April 20, 2024

ప్రేమతో

రచన: డా.లక్ష్మీ రాఘవ

అర్ధరాత్రి!!
చిమ్మ చీకటి!!!
‘ధన్’ శబ్ద౦!!!!
కిందపడగానే ‘కుయ్’ మన్న శబ్దం వచ్చింది నా నోట్లో…
స్కూటర్ స్టార్ట్ అయిన శబ్దం!
ఏం చేసారు నన్ను??? తల పైకి ఎత్తబోతే..
‘జుయ్’మని వెళ్ళిపోయింది స్కూటర్.
ఎక్కడ వున్నాను?? అర్థం కాలేదు నాకు.
పైకి లేవబోయాను..పడిపోయాను..కాలు విరిగింది కదా ఎలా లేవగలను??
పొద్దున్న రోడ్డు మీదకు రాగానే వెనకనుండి కొట్టిన కారు నిలవకుండా వెళ్ళిపోయింది..కింద పడిపోయి
‘కుయ్యో’ మని అరుస్తుంటే..పట్టించుకున్న వాళ్ళెవరు నన్ను??
చివరకు మా వీధికి వచ్చే పేపరు పిల్లాడు నన్ను చూసి మెల్లిగా మా ఇల్లు చేర్చినాడు..
కాలింగు బెల్లు నొక్కి నన్నుఅప్పచెప్పడానికి ఎదురుచూసిన ఆ అబ్బాయికి సమాదానం ఇచ్చిన మా యజమాని మాటలు ఎలా మరచిపోతాను?
“మీదే సార్..బయట రోడ్డుమీద ఎవరో ఆక్సిడెంట్ చేసి కాలు విరిచారు…రోజూ మీ గేటు దగ్గర చూస్తాను కదా అని తీసుకు వచ్చాను”
“ఏదో గేటు దగ్గర ఉంటుందని మా పాత వాచ్ మాన్ పెట్టినాడు…ఇంట్లో మిగిలిన అన్నం వేస్తామంతే … మేము పెంచుకునే కుక్క ఇంట్లోనే వుంటుంది…కాలు విరిగినదాన్ని ఎవరు చూసుకుంటారు??” అని దబ్బున తలుపేశాడు.
నేనేం చేసేది? అనుకున్నాడేమో ఆ పిల్లాడు గేటు దగ్గరే వదిలేసాడు. నొప్పితో చచ్చిపోయాను ’కుయ్యో కుయ్యో’ అని అరుస్తూనే వున్నాను…
నాటు కుక్కననేనా ఇంత ఈసడింపు? అన్నం తిన్నానని ఎంత కాపలా కాసాను. ఇప్పుడు కాలు నొప్పితో అరుస్తున్నానని అర్ధరాత్రి వేరే చోటికి తరలించేస్తారా??
ఇప్పుడేమి చెయ్యాలి? చలికి కాలు విపరీతంగా నొప్పిగా వుంది.
మూలుగుడు బయటకు వస్తూనే వుంది.
“భగవంతుడా ఈ నాటుకుక్క జన్మ ఎందుకిచ్చావయ్యా? జాతి కుక్కనయితే ఇంట్లోనే పెట్టుకుని ముద్దుగా చూసుకునేవారు కదా…ఎంత విశ్వాసంగా వున్నా నా కర్మ ఇలా కాలిందే. పైగా చుట్టూ జరుగుతున్నవి అర్థం అయిపోతున్నాయి. ఒక్కముక్క మాట్లాడలేక పోవడం ఎంత ఘోరం?” తిట్టుకుంటూనే కుయ్..కుయ్ అని అంటున్నాను
చుట్టూ లైట్లు కూడా లేవు…అంటే ఇళ్లు లేని చోట పారేసారా? ?
దూరంగా చిన్న లైటు వెలిగింది…కదులుతూంది…ఎవరో నడుస్తూ వస్తున్నారు..
‘కుయ్ కుయ్…’ అరిచాను.
లైటు తాలూకు మనిషి లైటు నా చుట్టూ తిప్పుతూ చివరికి నామీద నిలిపాడు.
చీకట్లో నా కళ్ళు మెరిసినట్టు వున్నాయి. కరుస్తాననుకున్నాడేమో
‘ఏయ్…ఇస్కో’ అంటూ అరిచాడు. నేను కదలలేదు..చిన్నగా ‘కుయ్’ అన్నాను.
అతను మరో వైపుకి వెళ్లి ఒంటెలు పోసుకుని వెళ్లి పోయాడు.
చూస్తూ వున్నాను..ఎంత దూరం వెడతాడో అని ఎక్కువ దూరం పోలేదు..నాకు సంతోషం వేసింది. ఎవరో మనుషులు వున్న చోటే వున్నాను. తెల్లారితే తెలుస్తుంది అనుకుంటూ కాళ్ళు మునగదీసుకుని పడుకోబోతే విరిగిన కాలు మరీ నొప్పేసింది..కంట్లో నీళ్ళు వచ్చినాయి. తప్పదు…మగతగా వుంది…

A Dog laying on a couch after surgery.
…………..

‘చచ్చిపోయిందేమో నాయనా’
“రాత్రి చూసినప్పుడు బతికే వుందిరా…”
“ఇజ్జొ…ఇజ్జొ” అంటూంటే మెల్లిగా కళ్ళు తెరిచాను. ఒక పెద్దాయన, ఒక పిల్లోడు కొంచం దూరంగా నిలబడి చూస్తున్నారు…
“ఏయ్” అని కట్టెతో పొడిచినాడు పిల్లోడు. కుయ్ కుయ్ అంటూ తలెత్తినా.
“బతికే వుంది నాయనా”
లేవలేక పోతూన్నట్టు చేసినా…కాలు నాకుతూ.
“లేవలేకపోతూంది. కాలు విరిగినట్టు వుంది”
“మెడలో బెల్టు వుందిరా, పెంచిన కుక్కే అయి వుంటుంది. కాలు విరిగిందని ఇక్కడ తోసేసి పోయినట్టు వున్నారు”
నాకు సంతోషం వేసింది. సరిగ్గా ఏమైందో వాళ్లకు తెలిసినందుకు. నాకు బెల్టు వేసి
‘నీవు ఇక్కడే వుండు’ అని చెప్పిన పాత వాచ్ మాన్ గుర్తుకు వచ్చినాడు.
కాలు నాకుతూ వుంటే ఆ పిల్లోడు కాలు దగ్గర భయంగా చెయ్యి పెట్టినాడు…
‘చూడరా బాబూ.. నొప్పితో చస్తున్నా’ అని చెప్పినా నా భాషలో. వాడికి ఏమి అర్థం అయ్యిందో కానీ..కాలు పట్టుకుని చూసాడు..
“కాలికి తగిలినట్టు వుంది. లేపి చూద్దామా?”అని పిల్లాడు అంటే పెద్దాయన నన్ను లేపినాడు.
కుయ్.. కుయ్ అంటూ కుడికాలు వేలాడ దీసి మూడుకాళ్ళమీద నుంచున్నాను.
“తియ్యరా నేను ఎత్తుకుని వస్తా. ఇంటికాడ కట్టు కడదాము..” అని నన్ను చేతులమీద ఎత్తుకుని నడిచినాడు పెద్దాయన.
దగ్గరలోనే వాళ్ళ షెడ్డు. అక్కడ కడుతున్న ఇంటికి కాపలాదారేమో…
ఇంటి దగ్గర దింపి పక్కనే వున్న వేపాకు చెట్టులో కొమ్మలు తెంపి కూర్చొని నా కాలుకి కిందా పైనా రెండు కట్టెలు పెట్టి , వేపాకు కలిపి తాడుతో బద్రంగా కట్టినాడు. కట్టినంత సేపూ నొప్పికి నేనరుస్తానే వున్నా…తరువాత ఇంట్లోకి పోయి ఒక ప్లాస్టిక్ తట్టలో అన్నం తెచ్చి మూతి దగ్గర పెట్టినాడు పిల్లవాడు. ఆకలితో చస్తున్న నాకు అమృతం చూసినట్టయి నాలుక పొడుగ్గా చాపి గబా గబా తినేసినా..
ఇంతలో ఇంట్లోంచి పిల్లోడి తల్లి బయటకు వచ్చింది చంకలో పాపతో. నన్ను ఆదరించిన కుటుంబంగా గుర్తించి విశ్వాసంతో ‘కుయ్’ అని హలో చెప్పినా..చంకలో పిల్ల నన్ను చూసి కిందకు దిగిపోవాలని చూసింది.
“బుజ్జీ, వద్దు కుక్కకు దెబ్బ తగిలింది, దగ్గరకు పొతే కరుస్తుంది” అని లోపలి పోయింది.
‘నేను కరవను తల్లీ” అని చెప్పినా నా భాషలో.. కొ౦చం సేపటికి
“అమ్మా స్కూలికి పోతాన్నా…కుక్క ఎక్కడికీ పోకుండా చూసుకో“ అని చెప్పి నా తలమీద చెయ్యి పెట్టి చిన్నగా తట్టి వెళ్లి పోయినాడు పిల్లోడు.
పెద్దాయన బయటకు వచ్చి”ఇయ్యాల ఇటుక లోడు వస్తుంది గానీ తొందరగా వండేయి. పని వుంటుంది” అని భార్యకు చెప్పి బీడీ తాగుతూ అక్కడే వున్న బండ మీద కూర్చున్నాడు.
నన్ను కాపాడిన వ్యక్తిగా అతన్ని ఆరాధనతో చూసాను.
“ఏమి పేరే నీది? మున్దోల్లు ఏమని పిలిచే వొళ్ళో గానీ నేను ‘రాజూ ‘అని పిలుస్తా ఇక్కడే వుండు నాతోబాటు కాపలా సరేనా?”
“బొవ్ బోవ్”అని రెండు సార్లు మొరిగా సంతోషంగా..
అలా మొదలైంది నా కొత్త జీవితం గంగన్న కుటుంబంతో..కొత్తపేరుతో!!
నా కొత్త యజమాని గంగన్న, భార్య రంగమ్మ, కొడుకు రమణ, పాప దీప అని గ్రహించ గలిగాను. నన్ను ఆదరించిన వాళ్ళను తెలుసుకోకపోతే ఎలా?
మాకూ మనుషులలాగానే ఆలోచనలు, ఆప్యాయతలు ఉంటాయని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఇంతకుముందు వాళ్ళలాగా వీళ్ళు కూడా నన్ను వదిలేయరు కదా నా అనుమానం నాది.. చూద్దాం ..
సాయంకాలం బడి నుండి రాగానే రమణ నా ముందు కూర్చుని తలమీద తట్టాడు నేను ‘కుయ్’ మని హలో చెప్పినా..రమణ నా కాలు పట్టుకుని
“తగ్గిపోతుందిలే..నేను మెల్లిగా నడిపిస్తాను ఒంటేలు పోసుకు౦దువు గానీ రా” అని మెల్లిగా లేపినాడు. కాలు మోపలేక పోయినా.. కుంటుకుంటూ కొంచం దూరంలోనే చెట్టు దగ్గర కార్యక్రమం ముగించా.
“అన్నం తిను, నాయన నడిగి నొప్పి మాత్ర ఇస్తా సరేనా?” అని ముద్దు చేసినాడు.
‘భౌ…భౌ..’ అని సంతోషంగా మొరిగినా. రమణకు నేను సంతోషం వేస్తె అలా రెండు సార్లు మొరుగుతానని తెలిస్తే ఎంత బాగుండు!
కుక్కలు చచ్చి పోయినాక మనుష్య జన్మ వస్తుందని అంటారు. ఎంత నిజమో తెలీదు కానీ నాకు మళ్ళీ పుట్టాలని వుంది..నాలుక చిన్నగా.. చిన్న నోరుతో మాట్లాడుతూ…వేళ్ళు పిడికిలి పట్టేలా..అవుతే ఎంత బాగుంటుంది? ముఖ్యంగా నాకు ఆ జన్మలో ఈ కుక్క జన్మ గురించి జ్ఞాపకం వుంటే…కుక్కలు ఎలా ఫీల్ అవుతాయో అందరికీ తెలియచెబుతా’ అబ్బా ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి!
వారం లోపలే నేను కుంటుతూ నడుస్తున్నాను. నొప్పి మాత్రలు బాగా పని చేసినాయి..కట్టెలతో కట్టిన నా కాలు తొందరగా కూడుకున్నది. కొంచం కుంటితనం నిలిచిపోయినా…బాగున్నా!
స్కూలు నుండే రాగానే ముద్దు చేసే రమణ అంటే నాకు ఇష్టం.
నాలుగు గంటలకే రోడ్డు వైపు చూస్తూ ఉంటా.
రమణ కనపడగానే పరిగెత్తుకెళ్ళి తోక ఊపుతూ నాకుతా…
రమణ నా చెవులు పట్టుకుని మూతి దగ్గరగా తీసుకుంటే ఆడి బుగ్గల మీద నాకుతా..నీవు నాకు చాలా ఇష్టం అని చెబుతున్నట్టు..నన్ను రెండుచేతులతో భుజం పట్టి లేపితే ఎంత బాగుంటుందో..
ఒక రోజు రాత్రి పడుకునే ముందు రమణ నాతొ కూర్చుని తల నిమురుతూ
“నేను బాగా చదువుకుని, ఉద్యోగం చేసి నీకు మంచి బెల్టు, చైను అనీ కొంటా రాజూ, బాగా చూసుకుంటా” అని చెప్పినాడు రమణ.
నాకేమీ వద్దు రమణా…అందరూ కుంటి కుక్క అంటే నాకేమి ? నీవు ఇష్టంగా చూసుకుంటావు అది చాలు నాకు అని చెబుదామన్నా..వాడికి అర్థం కాదు కదా..
నన్ను కాపాడి, బాగా చూసుకుంటున్న రమణ కుటుంబం నాకిష్టం. విశ్వాసంగా ఉంటా ఎప్పుడూ అనుకుంటా.
ఈ మద్య దివ్య పాప నిద్రపోతూ వుంటే నేను కాపలా వుంటాను..పాప లేవగానే ‘ భౌ.. భౌ’ అని అరిస్తే పక్కనే పనిచేస్తున్న రంగమ్మ వచ్చేస్తుంది…అంత భరోసా నా మీద పెట్టారని ఏంతో సంతోషం నాకు…
వెన్నెల రోజుల్లో బయట చాప వేసుకు కుని రమణ పడుకుంటే పక్కనే పడుకునేవాడిని…ఎన్నో విషయాలు చెప్పేవాడు…ఎప్పుడూ నాతోనే ఉంటాను…అని చెబుతాడు కానీ నేను పన్నెండు ఏళ్ల కంటే బతకను కదా అనిపించేది..ఒకవేళ చనిపోయినా మళ్ళీ రమణ ఇంట్లో నే పుట్టేలా చెయ్యి దేవుడా అని మొక్కు కుంటాను. దేవుడు మన్నిస్తాడా??
ఒక రోజు పాప నిద్రపోతూంటే నేను కాపలా వున్నా..పాప ఇబ్బందిగా కదులుతూంది..ఏడవకుండా మూలుగుతూ వుంది ..దగ్గరికి వెళ్లి వాసన చూస్తే ఎందుకో బాగా అనిపించలేదు..భౌ భౌ అని ఎక్కువ సార్లు అరిస్తే రంగమ్మ వచ్చింది..పాపను ఎత్తుకుంటే తెలిసినట్టు వుంది పాపకు బాగాలేదు బాగా జ్వరంగా వున్నట్టు ..వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకుని వెడుతూ ..నేను ‘ కుయ్ కుయ్ ‘ అంటే
“ఇక్కడే వుండు రాజూ, రమణ వస్తాడు..” అని చెప్పినారు.
రమణ వచ్చాక అందరూ బయటకు వెళ్లినారు అని నా భాషలో చెబితే కొంచం అర్థం అయ్యిందని పించింది…
అలా వాళ్ళలో ఒకడిగా అయిపోయినా..ఒక రోజు రాత్రి పడుకున్నప్పుడు నా తలమీద చెయ్యివేసి చెప్పాడు రమణ కాపలాగా వున్న ఇల్లు పూర్తి అయిపొయింది కనుక షెడ్డు కొట్టేస్తారని, ఇంకో చోట పని వెతుక్కో వాలని..ఎక్కడ దొరుకుతుందో..రమణ స్కూలు వెళ్ళడానికి వీలవుతుందా? అని సెబుతూ వుంటే..
‘పని దొరుకుతుంది నీవు స్కూలికి వెడతావు లే రమణా ‘ అని ఒదార్చాను రమణ చెయ్యి నాకుతూ..
ఆరోజు పొద్దున్న గంగన్న, రంగమ్మ సామాన్లన్నీ సంచుల్లో కట్టుకుంటున్నారు.. మాటల్లో తెలిసింది ఏమంటే రెండు వీధుల అవతల కన్స్ట్రక్షన్ సైటులో పని దొరికిందట.
నన్ను కూడా తీసుకెడతారని రమణ చెబితే ‘బౌ..భౌ’అని సంతోషంగా చెప్పినాను.వాళ్ళు నన్ను విడిచిపెట్టారని నాకు నమ్మకం…
అన్నం తినేసినాక సంచులు భుజం మీద పెట్టుకుని గంగన్న కొంచం ముందు నడుస్తూ వుంటే.. వెనక రంగమ్మ, పక్కన పాప చిన్నగా అడుగులు వేస్తూ వుంది..రమణ ఇంకో చిన్నసంచీ తీసుకుని వస్తా అంటూ షెడ్డు దగ్గరికి వెళ్ళినాడు. నేను పాపకు దగ్గరగా నడుస్తూ వున్నా ..
వీధి మలుపు తిరగ్గానే ఆ వీధి కుక్కలు నన్ను చూసి భౌ..భౌ అని మీదకు వచ్చాయి..నేనూ భౌ ..భౌ అని అరుస్తున్నా…నా మనసులో ఏదో అలజడి..అసహనంగా అనిపిస్తోంది..పాప కుక్కల అరుపులకు భయపడి పోయింది..ఏదో ప్రమాదం అని నాకు తెలిసిపోతూ వుంది…ఎక్కడ?? ఎలా?
ప్రమాదాలు కుక్కలు ముందుగానే కనిపెడతాయి అంటారు. నిజమేనా??
నాకు గాబరాగా, అసహనంగా వుంది అందుకేనా?
ఇంతలో ఎదురుగా టర్నింగు తిరుగుతున్న స్కూటరు… కొన్ని కుక్కలు అడ్డం రావడంతో అదుపు తప్పింది..స్కూటరు పాప దగ్గరగా వెడుతూంటే ఒక్క ఉదుటున అడ్డం దూకినా..అంతే స్కూటరు నా నడుం మీద నుండీ వెళ్లి పక్కకు పడిపోయింది..
‘కుయ్యో..’ మని గట్టిగా అరుస్తూనే వున్నా..రంగమ్మ స్కూటరు వాళ్ళను తిడుతూ నా దగ్గరకు వచ్చి ‘రాజూ’ అంటూ నా మీదకు వంగింది..ఆమె చంకలో వున్న పాపను చూసి సంతోషమైంది..
చుట్టూ అరుపులు..నా ప్రాణం పోతూంది నొప్పితో ..గంగన్న వచ్చి ‘అయ్యో రాజూ..రాజూ’ అంటూ నా గుండె మీద చెయ్యి వేసినాడు..
“నాడి ఆడుతూ ఉంది…కానీ నడుం విరిగింది…బతకదేమో” అంటూ నా తల మీద చెయ్యి వేసినాడు.
“రాజు అడ్డం రాకపోతే స్కూటరు పాప మీదకు వెల్లిపోయేదయ్యా” ఏడుస్తూ అనింది రంగమ్మ.
“పాప కోసం అడ్డం పడిపోయినావా. రాజూ..” అంటూన్న గంగన్న మాట వినబడింది.
నా తల దిమ్మెక్కి పోయింది..నాకు ఎక్కువ టైము లేదే… రమణను చూడాలే..దీన౦గా కళ్ళు తెరిచి చూసినా గంగన్నని
“నేను రాజును ఎత్తుకుంటా” అని నా కాళ్ళకింద చేతులు వేసినాడు గంగన్న
“బతకదు లేవయ్యా..యాడికి తీసుకు పోతావు” అన్నారు ఎవరో.
అమ్మో…రమణను చూడకుండానే చచ్చిపోతానేమో…నొప్పి..నొప్పి..కుయ్ కుయ్. అంటూనే వున్నా..
గంగన్న నన్నుఎత్తుకుని నాలుగు అడుగులు వేయగానే
‘రాజూ…రాజూ ‘ రమణ గొంతు వినిపించింది నాకు..
‘అబ్బా..నా చివరి కోరిక తీరుతూంది’ అని కష్టం మీద ప్రాణం నిలుపుకో బోతున్నా..
గంగన్న చేతులో నుండీ నన్ను తీసుకోబోయినాడు రమణ ‘ఎత్తలేవురా ‘ అనినా వినలేదు..
రమణ నన్నుచేతిలోకి తీసుకుని తలను భుజం మీద ఆనించుకున్నాడు. రమణ ఏడుస్తున్నట్టు నాకు తెలుస్తూంది లీలగా..
“నీకేమీ కాదు రాజూ” బొంగురు గొంతుతో అన్నాడు రమణ
నా కళ్ళు మూసుకుపోతూ వున్నాయి.
కష్టం మీద నాలుక జాపి రమణ గొంతు నాకాను..కళ్ళు సగమే తెరుచుకున్నాయి కానీ చివరిసారిగా రమణను చూసాను…
‘చాలు..భగవాన్’ అని చెబుదామనుకునేంతలో నా ప్రాణం ఎగిసిపోయింది..
నాకింకా బతకాలని వుంది.
“రమణా…మీరంటే నాకిష్టం..ఎప్పుడూ ప్రేమతో మీ చెంతే వుండి పోయేలా మళ్ళీ పుడతా” అని రమణ తో చెప్పాలని వుంది…

$$$$$$$ $$$$$$$ $$$$$$

1 thought on “ప్రేమతో

  1. బాగుంది ! కుక్క పిల్ల హృదయం చక్కగా చిత్రించారు !

Leave a Reply to kantha Cancel reply

Your email address will not be published. Required fields are marked *