అని చెప్పకుండా పుష్పాన్ని మాత్రమే వర్ణిస్తూ ఆమె లక్షణాలన్నీ దానికి అన్వయిస్తూ, ఆమెను ప్రతిక్షణమూ స్ఫురింపజేస్తే అప్పుడు పుష్పం ఆమెకు “ప్రతీక” అవుతుంది. అన్నమయ్య పరుసవేదిమణిగా భగవంతునికి ప్రతీకగా.. మానవులను హీన లోహాలకు ప్రతీకగా వాడడం గమనిస్తే.. అన్నమయ్య పాశ్చాత్యులకంటే దాదాపు 5 శతాబ్దాలకు ముందే ప్రతీక వాదాన్ని వాడడం సుబోధకమౌతుంది.
ముఖ్యమైన అర్ధములు :
పరుసవేది = ఇనుము వంటి అధమలోహములను బంగారంగా మార్చగలిగిన శక్తి గల మణి; పైడి, పయిడి = బంగారము; అరయ = పరీక్షించి అర్ధంచేసుకోవడం; వనజనాభుడు = తామరపుష్పాన్ని నాభియందు గలవాడు, శ్రీమహావిష్ణువు; శ్రీకాంతుడు = శ్రీమహాలక్ష్మి యొక్క భర్త;
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *