March 29, 2024

రైలు పక్కకెళ్ళొద్దురా డింగరీ! డాంబికాలు పోవద్దురా! !

రచన: శారదాప్రసాద్

(గత ఆరునెలల్లో ఆరు ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. కొన్ని వందలమంది ఈ ప్రమాదాల్లో మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. మరెందరో గాయపడ్డారు! ప్రభుత్వం, ఇవి విద్రోహ చర్యలని చేతులు దులుపుకుంటున్నది! సంస్థాగత లోపాలను గురించి రైల్వే అధికారులు, మంత్రివర్గం పట్టించుకోలేదు. . ఈ సందర్భంలో వ్రాసిన చిన్న వ్యంగ్య రచనను ఈ దిగువన చదవండి! )

*******
“ఏమోయ్! అర్జంట్ గా ఇటురా! రెండు జతల బట్టలు వగైరా సద్దు. నేను అర్జంట్ గా చెన్నైకు వెళ్ళాలి”
“ఇంత రాత్రి సడన్ గా ఎలా వెళుతారండీ ?”
“హైదారాబాద్- చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో.”
“అంత అర్జంట్ పని ఏమిటో?”
“మనవళ్ళను, మనవరాళ్లను చూడాలనిపించింది!”
“నేను మీకు ఏమి అన్యాయం చేశానని నామీద ఇంత కోపం?”
“కోపం ఏమిటి? కొత్త పల్లవిని ఎత్తుకున్నావు!”
“లేకపోతే, మరేమిటి? బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా రైలు ప్రయాణాలు చేస్తారా ఈ రోజుల్లో”
“మరైతే శ్రీ కాళేశ్వరి వారి బస్సులో వెళ్ళుతా”
“అది మరీ దారుణం. ఆ బస్సులు రోడ్ మీద నడవవట, కాలువల్లో, లోయల్లో గుండా వెళ్ళుతాయట!”
“మరి ఎలా వెళ్ళాలి?”
“మా ఊరినుండి మా పొలం పనిచేసే రైతును కబురు చేస్తాను. హాయిగా ఎద్దులబండిలో ఇద్దరమూ వెళ్లుదాం.”
“అలా వెళితే చెన్నైకు వెళ్ళటానికి ఒక నెల పడుతుంది.”
“అయితే ఏమి పోయింది. క్షేమంగా చేరుతాం కదా! అదీగాక, దారిలో ఉన్న పుణ్య క్షేత్రాలను కూడా చూడవచ్చు. అన్నిటినీమించి, మీకు కూడా పనీపాట లేదుగా! (అంటే రిటైర్ అయ్యానని ఆమె భావం)”
“పోనీ అమ్మాయి వాళ్ళను రమ్మంటే?”
“రిటైర్ అయిన తరువాత మీ బుర్ర సరిగా పనిచేయటం లేదనిపిస్తుంది. వాళ్ళు రావటానికీ పై సమస్యలేగా కారణం. అదీగాక వాళ్లకు ఎద్దులబండిలో వచ్చే అవకాశం కూడా లేదు.”
“ఈ ఎద్దులబండి ప్రయాణం నేను చెయ్యలేను. ఎక్కడి వాళ్ళం అక్కడే ఉందాం. ఫోనులో మాట్లాడుకుందాం”
“ఇప్పుడు సరిగా ఆలోచించారు. మొన్నటి దాకా, ఎవరికైనా జీవితం మీద విరక్తి కలిగితే, రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. ప్రస్తుతం ఆ అవసరాన్ని తప్పించి ప్రభుత్వం వారు రైలులోనే చనిపోయే సదుపాయం కల్పిస్తున్నారు.”
“ప్రభుత్వపు పనితీరు భేషుగ్గా ఉంది. చనిపోయినవాని కుటుంబ సభ్యులకు అయిదు లక్షలు కూడా ఇస్తున్నారు.”
“ఇంతకీ అది ప్రమాదమా? విద్రోహకచర్యా?”
“ప్రభుత్వం వారు రైల్వే వారి పనితీరులో లోపం అంటున్నారు. మరి రైల్వేవారు ఏమంటారో?”
“మరి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?”
“శవాలను పీక్కుతినే రాబందుల్లా వచ్చి పోతున్నారు. ఆ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అంటున్నారు”
“ఎంత ఘోరం?”
“మా చిన్నప్పుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో, ఒక చిన్న రైలు ప్రమాదానికి కలతచెంది తన పదవికి రాజీనామా చేసారు. అంత త్యాగధనుడు ఆయన.”
“మరి ఇప్పటి రైల్వే మంత్రి ఏమి చేసారు? రాజీనామా చేసారా?”
“ఇప్పటి మంత్రులకు ‘నామాలు’ పెట్టటమే తెలుసు. మొన్నఆ మధ్య ఒక రాష్ట్ర మంత్రికి న్యాయస్థానంవారు, ఆయన గతంలో చేసిన ఒక నేరానికి జైలుశిక్ష, జరిమానా వేసారు. అందుకు ఆయన స్పందన ఏమిటో తెలుసా? నేను అప్పుడెప్పుడో వ్యభిచారం చేసాను, ప్రస్తుతం పచ్చి పతివ్రతనని చెప్పుకుంటున్నాడు. గతంలో ఒకసారి జగజీవన్ రాం గారు రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ రైలు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలకు తాను బాధ్యుడను కానని చెప్పుకున్నారు ఆయన. ఆ సమయంలో పార్లమెంట్ లో శ్రీవాజపేయి గారు ఇలా అన్నారు “ప్రస్తుతం మనం రైలు ప్రయాణం చేయటమంటే, ‘జగ్ ఔర్ జీవన్ రాం రాం’అనుకోవలసిందేనని”.
“అసలు విషయానికి వస్తాను. మీరు ఒట్టేసి చెప్పాలి. ఇకనుండి రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణం చేయనని!”
” సరేలే! కాస్త ఆ కంట తడి ఆపు.”
అలా ప్రస్తుతానికి ప్రయాణాలు ఆగిపోయి, ఫొన్ లోనో, నెట్ ద్వారానో పిల్లలను చూస్తూ హాయిగా మాట్లాడుకోవటం ఎంతో ఉత్తమం అనిపించింది. అదీ గాక , మన ప్రభుత్వం వారు మనకు సమాజపు బరువు, బాధ్యతలను తెలియచేయటంకోసం బస్సు చార్జీలు, రైలు చార్జీలు దారుణంగా పెంచారు.

11 thoughts on “రైలు పక్కకెళ్ళొద్దురా డింగరీ! డాంబికాలు పోవద్దురా! !

  1. చక్కగా వాస్తవాన్ని వివరించారు ఇంత చిన్న కధలో..ధాన్య వాదాలు..అభివాదాలు సర్

  2. ఈ రోజుల్లో రైలు ప్రమాదాలకి రాజీనామా చేయాలంటే, ఏ గవర్నమెంటూ నిలబడదు.. కారణం – ప్రభుత్వంలో లాల్ బహదూర్ శాస్ట్రీలు లేరు, ప్రతిపక్షాలలో ఆనాటి నాయకులను పొలినవాళ్ళూ లేరు. ఎదో ఒక ప్రమాదం రోజూ చోటుచేసుకుంటుంది.

  3. చాలా బాగుంది, మీరు వ్రాసింది నూటికి నూరు పాళ్ళు నిజం శాస్త్రి గారు.

  4. ప్రయాణం ఏ రూపమైన ప్రమాదం అని తెలిసినా ప్రయాణం చేయక తప్పడంలేదు. ఎద్దుల బండి శ్రేయస్కరం అయినా ఎదుటి వాహనదారుడు సరిగ్గా రాకపోతే ఎద్దులతో బాటు అందులో ప్రయాణికులు కూడ ప్రమాదాన్ని ఎదురుకొనక తప్పదు. అసలు ఎద్దుల బండి కూడ కనుమరుగవుతున్న వస్తువుల పంచన చేరిపోయింది. ఎక్కడకూ పోకుండా ఎవరి పంచన వారు కాలం వెళ్లదీయటం అన్నిటికన్నా శ్రేయస్కరం. మొత్తం మీద ఈ వ్యాసం ద్వారా మంచి సందేశం ఇచ్చారు. అభినందనలు

Leave a Reply to నాగయ్య Cancel reply

Your email address will not be published. Required fields are marked *