June 14, 2024

రిటైర్మెంట్ ( హాస్య కధ )

రచన : శర్మ జి ఎస్

అక్కడ దాదాపు 1000 గడపలుంటాయి . అంతమాత్రాన అది పట్టణమూ కాదు . అలాగని పల్లెటూరూ కాదు .
పోనీ అటు పట్టణానికీ , యిటు పల్లెటూరుకూ నడుమ వరుసలో ఉందని అనటానికీ వీల్లేని ఓ సరిక్రొత్త
అత్యాధునిక సిటీలా చెలామణీ అవుతున్నది హైదరాబాదుకి ఊరి చివర .

అక్కడ వుంటున్న వాళ్ళు అందరికీ పుట్టుకతో వచ్చిన రెండు కాళ్ళే కాకుండా రకరకాల వాహన సంపత్తి
సమకూర్చుకొన్నవాళ్ళే . హైదరాబాదు కార్పొరేషన్ కి అనుసంధానం కావాలంటే యిటువంటివాటి అవసరం ఎంతైనా వున్నది అని బల్ల గుద్ది చెప్పక తప్పదు మరి . అంతే కాదు హైదరాబాదు కార్పొరేషన్ లోని
మెయిన్ రోడ్డుకి చేరుకోవాలన్నా స్వంతంగా వాహన సదుపాయం లేని వాళ్ళకి ఓ పెద్ద సమస్యే . ఎందుకంటే
ఈ యిళ్ళ నుంచి సెక్యూరిటీ మెయిన్ గేటుకి చేరుకోవాలంటేనే షుమారుగా 0.75 కిలోమీటరు నుంచి 2.00
కిలో మీటర్ల వరకు నడవవలసి రావచ్చు .
ఇంత దూరంగా , యిన్ని సమస్యలున్నచోట ఎందుకు వుంటున్నారన్న సందేహం మీ మనసుల్లో
తొలుస్తుండవచ్చు .దానికీ మన హైదరాబాదు , సికింద్రాబాదులే ముఖ్య కారణం . అదేమిటని ఆశ్ఛర్యపోకండి .
అదే సామాన్య నగరాన్ని మహానగరంగా మార్చుతున్న , అధునాతన డెవెలప్ మెంట్ అని వేనోళ్ళ కొనియాడ
బడుతున్నది .
ఈ మహానగరంలోని చాలామంది నేటి కుఱ్ఱకారు ఏదో ఓక సాఫ్ట్ వేర్ కంపెనీకి అనుసంధానమైన వాళ్ళే .
నగరం నడిబొడ్డున వుంటే ముఖ్య రహదారుల్లోని ట్రాఫిక్ ని దాటుకొంటూ వాళ్ళ ఆఫీసుకు చేరుకోవటానికి
ఉదయాన్నే బయలుదేరవలసి రావటం , అదే సమయంలో తమ పిల్లల్ని స్కూలుకు పంపించే పనిలో వాళ్ళు
బిజీగా వుండటం ఒక కారణమైతే , రాత్రికి యింటికి చేరుకొనే సరికి యింట్లోని వారందరూ నిద్రాదేవి ఒడిలోకి
చేరిపోవటం మరో కారణం కూడా . ఇదంతా ఓ ఎత్తయితే , ఈ రద్దీ కారణాల వలన ఏర్పడే వాతావరణ కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బ తీయటం ఓ ప్రధాన కారణం కూడాను .
ఇటువంటి కుటుంబాల వాతావరణంలో రకరకాల ఉద్యోగస్తులు వుంటూనే వుంటారు . ఒక కుటుంబంలో ఓ కారు , ఓ బైకు , ఓ స్కూటీ వుండవచ్చు . అవి ఆ కుటుంబంలోని అందరికీ ఉపయోగపడకపోనూ వచ్చు . దానికి రకరకాల కారణాలు ఉంటుంటాయి. అందరూ కలిసి వెళ్ళేటప్పుడో , లేక తను హాయిగా వెళ్ళాలనుకున్నప్పుడో కారు ఉపయోగపడవచ్చు . ఒక్కోమారు బైకు ఉపయోగపడవచ్చు . కారు బైటకు తీసుకొని ఒకరు వెళ్ళినప్పుడు , బైకు అందుబాటులో వున్నా , మిగిలిన వాళ్ళకు ఉపయోగపడకపోనూ వచ్చు . కారణం డ్రైవింగ్ వచ్చినా , లైసెన్స్ లేకపోవటమో , లేక అసలు ఆ డ్రైనింగ్ సెన్సే లేకపోవటమో జరుగుతుంటుంది . ఇలాంటి ఈ వాతావరణంలో మన కధలోని ముఖ్య పాత్ర అయిన వర్మ ఆ 1000 గడపలలోని ఓ గడపలో నివశిస్తున్నాడు .
ఈ వర్మ ఓ ప్రైవేటు సంస్థలో ఓ చిరుద్యోగి . 9.30 కి బయలుదేరి బేగంపేటలోని ఏర్ పోర్టుకి అతి సమీపంలో వున్న తన ఆఫీసుకి చేరుకోవాలి . నిత్యం తన దైనందిన కాలకృత్యాలు ముగించుకొని సెక్యూరిటీ వద్ద గల మెయిన్ గేట్ కు 7.45 కి చేరుకొంటాడు . అక్కడ నుంచి ప్రధాన రహదారికి కనీసం 1.75 నుంచి 2 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి . ఇది ఏ ఒక్క రోజో , రెండు రోజులో అంటే నడువగలడు . నిత్యం నడవటమంటే ఆఫీసులో అలసిపోవటమే అవుతుంటుంది . పోనీ ఆటో సౌకర్యం వున్నది కదా , ఆటోలో వెళ్ళవచ్చు కదా అన్న సందేహం కలగవచ్చు . అయితే ఆటోలో వెళ్ళి రావచ్చు కదా అంటే , అదీ ప్రారంభంలో చేశాడు . అప్పుడు రాను పోను 40 రూపాయలే ఖర్చు అయ్యేది . అంటే నెలకు 1040 అయ్యేది . అక్కడనుంచి మెట్రో పాస్ ఓ 900 , వెరశి నెల మొత్తం 2000 వరకు అయ్యేది . అయినా భరించాడు .
ఇప్పుడో అలా కాదు ఆ నాటి ప్రభుత్వ కారణంగా , అడుగడుగునా డీజల్ ధర పెరుగుతుండటంతో ఆ ఆటో ఖర్చులు షుమారుగా రోజుకి రాను పోను 80 రూపాయల వరకు చేరుకొన్నాయి , మెట్రో పాస్ పెరిగిపోవటంతో , ఈ అనుకోని అవాంతర చర్యలతో ఆతనికి నెలకు 4000 వరకు ఖర్చు పెట్టవలసి వస్తోంది . ఆతని జీతం ఆ నాడు 8000 అయితే , ఈనాడు అతి కష్టం మీద 9000 వరకు చేరుకొన్నది . ఈ 9000 జీతానికి ఉదయం 7.45 కి బయలుదేరి రాత్రి 8 గంటల వరకు శ్రమ పడవలసి వస్తోంది. ఇంత శ్రమ పడి , యింత ఖర్చు పెట్టుకొని , యింటికి చేరుకొనే జీతం 5200 మాత్రమే . అందుకే తన యింటి నుంచి ఆటోలో వెళ్ళటం మానేసి , అక్కడ నుంచి నిత్యం ఏదో ఓ పనిమీద బైటకు వెళ్ళేవాళ్ళ బైకుల మీదనో , కార్లలో వెళ్ళే వాళ్ళనో లిఫ్ట్ అడగటం అలవాటు చేసుకొన్నాడు .
ఈ చర్యతో ఆతనికి 7400 వరకు యింటికి చేరుతోంది . చాలా ఆనందం పొందుతున్నాడు .
అలా ఆ లిఫ్ట్ అడగటంలో కూడా తనకు తెలిసిన ఓ చిన్న టెక్నిక్ ఉపయోగించేవాడు నిన్న అడిగిన వాళ్ళని నేడు అడగకుండా . ఇలా కొంతకాలం గడిచింది . దాదాపుగా అక్కడ అందరికీ పరిచయమయ్యాడు , పాపులర్ అయిపోయాడు ఆ వర్మ .
దాదాపుగా వాళ్ళ కుటుంబంలో పాపులర్ కానంతగా పాపులర్ అయిపోయాడు . ఎంతగా పాపులర్ అయ్యాడంటే ,నిత్యం లిఫ్ట్ యిచ్చే వాళ్ళు , వాళ్ళు బయలుదేరబోయే ముందు ఆతను ఆ సెక్యూరిటీ గేటు దగ్గఱ వున్నాడేమోనని చూసే వారు . లేకుంటే కొంత సమయం వెయిట్ చేసి , ఆ పై వస్తే ఎక్కించుకొనే వాళ్ళు ,రాకుంటే అలాగే ఒంటరిగా వెళ్ళే వాళ్ళు .ఒక్కో మారు ఆతని కొఱకు ఆ గేటు వద్ద నిరీక్షించటం కంటే , తాము బయలుదేరే ముందు ఆతని యింటికే సెక్యూరిటీ నుంచే యింటర్ కాంతో కాల్ చేసి రమ్మనే వాళ్ళు .
ఇలా కొంతకాలం గడచింది . వాళ్ళ యింటిలోని వారందరూ వర్మకొచ్చిన పాపులారిటీని చూసి ఆశ్ఛర్య పోయారు . ఇలా ఒకళ్ళు కాదు అందరూ నిత్యం ఫోన్ చేస్తుండటంతో ఆ యింటిలోని వాళ్ళు బదులు చెప్పటంలో బిజీ అయిపోతున్నారు . ఒకటి , రెండు రోజులంటే ఎవ్వరికైనా బాగుంటుంది . ఇదే నిత్యం అయితే, విసుగు కలగక మానదు. అదే యిక్కడా సంభవించింది .
ఆ రోజు వర్మ యింటికి రాగానే , అందరూ వాళ్ళ యింటిలోని వాళ్ళు మూకుమ్మడిగా ఒక్కటే చెప్పారు . మీకు లిఫ్ట్ యిచ్చే వాళ్ళ ఫోన్లతో బదులు చెప్పలేకపోతున్నాము . మీరే ఏ రోజు ఎవరి లిఫ్ట్ తీసుకొంటారో వాళ్ళకు చెప్పుకోండి . అంతే కాదు ఆ సెక్యూరిటీలో మీ నేం ప్లేటు బోర్డు ఒకటి పెట్టుకోండి యిన్ – ఔట్ . మీరు వెళ్ళేటప్పుడు ఆ బోర్డ్ లో ఔట్ అని సరి చేసి వెళ్ళండి. మీరు వాళ్ళందర్నీ, వెళ్ళేటప్పుడు ఆ బోర్డ్ చూసి వెళ్ళమనండి . అంతే కాని యిలా అడుగడుగునా యిక్కడ వున్న వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతుంటే , మేమంతా చాలా యిబ్బందిపడ్తున్నాం యింట్లో పనులు కాక . అర్ధం చేసుకోండి .
అంత యిబ్బందికరంగా వున్నదా బదులు చెప్పటం . సరే చెప్పుకొంటాలే అన్నాడు .
నాన్నగారూ అన్నయ్యవాళ్ళు చేతికంది వచ్చారు కదా ! ఇంకా మీరు ఈ ఉద్యోగం చెయ్యకపోతే ఏం పోయింది
అన్నది వాళ్ళ పెద్దమ్మాయి .
ఆయన్ను ఈ ఉద్యోగం చేయనీవే , లేకుంటే మేం పడలేమే ఆ నసని అన్నది ఆయన అర్ధాంగి .
అదేంటమ్మా నాన్నని అలా అంటున్నావ్ ?
ఈ కొత్త యింటికి వచ్చే ముందు ఆయన్ను చేసే ఉద్యోగం మాని , యింట్లోనే వుండమని మేమే అన్నాం. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్న ఆఫీసుకి , ఈ కొత్త యింటికి దూరమని . ఆయనా అలాగే అన్నారు . కాని యింట్లో వుండి ఆనందించటం చాత కాక , అన్ని విషయాలు పట్టించుకొని చంపేస్తున్నారే . పోనీలే దగ్గర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయండి కాలక్షేపం అవుతుందీ అంటే , నా తెలివితేటల్ని ఈ చిన్న చిన్న దుకాణాదారులకు బలి చేయమంటారా అంటూ ఒకటే నస ,గొడవలు . ఆ బాధ తట్టుకోలేక మీ అన్నయ్య “నాన్నగారూ అమ్మ చెప్పినట్లు మీరు అంత దూరం వెళ్ళి ఉద్యోగం చెయ్యవద్దు . ఇలా యింట్లోనే వుండి అన్ని విషయాలు పట్టించుకొనే బదులు , మీరలా ఆఫీసు వర్కింగ్ టైంలో ఏ లైబ్రరీకో , ఏ పార్కులోనో , ఏ రైల్వేస్టేషన్ లోనో కాలం గడిపి ఎంజాయ్ చేసి రండి , అందుకు అయ్యే ఖర్చులు నేనిస్తాను ” అన్నాడు .
“ఖర్చులైతే యిస్తావు . నాకు అక్కడ వచ్చే జీతం ఎవరిస్తారు ? ” అని అన్నారు మీ నాన్న .
“ఆ జీతమూ నేనే యిస్తానన్నాడు మీ అన్నయ్య .”
నేనే వద్దన్నానే . ఎందుకంటే ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడా ఏదో గొడవ పెట్టుకొని వస్తారు . ఆ పేపర్ సరిగా మడత పెట్టలేదనో , ఈ పత్రికలో ఎవడో పిచ్చి గీతలు గీశాడనో , ఈ పజిల్ చింపారనో . ఈ బాధలూ పడ్డామే . అందుకే అదీ వద్దని నేనే చెప్పేశానే. సరే రైల్వే స్టేషన్ కి వెళ్ళొస్తాను అన్నారు . సరేలే అనుకొన్నాం .
అక్కడకి వెళ్ళారు . ప్లాట్ ఫాం టిక్కెట్టు కొనుక్కొని ప్లాట్ ఫాం 1 లో కూర్చొన్నాడు . ఇంతలో రైల్వే వాళ్ళు మైకు ద్వారా “దయచేసి వినండి 12748 పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 20 నిముషాలు ఆలస్యంగా నదచుచున్నదని ఆశించడమైనది ” అనౌన్స్ చేశారట .
ఆయన విన్నారు . వెంటనే రైల్వే టెలివిజన్ లో డిస్ప్లే చేశారు.
అర్ధగంట గడిచింది . ఆ 12748 పల్నాడు రాలేదు . ఆ డిస్ప్లేలో అదే లేట్ చూపిస్తున్నారుట . ఇంతలో మళ్ళీ ఓ ప్రకటన ” దయచేసి వినండి 12748 పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 40 నిముషాలు ఆలస్యంగా వచ్చునని ఆశించడమైనది “. వెంటనే మీ నాన్న ఆ డిస్ప్లే వైపు చూశారట . యింకా అక్కడ ఆ కరెక్షన్ చేయలేదట . అవుతుందేమోనని అలాగే చూస్తూ వున్నారట . ఇంతలో మరో ప్రకటన ” దయచేసి వినండి 12748 పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరో 60 నిముషాలు ఆలస్యంగా వచ్చునని ఆశించడమైనదని . అంతే ఆ డిస్ప్లే వైపు చూశారుట . కరెక్షన్ కాలేదుట . అంతే అమాంతంగా ఆయనకు కోపం వచ్చేసింది .
వెంటనే సూపరింటెండెంట్ దగ్గరకు వెళ్ళి ఏమిటండీ ఈ ప్రకటనలు . అడుగడుగునా లేట్ అని చెప్తున్నారు . ఎంత లేట్ గా వస్తుందో మీరు ఒక్కసారి చెప్పలేరా ? అడిగారట .
అలా చెప్పలేమండి . ఎందుకంటే పై స్టేషన్ నుంచి మాకు వచ్చేఆదేశాల ప్రకారం ప్రకటనలు చేస్తాం . తదనుగుణంగా మేం నడచుకొంటుంటాం . ఆ అధికారికి అనుమానం వచ్చి , ఆ ట్రైన్ లో మీ వాళ్ళెవరైనా వస్తున్నారా? అని అడిగారుట .
అబ్బే ఎవరూ రావటం లేదండీ . అయితే మీరెందుకండీ ఆ ట్రైన్ కొరకు యింత ఆవేదన పడ్తున్నారు ? మీరెందుకొరకు వచ్చారిక్కడకి ? అడిగారు .
నా చిన్నతనం నుంచి చూస్తున్నాను యిదే తంతు మీ రైళ్ళు , మీ విభాగాలు . ఉద్యోగం మానేసి యింట్లో ఖాళీగా కూర్చోలేక కాలక్షేపానికి వస్తున్నా ప్లాట్ ఫాం టికెట్ కొనుక్కొని .
రోజూ వస్తుంటారా మీరు అని అడిగారట ఆ స్టేషన్ మాస్టారు . ఏదీ ఆ టికెట్ చూపించండీ అన్నారట .
ఔనండి అంటూ ఈయనగారు టికెట్ చూపించారు . వెంటనే ఈ టికెట్ ఎప్పుడో ఉదయం 8 గంటలకు తీసుకున్నది . ఇప్పుడు 12 గంటలు కావస్తున్నది చెల్లదు అంటూ రైల్వే పోలీసులకు అప్పగించారుట . మీ అన్నయ్య సర్ది చెప్తుంటే ఆ పోలీసులు ” బాబూ మీ నాన్నగారికి కాలక్షేపం కాకుంటే యిలా ఓ ప్లాట్ ఫాం టికెట్టు కొనుక్కొని ఉదయం నుంచి సాయంత్రం దాకా యిక్కడే కూర్చోవటం మంచి పధ్ధతి కాదు అని మఱీ మఱీ చెప్పి యింటికి పంపించారుట .
తీరా యింటికొచ్చిం తర్వాత మళ్ళీ మామూలే అన్ని విషయాలు పట్టించుకొంటుంటే , పడలేక యిలా యింట్లో కూర్చొని అన్నీ పట్టించుకొనే బదులు అలా , ఉదయం సాయంత్రం పార్కుకి వెళ్ళి ప్రకృతిని ఎంజాయ్ చేసి రాకూడదు అన్నాను .పైసా ఖర్చు కాదు గదా! అని . అలాగే అంటూ బయలుదేరి వెళ్ళారు .
సాయంత్రం యింటికొచ్చారు చేతికి గాయాలతో . ఏమిటండీ ఆ గాయాలు ? ఎక్కడన్నా పడ్డారా ? అని అడిగాను .
ఎక్కడా నేను పడలేదు . ప్రేమలో పడ్తున్న వాళ్ళని హెచ్చరించాను .
మీకెందుకండీ అవన్నీ . మిమ్మల్ని పార్కుకి వెళ్ళమన్నది కాలక్షేపం చేయమని గాని , ఊరందరి విషయాలు పట్టించుకొని తన్నులు తినమని కాదు గదా! . అబ్బబ్బ మీరెన్నాళ్టకి మారరనుకుంటా . అయ్యయ్యో బాగా దెబ్బలు తగిలాయి . గట్టిగా కొట్టినట్లున్నారు .
కొట్టేవాళ్ళు గట్టిగా కొట్టక మెల్లగా కొడతారా ? పైగా నేనేమైనా మెల్లగా కొట్టండి బాబోయ్ అని రిక్వెస్ట్ చేస్తానా ?
సరేలే రండీ , రండి ఈ మంచం మీద కూర్చోండి , ఆయింట్మెంట్ రాస్తాను అని ఆయనను కూర్చోపెట్టేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది .
అందుకేనే మేమందరం ఓ స్థిర నిర్ణయానికి వచ్చేశాం .
ఏమిటో అది ?
ఏముందే , దూరమైనా ఆయన అంతకుముందు చేసే ఆ ఉద్యోగమే చేయమన్నాం . అదే బెటర్ అనిపించింది కష్టమైనా. ఆ కష్టమేదో ఆయనే యిష్టంగా పడ్తారుగా . అందుకనే ఆ పాత ఉద్యోగమే చేయమన్నాం .
మంచిపనే చేశారు . ఇంక సమస్య తీరిపోయినట్లేగా. అలాగే మేమూ అనుకున్నాం . దిగితే గాని లోతు తెలియదన్నట్లు , యిందులోనూ సమస్యలే .
సమస్యలా ? ఇంతలో ఫోన్ రింగ్ అయింది . చూడమ్మా ఆ ఫోను ఆయనగారి గురించే . ఆయన వస్తే మెయిన్ రోడ్డు వరకు లిఫ్ట్ యిద్దామని . పాపం పెద్దాయన కదాండి అని అంటుంటారు .
సరిగ్గా అదే అన్నారు ఆ ఫోన్ చేసినవాళ్ళు .
మా నాన్న గారు వెళ్ళిపోయారండి అని బదులిచ్చింది ఆ అమ్మాయి .
సరేనంటూ ఫోన్ పెట్టేశారు .
మంచిదే గదా అమ్మా , నాన్నకు శ్రమ లేకుండా ఉంటుంది కదా !
ఈ ఫోన్లకు బదులు చెప్పే కంటే ఆయన ఒక్కరే శ్రమ పడటమే మేలనిపిస్తుంది , శ్రమ పడలేకపోతే ఆయన ఆటోలో వెళ్తే అయ్యే ఖర్చులు మీ అన్నయ్య యిస్తానన్నాడే . అందుకు ఆయన ససేమిరా అంటున్నారు . పోనీ యింట్లోనే వుండండీ అందామా అంటే , ఆయనను భరించాలన్న ఆలోచన రాగానే భయం చుట్టు ముట్టేస్తోంది . ఆయన ఏం చేసినా , ఏమీ చేయకున్నా సెన్సేషనేనే . ఈ సమస్యకు సొల్యూషనే లేదా అనిపిస్తోంది .
నాన్న యింత సమస్యగా ప్రవర్తిస్తారా ? నేనెప్పుడూ చూడలేదమ్మా . నేనూ పెళ్ళికి ముందు 25 సంవత్సరాలు ఈ యింట్లోనే వున్నాగా . ఎప్పుడూ చూడలేదే యిలా ? ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి .
ఆ రోజుల్లో కూడా ఆయన ఏమీ పట్టించుకునే వారు కాదు , ఆ ఆఫీసు పనులతోనే సరిపోయేది . అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఆయన దాకా ఏవీ పోనిచ్చేదాన్ని కాదు . అంతా మీ అన్నయ్య , నేను చూసుకొనేవాళ్ళం . అందుకే ఆయన గురించి మీకెవ్వరికీ తెలియదు . అసలంటూ వాళ్ళకు చాదస్తం వుంటే , వయసు పెరిగే కొద్దీ అదీ పెరుగు తుంటుంది .
మఱి పరిష్కారం లేదా ?
ఉండే ఉంటుంది . కాలమే పరిష్కారం చూపాలి .

* * *

ఎప్పటిలాగే ఆ రోజు చాలామంది యింటికి ఫోన్లు చేస్తూనే వున్నారు వర్మ కొఱకు .
బదులుగా ఆయనకు నలతగా వుందంటూ బదులు చెప్పారు అందరికి .
ఆ వారమంతా యిలాగే ఫోన్ల వాళ్ళందరికీ చెప్తూ వచ్చారు .
ఆ రోజు సోమవారం ఆఫీసుకి రెడి అయి బయలుదేరుతూ మళ్ళీ ఫోన్లు . రింగు అవుతూనే వున్నది . బదులు రాలేదు.. ఆ రోజున ఫోన్ చేసిన వారందరికీ బదులు రాక , సరాసరి ఫ్లాట్ లోకి వచ్చారు వర్మ గారికెలా వుందో కనుక్కొని వెళ్దామని .
అక్కడ వర్మ గారిని నేల మీద పడుకోబెట్టారు . తల వెనుక దీపం వెలుగుతోంది . మరొక వైపు భగవద్గీత వినపడ్తోంది.
ఆ యింట్లోని వారందరూ మౌనంగా రోదిస్తున్నారు .
అప్పుడు తెలిసింది ఆఫీసుకు ఆలస్యమవుతుందని హడావుడిగా వెళ్తున్న బస్సెక్కుతూ క్రింద పడిపోయారుట . తలకు బాగా దెబ్బ తగిలిందిట . అంతే అప్పటినుంచి స్పృహ కోల్పోయారుట .
చూడటానికి వచ్చిన వాళ్ళందరూ . ఆయనను పొగడుతున్నారు . ఆయన పధ్ధతుల గురించి , ఆయన నడవడి గురించి .
ఆ రోజు దాదాపుగా వాళ్ళందరూ ఆఫీసుకి సెలవు పెట్టి ఆ తదుపరి కార్యక్రమాలకు చేయూతనిచ్చారు .

* * * సమాప్తం * * *

( అలవాట్లు పరిస్థితులను బట్టి అలవడ్తుంటాయి . అలవడిన తర్వాత మానుకోవటం చాలా కష్టతరమే . ఎందుకంటే అవి
నరనరాల్లో జీర్ణించుకు పోయి వుంటాయి . ప్రయత్నిస్తే కొంతవరకు మారే అవకాశం వుంటుంది , కాని ఆ వైపు అడుగులు
వేసేవాళ్ళే అరుదు . ఈ వర్మ కూడా ఆ కోవలోకి చెందిన వాడే . లేకుంటే పిల్లలు చేతికంది వచ్చారు . ఉద్యోగం చేయ
వలసిన అవసరం లేనే లేదు . హాయిగా యింట్లో కూర్చొని పెట్టింది తింటూ , చెప్పింది వింటూ ఆనందించవయ్యా అంటే
వినకుండా , తోచటం లేదు అంటూ , ఉద్యోగం చేస్తానంటూ బయలుదేరి , యిలా ఎంతమందినో బాధ పెట్టకుండా వుంటే
బాగుండేదేమో మరి అనుకున్నారు చాలామంది .
అలా వర్మగారూ అనుకొని నడచుకొంటే , అప్పుడు ఆయన వర్మ ఎందుకవుతాడు ? కొంచెం ఆలోచించి చూడండి .
ఎవరు ఎన్ని చెప్పినా , ఎన్ని చూసినా వాళ్ళు ఏమి చేయాలనుకొంటారో , అవే చేస్తుంటారు . వాళ్ళే కాదు ఎవరూ ఎన్నటికీ
మారరు . ఒకళ్ళ గురించి యింకొకళ్ళు ఆలోచించేటప్పుడు మారితే బాగుండు అనుకొంటుంటారు . కాని తన విషయానికొస్తే
అలా ఎందుకు మారాలి అనుకొంటుంటారు . ఇదే ఈ మానవ నవ నైజం . అదే వారి వ్యక్తిత్వం . )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *