May 26, 2024

గోమాంసాన్ని ఎందుకు తినొద్దని అటున్నాను ?

రచన: టీవీయస్.శాస్త్రి

cow

రాజస్థాన్‌లోని హింగోనియా గోశాలలో ఈ ఏడాది జనవరి నుంచి జాలై 2016 వరకు అక్కడి ప్రభుత్వం వారు చెప్పే 8, 122 ‘గోమాతలు ‘ మరణించాయి. అయితేనేం అక్కడి ప్రభుత్వం ఒక్క కేసును కూడా ఎవరి మీదా నమోదు చేయలేదు, కనీసం విచారణ జరపలేదు. బీహార్‌ లో లాలూప్రసాద్‌ ప్రసాద్‌ యాదవ్‌ ఏలుబడిలో మాదిరి రాజస్థాన్‌ సర్కారు గోమాత పేరుతో గడ్డి తింటున్నదని విమర్శలు వచ్చాయి. ఆవు ‘ఒక ఉపయోగకరమైన జంతువు అవసరమైతే దానిని తినవచ్చు’ అని కూడా హిందూత్వవాది వీర సావర్కర్ అన్నాడని మీకు తెలుసా? వేదాలు కూడా ఆవును దేవతగా వర్ణించలేదు. ఏదైనా ఉపయోగం, గొప్పది అనుకుంటే దానిని దైవంగా భావించటం హిందువులలో నేడు ఒక ధోరణిగా మారింది. వినాయకుడు పాలు తాగటం , ఫోటోల నుండి విబూది రాలటం. . . లాంటివి కూడా ఈదేశంలోనే జరుగుతాయి. అసలు సావర్కర్ ఏమన్నాడో తెలుసుకోవాలంటే ఈ లింకును చూడండి-http://scroll. in/article/763503/read-what-vd-savarkar-wrote-care-for-cows-do-not-worship-them. ఆవునే కాదు పాలిచ్చే గేదె మరి ఇంకోటి ఏదైనా ఆర్ధిక ప్రయోజనానికి ఉపయోగపడేదే. గాంధీ గారు మేక పాలు తాగటం తెలిసిందే!గొడ్డు మాంసం తినటంతో పాటు ఆ వ్యాపారంలో ముస్లింలే ఎక్కువమంది ఉన్నారనే ఒక దురభిప్రాయం ఇటీవలి కాలంలో బాగా వ్యాప్తి చెందింది . అన్ని రకాల పశు మాంసాలను కలిపి బీఫ్‌ అని అంటారు. దీంతో ఆవు మినహా మిగిలిన దున్న, బర్రె మాంసం తిన్నా లేదా వాటిని మాంసం కోసం వధించినా ఆవులనే పేరుతో దాడులకు తెగబడుతున్నారు. బీఫ్‌ ఎగుమతులు అంటే ఆవు మాంసమే అనుకొనే వారు ఎందరో ఉన్నారు. అది నిజం కాదు. ప్రధానే ఒక సందర్బంలో, ” బీఫ్‌ వ్యాపారంలో నా జైన్‌ స్నేహితులు కూడా ఉన్నార”ని చెప్పారు. గొడ్డు మాంసం తినేవారిలో హిందువులే ఎక్కువగా ఉన్నారు. బీఫ్‌ ఎగుమతులలో పెద్ద వ్యాపారులందరూ హిందువులే! దేశంలోని ఆరు పెద్ద సంస్ధలలో నాలుగు హిందువులకే చెందినవి కావటం గమనార్హం! వాటిలో ఒకటి హైదరాబాదు సమీపంలోని మెదక్‌ జిల్లా రుద్రారంలోని ఆల్‌ కబీర్‌. ఇది ముస్లిం పేరు అయినప్పటికీ దీన్ని నడిపించేది హిందువులే!అరబ్బు దేశాల మార్కెట్‌కోసం ఆ పేరు పెట్టుకున్నారు.

గోరక్షకుల ముసుగులో దళితులు, ముస్లింలపై దాడులు చేయటాన్ని ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ మధ్య ఖండించటం మీకు తెలిసిందే!అయితే అన్ని దేశాలు అభివృద్ధి పథంలో దూసుకొని వెళుతుంటే, ఇక్కడ మనం ఏమి తినాలో అనే విషయం మీద కొట్టుకొని చస్తున్నాం!నిజానికి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధం చట్టం లేదనుకుంటాను. కేవలం ఆవును ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారు హిందూత్వ వాదులు . బీహార్ లో అదే జరిగింది. ఫలితాలు ఎలా వచ్చాయో మీకు నేను చెప్పనవసరం లేదు. భిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద దేశంలో, ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. మొదట్లో ఈ దేశంలో(ప్రపంచంలో కూడా)ఒకప్పుడు అన్ని జాతులవారూ, కులాల వారూ పచ్చిమాంసాన్నే తినేవారు. నిప్పును కనిపెట్టిన తర్వాతనే కాల్చిన మాంసాన్ని తినటం మొదలుపెట్టారు. జైనులు వచ్చిన తర్వాతే కాయగూరలను పండించి , వాటిని తినటం మొదలు పెట్టాం!పచ్చి మాంసం నుండి కాయగూరల వరకు రావటానికి చాలా శతాబ్దాలు పట్టింది. ఆహారం ఏదైనా అది దైవ స్వరూపమే!నిజానికి ఆవు మాంసం తింటే ఎంత పాపమో చేప మాంసం తిన్నాఅంతే పాపం!ఎందుకంటే చేప దశావతారాలలో మత్స్యావతారం. గోవుకు ఇచ్చిన పవిత్రత గో సంతతికి(ఎద్దులకు) ఇవ్వకపోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ కూడా Gender Injustice ఉన్నదన్నమాట. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఆ దేశ పౌరుల ఆహారపు అలవాట్లమీద ఎటువంటి నియంత్రణలు, ఆంక్షలులేవు. అన్ని దేశాల్లోనూ మతాలున్నాయి, మతాధిపతులున్నారు, పవిత్ర గ్రంధాలున్నాయి, దేవుళ్ళు ఉన్నారు. గోమాంసం గురించిన చర్చ మహాత్మా గాంధీ ఉండగానే వచ్చింది. అప్పుడు అంబేద్కర్, ఆహారపు అలవాట్లమీద ఆంక్షలు పెట్టటం సరికాదన్నాడు. మనదేశంలో కూడా గోమాంసం ఎప్పడినుండో కొందరు తింటున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం మీద దేశం మొత్తం మీద ఇంత చర్చ జరగటానికి కారణం రాజకీయాల నేపధ్యమే.

హిందువుల భావోద్రేకాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే హిందూత్వవాదుల కుయుక్తి దీనికి అసలు కారణం. కుయుక్తి అని ఎందుకు అంటున్నానంటే, అసలు హిందూత్వవాదులు గోమాంసం మీద, గోవధల మీద ఏమంటున్నారంటే –ఆవులను, గోసంతతిని –అవి పాలిచ్చే దాకా, వ్యవసాయానికి పనికి వచ్చేదాకా వాటిని వధించకూడదు. అవి పనికిరాని స్థితికి చేరుకున్న తరువాత వాటిని కబేళాలకు తరలించి వధించవచ్చనేది వారి అభిప్రాయం. ఇందులో నాకు ఏమాత్రం లాజిక్ కనపడలేదు. మనం పవిత్రమైనదని భావించే గోవు , వయసు చేత అది పెద్దదైనంత మాత్రాన దాని పవిత్రత ఎలాపోతుంది?ఇదే వారి ద్వంద్వ నీతి. ప్రభుత్వాలు కూడా పనికిరాని ఆవులను కబేళాలకు తరలించటానికి అనుమతులు ఇస్తాయి. మళ్ళీ ఆహారపు అలవాట్ల దగ్గరికి వద్దాం!శాకాహారం సాత్విక ఆహారమని , దాన్ని తింటే సాత్వికమైన బుద్ధులుంటాయనే వాదనలో ఏ మాత్రం పసలేదు. మాంసాహారాన్ని తినే నా స్నేహితుల్లో కొంతమంది నాకన్నా చాలా సాత్వికులున్నారు. శాకాహారం తినే వాళ్ళలో(తిన్నవాళ్ళల్లో) హింసాప్రవ్రుత్తిగల వాళ్ళూ ఉంటారు. మహాభారతం మొత్తం మీద ద్రోణపర్వంలోనే ఎక్కువమంది చనిపోయారు, ఎక్కువ హింస జరిగింది. పరశురాముడిది హింసా ప్రవృత్తే!అంతవరకూ ఎందుకూ, మనకు తెలిసిన క్రూరమైన నియంత హిట్లర్ శాకాహారి. ఇలా చాలా ఉదాహరణలను చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లను బట్టి మనుషుల ప్రవృత్తిని అంచనా వేయటం తప్పు!మళ్ళీ చెబుతున్నా , ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. మనుష్యులను తినేవాళ్లు కూడా ప్రపంచంలో ఉన్నారని చదువుకున్నాం! ఎవరిష్టం వారిది. కొన్ని దేశాల్లో పాములు, కప్పలు, తేళ్ళు, చేపలు తింటున్నారే!కాదేది తినటానికి అనర్హం?అయితే, ఈ సమాజం నడుస్తుంది నమ్మకాల మీదే కనుక మనం ఇతరుల నమ్మకాలను గౌరవించక తప్పటం లేదు, తప్పదు కూడా!రాజకీయ నాయకులు ప్రతిదానికీ సెక్యులర్ అనే పదాన్ని వాడుతున్నారు!సెక్యులర్ అంటే ఒక మత విశ్వాసాలను ఇంకో మత విశ్వాసాల కొరకు బలిచేయడం కాదేమో!

సెక్యులర్ అంటే మత ప్రమేయంలేని రాజ్యాంగం. అసలు ఆ విధంగా ఆ పదాన్ని చూడటంలేదు. పోనీ, అన్ని మతాలనూ
సమానదృష్టితో చూడటం అనుకుందాం!హిందువులకు మతపరంగా గోవు పవిత్రమైనది. అది వారి నమ్మకం! ఇక వేరే మతాలలో గోవుని తినడం మతవిశ్వాసం కాదుగా? అది అహారపు అలవాటు మాత్రమే కొందరికి. కనుక హిందూ మత విశ్వాసాన్ని గౌరవిద్దాం!గోవధ నిషేదాన్ని, గోమాంసం తినకూడనే నమ్మకాన్ని బలపరుద్దాం!అలాగే ముస్లింలలో పందిని తినడం మతపరంగా తప్పు, అది వారి మత విశ్వాసం!కనుక పందిని తినడం కూడా నిషేధించి వారిని గౌరవిద్దాం. ఈ విషయాలకు ఆధారం కేవలం నమ్మకాలు, విశ్వాసాలు మాత్రమే! మనదేశంలో మతవిశ్వాసాలు ఎక్కువ. సున్నితమైన ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కొన్ని జంతువులను ఆహారంగా వినియోగించరాదనేది చట్టంచేస్తే అందరం పాటించడంలో తప్పులేదుగా! సభ్య సమాజంలో ప్రజా ప్రభుత్వాలు చేసిన చట్టాలను మనమే గౌరవవించకపొతే ఎలా?కేవలం మతసహనాన్ని, మత ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని ఈ అభిప్రాయాన్ని మీ ముందుకు తెచ్చాను. ఈ విశ్వాసాలను గౌరవించటం వలన మతసహనం కూడా పెరిగితే మరింత సంతోషం!ఇంతకీ గోవధ మీద గాంధీ గారు ఏమన్నారో తెలుసుకోకపోతే ఈ వ్యాసం అసంపూర్ణమే అవుతుందని నా అభిప్రాయం!గాంధీ గారు ఏమన్నారో తెలుసుకోవాలంటే , ఈ లింకును చూడండి! లింకు- –http://thewire. in/12170/what-mahatma-gandhi-said-to-those-who-wanted-beef-banned-in-india/ దేశ కాల మాన పరిస్థితుల మీద ఆధారపడి, ఆహార విహారాలు జరుగుతాయని నా ప్రగాఢ విశ్వాసం. మనం జీవించటానికి వేరొక ప్రాణిని చంపటం మంచిది కాదు. ఏదో ఒక ప్ర్రాణి మాంసాన్ని తినకుండా కూడా మనం జీవించగలం. అయితే మనం ఆ ప్రాణిని తింటే అది జీవించలేదు!అదే సింపుల్ లాజిక్. మనం బతుకుతూ మిగిలిన ప్రాణులను బతికిద్దాం!నా అభిప్రాయం ఇదే! LIVE and Let others LIVE!

6 thoughts on “గోమాంసాన్ని ఎందుకు తినొద్దని అటున్నాను ?

  1. చక్కని వ్యాసం..ముసలి జీవాలు చచ్చి పోతాయి.అందికే వాటిని వాటికి సహజ మరణం పొందేవరకు వదిలేయవచ్చు.ఇక ఎదో ఒకటి తినాలి.వ్యక్తులు వారి కి తోచిన,సౌకర్యం గా ఉన్న ఆహారపు అలవాట్లు చేసుకుంటారు.వాటి పై నియంత్రణ సరి కాదు.అనవసరం గా రాజకీయ లబ్ది కొరకు సమస్యలు సృష్టించటం సమర్ధనీయం కాదు .మంచి వ్యాసం..ధన్యవాదాలు, అభివాదాలు సర్

  2. చక్కని వ్యాసం..ముసలి జీవాలు చచ్చి పోతాయి.అందికే వాటిని వాటికి సహజ మరణం పొందేవరకు వదిలేయవచ్చు.ఇక ఎదో ఒకటి తినాలి.వ్యక్తులు వారి కి తోచిన,సౌకర్యం గా ఉన్న ఆహారపు అలవాట్లు చేసుకుంటారు.వాటి పై నియంత్రణ సరి కాదు.అనవసరం గా రాజకీయ లబ్ది కొరకు గొడవలు సృష్టించటం సమర్ధనీయం కాదు .మంచి వ్యాసం..ధన్యవాదాలు, అభివాదాలు సర్

  3. మీరు వ్రాసినది నూటికి నూరు పాళ్ళూ సత్యం. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.బీజేపీ అధికారం లోకి వచ్చిన తరువాత ఈ గోమాంసం విషయం గోరంతలుకొండంతలు చేస్తున్నారు.”బీఫ్” అన పదం కేవలం ఆవు మాంసానికే పరిమితం కాదు. గోమాంసం తినటాన్ని నిషేధించలేదు, గోవధను నిషేధిస్తాం అనటంలోనే అవ్వాళనాటకం బయట పడుతున్నది. వీళ్ళ కుట్ర అంతా ముస్లిములను వేధంచటమే, ఆవు మాంసం నిషేధించటం కాదు.ఇప్పటికీ కేరళలో ఆవు మాంసం తినే హిందువులు ఉన్నారు. ఎండిపోయిన ఆవులను వధ్యశాలకు పంపవచ్చు అని సుప్రీం కోర్టు ఎప్పుడో అన్నది. ముసలి ఆవులను అడవులలో వదిలి వేయాలనటం అర్ధం లేని మాట.వాటిని తోడేళ్ళూ, పులులూ వెంటనే చంపేస్తాయి. ప్రకృతిలో వేల పశుపక్ష్యాదులలో ముసలి జీవాలు చచ్చి పోతుంటవి. ఆవులు కూడా అంతే. వాటిని మనుషులతో పోలుద్దామా? రాజకీయానికి కూడా అర్ధంపర్ధం వుండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *