April 23, 2024

శుభోదయం – 12

రచన: డి.కామేశ్వరి

..

పేపర్లో ప్రకటన పడిన రెండో రోజున రాధాదేవి ప్రకటనలో ఇచ్చిన అడ్రసు వెతుక్కుని రాధాదేవి యింటికి వచ్చాడు ఆటో డ్రైవర్.
రాధాదేవి అతను వచ్చిన పని చెప్పగానే ఆనందంతో తబ్బిబ్బురాలయింది. అతను చెప్పిన వివరాలు విని అతన్ని వెంటపెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అతనిచ్చిన వివరాలు పోలీసు ఇనస్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. అతను ఆ రోజు రేఖను ఎవరో అతను తీసుకెడ్తుంటే మామూలు పాసెంజర్లనుకుని ఏమీ పట్టించుకోలేదు. ఆఖర్న ఆ యిల్లు వచ్చాక “యిదేమిటి యిక్కడికి తీసుకొచ్చారు” అంటే , అతను “ప్రైవేట్ నర్సింగ్‌హోంలో జాయిన్ చేశారు, లోపలికి వెళ్లి చూడండి” అనడం మాత్రం విన్నాడు గాని అప్పుడేం పట్టించుకోలేదట. ఆ తరువాత మర్నాడే అతను చెల్లెలి పెళ్లికి వూరెళ్ళి ఈ రోజే వచ్చాడు. ఆటోస్టాండ్‌లో తక్కిన డ్రైవర్లందరూ పేపర్లో పడిన ప్రకటన చూసి ఎవరై ఉంటారా అని చర్చించుకుంటూంటే, విని కుతూహలంగా సంగతేమిటని అడిగాడు. రేఖమీద జరిగిన అత్యాచారం అంతా విని పేపర్లో పడిన ఫోటో చూడగానే అతనికి చటుక్కున గుర్తువచ్చింది ఆ రోజు ఆటోలో ఆ అమ్మాయి ఎక్కిన వైనం. వివరంగా వార్తలు చదవగానే పోలీసులు రాధాదేవి అనుమానితురాలని ప్రకటించడం, రాధాదేవి పర్సనల్‌గా యిచ్చిన ప్రకటన అన్నీ చదవగానే అతని అనుమానం ధృవపడింది. పోలీసులకి చెప్పేముందు రాధాదేవితో మాట్లాడాలని నిర్ణయించుకొని ఆమె ఇంటికి వచ్చాడు. రాధాదేవి అతని సహృదయతని, ధైర్యాన్ని అభినందించి పోలీసుల దగ్గిరకి తీసికెళ్లి ఇనస్పెక్టర్‌కి అప్పగించింది.
“ఆ రోజు ఆటోలో ఎక్కిన ఆ అమ్మాయిని స్పష్టంగా గుర్తుపట్టగలవా?” ఇనస్పెక్తర్ అడిగాడు.
“ఫోటోలోనే గుర్తించాను సార్..” వినయంగా అన్నాడు.
“అయితే, ఆమెతో ఎక్కిన అతన్ని గుర్తించగలవా? అతని గుర్తులు ఏమన్నా చెప్పగలవా?” యినస్పెక్టర్ ఆరాటంగా అడిగాడు.
“సార్.. ఈ అమ్మాయిని చూసినంతగా అతన్ని చూడలేదు సార్.. కాలేజీ అమ్మాయి అందంగా వుంది కనక కుతూహలంగా చూశాను. అతని ఆకారం పూర్తిగా గుర్తులేదు కాని మీరు ఎంతమందిలో చూపించినా గుర్తించగలననుకుంటాను.”
“పోనీ గుర్తున్నంతవరకు చెప్పు..”
డ్రైవర్ కాస్త ఆలోచించి “ఐదడుగుల ఆరంగుళాల కన్న పొడుగుంటాడు సార్. చామనచాయ రంగు, జుత్తు మాత్రం వొత్తుగా పెంచాడు. నల్లపాంటు, ఏదో పువ్వులున్న టెర్లిన్ షర్టు వేసుకున్నట్టు గుర్తు. అతని మొహం మాత్రం అంతగా గమనించలేదు సార్. గడ్డం, నల్ల కళ్లద్దాలు వుండడంతో.”
“పోనీ, నేను కొంతమందిని చూపిస్తాను. వారిలో వున్నాడేమో గుర్తించగలవా?”
“గుర్తించగలననుకుంటాను సార్..”
“సరే, నీవు ఆ అమ్మాయిని ఏ యింటికి తీసికెళ్ళావో గుర్తించగలవా?”
“ఆ ఏరియాకి వెడితే గుర్తువస్తుందనుకుంటాను సార్..”
“ఎక్కడ అతను ఆటో ఎక్కాడో గుర్తించగలవా?”
“హిమాయత్‌నగర్ సెకండ్ స్ట్రీట్ అనుకుంటాను సార్..”
“సరే నాతో రా.. ముందు కొంతమందిని చూపిస్తాను” అన్నాడు ఇనస్పెక్టర్. పోలీసు కస్టడీలో వున్న ఆ ముగ్గురు రౌడీల దగ్గిరకి ముందు తీసికెళ్ళాడు. వాళ్ల ముగ్గురిని ఆఫీసు రూములోకి పిలిపించాడు.
“చూడు. వీళ్లని బాగా చూడు. ఈ ముగ్గురిలొ ఆటోలో ఎక్కిన వాడున్నాడా? ఇనస్పెక్టర్ డ్రైవర్ మొఖం నిశితంగా గమనిస్తూ అడిగాడు.
డ్రైవర్ ఒక నిమిషం చూసి “లేడు సార్.. ఆటోలో ఎక్కిన అతను వెళ్లల్లో లేడు..” అన్నాడు నమ్మకంగా.
ఇనస్పెక్టర్ నిరాశగా నిట్టూర్చాడు.
అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్లు ఒక్కక్షణం కలవరపడ్డాడు డ్రైవర్. “సార్… ఆగండి సార్. ఇందులో ఇతను.. ఆటో ఎక్కినతనితో సందుచివర మాట్లాడుతుండాడు సార్. ఈలోగా ఆటోతో నేను అటు వెడ్తుంటే.. పిలిచి ఎక్కాడు సార్. ఇదుగో ఇతను సార్” వేలు పెట్టి చూపుతూ ఆవేశంగా అన్నాడు.
ఇనస్పెక్టర్ మొహంలోకి వెలుగు వచ్చింది. ఒక్కసారిగా “నిజం.. సరిగా చూడు. బాగా గుర్తు తెచ్చుకో..”
“అవును సార్.. నాకు బాగా గుర్తువచ్చింది సార్. నాల్గురోజుల క్రితం జరిగింది అప్పుడే మరిచిపోలేను.. ఇతన్ని చూడగానే ఎక్కడ చూశానా అని గుర్తు వచ్చింది సార్..”
ఆ మాట వినగానే ఒక్కసారిగా ముగ్గురి మొహాలు మాడిపోయాయి.
ఇనస్పెక్టర్ లాఠీ ఊపుతూ వాళ్ల దగ్గరకు నడిచాడు. “ఏరా.. మీకు తెలియదు గదూ. అసలు మీరేం చెయ్యలేదు కదా. పాపం ఆ రోజు అక్కడ పేకాడుతూ కూర్చున్నారు గదూ. వరెయ్. దొంగవెధవన్నవాడు ఏదో ఎక్కడో తెలియకుండా పొరపాటు చేసి దొరుకుతాడురా.. మీ పాపం పండింది. చెప్పండి నిజం ఇప్పటికన్నా చెప్పండి.
“సార్.. మాకేం తెలియదు సార్. ఎవరితోటో రోజూ ఎంతోమందితోనో మాట్లాడతాం. ఇతను ఎవరి గురించి అంటున్నాడో మాకేం తెలియదు సార్.” గాభరాగా అన్నారు.
“తెలీదా.. సరే.. వచ్చి మీకు తెలిసేటట్టు చేస్తా. వన్ నాట్ త్రీ.. వీళ్లని లాకప్పులో పడేయి. జాగ్రత్త. మళ్లీ వస్తాను” అంటూ యినస్పెక్టర్ డ్రైవర్‌ని తీసికెళ్లిపోయాడు.
జీపులో .. హిమాయత్‌నగర్ క్రాసింగ్ దగ్గిర ఎక్కడ ఆటో ఎక్కాడో చూపించాడు డ్రైవర్. తరువాత నల్లకుంట ఏరియాలో రెండూ మూడు సందులు తిరిగాక దారి గుర్తు తెచ్చుకుని ఆఖరికి ఆ యిల్లు చూపించగలిగాడు ఆటో డ్రైవర్.
ఆ యిల్లు కాస్త పాతబడిన పెద్ద మేడ. ఆ మేడకి ఒక పక్క సర్వెంట్స్ క్వార్టర్‌లా గ్యారేజీకి ఆనుకుని చిన్న యిల్లు వుంది. ఆ మేడ దగ్గిర ఆపానని ఆటొడ్రైవర్ చెప్పాడు. ఇనస్పెక్టర్ దిగి ఆ యిల్లు ఎవరిదో ఆ వివరాలు కనుక్కున్నాడు. ఆ యిల్లు ఒక ప్లీడరుగారిది. ఆయన అరవై పై దాటిన ముసలాయన. బాగా రాబడి వున్న రోజుల్లో పెద్ద మేడ, నౌకర్లు ,చాకర్లతో దర్జాగా బతికిన మనిషి. యింటికి ఆనుకుని వున్న ఆ గదిలో నౌకరో, డ్రైవరో వుండేవారు. యిప్పుడు ఖాళీగా వుందని అద్దెకిస్తున్నారంట. సాధారణంగా బ్యాచిలర్స్ వుంటారు. ఇన్నాళ్లు ఒక పెళ్లికాని గుమాస్తా వుండేవాడుట. అతను బదిలీ అయి వెళ్లాక “టు లెట్” బోర్డు చూసి నాల్గు రోజుల క్రితం ఎవరో వచ్చి అడిగి అడ్వాన్సు యిచ్చి వెళ్లాడుట. ఆ ఎవరో సెక్రటేరియట్‌లో పని చేస్తున్నాట్టు చెప్పాడట. మళ్లీ చూస్తే గుర్తించగలనేమో అన్నారాయన. ఆ యింటి తలుపు మేడకి ఒక పక్కగా యింటితో సంబంధం లేకుండా వుంది. కనక ఎవరు వచ్చేది, పోయేది తనకి తెలియదన్నాడాయన. అతను మర్నాడే యింకో మంచి రూము దొరికిందని చెప్పి వెళ్లిపోయాడట. ఈ వివరాలన్నీ ఆయన గాభరాపడ్తూ చెప్పాడు పోలీసు ఇనస్పెక్టర్‌ని చూసి, జరిగిన సంగతి విని నిర్విణ్నుడయ్యాడు.
“ఎంత ఘోరం.. మా యింట్లో.. ఆ గదిలో అంత ఘోరం జరిగినా మాకేం తెలియలేదే…” అంటూ వాపోయాడు.
” ఆ వెధవలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ గదిలొ బంధించి ఇష్టం వచ్చినట్టు చేసి ఆఖరికి రాత్రి, ఎవరూ చూడకుండా,, నిర్మానుష్యంగా వున్న చోట తీసికెళ్లి పారేసి వుంటారు..”ఇనస్పెక్టర్ అన్నాడు.
“సార్.. మీరెలాగయినా ఆ వెధవలని పట్టుకోవాలి సార్.” అంటూ ఆయన ఆవేశపడ్డారు.
“కేసుకి క్లూ దొరికింది సార్. ఇంక ఫరవాలేదు. వాళ్లచేత నిజం ఎలా పలికించాలో మాకు తెలుసు” అన్నాడు ఉత్సాహంగా ఇనస్పెక్టర్.
ఆ తరువాత కేసు సులభంగా తేలిపోయింది. ఆ ముగ్గురు రౌడీలు పోలీసులు ప్రయోగించిన హింసకి తట్టుకోలేక ఆఖరికి రెండు రోజూల తరువాత నిజం బయటపేట్టి నేరం ఒప్పుకున్నారు. ఎంతో తెలివిగా ప్లాన్ చేసినా ఆటో ఎక్కిన వ్యక్తితో వీళ్లలో ఒకడు మాట్లాడడం చూసిన ఆటోడ్రైవర్‌కి క్లూ ఇచ్చేశారు. ఆటోడ్రైవర్ అంతగా ఆ విషయం గమనించడనుకోవడం వీళ్ల పొరపాటు.
వాళ్ళు ఆఖరికి రేఖ మీద ఎప్పటినించో మనసుందని.. ఆ పిల్లని ఏడిపించి, చూసి సంతోషిస్తూ కొన్నాళ్లు తృప్తిపడ్డారని ఆమె రాకపోకలు, ఆమె వచ్చిపోయే సమయాలు, ఆమె యిల్లు అన్నీ గమనించారు. ఓ రోజు పార్టీకి వెళ్లి వస్తున్న రేఖని అల్లరిపెట్టారు. ఆ రోజు శ్యాం వచ్చి అడ్డు తగలడంతో వాళ్లకి రేఖ పట్ల కోరిక మరింత పెరిగి ప్లాను వేశారు. వాళ్ల గ్రూపులో స్నేహితుడి ద్వారా ఒక రూము సంపాదించి, వాడ్ని రేఖ చూడలేదు గనక గుర్తించలేదని తెలివిగా కాలేజీకి పంపి రప్పించి రేఖని గదిలో బంధించారు. వాళ్ల మీద అనుమానం రాకుండా సాయంత్రం అంతా కిళ్లీబడ్డీ దగ్గిరే కూర్చుని రాత్రి పదిగంటల తరువాత వాళ్లు ఆ యింటికి వెళ్లి అప్పటికే కళ్లు, కాళ్లు, చేతులు కట్టేసి పడివున్న ఆమెని రేప్ చేశారు అని ఒప్పుకున్నారు. వాళ్లకి సాయపడిన వాడి ఉనికి తెలిపారు. రక్తాలు వచ్చేట్టు కొట్టేక, గోళ్లలో గుండుసూదులు గుచ్చి, సిగరెట్టుతో వాతలు పెట్టాక, యింక లాఠీదెబ్బలు తినే శక్తిలేక వెళ్లగక్కారు.
“రాస్కెల్స్.. ఎంతకి తెగించారురా.. అమాయకురాలైన ఆడపిల్లని యింత ఘోరంగా హింసిస్తారా?” బూటు కాలితో తన్నాడు ఇనస్పెక్టర్ కోపం పట్టలేక.
ఈ కేసులో దోషులని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రినించి పోలీసులకి ఆదేశం వచ్చి ఉండడంతో వెంటనే కోర్టుకి కేసు వెళ్లి పదిరోజులలో కేసు పూర్తయి, నేరం రుజువయి, యీ సహాయం చేసినవాడికి ఐదేళ్ళు, చేయించినవాళ్లకి పదేళ్ళు కఠిన శిఖ విధించింది కోర్టు 376 సెక్షన్ ప్రకారం.
పేపర్లన్నీ ఈ కేసు ప్రొసీడింగ్స్, అన్నీ ప్రాముఖ్యత యిచ్చి ప్రచురించాయి. కేసు తీర్పు చెప్పిన రోజున కోర్టు బయట కాలేజీ అమ్మాయిలు, వూర్లో అన్ని మహిళా మండలుల సభ్యురాండ్రు, యింకెందరో స్త్రీలు గుంపులు గుంపులుగా నిలబడి తీర్పు చెప్పగానే హర్షద్వానాలు చేశారు.
రేపిస్టు ముర్దాబాద్.. రేఖా జిందాబాద్.. జస్టిస్ జిందాబాద్.. న్యాయం గెలుస్తుంది. మా స్త్రీలకి రక్షణ కావాలి. రేపిస్టులని శిక్షించాలి.” అంటూ అరిచారు. జడ్జీగారిని చాంబరులో కల్సుకుని వూళ్లో మహిళామండలుల అధ్యక్షులు అభినందించారు.
కేసులో దోషులని పట్టుకొవడానికి సహాయపదిన ఆటోడ్రైవరుకి రాధాదేవే కాకుండా, పోలీసులు, వూర్లో మహిళామండలులవారు, కాలేజీలలో ఆడపిల్లలు అంతా కలిసి తలో బహుమానం ఇచ్చి అభినందించారు. అతని కళ్లు చెమర్చాయి.
ఒక ఆడపిల్లకి.. నా తోబుట్టువులాంటి అమ్మాయిపై జరిగిన అత్యాచారంలో నేరస్థులని పట్టుకోవడానికి సహాయపడగలిగినందుకు నా జీవితం ధన్యమైందనిపిస్తుంది” అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు డ్రైవర్. కాస్తో కూస్తో చదువుకున్నవాడు. “ఆడపిల్లలు.. అంటే మనలో ఎవరో ఒకరికి అక్కా చెల్లెళ్ళో, తల్లో, భార్యో అవుతారు. వారి గౌరవం మన గౌరవం. ఆ స్త్రీల గౌరవం కాపాడే బాధ్యత మనది. అలా ఒక యువతిని కాపాడలేకపోయినా, నేరం చేసిన వారిని శిక్షించేందుకు తోడ్పడినందుకు గర్వంగా వుంది” అంటూ పేపరువాళ్ల ప్రశ్నలకి జవాబు చెప్పాడు.
రిపోర్టర్లందరూ రేఖని చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. “యిప్పుడు మీకేం అనిపిస్తూంది? దోషులు శిక్షించబడినందువల్ల మీకు తృప్తి కలిగిందా” అంటూ ఆమె అభిప్రాయం కోరారు.
రేఖ నిర్లిప్తంగా నవ్వింది. “దోషులు శిక్షించబడినంత మాత్రాన ఆ అవమానం, హింస మరిచిపోలేను కదా? ఎటొచ్చి దోషులు తప్పించుకోకుండా శిక్ష పొందడంతో కనీసం కొన్నాళ్లవరకైనా స్త్రీల మీద అత్యాచారం జరిపే ముందు కాస్త జంకవచ్చు అలాంటివారు. నేననుభవించిన హింస, నరకం యింకో ఆడపిల్ల అనుభవించే దుస్థితి రాకూడదని కోరుతున్నాను. ఇలాంటి రేపిస్టులని వెంటవెంటనే పట్టుకుని గట్టిగా శిక్షించితే కొన్నాళ్లకైనా యీ అత్యాచారాలు తగ్గుతాయి” అంటూ తన అభిప్రాయం చెప్ప్పింది రేఖ.
కేసు తీర్పు విన్నాక అందరికంటే ఎక్కువ ఆనందపడింది రాధాదేవి. నిశ్చింతగా నిట్టూర్పు వదిలింది. తనమీద నింద తొలగిపోయినందుకే కాక ఆ దుర్మార్గులకి శిక్ష విధించడం ఆనందం కలిగించింది. కోర్టులో తీర్పు అయ్యాక అప్రయత్నంగానే రాధాదేవి మాధవరావు వంక చూసింది.
రాధాదేవితో చూపులు కలవగానే మలినమైన తన మొహం చూపలేనట్టు తల తిప్పుకున్నాడు. చూసావా అని రాధ సవాల్ చేసినట్టనిపించిందతనికి. కేసు తీర్పు చెప్పగానే జడ్జి చాంబర్స్‌లోకి వెళ్లగానే రాధాదేవి రేఖ దగ్గిరకి వెళ్లి చెయ్యి నొక్కి అభిమానంగా భుజం చుట్టూ చెయ్యి వేసి తన అభిమానం తెలియజెప్పింది. మాధవరావు చూస్తున్నాడని తెలిసినా లెక్క చెయ్యకుండా “రేఖా… దోషులు శిక్షించబడ్డారు. యింక నీవీ విషయం మర్చిపోయి చదువులో మనసు లగ్నం చెయ్యి. కాలేజీకి వెళ్లడం లేదు అన్నాడు శ్యాం. యింక రేపటినుంచి వెళ్లాలి . ప్రామిస్” అంది చనువుగా..
రేఖ తల తిప్పి “అలాగే ఆంటీ.. కానీ.. ఎందుకో భయంగా, మొహమాటంగా వుంది” నసిగింది.
“అదిగో.. నీవు అలా మాట్లాడవద్దు. చూడు నీ వెనకాల ఎందరి ఆడవాళ్ల సానుభూతి వుందో చూడు. యింతమంది వచ్చారంటే నీ పట్ల వున్న అభిమానంతో, ఓ స్త్రీకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందన్న సంతోషం పంచుకోవడానికి వచ్చారు. రేఖా .. మళ్ళీ చెప్తున్నాను. నీకేం కాలేదు. ఆ మాటే అనుకో పదిసార్లు” అంటూ నచ్చచెప్పింది.
“రేఖా.. పద యింటికి” తండ్రి తీవ్రంగా పిలిచాడు. రేఖ కళ్లతోనే రాధాదేవి దగ్గిర వీడ్కోలు తీసుకుని వెళ్లింది.
********
పదిహేను రోజులు గడిచాయి.
“అమ్మా.. అమ్మా.. రేఖ.. సూయిసైడ్ కమిట్ చేసిందమ్మా…” ఓ రోజు కాలేజీనుంచి పరిగెత్తి వచ్చినట్లే వచ్చి తల్లితో చెప్పాడు శ్యాం ఆ వార్త. రాధాదేవి నిశ్చేష్టురాలైంది..

యింకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *