రచన: చెంగల్వల కామేశ్వరి

మన దేశం లో కాల భైరవుడు క్షేత్రపాలకుడుగా పార్వతీ పరమేశ్వరులు కొలువయిన వారణాశిని దర్శించడం పూర్వ జన్మ సుకృతం ఎంతో అదృష్టం ఉండాలి. అన్నిటికన్నా మనకి ఆ పుణ్యక్షేత్ర దర్శనం కావాలంటే కాలభైరవుని అనుగ్రహముండాలి. అందుకే మనం వారణాశి వెళ్లాలి అనుకుంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. నిరాటంకంగా మన వారణాశి యాత్ర చక్కగా జరుగుతుంది
వారణాశికి బెనారస్ అని, కాశీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది.
పూర్వం కాశికెళ్లినవారు కాటికెళ్లిన వారు ఒకటే అనేవారు.. పిల్లల బరువు బాధ్యతలు తీరినవారు మాత్రమే వెళ్లేవారు
ఇప్పుడు రహదారులు, రైలు మార్గాలు అన్ని ఏర్పడి వయసుతో సంబంధం లేకుండా అందరూ దర్శిస్తున్నారు. అలాంటి అదృష్టంతోనే నేను ముమ్మారు కాశీ యాత్ర చేసుకున్నాను.
మొదటి సారి ఎవరో నిర్వహించిన కాశీయాత్ర లో, రెండోసారి మా సత్యం అన్నయ్య. మా మరిది రామారావు గారు మా బంధువులందరితో కలిసి వేసిన కాశీయాత్రలో పాలు పంచుకున్నాను. ఆ రెండుసార్లూ కాశీయాత్రకు సంబంధించిన విషయాలు అన్నీ కూలంకషంగా తెల్సుకున్నాను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా ఎన్నో యాత్రలు కండక్ట్ చేసాను నేను ఎవరితో ఎక్కడికెళ్లినా మిగతావాళ్లు గొడవ పెట్టేస్తారు. అందుకే నేను ఏది చూసినా మా వాళ్ల కోసం మళ్లీ టూర్ వేస్తాను
అలాగే మొన్న కార్తీక మాసంలో శైవ క్షేత్రం గంగాస్నాన పునీతం కావాలన్న ఆకాంక్షతో “కార్తీక మాస కాశీ యాత్ర” తొమ్మిది రోజులు వారణాశి తదుపరి త్రివేణి సంగమం, సీతామర్హి, వింధ్యాచల్, నైమిశారణ్యం, గయ, అయోధ్య
అని ఎనౌన్స్ చేసానో లేదో మేమొస్తాము మేమొస్తాము అని ఒక ముప్పైఅయిదు మంది రెడీ అయిపోయారు
16-11-2016 నుండి 1-12-2016 దాకా మొత్తం ట్రిప్…
అందులో ముఖపుస్తక మిత్రులు ఉమా కల్వకోట దంపతులు, వారిజా బాలాజీ దంపతులతో పాటు వారి స్నేహితులు కొందరు కూడా మాతో జాయిన్ అయ్యారు.


నేను యాత్రలు కండక్ట్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను అదేమిటంటే ఆహార వ్యవహారాల విషయం. ఏదో ఒకటి రెండు రోజుల కోసం పర్వాలేదు కాని పదిహేను రోజుల టూర్. ఎవరికి ఏ తేడా చేసినా కష్టం. కొందరు పెద్దవారు, మధ్యవయసువారు అందరూ నలభై సంవత్సరాల పై వారే
అందుకే నేను బుక్ చేసే హొటల్ లో కిచెన్ ఇస్తామన్న సాహు హొటల్ లోనే రూమ్స్ బుక్ చేసాను కుక్ నాగేశ్రరరావు, అసిస్టెంట్ ప్రసాద్, హెల్పర్స్ రామలక్ష్మి, సుజాత. సుగుణ + నేను మొత్తం నలభైమంది కాగానే బుకింగ్స్ క్లోజ్ చేసాను. ఆ తర్వాత వచ్చిన వారందర్నీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది
ఇంక అక్కడికి తీసుకెళ్లాసిన సామాన్లన్ని పెట్టడానికి రెండు పెద్ద బ్యాగ్స్ కొన్నాను. గ్యాస్ స్టౌ, సిలిండర్ హొటల్ అతనే ఇస్తాడు కాబట్టి ఇడ్లీ పాత్ర పెద్దది నలభై ఇడ్లీలు అయ్యేది, నాలుగు పెద్ద గిన్నెలు, వంటకి గిన్నెల సెట్స్, వండిన వంట తీయడానికి డబ్బాల సెట్స్, గరిటెలు అన్నీ సర్దాము. లేకుంటే అక్కడ అద్దె సామానుల షాప్స్ చుట్టూ తిరిగే కన్నా ఉన్న మటుకు పట్టుకెళ్లితే మంచిది కదా.
కూరగాయలు ప్రొవిజన్స్ అవీ అక్కడే కొనుక్కోవచ్చు కదా అనుకున్నాను
అన్నట్లు సరిగ్గా మా ప్రయాణానికి వారం ముందే నోట్ల రద్దు. ఇంక చూడండి వారంరోజులు కష్టపడి బ్యాంకులలో పాత నోట్లు మార్చడం, వాళ్లెంత ఇస్తే అంత డ్రా చేసుకోవడం అదో ప్రహసనం, అమౌంటు ఇవ్వవలసిన వారినందరినీ వారణాశిలో కొత్తనోట్లే ఇచ్చేలా ప్లాన్ చేసుకుని ఆ సమస్యని దాటేసాను. హొటల్ వాళ్లకు, బిగ్ బజార్ ట్రావెల్స్ వాళ్ళకి కార్డ్ గీయటమే! పాపం వాళ్లు బాగానే కోపరేట్ చేసారు కొంత క్యాష్ ఇచ్చాము కాబట్టి వాళ్లు సర్దుకున్నారు.
ఇంక రోజుకో రకం పచ్చళ్ళు మొత్తం పన్నెండు రకాలు. అల్లం, గోంగూర, టమాట, చింతకాయ, ఉసిరికాయ, దోసావకాయ, ఆవకాయ, కొరివికారం, మాగాయ, కొత్తిమీర, కంది పొడుం, మామిడల్లం పచ్చడి, తొక్కుడు పచ్చడి, నిమ్మకాయ అన్నీ పట్టుకెళ్లాము.
ఇందులో తొమ్మిది రకాలు మాత్రం “”అమ్మమ్మ పచ్చళ్లు” అని తార్నాకలో ఆర్డర్ చేసాను. వాళ్లకే మేము ఎక్కే పాట్నా ఎక్స్ ప్రెస్ కి అందించేలా లంచ్ ఆర్డర్ ఇచ్చాను. నైట్ కి రోటీ, ఆలూ కూర మా కాలనీలో ఉన్న శకుంతలకు ఆర్డర్ ఇచ్చాను. వాటర్ బాటిల్స్ స్టేషన్ లోనే కొన్నాము. కనీసం ట్రైన్ లో ఉండే మూడు పూటల్లో రెండు పూటలకు మాతోనే తీసుకెళ్లాలని అనుకున్నాను. లేకుంటే ట్రైన్ ఫుడ్ మూడు పూటలా తినలేము కదా!
అనుకున్నట్లుగానే అందరూ చక్కగా చెప్పిన టైమ్ కే అందరూ స్టేషన్ కి వచ్చేసారు.


ఎవరి టికెట్స్ వారికి, దాంతో పాటు ప్రయాణించే వారందరి పేర్లు ఫోన్ నెంబర్స్ ఉన్న జిరాక్స్ కాపీలు ఇచ్చాను. అందరికీ అందరూ తెలియాలని.. ఎవరి గ్రూపులకు సంబంధించిన గ్రూప్ ల ప్రకారం వాళ్లు ఆయా కంపార్డ్మెంట్ల లో ఎక్కాము. అలా మా కాశీ యాత్ర మొదలయింది. వచ్చిన వాళ్లందరూ సరదాగా ఉండే వాళ్లవడం వలన చాలా బాగా ప్రయాణం సాగింది.
మర్నాడు ట్రైన్ కేటరింగ్ అతనికి ఆర్డర్ ఇచ్చిన కాఫీలు, టిఫిన్స్, లంచ్ అన్నీ మా హెల్పర్స్ సహాయంతో వాళ్లందరికీ అందించగలిగాము.
మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు వారణాశి చేరాము.
స్టేషన్ కి మా వాట్సప్ గ్రూప్ ఫ్రెండ్ అనుపమ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది.సామానంతా కూలీలను మాట్లాడి ముందుగానే మాట్లాడుకున్న మూడు వింగర్స్ లో చేర్చుకుని అందరం హొటల్ కి చేరాము.
హోటల్ నెంబర్ ప్రింట్ ఉన్న కార్డ్స్ అందరికీ ఇచ్చి ఎప్పుడయినా ఎవరయినా మనలో మిస్ అయితే కంగారు పడకుండా విశ్వనాధ్ టెంపుల్ లైన్ కి వచ్చేయండి మన హోటల్ కనిపిస్తుంది అని చెప్పాము. అలాగే ఒక ఇద్దరు ఒక గుడి దగ్గర తప్పిపోయినా ఆ కార్డ్ వల్ల క్షేమంగా వచ్చేసారు. రాత్రిళ్లు అందరికీ టిఫిన్సే కాబట్టి హొటల్ నుండి తెప్పించేసాము.
బిగ్ బజార్ కి వెళ్లి కావల్సినవన్నీ తెచ్చాము అనుపమ నేను. మర్నాడు ఉదయం గంగానదికి స్నానానికి వెడ్తుంటే అందరికీ ఆనందం గంగా ప్రవాహంలా పరవళ్లు తొక్కింది
ఇలా అందరం గంగమ్మ ఒడిలో జలకాలాడి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకుని స్నానాలు ముగించుకుని హొటల్ కి వచ్చి రెడీగా ఉన్న టిఫిన్స్ తిని కాఫీలు సేవించి కాశీ విశ్వేశ్వరుని దర్శనార్ధం గుడికి బయల్దేరాము.


………………………..
మా గుడికి గంగానదికి షాపింగ్ కి దగ్గరగా ఒకే లైన్ లో ఉండటం వలన మా వాళ్లందరికీ మహా సంతోషమయింది. మొదడి రోజే మాతో వచ్చారు ఆ తర్వాత ఎవరికి వీలయిన టైమ్ లో వాళ్ల వాళ్ల ల గ్రూప్ లతో గంగా నదికి, గుడికి షాపింగ్స్ కి వెళ్లేవారు
రాత్రిళ్లు, తెల్లవారుఝామున అభిషేకాలు దర్శించి భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయారు అందరూ.
విశ్వేశ్వరుడు, విశాలాక్షి అన్నపూర్ణాదేవిని దర్శించుకుని మా రూమ్స్ కి వచ్చేసరికి హొటల్ డైనింగ్ హాలు లో వంట రెడీ వడ్డించడానికి మా రామలక్ష్మి, సుగుణ, సుజాత రెడీ

లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని గంగాహారతికి వెళ్ళాము

అదొక అద్భుతమయిన అనుభవం చల్లని గాలి తెమ్మరలు గంగా నది ఒడ్డున గణ గణ గంటారావాలతో రంగురంగుల విద్యుత్కాంతుల మేళవింపుతో వివిధ దేశాలనుండి, మన దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన జనసందోహంతో, శివస్తుతులతో ఇచ్చే గంగాహారతి చూడటం వినటం ఎన్నో జన్మల పుణ్యఫలం.
అదయ్యాక మా రూమ్స్ కి వచ్చేసాం.


ఆ మర్నాడు వారణాశిలోని కాలభైరవాలయం, గవ్వలమ్మ గుడి, వ్యాసకాశి, బౌద్ద ఆరామాలు, సారనాధ్, తిల భాండేశ్వర గుడి, చింతామణి గణపతి, జంగంవాడి గుడి, దుర్గదేవి గుడి, సావిత్రి వారాహి, ఇవన్నీ వ్యాస్ కాశీ చూసాము కాని కొన్ని దగ్గరున్నవి మధ్యమధ్యలో చూసాము.
జంగంబడి గుడి వారణాశిలో అడుగడుగునా ఒక గుడి ఉంది కేదారేశ్వరుడి గుడి


గంగా నది ఒడ్డనే ఉంది లలితా దేవి గుడి కూడా లలితాఘాట్ లో ఉంది
అలా వెళ్లిన రోజు ఒక ప్రమాదం తప్పింది. చెన్నయి నుండి వచ్చిన సుగుణ గారి మెడలో చెయిన్ లాగడానికి ఒకడు విఫలప్రయత్నం చేసాడు
అదృష్టం బాగుండి ఆ రోజు ఆమెకేమి కాలేదు కాని మెడ అంతా గీరుకు పోయింది. దెబ్బకి అందరం విడి విడిగా నడవడం మానేసి గుంపులుగా నడవడం మొదలు పెట్టాము
అలా ఆ రోజంతా చూసి మర్నాడు అలహాబాద్ కి హొటల్ వాళ్లు బుక్ చేసిన 40 సీట్ల బస్ లో ఉదయమే బయలు దేరాము
మా కుక్ చేసిచ్చిన ఉప్మా దారిలో తినేసాము. అలహాబాద్ వెళ్లగానే అందరికీ బోట్స్ లో తీసుకువెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ఒడ్డున ఉన్నపందిరిలో తొమ్మిదిజంటలు శాస్త్రోక్తంగా వేణీ దానమహోత్సవం చూడముచ్చటగా జరిగింది

అక్కడే మరో పక్క పితృకార్యాలు తర్పణాలు పిండ ప్రధానాలు మరి కొంతమంది నిర్వహించుకున్నారు. మరి కొందరు చేసిన. తమకు తెలియకుండా జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తం జరిపించుకున్నారు.
ఆ పక్కనే ఉన్న శయనావస్థలో ఉన్న బేడీ ఆంజనేయస్వామిని, ప్రయాగ లలితను దర్శించాము. తర్వాత బస్ లో ప్రయాణం. మధ్యలో పచ్చని చెట్ల దగ్రర మా కుక్ ఇచ్చిన పులిహోర, ధధ్యోజనం, అరటి పళ్లు లాగించాము. ఈ ప్రయాణంలో జోకులు, పాటలు, మాటలతో అందరికి అందరు తెలిసి పోయారు. వింధ్యవాసినీదేవి కొలువున్న శక్తి పీఠం, ఆ పైన సీతామర్హి అన్నప్రదేశం కి వెళ్ళాము. సీతాదేవి ప్రాణ త్యాగం చేసి భూమిలోకి వెళ్లిన ప్రదేశం చూసాము. పైన మహారాణి సర్వ సులక్షణ జత సీత కాగా క్రింద భూప్రవేశం చేసిన సీతామహాతల్లి ని చూస్తే గుండె చెరువయి కళ్ల లోకి వచ్చింది.


ఆమె చూపులోని భావాలు ఆ మహాతల్లికి జరిగిన అవమానానికి అద్దం చూపుతాయి. అంత సహజంగా ఉంది ఆ మూర్తి
మధ్యలో డిన్నర్ కి ఆగి కాశీ చేరేసరికి పదకొండయింది
ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఒక రోజు వారణాశిలో వున్న పద్నాలుగు ఘాట్స్ చూడటానికి ఒక బోటు మాట్లాడుకున్నాము.
ప్రధాన ఘాట్స్ అయిన దశాశ్వమేధ ఘాట్, లలితా ఘాట్, కేదార్ ఘాట్, హరిచంద్ర ఘాట్ లలో స్నానం చేసి చివరగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవతలు దిగివచ్చే సమయంలో మణికర్ణిక ఘాట్ లలో స్నానం చేసి అక్కడ సంకల్పంతో స్నానం చేసి బోటు వాడికి శివుడు ఇమ్మన్నట్లుగా గుప్తదానం ఇచ్చాము.

చాలా గుళ్ళు చూసాము. తిరిగాము. ఎక్కడా బోర్ అనిపించకుండా ఏదో రూమ్ లో చేరి కబుర్లు చెప్పుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, దర్శనాలకు, షాపింగ్ లకు, గంగా స్నానాలకు కలిసి వెళ్లడం వల్ల అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాము
ఇరవయి అయిదో తారీఖుకల్లా కాశీలో మా తొమ్మిది నిద్రలు అయ్యాయి.
ఆ మరునాడు 26-11-3016 న బయలుదేరి గయ వెళ్లాము. వెళ్లేటప్పుడు దారిలో టిఫిన్ తిన్నాము. పిండప్రధానం చేసే జంటలు తినలేదు. గయలో వున్న మాంగళ్య గౌరీ టెంపుల్ దర్శనం చేసుకున్నాము.
గయ వెళ్లి కుక్ కి గ్యాస్ సిలిండర్, స్టవ్ ఇప్పించి వంట చేయింఛాము. సాయంకాలం బుద్ద గయ కూడా దర్శించాము. ప్రశాంతమయిన పాలరాతి సౌధంలో తధాగతుని చరిత్ర అంతా చెప్పడానికి ఒక గైడ్ ని మాట్లాడుకున్నాము. అతను చాలా చక్కగా వివరించి చెప్పాడు..

లంచ్ చేసి నైట్ అక్కడే ఉందామనుకుంటే మీరు నైట్ బయల్దేరితేనే రేపు మధ్యాహ్నానికి అయోధ్య వెళ్లగలం లేకుంటే రేపు రాత్రికి వెడితే అయోధ్యలో ఏమి చూడలేరు అని డ్రైవర్ చెప్పాడు.. అంతే వెంటనే ప్యాకప్ అన్నాను
విషయం అర్ధం కానివారు కొందరు చిందులు వేసారు కాని మర్నాడు మధ్యాహ్నం (27-11-2016) అయోధ్యకు చేరేసరికి వాళ్ళకే అర్ధమయింది.
అసలు వారణాశి నుండే గయ వెళ్లొచ్చు కాని డిస్టెన్స్ వల్ల నైట్ కి చేరకుంటే తొమ్మిది రాత్రుల నిద్రకు భంగమవుతుంది. అని అలా వెళ్లలేదు. వారణాశికి ఒక వైపు గయ మరో వైపు అయోధ్య. అయోధ్యకు నైమిశారణ్యం దగ్గరే అందువల్ల గయనుండి వారణాశి, వారణాశినుండి అయోధ్య చూసామన్న మాట.
అయోధ్యలో పటిష్టమయిన, నిర్భేద్యమయిన పోలీస్ బందోబస్త్ లో ఉన్న రామ జన్మభూమి చూసాము. అక్కడ ఉన్న రామ మందిరాలు కూడా దర్శించాము
రాత్రికి కుక్ కి మళ్లీ గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇప్పించి వంట చేయించాము.
ఒక హొటల్ వాళ్లు వాళ్ల కిచెన్ ఇచ్చారు. అక్కడే ఉన్న బెంచీల మీద కూర్చుని చలిలో వేడి భోజనం తినడం ఒక ధ్రిల్ అందరికీ.
ఏవో రెండు ఐటమ్స్ అన్నం వండేవాడు కుక్ నాగేశ్వరరావు. ఏడువారాల నగల్లాగా ఒక్కోరోజు ఒక్కో పచ్చడితో భోజనం. పెరుగు ఎక్కడ పడితే అక్కడే దొరికేది. కేవలం వంట సామగ్రి గిన్నెలతో మా కుక్ రడీ. అద్దెకి గ్యాస్ స్టవ్ ఇంకేమి కావాలి. అందరికీ ఆరోగ్యకరమైన హోమ్లీ ఫుడ్.
దానికే ఎంతో సంతోషించారు ఈ యాత్రకు వచ్చినవారంతా.. ఆరోగ్యమయిన భోజనం చాలు పంచ భక్ష్య పరమాన్నాలు అవసరం లేదు అనేవారు. ఆ కోపరేషన్ లేకుంటే మనం కూడా ఏమీ చేయలేము కదా!
రాత్రికి నైమిశారణ్యం చేరుకున్నాము. అప్పటికే బుక్ చేసిన సాయి ధామ్ ( సాయి బాబా గుడి) లో రూమ్స్ తీసుకున్నాము. మర్నాడు ( 28–21-2016) కొన్నిజంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నారు


108 చక్రాలశ్రీచక్ర కుండ్

శ్రీకృష్ణుడు పూరీ జగన్నాధుడు గుడి కూడా అక్కడే వుంది చూసాము

సూత గద్దె గోమతీ నది, వ్యాసగద్దె లలితాదేవి గుడ, ధదీచి కుండ్, రుద్ర కుండ్ ( ఈ కుండంలో పాలు మారేడు దళాలు పళ్లు పూలు నీళ్ల ల్లో ఉన్న శివలింగానికి సమర్పించి ప్రసాదం ఇమ్మని అడగాలి. అప్పుడు ఏదొక పండు పైకి వస్తే తీసుకోవాలి)
వెంకటేశ్వరస్వామి గుడి శ్రీ చక్రతీర్ధం అన్నీ దర్శించుకుని సాయిధామ్ లో వారు పెట్టిన భోజనం చేసి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం. ఛలో వారణాశి అనుకుని బయలు దేరాము. మధ్య మధ్యలో అగుతూ మర్నాటికి( 29-11-2016) వారణాశి చేరాము ఆ రోజు అరోజున అన్నపూర్ణా దేవి ఆలయంలో భోజనం చేసాము. ఆవాళంతా రెస్టే.
30-11-2017 న మిగతా షాపింగ్స్, ప్యాకింగ్స్, పేమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. నో టిఫిన్ అనుకుని 11 గంటలకే భోజనం రెడీ. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకే హొటల్ నుండి మాట్లాడుకున్న వింగర్స్ లో మొగల్ సరాయ్ స్టేషన్ కి వెళ్లాలి మా ట్రైన్ కి అది స్టార్డింగ్ పాయింట్.
కాశీలో ఎక్కువ సేపు ఆగదు. గంటన్నర ప్రయాణం. అయినా లగేజిలతో ఏ ఒకరు ఎక్కలేకున్నా కష్టం అని మూడింటికి అక్కడ చేరాలి. అందుకే డైరెక్ట్ లంచ్. రాత్రికి చపాతీ ఫ్యాకింగ్స్ షరా మామూలే.
ఇంతకి ఆ లంచ్ దగ్గర చూడాలి అందరూ డల్ అయిపోయారు.
చిత్తూరు నుండి వచ్చిన శ్రీనివాస్( వారిజా బాలాజీల ఫామిలీ ఫ్రెండ్)
అందర్నీ వాళ్ల ఫీలింగ్స్ చెప్పమన్నారు. చెప్తున్నవారు చెప్తున్నారు. ఒక పక్క సుగుణ మరో పక్క అనుపమ మరో పక్క ఇంకొకరు కళ్లనీళ్ల పర్యంతమయి పోయారు. బాలాజీగారు చెప్పిన మాటలు.. ఇక్కడినుండి కొందరు వస్తువులు, మరి కొందరు దుస్తులు, మరి కొందరు పూసలు, ఇలా పట్టుకెడతారు నేను మాత్రం కొన్ని జ్ఞాపకాలు పట్టుకెడుతున్నాను అన్నారు


ఎక్క డ పుట్టామో ఎక్కడ పెరిగామో! కామేశ్వరి గారు కండక్ట్ చేసిన ఈ టూర్ వలన ఇలా కలుసుకున్నాము. పదిహేను రోజులు కలిసి మెలిసి ఒక కుటుంబంలా ఉన్నాము. విడిపోవాలంటే చాలా బాధగా ఉంది అని అందరూ సజల నేత్రాలతో చెప్పారు నాకూ అదే ఫీలింగ్ ఇన్నిరోజులు వీరందర్నీ నావాళ్లుగా చూసుకున్నాను కదా!
దానికి వారందరూ సంతోషించడం నాకూ ఆనందమే కదా!
అంతా భగవంతుడి దయ అనుకున్నాను
ఇలా అందరు ఆత్మీయులతో మా యాత్ర దిగ్విజయంగా ముగించుకుని వచ్చేసాము.
ఇది నేను నిర్వహించిన కాశీ యాత్ర

చెంగల్వల కామేశ్వరి

By Editor

12 thoughts on “ట్రావెలాగ్ – వారణాసి యాత్ర”
  1. plz inform when will you be going next time. Kaasi okka saari vellamu bt do not remember much. chaalaa baagaa describe chesaaru???

  2. చాలా బావుందండీ.మాకూ వెళ్లాలనిపించింది.

  3. బాగుంది కామేశ్వరిగారూ మీ యాత్ర. వీలున్నప్పుడు మీ టీమ్ తో మేమూ వస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *