March 29, 2024

మాయానగరం – 35

రచన: భువనచంద్ర

“వాన్ని గమనించాను వెంకటస్వామి… నిస్సందేహంగా వాడు పరమశివమే! అయితే వాడు ఇటువైపు రాలేదు. వెనక వైపు నుండి వచ్చి మా పెరట్లోకి దూకాడు. యాక్ట్యువల్ గా ఇవాళ నాకు ఆఫ్. అయినా ఓ చిన్నవిషయం వల్ల ఆఫీస్ కు వస్తూ వాడ్ని చూశాను. వాడి కథంతా మహదేవన్ గారు నాకు చెప్పారు. వాడెంత క్రూరుడో కూడా చెప్పారు. నువ్వే ఎందుకో నాతో చెప్పడానికి సందేహించావు. వాడేదో క్రూరత్వమైన ఆలోచనలతోటే ఇక్కడికొచ్చాడు. బహుశా వాడొచ్చాడని మీకు తెలియడానికే నా ముందు పక్షవాతం వచ్చినవాడిలాగా కాలు యీడ్చుకుంటూ అటు ఇటు తిరిగాడు. కానీ, నిన్న వాడ్ని నేను చూశానని వాడికి తెలీదు. వాడి వెనుక నేనున్నాను. చాలా చలాకీగా నడుస్తున్నాడు. గోడ కూడా ఎక్స్ పర్ట్ గా దూకాడు. మహదేవన్ గారు చాలా భయపడుతున్నారు… వీడి వల్ల ఏం ముప్పు వస్తుందో ఏమో! ” వెంకటస్వామితో వివరంగా అన్నాడు వాచ్‌మన్! వెంకటస్వామి గుండెల్లో రాయిపడింది. అసలే పాము… దాని తోకని తొక్కడం జరిగింది… ఖచ్చితంగా దాని పగ రెట్టింపుకి రెట్టింపై వుంటుంది.
“థాంక్స్ అన్నా.. నీ దగ్గర కొన్ని విషయాలు దాచిన మాట వాస్తవమే…కారణం పరమశివానికి నేను నందినిని ప్రేమిస్తున్నాననే అపోహ వుంది. వాడు అసలే శాడిష్టు. ” అంటూ నందినిని లేపుకుపోద్దామన్న తన ఆలోచన తప్ప మిగతా విషయాలన్నీ, అంటే పరమశివం తన మీద చూపించిన శాడిజంతో సహా అన్నీ విషయాలు పూస గుచ్చినట్టు వాచ్‌మన్ తో చెప్పాడు వెంటస్వామి.
వాచ్‌మన్ అవాక్కై విన్నాడు.
“ఇవన్నీ పోలీసులకి చెప్పి వాడిని పట్టి ఇవ్వచ్చుగా?” అన్నాడు అంతా విని.
“ఆధారాలేవీ? వాడు రాసుకున్న డైరీలో పేజీలున్నాయి. అది రాసింది నేను కాదనొచ్చు. పోనీ అందులో ఏం రాశాడో మహదేవన్ చదివి పోలీసులకి చెప్పినా , పోలీసులు కన్ఫర్మేషన్ కోసం , జరిగినదల్లా ఎంక్వైరీ చెయ్యాలి. అంటే కేరళ పోలీసులని సంప్రదించాలి. రెండు రాష్ట్రాల మధ్య సంగతది. ఎప్పటికి తేలుతుంది? అదీ గాక, తండ్రి దగ్గుతూ వూపిరాడకుండా చనిపోతుంటే కామ్ గా వున్నాడే కానీ , తండ్రిని హత్య చేసి చంపలేదుగా?
అదేమంటే “నా తండ్రి అంటే నాకు ఇష్టం లేదు, అందుకే గమ్మునున్నా” నంటాడు. దానికి పోలీసులేం చెయ్యలేరుగా. ఇన్ని చాకులు, కట్టర్లు, కట్టింగ్ ప్లేయర్లు ఉండటం తప్పేమీ కాదుగా? “నేను వంటవాడిని కనుక అవన్నీ నాకు అవసరానికి పనికొచ్చేవే ” అంటాడు. కాదని ఎవడనగలడు? లేదన్నా… వాడు శాడిష్టే కాదు. భయంకరమైన క్రిమినల్. ఏం చేసినా, ఎలా చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాల్సిందే కానీ , ఏమాత్రం చిన్న ఆధారాన్ని వదిలి పెట్టినా వాడి కాటుకి బలైపోతాము. ” అన్నాడు వెంకటస్వామి.
టీ మీద టీ తాగుతూ వాళ్ళిద్దరు ఓ టీ స్టాల్ ముందు మాట్లాడుకోవడం ఇద్దరు గమనించారు. ఒకడు పరమశివం. రెండోది నవనీతం.
పరమశివానికి తెలుసు… వాచ్‌మన్ ఖచ్చితంగా వెంకటస్వామితో చెబుతాడని. చెప్పాలనే పరమశివం కోరిక కూడా! ‘వేట’ మజాగా సాగాలంటే పులి దగ్గరలోనే వుందని జింకలకి తెలియాలి. కొట్టుకి కొంచం దూరం నుంచి వస్తున్న నవనీతానికి వెంకటస్వామి కనిపించాడు. ఆవిడకు కొండంత ఆనందం కలిగి అతనివైపు గబగబా అడుగులేసింది. ప్రాణదాతాయే పలకరించకపోతే ఎలా?
సడన్ గా ఆగిపోయింది. కారణం వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న పరమశివాన్ని చూడటమే!
వీడే కదూ తన వెనక పరిగెత్తి బలాత్కారం చేయబోయిందీ! ఆవిడకు అన్నీ గుర్తున్నై! ఫాదర్ ఆల్బర్ట్ చెప్పాడు వెంకటస్వామి రక్షించి హాస్పటల్లో చేర్చాడని. ఆ తరవాత చర్చి వాళ్ళు చెప్పారు. ఆ పరమశివంగాడ్ని ఎవరో బుర్ర పగలగొట్టారని, లేకపోతే బలాత్కారానికి గురై వుండేదానివనీ.
నవనీతానికి పెద్దగా చదువు లేకపోవచ్చు. కానీ, జరిగిన సంఘటనని బట్టి పరమశివం నించి తనని రక్షించింది వెంకటస్వామి అని అర్ధం చేసుకుంది.
అతన్ని కలవబోయేది కాస్త గభాల్న వెనక్కి తిరిగి గబగబా నడుచుకుంటూ దూరం వెళ్ళిపోయింది. ఆమె విన్నంత వరకు పరమశివం నడవలేడు, మాట్లాడలేడు. కానీ ఇప్పుడు చూస్తున్న పరమశివం పర్ఫెక్ట్ గా వున్నాడు. అంటే వెంకటస్వామి మీద పగ తీర్చుకోడానికి వచ్చాడా? లేకపోతే దొంగతనంగా వెంకటస్వామిని ఎందుకు అబ్జర్వ్ చేస్తాడు? డైరెక్టుగానే కలిసి వుండేవాడుగా.
ఇప్పుడు తను వాడి కంటపడితే పాముకు పాలుపోసినట్టవుతుంది. తన ప్రాణం కాపాడిన వెంకటస్వామికి ఎలాగైనా పరమశివం వూర్లోనే వున్నాడని అబ్జర్వ్ చేస్తున్నాడనీ, తను చూశానని చెప్పాలి. కానీ, ఎడ్రస్? ఫాదర్ అల్బర్ట్ కి ఫోన్ చేస్తే?

******************

కథ ఓ క్షణం ఆపితే…
ప్రేక్షకులారా… ఈ కథాకాలం ఇప్పటిది కాకపోయినా, అతిపురాతమైనదీ కాదు. ఇవ్వాళ అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు వున్నాయి. సెల్ ఫోన్లకి ముందు పేజర్లు వచ్చాయి. పేజర్లకి ముందు లాండ్ లైన్లు, ఎస్.టి.డి లే గతి. ఇంకా కొన్ని గ్రామాలలో ఇప్పటికీ కొన్ని బూతులున్నాయి. కారణం సెల్ ఫోన్లు కొందరికి ఇంకా అలవాటు కాకపోవడమూ అవసరం లేకపోవడమూ.
వ్యాపారస్తుల నైపుణ్యం ఎంతదంటే అవసరం లేని వాటిని అత్యంత అవసరమైనవిగా నమ్మించి , ఆ చెత్తనంతా మన చేత కొనిపించడం. ఏ ఇంటికైనా వెళ్ళి చూడండి అవసరమైనవి 5% వుంటే, అనవసరమైనవి 95% వుంటాయి. వాషింగ్ మెషీన్ వచ్చిన రోజుల్లో మధ్యతరగతి వారంతా ఆవురావురుమని కొనేశారు. ఇప్పుడు చూడండి…. అవన్నీ ఓ మూల విశ్రాంతిగా పడివుంటై. కారణం ఏమంటే , ఆ మిషన్ లో బట్టలేసి ఉతికి ఆరవేసే టైం కంటే , హాయిగా మామూలు పద్ధతిలోనే మేలని జనాలకి అర్ధం కావడమే! అదొకటే కాదు, వ్యాపారస్తుడు వ్యాపారం చెయ్యని ‘వస్తు ‘ వంటూ లోకంలో లేదు. కిడ్నీలు, కళ్ళు, గుండెలు, ఇతర అవయవాలతో సహా!

***********************
అప్పటికింకా కామన్ మాన్ చేతుల్లో సెల్ ఫోన్లు లేవు. ఎస్.టి.డి. బూతులున్నాయి. నవనీతం డైరెక్ట్ గా ఎస్.టి.డి బూత్ కి వెళ్ళింది. శంఖచక్రాపురం నంబరు ఆమెకి జ్ఞాపకమే. మూడుసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతోందే కానీ, ఎవరూ ఎత్తలేదు. నిరాశగా ఇంటిదారి పట్టింది నవనీతం. ఆమె మనసు తుఫానులో సముద్రం లాగా వుంది. కారణం తెలీనే తెలీదు. ఓ పక్క బోస్ కొట్టిన దెబ్బ. మరోపక్క సర్వనామం చేసిన ‘అత్యాచారం ‘ ఇప్పుడు మళ్ళీ యీ పరమశివాన్ని చూడటం. ఓ వెర్రిదానిలా నడుస్తూ సారా కొట్టు చేరింది. తాగటం ఆమెకేనాడు అలవాటు లేదు. కానీ, ఎందుకో ఓ గ్లాసులో సారా పోసుకొని గడగడా తాగింది. మళ్ళీ ఇంకో గ్లాసు.
అరగంట తరవాత ఆమె శరీరానికి, మనసుకీ విశ్రాంతి లభించింది. పట్టపగలే నిద్రాదేవి నవనీతాన్ని తన ఒడిలోకి తీసుకుంది
******************

కిషన్ చంద్ మనసు మనసులో లేదు. అతనెవరినీ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ‘విస్కీ ‘ అతన్ని ఆలోచనల్నుంచి రక్షించేది. ఇప్పుడతను ఏ అలవాటుని ఆశ్రయించలేదు. ఒకే ఒక్క బాధ.
“భగవంతుడా… ఒకే ఒక్కసారి షీతల్ ని నాకు చూపించు. నన్ను చంపినా పర్వాలేదు. తనని సుఖంగా బ్రతికించు. తను లేని జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను. ప్రేమ తప్ప తనేమీ నా నించి ఆశించలేదు. అదీ ఉత్తినే కాదు… అనంతమైన ప్రేమని నాకు ఇచ్చి. దేవుడా… నిజంగా నువ్వుంటే షీతల్ ని నాకు చూపించు. ” ఒకే ప్రార్ధనని మనసులోనే అనంతంగా చేస్తున్నాడు కిషన్.
“కిషన్ ‘ అనునయంగా పిలిచాడు చమన్ లాల్. ఆయన మనసు మనసులో లేదు. వెళ్ళిపోయే ముందు షీతల్ వ్రాసిన ఉత్తరం ఆయన చదివాడు. తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం ఒక అమాయకురాలిపై పడటం అతన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఒక పక్క మూర్ఖురాలు, అహంభావి అయిన కూతురు, మరో పక్క నిశబ్ధంగా తనలో తానే కుమిలిపోతొన్న అల్లుడు, ఇంకో పక్క తెలిసి తెలియని వయసులో ఏమీ అర్ధంకాక అయోమయంగా నడుచుకుంటున్న పిల్లలు. ఏం చెయ్యాలో సేఠ్ చమన్ లాల్ కి పాలుపోవడం లేదు.

గుజరాతీలకి గుంభన ఎక్కువ. మనసులో ఏముందో ఎవరికీ తెలియనివ్వరు. ఎంత డబ్బున్నా, ఏమీ లేకపోయినా, ఒకే విధంగా ప్రవర్తించడం వారికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. కాలాన్ని ‘క్లాసుల్తో ‘ కొలవడం గుజరాతీలకి పుట్టుకతో వచ్చిన విద్య. సమయాన్ని సమర్ధవంతంగా వుపయోగించడం , అవసరమున్న వారితో మాత్రమే కాకూండా అవసరం లేనివారితో కూడా స్నేహపూరితంగా, మర్యాదగా మాట్లాడటం వారి స్వభావం. అఫ్ కోర్స్, వ్యాపారస్తుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అదే. ఎవరితో ఎప్పుడు పని బడుతుందో ఎవరు చెప్పగలరు? అవసరంలో వున్న వారికి గడ్డిపోచ కూడా మహా వృక్షంతో సమానమే గదా!
“పితాజీ… నన్ను క్షమించండి… నేనేమి మాట్లాడను. సుందరే రైట్. నేను మనిషిని కాదు. మీ అమ్మాయికి కాపలాగా మీరు తెచ్చిన ఆల్సేషన్ డాగ్ నే. కానీ నాలోంచి ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడే ఆల్సెషన్ డాగ్ ఊరకుక్క కంటే భీరువైంది. ” సైలెంట్ అయ్యిపోయాడు కిషన్. ఏం మాట్లాడాలి? ఏమని ఓదార్చాలి? అసలిప్పుడు జరగవలసింది ఏమిటీ?
ఛమన్ లాల్ గమనిస్తూనే వున్నాడు, షీతల్ వెళ్ళిపోవడం కూడా సుందరీ బాయ్ ప్రెస్టేజ్ గా తీసుకుంది. కేవలం తనని సాధించడానికే ఆ పని చేసిందని సుందరి ఆలోచన.
అందుకే ఇంకా ఇంకా ఇంకా కిషన్ ని సాధించడం మొదలెట్టింది. ఆ “రండి ” ఎక్కడుందో నీకు తెలుసు. నువ్వే విడిగా ఎక్కడో దాన్ని కాపురం పెట్టించావు. ఎట్లాగైనా దాని గుట్టు రట్టు చెయ్యక వదల్ను. ఆఫ్ ట్రాల్ ఓ పనిమనిషిని ప్రేమించిన నువ్వూ ఓ మనిషివేనా? కుక్కవి.. ఛీ… ఇలా రకరకాలుగా కూతురు కిషన్ ని రెచ్చగొట్టడం చమన్ లాల్ చెవును దాటిపోలేదు. అయితే అతను భయపడే కారణం వేరు. ఒకవేళ కిషన్ సుందరిని చితకొట్టినా , జుత్తుపట్టుకొని చెంపలు పగలుగొట్టినా చమన్ లాల్ బాధపడేవాడు కాదు. కిషన్ మౌనశిలగా మారడమే చమన్ లాల్ కి భయకారణమైనది.
దెబ్బకి దెబ్బ … మాటకి మాటా బదులిచ్చే వారి గురించి అసలు భయపడాల్సిన పనే లేదు. భయపడాల్సింది బాధపడుతూ కూడా మౌనంగా వుండే వారి గురించి. వాళ్ళ లోపల లోపల అగ్ని పర్వతాల్లా రగిలిపోతున్నా , పైకి మాత్రం హిమాలయాల్లా వుంటారు. రగిలీ రగిలీ ఎప్పుడు క్రోధం లావాలా బయటకి విరజిమ్ముతుందో వాళ్ళకే తెలీదు. ఒక్కసారి అది చిమ్మితే ఎదుటివాళ్ళే కాదు … వాళ్ళూ నాశనమై పోతారు. కిషన్ సహజంగా ఓ ఇంట్రావర్ట్ , తనలోని భావాలను పైకి చెప్పుకునేవాడు కాదు. అంతే కాక తను బీదవాడ్ననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతనికి ఉంది. అందువల్లనే ఇన్నాళ్ళు సుందరి సంసారం సజావుగా సాగింది. కానీ అతని జీవితంలో షీతల్ ప్రవేశించడం అనూహ్యంగా జరిగింది. ఆకలిగొన్న వాడికి అమృతం దొరికినట్లయింది. సుందరి చూసీ చూడనట్టుంటే బహుశా కిషన్ ఇంకా ఎక్కువగా ఆమెకి కృతజ్ఞుడై వుండేవాడేమో! కానీ, ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఏమీ చెప్పలేకా, ఏమీ చెయ్యలేకా చమన్ లాల్ మెల్లగా బయట గార్డెన్ లోకి వచ్చాడు. ఆ గార్డెన్ మొదలెట్టింది సుందరి తల్లి.

***********************

“కొందరి రాక సుఖసంతోషాలను తెస్తే… మరికొందరి రాక బాధనీ నష్టాన్ని తెస్తుంది” అంటారు పెద్దలు. బిళహరి రాక, ఆ తరవాత షీతల్ రాక శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కోవెలకి ఆనందాన్నే కాదు , పేరునీ తెచ్చింది. విశాలమైన గుడి చుట్టూ వున్న స్థలం అంతా ఇప్పుడు నందనవనంలా కళకళలాడుతోంది. అరటి, జామ లాంటి ఫలాలనిచ్చే చెట్లు కూడా చల్లగా పెరుగుతున్నాయి.
చుట్టుపక్కల పిల్లల్ని చేరదీసి ‘ బిళహరి ‘ సంగీతం నేర్పుతోంది. అది చిన్నప్పటి నుంచీ తెలిసిన విద్యే. అంతే కాదు ఆమె వచ్చింది సంగీత కుటుంబం నుంచేగా.
షీతల్ వచ్చాక ఓ చిన్నపాటి చర్చ జరిగింది.
పూజారి : అమ్మా! మనకే కష్టంగా . ఇప్పుడీ హిందీ అమ్మాయికి కూడా ఆశ్రయమిస్తే గడిచేదెలాగో?
షీతల్ ; అయ్యా… నాకు నిజంగా వేరే దిక్కు లేదు. ఏ పని చెప్పినా చక్కగా చెయ్యగలను. వంటతో సహా. దయచేసి నన్ను బయటకు మాత్రం పంపకండి.

బిళహరి : అయ్యా.. చూద్దాం. నాకు సంగీతం వచ్చు. ఆమెకి వంట వచ్చు. ముందర యీ దేవాలయానికి భక్తులు రప్పించే ప్రయత్నం చేస్తే , చాలావరకు సమస్య తీరుతుంది.
పూజారి : ఎలా?
బిళహరి : ఒక వుపాయం వుందండి. కొండపల్లి గుళ్ళో ఒకరీ పద్ధతిని ప్రవేశ పెట్టారు. నెలకి వంద రూపాయిలు కడితే నాలుగు సోమవారాలో, లేక వారికిష్టం వచ్చిన నాలుగు రోజుల్లోనో వారి పేరు మీద అర్చన చేయించి ప్రసాదం ఇంటికే పంపేటట్టు. ఇది చాలా ప్రాచుర్యం పొందటమే కాదు, గుడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. దానికి ముందుగా మనం చెయ్యవలసింది గుడి పరిసరాలనీ, గుడినీ పరిశుభ్రంగా ఉంచడం. వీలున్నన్ని పూలూ, ఫలాలు ఇచ్చే మొక్కల్ని నాటడం. ఏ ఏ రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలూ, జరుగుతాయో లేక జరుపుతామో వాటి వివరాలు ప్రజలకు అందేలా చెయ్యడం.
పూజారి : చాలా మంచి ఆలోచనమ్మా. కానీ నేను పెద్దవాడ్ని, అంత శక్తి, ఓపికా నాకు లేవు.
బిళహరి : మేమిద్దరం ఉన్నాము. మీరు అనుమతిస్తే చాలు… అన్నీ మేమే చూసుకుంటాము.
అనుమతి భేషుగ్గా ఇవ్వబడింది. వారం రోజులపాటు బిళహరి, షీతల్ ఒళ్ళు హూనం చేసుకొని గుడిలోపలి ప్రదేశాన్నంతా శుభ్రం చేశారు. గడ్డిని కోశారు. చిన్న చిన్న పాదులు ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి అరటి జామ, వేప లాంటి మొక్కల్ని నాటారు. ఏనాటి బావో.. నీరు ఏనాడు ఇంకలేదు. తోడి తోడి మొక్కలకి నీళ్ళు పోస్తుంటే ఊట గంగలా ఊరుతోంది. గోంగూర, బచ్చలి కాడా, కొత్తిమీర, వంగ, బెండ, బీర, దోస, తోటకూర, లాంటి విత్తనాలు జల్లి పుష్కలంగా కూరగాయల్ని పండించే ఏర్పాటు చేసుకున్నారు. ఓ దబ్బ మొక్క, రెండు నిమ్మ మొక్కలు, ఓ రాచ ఉసిరి, ఓ ఉసిరి, ఓ బిల్వం ఇలాంటివి కూడా నాటారు.
బయట చుట్టుపక్కల కొట్ల వాళ్ల దగ్గరకి, కొంచం ధనవంతుల ఇళ్లకి బిళహరి పూజారిగారితో వెళ్ళి ‘ప్రజల వద్దకి ప్రసాదం ‘ స్కీం గురించి వివరించింది. ఆఫ్ ట్రాల్ వందే కనుక చాలామంది ముందే అడ్వాన్స్ ఇచ్చారు.
అవన్నీ చక్కగా ఓ పుస్తకంలో రాసింది. శివాలయంలో ఇచ్చేది వీభూతే. అయినా, బిళహరి అద్భుతంగా వండి పులిహోర, వడ ప్రసాదంగా మొదటి సోమవారం అందరి ఇళ్లకి, కొట్లకి లిస్ట్ ప్రకారం పంచడంతో జనాలకి సంతృప్తి కలగడమే కాక నమ్మకమూ పెరిగింది. ఇంకా చాలామంది ముందుకొచ్చారు. అప్పుడే పిల్లలకి ఆడవాళ్ళకి సంగీత పాఠాలు చెపుతానని బిళహరి చెప్పడంతో నేర్చుకోవాలన్న ఉత్సాహం వున్నవాళ్ళు చాలామంది చేరారు. ‘తోచినంత ‘ ఇమ్మందే కానీ ‘ఇంత ‘ అని ఆంక్ష పెట్టక పోవడంతో, అనుకున్నదాని కంటే ఎక్కువ మందే వచ్చారు. సంగీత క్లాసులు నిర్వహించేది కూడా గుడి మండపంలోనే కావడంతో జనాలు గుడికి రావడం ప్రారంభమయ్యింది. మొన్నటి దాకా ఒంటరిగా బిక్కు బిక్కుమంటున్న పూజారి అమరేంద్రవధానులు గారు కూడా ఇప్పుడు ఇనుమడించిన ఉద్యానవనంలో, తోటపని, గుడిపనీ కూడా చూసుకుంటున్నారు. ఆయన ఆశపడకపోయినా, హారతి పళ్ళెంలో మాత్రం దండిగా చిల్లర పడుతూనే వుంది. ఆయనకి ఒకందుకు ఆనందంగా వుంది… కనీసం చక్కని నైవేద్యాలు దేవుడికి సమర్పించగలుగుతున్నందుకు.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *