May 26, 2024

బ్రహ్మలిఖితం – 4

రచన: మన్నెం శారద

కాన్వొకేషన్ జరిగిన రాత్రి వెంకట్ లిఖితని ముద్దు పెట్టుకున్నాక తిరిగి వాళ్ళిద్దరూ కలిసింది ఆ రోజే.
“నువ్వు చేసిన పనేంటి?”
లిఖిత సూటి ప్రశ్నకి తడబడుతూ “నేను నిన్ను ప్రేమించేను. అయ్ లౌ యూ” అన్నాడతను.
“అన్ని భాషల్లో చెప్పనక్కర్లేదు. నాకు తెలుగొచ్చు. కాని నువ్వు ప్రేమించేసేవని నిర్ణయించుకున్నాక నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా నన్ను ముద్దు పెట్టేసుకోవచ్చును అనుకోవడాన్ని ఏమనాలి. ఆడదానికసలు ఇష్టాలుండవనా? నేనెంత హర్టయ్యేనో తెలుసా?” అంది లిఖిత సీరియస్‌గా.
“నాతో ఇంత చనువుగా తిరుగుతున్నావు. నీకిష్టమే నేనంటే అనుకున్నాను” అన్నాడతను నసుగుతూ.
“అవును. ఇష్టమే. నిన్ను స్నేహితుడిగా గుర్తిస్తాను. అభిమానిస్తాను. నీకు కష్టమొస్తే బాధపడతాను. కాని.. చాలా వ్యక్తిగతమైన అనుభూతుల్ని నీ నుండి పొందాలని యింతవరకెప్పుడూ నేననుకోలేదు. నిజం చెప్పాలంటె .. నీ ముద్దు నాకు జీవితమ్మీద ముద్దు మీదున్న తియ్యని అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది” అంది లిఖిత కొంచెం తీవ్రమైన కంఠస్వరంతో.
వెంకట్ ఖంగు తిన్నట్టుగా చూశాడామెవైపు
“సారీ! నీకు బాధ కలిగిస్తే క్షమించు. నాకు జీవితంలో అప్పుడే ప్రేమ పెళ్లి అనే రొంపిలో ఇరుక్కోవాలని ఏ మాత్రమూ లేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే మనస్తత్వం నాది!” అంది.
“మీ మమ్మీ సంపాదించింది చాలదనా?” కొంచెం వెటకారం మిళితమైన స్వరంతో అడిగేడు వెంకట్.
లిఖిత అతనివైపు చిరాగ్గా చూసి, “ఎవరో సంపాదించిన దాంతో తిని బతకాలనే సాధారణ మనస్తత్వం కాదు నాది. నువ్వు మాత్రం పెళ్లి అంటూ ఎందుకు తొందరపడుతున్నావో నాకు తెలియదు. అసలేం సాధించేవని?” అనడిగింది.
“సరే. సాధించే కనిపిస్తాను నీకు. నాకు డబ్బు లేదని, చాలాసార్లు నాకు ఫీజు కట్టేవని, నేనెక్కి తిరిగే బైక్, నేను తొడిగే బట్టలు నీవనేగా నీకింత చులకన నేనంటే?” అన్నాడు వెంకట్ కోపంగా.
లిఖిత అతని వైపు అప్రతిభురాలయినట్లుగా చూసి” నువ్వు చాలా తొందరపడుతున్నావ్ వెంకట్. అవన్నీ నేను నీకు స్నేహపూర్వకంగా మాత్రమే చేసేను. నిన్ను స్నేహితుడిగా ఎప్పటికీ గౌరవిస్తాను. కాని.. ఈ రకమైన అనుబంధాన్ని మాత్రం నేనెన్నడూ వూహించలేదు. ” అంది.
వెంకట్ సీరియస్‌గా లేచి నిలబడి”వస్తాను. తొందరలోనే నీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను” అంటూ విసురుగా వెళ్లిపోతుంటే కొంత బాధగానూ, మరికొంత చిరాగ్గానూ చూసి తనూ బయల్దేరింది లిఖిత.
మనసంతా చేదు తిన్నట్లుగా అనిపించింది.
వెంకట్ ఎందుకలా తొందరపాటుగా ప్రవర్తిస్తున్నాడో ఆమెకొక పట్టాన అర్ధం కాలేదు.
చిరాగ్గా హోటల్లోంచి బయటకొచ్చి అక్కడ రోడ్డు మీద సూట్‌కేసు తీసుకుని ఆటోకోసం నిలబడ్డ వ్యక్తిని చూసి “అంకుల్!” అంది దగ్గరికెళ్ళి.
మీనన్ ఆమెని చూసి “వస్తానమ్మా! ఇప్పుడు గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి వెళ్లిపోతున్నాను.” అన్నాడు.
“అప్పుడేనా?”
“ఏం చేయను. వచ్చిన పని కాలేదు.”అన్నాడతను నిరాశని వ్యక్తం చేస్తున్న మొహంతో.
“ఏం పని?” సందేహంగా అడిగింది.
“నీకు చెప్పొచ్చునో లేదో మరి?” అన్నాడతను సంశయంగా.
“నేను బి.ఏ. యూనివర్సిటీ ఫస్టొచ్చేనంకుల్! నాకు మైనారిటీ తీరిపోయింది. నాకెందుకు చెప్పకూడదూ?” అనడిగింది లిఖిత రెట్టిస్తున్నట్టుగా.
“అయితే వెళ్ళి మీ అమ్మని మీ నాన్నగారి గురించడుగు. నాకు రైలుకి టైమయింది. వస్తాను” అంటూ ఆటో ఎక్కేసేడతను.
ఆటో సాగిపోతుంటే నిర్విణ్ణురాలయి చూసిందటువైపు లిఖిత.
“వ్వాట్! తనకి నాన్న వున్నాడా?” జవాబు దొరకని ప్రశ్న ఆమె మనసులో ఉదయించింది మొదటిసారిగా.
టైము రాత్రి పదిగంటలు దాటుతోంది.
లిఖిత తల్లి వున్న పూజగదిలోకి మాటిమాటికి తొంగి చూస్తోంది.
తండ్రి గురించి అప్పటికప్పుడు తెలుసుకోవాలన్న ఆత్రుత, తెలిసి తీరాలన్న పట్టుదల హృదయంలో బెలూన్‌లోకి ఊదుతున్న గాలిలా విపరీతమైన వత్తిడి తెస్తోంది. ఆ వత్తిడిని ఆమె లేత హృదయం భరించలేకపోతంది.
నిజానికి తన తల్లి ఆ టైములో పూజ గదిలోకి వెళ్లదు. హాల్లోనే కూర్చుని ఎదురుగా నిశీధిలో ఒదిగిపోయిన ఘోషతో తన ఉనికిని తెలియజేసే సముద్రం కేసి చూస్తూ కూర్చుంటుంది. ఎదురుగా బెర్త్‌లు ఖాళీలేక సముద్రంలోనే తిష్టవేసి దీపాలతో వెలిగే స్టీమర్లు, హార్బర్ వైపు దారి చూపుతూ నీటిలో దీపాలతో తేలియాడే పాంటూన్స్, మాటిమాటికి కాంతి ప్రదక్షిణాలు చేసే లైట్ హౌస్. ఆ కాంతిలో నిశ్చలంగా సముద్ర మధ్యభాగంలో కరకు రాతి గుండెలా కదలిక నిలబడిన డాల్ఫిన్ నోస్ చూసిన దృశ్యాల్నే ఆమె చూస్తుందో.. వాటికి అతీతమైన అలౌకిక దృష్టితో ఆమె యోగనిద్రలో వుంటుందో లిఖితకెన్నడూ అర్ధం కాదు. అప్పుడెంతగా పలకరించినా ఆమె పలకదని కూడా ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. కాని ఈ రోజు ఆమె దినచర్యకి విరుద్ధంగా ఆమె పూజగదిలో దేవుడి ముందు కూర్చుని వుంది.
అంటే ఆమె కూడా ఏదో తీవ్ర సంఘర్షణకి గురవుతున్నదన్నమాట!
మీనన్ అంకుల్ తండ్రి గురించి ఏం చెప్పి వుంటాడు.
ఆయనకి గాని ఒంట్లో బాగుండలేదా?
మంచమ్మీద ఆఖరి ఘడియల్లో తను చూడకుండానే…”నో.. నెవర్!” లిఖిత అనుకోకుండానే బయటకి అరిచేసింది.
కేయూరవల్లి నిద్రాభంగమైనట్లుగా కూతురివైపు తిరిగి చూసింది.
“నాన్నకేమైంది?” ఆత్రంగా అడిగి9ంది లిఖిత.
కేయూర కనుబొమలు ఆశ్చర్యంగా పైకి లేచేయి.
లేచి గదిలోంచి బయకొస్తూ “నువ్వంతా విన్నావా?” అనడిగింది.
“లేదు. నేను వస్తుంటే మీనన్ అంకుల్ కనిపించేరు. వచ్చిన పని కాలేదని మీ నాన్న గురించి మీ అమ్మ నోటితోనే వినమని చెప్పి వెళ్ళిపోయేరు” అంది లిఖిత గబగబా.
కేయూరవల్లి చెక్కుచెదరని శిల్పంలా బాల్కనీలోకి నడిచింది.
ఆ వెనుకే లిఖిత కూడా వెళ్ళింది.
“నీకు మీ నాన్నంటే అంతిష్టమా?”
తల్లి ప్రశ్నకి తెల్లబోయింది లిఖిత.
“తండ్రంటే ఎవరికిష్టముండదు?” అంది ఆశ్చర్యంగా.
“ఎవరి సంగతో కాదు. నీ సంగతడుగుతున్నాను. ఆయన నీకేం చేసేరని? ఎత్తుకు తిప్పేరా? చదివించేరా? కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారొచ్చి నిన్ను చూడాలని ప్రయత్నించేరా? ఎందుకని నీకంత మమకారం?”
కేయూర శరపరంపరలా వదులుతున్న ప్రశ్నల ధాటికి తలదించుకుంది లిఖిత.
“చెప్పవేం? ఏం చెబుతావు? నీ దగ్గరేం జవాబుందని?” అంది కేయూర హేళనగా.
ఈసారి లిఖిత తలెత్తింది. సూటిగా.
“నేనాయన దగ్గర పెరిగుంటే నువ్వన్నవన్నీ చేసి వుండేవారేమో! మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. నువ్వు నన్ను నీ వెంట తెచ్చేసుకున్నావు. నన్ను చట్టం ప్రకారం తన దగ్గరకు లాక్కోక నీకే వదిలేయడంతో ఆయన సంస్కారం కనబడటం లేదా?”
కూతురి మాటలకు పకపకా నవ్వింది కేయూరవల్లి.
“ఎవరో తెలియకపోయినా తండ్రిని బాగానే వెనకేసుకొస్తున్నావు. పీతృ ప్రేమ బాగానే పొంగిపొర్లుతుంది. ఇంతకీ నేను ఆయన్నుంచెందుకు విడిపోయానో తెలుసా? నీకోసమే!” అంది గంభీరంగా .
లిఖిత విస్తుపోయినట్లు చూస్తూ”నా కోసమా?” అంది.
“అవును. ముమ్మాటికీ నీకోసమే. నీ తండ్రిని నేను ప్రేమించి పెళ్లి చెసుకున్నాను. అందుకోసం నా తండ్రిని కూడా ఎదిరించేను. కాని ఆయన నా ప్రేమకేం విలువిచ్చేడు. మనకిష్టమైన వస్తువుని కొనుక్కుని ఇంట్లో పడేసినట్లుగా నా మెడలో తాళికట్టి చెయ్యి దులుపుకున్నారు” అంది కేయూర ఆవేశంగా.
తల్లి గొంతులోని ఆవేశం దానివల్ల కల్గిన కంపన గమనించి తెల్లబోయింది లిఖిత.
“ఇప్పుడసలాయన కెలా వుందో చెప్పమ్మా!” అంది అసహనంగా.
కేయూర చూపు తిప్పి కూతురికేసి తీక్షణంగా చూసింది.
“నీకు చాలా ఆందోళనగా వున్నట్లుంది. నువ్వనుకునే ప్రమాదస్థితిలో ఆయనేం లేరు. నీ తండ్రి ఒక సైంటిస్ట్. పేరు కార్తికేయన్.”
తల్లి మాట విని లిఖిత మొహంలో ఆస్చర్యం, ఆనందం చోటు చేసుకున్నాయి.
ఆయనగురించి ఇటీవల కొన్ని పేపర్లు రాసిన వార్తలు కూడా ఆమె చదివి వున్నది.
“అంటే.. మరణం లేకుండా.. ప్రయోగాలు చేస్తున్న.. కార్తికేయన్..?”
“ఎగ్జాట్లీ ఆయనే. ఆయనిప్పుడు తన ఇరవై రెండు సంవత్సరాల నిరంతర కృషి విఫలం కాగా, కేరళ అడవుల్లోని మాంత్రికుల్ని ఆశ్రయించి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కేరళ బయలేరుతున్నారట. ఆ విషయం చెప్పడానికే మీనన్ వచ్చేరు” .
“ఈ సంగతి మనకెందుకు చెప్పేరు?”
“మీ నాన్నని రక్షించుకోమని”.
“ఆయనకేమవుతుందని?” ఆశ్చర్యంగా అడిగింది లిఖిత.
“కేరళ రాష్ట్రం గురించి నీకు తెలియదు. మా నాన్నగారు ఎ.ఎస్.పిగా సర్వీసులో జేరి ఐ.జి గా హార్టెటాక్ తో పోయేరు. ఆయన పుణ్యమా అని నేను తమిళనాడు, కేరళ చూడటం జరిగింది. కేరళ ఒక చిత్రమైన, సుందరమైన రాష్ట్రం. దేవతలకు స్వర్గంలో వుండతానికి విసుగు కలిగినప్పుడు భూలోకంలో విహారానికి రావడానికి కేరళని అంత సుందరంగా సృష్టించుకున్నారని కేరళీయులు నమ్ముతారు. దేవతలక్కడికి నిజంగా వస్తారో రారో కాని.. ఆ రాష్ట్రంలో ప్రకృతి సర్వాంగ సుందరంగా వుంటుంది. నీకు తెలుసో లేదో అక్కడసలు నిరక్షరాస్యత లెనే లేదు. భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాల కోసం ప్రతి విదేశీయుడూ కాలు పెట్టిందా రాష్ట్రంలోనే. కాని.. ఇన్ని వున్న ఆ రాష్ట్రంలో గొప్ప గొప్ప ఆయుర్వేద మందులతో పాటు.. మనిషిని మట్టుపెట్టే చేతబడులు.. క్షుద్రపూజలు కూడా వున్నాయి. అందుకే మీనన్ మీ నాన్నగారక్కడ కెళ్ళడానికి ఇష్టపడక భయంతో మనల్ని వెదుక్కుంటూ వచ్చేరు!” కేయూర గాధంగా విశ్వసిస్తూ అంది.
తల్లి చివరి మాటకు నవ్వొచ్చింది లిఖితకి.
“నువ్వేం చదువుకున్నావమ్మా?” అంది అమాయకంగా.
“ఎం.ఏ.లిటరేచర్”
“అంత చదువు చదివి నువ్వు చేతబడుల గురించి, క్షుద్రపూజల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు.ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మి ఇతరుల్ని నమ్మేట్లు చేయడం నేరం!” అంది లిఖిత హేళనగా.
“అలా కూర్చో” అంది తనూ కుర్చీలో కూర్చుంటూ.
లిఖిత కూర్చుని తల్లి మొహంలోకి చూసింది.
“అవును, ఈ రోజులు! ఈ రోజుల గురించి మా అమ్మమ్మ ఊహించి కలలు గంటూ నా పక్కలో పడుకుని చెప్పిన మాటలింకా న అచెవిలో గింగురుమంటూనే వున్నాయి. నేను పుట్టగానే మా అమ్మ చనిపోతే అమ్మమ్మే కొంతకాలం పెంచింది నన్ను. ఆమె స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్ళింది. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీగారితో కలిసి కన్నకూతురి భవిష్యత్తు గురించి కాక దేశానికి రాబోయే మంచి రోజుల గురించి ఆలోచించి ఆనందపడేవారట. స్వాతంత్ర్యం రావడం వాళ్లు జైళ్లలోంచి బయటికి రావడం ఉన్న ఆస్థిని దేశానికి సమర్పించిన వాళ్లు ఏదో చిన్న టీచరు ఉద్యోగం సంపాదించుకోవడం జరిగిపోయేయి. మా తాతగారు బారిస్టరు చదివి కూడా ‘లా’ ప్రాక్టీసు చేసి ‘లాయరు’ కావడానికిష్టం లేక ఆ పట్టాని చింపి టీచరు పని చేసేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాల ఆదర్శాల గురించి, వాళ్ల విశాల దృక్పధం గురించి, స్వార్ధమెరుగని వాళ్ల పరమార్ధం గురించి, స్వాతంత్ర్యం వచ్చేక కట్నాలు పోతాయని స్త్రీలకి గౌరవం పెరుగుతుందని లంచాలు, జులుంలు నశించిపోతాయని భారతీయులంతా ఒక తాటి మీద నడిచి దేశాన్ని ప్రగతి బాట మీద నడిపిస్తారని స్త్రీ,పురుష బేధాలు నశించిపోతాయని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని వీటినే చందమామ కథలుగా చెప్పేది అమ్మమ్మ.
“అమ్మమ్మ చచ్చిపోయింది. ఆవిడ కలలెంత కల్లలో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కట్నాలు లక్షలు, కోట్లలోకి పెరిగిపోయేయి. స్త్రీ శరీరం వ్యాపార వస్తువయిపోయింది. చూస్తుండగానే కుల, మత, ప్రాంతీయ భావాలు కలరా, ప్లేగు వ్యాధుల కన్నా తీవ్రంగా ప్రబలిపోయేయి. మనకో చట్టం, భద్రత ఉన్నాయని , మనకి అన్యాయం జరిగితే అక్కడ మొరపెట్టుకోవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లంత పిచ్చివాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ నలభయ్యేడు సంవత్సరాల్లో మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. న్యాయాన్ని ధర పెట్టి అమ్ముకుంటున్నాం. మెడలో నగలు, వేసుకొచ్చిన కారులు చూసి మనుషుల్ని గౌరవిస్తున్నాం. ఇక చేతబడుల్ని, క్షుద్రపూజల్ని నమ్మితే తప్పేముంది. మన నేతలే బాబాల్ని ఆశ్రయించి వాళ్ల పాదాల దగ్గర కూర్చుంటున్నారు. గారడీ విద్యల్ని దైవలీలలుగా నమ్ముతున్నారు. యధారాజా తథా ప్రజా అని నువ్వు నేను నమ్మడంలో తప్పేముంది?”
తల్లికెలా జవాబు చెప్పాలో అర్ధం కాలేదు లిఖితకి.
“ఇప్పుడు నాన్నగారి సంగతి మాట్లాడు. ఆయనకేదన్నా ప్రమాదం జరుగుతుందంటావా?” అనడిగింది ఆందోళనగా.
“ఆ సంగతి నేనెలా చెప్పగలను. ఆ ఇంటీరియర్ ఫారెస్టులో ఎలాంటి మాత్రికులున్నారో నాకేం తెలుసు. అయినా మనల్ని కాదనుకున్న వ్యక్తి గురించి మనమింత సేపెందుకు ఆలోచించాలి.?”
తల్లి ప్రశ్నకీసారి లిఖిత ఎర్రబడిన కళ్లతో చూసింది.
“ఎందుకా? ఆయన నీకు భర్త. నాకు తండ్రయినందుకు. నువ్వెన్ని చెప్పినా నేను వెళ్లి తీరతాను. ఆయన్నొకసారి చూడాలని లేదని నీకబద్ధం చెప్పలేను”.
ఈసారి కేయూర మ్రాన్స్పడినట్లు చూసింది కూతురివైపు.
“వెళ్లు. వెళ్లి ఆయన్నుద్ధరించు. ఎవరికోసం నేనింత కాలం వొంటరిగా ఒక మ్రోడులా జీవించేనో వాళ్లే కూతపెట్టి తండ్రి తరఫున మాట్లాడుతుంటే నాదేముంది?” అంది కన్నీళ్లతో.
ఆమె కన్నీళ్లని చూసింది లిఖిత హృదయం.
అన్ని భావాలని అతీతంగా ఒక యంత్రంలా ఇంతకాలం పని చేసుకుంటూ పోతున్న తల్లి హృదయంలో కూడా ఇంకా అనుభూతుల గోతులున్నాయా? అని ఆశ్చర్యపోయిందామె మనసు.
“చావుని నివారించాలనే అమాయకత్వంతో పసిపిల్లల్ని బలిచ్చే ఒక మాయగాడి చేతిలో పదమూడేళ్ల వయసులో చిక్కుకున్నారు మీ నాన్న. ఆ రాకెట్‌ని పట్టుకుని మీ నాన్నని యింటికి తీసుకొచ్చెరు మా నాన్న భాస్కర్ ఎస్.పి. ఇతనిలోని పట్టుదల చూసి చదివించేరు. మేమిద్దరం మంచి స్నేహితులుగా మసలేవాళ్లం. వయసుతో పాటు నాలో అతనిపట్ల ప్రేమ చోటు చేసుకుంది. మా నాన్న మా పెళ్లికి ఇష్టపడలేదు. అప్పటికాయన ఐ.జి గా పని చేస్తున్నారు. ఆయన వద్దనడానికి కారణం అతనికి డబ్బులేకపోవటం కాదు. పి.హెచ్.డి చేసి ఎప్పుడూ మరణం గురించి ఆలోచించే ఈ మనిషి భార్యని భర్తగా సుఖపెట్టలేడని.. కాని నేను వినలేదు. మా పెళ్లి జరిగిపోయింది. మీ నాన్నకి జుబ్లీ హిల్స్‌లో ఒక స్వంత లాబరేటరీ కట్టించేరు మా నాన్న. నేను ప్రెగ్నెంటయ్యేను. ఆ సమయంలో మీ నాన్న నుండి నేనాశించిన అనుభూతుల్ని పొందలేకపోయేను. మా నాన్న హార్టెటాక్‌తో చనిపోయినప్పుడు కూడా పట్టనట్లే వున్నారు. చావు లేకుండా మందు కనుక్కోవలని ప్రయోగాలు చేసే ఈ మనిషి తననంతవాణ్ని చేసిన మనిషి చచ్చిపోతే విచారించలేదు. నా మనసుకి ఎక్కడో తీరని దెబ్బ తగిలి దాని రూపం కోల్పోయింది. అయినా సహించేను. ఇంతలో నాకు నొపులొచ్చేయి. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసేరు. మరెవరో పురుడు పోసేరు. నువ్వు పుట్టేవు. ఆయనొక్కసారి కూడా వచ్చి చూడలేదు. తన మొదటి సంతానాన్ని చూసి ఏ తండ్రయినా మురిసిపోతాడు. కాని.. అది జరగలేదు. నా మనసింకా వంగిపోయింది. పొత్తిళ్లలో నిన్ను పెట్టుకుని ఇల్లు చేరేను. అప్పుడు కూడా ఆయన ఇంటికి రాలేదు. లాబ్‌లోనే అహర్నిశలూ గడపటం మొదలెట్టేరు. ఎందుకీ పెళ్ళి? ఏమిటి నేను పొందుతున్నది. పెళ్లి ఒక కమిట్‌మెంట్. తర్వాత భార్యాభర్తలు ఒకరి నుండి మరొకరు ఆశించేవి కంపానియన్‌షిప్. కన్సొలేషన్, కన్సర్న్, ఇవేమి లభించని ఈ పెళ్లినేమనాలి. మా నాన్న ఎందుకితనితో వివాహం వద్దన్నారో నాకు బాగా అర్ధమయింది. అయినా ఓర్చుకున్నాను. కాదు. మాకు విడిపోయే రోజు దగ్గరకొచ్చేసింది. నీకు అనుకోకుండా బాగా జబ్బు చేసింది. డయేరియా. పసిపిల్లలకి దీన్ని మించిన జబ్బు లేదు. నేను లాబ్‌కి ఫోన్ చేసేను. అయినా ఆయన రాలేదు. ఒక కుక్కపిల్ల ప్రాణాల్ని కాపాడే ప్రయోగం చేస్తున్నారాయన. కన్నకూతురి చావు బ్రతుకుల్ని పట్టించుకోలేదాయన. నిన్ను తీసుకుని భోరున కురిసే వర్షంలో కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ నీలోఫర్ హాస్పిటల్ చేరుకున్నాను. వారం రోజులు చావు బ్రతుకులతో పోరాడి బతికేవు నువ్వు. ఈ లోపు నేను ప్రార్ధించని దేవుడు లేదు. ఇక నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నిన్ను తీసుకుని తిన్నగా విశాఖపట్నం వచ్చేసేను. ఇక్కడ నాకొక స్నేహితురాలుంది. ఆమె సహాయంతో కేయూర టెక్స్‌టైల్స్ ప్రారంభించేను. దాదాపు నీ వయసు, ఈ కంపెనీ వయసూ ఒకటే. నీ ప్రాణాల్ని కాపాడినందుకే నేను దేవుళ్ళకంతగా పూజ చేస్తాను. ఈ నిరాసక్తం, నిస్తేజమూ, నిర్లిప్తమయిన నా జీవితంలో నువ్వే ఒక వెలుగురేఖవి. నీ ఆలంబనతో అల్లుకుంటూ ఊపిరి పోసుకుంటున్నది నా బ్రతుకు. ఇప్పుడు చెప్పు కేవలం పుట్టుక నిచ్చిన నీ తండ్రి నీకు ఏం చేసేరు. ఏమైనా చేసేరనుకుంటే వెళ్లు. నేను నిన్నాపే ప్రయత్నం చెయ్యను” అంది కేయూరవల్లి తనిన్నాళ్లూ ప్రోది చేసుకున్న గాంభీర్యాన్ని వదలి కన్నీళ్లతో.
తల్లి చెప్పిన కథ విని తల్లడిల్లిపోయింది లిఖిత.
వెంటనే తల్లిని కౌగిలించుకుని “నేనెక్కడికీ వెళ్లనమ్మా నిన్నొదిలి” అంది ఏడుస్తూ.
కేయూర ఆమె ముంగురులు సవరిస్తూ “ఏడవకు. అందుకే ఎప్పుడూ మీ నాన్న సంగతులు మాట్లాడలేదు నేను” అంది ఓదార్పుగా.

******
లిఖిత ఉలిక్కిపడి నిద్ర లేచింది.
తండ్రి ఏదో కష్టంలో ఇరుక్కుపోయి తనని పిలుస్తున్నట్లుగా కలొచ్చిందామెకు. ఎంత ఫ్రాయిడ్ సిధాంతాన్ని నమ్ముదామన్నా మనసేదో చెడునే ఊహిస్తున్నది. మనం చదివిన చదువుకి, విజ్ఞానానికి ఏ మాత్రం పొంతన కుదరని అతీతమైన అదృశ్య శక్తులేవో వున్నాయేమోనన్న అనుమానం ఎంత వద్దన్నా ఆమె మీదకి ప్రాతఃకాలపు నీడలా సాగుతూనే వుంది.
ఆమె లేచి మంచినీళ్లు తాగి తిరిగి ఫ్రిజ్ మూస్తూ పూజగది వైపు చూసింది. అక్కడ అఖండ దీపం వెలగడం లేదు. అగరొత్తుల ధూపం అలుముకోవదం లేదు. ముఖ్యంగా ధ్యానముద్రలో తల్లి అక్కడ కనిపించకపోవడంతో లిఖిత తల్లడిల్లిపోతూ తల్లి బెడ్‌రూంలోకి తొంగి చూసింది. తల్లి గోడకి మొహం పెట్టుకొని పడుకొనుంది.
లిఖిత గోడ గడియారం వైపు చూసింది.
టిక్కుటిక్కు శబ్దాలతో కాలాన్ని ముందుకు నెడుతూ సెకండ్స్ ముల్లు ముందుకు కదులుతుందంటే చిన్న ముల్లు అయిదు మీద, పెద్ద ముల్లు రెండు మీదకు చేరుకున్నయి. నాలుగ్గంటలకే లేచి పూజ మొదలెట్టే తల్లి ఈరోజు అయిదూ పది నిమిషాలయినా లేవకపోవడంలోని అంతరార్ధం అర్ధం కాక గదిలోంచి చిన్న నిష్క్రమించబోతూ బెడ్ లైటు కాంతిలో ఆమె భుజాలు కదులుతున్నట్లుగా అనుమానమొచ్చి అక్కడే నిలబడింది కొంత సేపు.
అయిదు నిమిషాలనంతరం ఆమె వెక్కిళ్ళు అణుచుకుంటూ ఏడుస్తున్నదనే విషయం అర్ధమయింది లిఖితకి.
కంగారుగా వెళ్లి తల్లి మంచం మీద కూర్చుని తల్లిని తనవైపు తిప్పుకుంది.
కూతురిని గమనించగానే కేయూరలో దుఖఃమధికమయింది.
భోరున కూతురి వడిలో తల పెట్టుకుని ఏడ్చింది.
ఆమె ముఖం చూసి నిర్విణ్ణురాలయింది లిఖిత.

********
ఎప్పుడూ ధీరగంభీరంగా వుండే తల్లి యిలా డీలాపడి ఎందుకేడుస్తుందో ఆమెకెంత మాత్రం అర్ధం కాలేదు.
“అమ్మా! అమ్మా! ఏం జరిగింది?” అనడిగింది ఆత్రుతగా.
కేయూరవల్లి జవాబు చెప్పలేదు. ఇంకా కూతురి వడిలో మొహం దాచుకుని ఏడుస్తూనే వుంది.
“నేను, నేను వెళ్లనన్నాను కదమ్మా నాన్నగారి దగ్గరకి” అంది లిఖిత తల్లినూరడించే ఉద్ధేశ్యంతో.
కేయూర రివ్వున తలెత్తింది.
“లేదు. నువ్వెళ్లి తీరాలి”
ఈసారి ఆశ్చర్యపోవడం లిఖిత వంతయింది.
విప్పారిత నేత్రాలతో తనని వింతగా చూస్తున్న కూతుర్ని గమనించి తల దించుకుంది కేయూర.
“రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. గతమంతా తలచుకునేసరికి మీ నాన్నతో గడిపిన కొద్దికాలం ఎంతో సుదీర్ఘంగా అనిపించింది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా ఆయన్ని నేను సిన్సియర్‌గా ప్రేమించేను. ఎంత విదిలించుకున్నా గుండెలో ఎక్కడో ఒక చిన్న పరమాణువులా ఆయన పట్ల నాకింకా ప్రేమ వుందనే నిజాన్ని ఈ రాత్రి రుజువు చేసింది. ఆయనకేమన్నా అవుతుందేమోనని భయంగా వుంది. వెంటనే నువ్వెళ్లి ఆయన్ని ఈ ప్రయాణం నుండాపు” అంది కేయూర ంలానమైన మొహంతో.
తల్లి మాటలు వినగానే లిఖిత మొహంలో సంతోషం చోటు చేసుకుంది.
“నిజంగానామ్మా?” అంది సందేహంగా.
“నిజంగానే. ఆలస్యం చేయకు. వెళ్లి ముందు మీనన్ గారిని కలువు. ఆయన నిన్ను మీ నాన్నగారికి పరిచయం చేస్తారు.” అంది.
లిఖిత తల్లివైపు పేలవంగా చూసింది.
“తండ్రికి కూతుర్ని మరొకరు పరిచయం చేయడం.. చాలా హాస్యాస్పదంగా వుంది కదూ!”
“అది కాదు. నువ్వూ రాకూడదూ!”
“ఇప్పుడు కాదు. అనుబంధం నాతోనయినా ఆ బంధానికి వారధిగా నిలబడిన నీకే యిప్పుడెక్కువ ప్రాధాన్యత వుంది. నీ మాటే ఆయన వింటారు. వింటారు కాదు విని తీరతారు. వెంటనే ఏ రైలుందో చూడు” తల్లి ఆజ్ఞ లభించగానే లిఖిత ఎగిరి గంతు వేసినంత పని చేసి తల్లిని కౌగలించుకుంది తనకి జన్మనిచ్చిన తండ్రిని చూడబోతున్నాననే ఆనందంతో…

సశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *