April 18, 2024

సీతారామ కల్యాణం

రచన: కిభశ్రీ

రండి కన రండి – – – – తరలి రండి
రండి రండి రారండి – – – – కదలి రండి

నవ్య యుగములో అందరూ
సవ్యముగా జరుపుకునేది
దివ్యానుభూతిని ఇచ్చేదీ
భవ్యమైన కల్యాణమే ఇది || రండి||

తుల్యమే లేని సీతమ్మే
కౌసల్యతనయుని చేరునటా
కల్యాణం చూసినవారికి
కైవల్యం తథ్యమటా

ధరణిని జనకుని పట్టియట
ఆ సిరియే- – – పెండ్లికూతురట
సరియైనవాడె జోడట
ఆ హరియే – – -పెండ్లికొడుకట

కుందనపుబొమ్మ సీ-త-మ్మ – –
సుందరాంగుడా రామునిపైనా
అందరి చూపులు నిలుచునట – –
విందది అందరి కనులకటా

ఎదురుకోలుకై నిలిచిరట – – –
ఎదురెదురుగా వధూ వరులట
పదిరకాల పూలున్న మాలలను –
పదిలంగా మార్చుకునేరట

సిరిపతికే – – – దానమిచ్చేటి
భాగ్యము జనకునిదేనట
నరుడిగ చేరిన నారాయణునికి – – –
కన్యా – – దానమిచ్చునట

బంగారు కలశముతో – – – –
గంగాజలమును పోసి
మంగళవాద్యమె మోగగా – –
మంగళకరునికి కన్యనిచ్చునట

నడిచెద నీతో జీవితాంతమూ – – –
విడువకుండ యను బాసతో
ముడులు మూడు విడిపోకుండా – –
వడిగా రాముడు వేయునటా

మూడులోకములనుంచి తెచ్చిరట
ఏడువర్ణముల ముత్యాలెన్నో
వాడి అన్నిటిని తలంబ్రాలుగా
ఆడుకునేరా వధూవరులంట

సంధించిన తమ చూపులతో
బంధించిన తమ మనసులతో
అందరికీ ఆదర్శము కాగాల
బంధములో ముడివడేరటా

సచ్చరిత్రులేనాడైనా
సత్యమునెరిగిన జనకులేనట
సన్మార్గమునే నడచచూ
సత్యకర్మమను నాగలి వాడుచు
సద్భావమనే బీజములు నాట
సత్ఫలకన్యయె సీతమ్మటా
సత్పురుషునికే కన్యనీయగ
సదవకాశమీ పెండ్లియటా

అమ్మలు అయ్యలు స్వయముగా
సీతమ్మా రాములు వస్తారంట
నమ్మినవారికి కనిపించేరట
నమ్మనివారు అభాగ్యులేనటా

1 thought on “సీతారామ కల్యాణం

  1. చక్కని చిక్కని ధార భావస్ఫూర్తి భాషాపటిమ …..శిరసానమామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *