April 16, 2024

నువ్వు కడలివైతే – సమీక్ష

రచన: డి.కమల పర్చా

నువ్వు కడలి
నువ్వు కడలివైతే . . . ఆ పేరే ఒక్క క్షణం చూపులని కట్టేస్తుంది. నవల చదువుదామని చేతిలోకి తీసుకోగానే , ఆ పేరు, పేజ్ మీద ఉన్న బొమ్మ నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే అన్నారు పెద్దలు పేరులోనే కలదు పెన్నిధి అని. పేరు సరైనది పెడితే అదే ఆటోమాటిక్ గా చదువరులను ఆకర్షిస్తుంది. ఆ కిటుకు రచయిత్రికి బాగా తెలిసినట్లుంది. సుందరీ నాగమణి వి “అమూల్యం”, “తరలి రావే ప్రభాతమా!” వాటి పేర్లతోటే నన్ను పిలిచాయి. ఆ పేర్లు ఎంత గా ఆకట్టుకుంటాయో, రచనలూ అంతే ఆకట్టు కుంటాయి. “ప్రేమంటే ఆట కాదని, పంతాల, పట్టుదలల కోట కాదని అది మనసులు కలిసి పాడే శ్రావ్యమైన పాట అని ప్రేమ గురించి “ఆనంద గోదావరి” లో అందంగా చెప్పినా, ఇంటి పనిమనిషి దొంగతనం చేసి వెళ్ళిపోయి, తిరిగి కలిసేందుకు వచ్చినప్పుడు , యింటి యజమానురాలు ఆదరించి , సరసన కూర్చోబెట్టుకోని “అడగని వరం” లో భోజనం పెట్టినా, అందమైన ప్రణయలహరి ని ఒక ప్రత్యేకమైన మధుర వీచికలా భావించాలని కృష్ణుడితో రాధమ్మకు మధురంగా “హృదయ మథనం” లో చెప్పించినా, “మూడో చపాతి”, “ఉల్లీ నీకో దణం తల్లీ” లో సునిశితమైన హాస్యం కురిపించినా , ఒక సినీతార జీవితము గురించి చాలా హృద్యంగా “నువ్వు కడలి వైతే” లో చెప్పినా, మానవీయత సామాజిక సృహను “నేను సైతం”లో కదిలించినా సుందరీ నాగమణికే చెల్లు.
మొత్తం ఇరవై రెండు కథలూ ఒక్కో విధంగా బాగున్నాయి. దేనికదే ప్రత్యేకత కలది. కాని అన్నింట్లో నన్ను కొంచం ఎక్కువగా ఆలోచనలో పడేసిన కథ “మాట చూస్తే మామిడల్లం “. హరిత ఒక ఉద్యోగిని, గృహిణి కూడా. తనకు నిజాయితిగా ఉండటము ఇష్టం. నిజాలే మాట్లాడుతూ ఉంటుంది. అందుకని అవి ఎవరికీ నచ్చవు. ఆడపడుచు అనితకు వంట నేర్చుకోమని, గర్వంగా ఉండవద్దు అని, అహంకారంగ మాట్లాడవద్దు అని చెపుతూ ఉంటుంది. ఐనా వినదు అనిత. అనితకు పెళ్ళి చేసినప్పుడు , కాలి మీద ఉన్న మచ్చ గురించి పెళ్ళికొడుకు చెబుదామంటే వినరు. ఫలితంగా అనిత కాపురం లో చిచ్చు, మూడు లక్షలు కట్నం సమర్పించుకోవాల్సి వస్తుంది! భర్తను ఎవరికీ చిట్ ఫుండ్ కు హామీ ఇవ్వద్దు అంటే వినడు. ఇచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. ఈ కథలో హరిత కారెక్టర్ బాగా తీర్చి దిద్దారు రచయిత్రి. అందరికి హితువులు చెప్పబోవటము, వారు వినక చిక్కుల్లో పడితే వారిని ఆదుకోవటమూలో హరిత పాత్ర బాగా తీర్చారు. అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే హరిత మాటే మామిడల్లం 🙂
sumana 1

ఇంత మంచి కథలు అందించించిన నండూరి సుందరీ నాగమణిని కొన్ని ప్రశ్నలు అడిగి నా అనుమానాలు తీర్చుకోవాలనిపించింది.
ఇదో ఇవే నా ప్రశ్నలూ , నాగమణి జవాబులు.
1. అసలు వ్రాయాలి అని మీకెందుకు అనిపించింది ? అదే ఇంటర్ చదివే రోజులల్లోనే వ్రాసానన్నారు కదా అప్పుడు ఎలా ఏ ఉద్ధేశంతో వ్రాశారు?
ఐదో క్లాసు చదువుతున్నప్పటి నుంచే చందమామ కథలు చదవటం అలవాటు. పత్రికలలో కథలు చదువుతున్నపుడు, ‘అబ్బా, ఎంత బాగా రాసారో’ అనుకోవటం నుంచి, నేనైతే ఎలా రాస్తాను అని ఊహించుకోవటం మొదలైంది. అంచేత, ఇంటర్ లో కాలేజీ మేగజైన్ కి కథ పంపమని అనగానే ఓ బావామరదళ్ళ ప్రేమకథ రాసి పంపేసాను. అచ్చయింది. . . ప్రత్యేకంగా ఒక ఉద్దేశ్యం అంటూ ఏమీ లేదు కానీ, నేనూ వ్రాయగలను అని అనిపించి వ్రాయటం మొదలు పెట్టాను
2. చాలా ఇష్టంగా కష్టపడి వ్రాసినది పూర్తయ్యాక అసంతృప్తి మిగిల్చింది ఏదైనా ఉందా?
సాధారణంగా సంతృప్తే. ఎందుకంటే ఏ పోటీకి కథను పంపినా, కనీసం ఐదారు సార్లు తిరగ రాస్తాను. తృప్తి కలిగే వరకూ. . . ఒక్కో సారి కొన్ని పోటీలకు ఆఖరి నిమిషంలో వ్రాసి పంపినప్పుడు మాత్రం కించిత్ అసంతృప్తి గా ఉంటుంది. . . ఇంకా బాగా రాసి ఉండాల్సింది అని బలంగాఅనిపిస్తుంది
3. ఇప్పటి వరకూ మీరు వ్రాసిన కథలల్లో కాని, నవల లో కాని, కవిత లో కాని మీకు ఇష్టమైనది ఏది?ఎందుకు నచ్చింది? .
నవల అయితే నా మొదటి నవల మాధుర్యం. వ్రాస్తున్నంత కాలం దానిలో తాదాత్మ్యత చెందుతూ వ్రాసాను. ఇది ప్రేమ కథే, అయినా స్నేహం యొక్క విలువను బలంగా చెబుతుంది. మార్చి 2012 స్వాతి మాసపత్రిక లో నవలానుబంధంగా వచ్చింది. కథలు చాలా ఉన్నాయి. ‘అమూల్యం’, ‘ఆనందగోదావరి’, ‘బెస్ట్ ఫ్రెండ్’ వీటిలో ముఖ్యమైనవి.
4. మూడో చపాతీ, ఉల్లీ, నీకో దండం లాంటి కథలల్లో సునిసితంగా హస్యాన్ని టచ్ చేసారు కదా!పూర్తి స్తాయిలో హాస్య రచనలు ఏవి ఎందుకు చేయలేదు?
అసలు హాస్య రచన అంటే కత్తి మీద సాములాంటిది. ఎక్కువైతే వికటిస్తుంది, తక్కువైతే నవ్వు రాదు. నాకు అలాంటి కథలు వ్రాసే నేర్పు చాలా తక్కువ. అందుకే అప్పుడప్పుడు ప్రయోగాలు మాత్రం చేయగలిగాను. అవి కూడా పొత్తూరి విజయలక్ష్మి గారిని తలచుకుని రాస్తాను. ఈ మధ్య స్వాతి వారపత్రికలో ప్రచురితమైన ‘బంటీ బనానా’ పూర్తి స్థాయిలో నాకు బాగా నచ్చిన నా కామెడీ కథ.
ఇప్పటి రచనలు ఎలా ఉంటున్నాయని మీ అభిప్రాయము ?
యువరచయిత(త్రు)ల రచనలు కొన్ని బాగుంటున్నాయి. కొన్ని ‘వాదాల’ చట్రంలో ఇరుక్కుంటున్నాయి. వ్రాసే ప్రతీవారూ మానవతావాదాన్ని మాత్రమే దృష్టి పెట్టుకోవాలని నా అభిప్రాయం. ఇక ఇప్పుడు వస్తున్న రచనలలో సీనియర్ రచయితల, రచయిత్రుల రచనలూ వస్తున్నాయి. వాటిల్లో సింహభాగం చదివింపజేసేవిగా మాత్రమే కాక ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటున్నాయి.
అంటూ ముగించారు, అందరమూ సుమనా అని ముద్దుగా పిలుచుకునే సుందరీనాగమణి. ఆమె మాటల్లాగే ఆమె భావాలూ, రచనలు కూడా సున్నితం గా మృదువుగా ఉన్నాయి.
నేను అడిగిన వెంటనే మీ భావాలను పంచుకున్నందుకు థాంక్ యూ సుమనా.

జే. వి పబ్లికేషన్ ద్వారా వచ్చిన ఈ కథాసంపుటి అన్ని ప్రముఖ పుస్తకాల షాపులల్లో లభ్యం అవుతుంది. ధర;150 రూపాయలు మాత్రమే!

1 thought on “నువ్వు కడలివైతే – సమీక్ష

  1. మాల గారు నాగలక్ష్మి గారి కథల సంపుటి ” నువ్వు కడలివైతే “పై మీ సమీక్ష చదివాక నాగలక్ష్మి గారి కథలను త్వరగా చదవమని ఊరిస్తూంది . బాగుంది మీ సమీక్ష .

Leave a Reply to P. Vijayalakshmi Pandit Cancel reply

Your email address will not be published. Required fields are marked *