February 27, 2024

బ్రహ్మలిఖితం 6

రచన: మన్నెం శారద

భగవంతుడు దుష్టులకెన్నడూ సహాయపడడని.. తాత్కాలికంగా కనిపించే విజయాలన్నీ తర్వాత శాపాలై వంశపారంపర్యంగా తింటాయని అతను గ్రహించే స్థితిలో లేడిప్పుడు. అదతని దురదృష్టం.
*****
లిఖిత ఎంతో అవస్థపడి హైద్రాబాదు చేరుకుంది. తల్లి ఇచ్చిన ఎడ్రస్ ప్రకారం ఆమె ఎలాగోలా జుబ్లీహిల్స్‌లోని కేయూర లాబరేటరీస్‌కి చేరుకుంది. అంతవరకు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదని ఆమెకి గుర్తు కూడా లేదు.
ఆమెకు ఆకలి, దాహం అన్నీ తండ్రిని చూడాలన్న ఆరాటంలోనే కలిసిపోయాయి.
దూరం నుండే కనిపిస్తున్న తల్లి పేరు చూసి ఆమె హృదయం ఆర్ద్రమైంది.
తల్లి మీద అతనికి ప్రేమ లేకపోతే ఆ పేరెందుకు పెడతారు. ఒక అవిరామ కృషిలో అతను బాంధవ్యాలు తెగ త్రెంచుకొని అంకితమైపోయేరు. అంతే” అనుకుంది మనసులో.
ఇంకొన్ని సెకండ్లలో తన తండ్రిని చూడబోతున్నానన్న ఆనందం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.
గబగబా గేటువేపడుగులు వేసింది.
అక్కడంతా నిర్మానుష్యంగా వుంది. గేటుకి తాళం వేసుంది. లిఖిత హతాశురాలయి బాగ్‌ని క్రిందపెట్టి దిక్కులు చూసింది.
అడగటానిగ్గాని.. చెప్పడానిగ్గాని అక్కడసలెవరూ లేరు.
ఎలివేటెడ్ లాండ్ కావటాన చలిగాలి జివ్వున మొహానికి తగులుతోంది.
ఆర్కిటెక్ట్స్ తమ నైపుణ్యాన్నుపయోగించి కట్టిన అందమైన బిల్డింగ్స్ షోకేసులలోని కేకు ముక్కల్లా తళుక్కుమంటున్నాయి. కాని ఆ అందాల్లో ఏదో లోపముంది. జీవచైతన్యం లేదు వాటిల్లో. అలికి ముగ్గేసిన ఒక వూరి గుడిసెకున్న కళ కూడా వాటికి లేదు. కారణం మనిషి నానాటికి కోల్పోతున్న సంఘీభావమే. మనిషి తన సుఖాన్ని యంత్రంలా డబ్బు సంపాదించడంలోనే చూసుకొని ఆనందపడుతున్నాడు. వందలుంటే వేలు, వేలు, లక్షలు, కోట్లు కావాలని అంచులేని తీరాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. అందుతున్న ఆనందాల్ని కాలదన్నుతున్నాడు. గమ్యం లేని పరుగుతీస్తున్నాడు. అందుకే అతని ఆర్జనకి అందం లేదు. ఆ అందానికి కళ లేదు.
ఎన్నో ఖరీదైన కార్లు ఆ రోడ్డువెంట పరిగెడుతున్నాయి. కాని ఏ ఒక్కరూ ఒక ఆడపిల్ల ఎడ్రస్ దొరక్క నిలబడి వుందేమోననిగాని, లిఫ్ట్ కావాలని గాని ప్రశ్నించలేదు. కళ్లకి, కార్లకి కూలింగ్ గ్లాసెస్ బిగించి కృత్రిమంగా సృష్టించుకున్న చీకటిలో పరుగులు పెడ్తూనే వున్నారు.
లిఖిత అలాగే నిస్పృహగా చూస్తూ నిలబడింది నిస్సహాయంగా.
“ఏ అమ్మా! కౌన్ హోనా ఆప్‌కో?”
ఆ ప్రశ్నకి ఉలిక్కిపడీ చూసింది లిఖిత.
గూర్ఖా వాచ్‌మన్ బిల్డింగ్ వెనుకనుండి వస్తూ అడిగేడామెను.
ఆమెకి ప్రాణం లేచొచ్చినట్లయింది.
“కార్తికేయన్ సైంటిస్టు” అంది.
” ఓ షెహర్ మే నై!. బాహర్ గయే!” అన్నాడతను.
లిఖిత ఒక్కసారిగా పాతాళంలోకి కూరుకుపోయినట్లు ఫీలయింది.
“ఏ ఊరో తెలుసా?”
అతను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్లు గడ్డం గీక్కుంటూ”ముజ్‌కో నహీ మాలూం. మీనన్ సాబ్‌కో పూచో” అన్నాడు.
ఎక్కడుంటారాయన?”
గూర్ఖా వేలుపెట్టి దూరంగా చూపించాడు.
“ఓ పింక్ బిల్డింగ్. ఉదర్ జావో”
అక్కడ రకరకాల సైజుల్లో చాలా పింక్ బిల్డింగ్స్ ఉన్నాయి.
అయినా తన ప్రయత్నం తాను చెయ్యడానికి అటువైపు సాగిపోయింది.
తండ్రిని సకాలంలో చూడలేకపోయేనన్న వేదన రెండు కన్నీటి బిందువులుగా మారి ఎంత ఆపుకున్నా ఆగక ఆమె బుగ్గల మీదకి జారిపోయింది.
*****
నల్లని నైలాను దారాలతో అల్లిన దోమతెరలా చీకటి ఆకాశం నుండి జారుతూ భూమిని కప్పుతోంది.
పడమట సూర్యుడు నిష్క్రమించిన ఛాయల్ని చూపుతూ భూమికి, ఆకాశానికి మధ్య ఒక చిన్న అస్పష్టమైన రేఖ కనబడుతూనే వుంది.
విశాఖపట్నంలోని మాహారాణీ పేట అవతల వున్న పేదవర్గపు ప్రపంచంలోకి అడుగుపెట్టేడు రాజుతోపాటు నారాయణ.
నేల మీద బోర్లించిన ఒక పెద్ద కోళ్ళ గంపలా వుందతనిల్లు.
“నువ్విక్కడే కూర్చో” అని గుడిసె ముందున్న చిన్న విరిగిన బెంచి చూపించి, చిలక పంజరాన్ని తీసుకొని లోపలికెళ్ళేడు రాజు.
నారాయణ తటపటాయిస్తూ ఆ బెంచి మీద కూర్చున్నాడు.
కీచుమంటూనే నారాయణ బక్క శరీరాన్ని మోయడానికంగీకరించింది బెంచ్.
అయితే గరిమనాభి లేనట్లుగా వూగుతోన్న ఆ బెంచి మీద కూర్చోవడానికి నారాయణ చాలా అవస్థ పడుతున్నాడు.
జైలుకి వెళ్ళేముందు తను చేసుకున్న ఆఖరి పెళ్లి గుర్తొచ్చింది అతనికి.
ఏం వైభోగం! ఏం మర్యాద!
పెళ్ళికూతురు అతిలోక సుందరి కాకపోయినా అనాకారి మాత్రం కాదు.
“మా చెల్లెలు ఎం.ఏ మూడుసార్లు చదివింది” అన్నాడు పెళ్ళికూతురు అన్న గర్వంగా.
“ఏం ఫెయిలయిందా పాపం?” అని తనన్న మాటలని వాళ్లు హాస్యంగా తీసుకొని తెగ నవ్వేరు.
“ఇంజనీరింగ్ చదివి ఏం తెలీనట్లడుగుతున్నారు. మా చెల్లి ఒకసారి సోషియాలజీతో, మరోసారి సైకాలజీతో, ఇంకోసారి ఫిలాసఫీతో పాసయింది. ఇంత చదివినా దానికి గర్వమనే పదానికి అర్ధం తెలీదు. ఏంటొ పెళ్ళే ఎంతకీ కుదర్లేదు” అన్నాడు పిల్ల బావగారు
“ఆలస్యమైనా మాంచి కుర్రాడు దొరికేడు. మా మనవరాలిది అదృష్ట జాతకమే బాబూ. దాని పేరన పదెకరాల మాగాణి వుంది. వంద తులాల బంగారముంది. మంచి ఉద్యోగం చేస్తుంది. తెలిసీ తెలియని వయసులో ఒక ముదనష్టపు పెళ్లి చేసేం. వాడు శోభనం జరక్కుండానే పుటుక్కుమన్నాడు. అడ్డుపుల్లలేసేందుకే అయిన వాళ్లున్నారు. తెలిసినవారెవరూ దీనికి సంబంధాలు రాకుండా చేసేరు చుట్టాలు. ఇన్నాళ్లకి నువ్వొప్పుకుని దాని మెడలో మూడు ముళ్ళేసేవు. చల్లగా నూరేళ్ళు కాపురం చెయ్యండి” అంది అమాయకంగా పిల్ల నాయినమ్మ.
పేపల్రో ప్రకటన చూసి ఆ పిల్లనెందుకిచ్చి చేసేరో తనకర్ధమయింది.
పెళ్ళికూతురు అన్న మాత్రం పోయే ప్రాణం గొంతులో అడ్డం పడ్డట్లుగా చూశాడు తనవైపు.
“వెంటనే తను చిరునవ్వు నవ్వి లేచి బావమరిది భుజం తట్టి “నాకేదో తెలిసిపోయిందని మీ అమ్మాయిని వదిలేస్తానేమోనని బాధపడకండి. నాకిలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. మీ అమ్మాయిని బంగారంలో పెట్టి చూసుకుంటాను” అన్నాడు సదరు పిల్ల వంటిమీద నగల్ని తలచుకుంటూ.
పిల్ల అన్న తన చేతులు పట్టుకున్నాడు ఆనందభాష్పాలతో. అంతా బాగానే జరిగిపోయింది.
రాజస్థాన్‌లో తన ఆస్తుల గురించి సింగపూర్‌లో తన షేర్లు గురించి చెప్పీ చెప్పనట్లు నిగర్వంగా అప్పుడో మాట, ఇప్పుడో మాటగా సాదాసీదాగా అన్నాడతను.
పెళ్ళికొడుకు నిరాడంబరుడని పెళ్ళికొచ్చిన వాళ్లందరూ చెప్పుకుని పొగుడుతుంటే విననట్లుగానే విన్నాడు.
పెళ్ళయిన మర్నాడు సినిమాకని బయల్దేరితే దారిలో కారాపింది పెళ్లికూతురు.
“నా వాచీ బాగా లేదు. కొత్తది కొనిపెట్టండి”అంది సరదాగా. జేబులో రూపాయి లేకపోయినా నవ్వుతూ షాపులోకెళ్ళేడు. అవీఇవీ తిరగేసి “ఈ ముష్టి ఇండియా వాచీలెందుకు, వచ్చేనెలలో సింగపూరెల్తాగా. తెస్తాలే” అన్నాడు.
ఆ అమ్మాయి అంగీకరించింది.
ఇద్దరూ కారెక్కేసి వెళ్ళిపోయేరు.
పదహార్రోజులు తనని నేల మీద నడవనివ్వలేదు. ఒకటే మర్యాదలు. విందు భోజనాలు. సరదాలు, సంతోషాలు.
ఆ మర్నాడే పెళ్లికూతురి బంగారం పట్టుకుని పారిపొవాలని ప్లాను చేస్తుండగా తన దురదృష్టం పండి పెళ్లికూతురి స్నేహితురాలు శైలజ వచ్చింది.
పెళ్లికి రాలేకపోయినందుకు విచారిస్తూ ఆవిడ మాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి తన వైపు నవ్వుతూ చూసిందల్లా షాక్కొట్టినట్లయిపోయి “మీరేంటి?” అంది.
“వెంకటేశ్వరరావు” అన్నాడు తను తడుముకుంటూ.
“ఇది నీ కొత్త పేరా?” అడిగిందావిడ వెటకారంగా.
తనకి గొంతులో తడారిపోతున్నది. కొంపదీసి ఈవిడ గతంలో తను చేసుకున్న వాళ్లలో ఒకర్తి కాదు కదా. అనుకుంటున్నాడు భయంభయంగా.
“వీడు పెద్ద చీట్. వీడు రకరకాల పేర్లతో చాలామందిని పెళ్లిచేసుకొని ఆనక పెళ్లికూతురి నగలు కాజేసి ఉడాయిస్తాడు. గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర కల్యాణమంటపంలో ఒక అయినింటి పిల్లని పెళ్లి చేస్కుంటుంటే వీణ్ణి అరెస్ట్ చేసి జైలుకి పంపేను. రిలీజయ్యేడో లేదో వీడు మళ్లీ మీకు టోపీ పెట్టేసేడు” అంది శైలజ.
అప్పుడర్ధమయింది తనకి అవిడ ఆ రోజు తనని అరెస్టు చేసిన పోలీసాఫీసరని.
వెంటనే పెళ్ళిల్లు శవం వెళ్లిన యిల్లులా తయారయింది.
ఏడుపులు.. మొత్తుకోళ్ల మధ్య శైలజ ఫోను చెయ్యగానే పోలీసులొచ్చి తనను అరెస్టు చేసి పట్టుకుపోయేరు.
ఈసారి జైల్లో పోలీసులు తనని కుళ్ళబొడిచేరు.
ఆరోగ్యం చెడింది.
“ఏరా పెళ్లికొడకా! నీ మొహం అద్దంలో చూస్కోరా ఒకసారి. వెళ్లి మళ్లీ పెళ్ళి చేస్కుంటావురా బాడ్కో!” అంటూ పచ్చి బూతులు తిట్టి బూట్ల కాళ్లతో తన్నేరు.
అంతమంది పెళ్లికూతుళ్ల శాపాలు తగిలి పాపాలు పండినట్లుగా తనకి టి.బి. వచ్చింది. ఆ జబ్బుతో బాధపడుతున్నా పోలీసులు జాలి చూపించలేదు. మందిప్పించి మరీ తన్నేవారు.
ఎలాగో జబ్బు నయమైంది కాని పీనుగ రూపు పోలేదు. తనకి మరో వ్యాపారం, మోసం తెలీదు. ఇది తప్ప. కాని తన రూపం చూసి పిల్లనెవరూ ఇవ్వరు. ఏం చేయాలి తనిప్పుడు.
“ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు?” అనుకుంటూ రెండు ముంతలు తీసుకొని బయటకొచ్చేడు రాజు.
“ఏం లేదు.” అని ఈ లోకంలోకొచ్చి ముంతలకేసి చూస్తూ “ఏంటది?” అన్నాదు నారాయణ.
“సీసాలో ఉంటే బ్రాందీ, పేకట్‌లో వుంటే సారా, ముంతలో వుంటే కల్లు. తాగు” అంటూ ఒక ముంత నారాయణ కందించేడు రాజు.
చాలా రోజుల తర్వాత అలాంటి ద్రవం కనిపించటంతో ప్రాణం లేచొచ్చినట్లయింది నారాయణకి.
ముంతెత్తుకుని గడగడా తాగేసి “చాలా బాగుంది. ఏ కల్లిది?” అనడిగేడు.
“ఈతకల్లు. సరేగాని అలా గబగబా తాగేసేవేంటి.. నా పెళ్లామింకా కబాబులే తేలేదుగా..”అనడిగేడు రాజు అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ.
నారాయణ సిగ్గుపడుతూ”ఇంకో ముంత తెప్పించరాదూ!” అనడిగేడు ఆశగా.
“దాందేవుంది. కాని, ఆ కల్లుకొట్టు నా పెళ్లాంది. అది రూపానికే కాదు గుణానిక్కూడా కీలుగుర్రంలో రాక్షసిలాంటిది. పైగా చెప్పలేని గర్వం. దాని బాబుకి ఇలాంటివి రెండు గుడిసెలున్నాయి.
పెళ్లికి నాకో వందరూపాయల కట్నం, రెండు పందులు, ఒక టెర్లీన్ చొక్కా కొనిపెట్టేడు. దీనికో నాలుగు ఈత చెట్లున్నాయి. అందుకే నన్నిది పురుగులా చూస్తది. సాయంత్రం నే తెచ్చిన చిల్లర లెక్కెట్టుకునే కల్లు పోస్తది”
అతని మాట పూర్తవుతుండగానే రయ్యిమంటూ రాజు పెళ్లాం కబాబులు తీసుకొని అక్కడికొచ్చి “ఈడెవడు?” అంది నారాయణని సీరియస్‌గా చూస్తూ.
“నాక్కావల్సినోళ్ళే. ఎల్లి ఇంకో ముంత కల్లిప్పించు” అన్నాడు రాజు గాంభీర్యంగా.
“ఏంటి ఇంకో ముంత కల్లా! తా దూర కంతలేదు మెడకో డోలంట. నువ్వు తాగిందే దండగ. బయటకి నడవండి” అంది కస్సున తోకమీద లేచిన త్రాచులా.
ఎన్నో వెధవ పనులు చేసిన నారాయణ కూడా ఆవిడ గొంతువిని అకారం చూసి అదిరిపడ్డాడు.
ఆవిడ నిజానికి చూడగానే బ్రహ్మరాక్షసిలా గోళ్ళూ, పళ్లతో లేదు.
సాదా నలుపు, సన్నం, గూళ్లెత్తు.. మామూలుగానే వుంది.
కాని ప్రత్యేకంగా ఆ మొహంలో ఎక్కడో చెప్పలేని ఒక హీనాతినీనమైన కళ వుంది. దుర్భర దారిద్యం చూపెత్తినట్లుగా కట్టగట్టుకు తరుముకొస్తాయనిపించింది. ఇలాంటి స్త్రీని రాజు పాపం ఎలా పెళ్లి చేసుకున్నాడో~” అని కొద్దిగా విచారించేడు కూడ.
రాజు లేచి ఆవిణ్ణి పిలిచి “ఊరికే అరవకు. అతను బాగా డబ్బున్న మారాజు. ఇద్దరం కలిసి ఓ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం” అన్నడు.
“డబ్బున్న మారాజుకి నీతో ఏంటి పని?” అందావిడ కోపంగా.
“సవాలక్షుంటాయి. డబ్బున్నోళ్లకి బుర్ర వుండదు. అందుకే నా దగ్గర కొచ్చేడు. నువ్వెళ్లి ఇంకో ముంత కల్లు పంపించు. మన పని సజావవుతుంది9” అన్నాడు.
ఆవిడ తలూపి లోనికెళ్లింది.
ఇంకాస్సేపటిలో ఆవిడ మరో ముంతకల్లు తెచ్చిపెట్టి వెళ్లింది.
ఆవిడ వెళ్తుంటే “సంపెంగీ!” అని పిలిచేడు రాజు.
సంపెంగి వెనుతిరిగి “ఏంటింకా?” అంది చిరాగ్గా.
“ఇంకో రెండు కబాబులు కూడా”
సంపెంగి లోనికెళ్లిపోయింది.
నారాయణ తెల్లబోయి చూస్తుంటే “ఏంటలా అశ్చర్యపోతున్నావు?” అనడిగేడూ రాజు నవ్వుతూ.
నారాయణ తేరుకుని “ఊహూ.. ఏం లేదు”అన్నాడు మొహమాటంగా.
“నువ్వు చెప్పకపోయినా నేనర్ధం చేసుకోగలను. రోజూ నా దగ్గరకొచ్చే జనాన్ని ఎంతమందినో చూస్తుంటాను. మొహాల్ని చూసి వాళ్ల భావాలు కనిపెట్టే తెలివి నాకుంది. దరిద్రపు పెద్దమ్మలా వున్న నా పెళ్లానికి సంపెంగి పేరేవిటా అని కదూ! ఇదే సందేహమొచ్చి నేను నా మావనడిగేను. ఈ పేరెందుకు పెట్టేవని ఆయన పెద్ద వేదాంతిలా నవ్వి లక్ష్మిదేవిని దరిద్రురాలని పిలిచినా కళకళ్ళాడుతూనే వుంటది. ఇది భూమ్మీద పడగానే దాని తల్లి దీన్ని చూసి గుండె ఆగి చచ్చింది. మంత్రసాని మూర్చపోయింది. నేను కూడా దాన్నెత్తుకోటానికి ఝడుసుకున్నాను. కాని.. తప్పలేదు. రక్తసంబంధం. ఇక అందమెలాగూ లేదని పిలుచుకోటానికైనా బాగుంటుందని సంపెంగి పేరు పెట్టుకున్నాను.. అన్నాడు” అంటూ నవ్వాడు.
“మరి నువ్వెలా పెళ్లి చేసుకున్నావీవిణ్ణి?” జాలిగా అడిగేడు నారయణ.
“ఏం చేయను. నేను మరీ అతీగతీ లేనివాణ్ణి కాదు. మా నాన్న గవర్నమెంటాఫీసులో జవానుగా పని చేసేవాడు. ఆయన అకస్మాత్తుగా చచ్చిపోయేడు.వెంక మాకు ఆస్తి లేదు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. గతిలేక వీళ్ల పేటలో వీళ్ళ గుడిసెకే అద్దెకొచ్చేం. నా చెల్లెలి పెళ్ళికోసం మా అమ్మ ఇతని దగ్గర అప్పు చేసింది. అప్పు తీర్చలేకపోయెం. ఇక తన కూతుర్ని పెళ్లి చేస్కుని తీరాలని పట్టుబట్టేడు మా మామ. తప్పించుకోలేని పరిస్థితిలో దీన్ని కట్టుకున్నాను. ఆ బెంగతోనే మా అమ్మ చచ్చిపోయింది. రోజంతా ఎంతో సంపాదిస్తాను. అంతా ఎలా ఖర్చయిపోతుందో తెలియదు. తెల్లారి పది పైసల బిళ్లుండదు” అన్నాడు రాజు విచారంగా.
నారాయణ కూదా దిగులుగా మొహం పెట్టి చూసాడు.
“సరే! మధ్యలో దాని సంగతి దేనికి. నాకో బ్రహ్మాండమైన ఉపాయం తోచింది. ఆ పని చేస్తే మనం ఆర్నెల్లలో లక్షాధికార్లమైపోవచ్చు” అన్నాడు రాజు సంతోషంగా.
“ఏంటది?”
రాజు నారాయణ చెవి దగ్గర చేరు గుసగుసలాడేడు.
అది విని నారాయణ ఉలిక్కిపడి “అమ్మా దొరికిపోయేమంటే సున్నంలోకి ఎముకుండదు” అన్నడు భయంభయంగా.
“దొరకడడమంటూ జరగదు. నా దగ్గరికి చదువుకున్న బడాబడా బాబులొస్తారు. వాళ్ల బలహీనతలు నాకు తెలుసు. ఇప్పుడు మనం చేసేది కొంచెం పెద్ద ఎత్తులో జరుగుతుంది. అహోబిలంలో నా తమ్ముడున్నాడు. వాడు మనకి కలిసొస్తాడు. నే చూసుకుంటాగా! నువ్వు నే చెప్పినట్లుగా చెయ్యి” అన్నాడు రాజు.
నారాయణ సందేహంగా చూసేడు.
రాజు ఫర్వాలేదన్నట్లుగా నవ్వేడు.
******
ఆ ఇల్లు నిశ్శబ్దాన్ని కూడా భరించలేనంత నిశ్శబ్ధంగా వుంది.
అక్కడ కట్టిన కట్టడాలన్నింటిలోనూ ఆ ఇంటికొక ప్రత్యేకత వుండటం గమనించింది లిఖిత.
ఆ ఇల్లు హిప్‌డ్ రూఫ్‌తో సాంద్రతతో కూడిన ఆకుపచ్చని చెట్ల మధ్య విరిసిన ఒకే ఒక రోజాపువ్వులా వుంది. ఆ ఇంటిని గమనిస్తే ఆ ఇంటి యజమాని అభిరుచి ప్రస్ఫుటమవుతుంది.
లిఖిత గేటు తెరవగానే గుబురుగా వున్న మామిడి చెట్టులోంచి ఒక కోయిల కూతకూసింది.
చెట్ల నిండా పేరు తెలియని రకరకాల పిట్టలు వాసాలు చేసుకొని ధీమాగా చిగుళ్ళు మేస్తూ, తోకలాడిస్తూ, కొమ్మకొమ్మకి రెక్కలు టపటపలాడిస్తూ ఉత్సాహంగా గెంతుతున్నాయి. ఉడుతలు కొన్ని ఆకలి లేకపోయినా చిలిపిగా జామపిందెలు కొరికి క్రిందపడేసి దొంగచూపులు చూస్తున్నాయి.
గేటు చప్పుడు విని ఒక తెల్లని పిల్లి మ్యావ్‌మంటూ ముందుకొచ్చి నిలబడి లిఖితని తేరిపార చూసింది.
గోడ ప్రక్కన గిన్నెలో పాలు తాగుతున్న పామరిన్ కుక్కపిల్ల కుయ్‌కుయ్‌మన్నట్లుగా తలెత్తి భౌభౌమంది.
దాని కళ్లు నల్లనేరేడు పళ్లలా మెరిసేయి. వాటిలో కాపల గుణంకన్నా స్నేహగుణమే మిన్నగా అనిపించింది.లిఖిత చెయ్యివూపి చిన్నగా నవ్వింది.
ఆ మాత్రానికే కుక్కపిల్ల స్నేహపాత్రంగా తోకాడించింది.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *