April 20, 2024

Gausips – ఎగిసే కెరటాలు-11

రచన:- శ్రీసత్యగౌతమి

లహరి గురవుతున్న అశ్వస్థతను ల్యాబ్లోని ఇతరులు గుర్తించి కంగారు పడ్డారు, దానితో లహరీ కంగారు పడుతూ శరీరం మీద వస్తున్న రాషెస్ (Rashes, దద్దుర్లు), ఆకస్మిక వాపులను చూసుకోవడం మొదలు పెట్టింది.ఇంతలో కౌశిక్ కూడా అటే వచ్చాడు. అది చూసిన సింథియా భృకుటి ముడుచుకుంది. కౌశిక్ లహరిని పరీక్షగా చూసి, వెంటనే హాస్పిటల్ ఎమ్ర్జెన్సీ కి పంపించాడు, తానుగా హాస్పిటల్ స్టాఫ్ కి ఫోన్లు చేసి. కౌశిక్ యొక్క ప్రమేయంతో లహరికి హాస్పిటల్ వసతులు వెంట వెంటనే అందడం అనేది సింథియాకు ఏ మాత్రం నచ్చలేదు. వెంటనే అందరి దృష్టిని తన వైపు త్రిప్పుకోవడానికి క్రొత్త నాటకం మొదలుపెట్టింది. తనకు కూడా చిన్నప్పటినుండీ ఇలాగే జరుగుతుందనీ, తాను మొహం తిరిగి పడిపోతుంటుందనీ, అదనీ ఇదనీ కధలు చెప్పడం మొదలుపెట్టింది కౌశిక్ కు. అలాగే ఇప్పుడు కూడా తనకలాగే జరిగితే తన గతేం కానూ … అని కూడా మధ్య మధ్యలో ప్రశిస్తోంది. కానీ కౌశిక్. ఆమె చెబుతున్నది వింటున్న మిగితా వాళ్ళు ఆమె చెబుతున్నది వినే పరిస్థితిలో లేరు. అందరూ లహరి కోసమే తీవ్రంగా ఆలోచిస్తూ, మాట్లాడుకుంటున్నారు. సింథియాకు లోలోపలే గంగ వెర్రులెత్తుతోంది.

లహరి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ ఆయ్యే టప్పటికే అంతర్గతంగా శరీరంలో వాపులకు గురయ్యి, గొంతు పూడుకు పోయింది., మాటరావడం లేదు. వెంటనే శ్వాశించడం భారమవ్వడం, రక్తపోటు పడిపోతుండడం మొదలయ్యింది. ఆ స్టేజ్ లో ఆమెకు ఇంట్రా వీనస్ ఇంజెక్షన్స్ ఇవ్వడంతో చికిత్స మొదలు పెట్టారు. 7-8 గంటల చికిత్స తర్వాత తగ్గుముఖం పట్టి ప్రమాద పరిస్థితి తప్పాక లహరిని హాస్పిటల్ డిస్చార్జీ చేసింది. ఆ తర్వాత ఆమె ఇతర స్పెషలిస్టుల దగ్గరకు పరీక్షలకు వెళ్ళవలసివచ్చింది.

**********

లహరికి నాలుగు నెలల పాటు అశ్వస్థత కొనసాగుతూనే ఉంది. ఇమ్యూన్ సిస్టం పూర్తిగా దెబ్బతినడంతో అంతర్గత వాపులతో, నరాల బలహీనత, చదివే దానిపై చేసే దానిపై ఫోకస్ చెయ్యలేకపోవడం. తిన్నది ఇమడకపోవడం, ఏం తిన్నా రియాక్షన్ వచ్చేయడం ఆఖరుకు అన్నప్రాసన నుండీ తింటున్న అన్నం కూడా రియాక్షన్ ఇవ్వడమే … ఏదో మొదటిసారిగా తింటున్నట్టు. రోజు రోజుకీ లహరిలో ఆరోగ్య మార్పు ప్రస్పుటంగా కనబడుతోంది. స్పెషలిస్ట్స్ కూడా ఓపిగ్గా ఆమె మామూలు స్థితికి రావడం కోసమే ఎదురు చూస్తున్నారు … ఒక్క సింథియా తప్పా.

బయోడిఫెన్స్ ప్రోజెక్ట్స్ లో వర్క్ చేస్తున్న లహరికి కాస్త సాయం గా ఉండమని బాబ్ కే కాకుండా సింథియాకి కూడా కౌశిక్ అప్పజెప్పాడు. సింథియా సంతోషంగా ఒప్పుకొంది. కౌశిక్ తెలియక సింథియాను నమ్మి లహరితో పెట్టాడు. లహరికయినా, ఇంకెవరికయినా ఏం తెలుసు సింథియా చేసినది?

కానీ ఒక్కరికి మాత్రం తెలుసు సింథియా పోకడలు. కానీ సింథియాకే తెలియదు తలదన్నేవాడుంటే తాడిని తన్నేవాడుంటాడని!

కౌశిక్ తో సింథియా తిరుగుళ్ళు, కౌశిక్ పరిశోధనా వ్యవహారాలు, ల్యాబ్ లోని సింథియా ఆర్భాటాలు, వీటన్నిటినీ రెండు కళ్ళు గమనిస్తున్నాయి.

సింథియా ప్రవృత్తి కౌశిక్ కు తీసుకొస్తున్న తీరని నష్టాలు ఆ కళ్ళకు దగ్గరగా చేశాయి. కౌశిక్ ల్యాబ్ లోకి చొరబడ్డ ఈ అంత్రగత శత్రువే వాళ్ళకు మిత్రువు, ఆపద్భంధువు.

హ్మ్… కలియుగంలో ఒకరి పట్ల దురాలోచన కలిగిన మరుక్షణం అది అమలుచేసే లోపే తిరిగి తమకే కొట్టడం మొదలెడుతిందిట.

*********

ఆ రోజు సాయంత్రం సింథియా … రెస్టారెంట్లొ కూర్చొని ఎదురు చూస్తున్నది కౌశిక్ కోసం. అది ఊరుకి చాలా దూరం గా ఉన్న రెస్టారెంట్ … నిజానికి అదొక పల్లెటూరు. జనసందోహం తక్కువగా ఉండే ప్రదేశంలో పైగా అంత సాయంత్రం పూట పైగా వాతావరణం చాలా మబ్బేసి … అతిశీతల గాలులతో ఊపేస్తోంది. రెస్టారెంట్ లోపల మాత్రం వెచ్చదనాన్నిచ్చే దీపాలు, వెచ్చటి హీటింగ్ సిస్టం తో హాయిగా ఉంది, ఒక పార్టీ మూడ్ ని తలపిస్తూ, పసందైన బీట్ తో వెస్ట్రన్ మ్యూజిక్కుతో మైమరపిస్తూ. వీకెండ్స్ లో ఇలాంటి చోట్ల గడపడమంటే సింథియాకు ఇష్టం. కానీ రాకేష్ తో ఇలాంటి చోట్లకు ప్లాన్ చెయ్యాలంటే తనకు అస్సలు ఇష్టముండదు. వీటికి అతను సరిపడడనే ఉద్దేశ్యం సింథియాకు. వీటికి ప్రస్థుతానికి కౌశికే కరెక్ట్ అని నమ్ముతోంది… అలాగే ఆలోచిస్తూ ఉండగా …. భుజం మీద బలంగా ఒక చెయ్యి పడింది.

“సింథియా … హౌ ఆర్ యూ?”
“ఐ యాం గుడ్” అంటూనే ఎవరా అన్నట్టు విస్తుపోతూ చూస్తోంది ఆ స్త్రీ కేసి.

సింథియా ఇంతకు మునుపెన్నడూ ఆమెని చూడలేదు. తెల్లటి శరీరం కానీ అమెరికన్ కాదు. ఏ వేరే దేశస్థురాలో మరి అనుకుంటున్నది సింథియా.

ఈలోపున ఆ స్త్రీ తనని తాను పరిచయం చేసుకోవడం మొదలెట్టింది.

“ఐ యాం సోఫియా. యు ఆర్ ఎ బ్రేవ్ గ్రల్. ఐ లైక్డ్ ఇట్”.
“ఎక్స్ క్యూజ్మీ?” అంటూ భృకుటి ముడిచి అడిగింది సింథియా ఏం మాట్లాడుతున్నావ్ అన్నట్లు.
“నువ్వు విన్నది కరక్టే” అంది సోఫియా (వాళ్ళ సంభాషణలు ఇంగ్లీషులో సాగాయి)
“ఇంతకూ మీరెవరూ?” అడిగింది సింథియా మనసులోనే ఒక 35-40 కిమధ్యలో ఉండొచ్చు వయసు అని మనసులో అనుకంటూ.
“చెప్పాగా నా పేరు సోఫియా. నాకు లహరి, కౌశిక్ లు చేసే ప్రోజెక్ట్ల్స్ రిజల్ట్స్ కావాలి”
“అది విన్నవెంటనే మనసులో అదిరి పడింది సింథియా”.
“ఆమె చేసే పరిశోధనలు మీకంత ముఖ్యమైనవా? ఏమున్నాయందులో?” అడిగింది సింథియా.
“అంత ముఖ్యమైన మనిషిని పడగొట్టావ్, దేనికోసం?” అడిగింది సోఫియా సోఫియా.

మాట్లాడలేదు సింథియా కళ్ళు క్రిందకు దించుకున్నది.

“ఫర్వాలేదు, నీ ఇష్టం. నాకు ఆమె చేతిలోని ప్రొజెక్ట్ రిపోర్ట్స్ కావాలి, నీకది చాలా చిన్న విషయం” అన్నది సోఫియా.

అక్కడ కాసేపు ఆగి సింథియా మొహం లోకి తేరిపార చూస్తూ.

సింథియా ఆలోచనలో పడింది. “ఏమున్నది ఆ రిపోర్ట్స్ లో? అడిగింది సొఫియాని.

సోఫియాని ఆ ప్రశ్న అడిగేసరికి సింథియా యొక్క తెలివి తక్కువదనం సోఫియాని ఆశ్చర్య పరిచింది. అంత ముఖ్యమైన విషయానికి కాకుండా ఇంక దేనికోసం లహరి మీద పగ తీర్చుకుంటుందా అని?

మరొకలా కూడా ఆలోచించింది సోఫియా. “ఎలాగూ ఈ విషయంలో దద్దమ్మ కాబట్టి … అదే మబ్బులో ఉంచుదాం. అన్నీ చెప్పి కాంప్లికేటెడ్ చేసుకొనేకన్నా … సింపుల్ గా చీట్ చేసేసి తీసేసుకుంటే అయిపోతుంది”.

“హా… ఏమీలేదు ఆ రిపోర్ట్స్ మాకిస్తే మేము డిఫెన్స్ ఆర్గనైజేషన్ కి సబ్మిట్ చేసుకుంటాము, అంతే”.

“ఆ డిఫెన్స్ వాళ్ళ గ్రాంట్స్ కోసం మేము కూడా ఫ్రాన్స్ నుండి ప్రోజెక్ట్ వ్రాశాము, కానీ లహరి, కౌశిక్ వాళ్ళు చూపించిన బెస్ట్ సొల్యూషన్స్ వాళ్ళకు నచ్చి ఆ గ్రాంట్స్ ని వాళ్లకు మంజూరు చేసేసారు. దాని పైన ఆరు సంవత్సరాలనుండి వాళ్ళు పని చేసారు, అది పూర్తయ్యిపోవచ్చింది, ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చేశాయి”

“మరి అలాంటప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? అదేదో మొదట్లోనే త్రుంచేయాల్సింది” అంది సింథియా.
“అబ్బో… బుర్ర బాగానే పని చేస్తోంది” అనుకొని మళ్ళీ నవ్వుతూ … మళ్ళీ మాట మార్చి … అందుకే ఆ రిపోర్ట్స్ ని గల్లంతు చేసేయాలి. ఆ రిపోర్ట్స్ ని మేము చేసినట్లుగా మేము సబ్మిట్ చేసుకుంటాము”.

“డిఫెన్స్ వాళ్ళకయితే వాళ్ళ రిపోర్త్స్ అయితే వాళ్ళకెళ్ళిపోతాయి, ఎవరు చేస్తే ఏంటి?”

“దానివల్ల నాకొచ్చేదేమిటి?” అడిగింది సింథియా.
“లహరి నిష్క్రమణ” అదే కదా నీకు కావల్సింది? సూటిగా చేస్తూ అడిగింది సింథియాని సోఫియా.

ఒక్క సారి షాకింగా చూసింది సింథియా…

“ఎంతో నమ్మకంగా కళ్ళార్పుతూ చూసి నాకంతా తెలుసు. నా మీద భరోసా ఉంచు” … అంతా నీక్కావలసినట్లే జరుగుతుంది అన్నట్లు చూసింది సింథియా కళ్ళలోకి.

సింథియా సగం విస్మయం, సగం భయం తో వింటున్నదే తప్పా … ఆమెని ప్రశ్నించలేకపోతోంది, ఆ సగం భయం వల్ల అనుకుంటా.

“నీ మనసులోని సందేహాలు నాకర్ధమయ్యింది. ఇదంతా నాకెలా తెలుసా అని కదా? నాకు ఆ ల్యాబ్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు”…అంది సోఫియా.

మళ్ళీ నోరు పెగల్లేదు సింథియా కి.

సోఫియా పైకి చూడడానికి చాలా అందమైన అమ్మాయి. కాని ఆమె మాటలు బలంగా ఉన్నాయి.

సింథియా నోరు పెగిలే లోపల బలమైన మాట ఒకటి పడేస్తున్నది, సింథియా మాట్లాడనీయకుండా.

“ఏం లేదు సింథియా … ఆ ఫైల్స్ నాకు తెచ్చిస్తే చాలు. ఎవ్వరికీ ఏం తెలియదు. లహరే ఎక్కడో పెట్టేసుంటుంది అనుకుంటారులే అంతే. మహా అయితే మళ్ళీ ఎక్స్ పెరిమెంట్స్ చేసుకుంటారు. నీకు వచ్చిన నష్టమేముంది?” అంది సోఫియా.

“మరి మీరూ ఆ ఎక్స్ పెరిమెంట్స్ చేసుకోవచ్చుగా? ఎలాగూ గ్రాంట్స్ మీరూ రాశామంటున్నారు కదా?” అడిగింది సోఫియా ని.

“వెల్ మేము కూడా చేస్తున్నాం. కానీ వీళ్ళు చేసేది మాకు తెలియాలి, అంతే మరింకేం కాదు” అంది సోఫియా.

మరింకేదో సింథియా చెప్పే లోపుల … సోఫియా మళ్ళీ అందుకుంది.

“లహరి టైం కి రిపోర్ట్స్ అందించలేదని లహరి ఉద్యోగం ఊడుతుంది, ఆమె ఇక నిష్క్రమిస్తుంది. ఆ రిపోర్ట్స్ ని కాస్తంతగా అటు ఇటు మార్చేసి “మనం” సబ్మిట్ చేసేద్ధాం….

“లహరి నిష్క్రమిస్తుంది, ఆమె చేసినదంతా నీ సొంతం. మేము ఎలాగూ నీ స్నేహితులం కాబట్టి కలిసి అంతా మనదే అవుతుంది. ఇహ నుండి టీం ను నువ్వే లీడ్ చేద్దువుగాని, కౌశిక్ నీ మాటే వింటాడు. ఇక అది నీ టీం! నువ్వెలా చెబితే అలా నడిచే టీం!!! నీ టీం తో నువ్వు … మాతో చేతులు కలుపుతున్నావ్, దీనివల్ల హ్యూజ్ ఫండింగ్ నీ ల్యాబ్ కెళ్తుంది. ఇక నువ్వే అక్కడ మహారాణివి. మా సహాయ సహకారాలు నీకు ఎప్పుడూ ఉంటాయి” అని ఆపింది సోఫియా.

లహరి నిష్క్రమిస్తుంది, తానే రాణవుతుంది అనే మాటలు తప్పా మరింకేమీ ఆమె చెవుల్లోకి వెళ్ళలేదు. కేవలం ఆ రెండు మాటల్ని మాత్రమే వింటున్నా సింథియా బ్రెయిన్ … సోఫియా మోసాన్ని అస్సలు గుర్తించలేకపోయింది.

మరొక్క మారు కూడా ఆలోచించకుండా … “సరే… ఆ ఫైల్స్ అన్నిటినీ నేను తీసుకొనొస్తా… ఎప్పుడు కావాలి? అని అడిగింది సింథియా.

“రేపే కావాలి” అని … తామే సింథియా ఇంటికి వచ్చి తీసుకుంటామని … టైం కూడా చెప్పింది.

వెళ్తూ వెళ్తూ …” ఈ విషయాలన్నీ మనిద్ధరి మధ్యే ఉండాలి. కౌశిక్ కూడా తెలియనివ్వద్దు. అతను ఒప్పుకోడు లహరి ఉంటుండగా నువ్వు ఎదుగుతానంటే. నీకనుభవమేగా … పాపం నువ్వెంత తాపత్రయపడుతున్నా … నీ మాట వింటున్నాడా”.. అని వక్రమైన చూపును విసిరి… ఆమె మనసును అలా తాకి … చెబుతూ వెళ్ళిపోయింది సోఫియా.

సింథియా కి ఆ అఖరు మాటా చాలా బలంగా తాకింది. ఆమె వైపు ఆలోచిస్తే ఆమెకి అలాగే ఉంది… కౌశిక్ తనమాటను పూర్తిగా వినటంలేదని.

ఇటువంటి పరిస్థితిలో … సోఫియా చెప్పినట్లు వినడమే సరియైన నిర్ణయమని ధృఢంగా నిర్ణయించుకున్నది సింథియా.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *