అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 13

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య.

balaji

శ్రీవేంకటేశ్వరా! నేను నిన్ను కాపాడు అని అడిగే అర్హత లేని వాడిని. ఎందుకంటే.. నా జీవితంలో ఒక్క క్షణము కూడా నిన్ను మనసారా కొలిచింది లేదు. జీవితమంతా సంసార సుఖాలలో గడిపాను. నా జీవితం అజ్ఞానమయం. నిన్ను శరణు అని అడగాలంటే భయం వేస్తోంది అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. అన్నమయ్య లాంటి పరమ భక్తుల స్థితి అలా ఉంటే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? తెలుసుకొని, మేల్కొని ఆ పరంధాముని సేవించి తరించమని పరోక్ష సందేశం ఈ కీర్తనలో ఉంది.
కీర్తన:
పల్లవి: ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్ను దలచినది నిముషమూ లేదు ||పల్లవి||

చ.1. పాయమెల్ల సంసారముపాలే పడితిగాని
చేయార నీసేవ నేజేసుట లేదు
కాయమెల్ల కాంతలకే కడు శేషమాయ గాని
నీయవసరములందు నే నొదుగలేదు ||ఏనోరు||

చ.2. చిత్తము ఆసలపాలే సేసి బదికితి గాని
హత్తి నిన్ను ధ్యానము సేయగ లేదు
సత్తెపు నానాలుకెల్ల చవుల కమ్మితిగాని
మత్తిలి నీ కీర్తనము మరపుటా లేదు ||ఏనోరు||

చ.3. పుట్టుగెల్ల నజ్ఞానము పొంతనే వుంటిగాని
వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని
యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ
నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు ||ఏనోరు||
(ఆ.సం.3-210వ రేకు. కీ.సం.60)

విశ్లేషణ:
పల్లవి: ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్ను దలచినది నిముషమూ లేదు .
ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్ను దలచినది నిముషమూ లేదు .

శ్రీనివాసా! నేను ఏ నోరు పెట్టుకుని నిన్ను రక్షించమని అడగాలి? నేను ఇప్పటివరకూ నిన్ను మనసారా దలచిన క్షణమే లేదు కదా! అని వాపోతున్నాడు అన్నమయ్య. వయసులో ఉన్నప్పుడు పెండ్లి, పెళ్ళాము, వృత్తి, పిల్లలు, చదువులు గడచిపోతుంది. వృద్ధాప్యం మీదపడి కళ్ళు కనపడక, చెవి వినపడక, దేహం జర్జరీభూతమై, శుష్కించి యున్నప్పుడు కఫ, వాత పిత్తాలు శరీరంపై ముమ్మరంగా దాడి చేస్తున్నప్పుడు, నీవు గుర్తుకు వస్తే నిష్ప్రయోజనం కదా అని అన్నమయ్య పరోక్ష బోధ మానవాళికి చేస్తున్నాడు.

చ.1. పాయమెల్ల సంసారముపాలే పడితిగాని
చేయార నీసేవ నేజేసుట లేదు
కాయమెల్ల కాంతలకే కడు శేషమాయ గాని
నీయవసరములందు నే నొదుగలేదు.
నా వయస్సంతా సంసార కూపంలో మునిగితేలాను. స్త్రీ సుఖము, సంపద సుఖము, యవ్వన మదము నన్ను నీ అలోచనలే లేకుండా చేశాయి. ఛేతులారా నీ సేవ చేసుకునే భాగ్యమే నాకు కలుగ లేదు. శరీరమంతా స్త్రీల సుఖం నిమిత్తమే ఖర్చుపెట్టాను. నీ అవసరాల గురించి గానీ.. నీ చింతనలతోగానీ గడపలేదు. ఈనాడు కరుణించు..కాపాడు..రక్షించు అని అడగాలంటే ఎలా అడుగగలను? అని విలపిస్తున్నాడు అన్నమయ్య.

చ.2. చిత్తము ఆసలపాలే సేసి బదికితి గాని
హత్తి నిన్ను ధ్యానము సేయగ లేదు
సత్తెపు నానాలుకెల్ల చవుల కమ్మితిగాని
మత్తిలి నీ కీర్తనము మరపుటా లేదు

నా మనసంతా వెఱ్ఱి మొఱ్ఱి ఆశలతో నిండిపోయి బ్రతికాను దప్ప మనసును కూడగట్టుకుని ఒక్క సారయినా నిన్ను ధ్యానం చేయనే లేదు. నిజాలను పలుకుతూ భగవద్ధ్యాన్నం లో గడుపవలసిన నా నాలుకను రకరకాల భోజన పదార్ధాలను సేవిస్తూ ఆనందంగా గడిపేశాను. అవివేకం, అజ్ఞానంతో నీ కీర్తనలను పాడలేదు. ఇక ఏనోరు పెట్టుకుని నిన్ను నను కడతేర్చు స్వామీ! అని ప్రార్ధించగలను.

చ.3. పుట్టుగెల్ల నజ్ఞానము పొంతనే వుంటిగాని
వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని
యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ
నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు

పరంధామా! నేను పుట్టినదాదిగా అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతున్నాను. జీవితానికవసరమైన నీ విజ్ఞానాన్ని ఒంట బట్టించుకున్నదే లేదు. ఇక నన్ను ఎలా మన్నిస్తావు? అందుకే నాకు తగని భయం వేస్తున్నది స్వామీ! అందుకే నిన్ను ఏమీ అడుగలేను నిన్ను. నీవే నా మనసెరిగి నన్ను కాపాడు. శ్రీవేంకటేశ్వరా! కరుణతో దయజూసి ముక్తిమార్గం ప్రసాదించు అని ప్రార్ధిస్తున్నాడు.

ముఖ్యమైన అర్ధములు : కావు = కాపాడు, రక్షించు; పాయము = వయస్సు, యౌవనము; శేషమాయె = మిగిలిపోయెను; హత్తి = కూడి (నిఘంటువులలో హస్తి (ఏనుగు) కు వికృతి రూపంగా పేర్కొన్నా ఆచార్య రవ్వా శ్రీహరి గారు అన్నమయ్య పదకోశంలో “హత్తుగడ” అంటే పొందిక, చేరిక, కలయిక అని ఇచ్చారు కనుక మనం ఈ సందర్భంలో “కూడి” అనే అర్ధం తీసుకోవచ్చు); చవుల = రుచుల; మత్తిలి = కామము, అవివేకము; ఒల్లనైతిని= అంగీకరించలేకపోవుట, ప్రయత్నము చేయకపోవడం; వెరగు = భయము, నిశ్చేష్టత.
-o0o-

Leave a Comment