April 23, 2024

ఎన్నెన్నో జన్మల బంధం

రచన: డా. గురజాడ శోభా

….

పేరిందేవి

నవల చదువుతూ కూర్చున్న వేద ”అప్పలమ్మా ఓ అప్పలమ్మా” అని పిలిచింది
జవాబు రాలేదు.
” నిన్నే” రెట్టించింది
” అప్పలమ్మ సచ్చిందిగా అమ్మగోరూ ” ఇంకో పనిమనిషి రత్తాలు చేస్తున్న పని ఆపి వొచ్చి చెప్పింది,
వేద మనసు మొర్రో అంది. . . . . ఆమెనే చూస్తూ నిలబడిన రత్తాలుకు కోపం వొచ్చింది. ”సచ్చినా అదే కావాలంట అమ్మగోరికి. ఆ ముసల్ది ఏం మ్మాయ సేసిందో ఏందో ‘ అని మనసులో అనుకుంటూనే తన పని తాను
చేసుకోసాగింది.
వేద చదువుతున్న పుస్తకం మూసి నిట్టూర్చింది.
” ఏమైందమ్మగోరూ పుత్తకాన్ని మూసేసినారేంటి ”? ఏమి కతున్నదందులో ”
” ఏమి లేదు ”
” అమ్మగోరూ ”
“మీకు ఆ యమ్మంటే అంత ఇది ఎందుకండీ ‘
” ఏ అమ్మంటే ”?
” ఇంకోరమ్మా అప్పలమ్మ” ‘కసి అసూయ కలగాపులగంగా ధ్వనించాయి ఆ మాటల్లో
” ఎందుకంటే ఏం చెప్పను రత్తాలు. ఏమీ చెప్పలేను ” గొణిగినట్టుగా అంది వేద.
”రత్తాలు మీతో ఆడుకుందేటీ ?. . . . ఓ. . . . . ఆ యమ్మ అల్లప్పుడెప్పుడో గంద పుట్టింది. మీ యమ్మగోరి కంటే శానా పెద్దదికాదేటీ ?
”అవును చాలా పెద్ద అందుకే నేను తనతో ఆడలేదు”.
” మీ నాయనమ్మగోరి తోటిదంట గందా
” అవును ”
”మఱైనా మీకాయమ్మంటే అంత ఇది ఎట్టండీ ? ముసిల్ది అని చూసేటోళ్లు లేరని జాలా? మీకు చమురు పూసి, నీరు పోసి ఆడించింది అని ఇఛ్చకమా ?” అడిగింది రత్తాలు.
‘ ఏమో. . . ఏమిటో మరి ‘ గొణిగినట్టుగా అంది వేద. ఆ మాటని అక్కడితో ఆపేసింది.
రత్తాలు పెరటివైపుకు వెళ్ళింది. . . . వేదకి మాత్రం ఏదోగా అనిపించింది. నవలలోని మనసుకు హత్తుకునే అంశం చదవగానే అప్పలమ్మకి చెప్పాలని తనకి ఎందుకు అనిపించింది? రత్తాలు అన్నట్టు ఆమెకి తనకీ మధ్య వున్నదేమిటి?తన వయసుదే అయినా రత్తాలుకు ఆ మాట కూడా చెప్పాలని తనకి అనిపించలేదు సరికదా రెట్టించి అడిగినా నవలలోచదివిన అంశాన్ని ఎందుకు షేర్ చెయ్య లేకపోయింది?
నవలని తెరిచింది. సోఫాలో జార్లపడింది. కానీ మనసును మాత్రం కేంద్రీకరించలేకపోయింది.
మనసు బాల్యం వైపుకు పరుగందుకుంది. . వేద పుట్టినప్పటినుండి ఆమెకి స్నానం చేయించడం మొదలుకుని జోలలు పాడడం వరకూ చేసిన అప్పలమ్మ బోలెడన్ని కధలూ కబుర్లూ చెప్పేది. అమెఆర్ధికంగా అట్టడుగునుండే వారి కథలే చెప్పినా కష్టాలూ కన్నీళ్లను వివరించేది కాదు. జానపదుల జీవన చిత్రణ , ఆచార వ్యవహారాలూ , ఆడుతూ పాడుతూ పనీ పాటలు చేసుకునే వారి సంగతులూ వారిమధ్య గల ఆప్యాయతా అనురాగాలూ ఆమె పాటల్లో వినిపించేవి. తెలియకుండానే అవి వేదను ఆకట్టుకునేవి. పోలేరమ్మ, నూకాలమ్మ లను కొలిచే అప్పలమ్మ వేదకి ఏ అనారోగ్యం కలిగినా తమ పూజలు చేసేది. తాయత్తులు కట్టేది.
నాయనమ్మ రామాయణ, భారతాలు చెప్పేది. . అమ్మ తెలుగు పద్యాలు నేర్పేది. అవి తన మీద ప్రభావం చూపేవి కాదు. కానీ జానపద ఫక్కీలో అప్పలమ్మ చెప్పిన రామకథ , పనీపాటలు చేసుకునేవారి పాటలు భలేగా నచ్చి నోట్లో నిత్యం ఆడేవి. ఆ మాట ఇంట్లో ఎవ్వరికి తాను చెప్పలేదు కానీ తనకే కాదు అప్పలమ్మకి కూడా తెలియకుండానే ఆమె తన ప్రధమ గురువు అయిపొయింది.
ధనికుల ఇళ్లల్లో వున్నట్టే తమ ఇంట్లో కూడా ఎందరో పని వాళ్ళు ఉండేవారు. కానీ వారు ఎవ్వరితోనూ లేని చేరిక అప్పలమ్మతో చక్కగా జరిగిపోయింది. స్కూల్లో జరిగిన సంగతులూ, టీచర్ల విషయాలు ఆమెతోనే ఎక్కువగా పంచుకునేది. క్లాస్ ఫస్ట్ వొస్తే అభినందించాలి అని అప్పలమ్మకి తెలియదు. కానీ తాను ఆమెకే ముందు చెప్పింది. ముందు వోచ్చా క్లాసులో అంటే స్కూల్కి ముందు వెళ్లడమనుకుందామె. అది కాదని వివరించడం కష్టమే అయ్యింది. కానీ ఆమెకి అంతా వివరించి కానీ వొదలలేదు తాను. అందుకే తర్వాత ఆ వివరాలన్నీ ఆమెకి అర్ధమయ్యి విపులంగా అడిగేది. చక్కగా వినేది
అప్పలమ్మ కూడా తనతో కష్ట సుఖాలు పంచుకునేది. తాగి వొచ్చి మొగుడు కొట్టడం గురించి చెప్తూ’ రేపు సేస్తా పెనిమిటి పెండ్లి’ అనేది. మర్నాడు ప్రొద్దున్న నిజంగానే అతను పిల్లిపిల్ల అయ్యేలా చూసేది. మగవాడి బలహీనతలను చూసి చూడనట్టు చూడాలి. కానీ వొదిలి పెట్టకూడదు. మొగుడ్ని దిద్దుకునేది వాడితో సర్దుకునేది మనమేగా అనేది.
రోజూ నాన్నమ్మ కాళ్ళు పిసుకుతూ లోకాభిరామాయణం చెప్పేది. అప్పుడు అప్పలమ్మ పూర్తిగా నాన్నమ్మకి నచ్చే సంగతులే చెప్పేది, . ఉక్కుల్లా ఉండేవి ఆమె చేతులు.
ఒక రోజు” నా మనవడు పట్నంలో వుండే గుంటడు. ” అంటూ ఒక కుర్రాడిని చూపించింది. అతని వైపుకు తిరిగి ”ఎవరో ఎరుగున్నావా ?” అని అడిగింది.
” అమ్మాయిగోరు ” అన్నాడు
” కాదేహే ” అంది
” అట్లానేసినావేటి ?” అంది కుర్రాడితో వొచ్చిన తల్లి.
” ఆ యమ్మ నా ఫెండు ” అంది నోరంతా చేసుకుని నవ్వుతూ
ఆ సంగతి విన్న కుర్రాడు బుర్ర గోక్కున్నాడు. తనకి కూడా ఆ పదం విచిత్రంగానే వినిపించింది. కానీ ఆలోచిస్తే నిజమనే అనిపించింది కూడా.
అప్పలమ్మ మనవడు ప్రతీ సెలవలకి వచ్చేవాడు. వొచ్చినప్పుడల్లా ఆడేవాడు. వొక్కగానొక్కపిల్లగా పుట్టి పెరగడం వల్లో ఏమో తనకి ఆడేందుకు ఎవ్వరూ ఉండేవారు కాదు. లంకంత ఇంట్లో ఒంటరిగా పెద్దల మధ్య తిరిగే తనకి సమవయస్కుడైన అతడితో మంచి స్నేహం కలిసింది. ఆ స్నేహం వల్లే వయసు పెరిగినా వొస్తూ ఈ మాటా ఆమాటా చెప్పి పోతూ ఉండేవాడు. ఏదో తెలియని ఆకర్షణ అతని మీద కలిగింది.
ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. ఒక రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.
” నేనతన్ని చేసుకోను అప్పలమ్మ” అంది తాను
” సూడకుండానే సెప్పేసినావే0టి ?”
” నేను నీ మనవడిని చేసుకుంటాను అంది మెల్లగా ”
అప్పలమ్మ చేతుల్లోని పూలు కిందకి జారి పడ్డాయి. క్షణం మౌనంగా నిలబడిపోయింది. తేరుకుని ”ఏటుంది ఆడిలో” అని అడిగింది.
” ఏమి తక్కువ ?” అన్నీ ఉన్నాయి పొడుగ్గా, బలంగా ఎంతమంది పక్కనున్నా ఓడించేలా ఉంటాడు. చదువుకున్నాడు. అంది
”ఎటెటీ సదూకున్నాడా ? ఆడి సదూకీ నీ సదూకు సాపత్యముంటదా ?నీలాగు మాటాడొస్తదా ఆడికి ”
” అవన్నీ నేను నేర్పుకుని మంచి మనిషిగా తీర్చిదిద్దుకుంటాను ”
గలగలా నవ్వింది అప్పలమ్మ”. గా సుద్దులన్నీ కధల్లా. సినేమాల్లా తొంగి సూస్తాయి కాదేటీ ? యిండ్లల్ల అవి వుండేటివి కాదు తల్లి పోలేరమ్మ మీద ఆన ”
తాను ఎన్ని మాటలు చెప్పినా అన్నీ కొట్టి పారేసింది అప్పలమ్మ. పెళ్ళిచూపుల్లో కూర్చోడం , వాళ్ళు ఓకే చెయ్యడం అన్నీ అయ్యాయి. . తన పెళ్లి జరిగిపోయింది
సారె సామాన్లతో పాటు ఒక జంటని తోడిఛ్చి పంపుతామన్నారు కన్నవాళ్ళు. తాను ఆ దంపతులు కాక అప్పలమ్మ కావాలని కోరింది.
” ఆ ముసల్ది నీకేమి సాయమే ?” అన్నా తాను అప్పలమ్మే కావాలని పట్టు పట్టింది. అప్పటికే అప్పలమ్మ భర్త పోయాడు. ఆమె రెక్కల్లో సత్తువా వుడిగింది అలాంటి ఆమెని కొడుకులు పట్టించుకోవడం మానేశారు అన్న సంగతి తెలిసి తనతో తీసుకు వొచ్చేసింది.
”అయ్యో నేనేటి తల్లి నీతో వొచ్ఛేది” అంది కన్నీళ్లతో అప్పలమ్మ.
” నువ్వు నా ఫ్రెండ్ని అన్నావుకదా ఫ్రెండ్ని ఫ్రెండ్కాక ఇంకెవరు చూసుకుంటారు ”అంది తాను.
అప్పలమ్మ తనతో వచ్చాక పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ అయితే వుండే లాభమేంటో తెలిసింది. మంచి చెడూ చెప్పడం ఎవరితో ఎలా మసలుకోవాలో ఏ సమస్య ఎదురయితే ఎలా తట్టుకోవాలో తెలిసింది. సినిమాలూ, పుస్తకాలూ, వ్యక్తులను గూర్చి చర్చించడమూ అలవాటయ్యింది. టీవీ సీరియల్స్ అలవాటు పడుతున్న తనని ఖండించింది.
” ఏటమ్మా ఆ కథలేటి? ఏ సంసారo లోనైనా అట్టా వుంటవా? యేటి మందికి సెప్పాలి యెటొద్దు అనేది తెల్వకుండా తీసేస్తున్నారు కాదేటీ ”అంటూ మాన్పించింది.
స్వార్ధానికి పరాకాష్టగా మారిపోయిన సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఆర్ధిక అంశాలను దాటి ముందుకు పోవడం లేదని కుల రాజకీయాలతో కుటిలంగా ఎదగడం , పవర్ పేరిట పాపిష్టి పనులు చెయ్యడం హేయమని అందువల్ల ఆచి తూచి అడుగెయ్యాలని తెలిపింది.
ఒకటేంటి అన్నిటా తాను అప్పలమ్మ మీద ఆధారపడుతూ వొచ్చింది. అందుకే ఆమె మరణం తనని ఇంతగా కృంగదీసింది.
” నేను సచ్ఛే రోజులు వొచ్చచేసినాయి గందా వేదమ్మా” ఆందో రోజు. అప్రస్తుతమైన ఆ అంశం ఎందుకు తెచ్చిందో తనకి అర్ధంకాక అయోమయంగా చూసింది.
” టీవిలో సూసినాను గoదా సచ్చినంక వొళ్ళు మొత్తం ఇచ్ఛేస్తే శానామంది బతుకుతారని. లేదంటే డాక్టర్ చదివే వాళ్లకి నేర్పే శవాలు ఇవ్వచ్చట గదా అవి దొరుకుట లేదంటగా నాకూ అట్టా సెయ్యాలనుంది వేదమ్మా పేద ముండని. జానెడు పొట్ట పోసుకోడమే కానీ వోరికీ పైసా ఇచ్చినది లేదు గందా ‘ అందుకోసం ఆ కాగితాలేమన్నా ఇచ్ఛేసినావంటే ఏలి ముద్రలేసేస్తా ”’అంది. ఆ పని చేసి కానీ స్థిమిత పడలేదు.
అప్పలమ్మ పోయాక ఆమె శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసి ఆమె చివరి కోరిక తీర్చింది. కానీ తాను మంచి మిత్రురాలిని శ్రేయోభిలాషిని కోల్పోయింది. ఆ లోటు పూడ్చలేనిది. నిట్టూర్చింది
” వేదా నీ స్నేహితురాలిని గురించి ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని ఆన్ లైన్ పత్రికకి రాసిన నీ వ్యాసం బాగా పేరు తెచ్చుకుంది. దానికి మంచి రేటింగ్ వొచ్చిందని మీ ఇద్దరి ఫొటో వైరల్ అయ్యిందని వివరించారు నీకు అభినందనలూ పంపారు చూడు. ”. లోపల గదిలో ఆదివారం మూడ్లో రిలాక్సడ్గా కూర్చున్న శ్రీవారు వొఛ్చి చెప్పడంతో ఉత్సాహంగా లేచింది వేద

” స్నేహానికి కులం అడ్డు రాదనీ, వయసు తేడా పర్వాలేదని, ఆర్ధిక అసమానతలు కానీ విద్య అవిద్య అనే అంశాలు కూడా అడ్డుకోవని మనసులు కలిస్తే చాలని యెంత బాగా నిరూపించిందో ఆ స్నేహితుల స్నేహ సంబంధం అనుసరణీయమైన ఆ బంధం. . . . . . ” ఎడిటర్ తమ స్నేహబంధాన్ని గూర్చి వివరించి ముగించిన అక్షరాలను సజల నయనాలతో చదువుకుంటూ ఉండిపోయింది వేద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *