April 25, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా? 7

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి

సతీష్‌చంద్ర వెళ్లేటప్పటికి వాసుదేవ్‌, జాన్‌ హాల్లో కూర్చుని మ్లాడుకుంటున్నారు. సతీష్‌చంద్రను చూడగానే ”రా సతీష్‌! కూర్చో” అంటూ ఆప్యాయంగా కుర్చీ చూపించాడు వాసుదేవ్‌.
సతీష్‌చంద్ర కూర్చున్నాక ”దృతిని తీసుకురాలేదేం?” అని అడిగాడు వాసుదేవ్‌.
సతీష్‌చంద్ర నవ్వి ”ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంకుల్‌! ఇప్పుడు నేను అనుకోకుండా వచ్చాను. మీతో మాట్లాడాలని వచ్చాను” అన్నాడు.
”మాట్లాడు” అన్నాడు వాసుదేవ్‌.
జాన్‌ వున్నా ఫర్వాలేదన్నట్టుగా జాన్‌ ముందే ”నాకు మా పేరెంట్స్ ని వదిలేసి నా భార్యను తీసుకొని దూరంగా ఎటైనా వెళ్లి వుండాలని వుంది అంకుల్‌!”
అది వినగానే బిగుసుకుపోయాడు వాసుదేవ్‌. ఇప్పటి కొందరు పిల్లల్లో ఇదే ధోరణి కన్పిస్తున్నా సతీష్‌చంద్ర అలాంటి వాడు కాదని జాన్‌ అనుకోవటం వల్ల ”పేరెంట్స్ కి దూరంగా వుండాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది సతీష్‌?” అని అడిగాడు.
”కారణాలు ఇప్పుడొద్దులెండి!”
”మరి మీ పేరెంట్స్ కి దూరంగా వెళ్తే దృతిని ఎక్కడ వుంచుతావు? ఎక్కడ వుంచినా నువ్వు ఆర్మీలోకి వెళ్లాక ఒంటరిదైపోదా?”
”ఆర్మీలో నుండి వచ్చెయ్యాలనుకుంటున్నాను అంకుల్‌!”
ఈసారి అదిరిపడి అలాగే చూశాడు వాసుదేవ్‌. జాన్‌ పరిస్థితి కూడా అలాగే వుంది. జాన్‌ వెంటనే కదిలి ”అదంత సులభం అనుకుంటున్నావా?” అని అడిగాడు.
”దానికి తగిన మార్గాలను ఆలోచిస్తున్నాను అంకుల్‌! నిర్ణయం గట్టిదైనప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. ఇది తప్ప నాకింకో దారిలేదు.”
”మీ పేరెంట్స్ ఏమంటున్నారు?”
”వాళ్లకు నేను సైన్యంలో వుండటమే ఇష్టం అంకుల్‌. అదేదో దేశంమ్మీద ప్రేమతో కాదు. చదువు తక్కువైన నన్ను వాళ్ల కొడుకుగా చెప్పుకోవాలంటే అవమానంగా వుంటుందట. అన్నయ్య ఒక్కడే చాలట. నేను రహస్యంగా వుండాలట” అన్నాడు.
ఇది కొంచెం బాధగానే అన్పించింది వాళ్ళకు. ఈ విషయంలో అంకిరెడ్డిది కూడా తప్పుంది. ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి అభిప్రాయాన్ని పిల్లల ముందు వెలిబుచ్చకూడదు.
”నా చిన్నప్పటి నుండి నాముందే మా అన్నయ్యను ఆకాశానికి ఎత్తేవాళ్లు. అప్పుడు ఏమీ అన్పించలేదు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు. వింటూ వాళ్ల ముందు వుండేకన్నా దూరంగా వుండటం మంచిది కదా!”
”దూరంగా వుండు. కానీ ఆర్మీలో నుండి వచ్చెయ్యకు. నువ్వు ఆర్మీలో వున్నావని తెలియడం వల్లనే ప్రవీణ్‌ నీకు తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాడు… వాళ్లకు నువ్వు ఆర్మీలో వుంటేనే గర్వంగా వుంటుంది. దేశం మీద ప్రేమతోనే వాళ్లు నిన్ను ప్రేమిస్తున్నారు. గౌరవిస్తున్నారు. నీ చదువు గురించి వాళ్లెప్పుడూ ఆలోచించలేదు. నిన్ను తక్కువ చేసి చూడలేదు” అన్నాడు వాసుదేవ్‌.
”కానీ దృతి…” అంటూ ఆగాడు సతీష్‌చంద్ర.
”దృతి ఏమైనా అభ్యంతరం చెబుతుందా? అలా చెప్పదే!”
”లేదంకుల్‌! నాకే తనని వదిలి వెళ్లాలని లేదు. అలా అని మేమిద్దరం మా పేరెంట్స్ తో కలిసి వుండలేము. చెప్పాను కదా! వాళ్లు నన్ను అవమానించినట్లు మాట్లాడుతున్నారని. వాళ్లకు తెలియకపోవచ్చు వాళ్ల మాటలు నన్ను బాగా గుచ్చుకుంటున్నాయి. అందుకే ఇద్దరం ఎటైనా వెళ్లి బ్రతుకుతాం” అన్నాడు.
”నువ్వు చాలా డిస్టర్బ్‌డ్‌గా వున్నట్లున్నావ్‌ సతీష్‌! అందుకే నీ నిర్ణయంలో స్పష్టత లేదు”
”వుందంకుల్‌! నేను దృతిని వదిలి ఆర్మీలోకి వెళ్లలేను. మీరొక్కసారి నా ఏజ్‌లోకి వచ్చి చూడండి! అదెంత కష్టమో అర్థమవుతుంది” అన్నాడు ఎమోషనల్‌గా.
జాన్‌ నవ్వి ”మేము నీ ఏజ్‌లో వున్నప్పుడు ఎక్కడున్నామనుకుంటున్నావ్‌ సతీష్‌! ఇంట్లోనా? సైన్యంలోనా?” అన్నాడు.
”ఏమో అంకుల్‌! అప్పటి మీ వాతావరణం వేరు. ఇప్పటి మా జనరేషన్‌ వేరు” అన్నాడు.
వాసుదేవ్‌ ఆశ్చర్యపోతూ ”నువ్వు చాలా నార్మల్‌గా మాట్లాడుతున్నావ్‌ సతీష్‌! ఇన్ని రోజులు నువ్వు సైన్యంలో చేరి తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న క్రమశిక్షణ, మానసికంగా, శారీరకంగా పొందిన దృఢత్వం ఇదేనా?” అన్నాడు.
”ఎంత నేర్చినా, ఎంత పొందినా నేను దృతిని వదిలి వుండలేననిపిస్తోంది అంకుల్‌!” అన్నాడు.
”నువ్వే కాదు సైన్యంలో వుండే ప్రతి జవాను నీలాగే అనుకుంటాడు… కానీ నువ్వనుకున్నట్లు సైన్యంలోంచి వచ్చేయ్యాలని మాత్రం అనుకోడు. అలా అనుకుంటే బార్డర్‌లలో వుండే సైనికులంతా వచ్చి ఇళ్లలోనే వుంటారు. ఇళ్లల్లో వుండే భార్యలకు సేవలు చేసుకుంటూ పురుళ్లు పోసుకుంటూ గడుపుతారు. ఎందుకంటే వాళ్లు భార్యల్ని ప్రేమించాలంటే పెద్దవాళ్లకి దూరంగా వుండాలి. పెద్దవాళ్లను ద్వేషించాలి” అన్నాడు.
”అలా ఎందుకుంటుంది అంకుల్‌?”
”అలాగే వుంటుంది సతీష్‌! చాలామంది అబ్బాయిలు భార్యలు రాగానే పెద్దవాళ్లని మాసిపోయిన దుస్తుల్ని విప్పినట్లు విప్పేసి తొలగిపోతున్నారు. పరాయివాళ్లను చేసి చూస్తున్నారు. వాళ్లేం మాట్లాడినా తప్పులు వెతుకుతున్నారు. మాట్లాడకపోయినా సరే వాళ్లపట్ల విముఖతను, విరక్తిని పెంచుకుంటున్నారు. ఇది విష సంస్కృతి. దీన్నెవరూ అంగీకరించరు. కానీ దేశానికి సేవ చెయ్యాలనుకునే మనలాంటి వాళ్లలో కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల దయ మాత్రమే ఉండాలి… విముఖత వుండకూడదు. నువ్వు చాలా మారిపోయావు” అన్నాడు వాసుదేవ్‌.
”నేను మారానా?” తనలో తనే ఆశ్చర్యపోయాడు సతీష్‌.
”అది నీ తప్పుకాదులే! ఈమధ్యన ఇంటి తిండి తిని, ఖాళీగా వుండి, పక్కన భార్యకూడా వుండటంతో నీకు సోమరితనం పెరిగి దేశం గురించి యావ తగ్గింది. తపన వుంటేనే కదా ఏదైనా చేస్తాం. ఆ తపన ఇప్పుడు నీకు దేశం పట్ల లేదు” అన్నాడు చనువుగా, మందలింపుగా వాసుదేవ్‌.
ఆయనకు వెంటనే ప్రవీణ్‌ గుర్తొచ్చాడు. ప్రవీణ్‌ ఎప్పుడు మాట్లాడినా ”మనం పుట్టినందుకు ఏదో ఒకటి చెయ్యాలి అంకుల్‌! అది కూడా అందరిలా స్వార్థంతో కాదు. కొందరిలా ఓ లక్ష్యంతో, ఆశయంతో… అది కూడా శారీరక శక్తిని మించిన మానసిక బలంతో, మహా సంకల్పంతో, మహోన్నతంగా చెయ్యాలి. సంకల్పాన్ని సంకుచితం చేసుకోకుండా అందరికోసం ఆలోచించాలి. అలా ఆలోచించేవాళ్లు ఎక్కువగా సైన్యంలో వుంటారు. దేశం కోసం పోరాడేవాళ్లంటే నాకు చాలా గౌరవం” అని అంటుంటాడు. అలాంటి ప్రవీణ్‌కి ఇప్పుడు సతీష్‌చంద్ర ఇలా మాట్లాడుతున్నాడని తెలిస్తే ఏమనుకుంటాడు? దృతిని ఇచ్చి తప్పు చేశానేమోనని అనుకోడా? ఆర్మీలో చేరి కొంత కాలం సైనికుడుగా పనిచేసి ఇప్పుడు కేవలం భార్యను వదిలి వెళ్లలేకపోతున్నాననటం హాస్యాస్పదంగా లేదా? అంకిరెడ్డి లోగడ ఎన్నోసార్లు ”మా సతీష్‌చంద్ర ఒట్టి సోమరివాడు వాసు! లేకుంటే ఇప్పుడు ఏ స్థాయిలో వుండేవాడో!” అని బాధపడేవాడు. ఆయన బాధపడినట్లు సతీష్‌చంద్ర నిజంగానే సోమరి అని మనసులో అనుకున్నాడు వాసుదేవ్‌.
సతీష్‌చంద్ర మాట్లాడకుండా కూర్చున్నాడు. అది చూసి జాన్‌ ”సతీష్‌! మన ఆలోచనలు మామూలుగా వుంటే మనం చేసే పనులు కూడా మామూలుగానే వుంటాయి. అప్పుడు మనకు చెప్పుకోదగిన అనుభవాలు, జ్ఞాపకాలు వుండవు. అనుభవాలు, జ్ఞాపకాలు లేకుంటే మనల్ని మనం పునర్జీవింప చేసుకోలేం! మనలో వుండే మరో మనిషిని సంతృప్తి పరచలేం. అలాంటి సంతృప్తికి నువ్వు దూరం కావద్దు. ఒక మాజీ సోల్జర్‌గా నీకు నేనిచ్చే సలహా ఇది” అన్నాడు.
”ఐనో అంకుల్‌! కానీ నేను వాసు అంకుల్‌ అన్నట్లు సోమరిని కాను. నన్ను అర్థం చేసుకోండి! నాకు ఏదైనా ఒక పల్లెటూరు వెళ్లి నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలని వుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా మీరు ఆంటీల పక్కన వున్నారు. వాళ్లకి తగినంత ఎమోషనల్‌ సపోర్టు ఇస్తున్నారు. నేను లేకుంటే నా భార్య…” అన్నాడు.
”ఏమీ కాదు. అయినా దృతి ఏమంటుందో చెప్పనేలేదు. నిన్ను ఇక్కడే వుండిపొమ్మంటుందా?”
”లేదు” అంటూ దృతి ఏమన్నదో చెప్పాడు సతీష్‌చంద్ర.
అది వినగానే
”దృతి అలా అందా! మరి నువ్వు నీ భార్య అభిప్రాయాలను గౌరవించే ఈ నిర్ణయం తీసుకున్నావా?” ఆశ్చర్యపోతూ అడిగాడు వాసుదేవ్‌.
”దృతి చిన్నపిల్ల. తనకేం తెలుసు అంకుల్‌! ఎక్కడో చదివిందట. పూసిన ప్రతి పువ్వుకి దేవుని మందిరంలో కన్నా వీరుని సమాధిపైన వుండాలని వుంటుందని… అయినా ఆ పువ్వుకేం తెలుస్తుంది అంకుల్‌! పూస్తుంది, తెంపకుంటే రాలుతుంది. వాడుతుంది. ఇది జీవితం కదా!” అన్నాడు.
”జీవితం కాబట్టే మజిలీలు వుంటాయి సతీష్‌! ప్రతి మజిలీ మనం గర్వపడేలా, ఆనందించేలా వుండక పోవచ్చు. కానీ నువ్వు చిన్నపిల్లల మాటల్లా వున్నాయనుకునే దృతి మాటలకి హ్యట్సాఫ్‌ చెప్పాలయ్యా!” అంటూ జాన్‌ వెంటనే లేచి నిలబడి అక్కడ లేని దృతికి సెల్యూట్ చేశారు.
ఆయన ప్రవర్తనకి దేశభక్తితో సతీష్‌చంద్ర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
జాన్‌ మామూలు మనిషి కాదు. బరోడా, చండీగఢ్‌, జాంనగర్‌ లాంటి అనేక ప్రాంతాల్లో శిక్షణ పొంది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో సెలెక్ట్‌ అయిన వ్యక్తి. రాకెట్ లాంచింగ్‌లో పనిచేశారు. రాడార్‌లో, విమానాల్లో పనిచేశాడు. ఆయన రాంక్‌ నాన్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌. అందుకే సతీష్‌ మాట్లాడకుండా జాన్‌ వైపు అలాగే చూడసాగాడు.
వాసుదేవ్‌ ఎటో చూస్తూ సతీష్‌చంద్ర గురించే ఆలోచిస్తున్నాడు. నిజానికి సతీష్‌చంద్రకి పెళ్లి చెయ్యమని సలహా ఇచ్చింది ఆయనే… పిల్లనెవరూ ఇవ్వకుంటే పిల్లనిప్పించింది ఆయనే. ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు తోచటం లేదు.
జాన్‌ అది గమనించి ”నువ్వు ఏది చెయ్యాలన్నా నీ అంతట నువ్వే చెయ్యాలి. ఒకరు చెబితేనో, చేయిపట్టి నెడితేనో చెయ్యవు. ఒకవేళ నీ మనసు మారి సైన్యంలోనే వుంటే వ్యూఛర్లో నిన్ను ఏ పేపరో, మీడియానో కలిసి ఇంటర్వ్యూ తీసుకుంటే అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాల్సింది దృతికి ఒక సైనికుడి పట్ల వున్న అత్యున్నతమమైన భావన గురించి. అది పదిమందికి తెలిసేలా మాట్లాడు. ఆ పదిమంది ఇంకో పదిమందికి చెప్పుకోవాలి. ఇలాంటి సంఘటనలు నా లైఫ్‌లో కొన్ని జరిగాయి” అన్నాడు.
సతీష్‌చంద్ర వెంటనే ”ఏంటి అంకుల్‌! అవి…?” అన్నాడు.
”ఈ దేశం రెండు యుద్ధాలు చేసింది సతీష్‌! ఆ రెండు యుద్ధాల్లో నేను పని చేశాను. ఒక యుద్ధం 1962లో జరిగింది. రెండవ యుద్ధం 1971లో జరిగింది” అన్నాడు.
యుద్ధాలు జరిగిన విషయం సతీష్‌చంద్రకి తెలుసు. ఆ యుద్ధాల్లో జాన్‌ పనిచెయ్యాన్ని నమ్మలేక, నమ్మినా జీర్ణించుకోలేక అలాగే చూస్తూ ”అవునా అంకుల్‌! ఆ యుద్ధాల్లో మీరు పని చేశారా?” అని అడిగాడు.
”అవును సతీష్‌! పని చేశాను. 1962లో యుద్ధ సమయంలో అయితే మాకు శిక్షణ పూర్తయి బెంగుళూరు నుండి నాలుగు రోజులు ప్రయాణం చేసి నాగాలాండ్‌ చేరుకుని లగేజి పెట్టుకున్నాక కనీసం మాకు మంచినీళ్లు తాగే సమయం కూడా ఇవ్వలేదు. నేరుగా తుపాకీని చేతికిచ్చి ”గో అండ్‌ ఫైర్‌… ప్రొటక్ట్‌ అవర్‌ మదర్‌లాండ్‌” అన్నారు. ఒక్కక్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. అసలే నేను హింసకు వ్యతిరేకిని. అయినా దేశం కోసం, దేశాన్ని రక్షించుకోవటం కోసం అది నాకొక మంచి అవకాశం అనుకున్నాను. వెంటనే తుపాకీ అందుకున్నాను” అన్నాడు జాన్‌.
ఊపిరి బిగబట్టి వింటున్నాడు సతీష్‌.
”ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ కోసం యుద్ధం జరిగింది. అప్పుడు నేను షిల్లాంగ్‌ రాడార్‌ స్టేషన్‌లో వున్నాను. రాడార్‌ స్టేషన్‌ ఎలా వుంటుందంటే లోపలంతా ఏ.సి. యుద్ధకాలంలో ఎవరూ తప్పించుకోవానికి లేదు. అంతా సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌. అన్ని రాడార్‌ స్టేషన్స్‌ జామ్‌ అయ్యాయి” అంటూ ఆగాడు జాన్‌.
ఉద్వేగంతో వింటున్నాడు సతీష్‌చంద్ర.
మళ్లీ చెప్పటం మొదలుప్టోడు జాన్‌.
”అప్పుడు నేనున్న స్టేషన్‌కే సిగ్నల్స్‌ వస్తున్నాయి. ఈస్టర్న్‌ పార్ట్‌ అతి ముఖ్యమైన యుద్ధక్షేత్రం. అక్కడి రాడార్‌ స్టేషన్ను పేల్చేస్తే సులభంగా యుద్దాన్ని జయించవచ్చని శత్రుదేశపు పన్నాగం. అయితే అదృష్టవశాత్తూ నా స్టేషన్‌ పని చేయటం వల్ల శత్రుదేశపు విమానాల రాకను పసిగట్టి (వాటి సిగ్నల్స్‌) అవి ఏ దిశలో వస్తున్నాయో పై స్టేషన్‌కు (హైయ్యర్‌ అథారిటీకి) క్షణాల్లో సమాచారం అందించాను. అంతే! ఆ సమాచారం అందుకున్న హయ్యర్‌ అథారి స్క్రంబ్లింగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఆ ఆర్డర్‌తో మన ఫైటర్స్‌ (విమానాలు) వెళ్లి శత్రుదేశ విమానాలను పడగొట్టాయి. రాడార్‌ స్టేషన్‌ సేఫ్‌. ఈ జాన్‌ సేఫ్‌. జాన్‌కన్నా ముందు దేశం సేఫ్‌…” అన్నాడు.
అది వినగానే రిలాక్స్‌డ్‌గా చూశాడు సతీష్‌చంద్ర.
”ఐతే 1971లో వచ్చిన వార్‌కన్నా ముందే నాకు పెళ్లయింది. ఇద్దరం హనీమూన్‌ కోసం ఊటి, బెంగుళూరు, మైసూర్‌ వెళ్లి వున్న సమయంలోనే ఆ యుద్ధం వచ్చింది. వెంటనే మీ ఆంటీని రైలెక్కించి నేను యుద్ధంలోకి వెళ్లాను. విమానం రెక్కల కింద కూర్చుని మీ ఆంటీకి ఉత్తరం రాశాను. వార్‌ టైంలో తప్ప నా భార్య ఎప్పుడూ నాతోనే వున్నది. నేను యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు కూడా నా భార్య భయపడలేదు. ఇప్పుడు అలాంటి యుద్ధాలు లేవు. బార్డర్‌లోంచి బయటకొచ్చాక ప్రతి సైనికుడు తమ భార్యను తమతోనే వుంచుకుంటాడు. నువ్వు కూడా నీ భార్యను అలాగే వుంచుకోవచ్చు.
అన్నికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే నేను వాయుసేనలో పనిచేసినా, దేశ దేశాలు తిరిగినా, దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగినా వాయుసేన సైనికుడిగా పనిచేసినా పదాది దళానికి సెల్యూట్ చేస్తాను” అన్నాడు.
లోగడ వాసుదేవ్‌ పనిచేసింది పదాది దళంలోనే. ఇప్పుడు సతీష్‌చంద్ర పనిచేసేది కూడా పదాదిదళంలోనే…
జాన్‌ మాటలు విన్నాక వాసుదేవ్‌కి తను జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌, పిండి, ఆలా, కార్గిల్‌ గ్రామాలలో భారత రక్షణార్థం విధులు నిర్వహిస్తున్న సమయంలో అకారణంగా పాకిస్తాన్‌ సైనికులు కాల్పులు జరపగా భారతీయ సైనికులు ఎదురు కాల్పులు జరిపి భారతదేశ రక్షణ కావించడం గుర్తొచ్చింది. అది 1971 యుద్ధ సమయం. భారతదేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు అనుబంధముగా భారతీయ సైనికులను పంపటము జరిగింది. అప్పుడు భారతీయ సైనికులు పాకిస్తాన్‌ సైనికులతో యుద్ధం చేస్తూ సెంచూరియన్‌ టాంక్‌తో కాల్పులు జరుపుతూ వీరోచితంగా పోరాడి భారతీయ సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలను కాపాడటం కోసం (శత్రుసైన్యం ముందుకు రాకుండా) భూమిలో యాంటీ టాంక్‌ మైన్స్‌ పెట్టారు. అలాంటివి పెట్టినప్పుడు టేపుతో మార్కు చేస్తారు కాబట్టి రైతులు వెళ్లి వ్యవసాయం చెయ్యలేరు. ఇరుదేశాలు పాకిస్తాన్‌, ఇండియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందము జరిగిన తర్వాతనే ఆ మైన్స్‌ను తీసివేస్తారు.
”ఏంటి వాసు ఆలోచిస్తున్నావ్‌?” అన్నాడు జాన్‌.
”మైన్స్‌ తీసేటప్పుడు ఒక సంఘటన జరిగింది జాన్‌! నువ్వు మా పదాది దళానికి సెల్యూట్ చెయ్యగానే అది గుర్తొచ్చింది. నీకు తెలుసోలేదో నేను నాయర్‌ అనే నా మిత్రునికి రోజుకొక్కసారైనా సెల్యూట్ చెయ్యకుండా వుండలేను”
”ఎవరంకుల్‌ అతను?” వెంటనే అడిగాడు సతీష్‌.
”చెబుతాను సతీష్‌! ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే సైన్యంలోకి వెళ్లాక ఎవరికైనా దేశాన్ని రక్షించుకోవడం అన్నదే వుంటుంది. ఆ యూనిఫాంకు వున్న శక్తి అలాంటిది. మనకు సరిహద్దులనేవి చాలా అవసరం. ఎవరి దేశానికి వాళ్లు రక్షణ. భారతీయ సైనికులు, పాకిస్తాన్‌ సైనికులు కలిసి మాట్లాడుకుంటూనే కవ్వింపు చర్యలకు దిగుతారు. ఎవరికైనా ఇది అనర్థదాయకమే. ఆ రోజు మేము మైన్స్‌ తీసేటప్పుడు ఒక సెక్షన్‌ ప్రకారం విధులు నిర్వర్తించుచుండగా మా సైనిక అధికారి మమ్మల్ని చూసి ‘ఒక ఐదు నిమిషాలు విరామము తీసుకోండి’ అన్నారు. అప్పుడు మేమంతా ఓ చోట గుమిగూడి ఇళ్ల దగ్గర విషయాలను చెప్పుకున్నాం. అప్పుడు నాయర్‌ అనే సైనికుడు తాను తన తల్లిని, భార్యను, బిడ్డలను కాశ్మీరుకు తీసుకొచ్చి చూపిస్తాను అన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సొంత విషయాలను చెప్పుకున్నాం.
విరామ సమయం అయిపోగానే తిరిగి మా పనులలో నిమగ్నమయ్యాం. రెండు నిమిషాలు గడిచాక నాయర్‌ తీస్తున్న యాంటీ టాంక్‌ మైన్‌ పేలిపోయింది. ఆ ధ్వనికి సజీవంగా వున్న మా సైనికులందరం ఎవరికి వాళ్లం జీవించి వున్నా మరణించామనే వూహించుకున్నాం. తర్వాత విచారణలో ఎవరి మైన్‌ పేలిందో తెలుసుకోటానికి ప్రయత్నించగా ఎవరికి వాళ్లం లెక్కబెట్టి పరమానందయ్య శిశ్యుల్లాగా అందరం సజీవంగా వున్నారనే తెల్పటం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఎవరి పక్కన ఎవరు వున్నారని విచారించగా ‘వాసుదేవ్‌ పక్కన వున్న నాయర్‌ ఏడి?’ అని అడిగారు. నాయర్‌ కన్పించలేదు. అంతవరకు మామూలుగా వున్న నేను ఒక్కక్షణం షాకులోకి వెళ్లాను. వెంటనే తేరుకుని అందరం కలిసి చుట్టుపక్కల వెదికాం. అప్పుడు నాయర్‌ జేబులోంచి కొన్ని డబ్బులు బయటపడటం జరిగింది. అతని శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఒక్క కుడికాలు మాత్రం పాదం నుండి మోకాలు వరకు లభించింది. ఆ మాంసపు ముక్కలన్నీ ఏరి ఒకచోట వేయగా అతని జేబులో వున్న మనీపర్స్‌ దొరికింది. అందులో నాయర్‌ యొక్క కుమారుని ఫోటో, మురుగన్‌ (సుబ్రమణ్యేశ్వరస్వామి) ఫోటో ఏమాత్రం చెక్కు చెదరకుండా పర్స్‌లో అలాగే వున్నాయి. మనిషి పోయినా దేవుని ఫోటో అలాగే వుండిపోయింది. ఏది జరిగినా దేవునికి తెలిసే జరుగుతుంది. జరగవలసింది ఇదే అయినప్పుడు ఎవరూ దాన్ని ఆపలేరు” అన్నాడు వాసుదేవ్‌. అంతవరకు ఉత్కంఠతో విన్న సతీష్‌చంద్ర కళ్లు చెమర్చాయి.
వెంటనే జాన్‌ కల్పించుకొని ”సందర్భం వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నాం కాని ఇవన్నీ 1971లో జరిగిన విషయాలు. అయినా వీటిని సింహావలోకనం చేసుకోవటం అనేది వీరుల త్యాగాలను గుర్తించటం కోసం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. స్పందించాలి. భార్యా, పిల్లలు లేని సైనికులు ఎవరున్నారు? కానీ మనం ఒక్కసారి సైన్యంలోకి వెళ్లాక కొన్ని మార్పుల్ని తప్పనిసరిగా స్వీకరించాల్సి వస్తుంది. భయపడకూడదు. బాధ్యతా రహితంగా వుండకూడదు. ఇప్పుడు మనం కస్పారెడ్డిని గుర్తు చేసుకుందాం వాసూ” అన్నాడు జాన్‌.
”అతని గురించి నీకు తెలియంది ఏముంది జాన్‌! గొప్ప సాహసి. మంచివాడు. ఆ రోజు ఏం జరిగిందో సతీష్‌కి నువ్వే చెప్పు” అన్నాడు వాసుదేవ్‌.
”యుద్ధ సమయంలో విదేశీ విమానాల ద్వారా బాంబులు వేయటం జరిగింది. అప్పుడు భారతీయ సైనికులు బంకర్‌లలో తమ రక్షణార్థం వుంటూ కాల్పులు జరిపారు. ఆ సమయంలో పాకిస్తాన్‌ వాళ్లు వేసిన బాంబు బ్లాస్టింగ్‌ కావడం వల్ల కస్పారెడ్డి అనే సైనికుడికి ఎడమకాలు తగిలి విషపూరితం అయింది. అతనికి మిలటరీ హాస్పిటల్లోనే కాలు తీసేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన అలాగే వున్నారు. కాలు లేకపోయినా కళ్లలో బోలెడంత తృప్తి, దేశం కోసం ఏదో చేశానన్న సంతృప్తి” అన్నాడు.
సంతృప్తితో జీవించటం గొప్ప వరం. అలాంటి వరాన్ని పొందడం కస్పారెడ్డి లాంటి వాళ్లకే సాధ్యం అనుకున్నాడు మనసులో సతీష్‌చంద్ర.
”అదే సమయంలో ఇంకో సంఘటన జరిగింది. పాకిస్తాన్‌ వాళ్లు గ్రెనేడ్‌ని (చేతిబాంబు) విసిరినప్పుడు అది వెళ్లి భారతీయ సైనికుల దగ్గరకు రాగా ఒక సైనికుడు వెళ్లి దానిమీద పడుకున్నాడు. ఇది నేను చూస్తుండగానే జరిగింది. అంటే ఎప్పుడైనా ఒక సైనికుడు తన ప్రాణం పోయినా సరే తన వాళ్లందరు బ్రతకాలన్న కాంక్షతో వుంటాడు. దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం క్షేమంగా వుంటేనే కదా తన భార్యాపిల్లలు బాగుంటారు” అన్నాడు జాన్‌.
కదిలిపోయాడు సతీష్‌చంద్ర. వెంటనే లేచి నిలబడి జాన్‌కి సెల్యూట్ చేశాడు. అది చూసి వాసుదేవ్‌ కళ్లు ఆనందంతో మెరిశాయి. వాళ్లిద్దరికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఇంటికెళ్లాడు సతీష్‌చంద్ర.

*****

సతీష్‌చంద్ర ఇంటికెళ్లాక చాలాసేపు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చున్నాడు. దృతి వెళ్లి పలకరించినా మౌనంగానే వున్నాడు. అది గమనించి ఆమె అతన్ని మాట్లాడించకుండా అలాగే ఓ గంటసేపు వదిలేసింది. అతను ఆరోజు మొత్తం అలాగే గడిపాడు. అతనికి తల్లీదండ్రీ, భార్య, అన్నా, వదిన ఎవరూ గుర్తు రావడం లేదు. రెండు యుద్ధాల్లో పనిచేసిన జాన్‌ గుర్తొస్తున్నాడు. కోమాలో వున్న భార్యను వదిలేసి నేవీలోకి వెళ్లిన నరేంద్ర గుర్తొస్తున్నాడు. వాసుదేవ్‌ గుర్తొచ్చాడు అంతే!
తెల్లవారి నిద్ర లేవగానే ఇంట్లో అందరితో మాట్లాడాడు. చాలా ప్రేమగా మాట్లాడాడు. ఆ తర్వాత అస్సాం వెళ్లానికి సిద్ధమయ్యాడు. ధృతిని బ్యాగ్‌ సర్దమని అతను వెళ్లి హాల్లో కూర్చున్నాడు.
బ్యాగ్‌ సర్దటం పూర్తయ్యాక ”ధృతీ!” అంటూ పిలిచాడు సతీష్‌చంద్ర. అతను ఎప్పుడెప్పుడు అలా పిలుస్తాడా అని ఎదురుచూస్తున్న ధృతి వెంటనే అతని దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను కూర్చోమనగానే కూర్చుంది.
”ధృతీ! జాగ్రత్త! నాకు బార్డర్‌లో డ్యూటీ వేశారు. ఇంకొద్ది సేపటిలో ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లాలి. నేనిక ఏ పండగకి ఇంటికి రాలేను. నీ ఖర్చులకి నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను. పండక్కి కావలసినవి కొనుక్కో. నువ్వు డబ్బులు కోసం బ్యాంక్‌కి వెళ్లకుండా నీ పేరుతోపాటు నాన్నగారి పేరు కూడా అకౌంట్ బుక్‌లో వచ్చేటట్లు జాయింట్ అకౌంట్ పెట్టించాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాన్న వెళ్లి నీకు డబ్బులు తెచ్చిస్తాడు. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన నిన్ను ప్రేమగా చూసుకుంటారు… ఎక్కవ సేపు నీతో మాట్లాడేంత సమయం లేదు. వెళ్లాలి” అంటూ లేచి గదిలోకి వెళ్లి బ్యాగ్‌ తగిలించుకొని బయటకొచ్చాడు.
అతనితోపాటు రైల్వేస్టేషన్‌కు వెళ్లాలని ఆమెకు వున్నా వద్దన్నాడు. సతీష్‌చంద్ర అక్కడే నిలబడి వున్న తల్లి వైపు చూసి ”వెళ్లొస్తానమ్మా!” అన్నాడు. ఆమె ”సరే!” అంది. గేటు వరకు అతని వెంట వెళ్లింది. ధృతి చలనం లేని శిల్పంలా భర్తనే చూస్తూ నిలబడింది.
సతీష్‌చంద్ర రైలు ఎక్కబోయే సమయానికి అంకిరెడ్డి, ఆనంద్‌ రైల్వే స్టేషన్‌కి వెళ్లి అతన్ని కలిశారు. సతీష్‌చంద్ర ఎక్కిన రైలు కదిలేంత వరకు ఫ్లాట్ ఫాంపై నిలబడి అతనితో మాట్లాడారు. జాగ్రత్తలు చెప్పారు. ఆ రైలు వాళ్లు చూస్తుండగానే కదిలి సతీష్‌చంద్రను తీసుకొని వెళ్లిపోయింది.
*****
సతీష్‌చంద్ర వెళ్లాక ఆ గదిలో ధృతి ఒంటరిదైపోయింది.
ఆమె సతీష్‌చంద్రతో గడిపింది రెండు నెలలే అయినా రెండు యుగాలకు సరిపడ ఆనందాన్ని అందించి వెళ్లాడు. పగలు పనిలో వున్నప్పుడు తప్ప అతనెప్పుడు గుర్తొచ్చినా ఆమెకు హాయిగానే వుంటుంది. ఆ జ్ఞాపకాలే లేకుంటే ఇప్పుడామె ఒంటరి… నువ్వు ఒంటరివి కావు అన్నట్లు ఆమెకు ప్రెగ్నెన్సీ కన్‌ఫం అయింది. అది తెలిసిన క్షణం నుండి సతీష్‌చంద్ర పక్కన లేకున్నా కడుపులో వున్నట్లనిపిస్తున్నాడు. అదే విషయం సతీష్‌చంద్ర ఫోన్‌ చెయ్యగానే చెప్పింది. డాక్టర్‌ దగ్గరకి వెళ్లినట్లు చెప్పింది. అతను సంతోషపడి వెంటనే తల్లితో మాట్లాడాడు. మాధవీలత కూడా చాలా సంతోషపడుతూ కొడుకుతో మాట్లాడింది. అత్తగారు మాట్లాడే విధానం చూస్తుంటే అవతల వైపున సతీష్‌ ఎంత సంతోషపడుతున్నాడో అర్ధమవుతోంది. అతను అలా సంతోషపడటమే ఆమెకు కావాలి. ఆరోజు అతను బ్యాగ్‌ తగిలించుకొని గేటు దాటినప్పుడే అనుకుంది అతను ఎప్పుడు ఫోన్‌ చేసినా సంతోషకరమైన విషయాలే చెప్పాలని… సంతోషాన్ని కలిగించే మాటలే మాట్లాడాలని… అలాగే మాట్లాడుతుంది. ఆమె అలా మాట్లాడుతుండటం వల్లనే అతను దూరంగా ఎక్కడో వున్నా – అలా లేకుండా దగ్గరగా ఇంట్లో వున్నట్లే అన్పిస్తుంది. అతను ప్రతిరోజు తప్పనిసరిగా రాత్రి పది దాటాక ఫోన్‌ చేస్తాడు. అప్పటికి ఆమె ఇంట్లో పనంతా చేసుకొని సతీష్‌చంద్ర కాల్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇంట్లో పని చెయ్యటానికి ప్రస్తుతం పనివాళ్లెవరూ లేరు. గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, రూములు తుడిచి, వంటలో అత్తగారికి సాయం చేసే పనులన్నీ దృతినే చేస్తుంది. అవి ఇంట్లో వుండి చేసే పనులు కాబట్టి ఆ పనులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆమెకేం పని లేదనే అనుకుంటారు. ఇంట్లో ఖాళీగా వుండే బ్రతుకుతోందనుకుంటారు. ఎందుకంటే మోక్ష ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు బయటకెళ్లి పనిచేసి వస్తుంది. ధృతికి బయటకెళ్లి పని చేసేంత చదువులేదు. కాబట్టి ఇంట్లో పనులే ఆమెకు అప్పజెప్పారు. అది కూడా సతీష్‌చంద్ర ఊరెళ్లిన రాత్రికే ఆ ఇంట్లో అందరు ఓ చోట కూర్చుని చాలా లోతుగా చర్చించుకొని పనిమనిషిని పనిలోంచి తీసేసి ఆ పనులన్నీ ధృతికి ఇచ్చారు.
*****

… ఎప్పుడైనా డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నప్పుడు అంకిరెడ్డి, ఆనంద్‌ ముందుగా తిని లేచి వెళ్లిపోయాక ఆడవాళ్లు ముగ్గురు కూర్చుని తింటుంటారు. అది ఆనవాయితీ ఆ ఇంట్లో….
ఈరోజు అంకిరెడ్డితోపాటు ఆనంద్‌ లేచి వెళ్లలేదు. అతను అక్కడే కూర్చుని ఆడవాళ్లతో మాట్లాడుతూ నెమ్మదిగా తింటున్నాడు.
”నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి ధృతి సమాధానాలు చెప్పాలి… తనలో ఎంత ఐక్యూ వుందో నాతోపాటు మీరు కూడా చూసి ఎంజాయ్‌ చేద్దురు గాని…”
”అదేం ఎంజాయ్‌ ఆనంద్‌! నువ్వెళ్లి పడుకో! మేం తినాలి” అంది మాధవీలత.
”నీ పెద్దకోడలు తెలివైనదన్న అభిప్రాయం నీకు చాలా రోజులుగా వుందిగా! నీ చిన్నకోడలు కూడా తెలివైనదే! అది నువ్వు గుర్తించాలి. అందుకే ఈ చిన్న టెస్ట్‌!” అన్నాడు.
అతను సరదాగా అంటున్నాడనుకున్నారే కాని మనసులో దురుద్దేశం పెట్టుకుని అంటున్నాడని అక్కడెవరూ ఊహించలేదు. వాళ్ల మౌనం చూసి
”అయితే ఒక షరతు” అన్నాడు.
”ఏంటా షరతు?” అంది మోక్ష. భుజాలమీద చిక్కగా పరుచుకున్నజుట్టును ఎడమచేత్తో అటు ఇటు వెనక్కి నెట్టుకుంటూ ఈ మధ్యన జడ వేసుకోవాలంటే ఆఫీసుకెళ్లేముందు బాగా ఆలస్యం అవుతుందని బ్యూటీపార్లర్‌కి వెళ్లి జుట్టు కత్తిరించుకుంది.
”మీరు రెడీ అంటేనే చెబుతాను” అన్నాడు చాలా కూల్‌గా ఆనంద్‌.
”రెడీ!” అన్నారు తోడికోడళ్లిద్దరు ఉత్సాహంగా.
మాధవీలత కోడళిద్దరు వైపు నవ్వుతూ చూస్తోంది. ఆమెకు కూడా అదేంటో చూడాలన్న ఆసక్తి బాగానే వుంది.
”మరి మీరు ఎలాంటి కొశ్చన్స్‌ వేస్తారో క్లూ లాంటిది ఏమైనా ఇస్తారా?” అతన్నే చూస్తూ అడిగింది మోక్ష.
”క్లూనా? క్లూ అంటే ఒట్టి కొశ్చన్స్‌కేనా ఆన్సర్స్‌కి కూడా ఇవ్వాలా?” అన్నాడు నవ్వుతూ.
”ఆహా… అలా అనికాదు. ముందు మీరు పెట్టే షరతులేమిటో చెప్పండి! లేకుంటే మీ కొశ్చన్స్‌ క్రిటికల్‌గా వుంటే ఆన్సర్‌ చెయ్యలేకపోతే మళ్లీ తనకి ప్రాబ్లమ్‌ అవుతుంది” అంది భయంగా చూస్తూ.
ధృతి మామూలుగానే చూస్తోంది. ఆమె ఎవరు ఏం మాట్లాడినా ప్రేమతోనే మాట్లాడుతున్నారనుకుంటుంది. కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా ఒక దారంతో బిగించి అల్లిన పూలమాలగా, మమతల హారంలా అనుకుంటుంది. అందుకే ఈమధ్యన ఆనంద్‌ ఏ పని చెప్పినా మోక్షకన్నా ముందు ఆమెనే కదిలి చేస్తుంటుంది. మోక్ష కూడా ఆఫీసుకెళ్లే హడావుడిలో వుంటుంది. కాబట్టి ఆ మాత్రం పనులు చేస్తే తప్పు లేదనుకుంటుంది. మాధవీలత కూడా ”బావగారేదో పిలుస్తున్నట్లుంది. అక్కడ మోక్ష వున్నట్లు లేదు వెళ్లి చూడు దృతీ!” అంటుంది. ”అలాగే అత్తయ్యా!” అంటూ ఆనంద్‌ చెప్పిన పని చేసి వస్తుంటుంది. మోక్ష కూడా ఏమీ అనుకోదు. ”వెరీ నైస్‌” అన్నట్లు దృతి వైపు ప్రేమగా, కృతజ్ఞతగా చూస్తుంటుంది. ఎలాగైతేనేం మోక్ష ఆనంద్‌ చెప్పే చిన్న పని పెద్ద పని చెయ్యలేక చస్తున్న సమయంలో ధృతి బాగా సహాయంగా మారింది. అందుకే ప్రస్తుతం ధృతి వైపున మాట్లాడుతోంది భర్తతో…
ఆనంద్‌ తెలివిగా ”అయితే మీ ఇద్దరు ఒకటయ్యారన్నమాట. అయినా ధృతి నీకు చెల్లెలైతే నాకు మరదలు. బావ ఎక్కడైనా మరదల్ని ప్రాబ్లమ్‌లో పడేస్తాడా?” అంటూ దృతి వైపు చూశాడు. ధృతి కట్టూబొట్టూ అతనికి బాగా నచ్చాయి. ఆనంద్‌ దృతివైపు చూస్తుంటే
”ఏం కాదులే అక్కా! ఇప్పటికే ఆలస్యమైంది. అత్తయ్యగారు భోంచేసి టాబ్లెట్ వేసుకోవాలి. మీరు అడగండి బావగారు!” అంది ధృతి.
ధృతి ఎందుకలా తొందర పడుతుందంటే భోజనాల కార్యక్రమం అయిపోతే తన గదిలోకి వెళ్లాలని… ఇప్పటికే బాగా ఆలస్యమైంది. సతీష్‌చంద్ర ఫోన్‌ చేస్తాడు. అతను ఫోన్‌ చేసే సమయానికి గదిలో లేకపోతే లాంగ్‌ రింగ్‌ వచ్చి ఆగిపోతుంది. మళ్లీ చేస్తాడో లేదో! ఈమధ్యన అప్పుడప్పుడు అలాగే జరుగుతోంది. అతనితో మాట్లాడకపోతే రాత్రంతా నిద్ర పట్టదు. అతనికి కూడా అంతేనట. అతనుండే దగ్గర బాగా చలిగా వుంటుందట. రగ్గులు కప్పుకొని కందకాల్లోనే వుండాలట. రాత్రీ పగలు అదే వాళ్ల స్థావరమట… ఇప్పుడంటే ఈ సెల్‌ఫోన్లు వచ్చాక సైనికులు ఎక్కడ నుండయినా వాళ్ల భార్యలతో మాట్లాడుకోగలుగుతున్నారు కాని ఒకప్పుడు ఈ సౌకర్యం వుండేది కాదట… ఉత్తరాలు రాసుకుంటూ మళ్లీ వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ గడిపేవాళ్లట… అలాంటి శిక్ష ఇప్పుడు లేనందుకు మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంటే ఆనంద్‌ ధృతి మీద నుండి చూపుల్ని తిప్పుకోకుండా
”నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతే నీకే కష్టం. నేను పెట్టిన షరతులు తప్పకుండా పాటించాల్సి వస్తుంది. రెడీయేనా?”
”రెడీయే!” అంది ధృతి. ఆమెకు సతీష్‌చంద్రనే గుర్తొస్తున్నాడు.
వెంటనే మోక్ష కల్పించుకొని ”ఆ షరతులేమిటో ముందుగా చెప్పండి! తెలియకుండా ఎలా పాటిస్తారు? మీరు ఏది చెబితే అది ఓ.కె. అనలేం కదా!” అంది.
”ఏదో చెప్పను. చెయ్యలేనిది చెప్పను. ఇవాళ అన్నం తినడం మానెయ్యాలి. అంతే! ఆన్సర్‌ చేస్తే నో ప్రాబ్లమ్‌” అన్నాడు.
మాధవీలత అదిరిపడి అసలే ప్రెగ్నెన్సీ కన్‌ఫం అయిన పిల్ల అన్నం తినకుండా మానేస్తే ఎలా అని అనాలని వున్నా ధృతి జవాబులు చెప్పగలదన్న ధీమాతో అనలేదు. మోక్షకు కూడా అదే నమ్మకం.
”చెప్పు ధృతీ! ఓ.కెనా?” అడిగాడు ఆనంద్‌.
”ఓ.కె. బావగారు! అడగండి!” అంది. ఆమె సరదా పడటం లేదు కాని త్వరగా అక్కడ నుండి వెళ్లాలని…
”స్మాల్‌ కొశ్చన్స్‌ అడుగుతాను” అన్నాడు.
”ఓ.కె.”
”నేను అడిగాక ఓహ్‌ ఇంతేనా! ఇంత ఈజీనా అని నీకే అన్పిస్తుంది” అన్నాడు ఆమెనే చూస్తూ.
”సరే బావగారు! నేను దేనికైనా ఒప్పుకుంటున్నాను కదా! ముందు మీరు అడగండి!” అంది. ఆమెకు లోలోన విసుగ్గా వుంది. అత్తగారు ఆనంద్‌వైపు ఆసక్తిగా చూస్తుండడం వల్లనో ఏమో ఆ విసుగును బయటకు రానివ్వాలంటే భయంగా వుంది. లేకుంటే ఎప్పుడో గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకునేది. సతీష్‌ దగ్గర నుండి వచ్చే ఫోన్‌ కోసం ఎదురుచూస్తూ మొబైల్‌ని బెడ్‌మీద పెట్టుకొని వుండేది. ‘ఈ ఖర్మంటి నాకు’ అని అనుకుంటోంది.
అతను మళ్లీ ధృతితో
”అడుగుతాను. మన ఇందిరాగాంధీ, నెహ్రూ తెలుసుకదా? అలాగే పదకవితా పితామహుడు తెలుసుకదా?” అన్నాడు.
”పర్సనల్‌గా తెలియకపోయినా వాళ్ల పేర్లు విన్నాను. అబ్దుల్‌కలాం పేరు, డా|| సి. నారాయణరెడ్డి పేరు కూడా విన్నాను” అంది ధృతి.
”జస్ట్‌ వాళ్లకు సంబంధించినవే అడుగుతాను” అన్నాడు.
”అడుగుతాను, అడుగుతాను అంటూ చిరాకు పుట్టేలా చెయ్యకపోతే త్వరగా అడగొచ్చుగా! అయినా ఈయనగారిలో ఇంతెప్పుడు ఏడ్చింది. భార్యతో గట్టిగా నాలుగు మాటలు సంతోషంగా మాట్లాడలేని ఈయనకు మరదలుతో ఇన్ని మాటలు అవసరమా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని మనసులో అనుకుంటున్న మోక్షకు నిద్ర ఆగటం లేదు. పగలంతా ఆఫీసులో కూర్చుని కూర్చుని వచ్చి ఇప్పుడు మళ్లీ ఆనంద్‌ నిర్వహించే ఈ క్విజ్‌ను వింటూ కూర్చోవాలంటే కూర్చోలేక పోతోంది. ఆమెకు రేపు ఆఫీసుకెళ్లగానే అక్కడ వుండే హెవీ వర్కే కళ్లముందు కదులుతోంది.
”ఒన్‌ మినిట్” అంటూ ఆగాడు. అత్యుత్సాహంగా ఆమెనే చూస్తున్నాడు.
అదిచూసి ఏమిటో రోజురోజుకి ఆనంద్‌లో ఈ వింత మార్పు అనుకుంది మోక్ష. అతనిలోని ఆ ఉత్సాహం ఆ తుళ్లింత చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతోంది. ఆమె కాపురానికి వచ్చాక ఆనంద్‌ ఇంత ఆనందంగా ఎప్పుడూ లేడు. ఎప్పుడు చూసినా దిగాలుగానే వుండేవాడు… ఈ మార్పు చూడానికి బాగున్నా అదేదో నాతో ఇలా వుంటే ఇంకా బావుండేది కదా అని అనుకుంది.
అతను వేయబోయే ప్రశ్న పెదవి దాటింది.
”ప్రస్తుత పోటీలో మనిషి నిలబడి గెలవాలంటే ప్రధానంగా ఆ మనిషికి ఏం కావాలి?” అన్నాడు.
ధృతి కొద్దిసేపు ఆలోచించి ”సునిశిత నైపుణ్యం” అంది.
”వెరీగుడ్‌!” అంటూ క్లాప్స్‌ కొట్టాడు ఆనంద్‌.
అది చూసి మాధవీలత సంబరపడింది. ఇల్లన్నాక ఇంట్లో వుండే సభ్యులన్నాక ఈ మాత్రం సరదాలు, గేమ్‌లు లేకుంటే ఏం బావుంటుంది. ఇల్లంతా స్మశాన నిశ్శబ్దమే వుంటుంది. అదీ ఆమె అభిప్రాయం. అందుకే ఆనంద్‌తో సమానంగా ఆనందపడుతోంది.
”ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కదా! అలాగే మన భారతదేశానికి రెండో ప్రధానమంత్రిగా అప్పట్లో ఎవరున్నారు?” అన్నాడు.
”ఇప్పుడైతే చెప్పగలను కాని అప్పట్లో ఎవరున్నారో నాకు తెలియదు” అంది.
”ఓ.కె. దానికి ఆన్సర్‌ లాల్‌బహదూర్‌శాస్త్రి” అన్నాడు. అతని ఛాతి కొంచెం ఉబ్బింది.
”భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?” అన్నాడు.
”ఇందిరాగాంధీ” అంది.
”వెరీగుడ్‌” మళ్లీ క్లాప్స్‌ కొట్టాడు.
ఆ చప్పుడుకి వాలిపోతున్న మోక్ష కనురెప్పలు వెంటనే అలర్టయి విచ్చుకున్నాయి.
”పదవిలో వుండగా మరణించిన మూడో ప్రధానమంత్రి ఎవరు?” అన్నాడు.
ఆమె చెప్పలేకపోయింది.
”ఇది కూడా ఈజీ జవాబే… ఇందిరాగాంధీ. కానీ నువ్వు చెప్పలేకపోయావ్‌” అన్నాడు. మళ్లీ ఉబ్బింది అతని చాతి.
”భారతదేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ. అయితే ఆయన ఎంతకాలం పనిచేశాడు?” అన్నాడు.
”తెలియదు” అంది.
”16 సంవత్సరాల 286 రోజులు. ఇదికూడా చెప్పలేక పోయావ్‌!” అన్నాడు.
ధృతి మనసు మీద సడన్‌గా నీళ్లు చిలకరించినట్లు ఉలిక్కిపడింది. ఎందుకో ఆమెకు ఓడిపోతుంటే బాధగా వుంది. తేలిగ్గా తీసుకోలేక పోతోంది.
”ఇంకో చిన్న ప్రశ్న. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు?” అన్నాడు.
ఆమె చెప్పలేకపోయింది. అత్తగారు, తోడికోడలు ముందు తలకొట్టేసినట్లైంది.
”ఇది కూడా తుస్‌…” అన్నాడు.
”రాష్ట్రపతి నియమిస్తాడు” అన్నాడు.
ధృతి తలదించుకునే వుంది.
అతను మళ్లీ అడగడం మొదలు పెట్టాడు.
”కార్గిల్‌ యుద్ధకాలంలో భారత ప్రధానమంత్రి ఎవరు?” అన్నాడు.
ఆమె చెప్పలేకపోయింది.
అతను నవ్వి ”ఇది మీ యుద్ధంలో వుండేవాళ్లు ముఖ్యంగా తెలుసుకోవాలసిన ప్రశ్న. కార్గిల్‌ యుద్ధ కాలంలో భారత ప్రధాని ఎ.బి. వాజ్‌పేయ్‌” అన్నాడు. నువ్వు ఓడిపోతున్నావ్‌ అన్నట్లుగా చూశాడు. ఆమె ముఖం చిన్నబోయింది. కళ్లు చెమర్చేలా వున్నాయి.
మోక్ష బిత్తరపోయి చూస్తోంది. ఇతనికి ఈ ప్రశ్నలు వేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పటి నుండి ఆలోచిస్తున్నాడు? ఇవన్నీ పోలీస్‌ పరీక్షల కోసం చదివే ప్రశ్నలు. ఆఫీసులో ఎవరైనా మాట్లాడుకుంటుంటే విని వుంటాడేమో! లేకుంటే ఇతని పర్సనాలిటీకి ప్రధానమంత్రి గురించి ప్రశ్నలు వేయడమేంటి? అసలు ప్రధానమంత్రి అంటేనే భారత ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. అంతేకాదు దేశ ప్రజలకు, అధికార పార్టీకి, పార్లమెంటుకు, కేంద్ర కాబిన్‌ెకు, కేంద్ర మంత్రిమండలికి నాయకుడు. ఇంకా చెప్పాలంటే భారత రాజకీయ వ్యవస్థ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరిస్తారు. ఇదంతా ఒకసారి ఆమె ఎగ్జామ్‌ కోసం చదివినప్పుడు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలకు దృతి సరైన సమాధానాలు ఎలా చెప్పగలుగుతుంది? ఇది అన్యాయం కాదా? అంటే ఆమెను ఏడ్పించాలనే ఈ సన్నివేశాన్ని సృష్టించాడా? లేక ఆమెతో మాట్లాడుతూ గడపాలన్న ఇన్నర్‌ ఫీలింగ్‌, ఇంట్రెస్ట్‌ లాంటిది ఏమైనా వుందా? ఎటూ తేల్చుకోలేకపోతోంది మోక్ష.
ధృతి అన్నం తినకుండా తన గదిలోకి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది.
ఆమె ఏడుపు అక్కడ వున్న వాళ్లెవరూ చూడలేదు. ఆనంద్‌ నవ్వాడు. మాధవీలత కొడుకుతో పాటు కలిసి అన్నం తింటుంటే మోక్షకు ఒక్క ముద్దకూడా దిగలేదు. ఆమె బాధ ఆమెకుంది.
ఆ రాత్రి అలా గడిచిపోయింది.
*****

తెల్లవారింది. అంకిరెడ్డి వాకింగ్‌కెళ్లి వచ్చాడు. ఆఫీసుకెళ్లాలని రెడీ అవుతున్నాడు.
ఆనంద్‌ ఆఫీసుకెళ్లాలని రెడీ అవుతూ బిజీగా వున్నాడు. అతను ఆఫీసుకి వెళ్లక ముందే ”నాకు డబ్బులివ్వండి! ఇవాళ ఆఫీసు నుండి ఇంటికొచ్చేముందు నా కొలీగ్‌ని షాపింగ్‌కి తీసికెళ్లి నాకో డ్రెస్‌ తెచ్చుకుంటాను. రేపు నా బర్త్‌డే!” అంది మోక్ష.
”డబ్బులు నేనివ్వను. బర్త్‌డేలు చేసుకోవటం నాకిష్టం వుండదు” అన్నాడు.
”మనకు ఇష్టం వున్నా లేకున్నా చేసుకోవాలి. నేనేం ఇంట్లో చెయ్యమనటం లేదు. మా ఆఫీసువాళ్లే కేక్‌ తెచ్చి కట్ చేయిస్తారు. నాకే కాదు, ఆఫీసులో ఎవరి పుట్టినరోజు అయినా వాళ్లు అలాగే వాళ్ల ఖర్చులతోనే చేస్తారు. అది అక్కడి ఫార్మాలిటీ. ఇప్పుడు నేను వేసుకుంటున్న డ్రెస్‌లన్నీ పాతవే. రేపు అవే వేసుకెళ్తే అందరిలో నాకు షేమ్‌గా వుంటుంది” అంది.
”రేపు ఆఫీసుకెళ్లటం మానేసి ఇంట్లో వుండు” అన్నాడు.
నిర్ఘాంతపోయింది మోక్ష.
ఒకరోజు తను పనిచేస్తున్న ఏర్‌టెల్‌ ఆఫీసులో తన కొలీగ్‌ ఆమె కూతురు పుట్టినరోజుకి డ్రెసెస్‌ తేవాలి తోడు రమ్మంటే వెళ్లింది. ఆ షాపులో ఆడపిల్లల డ్రెస్‌లు చూసి పూర్విని గుర్తు చేసుకుంది. వాటిల్లో ఎల్లో శాటిన్‌ షేడెడ్‌ నెట్ ఫ్రాక్‌, ఆపిల్‌ గ్రీన్‌ సెమీ రాసిల్క్‌ మెటీరియల్‌తో డిజైన్‌ చేసిన ఫ్రాక్‌, అవికాక కలంకారీ ఖాదీతో బ్లౌజ్‌, నేచురల్‌ డై ఖాదీతో లంగా చూడముచ్చటగా వున్నాయి. ఆ డ్రస్సులు పూర్వికి చాలా బాగుంటాయి. పూర్వి అక్కడ లేకపోయినా వాటిని వేసుకొని చూసుకున్నట్లే కళ్లకు కన్పిస్తోంది. అవి వేల ఖరీదులో వున్నాయి. కొలీగ్‌ టకటక నాలుగు డ్రెస్‌లు సెలెక్ట్‌ చేసుకొని ప్యాక్‌ చేయించుకుంది. వాటిల్లో ఒక్కటి కొనాలన్నా మోక్ష దగ్గర డబ్బులు లేవు. కోరిక వున్నా కొనలేక అలాగే ఇంటికొచ్చింది.
ఆనంద్‌ ఆమె తలమీద తట్టి ”ఏంటి ఆలోచిస్తున్నావు? నేను వెళ్లొద్దన్నానని ఆఫీసుకెళ్లకుండా వుండకు. కొత్త చీరలు బీరువాలో చాలా వున్నాయి. అన్నీ అమ్మ కొన్నవే. మన పెళ్లిలో సతీష్‌ పెళ్లిలో కొన్నవన్నీ అలాగే వున్నాయి. వాటిలో ఒకి కట్టుకెళ్లు”
”చీరలా? చీర కట్టుకెళ్లాలా?” ఒకరకంగా ముఖం పెట్టి అంది మోక్ష.
”ఏంటి! ఏదో అంటున్నావ్‌?”
”చీరలు హౌస్‌వైఫ్‌లకు బాగుంటాయి. ఇప్పుడు వాళ్లు కూడా చీరలు కట్టడం లేదు. నేను కడితే వింతగా చూస్తారు. మీ ఆఫీసులో ఎవరైనా చీరలు కడుతున్నారా?” అంది.
”ఆడవాళ్లకి చీరలే బాగుంటాయి. ఆ చీరలన్నీ ఏం చేస్తావ్‌ పడేస్తావా?”
”మీతో వాదించలేను. నేనే ఏదో ఒకటి చేస్తాలెండి!” అంటూ ఆఫీసుకెళ్లిపోయింది మోక్ష.
ఆఫీసుకెళ్లిన మోక్ష శాలరీ వచ్చాక ఇస్తానని చెప్పి కొలీగ్‌ దగ్గర డబ్బులు తీసుకొని డ్రెస్‌ తెచ్చుకుంది.
*****

ఉదయాన్నే ఇంట్లో అందరు బ్రేక్‌ఫాస్ట్‌ చెయ్యాలని డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నారు. అంకిరెడ్డి, ఆనంద్‌, మాధవీలత, మోక్ష తింటుంటే ధృతి వడ్డిస్తోంది.
ధృతికి ఈ మధ్య చాలా నీరసంగా అన్పిస్తోంది. పనికూడా తప్పనిసరై చేస్తున్నట్లే వుంది కాని ఒంట్లో ఏమాత్రం శక్తి వుండటం లేదు. ప్రతిరోజు రాత్రి డిన్నర్‌ టైంలో ఆనంద్‌ ఏదో ఒకటి అని నొప్పించటం వల్ల తిండి సరిగా తినడం లేదు. అది ఆమెకు నొప్పిగా వున్నట్లు అక్కడ ఎవరికీ అన్పించదు. మాధవీలత ఓ నవ్వు నవి ‘బాగుంది మీ బావామరదళ్ల సరసం’ అంటుంది. ఒక్కసారి కూడా మరదలితో ఆ మాటలేంటి? ఆ ప్రశ్నలేంటి? దాని భర్త ఊరిలో లేనప్పుడు దాన్ని మనమెంత ప్రేమగా చూడాలి అనిమాత్రం అనదు. దృతి వచ్చాక అందరం నవ్వుకుంటూ హేపీగా వున్నాంరా అని మాత్రం అంటుంది. వాళ్లు అలా వుండానికి ఎన్నిసార్లు తిండి మానేసి వుంటుందో, ఎన్నిసార్లు గదిలోకెళ్లి ఒంటరిగా పడుకొని ఏడ్చుకుని వుంటుందో ఎవరికీ కన్పించదు. అత్తగారింట్లో ఎవరికైనా కష్టంగానే వుంటుంది అన్న మాటల్ని ఆమె హాస్టల్లో వున్నప్పుడు అమ్మాయిల నోటి వెంట విన్న కారణం వల్లనో ఏమో ఇది పెద్ద కష్టం కాదులే అని మాత్రం చాలాసార్లు అనుకుంది. నేను చాలా హ్యాపీగా వున్నానని కూడా అనుకుంది…
సతీష్‌చంద్ర ఆమెకు ఎప్పుడు ఫోన్‌ చేసినా అడిగే మొట్టమొదటి ప్రశ్న ‘డిన్నర్‌ చేశావా?’ అని… చెయ్యకపోయినా చేశాను అనే అంటుంది. ఒక్క రోజు కూడా ఇవాళ బావగారు అడిగిన కొశ్చన్స్‌కి ఆన్సర్‌ చెయ్యలేక డిన్నర్‌ మానేశానని మాత్రం చెప్పదు. అలా చెబితే అతను తిట్టొచ్చు. లేదా అతన్ని అతను తిట్టుకోవచ్చు, టెన్షన్‌ పడొచ్చు. భార్యను వదిలేసి సైన్యంలోకి వచ్చినందుకు బాధపడొచ్చు. తన వల్ల ఎవరూ బాధపడకూడదు. ప్రవీణ్‌ కూడా ఫోన్‌ చేసి ”తిన్నావారా?” అంటాడు ప్రేమగా. తిన్నాననే చెబుతుంది. తినలేదని చెబితే ఎవరూ వచ్చి తనకు తినిపించరు. పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు, మానసికంగా సంతోషంగా వున్నప్పుడు తనే తినాలి. ఇది ఎవరి తప్పూకాదు. ఎవరి లోపం కాదు…
మోక్ష టిఫిన్‌ తినటం పూర్తయ్యాక ఆమెకు లంచ్‌బాక్స్‌ అందిస్తూ ”హ్యాపీ బర్త్‌డే అక్కా” అంది. అది విన్నాడు ఆనంద్‌. దృతి ఇంకాస్త దగ్గరగా వెళ్లి ”అక్కా! నీ డ్రస్‌ కత్తి!” అంది. అది కూడా విన్నాడు ఆనంద్‌. మోక్ష వెంటనే ధృతి బుగ్గమీద ముద్దుపెట్టుకొని ”థాంక్యూ ధృతి!” అంది. అది కూడా చూశాడు ఆనంద్‌. చూసి వూరుకోలేదు.
మోక్షను రెక్క పట్టుకొని అర్జంట్ గా గదిలోకి తీసికెళ్లాడు. అతనలా తీసికెళ్తుంటే ధృతి, మాధవీలత చూసి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇంకేదో ఇస్తాడనుకొని ముసిముసిగా నవ్వుకున్నారు.
కానీ లోపల వాళ్లు నవ్వుకున్న సరదా ఏం లేదు.
”ఎప్పుడైనా ఆడవాళ్లు ఆడవాళ్లు ముద్దు పెట్టుకుంటారానే! చూడానికి చెండాలంగా లేదు. ఎక్కడైనా మగవాళ్లు కదా ఆడవాళ్లను ముద్దు పెట్టుకునేది” అన్నాడు.
”అవునా!!” అన్నట్లు అతన్ని కింద నుండి పైకి చూసింది మోక్ష.
ఆమె చూపుల్ని అతనేం పట్టించుకోలేదు. ”ఎలాగైతేనేం మా తమ్ముడు లేని లోటును నువ్వు భర్తీ చేసేలా వున్నావ్‌! మిమ్మల్నిద్దర్ని ఇలాగే వదిలేస్తే ఎంత దూరమైనా వెళ్లేలా వున్నారు. అలా వెళితే నాకు ఇబ్బందవుతుంది. మరీ అంత దూరం వెళ్లకు” అన్నాడు.
అతన్ని లోలోన అసహ్యించుకుంది మోక్ష. భార్యను విష్‌ చెయ్యాల్సిన సందర్భంలో కూడా అతను ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఎప్పుడు చూసినా ధృతి గురించే ఆలోచిస్తాడు. దృతితోనే మాట్లాడుతుంటాడు. ధృతి ఎటు వెళ్లినా ఏదో ఒక పని కల్పించి చెబుతుంటాడు. ఆమెకు అది నచ్చటం లేదు.
”అసలేంటండీ మీ ఉద్దేశ్యం. ఈ మధ్యన మరీ ఎక్కువగా దృతి చేతనే మీ పనులు చేయించుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆ పనులన్నీ నేనేగా చేశాను. ఇప్పుడు నేను లేనా? నాకేదో డౌట్ గా వుంది మీమీద… తమ్ముని భార్య బిడ్డతో సమానమంటారు. ఏదైనా చెడు ఆలోచన వుంటే కట్ చేసుకోండి?” అంది.
”దవడ పగిలిపోద్ది అలా అన్నావంటే! అసలేంటే నీ మాటలు. నేనెలా కన్పిస్తున్నాను నీ కళ్లకు? మీ నాన్న మీ ఊరిలో మాజీ సర్పంచ్‌. మీ అన్నయ్య కూడా వ్యవసాయం చేసుకుంటూ పద్ధతిగా గౌరవంగా వున్నాడు. అందుకే నిన్ను పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాను. విన్నావుగా నేను కాపురం చెయ్యాలంటే ఎన్ని పాటిస్తానో… అదీ నా లెవెల్‌. నా లెవెల్‌ మరచిపోయి మాట్లాడకు” అన్నాడు.
ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిఃది మోక్ష.
ఆమె నోటిని మూసి ”మీరు నా ఆశయాలను గుర్తించటం లేదు. అర్థం చేసుకోవటం లేదు. ప్రోనోటుతో సర్దుకుని మీవాళ్లు డబ్బులు ఇవ్వకపోయినా పెళ్లి చేసుకున్నవాడినే నేను. అలాంటి నన్ను అంతమాట అంటావా? నేనేమైనా మా తమ్ముడిని అనుకున్నావా? అడుక్కునే వాళ్లకి అన్నం పెట్టేవాడి చెల్లెలి చేయి పట్టుకొని కాపురం చేయానికి? అలాంటి వాళ్లతో పనులు మాత్రమే చేయించుకోవాలి. వేరే నువ్వనుకునే పనులు కాదు” అన్నాడు. ఆమె నోటితో పాటు కోపంతో ముక్కు కూడా మూశాడు. ఆమె ఊపిరాడక గింజుకుంది. అతను వదిలేశాక గాలి పీల్చుకుంటూ ”ఇంకొంచమైతే నా ప్రాణం పోయేది. ముక్కు మూస్తారేంటి? మామూలుగా మాట్లాడలేరా?” అంది.
”నువ్వు మామూలుగా మాట్లాడేటట్లు మాట్లాడుతున్నావా? ఏదేదో మాట్లాడుతున్నావుగా. మండదా? ఆ మంటలో నేను నోరు మూశానో, ముక్కు మూశానో నాకెలా తెలుస్తుంది” అన్నాడు.
ఆమె మరి కాస్త గాలి పీల్చుకొని ”మీకేం తెలియదు లెండి! నేను ఆఫీసుకెళ్లాలి” అంటూ ఆమె ఆ గదిలోంచి బయటకొచ్చింది.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *