March 28, 2024

వేదిక – విశ్లేషణ

రచన: నండూరి సుందరీ నాగమణి

వేదిక!
ఎంత చక్కని శీర్షిక!!
గోతెలుగు వారపత్రికలో ఈ నవల ధారావాహికంగా వెలువడినప్పుడు నేను అనుసరించలేకపోయాను. కానీ పుస్తకరూపం లోనికి వచ్చాక చదువుతూ ఉంటే మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది.

రచయిత్రి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు నాకు చక్కని మిత్రురాలు, సన్నిహితురాలు. క్రిందటేడు ఆమె మాతృభూమికి వచ్చినప్పుడు శ్రీమతి మంథా భానుమతి గారి గృహంలో వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. అంత గొప్ప నృత్యశాస్త్ర కోవిదురాలు అయినా కూడా కించిత్ గర్వమైనా, అహంభావమైనా లేక ఎంతో ఆత్మీయంగా పలకరించి, మనసారా మాట్లాడారు. వారి స్నేహితానికి పాత్రత కలిగి వారికి సన్నిహితురాలినైనందుకు ఆ కళాభారతి పాదాలకు భక్తి పూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.

సహజంగా తానూ నర్తకి కావటం వలన కథానాయకి చంద్రకళ పాత్రలో తాను లీనమైపోయి వేదిక నవలా రచన సాగించారు రచయిత్రి. మేజర్ సత్యదేవ్, గాయని శారదల సంతానం చంద్రకళ, వినోద్ లు. చంద్రకళకు చిన్ననాటి నుండీ నాట్యకళపై మక్కువ ఎక్కువ. తల్లి శారద ప్రోత్సాహంతో, ఇంటి దగ్గరగా చేరిన డాన్స్ స్కూలు మాష్టారి ప్రోత్సాహంతో నృత్యాన్ని నేర్చుకుంటుంది. కళల పట్ల ఎంతో అభిమానం కల తల్లిదండ్రులకు వారసురాలు కావటం చంద్రకళ అదృష్టం. ఆమె విద్య కోసం, ఆమెకు కాస్ట్యూమ్ కుట్టించడం దగ్గరనుంచి, పాట పాడుతూ అభ్యాసం చేయించడం, మేకప్ చేయటం వంటి పనులన్నిటిలో తన కుమార్తెకు ఎంతో చేదోడు వాదోడు గా ఉంటుంది శారద. అలాగే సత్యదేవ్ కూడా తన పిల్లల ఆనందం కన్నా వేరే ఏమీ కోరుకోని ప్రియతమ పితృదేవుడే.
సత్యదేవ్ స్నేహితుడైన భూషణ్, ఆయన భార్య నిరుపమలు చంద్రకళను ఎంతగానో ఆదరించటమే కాక, తమ కుమార్తె అయిన రాణి తో సమానంగా ఆమెను ప్రేమిస్తారు… ఆమె నృత్యకళకు భూషణ్ ఎన్నో సోపానాలు వేస్తాడు. ఎన్నో వేదికలను ఆమె అభివృద్ధికి గాను అమరుస్తాడు. అలాగే మేనత్త కొడుకు జగదీష్ తో చంద్రకళ అనుబంధం, ప్రేమలను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు ఉమాభారతి గారు తనదైన చక్కని శైలిలో… జగదీష్ కూడా మరదలు, ప్రేయసి అయిన చంద్రకళతో ఎంతో ప్రేమగా, చనువుగా ఉంటూనే, స్నేహితురాలైన రాణితో, ఆమె తల్లిదండ్రులతో కూడా ఎంతో అభిమానంగా ఉంటూ ఎన్నో సమస్యలలో వారికి తోడుగా, నీడగా ఉంటాడు.

బాలికగా ఉన్న చంద్రకళనుంచి, యవ్వనంలో అడుగిడిన చంద్రకళతో పాటుగా, ఆమె మనసుతో పాటుగా, ఆమె కళా సేవతో పాటుగా, ఆమె భావాలతో పాటుగా మనమూ పయనిస్తాము. చివరికి అమెరికాలో కూడా విజయకేతనం ఎగురవేస్తుంది చంద్రకళ. నృత్యకళాకారిణి, మరియు ఆచార్యురాలైన శ్రీమతి తేజస్విని గారి ద్వారా అక్కడికి వెళ్ళి, ఎన్నెన్నో ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా, అక్కడే కొన్నాళ్ళుండి చాలా మంది విద్యార్థినులకు నాట్యవిద్యలో శిక్షణను ఇస్తుంది. చివరికి ఆమె భారతదేశానికి తిరిగి రావటం ద్వారా కథ ముగింపుకు చేరుకుంటుంది. అయితే చంద్రకళ తన బావ జగదీష్ చేయిని అందుకుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే మాత్రం నవల ఆద్యంతమూ చదవక తప్పదు.

‘వేదిక’ నవల మకుటమే ఎంతో అందాన్ని, ఆనందాన్ని తెచ్చింది ఈ గ్రంథానికి. చదువుతూ ఉంటే సమయం తెలియదు, పేజీలు మాత్రం తిరిగిపోతూనే ఉంటాయి. కథానాయికతో పాటు మనమూ నాట్యమాడుతాము… పార్టీలలో హాయిగా ఆనందిస్తాము. జగదీష్ తో విహరిస్తాము. ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడినా, అసూయతో తూలనాడినా సంయమనం వహిస్తాము. ఇలా ఎన్నెన్నో సుగుణాలను మనకు తెలియకుండానే ప్రధాన పాత్ర అయిన చంద్రకళ ద్వారా మనము నేర్చుకుంటాము. అలాగే బిడ్డల ఉన్నతి కోసం, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, ఉంటారో శారద, సత్యదేవ్ పాత్రల ద్వారా తెలుస్తుంది. పెంపకం ఎలా ఉండకూడదో రాణి తల్లిదండ్రులు భూషణ్, నిరుపమల పాత్రల ద్వారా అవగతమౌతుంది. మరొక చక్కని ఆత్మీయమైన పాత్ర కోటమ్మత్త. ఆప్యాయతానురాగాల మేలు కలయిక.
నవలలో ఎన్నెన్నో చక్కని కీర్తనలు… వాటికి అభినయాలు… తరంగాలు, అష్టపదులు… అన్నమయ్యా, త్యాగయ్యా, క్షేత్రయ్యా పలుకరిస్తూనే ఉంటారు ఆత్మీయంగా… మువ్వల సవ్వడి మన కనుల ముందూ, మనసులోనూ మారుమ్రోగుతూనే ఉంటుంది. సర్వం, సకలమూ సరస్వతీమయమే అవుతుంది.
ఇంత మంచి నవలను, చక్కని సులభ శైలిలో మనకోసం అందించిన శ్రీమతి కోసూరి ఉమాభారతిగారు నిజంగా అభినందనీయులు. వారి కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఉమాభారతిగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పుస్తకము తెరచి చదవటం మొదలుపెట్టింది మొదలు మనమూ ఆ పాత్రలతో సహా నడుస్తాము…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *