June 14, 2024

బెస్ట్ ఫ్రెండ్

రచన: లక్ష్మీ YSR

“అమ్మా!నాకు 500రూపాయలు కావాలి. “అన్నాడు మూడవ తరగతి చదువుతున్న 7యేళ్ళ చింటూ.
“ఎందుకురా?”అడిగింది విజయ. “న్యూ ఇయర్ వస్తోంది కదా!మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోటానికి”
“మీరా?పార్టీనా”ఆశ్చర్యంగా అడిగింది విజయ.
“మేమే! చేసుకోకూడదా?”
“నీ కిలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది?”
“ఆ రోజు డాడీ పార్టీకని బయటకు వెళ్ళిపోతారు. అన్నయ్య అంతే. నువ్వేమో టివి లో కొత్త ప్రోగ్రాములు వస్తాయని చూస్తా కూర్చుంటావు. పిలిచినా పలకవు. మా ఫ్రెండ్స్ అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఎంతో గొప్పగా చెబుతారు. కిట్టూగాడైతే మరీను. వాళ్ళ అపార్ట్మెంట్ లో అందరూ కింద కలుసుకుంటారట. పిల్లలకు,పెద్దవారికి వేరువేరుగా పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇస్తారట. తరువాత కేక్ కట్ చేసి పార్టీ చేసుకుంటారట. అలాగే వైభవ్,సునీల్,ఆదర్శ్ వాళ్ళ కాలనీల్లో ఇలాగే జరుపుకుంటారట. నేనేమో ఒక్కణ్నే. . . . . “వచ్చే ఏడుపుని ఆపుకోటానికి అన్నట్లు గుటకలు మింగాడు చింటూ.
విజయ ఒక్కక్షణం ఆలోచనలో పడింది. నిజమే అపార్ట్మెంట్లు,కాలనీలు ఏర్పడటం మొదలైన తరువాత అందరూ కలసి చిన్నచిన్న వేడుకలు కూడా ఆర్భాటంగా చేస్తున్నారు. మరి న్యు ఇయర్ ఎందుకు చేయరూ?అంతకుముందు తాము ఉన్న చోట చింటూ వయసు పిల్లలు ఉండేవారు. అక్కడ వాడు వాళ్ళతో ఆడుకొనే వాడు. తాను గమనించలేదు కాని చింటూలో మార్పు కనిపిస్తోంది. అస్తమానం అమ్మా అంటూ వెనకాలే తిరగటం వేసిన ప్రశ్నలే వేయడం విసిగిస్తున్నాడు. తాము కొత్తగా ఇల్లు కట్టుకొని ఇక్కడకు వచ్చారు. అక్కడొకటి ఇక్కడొకటి ఇళ్ళు ఉన్నాయి. ఎవరెవరు ఉంటున్నారో కుడా తెలియదు. కొంచెం దగ్గరలో శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు కాని వాళ్ళ పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నారు. ఈయనకు ఉద్యోగంతోనే తీరిక ఉండదు ఉన్న కొంచెం సమయం ఫ్రెండ్స్ తో పార్టీలకు సరిపోతుంది. పెద్దవాడేమో ఇంటర్ చదువుతున్నాడు. వాడు స్టడీ అవర్లతో తొమ్మిది అయితేగాని ఇంటికి రాడు. చింటూ ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. తానే ఏదో మార్గం చూడాలి అనుకొన్నది. ముందు ఈ సమస్యను గట్టెక్కించాలి.
“చూద్దాములే”అని అప్పటికి సమాధానం చెప్పి పంపించింది.
మరునాడు టౌన్ లో ఉన్న తన కజిన్ సుకన్యతోను, ఫ్రెండ్ పద్మతోను మాట్లాడింది. చింటూ స్కూల్ నుంచి రాగానే చెప్పింది.
“మన ఇంట్లోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం”అని.
“నిజంగానా!”సంతోషంగా.
“మరి ఫ్రెండ్స్ ఉండరుగా”అంతలోనే సందేహం.
“ఉంటారు. నువ్వే చూస్తావుగా!” అంది విజయ.
31 సాయంకాలమే సుకన్య,పద్మ వారి నలుగురు పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. పెద్ద కొడుకుని ఇంట్లోనే ఉండమంది. ఆ రోజు ఉదయమే ఆర్డరిచ్చిన కేక్ ని పిల్లలకు గిఫ్ట్స్ కొనుక్కొచ్చింది. అర్ధరాత్రి 12 గంటల వరకు పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి అందరకు బహుమతులు వచ్చేలాగ చూసింది. పద్మ చక్కగా పాడుతుంది. ఆమెతో మంచి హుషారైన పాటలు పాడించింది. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు ముగ్గురూ సంతోషంగా ఎంజాయ్ చేసారు. అప్పుడు కేక్ కట్ చేసి సమోసా మాంగో జ్యూస్ తో పార్టీ చేసింది. ఆట పాట లతో పిల్లలు బాగా అలసిపోయారు. చింటూ అయితే నిద్రకు జోగుతున్నాడు. ఇంట్లో పార్టీ అనగానే తన దగ్గరున్న బెలూన్లను పెరట్లొ ఉన్న పూలతోను హాలంతా వాడికి తోచిన రీతిలో అలంకరించాడు. 1గంటకు సుకన్య,పద్మ పిల్లలను వారి భర్తలు వచ్చి తీసుకొని వెళ్ళారు.
వాళ్ళను పంపి అలసటగా చింటూ పక్కన ఒరుగుతూ వాడి ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వు చూసి తృప్తిగా నిట్టూర్చింది విజయ. అప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకొంది. చింటూ స్కూల్ నుంచి వచ్చే సమయానికి పన్లన్నీ పూర్తి చేసుకొని టివి కి అతుక్కు పోకుండా వాడు పడుకునే వరకు వాడితోనే గడపాలని. తానే చింటూకి “బెస్ట్ ఫ్రెండ్” అవ్వాలని.
నిజమే కదా!తల్లి గర్భం తొలి పాఠశాల అయితే. ఆమె మంచి గురువు స్నేహితురాలు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *