June 14, 2024

పెళ్లి

రచన: అప్పరాజు నాగజ్యోతి

సాయిగార్డెన్స్ లో విశాల్, శిల్పల పెళ్లి జరుగుతోంది. ఒక వేపు పెళ్ళికూతురు తల్లితండ్రులైన సుమతి, రాజారావులు పెళ్ళికొడుకు తరఫు వారికి జరగవలసిన మర్యాదలకి ఏ లోటు లేకుండా చూసుకునే హడావిడిలో ఉంటే, మరో వేపు పెళ్ళికొడుకు అమ్మానాన్నలైన ఉష , భానుమూర్తీ తమ వైపు నుండి వచ్చిన ముఖ్యులందరినీ స్వయంగా రిసీవ్ చేసుకుంటున్నారు.
పెళ్ళికి వచ్చినవారిని నవ్వుతూ పలకరిస్తున్నప్పటికీ “కొడుకు పీటల మీద ఏం పేచీలు పెడతాడో, ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందో, లేదో “ అని మనసులో ఎంతో టెన్షన్ పడుతోంది ఉష . ఉష అంతగా ఆందోళన పడడానికి కారణం విశాల్ కి ఈ పెళ్లి యిష్టం లేకపోవడమే.
***
విశాల్ ఎంబీఏ పూర్తి చేసి, ఢిల్లీలో ఒక పెద్ద మార్కెటింగ్ ఫర్మ్ లో బిజినెస్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో అతనికి జూనియర్ గా చేరింది రుచిత. రుచిత అందం, కలుపుగోలుతనం విశాల్ ని ఆకట్టుకుంటే , విశాల్ చురుకుదనమూ, తెలివితేటలూ రుచితని ఆకట్టుకున్నాయి. యిద్దరి మనస్తత్వాలు, అభిప్రాయాలు కూడా ఏకమవ్వడంతో, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పీకలోతు ప్రేమలో పడిపోయారు. తమ ప్రేమ విషయం అమ్మా నాన్నలకి చెప్పి, వారి అంగీకారంతో త్వరలోనే తనని పెళ్లి చేసుకుంటానని రుచితకి మాట యిచ్చిన విశాల్, ఆఫీస్ లో సెలవు తీసుకుని హైదరాబాద్ లో అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళాడు.
రుచిత క్రిస్టియన్ అని తెలిసిన భానుమూర్తి ఈ పెళ్ళికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. ఒక క్రిస్టియన్ ని తన యింటి కోడలిగా ఎన్నటికీ అంగీకరించనని ఖరాఖండిగా చెప్పాడు. అంతే కాదు, తను చెప్పిన దానికి వ్యతిరేకంగా విశాల్ గానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, తన శవాన్నే కళ్ళచూస్తారని కూడా బెదిరించాడు.
భానుమూర్తికి ఆవేశమూ , పట్టుదలా రెండూ ఎక్కువే, తను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తాడు. ఆ విషయం అతని భార్య ఉషకీ , కొడుకు విశాల్ కీ ఎన్నోసార్లు అనుభవమే. అందుకే వారిద్దరూ అతనికి ఎదురు చెప్పలేకపోయారు.
భానుమూర్తి అప్పటికప్పుడు యింటర్నెట్ లో తెలుగు మాట్రిమోనియల్ అంతా గాలించి , పది రోజుల్లో కొడుకు పెళ్లి శిల్పతో ఖాయం చేసాడు. తండ్రి పట్టుదల ఎరిగిన విశాల్, తప్పనిసరి పరిస్థితులలో ఈ పెళ్ళికి తల వంచాడు .
***
పెద్దగా బాజాలు మ్రోగుతుంటే ఉలిక్కిపడ్డ ఉష, ఆలోచనల నుంచి బైటపడింది. పెళ్ళికూతురు తలపై పెళ్ళికొడుకు జీలకర్ర, బెల్లం పెట్టడం, ఆ తరవాత మెళ్ళో తాళి కట్టడం చూసిన తరవాత గానీ ఆమె మనసు స్థిమితపడలేదు.
***
పెళ్లి జరిగిపోయినా కూడా కొడుకు , కోడలితో ముభావంగా, అంటీముట్టనట్టుగానే వుండడం గమనించిన ఉష, భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపితే అన్నీ సర్దుకుంటాయనే ఆశతో , భర్తకి చెప్పి ఊటీ, కొడైకెనాల్ కి టికెట్స్ బుక్ చేయించి వారిద్దరినీ హనీమూన్ కి పంపించింది. కానీ ఆమె ఆశ అడియాసేనని , హనీమూన్ నుంచి ఎడమొహం పెడమొహం పెట్టుకుని తిరిగి వచ్చిన జంటని చూసి అర్థం చేసుకుంది. సెలవు అయిపోవడంతో ఢిల్లీకి వెళ్ళిపోయాడు విశాల్.
***
లంచ్ టైంలో రుచితతో కలిసి క్యాంటీన్లో లంచ్ చేస్తుండగా జరిగినదంతా చెప్పాడు విశాల్ .
“ రుచీ , మా నాన్న కోసం నేను ఈ పెళ్లి చేసుకున్నానే గానీ, శిల్పని నేను తాకను కూడా తాకలేదు. నేనసలు తనని నా భార్యగానే చూడలేదు. నన్ను నమ్ము. నేను మనసా, వాచా ప్రేమించింది నిన్నే రుచీ. ఈ విషయం త్వరలోనే శిల్పకి చెప్పి , తన నుంచి విడాకులు తీసుకుంటాను. ఆ తరవాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం “ .
తమ పెళ్ళికి అమ్మానాన్నలని ఒప్పించిన శుభవార్తతో విశాల్ వస్తాడని ఎదురు చూసిన రుచిత హతాశురాలైంది. కొడుకు అభిప్రాయానికీ, తమ ప్రేమకీ పిసరంత కూడా విలువనివ్వకుండా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి విశాల్ కి వేరే అమ్మాయితో పెళ్లి చేసిన అతని తండ్రి మీద రుచితకి పట్టరాని కోపం వచ్చింది. మనసనేది లేని అలాంటి తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించిన రుచితకి విశాల్ చెప్పినది సబబుగానే అనిపించింది ఆ క్షణాన .
“ సరే విశాల్, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నీ కోసం నేను ఎన్నాళ్ళైనా వేచి వుంటాను “ అని హామీ యిచ్చింది.
ఆ తరువాత విశాల్, రుచిత ఎప్పటిలాగే హాయిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు ఢిల్లీలో.
***
రెండు నెలలు గడిచినా, విశాల్ నుండి ఏ కబురూ రాకపోవడంతో ఉషా, భానుమూర్తిలు కంగారు పడ్డారు. ఫోన్ చేసినా కూడా కొడుకు రెస్పాండ్ అవటంలేదు. మరో వేపు శిల్ప తల్లితండ్రుల వత్తిడి ఎక్కువయ్యింది “ అబ్బాయి ఢిల్లీలో ఇల్లు తీసుకున్నాడా? మా అమ్మాయిని కాపురానికి ఎప్పుడు తీసుకునివెళ్తారు ? “ అంటూ. ఏం చేయాలో పాలుపోలేదు వారికి.
***
తెల్లవారు జామున నాలుగు గంటలకి ఫోన్ మ్రోగుతుంటే నిద్ర మత్తులోనే లిఫ్ట్ చేసిన రుచిత, అక్క వినితకి సీరియస్ గా వుందని ఫోన్లో నాన్న చెప్పిన వార్త వినగానే, అప్పటికప్పుడు వాళ్ళ ఊరికి బయలుదేరింది.
ఉదయం తొమ్మిది గంటలకల్లా ఊరు చేరుకున్న రుచిత, డైరెక్ట్ గా అక్కని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కే వెళ్ళింది . వినిత తీసుకున్న విషం డోస్ చాలా ఎక్కువగా ఉండడంతో, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వచ్చినా కూడా ప్రయోజనం లేకపోయింది. హాస్పిటల్ కి రుచిత చేరుకున్న గంటలోనే , వినిత ఆఖరి శ్వాస విడిచింది.
రుచిత అమ్మానాన్నల దుఃఖానికి అంతు లేదు. రుచిత, వినిత ల నడుమ వయసులో వ్యత్యాసం ఎక్కువ లేకపోవడంతో , యిద్దరూ చిన్నతనం నుండీ శరీరాలు వేరైనా , ఒక్కటే మనసుగా కలిసిమెలిసి పెరిగారు. అలాంటిది యిలా అకస్మాత్తుగా అక్క మరణించడం అనేది రుచిత మనసు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
“ అన్ని విషయాలూ తనతో పంచుకునే అక్క అసలిలా ఎందుకు చేసిందీ ? “ అన్న ప్రశ్నకి సమాధానం రుచితకి అమ్మా నాన్నల ద్వారా తెలిసింది.
***
వినితకి పెళ్లై మూడు సంవత్సరాలు కావొస్తోంది. వినిత భర్త రవి, వినితనెంతో ప్రేమగా చూసుకునేవాడు. భార్యా భర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. వారి అన్యోన్యతని చూసి ఎవరికీ కన్ను కుట్టిందో మరి.
నాల్గు నెలల క్రిందట , రవికి డిగ్రీలో క్లాస్ మేట్ అయిన రాగిణి , రవి ఆఫీస్ లోనే జాయిన్ అయ్యింది. కాలేజీ లో చదువుకునేటప్పుడు , రవి, రాగిణి ప్రేమించుకున్నారు, ఎన్నో బాసలు చేసుకున్నారు. కానీ విధి వైపరిత్యమో ఏమో, అనుకోని పరిస్థితులలో వారిద్దరూ విడిపోయారు. రవిని మరిచిపోలేని రాగిణి యింతదాకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉండిపోయింది. చాలాకాలానికి కలిసిన ఆ జంట మధ్య మునుపటి ప్రేమ మళ్ళీ ఊపిరి పోసుకుంది. దాంతో , భార్యకి విడాకులిచ్చి రాగిణిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రవి, వినితకి విడాకుల నోటీసు పంపాడు. భర్తే సర్వస్వంగా భావించి బ్రతుకుతున్న వినిత, యిది తట్టుకోలేక మరో ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసేసుకుంది.
***
వినిత తల్లి కూతురి శవం మీద పడి భోరుమని విలపిస్తూ “ పాతికేళ్ళకే నీకు నూరేళ్ళు నిండి పోయాయామ్మా . యిది చూడడానికేనా నేనింకా బ్రతికున్నది. నాకింత కడుపుకోతని మిగిల్చిన నీ మొగుడు నాశనమైపోతాడు. పెళ్ళైనవాడితో ప్రేమకలాపాలు సాగిస్తూ, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన వాడి ప్రియురాలూ , వాడూ పురుగులపడిపోతారు “ అంటూ శాపనార్థాలు పెడుతుంటే, ఒక్కసారిగా విశాల్ భార్య శిల్ప జ్ఞప్తికి వచ్చిన రుచితకి ఆ శాపనార్థాలన్నీ తనకే తగులుతున్నట్లనిపించింది. తనూ , విశాల్ కలిసి ఎంతటి పొరబాటు చేయబోయామో తలుచుకుంటేనే ఆమెకి ఒళ్ళు గగుర్పాటు చెందింది.
***
ఢిల్లీ వచ్చి ఆఫీస్ లో తిరిగి జాయిన్ అయిన రుచిత , విశాల్ తో తన అక్క మరణమూ , అందుకు దారి తీసిన పరిస్థితులూ వివరించింది.
“ విశాల్, అక్కకి జరిగిన అన్యాయం కళ్ళారా చూసిన తరువాత గానీ నాకర్థం కాలేదు, మనిద్దరం కలిసి ఎంతటి తప్పుడు పని చేయబోయామనేది . మన ప్రేమని త్రోసిపుచ్చి మొండిగా నీకు వేరే పెళ్లి చేసింది మీ నాన్న. అలాగని మీ నాన్న మీద కోపంతో మనం తీసుకునే నిర్ణయం వలన నాశనం అయ్యేది మాత్రం అమాయకురాలైన శిల్ప జీవితం. మన ప్రేమకీ, కోపానికీ అమాయకురాలైన శిల్పని ఎందుకు బలి చేయాలి మనం ? ఈ మొత్తం వ్యవహారంలో అసలు శిల్ప చేసిన తప్పేమిటి చెప్పు ? నా వల్ల మరో అమ్మాయి జీవితం నాశనం కావడానికి నా మనస్సెంత మాత్రమూ అంగీకరించడం లేదు విశాల్. జరిగిందేదో జరిగి పోయింది. అగ్నిసాక్షిగా నీ వివాహం శిల్పతో జరిగిపోయింది, కాబట్టి నువ్వు శిల్పని నీ జీవిత భాగస్వామిగా యాక్సెప్ట్ చేయడమే కరెక్ట్. “
“అది కాదు రుచీ, నా మాట విను.. “ అంటూ ఏదో చెప్పబోతున్న విశాల్ ని మధ్యలోనే ఆపేసి
“ నీ చెల్లికో, అక్కకో యిలా జరిగితే నువ్వెలా రియాక్ట్ అవుతావో ఒక్క సారి ఆలోచించు విశాల్. మా అక్క మరణం నా కళ్ళు తెరిపించింది . నీకూ, శిల్పకూ మధ్య నేను అడ్డు రాకూడదనే నిర్ణయించుకున్నాను. యిప్పుడే కాదు ముందు ముందు భవిష్యత్తులో కూడా నా వలన మీ యిద్దరి మద్య ఏవిధమైన అగాధం ఏర్పడకూడదు. ఒకే ఆఫీస్ లో పని చేస్తూ, ఒకరినొకరు రోజూ చూసుకుంటుంటే , మన మనసులు ఏనాడైనా స్వాధీనం తప్పే అవకాశం వుంది. అందుకే, ముందు జాగ్రత్త చర్యగా నేను ఈ రోజే ఆఫీసులో నా రిజిగ్నేషన్ యిచ్చేసాను. యిదే మన ఆఖరి కలయిక. యిక ముందెన్నడూ మనం కలుకోబోము. విష్ యూ హ్యాపీ మారీడ్ లైఫ్ విశాల్. గుడ్ బై ఫరెవర్ “ అని చెప్పేసి , చెమ్మగిల్లుతున్న తన కళ్ళని విశాల్ చూడకుండా కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని అక్కడ నుంచి కదిలింది రుచిత.

1 thought on “పెళ్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *