May 26, 2024

శుభోదయం 11

రచన: డి.కామేశ్వరి

“కుమారి రేఖతో మీ పరిచయం ఎన్నాళ్లుగా వుంది. ఆమె తండ్రి పేరు ఎన్నడూ అడగలేదా మీరు?”
“ఒక్క మూడు రోజుల పరిచయం మాది. మొదటిసారి రౌడీలు అల్లరి పెడుతుంటే శ్యాం ఆ సమయానికి అటునించి వస్తూ ఆమెని తీసుకుని మా యింటికి వచ్చాడు. ఆ రోజే ఆ రౌడీల గురించి చెప్పింది ఆమె. తరువాత మర్నాడే ఆ ఘోరం జరిగింది. ముందు రోజు ఆమె వున్న అరగంటలో ఆమె తండ్రి ప్రసక్తి రాలేదు.”
“ఆహా! నిన్న మీరు రోజంతా ఎక్కడ వున్నారు? ఏం చేశారు?”
“నాలుగ్గంటల వరకు కాలేజీలో క్లాసులు వున్నాయి. తరువాత వచ్చి యింట్లోనే వున్నాను.”
“మీ అబ్బాయి శ్యాం కూడా యింట్లోనే వున్నాడా?”
“ఐదుగంటలకి కాలేజీనించి వచ్చిన దగ్గిరనించి ఇంట్లోనే వున్నాడు. టరం ఎగ్జాంస్ వస్తున్నాయని చదువుకుంటూ కూర్చున్నాడు.
“మీ యిద్దరూ యింట్లో వున్నారనడానికి ఏదన్నా ఎలిబీ చూపగలరా?”
“ఎలిబీ! యిలా ఈ ప్రశ్నలకు జవాబివ్వాల్సి వస్తుందని తెలిస్తే యిరుగింటి, పొరుగింటివాళ్ళని పిలిచి మాట్లాడేదాన్ని.. యింట్లో వుండడం యిరుగుపొరుగు చూసి వుండవచ్చు. పాలవాడు ఆరున్నరకి వచ్చాదు. అప్పుడున్నానని చెప్పచ్చు వాడ్ని అడిగితే..”
“అయితే మీకు ఆ రౌడీలకి ఏమీ సంబంధం లేదంటారా?”
“వుందనడానికి మాధవరావుగారేమన్నా సాక్ష్యం చూపించారా సార్! లేదు అనడం తప్ప యింకేం సాక్ష్యం చూపలేను సార్. పోనీ ఆ రౌడీలని పట్టుకొని వారు మేం చేయించామంటె ఆప్పుడు మమ్మల్ని శిక్షించుదురు గాని.. సార్ మాధవరావుగారు తనకి జరిగిన అవమానం నేను చూశానని. నాకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు అదే శిక్ష కూతురికి విధించి శిక్షించాడన్న సంగతి నేను చూశానన్న ఉక్రోషం కొద్దీ నా మీద కసి తీర్చుకోవడానికిలా యీ నేరం మా మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని నా ఉద్దేశం. ఏ ఆధారమూ లేకుండా ఎవరో ఏదో అన్నారని పరువు ప్రతిష్టలతో బతికే మమ్మల్ని ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సమ్మతమో న్యాయమూర్తులు మీరే ఆలోచించండి? నన్నీవిధంగా అవమానించాడని ఆయన మీద పరువు నష్టం దావా నేనూ వేయగలను సార్. ఒక ఆడదాని జీవితంతో ఆడుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందటి సంగతికిది ముడిపెట్టి మా మానాన మేం బతుకుంతుంటే నన్ను, నా కొడుకుని ఈ విధంగా అవమానించిన ఆయన ఎంత పెద్దమనిషో న్యాయమూర్తులు మీరు గుర్తించాలి. ఏ ఆడపిల్లమీదనన్నా అత్యాచారం జరిగిందని వింటేనే ఆ రోజంతా మనసు వికలం అవుతుందే నాకు. నా పాత అనుభవం గుర్తుతెచ్చుకుని ఏ ఆడపిల్లకీ ఆ దుస్థితి రాకూడదని ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటిది ఎప్పటి కక్షో తండ్రి మీద వుంటే అది కూతురు మీద తీర్చుకుంటానా? ఇంతకంటే యీ విషయంలో నేనేం చెప్పలేను సార్. నేను అనుమానితురాలినని మీకేదన్నా సాక్ష్యం దొరికితే తప్పకుండా నా మీద కేసు పెట్టండి సార్. తప్పకుండా దోషిని శిక్షించే హక్కు మీకు వుంది..”
రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడింది. అప్పటివరకు మాట్లాదిన మాటల్లో ఒక్క పాయింట్ కూడా ఆమెని అనుమానితురాలిగా చూపకపోవడంతో మెజిస్ట్రేట్ సందిగ్ధంలో పడ్డాడు. అసలు మాధవరావు కంప్లయింట్ చేసినప్పుడే ఎవిడెన్సు లేదని, అతని ఆరోపణ కేవలం అనుమానించి తప్ప, సాక్ష్యంతో బలంగా లేకపోవడంతో అరెస్ట్ వారంట్ యివ్వలేకపోయాడు. యినస్పెక్టర్ కూడా మాధవరావు ఆరోపణలో బలం లేదన్న అభిప్రాయమే వెలిబుచ్చాడు. కాని మాధవరావు పాత సంగతులన్నీ చెప్పి, చాలా నమ్మకంగా ఆమే చేయించిందని, ఆ రౌడీలకి డబ్బిచ్చి వినియోగించి వుంటుందని నేరం తన మీదకి రాకుండా యింకో రౌడీల గురించి చెప్పి వుండవచ్చని, ఆ రౌడీలు ఆ రోజు రేఖని అల్లరి పెట్టడం చూశాక ఆ సాకుతో రేఖమీద అత్యాచారం చేయించితే ఆ నేరం తనమీదకి రాకుండా రౌడీల మీదకి వెడుతుందని,ఆ రౌడీలు ఆ రోజు కిళ్ళీ కొట్టు దగ్గరే వుండగా వాళ్ళెలా చేశారని, ఇది రాధపనే అని చాలా పట్టుదలగా వాదించడంతో ఇనస్పెక్టర్‌కి కాస్త అనుమానం వచ్చి కేసు మెజిస్త్రేట్‌కి వెల్లడించాడు. అరెస్టు వారంటు యివ్వడానికి తగిన బలమైన సాక్ష్యం లేనందున అనుమానితులుగా ప్రశ్నించేందుకు రప్పించాడు మెజిస్త్రేట్. ఇప్పుడు రాధాదేవి మాటలు వింటుంటే ఆ మాటల్లో ఆవేదన, నిజాయితీ కన్పించింది. రాధాదేవిలాంటి చదువుకున్న స్త్రీ ఇంత నీచానికి దిగజారలేదు అంపించింది. నిజంగా ఎవరో రౌడీల చేత ఆ పని చెయించితే ఎప్పటికన్నా ఆ నిజం బయటికి వస్తుందన్న భయం వుంటుంది. ఆ రౌడీలు బ్లాక్ మెయిల్ చేస్తారన్న భయం వుంటుంది. ఏ మాత్రం జంకు ఆ మొహంలో కనపడలేదు. పిరికితనం ఆ మాటల్లో లేదు. నిబ్బరంగా మాట్లాడిన ఆమె మాటలను సందేహించ లేకపోయాడు.
మెజిస్ట్రేత్ సందేహం చూసి రాధాదేవికి ఒక ఆలోచన తట్టి “సార్.. మీకు ఇంకా అనుమానంగా వుంటే ఆ ఆటోడ్రైవర్ ఎవరో అతని గురించి వాకబు చేస్తే ఆ ఆటోలో ఎవరింటికి తీసుకెళ్లారో తెలిస్తే అసలు దోషులెవరో తెలుస్తుంది” ధైర్యంగా సలహా యిచ్చింది.
“ఆ ఆటోడ్రైవర్ ఎవరో వచ్చి పోలీసులకి విషయం చెప్పి సాయపడవలసిందిగా పేపరులో కోరాం. కాని యిప్పటీవరకు అతను రాలేదు. అతను వచ్చి ఇంఫర్మేషన్ యిస్తే పని సగం సుళువవుతుంది”
“సార్.. అలా కాదు. ఈ రేప్ కేసులో అనుమానితులుగా మమ్మల్ని అనుకుంటున్నట్టు పేపరుకి వార్త యివ్వండి. నిజంగా దోషులెవరో అతనికి గుర్తుండి వుంటుంది కనుక ఓ స్త్రీ అనవసర నిందకి గురి అవుతుందని అయినా అతను బయటికి వచ్చి నిజం చెప్పవచ్చు.”
మెజిస్ట్రేట్, యినస్పెక్టర్ ఆశ్చర్యంగా చూశారు. “మీ పేరు పేపర్లో వస్తే, మీ పరువు.. మీ పేరు… మీకేం అభ్యంతరం లేదా?”
“ఫరవాలేదు సార్.. ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం రూపుమాపడం కోసం నా పరువు పణంగా పెట్టగలను. నా మీద పడిన నింద మాపుకోవడం కోసం, నా నిజాయితీ నిరూపించుకోవడం కోసం నా పేరు వీధిలో పడినా నాకిష్టమే సార్” అంది రాధాదేవి. మెజిస్ట్రేట్, యినస్పెక్టర్ మొహాలు చొసుకున్నారు. ఆమెవంక అభినందన పూర్వకంగా చూశారు. ఆమెపట్ల వున్న కాస్త అనుమానమూ పోయింది వారికి.
“వుయ్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు లొకేట్ దట్ డ్రైవర్ మేడం. ఈలోగా దయచేసి మీరు ఈ వూరు వదిలి ఎక్కడికీ వెళ్లకండి. వెడితే ముందుగా పోలీసు స్టేషన్ పర్మిషను తీసుకుని వెళ్లాలి. ఈ కేసు తేలేవరకు మీరు అనుమానితులలో ఒకరు గనక దయచేసి వూరు విడిచి వెళ్లకండి. సారీ ఫర్ ది ట్రబుల్. వుయ్ విల్ కాంటాక్ట్ యు ఎగైన్. నౌ యూ కెన్ గో…” మెజిస్ట్రేట్ వారు వెళ్లడానికి పర్మిషన్ యిచ్చాడు. రాధాదేవి, శ్యాం బతుకు జీవుడా అనుకున్నట్లు నిట్టూర్పు వదిలి బయటికి వచ్చారు. బయట రాజారావు లాయర్‌తో వెయిట్ చేస్తున్నాడు. లాయరు అవసరం లేకుండానే పని జరిగిందని టాక్సీలో వెడుతూ విషయం వివరించింది. లాయరు సంగతంతా విని” ఈ కేసులో మిమ్మల్ని నిందితులుగా చూపే పాయింటు ఒక్కటీ లేదు. ఏ చిన్న ఆధారమూ లేదు. మిమ్మల్ని అనవసరంగా యిలా పోలీసు స్టేషనుకు తీసుకొచ్చి ప్రశ్నించే అవసరమూ లేదు. మిమ్మల్నిలా అనవసరంగా అవమానించినందుకు మీరు ఆ మాధవరావుగారిమీద పరువునష్టం దావా వెయ్యొచ్చు.” అన్నాడు.
“వదిలేయండి లాయరుగారూ! ఎవరి పాపం వారిదే. కేసులు, కోర్టులు అంటూ తిరిగే ఓపిక నాకు లేదు. అసలే ఈ గొడవ ఏమిటని బాధపడుతున్నాను.ఈ అపనింద తొలిగిపోతే అంతే చాలు నాకు” రాధాదేవి విరక్తిగా అంది.
“ఆ.. ఆటోడ్రైవర్ ఎవరో? ఎందుకు వచ్చి విషయం చెప్పడంలేదు” శ్యాం అన్నాడు.
“వాళ్లు డబ్బిచ్చి నోరు మూయించి వుండవచ్చు. లేదా వాళ్లకి భయపడి తనకెందుకని వూరుకుని వుండవచ్చు” రాజారాం అన్నాడు.
“రాజారాం.. నేను రేపు పేపరులో ఒక ప్రకటన యిద్దామనుకుంటున్నాను. ఒక ఆడపిల్లపై జరిగిన అత్యాచారంలో దోషులని పట్టుకునేందుకు సహాయపడేందుకు ఆటోడ్రైవర్ మానవత్వంతో ముందుకు వచ్చి సహాయపడవలెనని, ఆచూకీ తెలిపితే నూటపదహార్లు బహుమానం అని ప్రచురిస్తాను.”
“రాధా .. నీకెందుకీ గొడవ? యిప్పటికే మాధవరావు మండిపడుతున్నాడు. నీవెందుకు తలదూరచడం? ఇదీ నీ నిజాయితీ నిరూపించుకోవడానికి వేసిన ఎత్తనవచ్చు.”
“అననీ పరవాలేదు. అసలు దోషులు పట్టుబడేవరకు నాకు మనశ్శాంతి వుండదు. నా మీద నింద తొలగిపోయేవరకు శాంతిగా బతకలేను. అంతేకాక… రేఖ.. ఆ అమ్మాయి అంటే నాకెందుకో యిష్టం కలిగింది. ఈ కేసు పరిష్కరించడానికి నా చాతనయితే సహాయం చేస్తాను” రాధాదేవి పట్టుదలగా అంది.
అన్నట్టుగానే మర్నాడు పేపరులో చిన్న ప్రకటన యిచ్చింది. మాధవరావు అది చూసి పళ్ళు కొరికాడు. పంతం కొద్దీ తను నిర్దోషినని నిరూపించుకుని తనకి బుద్ధి చెప్పడానికి చేసిందని మండిపడ్డాడు. అసలే పోలీసు రిపోర్టు యిచ్చినా వాళ్లు ఎవిడెన్సు లేదని కస్టడీలోకి తీసుకోనందుకు మంటగా వుంది. దానికి తోడు ఈ ప్రకటన చూసి ఏదో అవమానం జరిగినట్టు చిందులు తొక్కాడు.
“డాడీ! ఆంటీ మంచి ఆవిడ డాడీ! ఆవిడెందుకు చేయిస్తుంది..”రేఖ తండ్రితో వాదించింది.
“నీకు తెలీదు. చిన్నపిల్లవి. మాట్లాడకు” అని గదమాయించాడూ.
తండ్రి ఎంత నమ్మకంగా చెప్పినా రేఖకి రాధాదేవిని అనుమానించబుద్ధి వేయలేదు. రాధాదేవి ఎవరో తల్లి ద్వారా విని ఆశ్చర్యపోయింది. రాధాదేవి మీద అత్యాచారం జరిగితే తండ్రి నిర్దాక్షిణ్యంగా ఆమెని ఎలా దూరం చేసాడో విని రాధాదేవి కూడా తనలాంటి అవమానానికి గురి అయింది కనకనే తన బాధ అర్ధం చేసుకుని ఓదార్చింది అని అర్ధం అయ్యాక ఆమె పట్ల గౌరవం, అభిమానం ఇనుమడించింది. తండ్రి ఆమె మీద ఎందుకలా కత్తికట్టాడో, ఆమె నేరం ఏమిటో అర్ధం కాక తండ్రిని సమర్ధింపలేక, కాలేజీకి వెళ్ళే శక్తి యింకా లేక యింటిపట్టునే వుంది రేఖకి. స్నేహితులంతా వచ్చి ఎంతో సానుభూతిగా, దయగా ప్రేమగా మాట్లాడేవారు. ఏమీ జరగనట్టే ప్రతివాళ్లు మాట్లాడినా వారి కళ్లలో తనపట్ల సానుభూతి రేఖకి కనబడేది. రాధాదేవి మాటలు గుర్తు తెచ్చుకుని ఏం జరగలేదని ఎంత దులిపేసుకున్నా ఆ జ్ఞాపకం రేఖని మానసికంగా కృంగదీయసాగింది. ఆ సమయంలో ధైర్యం చెప్పి, ప్రోత్సహించి, బుజ్జగించేందుకు ఆమెకి ఎవరూ లేకపోయారు. తల్లి అదోరకం అమాయకురాలు, ప్రపంచజ్ఞానం లేనిదని పిల్లలకీ తెలుసు. దానికితోడు చిన్నప్పటినుండి తండ్రి తల్లి తెలివితక్కువతనం మీద విసుక్కోవడం, ఎక్కడి పిచ్చిమొద్దువి దొరికావో నా ఖర్మానికి, వెధవ అడ్డితనం మాను, ఎమిటా వెకిలినవ్వు” అంటూ పిల్లల ఎదురుగానే భార్య మీద విసుక్కోవడంతో చిన్నప్పటినుంచి పిల్లలకి తల్లి మీద అదోరకం చులకన భావం ఏర్పడింది. తల్లి మాటలు లెక్కచెయ్యకపోవడం, ఏం కావాలన్నా తండ్రినే అడిగి తల్లిని అనామకురాలిగా చేశారు. మాధవరావు భార్యనెలా చూసినా పిల్లలని ప్రేమగా చూడడంతో పిల్లలకి తండ్రి మీద గురి. ఈ సమయంలో తల్లి ముందురోజు ఏడవడం చూసి మరింత బెంబేలుపడిన రేఖ, తల్లినించి ఏమీ ఆశించేందుకు లేదేమో, రాధాదేవిలాంటి వ్యక్తి ఆదరణ కోసం పరితపించింది. ఒక్కసారి, మరొక్కసారి ఆవిడ వచ్చి మాట్లాడితే ఎంత బాగుండును అనిపించింది. తండ్రి ఆమె మీద అన్యాయంగా ఆరోపణ చేశాడని గుర్తించి బాధపడింది. అంతకంటే ఏమీ చెయ్యలేని అశక్తురాలామె.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *