May 26, 2024

మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం!

రచన: టి.వి.ఎస్ శాస్త్రి

కొన్ని సంస్థల పేర్లను చూస్తుంటే నవ్వొస్తుంది! ఒక ప్రఖ్యాత ఆంగ్ల రచయిత(పేరు గుర్తుకు రావటం లేదు, క్షమించండి! ) లండన్ లో ‘Ugly Men Club ‘అనే సంస్థను ప్రారంభించాడట! ఎంతకాలం చూసినా ఏ ఒక్కడు కూడా అందులో సభ్యుడిగా చేరలేదట! ఎవరికి వారు తమని అద్దంలో చూసుకొని తమ అందాన్ని చూసి మురిసిపోతుంటారు! ‘నేను అందవిహీహనంగా ఉన్నానని ‘ ఎవడూ అనుకోడు! మనిషి అందంగా ఉండి, ఆలోచనలు ugly గా ఉంటే ఏమి ప్రయోజనం? ఇంతకీ ఆ సంస్థలో ఎవరూ సభ్యత్వం తీసుకోకపోవటానికి కారణం –అందరూ తాము అందంగా ఉన్నామని భావించటమే కాకుండా తమ ఆలోచనలు కూడా బాగున్నాయని అనుకొని ఉంటారేమో ! ఇది సహజమే !

ఇలా నవ్వు తెప్పించే సంస్థల పేర్లు చాలానే ఉన్నాయి! ఉదాహరణకి— మేధావుల సమాజం, మేధావుల సమాఖ్య, మేధావుల కూటమి. . . . . . . . లాంటి సంస్థలున్నాయని తెలిసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను! ఇంతకీ అటువంటి సంస్థలకు వారే ఆ పేరు పెట్టుకొని, తమల్ని తామే మేధావులుగా డిక్లేర్ చేసుకుంటారా?లేక మరెవరైనా ఆ సంస్థకు ఆ పేరు పెట్టి అందులోని సభ్యులను మేధావులుగా డిక్లేర్ చేస్తారా?ఆ సంస్థలో సభ్యులు -మేధావులకు ఏ కొలమానాలిచ్చారో? నిజమైన మేధావులు ఎవ్వరూ తామే మేధావులని డిక్లేర్ చేసుకోరు! ఇటువంటి స్వయం ప్రకటిత సంస్థలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయి! ప్రపంచం అంతా మేధావులుగా గుర్తించిబడినవారు, ఒక్కొక్కసారి చుట్టుపక్కలవాళ్ళ చేత అలా గుర్తించబడరు.

ఒక ప్రఖ్యాత రచయితకు నోబెల్ బహుమతి లభించిన సందర్భంలో ఆయన ఆ ఆనందాన్ని తన భార్యతో పంచుకోవాలని ఆమెకు చెప్పాడట! అందుకు ఆమె, “అదేమిటండీ! అది గొప్ప మేధావులకు ఇచ్చేది కదా! మీకెలా ఇచ్చారు?” అని అంటే ఆయన విస్తుపోయాడట! ఈ దేశంలో నిజమైన మేధావులు మౌనంగా ఉన్నారు! కుహనా మేధావులే తమల్ని మేధావులుగా ప్రకటించుకోవడం చూస్తుంటే నాకు నవ్వుతో పాటు అసహ్యం కూడా కలుగుతుంది! ఈ so called మేధావులు ఏ ఉద్యమాన్ని సంపూర్ణంగా చేపట్టరు. అన్నిటినీ అర్ధాంతరంగానే వదిలేస్తారు! మీకు కూడా ఈ విషయాలు తెలుసు! సమాజాన్ని చైతన్యం చేయకపోతే ఫరవాలేదు, పక్కదోవ పట్టించుకుంటే అదే పదివేలు! ఇలాంటి వారిని మేధావులని అనటం కన్నా Court Priests అనటమే బాగుంటుంది! నాకు కొంతమందిని గురించి మేధావులనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. విశ్వ విద్యాలయాల్లో, న్యాయవాదుల్లో, రచయితల్లో, విలేఖర్లలో, పత్రికా సంపాదకులలో —చాలామంది తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారు! దీని కారణంగానే కుహనా మేధావులు పుట్టుకొస్తున్నారు! మనం ఏమి వ్రాయాలో కూడా వీరే చెబుతున్నారు! వారు అనుకున్నట్లు రాయకపోతే అభ్యుదయ భావాలు లేవని పెదవి విరుస్తారు. మేధావులుగా చెలామణి అవుతున్న కొందరు, తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పైకి చెబుతుంటారు. వారి రాతలు, కోతలు చూస్తుంటే వారు ఏ రాజకీయ పార్టీ తొత్తులో చెప్పటమే కాకుండా వారి కులగోత్రాలు కూడా చెప్పొచ్చు. వారి దృష్టిలో వారి కులం, మతం మాత్రమే గొప్ప ! తెలియని దానిని తెలుసుకోవటానికే ఈ నిరంతర ప్రయాణం, అన్వేషణ!

కుహనా, సం’కులిత’ మేధావులు పెట్రేగిపోవటానికి కారణం, నిజమైన మేధావులు తమ కలాలకు, గళాలకు పని చెప్పకపోవటమే! మేధావులుగా చెప్పుకునే ఇలాంటి వారి ఆహార్యం కూడా విభిన్నంగా ఉంటుంది. వీరిలో చాలామంది గడ్డాలు పెంచుకుంటారు. కొందరికి పిల్లి గడ్డం ఉంటుంది. కొందరు కళ్ళజోడు పైనుంచి చూస్తుంటారు. వీళ్ళు గడ్డాలు ఎందుకు పెంచుకుంటారో నాకైతే తెలియదు. మేధావితనానికి అదొక సింబాలిజం ఏమో మరి?దీన్ని మీరు కూడా గమనించే ఉంటారు. నా లాంటి సామాన్యుడి ఆవేశం వల్ల సమాజానికి ఉపయోగం లేకపోవచ్చు! కానీ అసలైన మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం! కొసమెరుపు ఏమంటే ఫేస్ బుక్ వాడు నన్ను కూడా ఈ మధ్య మేధావిగా డిక్లేర్ చేసాడు, నాకు చెప్పకుండానే! ప్రస్తుత పరిస్థితులలో వాడు నన్ను మేధావి అనటం ఏదో బూతుమాటన్నట్లుగా నేను ఫీల్ అవుతున్నా! ఈ సందర్భంలో మహాకవి శ్రీ శ్రీ వ్రాసిన ఒక అనువాద గీతాన్ని ఈ దిగువన పొందుపరుస్తూ ముగిస్తాను!
విరాజకీయ మేధావులు
ఒకానొక దినాన
నాదేశపు విరాజకీయ మేధావుల్ని
నిలవేసి ప్రశ్నిస్తారు
అమాయకులైన అలగాజనం
ఏం చేస్తున్నారు మీరు
మనదేశం నింపాదిగా తీయ్యని మంటలాగా
చిన్నగా ఒంటరిగా మరణిస్తున్నప్పుడని

ఈ రాజకీయాలేవీ లేని మేధావుల్ని
ఎవరూ ప్రశ్నించరు
మీరెలాంటి దుస్తులు వేసుకున్నారని
మధ్యాహ్న భోజనానంతరం
ఎలా కునుకు తీశారని
శూన్య పదార్థంతో మీరు సాగించిన
శుష్కసమరాలను గురించి
ఎవరూ తెలుసుకోదలచుకోరు
ధనవంతమైన మీ ఉన్నత విద్యగురించి
ఎవరూ పట్టించుకోరు

ప్రశ్నించరు మీ పౌరాణిక పాండిత్యాన్ని
ప్రశ్నించరు మీలోని ఎవడో
పిరికివాడి చావు చావడం ప్రారంభించినప్పుడు
మీరు పొందుతున్న స్వీయహేయభావం గురించి
సంపూర్ణమైన అసత్యపు ఛాయాల్లో జన్మించిన
మీ అర్థం సమర్థింపుల గురించి
సంజాయిషీల గురించి
ఎవరూ ఏమీ అడగరు
ఆ రోజున
అమాయక మనుష్యులు వస్తారు
రాజకీయాలు లేని మేధావుల గ్రంథాలలో
కవిత్వాలలో స్థలం లేనివాళ్లు
కానీ అనుదినం ఈ మేధావులకి
పాలూ కూరగాయలూ పట్టుకొచ్చినవాళ్లు
కోడిగుడ్లు తెచ్చినవాళ్లు
దుస్తులు కుట్టిపెట్టినవాళ్లు
కార్లు నడిపినవాళ్లు
కుక్కల్నీ తోటల్నీ పెంచినవాళ్లు
కష్టించిన వాళ్ళు
వాళ్ళు ప్రశ్నిస్తారు
పేదవాళ్లు భాద పడుతున్నప్పుడు
లాలిత్యమూ జీవితమూ వాళ్లలోనుంచి
మండిపోయి మసీ నుసీ అయిపోయినప్పుడు
ఏంచేస్తున్నారు మీరని
ఓ నా సుమధుర దేశపు
విరాజకీయ మేధావులారా
అప్పుడు మీరు జవాబు చెప్పలేరు
ఒక నిశబ్ధపు రాబందు
మీ పేవులారగిస్తూ ఉంటున్నప్పుడు
మీ వేదన మీ ఆత్మలనే
పొడుచుకు తింటున్నప్పుడు
మీ సిగ్గులో
మీరే నోరు మూసుకొంటారు .

రచన :మ్యడిసెస్
మహాకవి శ్రీశ్రీ – మరోప్రస్థానం

(ఇది ఎవరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు! నా గురించి మాత్రమే వ్రాసుకుంది. ఎవరైనా భుజాలు తముడుకుంటే నేనేమీ చేయలేను! )
టీవీయస్. శాస్త్రి

14 thoughts on “మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం!

 1. మీ వ్యాసం చాలా బాగుందండీ. మంచి విషయాన్నీ చెప్పారు.

 2. మేథావుల గూర్చి మీ వ్యాసం బాగుంది. ఈ రోజుల్లో మేథావుల మౌనం కంటె, మేథావులం అనుకునేవాళ్ళ వలన ఎక్కువగా చెడు జరుగుతోందని నా అభిప్రాయం. సోషల్‌మీడియా వచ్చాక, ఈ తరహా మేథావుల సంత ఎక్కువయ్యింది. సలహాలు, సూచనలు, తమకు ఏ మాత్రం పరిజ్ఞానం లేని విషయాల్లో చర్చలు … వగైరా మితిమీరిపోయి విసుగు పుట్టిస్తున్నాయి కదా?! వీళ్ళ నిర్వాకం వల్ల నిజంగా కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉన్నవాళ్ళంతా మౌనాన్నే ఆశ్రయుస్తున్నారేమోనని నా సందేహం. ఏది ఏవైనా మీరన్నట్టు.. మేథావులు మౌనం నష్టదాయకమే.

 3. మేథావుల గూర్చి మీ వ్యాసం బాగుంది. ఈ రోజుల్లో మేథావుల మౌనం కంటె, మేథావులం అనుకునేవాళ్ళ వలన ఎక్కువగా చెడు జరుగుతోందని నా అభిప్రాయం. సోషల్‌మీడియా వచ్చాక, ఈ తరహా మేథావుల సంత ఎక్కువయ్యింది. సలహాలు, సూచనలు, తమకు ఏ మాత్రం పరిజ్ఞానం లేని విషయాల్లో చర్చలు … వగైరా మితిమీరిపోయి విసుగు పుట్టిస్తున్నాయి కదా?! వీళ్ళ నిర్వాకం వల్ల నిజంగా కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉన్నవాళ్ళంతా మౌనాన్నే ఆశ్రయుస్తున్నారేమోనని నా సందేహం. ఏది ఏవైనా మీరన్నట్టు.. మేథావులు మౌనం నష్టదాయకమే.

  1. శాస్త్రిగారి రచన స్లాఘమియా మైనది . ఒక చక్కని ఇతివృత్తం తీసికుని దాంట్లో మహాకవి శ్రీ శ్రీ గారి రచన పొందుపరిచారు. వీరి వ్యాసం సూసి నేను “గూగులులో” అగ్లిమెన్ క్లబ్గుగురించి చూసాను – చాలానే ఉన్నాయి . ఎక్కువ ధనవంతులు ఈక్లబ్బులలో చేరుతారని ప్రతీతి. ఈమధ్య వాట్సాప్ లో విచిత్రమైన “భార్య-భాదితుల సంఘం” ఒకటి గుంటూరులో నడుపుతున్నారని సరుకులెట్ అయ్యింది ,వారు ప్రచురించిన తెలుగు క్యాలెండరు కూడా నమూనా వేసేరు.
   ఆస్కార్ అవార్డ్స్ లో కూడా , ఫర్ గుడ్, బాడ్ అండ్ అగ్లీ ఫిలిమ్స్ అవార్డ్స్ ఉంటాయట ! హాలీవుడ్ లో వరస్ట్ ఫిలిమ్స్ అర్ అల్సొ రేటెడ్. అండ్ అవార్డ్స్ గివెన్.!

   చాలామంది క్లిష్టమైన పరిస్థితులలో “ఊరుకున్నంత” ఉత్తమం, బోడిగుండుకున్న సుఖం లేదు” అని సరిపుచ్చుకుంటారు. అందుకే మేధావులు మౌనంగావుండిపోతారేమో? ఈ డెమోక్రాటిక్ వరల్డ్ లో ఒకరు భిన్నంగా గొంతు ఎత్తితే హేళన చేస్తారు .మైట్ ఐస్ రైట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *