April 24, 2024

రంగుల ‘భ్రమ’రం..

రచన, చిత్రం, కవితాగానం : కృష్ణఅశోక్

ఈ మైక్ మీద క్లిక్ చేసి  కవితను వింటూ చదువుకోండి.

అప్పుడప్పుడు…
ఆకాశంలో ఉల్కలు రాలిపడినప్పుడో, భూమ్మీద సునామీలు చెలరేగినప్పుడో, నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను… కారణం లేకుండానే!
జ్ఞాపకాలు హృదిలో కదలాడే వేళ మొదట కనిపించేది నీవే…
నగ్నంగా… అవును! నగ్నంగానే…
నిన్ను మొదటిసారి నగ్నంగా చూసినప్పుడు “నా న్యూడ్ పెయింటింగ్ వేస్తావా!?” అని ఆకాశంలో ఏదో వెదుకుతున్నట్టు చూస్తూ అడిగావ్… గుర్తుందా!…” భౌతికంగా కాకుండా, మనో నగ్నత్వం తో చూస్తేనే నిన్ను నగ్నంగా చిత్రించగలను” అని చెప్పాను…
నీకు గుర్తుండదు…
హు!.. అర్ధం కూడా అయి ఉండదు.
*** *** ***
ఆ రోజు మనిద్దరం మధువు తాగి, తనువుల తకధిమి ఆడుకున్నాము. పరవశాన తేలిపోతున్న తరుణంలో.. నా గుండె మీద తల వాల్చి, ఒక భక్తుడు భగవంతుడిని చూస్తున్నట్లు కళ్ళు పైకెత్తి, ఆనందం అతిశయించి మత్తెక్కిన చూపులతో నా కళ్ళల్లోకి చూస్తూ అన్నావు. “యు ఆర్ గుడ్ ఎట్ లవ్ మేకింగ్” అని… అస్పష్టంగా అన్నావు, కానీ.. అది నాకు చాలా స్పష్టంగా వినిపించింది.
అది నా మది చెవికి చేరింది. నాలో ఓ సంఘర్షణాత్మక పరిశీలన మొదలైంది…
మనసుల కలయికని love (ప్రేమ) అంటారని తెలుసు, కానీ తనువుల కలయికని ‘లవ్’ అంటారని అప్పటివరకూ నాకు తెలీదు…
మనసులోని భావాలు, అనుభూతులు ఒకటొకటీ పంచుకున్నాక, ఒక పరిమళ కుసుమం వికసిస్తుంది,
దాన్నే ప్రేమ అంటారు అనే పాత కాలపు ఆలోచనలు తప్ప, ‘లవ్ మేకింగ్’ అనే మాటకు అర్ధం తెలియని, అవసరం కూడా లేని సంగతి అది ఆనాటికి…!
ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమతో ఆత్మల ఆలింగనంతో పాటుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోవడం, ఆత్మీయానుబంధ అనురాగంతో ఎగసిన ప్రేమోద్వేగాలను ఒకరినొకరు చల్లార్చుకోవడం, కాంక్షల కెరటాలను తనువుల పరిష్వంగాలతో ఓదార్చుకోవడం… ఇది… నాకు తెలిసిన ప్రేమైక శృంగారం…

*** *** ***

ఆ రోజు… సిటీలోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలో నా చిత్ర ప్రదర్శన ఇనాగ్రేషన్. ఓ ఆర్ట్ హిస్టారియన్ చీఫ్ గెస్ట్, దీపం వెలిగించి షో ని ప్రారంభించారు. విజిటర్స్ పెయింటింగ్స్ ని చూస్తూ ఉన్నారు.
గ్యాలరీలో ఒక మూల రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో వేసిన పెయింటింగ్ దగ్గర కొందరు తదేకంగా గమనిస్తూ ఉన్నారు. విజిటర్స్ కి ఆ పెయింటింగ్ థీమ్ వివరిస్తున్నాను. అంతలో ఒక మీడియా రిపోర్టర్ చేతికి మైక్ ఇచ్చి, “ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ పెయింటింగ్” అన్నాడు… వివరిస్తున్నాను…ఖచ్చితంగా కెమరామెన్ వెనక రెండు ‘కలువ కళ్ళు’ అందంగా నవ్వాయి. చిలిపితనం, చెలిమితనం, ప్రేమ తత్వం అన్ని భావాలు ఒక్కసారిగా కురిపిస్తున్నట్లు ఆ నీ చూపులు!
మనసు తడబడటం అంటే అదే…నా ఈ నలభయ్యేళ్ళ జీవితంలో మొదటిసారి!
ఆ కలువ కాంతి చూపులు నన్ను తాకగానే మనోగమనం ఒక్కసారి ఆగింది…
తరచూ టి.వి.లో కనిపించే నాకిష్టమైన ఓ సెలెబ్రెటీ నర్తకి నా ఆర్ట్ షోలో కనిపించడం ఆనందంతో కూడిన ఆశ్చర్యం…
అక్కడ మొదలైన మన పరిచయంతో ప్రేమ ప్రయాణం…
ఎన్నో అరుణోదయ కాంతుల్లో మధురోహల పంపకాలు…
ఏటి గట్లు, సెలయేర్లు…
పచ్చిక బయళ్ళ సాక్షిగా ఊసులాటలు…
అందమైన స్టార్ హోటల్ డిన్నర్లు…
చిలిపితనపు లాంగ్ డ్రైవ్లు…
ప్రేమ విహంగాలమంటూ విమానపు ప్రయాణాలు…
సముద్రాలు దాటుకుంటూ విదేశీ యానాలు…
ఇద్దరి మధ్య పాటల కచేరీలు, ఆధ్యాత్మిక చింతనలు, కళల పైన చర్చలు ఒక్కటేమిటి ఎన్నో…
ఒక యోగిలా నిశ్శబ్దంగా కుంచె చేతబట్టి తెల్లని కాన్వాస్ ల పైన ఏకాగ్రతగా చిత్రాలకు రంగులద్దుకొనే నన్ను చిత్రంగా మార్చావు, ఎమార్చావు… మాటల గారడీలు చేసావో, మత్తు మందులే చల్లావో..
నిరంతర నీ ఆరాధకుడిగా మలచావు… నా చిత్రాల్లో నాయకిగా వెలిసావు..!!
నీ ప్రేమ మత్తు పొగమంచులా నా చుట్టూ వ్యాపించింది. కనులకు వేరేది కానరాని గమ్మత్తైన స్థితి…
నా మనో పరిభ్రమణానికి నీవే కేంద్ర బిందువయ్యావు.
ధర్మార్థ కామ మోక్షాలకు అతీతమైన ఆత్మానంద అనుభూతి.
కాలంతో పాటు, మధురమైన రాత్రుళ్ళు, పగళ్ళు…
రసాస్వాదనల ఇంద్ర ధనుస్సులు, సరాగాల ప్రయాణం…
ఏ రాక్షస చక్షువుల వీక్షణాలు నను వరించాయో, పదిలంగా అల్లుకున్న ప్రేమ అల్లిక దారాలు, దారాలుగా విడిపోయి తెగిపోవడం మొదలయింది…
కారణం తెలియని… ఓ కారణం!
మన ఇద్దరి మధ్య దూరం!!
రోజులో ప్రతీ నిముషం ఒకరికొకరం పంచుకునే కమ్యునికేషన్ పలచబడటం మొదలైంది…
సాయంత్రాలు మనం కలుసుకునే చోటు నన్ను వొంటరిగా చూసి వెక్కిరించడం మొదలెట్టాయి…
వెన్నెల చందమామ ఎన్నోసార్లు ప్రశ్నించేది, ‘ఏది నీ కలువ భామ’ అంటూ…
కారులో పక్క సీటు దేవురిస్తున్నట్టు నా వంక చూసేది. నీవు లేవే అని!!
మనసు మౌనమయింది…
మూగగా రోదించింది…
వేగంగా ప్రయాణిస్తున్న రైలుకి సడన్ బ్రేక్ వేసి ఎవరో ఆపే ప్రయత్నం చేస్తున్నట్లు ఒక్కసారిగా నా గమనంలో అల్లకల్లోలం…
అందమైన కాన్వాస్ చిత్రం పై ఎవరో కన్ను కుట్టి, నల్ల రంగు పోసినట్టు నా జీవన చిత్రం వివర్ణమైంది. మ్లానమై మసిబారిపోయింది. స్టాండ్ లోని కుంచెలన్నీ నా వంక జాలిగా చూస్తున్నాయి.

*** *** ***

బాగా గుర్తుంది… అది మార్చ్ 12, 2013,
నీ ఆలోచనలతోనే నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తూ వెళుతున్న నాకు… నమ్మలేని ఒక చేదు దృశ్యం నా కళ్ళ ముందు…
ఎదురుగా వెళుతున్న కార్ లో నీవు వేరొక వ్యక్తి తో కేరింతలు, కవ్వింతలు, ముద్దులు, కౌగిలింతలు… అన్నీ కార్ లోనే…
నా కళ్ళను నమ్మలేకపోయాను… నువ్వు వెళుతున్న ఆ కార్ ని దాటుకుని వేగంగా వెళ్లి గమనించాను…
అవును… నువ్వే… అది నువ్వే…కానీ, నీతో వేరెవరో…
అబ్బా… ఒక్కసారిగా మనస్సు ‘ఓ….’ అని పెద్దగా అరుపు. ఆగని రోదన.
గుండెని ఒక ఇనుప గుండుతో బాదినట్లు… భరించలేని వ్యథ… కన్నీటి ప్రవాహం…
ట్రాఫిక్ ని దాటుకుంటూ కారు ఓ పక్కన ఆగింది నాకు తెలీకుండానే.

*** *** ***

అది పౌర్ణమి…
నిస్తేజంగా చందమామనే చూస్తున్నాను,
చీకటి మనసున వెలుగు కోసం ఎదురు చూస్తూ…
నీవన్న మాట గుర్తొచింది “యు ఆర్ గుడ్ ఎట్ లవ్ మేకింగ్”… మళ్ళీ మళ్ళీ ఆ మాటే చెవిలో వినిపిస్తోంది. నెమ్మదిగా దానర్ధం స్పురించడం మొదలయింది.
తనువుల కలయికే నీ దృష్టిలో ప్రేమ అని, మేట్ చేసిన ప్రతి వ్యక్తినీ సోల్ మేట్ అంటావనీ…
నీ ఈ తత్వానికి నీవు పెట్టుకున్న పేరు ‘ప్రేమ’ ఏమో కానీ నాకది పచ్చి వ్యామోహం అనిపిస్తుంది…
ఏది ఏమైనా ఇటీస్ ఎన్ ఎపిసోడ్… ముగిసిన ఒక అందమైన అంకం… ఛీ… అందమైన అని అనలేని ఒక అంకం…ముగిసింది.

*** *** ***

కాలం ప్రవహిస్తూనే ఉంది. నీ జ్ఞాపకాల ప్రవాహపు జోరు తగ్గడం మొదలైంది. నాలో ప్రేమ పట్ల పరమార్థం మారిపోయింది…
కాన్వాస్ పై రంగుల ప్రయాణం సాగుతూనే ఉంది, జీవన సత్యం రంగుల రూపంలో..
తెల్లని కాన్వాస్ ఫై ఏ రంగు కాంతి పరావర్తనం చెంది మన కాంతిని చేరుతుందో, ఆ వర్ణంలో మనకు ఆ చిత్రం కనిపిస్తుంది.
ఎంత చిత్రమో….!!
మనసు నిశ్శబ్ద గమనం చేస్తూనే ఉంది… ప్రేమ అనే ఓ రంగుల ‘భ్రమ’ చెదిరిపోయింది.

*** *** ***

అది మే 18, 2015
మళ్ళీ… అవును మళ్ళీ…
భాషా, భావం తెలియని ఓ భావన చిగురించింది. ఓ అందమైన అమ్మాయి పరిచయంతో ఓ రంగుల భ్రమరం నాలో ప్రవేశించింది.
కాలం నాకు మరో కొత్త రంగుల భ్రమ ని అల్లుతోంది…
‘భ్రమ’ ఆనందంగానే ఉంటుంది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *