March 29, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 14, 15

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య.

అన్నమయ్య ఎన్నో కీర్తనలలో దశావతార వర్ణన బహు చిత్ర విచిత్రంగా చేశాడు. ఈ క్రింది కీర్తనలో పదిరూపులై పలు పలు విధములుగా ధర్మాన్ని రక్షించావు అలాంటి నీకు మమ్ము రక్షించడం కష్టమా! చెప్పు పరంధామా అంటూ దశావతారాలను స్తుతిస్తున్నాడు అన్నమయ్య. చేసిన వర్ణన చేయకుండా కొత్త కొత్త రీతులలో దశావతార వర్ణన చేయడం అన్నమయ్య కే సాధ్యం.
కీర్తన:
పల్లవి: ఇట్టె మమ్ము రక్షించుట ఏమి దొడ్డ నీకు నేడు
బట్ట బాయిటనే నీవు పదిరూపులైతివి
చ.1. చదువుల చిక్కు దిద్ది చక్కగ జేసితివి
మొదలు గుంగిన కొండ మోచి యెత్తితి
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి
అదనున బ్రహ్లాదునట్టె మన్నించితివి || ఇట్టె మమ్ము ||
చ.2. అడుగులు మూటనే అఖిలము గొలచితి
బడిబడినే రాచపగ నీగితి
బెడిదపు లంక విభీషణు నేలించితివి
అడరి పాండవుల దిక్కై నిలిచితివి || ఇట్టె మమ్ము ||
చ.3. త్రిపుర కాంతల గుట్టు ధీర బోధించితివి
వుపమ గలికి రూపై ఉన్నాడవు
ఇపుడు శ్రీవేంకటేశ ఏలితివి లోకాలెల్ల
యెపుడు మానుతులకు నిరవైతివి || ఇట్టె మమ్ము ||
(ఆ.సం. సం.2-198వ రేకు. కీ.సం.503)
విశ్లేషణ:
పల్లవి: ఇట్టె మమ్ము రక్షించుట ఏమి దొడ్డ నీకు నేడు
బట్ట బాయిటనే నీవు పదిరూపులైతివి
స్వామీ! మమ్ము రక్షించడం నీకు ఏమీ గొప్ప సమస్య కానే కాదు. ఆనాడు అంతమంది రాక్షసులు ఉన్నప్పుడు వారిని దునిమి బాహాటంగానే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిం చి మమ్ము రక్షించావు గదా! ఈ కలియుగంలో కూడా మా దీనాలాపాలు విని మమ్ము రక్షించేందుకే గదా శ్రీవేంకటేశ్వరుని రూపు దాల్చావు అంటూ ప్రార్ధించడం ఈ పల్లవిలోని సారాంశం.
చ.1. చదువుల చిక్కు దిద్ది చక్కగ జేసితివి
మొదలు గుంగిన కొండ మోచి యెత్తితి
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి
అదనున బ్రహ్లాదునట్టె మన్నించితివి
ఆనాడు చదువుల చక్కదిద్దితివి అనగా వేదాలను అపహరించిన సోమకుని మత్స్యావతారం ఎత్తి సంహరించి, వేదాలను, మమ్ము రక్షించావు గదా! తర్వాత కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని ఎత్తి నీ మూపుపై మోసి, క్షీర సాగర మధనానికి సహాయపడ్డావు కదా! భూమిని పొదివి చేపట్టి వరాహావతారంలో మమ్ము కాపాడి ఉద్ధరించినది నీవే కదా! అదను చూసి నరసింహావతారంలో ప్రహ్లాదుని రక్షించావు కదా.. అంటూ ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.
చ.2. అడుగులు మూటనే అఖిలము గొలచితి
బడిబడినే రాచపగ నీగితి
బెడిదపు లంక విభీషణు నేలించితివి
అడరి పాండవుల దిక్కై నిలిచితివి
వామనావతారంలో మూడే మూడు అడుగులతో ఈ త్రిభువనలాను గొలిచితివి. పరశురామావతారంలో రాజులపై నీ పగను వారిని సంహరించి చెల్లించుకొన్నావు. రామావతారంలో గొప్ప లంకాద్వీపాన్ని విభీషణుకిచ్చి ఆయనచే పాలింపజేశావు. నీవు పూనుకొని నిలబడి శ్రీకృష్ణావతారంలో పాండవులకు అండగా నిలిచి కురుక్షేత్ర మహా సంగ్రామంలో దుష్టశిక్షణ గావించావు.
చ.3. త్రిపుర కాంతల గుట్టు ధీర బోధించితివి
వుపమ గలికి రూపై ఉన్నాడవు
ఇపుడు శ్రీవేంకటేశ ఏలితివి లోకాలెల్ల
యెపుడు మానుతులకు నిరవైతివి
పురాణ బుద్ధావతారంలో త్రిపురాసురుల భార్యల మానమపహరించావు. పోల్చలేనటువంటి కల్క్యావతారం రూపు ధరించావు. ఇపుడు అఖిల లోకాలకూ శ్రీవేంకటేశ్వరునిగా ఏలుతున్నావు. ఇపుడు మా ప్రార్ధనలకు నెలవై ఉన్నావు. ఇన్ని సత్కార్యాలు అసాధ్యాలు సాధించిన నీవు మమ్ము రక్షించి కాపాడలేవా! స్వామీ! చెప్పండి అంటూ ముగిస్తాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధములు : దొడ్డ = గొప్ప; బట్టబాయిట = బట్టబయట, బాహాటంగా; మోచి ఎత్తు = వీపుపై మోసి ఎత్తుట; అడుగులు మూట = మూడు అడుగులతో; బడిబడి = వెంట వెంటనే; బెడిదపు = గొప్ప; అడరి = పూనుకొని; నుతులు = ప్రార్ధనలు; ఇరవు = స్థానము, నెలవు.
విశేషాంశములు: ఒకసారి త్రిపురకాంతలు తమతమ భర్తల ఆయుష్షు పెంపుకై పూజలు, నోములు నోచడం కోసం వెళ్తూ ఉండగా దారిలో విష్ణుమూర్తి బుద్ధావతారములో (పౌరాణిక బుద్ధుడు) వారికి దిగంబరుడిగా దర్శనమిచ్చాడు.కామపీడితులైన త్రిపురకాంతలు ఆ విరహం తట్టుకొనలేక ఆయన్ను గట్టిగా కౌగలించుకొన్నారు. పరపురుష స్పర్శ కలిగినందున వారికి మానభంగము అయింది.

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 15

ఆత్మ జ్ఞానము అంటే తనను తాను తెలుసుకోవడమే! ఆదిలోనే జగత్తును గురించి తెలుసుకోవాలనుకుంటే కుదరదు. అది దేహిని చూసి వెక్కిరిస్తుంది. నిన్ను నీవు తెలుసుకో మొదట అంటుంది. మనస్సు యొక్క ఫలితమే ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకొని ఆ తర్వాత జగత్తును చూడవచ్చు. అప్పుడే అది ఆత్మ కంటే అన్యంగానూ భిన్నంగానూ లేదని తెలుసుకోగలుగుతాము. మనలను మనం సంపూర్తిగా తెలుసుకోవడమే అసలైన జ్ఞానము. మన మనస్సు ద్వారానే మనం పరమాత్మ స్వరూపమని తెలుసుకొని తద్వారా తన్ను తాను తెలుసుకోవటమే పరమ ధర్మం అని ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య. అయితే అది తెలియడానికి, ఆత్మసాక్షాత్కారానికి మళ్ళీ ఆ శ్రీహరే దిక్కు మనకు. ఆయనే మనకు సమయం వచ్చినప్పుడు, కర్మ పరిపక్వమైనప్పుడు ప్రతిమానవుడూ తన్ను తాను తెలుసుకునేట్టు చేస్తాడు. ఆ విషయాన్ని “తెలియుట ఎన్నడు దేహి తనంతట” అన్న చక్కని ఆధ్యాత్మిక కీర్తనలో తెలియజేస్తున్నాడు.

కీర్తన:
పల్లవి: తెలియుట యెన్నడు దేహి తనంతట
తెలియగ హరినీ దిక్కే కలది

చ.1. రాపుగ రేపేమూత్రపురీషంబులు
ఆపైనాకటి యలమటలు
కైపుగ నింతట గామ వికారము
మాపు నిద్దురల ముంపులె గలది. ||తెలియుట||

చ.2. కొన్నాళ్ళు బాల్యము కొన్నాళ్ళు కౌమార
మన్నిట గొన్నాళ్ళు యౌవనము
పన్నిన ముదిమియు బైపై గొన్నాళ్ళు
వున్నతి నంతట నుడుగుట గలది ||తెలియుట||

చ.3. జంతువులకు యీ సరవులు నీవే
పొంతల గల్పించి పొదిపితివి
యింతట శ్రీవేంకటేశ్వర నీ కృప
చింతించి కావవే చేకొని నన్ను ||తెలియుట||
(రాగం బౌళి; ఆ.సం. సం.4; 312వ రేకు; కీ.సం.70)

విశ్లేషణ:
పల్లవి: తెలియుట యెన్నడు దేహి తనంతట
తెలియగ హరినీ దిక్కే కలది
ఈ దేహం అశాశ్వతమనీ ఎప్పుడొ ఒకనాడు ఈ తోలు సంచిని వదిలి వెళ్ళిపోవాలని, ఆత్మ జ్ఞానాన్ని…భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే జ్ఞానం ఈ దేహికి ఎన్నటికీ తనంత తనకుగా తెలియనే తెలియదు. శ్రీహరే దిక్కని నమ్మి.. ఆ స్వామి శరణు జొచ్చితేనే ఆజ్ఞనం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో అన్నమయ్య ఎలుగెత్తి చాటుతున్నాడు.. ఆధ్యత్మికా వీచికలు విశ్వమంతటా విరజిమ్ముతున్నాడు.
చ.1. రాపుగ రేపేమూత్రపురీషంబులు
ఆపైనాకటి యలమటలు
కైపుగ నింతట గామ వికారము
మాపు నిద్దురల ముంపులె గలది.
ఈ దేహం ధరించి సాధించినదేమిటనే విషయం తెలియజేస్తున్నాడు. ఆగకుండా ఒరిపిడిని కలిగించే మలమూత్ర విసర్జన, ఆకలి దప్పుల ఆవేదనా పరంపర, పరవశత్వం కలిగించే కామ వికారాలు, రాత్రి కాగానే మైమరపించే నిద్ర. ఇవే మనము దేహాన్ని ధరించి పొందుతున్న భోగం ఇదే. పుట్టినదాదిగా గిట్టే వరకూ ఈ వరుసలోనే జీవనం సాగిపోతూ ఉంది.
చ.2. కొన్నాళ్ళు బాల్యము కొన్నాళ్ళు కౌమార
మన్నిట గొన్నాళ్ళు యౌవనము
పన్నిన ముదిమియు బైపై గొన్నాళ్ళు
వున్నతి నంతట నుడుగుట గలది
ఈ దేహంతో నడుస్తూ ఉన్నాము మనం. ఎలా? కొన్నాళ్ళు బాల్యాన్ని, కొన్నాళ్ళు కౌమారాన్ని, మరి కొన్నాళ్ళు యౌవనాన్ని ధరించి అనుభవించాము. ఆ తర్వాత ముదిమి వయసు వస్తుంది. అది కొన్నాళ్ళు చాలా బాధపెడుతుంది. ఈ యాతనలో ఉన్నతి అడుగంటి ఉన్న మతికూడా పోగొట్టుకొని కొండొకచో దైవ దూషణ కూడా ప్రారంభిస్తాము కదా! ఇక ఎప్పుడు తెలుసుకుంటాము ఆత్మ జ్ఞానాన్ని?
చ.3. జంతువులకు యీ సరవులు నీవే
పొంతల గల్పించి పొదిపితివి
యింతట శ్రీవేంకటేశ్వర నీ కృప
చింతించి కావవే చేకొని నన్ను
జంతువులకు జ్ఞానం ఉండదు. ఆహార నిద్రా భయ మైధునాధులు అనే పద్ధతులను వాటికి నీవే కల్పిస్తున్నావు, తద్వారా ఉద్ధరిస్తున్నావు కదా! స్వామీ శ్రీవేంకటేశ్వరా! నా గురించి కూడా కొంచెం అలోచించండి. ఎన్నాళ్ళీ పాడు బతుకు? నీ అనుజ్ఞ లేనిదే మాకు ఆత్మ జ్ఞానం అబ్బుతుందా? నన్ను కూడా చేరదీసి ఆత్మజ్ఞానం ప్రసాదించి కడతేర్చు స్వామీ! అని దీనంగా వేడుకుంటున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధములు : దేహి = దేహంలో నివసించే జీవుడు; దిక్కు = శరణ్యము, గతి; రాపుగ రేపు = కఠినంగా కలిగించే ఒరిపిడులు; అలమట = ఆవేదన; కైపు = మత్తు; మంపులు = మైకము; ముదిమి = వయసుపైబడడం; ఉడుగుట = తగ్గిపోవు, నశించు; సరవు = పద్ధతి; పొదుపు = ఉద్ధరించు; చేకొని = చేపట్టి, చేరదీసి.
-o0o-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *