March 29, 2024

మాయానగరం – 34

రచన: భువనచంద్ర

మూడు హెచ్చరికలు వచ్చాయి మిస్ శోభారాణి బియ్యస్సీకి. అలాగే మిసెస్ మాధవీరావుకి కూడా మూడు వార్నింగులు వచ్చాయి. సుడిగాలిలో ఎండుటాకులా వణికిపోయింది శోభ.
“అక్కా.. ఇది చూడు ” ఏడుస్తూ మొదటి ఆకాశరామన్న ఉత్తరాన్ని మాధవికి ఇచ్చింది.
“కుమారి శోభారాణి! నువ్వూ, మీ డైరెక్టర్ గారూ చేస్తున్న హడావిడి గమనిస్తూనే వున్నాం. ఆ శామ్యూల్ గాడో పెద్ద వెధవ. వాడు నిన్ను ముగ్గులోకి దించడానికే నిన్ను ‘సహాయ బృందానికి చీఫ్ ‘ గా నియమించాడు. నువ్వో అనాధవనీ, నీకు దిక్కూమొక్కు ఎవరూ లేరని నాకు తెలుసు. సామదానభేద దండోపాయాలు కొన్ని ఆల్రెడి నీ మీద ప్రయోగించాడు . వాడేం చేసినా నీ కోసమే. అలా అని జీవితాంతం నిన్ను అంటి పెట్టుకొని ఉంటాడనుకోకు. నిన్ను ఫుల్ గా వాడుకొని ఎంగిలి విస్తరాకుని బయటకు పారేసినట్టు నిన్ను విసిరి పారేస్తాడు. నేను నీ శ్రేయోభిలాషిని. నువ్వు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం. కళ్ళు తెరుచుకొని చుట్టు చూస్తే నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేవాళ్ళు నీకు కనపడతారు. ఆ కనపడేవాళ్ళల్లో ఓ యువకుడు వున్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం విజ్ఞుల లక్షణం. నువ్వు చదువుకున్నదానివి. కానీ అమాయకురాలివి. లోకంలో ఎవరేనా అమాయకులతో ఆడుకోడానికి ట్రై చేస్తారే కానీ అభయ హస్తాన్ని ఇవ్వరు. ప్రత్యేకంగా ఆ అమాయకులు ఆడవాళ్ళు అయినప్పుడు . నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం వుంది. నీ జీవితం ముళ్ళబాట మీద కాకుండా పూలబాట మీద సాగాలని కోరుకునే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే. అందుకే నిజాన్ని గ్రహించు. శామ్యూల్ గాడి దురుద్దేశాల్ని గమనించు. ఇప్పటికే మీ స్కూల్లో చాలా వదంతులు వున్నాయి. ఆ పుకార్లు గనక షికార్లు మొదలెడితే ఇహ జన్మలో నీకు పెళ్ళి కాదు. ఇది సలహాగా తీసుకొన్నా ఓ.కే. హెచ్చరికగా తీసుకొన్నా ఓ.కే. నిన్ను నిన్నుగా ప్రేమించేవాడిని గనక నువ్వు గుర్తించగలిగితే , నీ జీవితం అద్భుతంగా వుంటుంది. లేకపోతే అధోగతి.
ఇట్లు
నీ శ్రేయోభిలాషి
ఆకాశ రామన్న.
చదివి ఓ నిమిషము సీరియస్ గా ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఆలోచించి ఆ తరవాత పకపక నవ్వింది మిసెస్ మాధవీరావ్.
“ఎందుకు అక్కా నవ్వుతున్నావ్? ” అయ్యోమయంగా అడిగింది శోభ.
“ఎందుకా.. ఇరవై ఒకటో శతాబ్ధంలో కూడా ‘ఆకాశరామన్న’ లు ఇంకా బ్రతికే వున్నారంటే నవ్వురాదూ? అమ్మాయి.. ఇది ఎవడో పని గట్టుకొని రాసిన వుత్తరం. దీని గురించి నువ్వు భయపడాల్సిన పని లేదుగానీ, ఆలోచించాల్సిన పని ఉంది. నువ్వు శామ్యూల్ స్కూల్ ని వదిలేస్తే లాభం ఎవరికి? రెండోది నిను ప్రాణం కన్నా ప్రేమించేవాడు ఎవడు? ఒకవేళ ఉంటే వాడికీ యీ ఉత్తరానికి సంబంధం ఏమిటి? వాడు యీ ఉత్తరం రాసి నిన్ను శామ్యూల్ నుంచి రక్షించాలనుకుంటున్నాడా? లేక శామ్యూల్ మీద అనుమానం నీలో పుట్టించి తను లాభపడాలనుకుంటున్నాడా? టెన్షన్ పడాల్సిన పని లేదు. మెల్లగా ఆలోచిద్దాం. మనసుని మాత్రం కుదుట పరచుకో ” ధైర్యం చెప్పింది మాధవి.
బయటకి ధైర్యం చెప్పినా ఆమె మనసు మాత్రం ఏదో అనర్ధం జరుగుతుందని భయపడుతూనే వుంది. శోభని ప్రాణంగా ప్రేమించేది ఎవరూ? ఆమెకి అసంకల్పితంగా బోసు గుర్తొచ్చాడు. అవును.. ఎంతమంది చుట్టూ వున్నా అతని కళ్ళు శోభనే చూస్తూ వుంటాయి. ఆ కళ్ళలో ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తూనే వుంటుంది… శోభని చూసినప్పుడల్లా. అయితే అతనీ ఉత్తరం రాసి వుండడు. ఎవరో శోభకి రాశారు. బోస్ మీద శోభకి అనుమానం కలిగించడానికి. దాని వల్ల ఎవరికి లాభం.. శామ్యూల్ కా? అయితే శామ్యూల్ తనని తాను కించపరచుకుంటూ శోభకి ఆకాశరామన్న ఉత్తరం ఎందుకు రాస్తాడు? రకరకాలుగా ఆలోచిస్తోంది మాధవి.
“అదేంటక్కా.. టెన్షన్ పడాల్సిన పనిలేదని నాతో చెప్పి నువ్వు టెన్షన్ పడుతున్నావు? ” అయోమయంగా అన్నది శోభ.
“ఇది టెన్షన్ కాదమ్మా.. జాగ్రత్త. ఉత్తరం ఎవరు రాసినా ఎందుకు రాసినా , నీ గురించి నేను జాగ్రత్తలు తీసుకోవాలిగా. జాగ్రత్తలు చెప్పడమే కాదు… జాగ్రత్తలు తీసుకోవడం నా బాధ్యత. ” అనూనయంగా అన్నది మాధవి.
ఆ మరుసటి రోజునే మాధవికి ఓ హెచ్చరిక వచ్చింది.
“మారేజీ కానీ మిసెస్ మాధవీ రావ్ ! నీది చాలా జాలి గుండె. పాపం గుడిసెల వాళ్ళ కోసం ఎంత పాటు పడుతున్నావో! హాయిగా ఎక్సైటింగ్ ప్రేమ కథలూ నవలలూ రాసి ‘నవలా రాణి ‘ వనిపించుకున్న నువ్వు , పిచ్చి జర్నలిజంలోకి ఎందుకొచ్చావమ్మా? ఏం వొరుగుతుందని? మహా అయితే రిక్షావాళ్ళ పెళ్ళాల చెమట కంపో, మురికి కంపో నీకు అంటుకుంటుంది. అంతకు మించి జరిగేదేముంది? గుడిసెల వాళ్ళ చావుకి కారణం కలరా కాదని, కల్తీ సారా అని గొప్ప గొప్ప వాళ్ళందరికీ రిపోర్ట్ ఇచ్చావు. ఏం జరిగింది? ఏ పేపర్ వాడు నీ మొర విన్నాడు? ఏ ఛానల్ వాడు నిన్ను కూర్చోబెట్టి ‘నిజ నిర్ధారణ ‘ చేసే ప్రయత్నం చేశాడు?
జనాలకి కావల్సింది కన్నీళ్ళూ కష్టాలూ కావు. అవి ఎప్పుడు కింది వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి వుంటూనే వున్నాయి. జనాలకి కావల్సింది రెడిమెడిజం . లక్ష తప్పులు చేసినా, ఒక్క బ్రాంది ఫుల్ బాటిల్ ఇస్తే ఆ తప్పులన్నీ గాలికి కొట్టుకుపోతాయి.
అసలీ విశాల భారతదేశంలో నిజమైన, నిఖార్సైన రాజకీయనాయకుడున్నాడా? పోనీ జనాల కష్టాల్ని యధాతధంగా చూపించి ప్రభుత్వాల్ని ప్రశ్నించే దమ్మున్న ఛానల్సు వున్నాయా? ఉన్నాయా ఎక్కడా? ఏ రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రీ నెమ్మదస్తులో కొద్దో గొప్పో మానవత్వం ఉండే వాళ్ళు వున్నప్పుడు. అదీ, టఫ్ కారెక్టర్స్ మంత్రులుగా వుండే చోట వీళ్ళ నోరు పెగులుతుందా?
ఓ పెళ్ళి కాని శ్రీమతి! ఇవన్నీ నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శోభలాంటి అనాథని దగ్గరకు తీసుకొని , తోబుట్టువుగా నిన్ను నువ్వు భావించుకొని వారికి పెద్ద దిక్కుగా వుండు. కాదనం సరి కదా , ఆనందిస్తా. ఏ పెళ్ళి కాని ఆనందరావు లాంటి వాడికో కాళ్ళూ వేళ్ళూ విరిగితే సేవలు చెయ్యి. అసలే కాదనం. జనాలు కలరాతో చచ్చినప్పుడో, తాగి చచ్చినప్పుడో, నువ్వూ నీ కొంచం ‘బలగం తో ‘ వంటలూ వార్పులు లాంటి సహాయ కార్యక్రమాలు చేశావు చూడు, నిరభ్యంతరంగా చేసుకో, కావాలంటే లక్షో, రెండు లక్షలో చందా కూడా ఇస్తాము. కానీ…. కొరివితో అంటే కంప్లైంట్లు ఇవ్వడమనే కొరివితో మాత్రం తలదువ్వుకోవద్దు. హాయిగా నీ బ్రతుకు నువ్వు బ్రతికినన్నాళ్ళు మేమూ నీ శుభాన్ని కోరతాం. కాదని పాత పద్ధతినే ఎంచుకున్నావనుకో…..
చెప్ప…
ఇట్లు…
ఆకాశరామన్న.
రెండూ సేం ‘ఆకాశరామన్న ‘ వుత్తరాలైనా, హాండ్ రైటింగ్ వేరని ఉత్తరం చూడగానే గుర్తించింది మాధవి. రాసినవాడెవడో గానీ చాలా వివరాలు సేకరించి రాశాడు. అంటే అంబ్జర్వేషన్ చేస్తూనే వుండి వుండాలి. తను ఇన్వెస్టిగేట్ చేయడమూ, అసలు విషయాన్ని బయటకు లాగి పబ్లిక్ చేసే ప్రత్నాలు చేయడం వాళ్ళకి నచ్చలేదు. ఒక్క విషయం స్పష్టం .. అటు శోభ విషయం లోనైనా , తన విషయం లోనైనా సెంటర్ పాయింటు గుడిసెల సిటీయే!
ఇప్పుడేం చెయ్యాలి? తోక ముడుచుకొని పారిపోవడం బీరుల లక్షణం. పోనీ, ఎంతకైనా తెగించి ఎదురుకుంటే ఏం జరుగుతుంది? ఉపన్యాసాలతోటో, మాటలతోటో, చివరకి ప్రాణత్యాగంతోటో గుడిసెల వాళ్ళు మారుతారా?
గతపు లెక్కలు తవ్వితే, కనీసం కల్తీసారా , కల్తీ కల్లు వల్ల చావులు అనేకసార్లు జరిగాయి. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా తాగడం మానలేదు. సరి కదా, గత పదేళ్ళ కన్నా యీ సంవత్సరపు ఆదాయం పది రెట్లు పెరిగింది. చావులూ అలానే పెరిగాయి. ప్రభుత్వం ఎన్నో ఎన్నో పధకాలని పేదవాళ్ళ కోసం ప్రవేశ పెట్టింది. కానీ “ఇదిగోనండీ, యీ పధకాలన్నీ మీ కోసమే.. ఇదిగో… ఇలా చేస్తే యీ లాభం పొందుతారు, ” అని వాళ్ళకు అసలు చెప్పేదెవరు? ఆ లాభం పొందే దళారీలు మాత్రం వీలున్నంత వాళ్ళు మింగి, వేలు ముద్రలు మాత్రం వీళ్ళ చేత వేయిస్తారు. ఇహ బాంకు లోన్ల కథ మరోటి. అందులో అటు బాంకర్లూ, ఇటు వీళ్ళు కూడా ( కొందరు మాత్రమే) పండిపోయినవాళ్ళే! పండిపోని పచ్చి ఆకులు మాత్రం నానా క్షోభ పడాల్సిందే! ‘ఉన్న వారికి ‘ ఎంత ‘ఉందో ” కూడా తెలుసుకోకుండా వేలకోట్లు అప్పులిచ్చి ‘ రైటాఫ్ ‘ చేసే బాంకర్లే , పేదవాడు పదివేలు అప్పు తీర్చకపోతే, వాడ్ని వాడి గుడిసెని కుండనీ చట్టీనీ కూడా ‘ జప్తు ‘ చేసి అందినంత వసూలు చెసుకుంటారు.
కాకుల్ని కొట్టి గద్దల్ని మేపడం పరమ పవిత్రమైన ప్రజాస్వామ్య దేశంలో ఆనవాయితి.
అందుకే, రక్తాన్ని పీల్చి పిప్పి చేసే ‘ మైక్రో ఫైనాన్సులు ‘ వక్కంత వడ్డీని ‘వెండి కొండ ‘ గా మార్చే చమన్ లాల్ లు ఏరోజుకారోజు ‘దీనజన ప్రజా బంధువు ‘ ల అవతారాలెత్తుతున్నారు.
ఇదంతా మిసెస్ మాధవీరావ్ లో రగులుతొన్న ఆలోచన మంట. ఏం చెయ్యాలి? ఇదే ప్రశ్న ఇతింతై వటుడింతై లాగా ఎదిగి ఎదిగి ఆకాశాన్నాక్రమించింది.

*************************

కొందరు ఎంతో అర్ధమయ్యారు అనుకుంటాం. సడన్ గా ఓ షాకు తగులుతుంది. “వీళ్లసలు మనమెరిగిన వాళ్ళేనా?” అని ఆ షాకులోనే వుంది నీరజ. మదాలస తనకి పూర్తిగా అర్ధమయ్యిందనే ఆ పిల్ల అనుకొంది.
ఎప్పుడో, ఆ రోజున , “పోనీ అన్నయ్యతో వెళ్ళి రాకూడదూ ” అన్న రోజున వదిన ఏడ్చిన ఏడుపు నీరజని నిశ్చేష్టురాలిని చేసింది. ఆ క్షణం నుంచే మదాలస మైనం శిలలాగా మారిపోయింది. తన పని తాను చేయడం తప్ప ఎవరితోనూ ఉలకదు పలకదు. ఆఖరికి అత్తగారూ, అయాచితుల సుందర రామమూర్తి తల్లి అయిన ‘ శృత కీర్తి ‘ కూడా కోడలితో మాట్లాడాలంటే భయపడిపోతోంది.
అసలెందుకా భయం. మదాలసేం గయ్యాళి కాదు. కానీ, అయాచితుల సుందర రామమూర్తి కూడా భయంతోనే ‘గమ్మున ‘ వుంటున్నాడు. అతనికి తను చేసిన వ్యాఖ్యలు అనుచితమని , చాలా అనవసరంగా ‘నోరు ‘ పారేసుకున్నాననీ అర్ధమయ్యింది. అయినా క్షమార్పణ అడగలేని ‘భర్త ‘ రికం.
ఇరుగుపొరుగు వాళ్ళకి కూడా వాళ్ళూ ఆశించిన ‘ఆనందం ‘ కరువైంది. మదాలస ప్రవర్తన ‘చెడ్డది ‘ అని నిరూపించబడితే హాయిగా అవాకులు చవాకులు పేలడానికి ఎంతో అవకాశముండేది. మొగుడేమో సన్నాసిలాగా ఆ విషయమే ఎత్తడాయే. నోటి దురద వున్న శృతకీర్తి కూడా సైలెంటైపోయే. ఇహ చేసేదేముంది!
“వదినా ” పిలవలేక పిలవలేక ధైర్యంగా పిలిచింది నీరజ.
“ఏమిటి ” అన్నట్టు కళ్ళెత్తి నీరజని సూటిగా చూసింది మదాలస.
ఆ చూపు కఠినంగా లేదు. అలాగని మెత్తగానూ లేదు. ఆ చూపులో అసహ్యం లేదు, అలాగే ప్రేమా వాత్యల్యమూ కూడా లేవు. ఏ భావానికి అందనంత అతీతంగా ఆ చూపుంది.
“నువ్వు అదివరకట్లా మాట్లాడవా? ” బెరుగ్గా అడిగింది.
“అమ్మా.. ఒక్క మాటతో చచ్చిపోయేవాడిని బ్రతికించవచ్చు. ఒక్క మాటతో మనిషి హృదయాన్ని నిట్టనిలువునా నరికేయవచ్చు. ప్రతి మాటకి అర్ధమూ, పెడర్ధమూ కూడా వుంటుంది నీరజ. అర్ధం చేసుకోమని అనను. పెడర్ధాలు తీసే అవకాశం ఎందుకివ్వాలి? నీరజ.. యీ లోకంలో కోట్లానుకోట్ల జీవులున్నాయి… మనిషి కాక. అవేవీ మాట్లాడవు. వాటికుండే భావాల్ని అనేక విధాలుగా ‘వ్యక్తపరుస్తాయి ‘ అంతే. మాట్లాడవు. మాటలతో వాటికి పని లేదు. ఏదీ మరోదాన్ని బానిసగా చూడదు. ఏదో మరోదాని మీదా ఆదిపత్యం చలాయించదు. అందుకే నా మానాన నేనుంటున్నాను. ఎవరి దారికీ అడ్డు రాను. ఎంతైనా పరాయిది ఎప్పుడూ పరాయిదే. ఇంగ్లీషులో ఓ మాటుంది. ‘బ్లడ్ ఈజ్ తిక్కర్ థాన్ వాటర్ ‘ అని ‘నీటి కంటే రక్తం ఎప్పుడూ చిక్కనే ” చెప్పదలుచుకున్నదంతా ఒకేసారి చెప్పేసి నిట్టుర్చి , పుస్తకాలు తీసుకొని బయట కెళ్ళిపోయింది మదాలస.
అత్తగారు అంతా విన్నది. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఆ రోజు “ఏమిటీ ఏడుపులు… ఎవరు చచ్చారని ” అనడిగిన రోజున మదాలస ఏడుస్తూనే నిప్పులు కురిసే కళ్ళతో ఒక్క చూపు చూసింది. ఆ క్షణం ఆమెకే అర్ధమైంది తన తప్పు.
తెగే దాకా లాగడం కూడదన్న మాట చాలా గొప్పది. ఒక్కోసారి తెగాక , ఇక చేసేదేమీ వుండదు. తెగిందాన్ని అతికించినా , అది అతుకే కానీ సహజంగా వుండదు.
*******************
మాధవి గొప్ప రచయితే కాదు.. ఓ గొప్ప టీచర్. ఆమె బి.ఈ.డీ . లు ఎం. ఈ.డీ. లు చెయ్యలేదు కానీ, బోధించడంలో ఆమెకో నేర్పరితనం ఉంది. ఆనందరావు ఇచ్చిన పుస్తకాలకి తోడు తనూ కొన్ని నిఘంటువుల్లాంటి పుస్తకాలు కొని మదాలసకిచ్చింది. తనే కొన్ని సబ్జెక్ట్ లు బోధించడం మొదలెట్టింది.
మదాలస చాలా మంచి గ్రాహకురాలు. చెప్పింది చెప్పినట్టు ఇట్టే పట్టెయ్యడం ఆమెకి పుట్టుకతో వచ్చిన విద్య. ఒక మంచి స్టూడెంటు దొరికితే మంచి టీచర్ కి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందపడుతోంది మాధవి.
మదాలసకు పోనూ పోనూ జ్ఞానతృష్ణ పెరిగింది. పరీక్షకి కావాల్సింది చదివేశాక మాధవికి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించి ఎంతో తెలుసుకుంటోంది.
” మాధవక్కా నిన్నటి దాకా నిజంగా నేనున్నది రాతి పంజరంలోనే. జీవితంలో మొగుడూ, పెళ్ళి, అత్తవారింట్లో మంచిపేరు తెచ్చుకోవడం.. ఇదే స్త్రీకి ముఖ్యమైనవి అనుకున్నాను. ఇప్పుడు అర్ధమౌతోంది .. నేనెంత పిచ్చితనంలో వున్నానో ” అన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *