April 23, 2024

బ్రహ్మలిఖితం – 5

రచన: మన్నెం శారద

నారాయణ సెంట్రల్ జైల్లోంచి బయటకొచ్చేడు.
వచ్చినందుకు అతనికి సంతోషంగానూ లేదు, లోపల వున్నందుకు విచారంగానూ లేదు.
జైలుకెళ్లడం అతనికిది మొదటిసారి కాదు.
రాజస్థాన్ వెళ్లి ఎప్పుడో సెటిలయ్యానని, చాలా ఆస్థి వున్న ఇంజనీరునని చెప్పి ఓ చదువుకున్న అయినింటి పిల్లను పెళ్లి చేసుకొని.. గత చరిత్ర బయటపడి జైలుకెళ్లేడతను. తీగెలాగితే డొంకంతా కదిలింది.
ఒకసారి సినిమా ప్రొడ్యూసరుగా వేషాలిప్పిస్తానని.. చాలా మంది యువతీయువకుల దగ్గర డబ్బు కాజేసి పరారయి పెళ్లికొడుకు వేషం కట్టి ఒక పాతిక దాక వివిధ రాష్ట్రాల్లో పెళ్ళిళ్లు చేస్కున్నాడతను.
దొరికినప్పుడు జాలీగా జైలుకెళ్లడం.. దొరకనప్పుడు అవతారం మార్చడం అతనికి ఆనవాయితీ అయిపోయింది.
జైలు బయటకొచ్చి ఓ కల్వర్టు మీద కూర్చుని బీడీ కాలుస్తూ ఆలోచనలో పడ్డాడతను.
ఇప్పుడే అవతారమెత్తాలి??
పెళ్లికొడుకు గెటప్‌కి తన మొహమింక ఎంతమాత్రం సూట్ కాదు.
చప్పి దవడలు, బవిరి గడ్డం, గుంటకళ్ళు, గారపళ్లు, సవరాలు కట్టే సన్నాసి మొహంలా వుంది తనది. ఈ రూపం ఏ అవతారానికి బాగుంటుందా అని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాదు.
సరిగా అప్పుడు అతని దృష్టి ఎదుట చెట్టు క్రింద కూర్చున్న జ్యోతిష్యుడి మీద పడింది. అక్కడ ఓ పదిమంది దాక గుమిగూడి వున్నారు. రివ్వున ఆకాశంలో హాయిగా ఎగిరే పిట్ట కటకటాల పెట్టెలో కడుదీనంగా వుంది. బాగా పరికించి చూస్తే ఆ కళ్లలో ధైన్యం, ఆ కాళ్లలో పటుత్వం సడలి, సన్నటి వణుకు కనిపిస్తున్నాయి.
అయినా ఎవరూ దాని పరిస్థితి గమనించడం లేదు.
అది కుంటుతున్నట్లుగా బయటికొచ్చి నోటితో ఒక కార్డుని కరచుకుని యజమాని వడిలో పడేసి మళ్లీ అర్జెంటుగా పెట్టెలో దూరుతోంది.
కార్డులో ఏముంటుందో తన ఆశలేమవుతాయోనని అక్కడి మనుషులు ఆశతో చూస్తున్నారు. యజమాని సగర్వంగా కార్డులో విషయం చెబితే భవిష్యత్తు గురించి కలలుగంటూ అతనికి డబ్బులిచ్చి వెళ్తున్నారు.
కొడుకుల చదువులు గురించి, కూతుళ్ల పెళ్ళిళ్ళు గురించి, ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి ప్రతి మనిషికి రకరకాల ఆశలు, ఆందోళనలు, అనుమానాలూ..
నారాయణ బీడి మీద బీడి కాలుస్తూ చిలక జ్యోతిష్యుడి ఆదాయం గురించి ఆలోచిస్తున్నాడు.
సాయంత్రానికి అతను ఓ వంద రూపాయిల చిల్ల పోగు చేసుకున్నాడు.
నారాయణ కళ్లు మెరిసేయి. అతని పెట్టుబడంతా ఒక చిలుక వంద కార్డులు. ఎంతమందొచ్చినా అవే అటూ ఇటూ తిరుగుతుంటాయి. ఒక చోట కదలకుండా కూర్చుని తేలికగా సంపాదించేస్తున్నాడు.
అతను నోట్లో బీది విసిరేసి జ్యోష్యుడి దగ్గరగా వెళ్లి “చాలా మోసం గురూ!” అన్నాడు.
జ్యోతిష్యుడు అతన్నెగాదిగా చూసి “ఏంటి మోసం?” అన్నాడు చిరాగ్గా.
” ఆ చిలక్కి గాని, నీకు గాని జ్యోతిష్యం తెలీదు. పిండాకూడు తెలీదు. దాన్నడ్డం పెట్టుకుని మనుషుల్ని మోసం చేస్తున్నావు” అన్నాడు నారాయణ తెలివిగా.
జ్యోతిష్యుడు పకపకా నవ్వి,” నేను మోసం చెయ్యడం లేదు. ఆ వచ్చే పిచ్చి జనమే మోసపోవాలనుకుంటున్నారు. దానికి నేనేం చెయ్యను. కూటి కోసమేగా కోటి విద్యలు” అన్నడు లేచి గోనె సంచి దులుపుకుని భుజాన వేసుకుంటూ.
“పాపం, వాళ్ళేదో సమస్యలతో బాధపడి భవిష్యత్తు తెలుసుకోవాలని వస్తున్నారు. వాళ్లనిలా దోచుకోవటం మంచిది కాదు”
జ్యోతిష్యుడు చిలక పెట్టెకి తాళమేసి చేత్తో పుచ్చుకుని ముందుకు నడుస్తూ “ఏదో జరుగుబాటు లేని బక్క వెధవని. నా వెంబడి పడ్డావేంటి?” అన్నాడు.
సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఏదో ఉప్పెన వచ్చినట్టుగా రోడ్డంతా జనసందోహంతో నిండిపోయింది.
ముందు నాదస్వరంతో, బాణాసంచా వెలుగులతో జనం బుక్కా చల్లుకుంటూ ఉన్మాదుల్లా నాట్యం చేస్తూ వెళ్తున్నారు. ఆ వెనుక కొన్ని పోలీస్ జిప్సీ వాన్‌లు, దాని వెనుక కొంతమంది నగరంలో ప్రముఖుల కార్లు, ఆ వెనుక టాప్‌లెస్ మెర్సిడీస్‌లో కాషాయరంగు దుస్తుల్లో చెక్కు చెదరని చిరునవ్వుతో జనం అడక్కపోయినా అభ్యం పెడుతూ ఓ వ్యక్తి.. ఆ వెంట మరికొన్ని కార్లు బిలబిలా వెళ్లిపోయేయి.
“ఎవరతను?” నారాయణ గొణుగుతున్నట్లుగా అడిగేడు.
“నువ్వే దేశం నుండొచ్చేవు?” అని వెటకారంగా అడిగేడు జ్యోతిష్యుడు.
“జైలునుండి”
ఈసారి జ్యోతిష్యుడు ఉలిక్కిపడ్డాడు.
“నేనేం మర్డర్లు చెయ్యలేదు. నీలానే కూటికోసం కాసిన్ని పెళ్ళిళ్ళు చేసుకుని దొరికిపోయేను”.
“అలాంటివి చేస్తే జైలు ఖాయం. అటు చూడు ఆ మహానుభావుడు. లంకంత కార్లో ఎంత దర్జాగా వెళ్తున్నాడో. ఏనుగు కుంభస్థలం కొట్టేడు మరి!” అన్నాదు.
నారాయణ అర్ధం కానట్లుగా చూసేడు.
“నీకింకెవరూ లేకపోతే పద. నా గుడిసె దగ్గర మాట్లాడుకుందాం” అన్నాదు జ్యోతిష్యుడు.
నారాయన తలూపేడు.
అతని వెంట నడుస్తూ “నీ పేరేంటన్నా?” అనడిగేడు.
“పేరు దేవుందిలే, రాజని పిలువు” తను గాంభీర్యంగా ముందుకి నడుస్తూ.
*****
తన ప్రయాణానికి కావల్సిన డబ్బు డ్రా చెయ్యడం కోసం బాంక్ కెళ్ళింది లిఖిత. బాంక్ రద్దీగా ఉంది.
ఆ రోజు శనివారం.
లిఖిత విత్‌డ్రాయల్ ఫారం ఇచ్చి టోకెన్ తీస్కుని బెంచి మీద కూర్చుంది. ఒక్కొక్కరూ కేష్ తీసుకొని కదులుతున్నారు.
వాచీ చూసుకుని లిఖిత అసహనంగా.
ఫ్లయిట్‌కి మరో గంట మాత్రమే టైముంది.
“మీరర్జంటుగా వెళ్లాలా?”
లిఖిత అటువైపు చూసింది.
కౌంటరు దగ్గరున్న ఒక బాంక్ ఎంప్లాయీ అడిగింది నవ్వుతూ.
“ఎస్ మాడం!” అంది లిఖిత.
కాష్‌ని బాగ్‌లో పెట్టుకుని తన లగేజ్ తీసుకుని బయటకి రాబోతూ చప్పున వెనుతిరిగి “థాంక్యూ మాడం. థాంక్స్ ఎ లాట్! మీ పేరు?” అంది సభ్యతగా.
“ఈశ్వరి. ఇక్కడ క్లర్కుగా పని చేస్తున్నాను” అందామె నవ్వుతూ.
“నా పేరు లిఖిత. మళ్లీ కలుస్తాను” అంటూ లిఖిత పరిగెడుతున్నట్లుగా వెళ్లి ఆటోని పిలిచింది.
“నేను తీసుకెళ్తాను రా” ఆ గొంతు విని ఆశ్చర్యంగా అటుకేసి చూసింది లిఖిత.
బైక్ మీద వెంకట్ కూర్చునున్నాడు నవ్వుతూ.
“నువ్వా?” అంది లిఖిత ఆశ్చర్యంగా.
“ఏం నేను నేనులా కనబడటం లేదా?” అదోలా మొహం పెట్టి అడిగేడు వెంకట్.
“నాకు నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు. నేను త్వరగా వెళ్లాలి.” అంది లిఖిత.
“తెలుసు. అందుకే వచ్చేను. మీ అమ్మగారు చెప్పేరు పద. ఎయిర్‌పోర్టులో దింపుతాను” అన్నాడు వెంకట్ బైక్ స్టార్టు చేస్తూ.
లిఖితకి అయిష్టంగా అనిపించినా ఆమె ధ్యానమంతా తండ్రి మీదనే వుంది. అందుకే గబుక్కున బైక్ ఎక్కేసింది.
“మీ డీడి సైంటిస్టని చెప్పనే లేదు నువ్వు?”
“నాకు తెలిస్తేగా చెప్పేది?” విసుగ్గా అంది లిఖిత.
“అయిసీ.. మీ ఇంట్లో ఏంటి ఒక్కసారి అన్నీ సెంటిమెంట్స్ వచ్చేసేయి. భర్తకోసం ఆవిడ, తండ్రి కోసం నువ్వు తెగ కంగారు పడిపోతున్నారు” అన్నాడు వెంకట వెటకారంగా.
లిఖిత కోపంగా అతనివైపు చూసి “నువ్వు నన్ను ఎయిర్‌పోర్టులో దింపాలనొచ్చేవా.. లెక నన్నెత్తి పొడవాలంనొచ్చేవా?” అంది సీరియస్‌గా.
“సారీ! జోక్ చేసేను” అన్నాడు వెంకట్ నవ్వుతూ.
లిఖిత నవ్వలేదు.
అతని కేరక్టర్ గురించి ఆలోచిస్తుంది. నిన్న తనని నిష్టూరం చేసి చాలా ఫోర్సుగా వెళ్లిన వ్యక్తి తిరిగి ఎందుకు వెంటనే వచ్చినట్లు.
మాట్లాడుతూనే తనని వెన్నుపోటు పొడవాలనా?
లేక నిజంగా అతన మీద ప్రేమ చంపుకోలేకనా?
“నేను నీతో రానా? “అనడిగేడు వెంకట్ తిరిగి.
“థాంక్స్. నేనే శ్రీలంక వెళ్లడం లేదు. వెళ్ళేది హైద్రాబాదు. తోడక్కర్లేదు” అంది.
“నీకసలు నా మీద ప్రేమే లేదు. ఉంటే నన్నొద్దనవు.”
“వెంకట్! అవతల టైమయిపోతున్నది. నాకు ఫ్లయిట్ మిస్ చెయ్యకు. నేనాలస్యం చేస్తే డేడి వెళ్లిపోతారు” అంది ఆందోళనగా.
“నువ్వనవసరంగా ఆందోళన పడకు. నేను నిన్ను ఫ్లయిటెక్కిస్తాగా!” అన్నాడు వెంకట్ కొద్దిగా స్పీడు పెంచుతూ.
లిఖిత మౌనంగా కూర్చుంది
వెంకట్ కూడా మరేం మాట్లాడలేదు.
కొంతదూరం వెళ్లి ఒక నిర్మానుష్యమైన స్థలంలో బైక్ సడెన్‌గా ఆగిపోయింది.
లిఖిత గుండె నిజంగానే దడదడలాడింది.
“ఏమయింది?” అంది కంగారుగా.
వెంకట్ బైక్‌ని చాలాసార్లు స్టార్ట్ చెయ్యాలని విఫలయత్నం చేశేడు. కాని బైక్ స్టార్ట్ కాలేదు.
“సారీ లిఖితా! దీనిక్కూడా నువ్వెళ్లడమిష్టం లేదు” అన్నాడదొలా నవ్వుతూ.
లిఖిత అతన్ని నివ్వెరపోతూ చూసి “నేనెంతో టెన్షన్ ఫీలవుతుంటే నువ్వు చాలా చూల్‌గా నవ్వుతున్నావే. నా ప్రయాణం పాడుచెయ్యాలని వొచ్చేవు కదూ నువ్వు!” అంది.
వెనక్ట్ పరిహసంగా నవ్వి “నువ్వేమన్నా అనుకో డార్లింగ్. ఇప్పుడన్నా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నానని!” అన్నాడు బైక్‌కి జారబడి.
సరిగ్గా అప్పుడే ఆమె వెళ్లదలుచుకున్న విమానం టేకాఫయి ఆకాశంలోకి ఎగురుతూ కనిపించింది.
లిఖిత అతని వైపసహ్యంగా చూసింది.
“అమ్మ నన్ను కారులో వదులుతానంటే నేనే వద్దన్నాను. ట్రెయినయితే ఆలస్యమవుతుందని ఎంత తొందర్గా వెళ్లి ఆయన్ని చూద్దామా అని ఆశపడ్డాను. నువ్వు కావాలని ఇలా చేస్తావనుకోలేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో. ఆడదాన్ని ఏడిపించిన వాడెవడూ ఈ భూమ్మీద బాగుపడలేదు. పడడు కూడా.” అంది ఉక్రోషంగా.
ఈసారి నిజంగానే ఆమె కళ్లలో నీళ్ళొచ్చేయి.
*****
ఆమెనాస్థితిలో చూసి వెంకట్‌కి చాలా ఆనందం కలిగింది. దాన్ని పైకి కనపడకుండా ప్రయత్నం చేస్తూ “అరె! ఏదో జరిగినట్లేడుస్తూ శాపాలు పెడతావేంటి, నిన్ను సాయంత్రం గోదావరి ఎక్కిస్తానులే. ఒక్క రాత్రిలో మీ డేడిని చూడలేనట్లుగా వర్రీ అయిపోతావేంటి?” అన్నాడు.
“నేనెందుకు వర్రీ అవుతున్నానో నీకెలా చెబితే అర్ధమవుతుంది. నాకు తండ్రి వున్నాడని , కాస్త ఆలస్యం చేస్తే నేనతన్ని చూడలేనేమోనని ఎంతో కంగారుగా బయల్దేరేను నేను. నా ప్రయత్నాన్ని భగ్నం చేసాడా దేవుడు. నేనిక ఆయన్ని చూడలేనేమో!” అంది లిఖిత బుగ్గలమీద జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ.
వెంకట్ ఆమె కన్నీళ్లు తుడిచే నెపంతో ఆమె దగ్గరగా వచ్చి కర్చీపుతో తుడిచే ప్రయత్నం చేయబోయేడు. లిఖిత వెనక్కి జరిగింది కోపంగా.
“నీకు నా మీద బాగా కోపం వచ్చినట్లుదంది. ఏం చేయను. నేను నిన్నంత కోపంగా వెళ్లిపోయి నిన్నసలు చూడకూడదనుకున్నాను. రాత్రి ఒక్క క్షణం నిద్ర పడితే ఒట్టు. అందుకే తిరిగొచ్చెసేను. నిన్ను వదలి వుండలేకనే బైక్ పాడయిందని నటించేను. నువ్వింత సీరియస్సయిపోతావనుకోలేదు”.
లిఖిత కళ్లు కోపంతో ఎర్రబడి పోయేయి.
“అంటే… బైక్‌కి నిజంగా రిపేర్ రాలేదా?”అంది నివ్వెరపోతూ.
“చెబుతున్నాగా! నిన్నొదిలి వుండలేక”
లిఖిత మాట్లాడలేదు. కోపాన్ని పళ్లబిగువున నొకి “రైల్వే స్టేషన్‌కి పద. ఇప్పుడే ట్రెయినుంటే అదెక్కి ముందు విజయవాడ చేరతాను. అక్కణ్ణుంచి ఎలాగోలా వెళ్తాను” అంది.
“అవస్థ పడతావేమో!” అన్నాడు వెంకట్ బైక్ స్టార్ట్ చేస్తూ.
లిఖిత జవాబు చెప్పలేదు.
ఆమె మనసంతా తండ్రి మీదనే వుంది.
తను వెళ్లేవరకన్నా తండ్రి బయలుదేరకుండా వుంటే బాగుండును. వెంకట్ మాటి మాటికి బైక్‌కి సడెన్ బ్రేక్స్ వేసి తన మీదికి ఒరుగుతున్నాడని గ్రహించి కూడా ఓర్చుకుంది లిఖిత.
ఆ బైక్ రైల్వే స్టేషన్ చేరుకుంది.
విజయవాడ వెళ్ళే ఎక్స్‌ప్రెస్ ట్రెయినొకటి వుందని టికెట్ తీసుకుంది. ప్లాట్‌ఫారం టికెట్ తీసుకొని వెంకట్ కూడా ట్రెయిన్ దగ్గరకొచ్చేడు. ఆమె బాగ్‌ని సీట్లో పెట్టి క్రిందికి దిగి “వెంకట్, నీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను” అంది.
వెంకట్ మొహం విప్పారింది.
“ఏంటి నన్ను ప్రేమిస్తున్న సంగతా?”
లిఖిత అతనివైపు నిరసంగా చూసింది.
“కొంతకాలం టైమిస్తే ప్రేమించేదాన్నేమో కాని.. నువ్వా అవకాశం ఇవ్వలేదు నాకు. నిన్ను ఒక మంచి స్నేహితుడిగా గౌరవించేను. అభిమానించేను. కాని.ఈ రోజు నుండి నా మనసులో నీకా స్థానం కూడా లేదు. మగాడికుండాల్సిన లక్షణాలు నీకు లేకపోయినా మనిషికుండాల్సిన లక్షణాలు యిన్నాళ్లు నీకున్నాయని నమ్మడం వల్లనే నిన్ను గౌరవించేను. కాని… ఈ రోజుతో నా దృష్టిలో నువ్వు రెండు కాళ్ళున్న ఒక నికృష్ట నీచ జంతువువి. నేను నిన్ను అనేక విషయాల్లో ఒక స్నేహితురాలిగా ఆదుకున్నాను. కాని. నువ్వన్నీ మరిచిపోయి నాకు బైక్ రిపేర్ వచ్చిందని అబద్ధమాడి ఫ్లయిట్ అందకుండా చేసేవు. నీ బుర్ర చెడిపోయింది. అది కుళ్ళిపోకుండా ఏ డాక్టరుకన్నా చూపించుకో. మనిషిగా బతకడానికి ప్రయత్నించు..”
సిగ్నల్ ఇవ్వడంతో లిఖిత గబుక్కున రైలెక్కేసింది. లిఖిత అన్న మాటలు విని వెంకట్ దిగ్భ్రమ చెందేడు.
“ఒక ఆడదానికి ఇంత పొగరా? చూస్తా దీని సంగతి అనుకుంటూనే “నీకు నిజంగానే చాలా కోపం వచ్చేసినట్టుంది. సారీ చెబుతున్నాగా” అన్నాడు పైకి.
లిఖిత అయిష్టంగా మొహం తిప్పుకుంది.
రైలు కదిలింది.
వెంకట్ రైలుతో పాటుగా కదిలి “లిఖితా! జాగ్రత్త. వెళ్లగానే ఫోను చెయ్యి” అన్నాడు.
లిఖిత జవాబు చెప్పలేదు.
“ప్లీజ్! కొంచెం మనీ వుంటే ఇస్తావా? ఇప్పుడింటికి తిరిగెళ్లడానికి నా బైక్‌లో పెట్రోలు కూడా లేదు.” అన్నాడతను స్పీడందుకున్న రైలుతో పరిగెత్తుతూ.
లిఖిత పర్సులోంచి వెయ్యి రూపాయిలు తీసి అతనివైపు విసిరింది.
వెంటనే రైలు వేగమందుకొంది.
వెంకట గబగబా ఆ నోట్లు ఏరుకొని చూసేసరికి రైలు ప్లాట్‌ఫారాన్నొదిలేసింది.
డబ్బు జేబులో కుక్కుకుని తిన్నగా ఒక బార్‌కెళ్లి కూర్చున్నాడు. పెగ్ మీద పెగ్ గొంతులోకి జారుతున్న కొద్ది అతనికి లిఖిత మీద ద్వేషం.. పగ పెరిగిపోసాగాయి.
అతనిలోని వికృతమైన మనిషి బాహాటంగా బయటికి రాసాగేడు.
“చూస్తాను దీని సంగతి. ఇది నన్ను మగాణ్ణి కాదంటుందా.. మనిషినే కాదంటుందా?” అనుకున్నాడు.
ఆ క్షణం అతన్ని ఆమె ఎన్ని విధాల తన పరిధిని దాటి కూడా ఆదుకున్నదీ మరచిపోయేడూ. తన తల్లికి జబ్బు చేసినప్పుడు హాస్పిటల్లో ఫీజు కట్టలేని స్థితిలో తనుంటే డబ్బు తీసుకొని ఆమె హాస్పిటల్‌కి పరిగెత్తుకొచ్చిన సంఘటనగాని, , తనకి ఫీజుకు కట్టి చదివించిన సంగతి కాని, చివరికి తల్లి చచ్చిపోతే ఒంటరయిపోయిన అతన్ని ఊరడించి ఆదుకున్న సంగతి కాని అతనికిప్పుడేమీ గుర్తులేవు. రావు కూడా!. మీదుమీరి ఆమే అతని జీవితాన్ని నాశనం చేసినంతగా ఫీలయిపోతున్నాడతను.
లిఖితని ఎంతర్జంటుగా నాశనం చేసేస్తే , అంత అతనికి మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతున్నాడు కూడా.
ఒక మనిషికి అన్నం పెట్టి ఆదరిస్తే అదెంత విషంగా మారగలదో తెలీని లిఖిత మాత్రం రైల్లో తండ్రి గురించి ఆలోచిస్తూ ప్రయాణం చేస్తోంది.
ఆమె జీవితాన్ని ఏ విధంగా కాటు వెయ్యాలా , ఆమెనెలా అల్లరి చెయ్యాలా అని ఆమె డబ్బుతో తాగిన మందుతోనే పథకాలు వేస్తూ బయటకొచ్చేడు వెంకట్.
బార్ కెదురుగా ఒక చిన్న గుడి వుంది.
ఆ గుడిలోని దేవతకి చెంపలేసుకొని దణ్ణం పెట్టుకున్నాడు తూలుతూ.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *