May 26, 2024

మాయానగరం – 33

రచన: భువనచంద్ర

బిళహరి గుళ్ళో కూర్చుంది. భగవంతుడున్నాడా? ఇదీ ఆమె మనసును నలిపేస్తున్న ప్రశ్న. మళ్ళీ ఒక్కసారి జీవితాన్ని చూసుకుంటే ఏముందీ? ఆరోహణా, అవరోహణా గమకాలు తప్ప బిడ్డ జీవితం గురించి పట్టించుకోని తల్లితండ్రులూ, అన్నావదినలూ. ఇహ అత్తగారింట సంగతి సరేసరి. పెళ్ళైంది కానీ భర్త రాధామోహనుడు అప్పటికే పుచ్చిపోయి చచ్చిపోయాడు. పెళ్లైన కన్య తను. ఇంకా కన్నెతనం చెడలేదు. లేపుకొచ్చిన కామేశ్వరరావు పరమ అసమర్ధుడు, భయస్తుడు. ఇల్లు కల సర్వేశ్వరరావు ఓ కట్లపాము. ఆ ఇంట్లోనే ఉంటే పతనానికి అంతుండదు. అందుకే, ఇంట్లోనుంచి బయట పడింది. వెంట చిల్లు పైసా లేదు. కనీసం మార్చుకోడానికి మరో చీరా జాకెట్టు, లంగా అయినా లేవు. అబ్బా.. ఎంత భయంకరం. పొద్దున్నే జరిగిన విషయం జ్ఞాపకం వచ్చింది.
స్నానం చేసి బయటకు రాగానే ఎప్పటి నుంచో కాపు కాస్తున్నడో ఆ ముసలి నక్క, ఒక్కసారి మీదపడ్డాడు. గిల్లిగిచ్చి కొరికి ఆ వెధవ తొడల మధ్యన లాగి తన్ని ఎలాగోలా బయటపడింది. అదృష్టం ఏమిటంటే స్నానం చేశాక బాత్ రూంలోనే లంగా జాకెట్టు తొడుక్కొని చీర కట్టుకోవడం.
ఇప్పుడేం చెయ్యాలి? వెనక్కి వెళ్తే ఆ వెధవకి లొంగిపోవడానికి ఒప్పుకున్నట్టే. వెళ్ళకపోతే.. అదే మనసుని పిండి పారేస్తోంది.
“ఎవరమ్మాయ్ నువ్వూ?”అడిగాడు పూజారిగారు. పూజారి అని చెప్పక్కర్లేదు.. ఆయన బొట్టు వస్త్రాలే చెబుతున్నాయి. ఆయన వయసు నలభై దాటే ఉన్నటుంది.
“అయ్యా.. నేనో దిక్కులేనిదాన్ని. పరిస్థితుల ప్రభావం వల్ల ఒంటరినయ్యాను. ఈ లోకంలో ‘నాది ‘ అంటూ ఏదీ లేదు. దయచేసి నేను ఇక్కడ ఉండటానికి మీరేదైనా ఆశ్రయం కలిపిస్తే ఇక్కడే వుండి ఈ గుడికి, గుడిలో దేవుడికీ మనస్పూర్తిగా సేవ చేసుకుంటాను.” గభాల్న ఆయన పాదాల మీద పడి అన్నది బిళహరి. కానీ పాదాల్ని ముట్టుకోలేదు.
“లేమ్మా.. నీ మాటలు చేష్టలు చూస్తే బ్రాహ్మణ పిల్లలా ఉన్నావు. నీ కథ ఏంటని నేనడగను. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పక తప్పదు. ఈ గుడి ఆవరణ చాలా చాలా పెద్దది. గుడికి, యీ గుడి కట్టిన మహానుభావులూ, ఇతర్లు ఇచ్చిన పొలాలు కూడా వందల ఎకరాల్లోనే వుంటాయి. కానీ ఆ ఆదాయం దేవుడికి చేరదు. కారణం ఇది కలికాలం. ధర్మకర్తలున్నారు. ఏం చేస్తున్నారని అడగకు. అమ్మాయ్, నా తాతముత్తాలందరూ యీ సుబ్రహ్మణ్యేశ్వరుడ్నే సేవించారు. నా కొడుకులిద్దరూ చదువులు పూర్తి కాగానే ఇతర దేశాలకు వలస పక్షుల్లా ఎగిరిపోయారు. నా భార్య గతించి పదేళ్ళైంది. ఇప్పుడు నా వయసు యాభై నాలుగేళ్ళు. పెళ్ళప్పటికి నాకు పన్నెండు, నా భార్యకి ఏడేళ్ళు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, యీ గుడి ఎంత పెద్దదో , దీని ఆదాయం, అంటే నా చేతికి అందే ఆదాయం అతి తక్కువ. బహుశా నా వంశంలో నేనే యీ స్వామి సేవకు చివరివాడిననుకుంటాను. సరే అవన్నీ నా బాధలు. ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తున్నా.ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయం ఇమ్మంటున్నావు. ఉన్నదాంట్లోనే తలా కొంచం తిందాం సరే.. నా తరవాతా?” బిళహరి వంక దయగా చూస్తూ అన్నాడు. ఆ కళ్ళలో అంతులేని కరుణ.
“అయ్యా.. తరువాత సంగతి నాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిలో నేనెక్కడికీ వెళ్ళే వీలు లేదు. కనీసం మార్చుకోడానికి గుడ్డముక్కైనా లేదు. ఆ దేముడు కరుణిస్తే , మీ నీడలోనే జీవితం మళ్ళీ మారిపోవచ్చు. దయ చేసి నాకు ఆశ్రయం ఇవ్వండి.” కళ్ళ నిండుగా నీళ్ళు నిండగా అన్నది బిళహరి.
“సరే అదిగో… ఆ చివర ఉండేదే తరతరాలుగా మేముంటున్న నివాసం. ఒకప్పుడు పిల్లల చదువు బాగా సాగాలని ఓ చిన్న గది వాళ్ళ కోసం ఏర్పాటు చేశాను. నువ్వు ఆ గదిని వాడుకోవచ్చు. కానీ అమ్మాయ్, దాన్ని శుభ్రపరచడం అంత తేలిక కాదు. నా భార్య పోయాక ఇల్లొక సంకటంగా తయ్యారయ్యింది. అంత పెద్ద ఇంట్లోనూ ఒక్క గదిని మాత్రమే నేను వాడుకుంటున్నా.. మిగతాదంతా…” నిట్టుర్చాడాయన.
“చాలండి.. చాలు.. చోటు దొరికిందిగా. ఇంటి సంగతి నే చూసుకుంటా.” కన్నీళ్ళు బుగ్గ మీద జారుతుండగా అన్నది బిళహరి.
“ఇంతకుముందోసారి ఇక్కడకు వచ్చాను. ఓ చల్లని గాలి కెరటం నన్ను తాకింది. ఇవాళ ఓ ఘోరమైన రాక్షసుడ్ని తప్పించుకొని అసంకల్పితంగా ఇక్కడికేవచ్చాను. భగవంతుడున్నాడండి… నిజంగా వున్నాడు. ఆ దేముడే మీ రూపంలో నాకు ఆశ్రయం కల్పించాడు.” గర్భగుళ్ళోని దేవసేనా వల్లీ సమేత సుబ్రహ్మణ్యస్వామికి నమస్కరిస్తూ అన్నది బిళహరి.
*******************************

ఆనందరావు బోంబే వెళ్ళిపోయాక సుందరీభాయ్ ఎటన్షన్ మొత్తం కిషన్‌చంద్‌ జరీవాలా వైపు తిరిగింది. అంటే కిషన్‌చంద్‌ని హింసించడమే పనిగా పెట్టుకుంది. అల్పపీడనం ‘ఎక్కడో ‘ ఉంటే వర్షాలు వొడ్డున కురిసినట్టు కిషన్‌చంద్‌ని హింసించాలంటే షీతల్ ని హింసించాలి. రోజుకొకరకంగా ఆమెని చిత్రహింసలకు గురి చెయ్యడం మొదలెట్టింది సుందరి.
ఆ హింసాకాండని ఇటు కిషన్‌చంద్‌ గాక అటు చమన్‌లాల్ కూడా గమనిస్తునే వున్నాడు. ఏం చెయ్యడానికే ఏమీలేదు.
పిచ్చివాడి కంటే శాడిస్టు వెయ్యి రెట్లు బలవంతుడు. పిచ్చివాడికి తనేం చేస్తున్నాడో తెలీనే తెలీదు. శాడిస్టుకి కేవలం తెలీడమే కాదు .. క్షణాక్షణానికి శాడిజం పెరిగి సరి కొత్త పద్ధతుల్ని ఏర్పర్చుకుంటాడు. సుందరి స్థితి అదే. ఏమాత్రం షీతల్ కి సపోర్ట్ వచ్చినా ఇంకా ఇంకా పిశాచిలా రెచ్చిపోతుందని ఆ ఇంట్లో మగాళ్ళిద్దరికీ తెలుసు.
కిషన్‌చంద్‌ అయితే అంతే కోపంతోనూ, అసహనంతోనూ వూగిపోతున్నాడు. ఏమీ చేయలేని తన అసమర్ధతకి అతనికే సిగ్గేస్తోంది. చమన్ లాల్ గనక కంట్రోల్ చేయకపోతే ఏనాడో షీతల్ ని తీసుకొని బయటకుపోయేవాడు.
సుందరికి ఇద్దరు పిల్లలు. ఆడపిల్ల పేరు కుముద్. మగపిల్లాడి పేరు యదునందన్ జరీవాలా. వాళ్ళకి జరుగుతున్నది ఏదో స్పష్టంగా తెలీకపోయినా , ఇంట్లో వాతావరణం చాలా మారిందని మాత్రం తెలుస్తూనే వుంది.
“తాతయ్య! అమ్మ ఎందుకు అంత కోపంగా వుంది? షీతల్ అన్ని పనులు బాగానే చేస్తొన్నా ఎందుకంత అరుస్తోంది.” ఉండబట్టలేక అడిగింది కుముద్ చమన్‌లాల్ ని.
“అమ్మ కోపం సంగతి నీకు తెలుసుగా! ఉత్తునే వస్తుంది. దాన్ని గురించి మీరు ఆలోచించకండి. హాయిగా చదువుకోండి.” అంటూ కాసేపు వాళ్ళని ఎంటర్ టైన్ చేశాడు చమన్‌లాల్. ఆయనకి తెలుసు .. ఇలా ఏంతో కాలం వాళ్ళని మభ్య పెట్టలేనని. ఓ నిట్టూర్పు నిప్పులా బయటకొచ్చింది.

*************

“కిషన్ షీతల్ ని ఎక్కడో అక్కడకి పంపించక తప్పదు. లేకపోతే..” ఆగాడు చమన్‌లాల్.
“హా.. పితాజీ.. కానీ ఎక్కడకి పంపను? పంపినంత మాత్రాన నన్ను హింసించడం మానుతుందా? ఎక్కడకి పంపానో చెప్పమని ఇంకా హింసిస్తుంది. కొద్దో గొప్పో పిల్లల కూడా ఏదో జరుగుతోందని అర్ధమౌతోంది. షీతల్ ని బయటకు పంపిన మరుక్షణం ఇల్లు మరింత నరకంగా మారడమే గాదు, పిల్లల మనసులు కూడా నాశనమైపోతాయి.
అన్నీ తెలిసే మౌనంగా ఉంటున్నాను. మీరడగవచ్చు… షీతల్ ని దగ్గరకు తీయకపోతే యీ గొడవ అసలు వుండేదే కాదు గదా అని. చాలా ఏళ్ళు నాలో నేను మధనపడి మధనపడి చివరకు చేసేదేమీ లేక షీతల్ ని తోడుగా ఎంచుకున్నా. ఆమె పనిమనిషే… చదువు లేనిదే… కానీ పితాజీ, ఎన్నేళ్ళుగా నేను భయంకరమైన ఒంటరితనంతో రగిలిపోతున్నానో మీకు తెలీనే తెలీదు. మీ అమ్మాయి అసలు స్వరూపం గురించి నేను చెప్పను. తండ్రి ముందు కూతుర్ని తేలిక చేసే స్వభావం కాదు నాది. సరే షీతల్ ని పంపేసి నా నికృష్టపు బాధేదో నేను పడతాను. కానీ సుందరి మామూలుగా వుంటుందా?”మనసులో వున్నది వున్నట్టుగా చెప్పాడు కిషన్‌చంద్‌. చమన్ లాల్ దగ్గర జవాబేలేదు. ఏం మాట్లాడతాడు?
సుందరీబాయ్ తల్లి పోయాక చమన్ లాల్ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు కానీ, స్త్రీల నుంచి మాత్రం దూరంగా లేదు. అతని వడ్డీ వ్యాపారం చాలామంది స్త్రీలని ఇష్టపూర్వకంగానే లొంగదీసింది. అంతే కాదు చాలా మంది అసంతృప్త ‘శెఠానీ ‘లతో కూడా అతనికి పరిచయం వుంది. అతనితో పోలిస్తే కిషన్‌చంద్‌ పరమోత్తముడు.
కిషన్‌చంద్‌బయటకి వెళ్ళాడు. మనసు మంటని ఆర్పడానికి అతనికి దొరికి మందు ఒక్కటే. దాని పేరే విస్కీ. ఓ విషాదమా.. ఎంతటిదానివే నువ్వు? ఒక పక్క మనసుని కాల్చడమే కాక మనిషిని కూడా తాగుబోతుడ్ని చేస్తావు కదా!
సుందరీబాయ్ మంచం మీద పడుకొని వుంది. ప్రస్తుతం ఆనందరావుని తన కౌగిట్లో బంధించి సర్వసుఖాల్ని పొందుతున్నట్టు కలలు కంటోంది. కారణం చల్లని లిమ్కాలో దిట్టంగా ‘జిన్ ‘ కలుపుకొని సేవించడమే. రమ్ము, విస్కీ, బ్రాందీ, ఓడ్కాలు కొంత ‘కంపు’ నిస్తాయి. దాంతో జనాలకు తెలుస్తుంది. జిన్ విత్ లిమ్కా కి అంత కంపు వుండదు. పిల్లలు హాలీడే కావడం వల్ల వాళ్ళ వాళ్ళ గదుల్లో ఆడుకుంటున్నారు.
షీతల్ గోడ పక్కకి నిశ్చేష్టురాలై నిలబడి వుంది. అటు చమన్ లాల్ కి కానీ ఇటు కిషన్‌చంద్‌కి కానీ తెలీదు. ఆమె తమ మాటల్ని పొల్లుపోకుండా విన్న సంగతి.
షీతల్ ఆలోచిస్తోంది. ఏం చెయ్యాలి? ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? కిషన్‌చంద్‌ తన చెయ్యి వదిలిపెట్టడు. సుందరి పగ పాము కంటే భయంకరమైనది. కూతురికి ఏమీ చెప్పలేని కూతుర్ని ఏ మాత్రమూ కంట్రోల్ చేయలేని నిస్సహాయుడు చమన్ లాల్. ఇప్పుడేం చెయ్యాలి?
షీతల్ వయసు ఇరవై ఆరేళ్ళు. చదివింది కేవలం ఐదో తరగతే. ఆమె తల్లితండ్రులు చమన్ లాలల్ పూర్వికుల దగ్గర పని చేసేవారు. తల్లితండ్రులు గతించాక షీతల్ ని చమన్ లాలే తీసుకొచ్చాడు. న్యాయంగా ఆయితే ఆమె పెళ్ళి చేసే బాధ్యతని కూడా స్వీకరించాలి. చమన్ లాలల్ ఇంటికొచ్చినప్పుడు ఆమె వయసు పద్దెనిమిదేళ్ళు. బహుశా అప్పట్లోనే షీతల్ కి పెళ్ళి చేసి వుంటే ఇప్పుడీ సమస్య వచ్చి పడేది కాదేమో!
కిషన్‌చంద్‌ని మొదటిసారి అక్కున చేర్చుకున్నది షీతలే! సుందరి తిరుగుళ్ళు గురించి ఇతర పనిమనుషుల ద్వారా ఆమె విన్నది. ఆమె భర్తని ‘కుక్క ‘ లా ట్రీట్ చేయడం చాలా సార్లు చూసింది. ‘కుక్క ‘ అంటే విశ్వాసంగా పడి వుండాలనే అర్ధం సుందరిది. కానీ కిషన్‌చంద్‌ మనిషి.
లోకంలో అందరూ ‘కుక్క ‘ విశ్వాసాన్ని కీర్తిస్తారు, కానీ అది ఏ యజమాని దగ్గరుంటే అతనికి మాత్రమే వుంటుందనీ, యజమాని మారితే విశ్వాసం కూడా షిఫ్ట్ అవుతుందనీ అర్ధం చేసుకోరు. మీ యింటి కుక్క పిల్లని ఓ మూడ్నెల్లు పక్కింట్లో వుంచి ఆ తరువాత దాని దగ్గరకు మీరెళ్ళండి… అది మిమ్మల్ని చూసి అపరిచితుడ్ని చూసి అరచినట్టుగా అరవకపోతే నామీదొట్టు. మీ లగ్నం బాగోకపోతే కరచినా కరవచ్చు.
నిజం చెబితే కిషన్‌చంద్‌ చమన్ లాల్ కి అవసరం కంటే ఎక్కువ కృతజ్ఞత కనబరిచాడు. ఆ విషయం నిస్సందేహం.
సుందరితో జీవితం నిప్పుల మీద నడకే అని తెలిసి కూడా సిన్సియర్ గానే వున్నాడు. ఒక్క పెళ్ళి రోజున మాత్రం భయంకరంగా కవ్విస్తుంది. ఆ రోజున కిషన్ చంద్ తన కోపాన్నంతా పశువులా ఆమె మీద పడి తీర్చుకునేవాడు.
కిషన్‌చంద్‌ జీవితం ఓ విధంగా దుర్భరమైనదే. కూలి చేసి చదివించిన తల్లి ప్రేమ తప్ప మరేది అతనికి అనుభవంలో లేదు. ధనవంతురాలు, రూపవంతురాలు అయిన సుందరీబాయితో అతను చాలా గొప్ప జీవితాన్ని వూహించుకున్నాడు. కానీ సుందరి అహంకారమూ, ధన మదము కిషన్‌చంద్‌ని ఏకాకిగానే మిగిల్చాయి.
ఇవన్నీ షీతల్ కి తెలిసే అంతులేని జాలితో అతనికి చేరువైంది. కానీ ఆ అంతులేని జాలి కాస్త కిషన్‌చంద్‌ ప్రేమలో అంతులేని ప్రేమగా మారిపోయింది. చావైనా బ్రతుకైనా కిషన్ కోసమే అని ఏనాడో నిర్ణయించుకుంది షీతల్.
ఇప్పుడా ‘నిర్ణయం ‘ ఎదుటికొచ్చి ప్రశ్నిస్తోంది. బ్రతకడమా?….. చావడమా?
సరే, చచ్చిపోయినందువల్ల ప్రయోజనం ఏమిటి? చావడానికి క్షణం పట్టదు. ఆ తరవాత? కిషన్ జీవితం మారుతుందా? మారకపోతే తను చచ్చి ఉపయోగం ఏముంటుంది? షీతల్ మనసులో ప్రశ్నల తరవాత ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
“చచ్చి సాధించేది ఏదీలేదు. పోనీ, ఇక్కడున్నా క్షణక్షణానికీ సుందరి పైశాచికత్వానికి బలికావడం తప్ప మరో మార్గం లేదు. కిషన్ నన్ను ఏనాడు వదలడు. వదలనంత కాలం అతను ఏనాడు శాంతిగా వుండలేడు. కనుక నేనే నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒకటే మార్గం వుంది. ఎవరితోటీ చెప్పకుండా వెళ్ళిపోవడం. సరే! ఎక్కడకి వెళ్ళాలి? కిషన్ చంద్ పిచ్చి పట్టినట్టు నాకోసం వెతుకుతాడు. అతను వెతికిన కొద్ది సుందరి మరింత పిశాచమై అతన్ని పీడిస్తుంది. కనుక చెప్పే వెళ్ళాలి. అయితే ఎవరితో?”
తనలో తానే యోచించుకుంటోంది షీతల్. షీతల్ సుందరి అంత అందగత్తే కాదు. సుందరిది కాముకత పెంచే అందమైతే, షీతల్ ది ప్రేమని వెదజల్లే అందం.
“నరమృగాలు తిరిగే ఈ లోకంలో వెళ్ళి ఎలా బ్రతకగలనూ? భగవంతుడా… ఆడదానికిన్ని వొంపుసొంపులెందుకిచ్చావు? ఇచ్చినవాడివి వూరుకోకుండా మగవాడిలో ‘పశుత్వాన్ని’ ఎందుకు పెట్టావు?” ఆలోచిస్తూనే వుంది షీతల్.
రెండు గంటలు గడిచాక ఓ పేపర్ మీద కుముద్ పెన్ను తీసుకొని,” నేను వెళ్ళిపోతున్నాను, దయ చేసి నాకోసం వెతక్కండి. చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదు గనక, మీరు కంగారు పడవద్దు. భగవంతుడే నాకూ, మీకూ తోడు” అని రాసేసి డైనింగ్ టేబుల్ మీద ఓ గ్లాస్ కింద పెట్టి మెల్లగా బయటకు నడిచింది షీతల్. ఆమె వొంటి మీద వున్న నగ ఒక్కటే…. ఓ నాడు ప్రేమగా కిషన్ చంద్ ఇచ్చిన మామూలు వుంగరం.
ఆమె అడుగు రోడ్డుని కొలుస్తూనే వున్నాయి. కాళ్ళు ఎటువైపుకి పోతే అటువైపు కెళ్ళింది షీతల్. నడిచీ, నడిచీ కాళ్ళు బొబ్బలెక్కేలా నడిచి ఓ ఆలయం ముందు పడిపోయింది షీతల్. పొద్దున్న నుంచీ ఏమీ తినకపోవడం వల్ల వచ్చిన నీరసమే కాదూ… మనసులోనీ ఆవేదన కూడా ఆమె శక్తిని హరించివేశాయి.
“అమ్మాయ్.. ఎవరో పడిపోయారు చూడు” ఆలయంలోనుంచి అరిచారు పూజారి గారు.
పరిగెత్తుకుంటూ వచ్చింది బిళహరి.
“అయ్యా… ఆమె తెలుగు అమ్మాయిలా కనిపించడం లేదు. సృహ తప్పింది.” అంటూ గబగబా నూతి దగ్గర ‘గోలం’ లో నుంచి చెంబుతో నీళ్ళు తెచ్చి షీతల్ మొహం మీద జల్లింది బిళహరి. కొన్ని నిమిషాలకి కళ్ళు తెరిచింది షీతల్. మొదట ఆమె కళ్ళు చూసింది ఆలయగోపురాన్ని.

******************************

ఇద్దరు స్త్రీలు… ఒకరు పెళ్ళై శారీరక సుఖం ఎరుగని కన్నె.. ప్రేమే ఎరుగని బిళహరి. అసమర్ధ అమాయక కామేష్ ని నమ్మి సర్వేశ్వర్ అనే నికృష్టుడి బోనులో నుంచి తప్పించుకున్న అబల. మరొకరు షీతల్. ఎన్ని తలనొప్పులు కష్టాలు ఎదురైనా , పెళ్ళి అనేది కాకపోయినా ప్రేమని మాత్రం ‘నిండుగా ‘ పొందిన వనిత.
ఒకరు మానం కాపాడుకోవడం కోసం పారిపోతే, మరొకరు ‘శాంతి ‘ కోసం బయటకొచ్చినవారు. ఇద్దరూ చేరింది ఒకే ఆలయపు నీడలో. ఒకరికీ ఆశ్రయం లభించింది. మరి ఇంకొకరికీ?

*****************

“దేఖ్ తేరా ఇన్సాన్ కి హాలత్ క్యా హోగయి భగవాన్
కిత్నా బదల్ గయా ఇన్సాన్
సూరజ్ న బద్ లా.. చాంద్ నా బద్ లా
నా బద్ లారే ఆసమాన్
కిత్నా బదల్ గయా ఇన్సాన్

రోడ్డు మీద ఓ బైరాగి పాడుకుంటూ పోతున్నాడు. ( ఓ భగవంతుడా నీ మనుషులు ఎలా మారిపోయారో చూడు . సూర్యుడు మారలా, చంద్రుడు మారలా, ఆకాశమూ మారలా.. కానీ నీ మనుషులు చూడు .. ఎంత ఘోరంగా మారిపోయారో)
బైరాగి పాట విన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి గుళ్ళో చిరునవ్వు చిందించాడు. ”పిచ్చివాడా మార్పు అతి సహజమైన ప్రక్రియ. మార్పు ఉండి తీరుతుంది. ‘కాలం ‘ నడవాలంటే ‘మార్పు ‘ ఉండి తీరాలి.” అన్నట్టుందా చిరునవ్వు. .

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *