April 25, 2024

పరుగు

రచన: కాంత గుమ్ములూరి

run-3

ఉదయించిన బాలభానుని కిరణాల వెంట
పిల్ల గాలుల పరుగు …
నిన్న రాత్రి పడ్డ వర్షపు పరియలలో
సూర్య కిరణాల పరుగు …
నీటి గుంటలలో పడ్డ కాంతి
ఇంద్రధనుస్సు వైఖరి పరుగు …
ఆ రంగుల హరివిల్లు నందుకోడానికే
ఈ చిన్నారి పరుగు…
విచ్చలవిడిగా పూసిన రంగు రంగుల
గడ్డిపూలకోసం పరుగు …
విశృంఖలంగా అల్లుకున్న తీగపై
ఊదారంగు పూలవెంట పరుగు …
వాటి వెంటే విహరిస్తున్న
పసుపు వన్నె సీతాకోక చిలుకల కోసం పరుగు…
చెట్టు కింద రెక్కలు విచ్చిన తామ్ర వర్ణపు బొంతకాకిని
కనులారా చూడాలని పరుగు….

జీవిత ధ్యేయం –
రంగుల హరివిల్లు నందుకోడం కోసమేనా పరుగు?
నా వంటి యువత జవాబు
శరీర దార్డ్యం కోసం పరుగు …
నీ కలలు నిజమవడానికి
కలల వెంట నీ పరుగు …
క్రింద పడితే లేచి నొప్పితో కుంటుతూ
మళ్ళీ మొదలెట్టు నీ పరుగు…
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయనే ఆశల కలలే
యౌవనంలో ఈ పరుగు…
ధనం, అధికారం శాస్త్రోక్తంగా, అనుకూలంగా
పొందడానికి పరుగు …
గతిని పెంచితే ఇంకా త్వరగా చేతికి అందుతుందన్న
ఆశతో పరుగు …
ప్రపంచాన్నంతా స్వాధీనం చేసేస్కోవాలనే
ఆవేశంతో పరుగు …
మనసు అలసినా శరీరం సొలసినా
రంగుల హరివిల్లు అందుతుందన్న తృప్తికై పరుగు …

దిక్మండలంలో అష్టకష్టాలు పెను తుఫానులా
నా వెంట పరుగు…
పూలు -ముళ్ళు, మంచి – చెడు, ఆశ -నిరాశ
అన్నీ పెట్టాయి పరుగు …
వికలమై వెనుదిరిగి చూస్తే జీవిత కల్లోలం
నా వెంట పరుగు …
ప్రశ్నించా ముందున్న వృద్ధ వ్యక్తిని,” గమనించారా ప్రచండమైన
ఈ పెను తుఫాను పరుగు?”
చిరునవ్వుతో, “నన్నెప్పుడో సంతరించుకుంది నలుదెసలా
ఈ పెను తుఫాను పరుగు.
విపత్తు నుంచి పలాయనం చేస్తే
అది నీ వెంట పెట్టదా పరుగు ?”
భయ విహ్వలుడ నై త్వరిత గతిని పోతున్న నన్నందుకుంది
భవసాగరం పరుగు…
ఇనుమడించిన క్రోధంతో కూలదోస్తూ
ఆపింది నా పరుగు…
పట్టు వదలక పడి లేచి, పడి లేచి
మొదలెట్టాను పరుగు…
స్థిరంగా పట్టుదలతో సాధించడానికి శాయ శక్తులా
ప్రయత్నించాను పరుగు…
సంకల్ప సిద్ధిని పొంది సాగించింది మనసు
దృఢ నిశ్చయపు పరుగు !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *