March 28, 2024

పయనం

రచన: కామేశ్వరీదేవి చెల్లూరి

కెనడాలోని Ottawa నగరం

సెప్టెంబర్ నెల వచ్చింది. సాయంకాలం ఆరు గంటలయంది. బ్లైండ్స్ తీసి బయటికి చూశాను. కళ్ళు చెదిరే వెలుగు. చూడలేక బ్లైండ్స్ మూసేశాను. హు ! ఇంకో గంట పోతేకానీ వాకింగ్ కి వెళ్లలేను. ఇప్పుడు ఏడు గంటలకి కానీ సూర్యాస్తమయం అవదు. ఇక్కడ మే నెల నుంచీ వీళ్లకి పండగే. ఆరు నెలలుగా మంచులో మునిగి, మోడై న చెట్లు కొద్ది నెలల్లోనే చిగురించి పచ్చగా తయారవుతాయ. కంటికి కనబడకుండా పోయన లిల్లీలు, టొమాటోలు, ట్యూలిప్స్ మేమూ ఉన్నామంటూ ఎంచక్కా బయటికి వచ్చి వొళ్ళు విరుచుకుంటాయ. ప్రతీ ఇల్లు , పచ్చని మొక్కలతో, రంగురంగుల పూలతో కళకళ్లాడిపోతాయ.

ఏడు గంటలైంది. బయట చల్లబడింది.’ అమ్మాయీ ! వాకింగ్ కి వెళ్లి వస్తా ‘ అన్నాను షూస్ వేసుకంటూ. ‘సరేనమ్మా! రోడ్లు గుర్తున్నాయిగా ‘ అంది. ఆ !ఆ! అంటూ తలుపు దగ్గరకి నొక్కి బయలుదేరాను.

చుట్టూ అందమైన ఇళ్ళు. ఇంటి ముందు స్తంభాలతో చక్కని అందమై న బాల్కనీలు రాజమందిరాలను గుర్తుకు తెస్తాయి. మంచు జారడానికి వేసిన కప్పులు, మన పెంకుటిళ్లని గుర్తుకు తెస్తాయి. లోపల విశాలంగా అన్ని సౌకర్యాలతో ఉన్న గదులు విదేశీ ఉన్నతిని తలపిస్తాయి.

ఇంతలో చిన్న నిక్కరు, టై ట్ టాప్ వేసుకొని, పోనీ టైల్ ఇటూ అటూ ఊగుతుండగా జాగింగ్ చేసుకంటూ పాతికేళ్ల చిన్నది ఎదురయింది. నన్ను చూసి “హాయ్” అంది నవ్వుతూ. నేను కూడా హాయ్ అన్నాను నడుస్తూనే.
అద స్నేహపూర్వకమైన పలకరింపు. నేనెవరో ఆమెకి తెలీదు. తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉండదు. కాని పలకరిస్తారు. మా కాలనీలో ఇండియన్స్ ఒకరో, ఇద్దరో ఉన్నారు. చాలామంది చిన్నపిల్లలున్నవాళ్లు ఉన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలను మనలాగే ప్రేమగా చూసుకుంటారు. తల్లో, తండ్రో పిల్లలని స్ట్రోలర్ లో తిప్పుతూనో, పార్క్ లో ఆడుతూనో కనిపిస్తారు.
నడుస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయింది. ఆకాశం కాషాయం, ఎర్రని రంగులు పులుముకుని చూడముచ్చటగా ఉంది. పక్కకి నిల్చుని నా సెల్ ఫోన్ లోని కెమెరాతో ఆ అందాలని బంధించాను.

ప్రతీ సందుకి స్టాప్ బోర్డు ఉంటుంది. మనుషులున్నా, లేకపోయినా, పోలీసు లేకపోయినా అక్కడ కొన్ని సెకనులు ఆగే వెళ్తాయి కార్లు. ఎవరైనా రోడ్డు దాటుతుంటే, వాళ్లు వెళ్లేదాకా ఆగి అప్పుడు నడుపుతారు. ఎవరూ చూడకపోయినా చెత్త రోడ్డు మ ద పడేయడం వంటివి చేయరు. ఎందుకో? రూల్స్ మనకోసమే అని పాటిస్తే మనకే మంచిదని తెలుసుకున్నారు కనుక. అంతబాగా రూల్స్ పాటిస్తారు కనుకే పిల్లలు, పెద్దలు రోడ్డు మీద తిరగగలుగుతున్నారు.
నెమ్మదిగా చీకటి పడింది. స్ట్రీట్ లైట్స్ వెలిగాయి. జనసంచారం తగ్గిపోయింది. రోడ్డు మీద అక్కడక్కడ కార్లు ఆగి వున్నాయి. నాకు మన దేశం గుర్తొచ్చింది. ఇంత చీకట్లో, జనసంచారం లేని చోట, మెడలో గొలుసు, చేతికి గాజులతో మా కాలనీలో ఐతే ఇలా తిరగగలిగేదాన్నా? ఏ పక్కనుంచి ఎవడు వచ్చి ఉన్నవి లాక్కుపోతాడేమో అని భయం. అంతేకాదు ఏ కారులోనుంచైనా ఎవడైనా ఒక్క లాగు లాగి, నోరు నొక్కి, ఎక్కడికో తీసుకుపోయి ఏ అఘాయిత్యమైనా చేస్తాడేమో అని భయం. రోజూ న్యూస్ లో ఎన్ని చూడ్డంలేదూ? చిన్నా చితకా, ముసలీ ముతకా ఎవరైనా సరే ఆడది అంటే చాలు మానభంగం చేసి చంపేసే రాక్షసులు ఉన్నారు. బయటకు వెళ్లిన ఆడపిల్లలు ఇంటికొచ్చేదాకా తల్లితండ్రులకు బెంగే. ఎందుకీ జనం ఇలా అయిపోయారు?


ఏమయింది నా చిన్నప్పటి దేశం? ఎంత స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. మెడలో బంగారు గొలుసు, చేతులకి గాజులు, చెవులకు లోలకులు పెట్టుకుని పదహారేళ్ల వయసులో ఉన్నా నిర్భయంగా మైలు దూరంలో ఉన్న స్కూలుకి నడిచి వెళ్లేవాళ్లు. అప్పుడు లేరా మగపిల్లలు. వచ్చేవారు వెనకాల. సరదాగా కామెంట్స్ చేసేవారు. కానీ ఇంత ఘోరంగా ఉండేవారు కాదు. స్నేహితులరాలింటికి వెళ్లి చీకటి పడినా భయం లేకుండా ఇంటికి వచ్చేవాళ్లం. అప్పుడు మాత్రం బీదవారు లేరా? ఏమైపోతోంది నా దేశం?
ఆడపిల్లలు ఈ విదేశాల్లోనే హాయిగా భయం లేకుండా ఉన్నారనిపిస్తుంది. ఇక్కడి వస్త్రధారణ విపరీతంగా కనిపించవచ్చు. ఇష్టమైనవారు వారికిష్టమైనట్టు ఉండవచ్చు. కానీ ఇతరులకి అపకారం తలపెట్టరు. మనసులో స్వచ్ఛతను కోల్పోకూడదు. అది అన్నివిధాలా వినాశనానికి దారి తీస్తుంది.
నా దేశంలో కూడా అందరూ మంచివారు ఉండాలి, లంచగింతనం ఉండకూడదు. ప్రజలందరూ శుభ్రతని పాటించాలి. ఆడపిల్లలు నిర్భయంగా బ్రతకాలి, నా దేశం గురించి నేను ఎక్కడైనా గొప్పగా చెప్పుకొని గర్వపడాలి. ఈ మార్పు ఎప్పుడొస్తుందో అని ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నాను

3 thoughts on “పయనం

  1. చాలా బాగుంది. మేమూ మీతో వాకింగ్ చేసాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *