May 19, 2024

శుభోదయం

రచన: డి.కామేశ్వరి

ఆమె మాటలకి మాధవ్ కూడా కాస్త విచలితుడయ్యాడు. అంతలోనే పౌరుషంగా “నాకెవరి సహాయం అక్కరలేదు” బింకంగా అన్నాడు.
“నీకక్కరలేదు. కాని రేఖకి కావాలి” లోపల్నించి రాధాదేవి గొంతు గుర్తుపట్టిన రేఖ ఒక్క ఉదుటున పక్కమీద నుంచి లేచి వచ్చి రాధాదేవిని కౌగలించుకుని “ఆంటీ” అని బావురుమంది. ఈ హడావిడికి శారద కూడా లోపల్నించి వచ్చి “అక్కయ్యా, ఎంత పని జరిగిందో చూశావా? నీలాగే అయింది దాని బతుకూ, నిన్ను పెట్టిన ఉసురు మాకు కొట్టింది చూశావా” అంటూ రాధాదేవిని పట్టుకుని ఏడ్చింది.
“ఏమిటీ ఏడుపులు రోడ్డు మీద, లోపలికెళ్లండి” మాధవ్ కసిరాడు.
“ష్.. రేఖా.. ఏమిటమ్మా! ఏం జరిగిందని యీ ఏడుపు, శారదా నీకసలు బుద్ధి లేదు. పిల్లకి ధైర్యం చెప్పాల్సింది పోయి నీవే యిలా అంటావేమిటి?” యిద్దర్నీ మందలిస్తూ లోపలి గదిలోకి నడిపించుకు వెళ్ళింది. మాధవ్ ఈసారి రాధని కర్కశంగా వెళ్ళిపో అని నిందించలేక, ఆవేదనగా కళ్ళు మూసుకుని అలా వుండిపోయాడు.
“రేఖా! నీకు చెప్పిందంతా మర్చిపోయావా? ఆ విషయం మరిచిపొమ్మని చెప్పానా.. యింతపని చేస్తావా యీ విషయానికి..”
“ఇంకా ఏం జరగాలి ఆంటీ ? శ్యామ్ ని హేళన చేసినందుకు, శ్యామ్ లాంటివాడిని నేనూ కంటాను. పెళ్ళి కాని తల్లినవుతాను. అందరూ నవ్వుతారు. ఆంటీ.. నా గర్వానికి దేముడు ఇలా శిక్షించాడు..” మళ్లీ ఏడవడం ఆరంభించింది రేఖ.
“ష్.. రేఖా, నీవిలా ఏడిస్తే నేను వెళ్ళిపోతాను. నీవిలా బాధపడితే నాకు చాలా కోపం వస్తుంది. రేఖా, చూడు.. నావంక చూసి ముందా కళ్లు తుడుచుకో” అంటూ పమిటకొంగుతో కళ్లు వత్తింది.
“నా కూతురి బతుకు అన్యాయం అయిపోయింది. యింక దాన్ని ఎవరు పెళ్ళాడతాడక్కయ్యా” శారద ఏడ్చింది.
“శారదా.. నీవింక ఒక్క మాట మాట్లాడకు. నీవే అసలు రేఖకి పిరికిమందు పోస్తున్నావు” గదమాయించింది.
వాళ్ల మాటలు వింటున్న మాధవ్‌కి రాధాదేవిని వదలుకుని తనెంత పొరపాటు చేశాడో మరోసారి బాగా తెలిసివచ్చింది. గత యిరవయ్యేళ్ళలో రాధాదేవిని వదిలి తనెంత నష్టపోయాడో ఎన్ని వందలసార్లో తెలిసింది. రాధాదేవి అందం, రాధాదేవి మంచితనం, రాధాదేవి సంస్కారంతో.. ప్రతిదానికి శారదని పోల్చి చూసుకుని ప్రతిక్షణం తను కోల్పోయినదాని విలువ గ్రహించి బాధపడ్డాడు. దేని విలువా దగ్గిర వుండగా తెలియదు. రాధాదేవి వెళ్లాక, శారదని పెళ్లి చేసుకున్నాక, ఆ అమాయకురాలితో కాపురం నిప్పులమీద నడకలాగే వుండి ప్రతి చిన్నపని, పెద్ద పని, ఆడపని, మగపని అన్నీ చేసుకుని సంసారం నడుపుకుంటున్నప్పుడల్లా రాధాదేవి గుర్తువచ్చేది. పిల్లలు తల్లి ఆసరా లేకుండా పెరిగారు. ఈరోజు.. రాధాదేవి రేఖని ఓదార్చి కన్నతల్లిలా బుజ్జగిస్తుంటే.. పిల్లలకి కావలసింది యిలాంటి తల్లి, తనకి కావల్సింది యిలాంటి భార్య అనిపించింది. యిలాంటి భార్యని చేతులారా దూరం చేసుకున్న తనకీ శిక్ష సరి అయినదే. ఆలోచిస్తూ కుమిలిపోయాడు మాధవ్.
“రేఖా.. చూడమ్మా. మనకి అక్కరలేదనుకుంటే గర్భం తీయించుకోవడం మూడు నిమిషాల పని. ఎబార్షన్ లీగలైజ్ అయింది. అందులో ఇలాంటి పరిస్థితిలో అసలు అభ్యంతరం లేదు. రేఖా! దీనికోసం ఇంత బెంగపడ్డావా?”
“కాని యింక పెళ్లవుతుందా అక్కయ్యా? యిప్పటికే వూరూవాడా తెలిసింది.” దైన్యంగా అంది శారద.
“శారదా.. జీవితానికి పెళ్లి ముఖ్యమే కాని, పెళ్ళి లేకపోతే జీవితం లేదనుకోవడం వెర్రి. అసలు రేఖకి ఆ బాధ లేదు. నేను పెళ్ళీకొడుకుని వెతికాను. మీకిష్టం అయితే ఆ పెళ్లి రేపే జరుగుతుంది.
రేఖ, శారద ఆశ్చర్యంగా చూశారు. వింటున్న మాధవ్ అంతకంటే తెల్లబోయాడు. రేఖని. యింత జరిగాక పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చిన ఆ ఔదార్యవంతుడెవరు? .. నిజంగా అతనే అభ్యంతరం లేకుండా ఎలా చేసుకుంటాడు? ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన సంఘటనలు అతని మతి పోగొట్టాయి. ముందు అబార్షన్ చేయించాలి. రేఖ విషం మింగి చావు బతుకుల మధ్య ఊగిసలాడి ఒక్కరోజులో గుర్తుపట్టలేనంత బలహీనంగా అయింది. డాక్టరు ముందు కాస్త కోలుకున్నాక అబార్షన్ చేస్తాం అన్నారు. వర్రీ అవడానికి ఏం లేదని అందరు డాక్టర్లు ధైర్యం చెప్పారు. ముందు అబార్షన్ చేయించి, రేఖని బాగా చదివించాలి. ఉద్యొగం చేయించాలి. పెళ్ళి అంత సుళువుగా అవదని అతనికి తెలుసు. ఈ దేశంలో మానం పోగొట్టుకుని , గర్భం వచ్చిన స్త్రీకి అంత సుళువుగా పెళ్లి జరగదని తెలుసు. ఏమో, ఎప్పుడో, కొన్నేళ్ళు పోయాక, ఏ ఉద్యోగమో చేసుకుంటుండగా ఎవరన్నా కోరి చేసుకుంటే చేసుకోవచ్చు. యిప్పుడు, ఈ జరిగింది అందరి మనసుల్లో వుండగా రేఖకి పెళ్లి కావడం దుర్లభం. పెళ్ళిమాట మరిచిపోయి రేఖని బాగా చదివించాలి అని గుండె దిటవు చేసుకున్నాడు. ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా రాధాదేవిని తను ఎంత నిర్దయంగా దూరం చేశాడో, భార్యని తాకడానికి కూడా యిష్టపడకుండా ఎంత నిరాదరణ చూపాడో… అన్నీ గుర్తు వచ్చి గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లుండేది. పెళ్ళి చేసుకున్న భార్యతో సంసారం చేయడానికే తనకిష్టం లేకపోయినప్పుడు ముందుకు వచ్చి తన కూతుర్ని చేసుకునేవాడెవడు? రాధ బాధ, ఆవేదన అర్ధం అయి రేఖకి జరిగిన దానికంటే గతంలో తను రాధకి చేసిన అన్యాయం గుర్తువచ్చి మనిషి కృంగిపోయి కృశించి పోయాడు. ఇంత జరిగినా, పోలీసు కంప్లయింట్ యిచ్చి ఆమె పరువుని రోడ్డుకెక్కించి అవమానించినా, తన కూతుర్ని అభిమానించి, ఓదార్చి, ధైర్యం చెప్పి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన రాధ మంచితనం అతని గుండెని కోసింది. అతనికి తెలియకుండానే కుతూహలంగా లేచి గుమ్మం దగ్గిరకి వచ్చి నిల్చుని ఆరాటంగా చూశాడు.
“నిజమా అక్కయ్యా! ఎవరక్కయ్యా అతను?” శారద ఆనందంగా అడిగింది. రేఖ విభ్రాంతురాలై చూడసాగింది.
“రేఖా.. నీకిష్టమయితే .. మాధవ్.. మీ అందరి కిష్టం అయితే మా శ్యామ్ రేఖని చేసుకుంటాడు” రాధాదేవి అందరి మొహాల వంక చూస్తూ అంది.
ఒక్క నిముషం అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఫేను తిరుగుతున్న చప్పుడు తప్ప ఏమీ వినపడలేదు. అందరిలోకి ముందుగా తేరుకున్నది మాధవరావే.
“శ్యామ్.. శ్యామ్ తో పెళ్లా? వీల్లేదు. నేను వప్పుకోను. రేఖకి పెళ్లికాకపోయినా ఫరవాలేదు.. కాని.. కాని.. ఎవడో రౌడీకి పుట్టినవాడికి.. ఆ నల్లవాడికి నా కూతుర్నీయను” ఆవేశంగా అన్నాడు.
రాధాదేవి మొహం ఎర్రబడింది. అయినా రేఖ కోసం ఆవేశం అణచుకుంది. “మాధవ్! శ్యామ్ నా కొడుకు. వాడిని ఒక్కమాట ఏదన్నా అంటే వూరుకోను. ఇంత జరిగినా నీకింకా ఉచితానుచితాలు తెలుసుకునే జ్ఞానం రాలేదంటే విచారంగా ఉంది. కాని.. రేఖకి జరిగింది మరిచిపోయావా?… కట్టుకున్న పెళ్ళానికి శీలభంగం కల్గిందని వదిలేసిన నీలాంటి పుణ్యపురుషుడున్న దేశం యిది. అలాంటిది శీలం పోయిన ఆడదాన్ని కట్టుకోవడానికి ముందుకొచ్చే మగాళ్లు వెయ్యికి ఒకరన్నా ఉండరేమో. నిన్ను నీవే అడిగి చూడు. చాటుమటుగా ఎన్నెన్ని చెయ్యచ్చు? బయటపడనంతవరకు అందరూ పవిత్రులే. కాని, తెలిసి తెలిసి బట్టబయలై నలుగురినోట పడిన ఓ ఆడపిల్లని పెళ్ళాడడానికి వచ్చే ఉదారులు ఎవరు? ఈ సంగతి ఆలోచించు”
“అంటే నీ కొడుకు ఉదారుడన్నమాట. నీవు త్యాగం చేసి అనన్ను ఉద్ధరించి , నీ త్యాగనిరతి లోకానికి చెప్పాలనుకున్నావన్నమాట” అతనిలో తిరిగి పాత అహం తలెత్తింది. తీరా అన్నాక అంత కటువుగా మాట్లాడకపోవల్సింది అనిపించింది అతనికి.
రాధాదేవి అతనివంక తిరస్కారంగా చూసింది. “మాధవ్! నీవు నిజంగా తండ్రివయితే, ఆమె మేలు కోరేవాడవయితే.. ఈ వచ్చిన అవకాశాన్ని ఆనందంగా ఉపయోగించుకుని నాకు కృతజ్ఞత చూపేవాడివి. నేను చేస్తున్నది త్యాగమనుకున్నావు కనక నన్నభినందించు. నేను చేసేది ఏమయినా శ్యామ్ ని మాత్రం నీవు సంస్కారవంతుడిగా అంగీకరించక తప్పదు. ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా శ్యామ్ సంస్కారాలున్నవాడు కాబట్టే ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి తనకు చాతనయినంతగా న్యాయం చేకూర్చాలనే తపనతో ఆమెని చేపట్టి మానవత్వం నిరూపించడానికి వప్పుకున్నాడు. నీలా గొప్ప తండ్రికి పుట్టలేదు. గొప్ప కులస్థుడికి పుట్టలేదు. కాని నీ కన్నా గొప్ప గుణం వుంది అని గర్వంగా చెప్పగలను. మాధవ్ , నీవేమనుకున్నా సరే. .మేం చేసేది త్యాగం అనుకోలేదు. ఎవరో ఏదో చేసిన నేరానికి రేఖ బలి అవడం నాకిష్టం లేక, ఓ ఆడపిల్ల జీవితం చక్కపరచాలని ఈ నిర్ణయానికి వచ్చాం. ఆమోదించేది, మానేది మీ ఇష్టం. రేఖా. నీవూ ఆలోచించుకో. పరిస్థితి విడమరిచి చెప్పాను. నీవు కోల్పోయిన మనశ్శాంతి దొరకాలంటే.. నీ జీవితానికో భద్రత వుందని నీవు నమ్మాలి. నీవూ అందరి స్త్రీలలాగే భర్తతో సుఖంగా వుండగలవని, తల్లివవగలవని నమ్మకం కల్గించడానికి శ్యామ్ నీకు చేయూత యివ్వడానికి సిద్ధంగా వున్నాడు. ఆ చేయి అందుకునేది మానేది నీ యిష్టం. ఎవరి యిష్టాయిష్టాలకి నీ జీవితాన్ని బలిపెట్టకు. నీవు మరీ చిన్నపిల్లవి కావు. మైనారిటీ తీరినదానివి..”
“రాధా.. నా కూతురికి యివన్నీ నేర్పి పెట్టి నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. దానికిప్పుడు పెళ్ళి తొందరలేదు. నీ సహాయానికి థాంక్స్. పెళ్లి అవసరం అనుకున్నప్పుడు నా కూతురికింకెవరూ మొగుడు దొరకనప్పుడు వస్తాంలే..”హేళనగా అన్నాడు.
రాధాదేవి సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది. “అప్పుడు నా కొడుకు నీకందే స్థితిలో వుండదు మాధవ్. శ్యామ్ కి తెలుసు మీరిలా మాట్లాడి అవమానపరుస్తారని. అందుకే వెళ్లవద్దన్నాడు. రేఖకోసం వచ్చాను. వస్తాను రేఖా.. నీకీ ఆంటీతో ఏ అవసరం వున్నా నిరభ్యంతరంగా రా అమ్మా…”
“ఆగండి ఆంటీ.. నేను శ్యామ్ ని చేసుకుంటాను. నా కిష్టమే. నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చిన శ్యామ్ ఔదార్యం నాకర్ధం అయ్యింది. శ్యాంలాంటి భర్త, తల్లిలాంటి మీ నీడ దొరకడం అదృష్టం అనుకుంటాను” రేఖ స్థిరంగా అంది.
“రేఖా!… “మాధవ్ ఏదో అనబోయాడు.
“డాడీ! నన్ను నా యిష్టానికి వదిలేయంది. నేను చిన్నపిల్లని కాను. ఆలోచించే శక్తి వుంది. డాడీ.. ఈ పరిసరాలలో నేనింక వుండలేను. ఆంటీ. శ్యామ్ లాంటి ప్రేమమూర్తులుండే చోట వుండాలని వుంది. నన్ను క్షమించండి డాడీ” రేఖ గద్గదంగా అంది.
మాధవ్ మొహం నల్లబడింది.
“అక్కయ్యా! రేఖ శ్యామ్ ని చేసుకోవడం నాకిష్టమే. కాని.. కాని.. వాళ్లిద్దరూ అన్నాచెల్లెల్లవరూ.. “శారదకామత్రం తెలివితేటలున్నందుకు ఆనందమే కలిగింది.
“ఎలా అవుతారు శారదా? ఒక తల్లికి పుట్టలేదు. ఒక తండ్రికీ పుట్టలేదు. ఆ అనుమానం వద్దు నీకు. పిచ్చిదానివనుకున్నా పరిస్థితి అర్ధం చేసుకొన్నావు గాని, అతి తెలివితేటలున్న నీ భర్త ఆలోచన మారనందుకు విచారంగా వుంది” మాధవ్ వంక చూస్తూ అంది రాధాదేవి. మొహం మాడ్చుకున్నాడు మాధవ్.
“రేఖా.. శ్యాం, నీవు ఒకసారి కలిసి మాట్లాడుకోండి. మీ యిద్దరూ యిష్టపడి చేసుకుంటే ఎవరూ చెయగలిగింది ఏమీ లేదు” మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు.
“రాధా… ఆఖరికి గెల్చావు. నా మీద కసి తీర్చుకున్నావు” అంటూ అక్కడినుంచి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు దభాలున.
“మాధవ్.. ఎప్పటికన్నా నీవు నన్నర్ధం చేసుకునే రోజువ్ అస్తుంది” అంది బాధగా రాధాదేవి.
“ఆంటీ.. బాధపడకండి. నేను డాడీకి చెపుతాను. ఆయనకు మతిపోయింది” అంది రేఖ.
“అక్కయ్యా.. నీవెంత మంచిదానివి? నీ భర్తని నాకిచ్చావు. నీ కొడుకుని నా కూతురికిచ్చావు” అంటూ శారద అమాయకంగా రాధాదేవిని కౌగలించుకుని అంది.

********

“ఏమిటి రాధా.. పేపరు పట్టుకుని అలా కూర్చున్నావు?” పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న రాధాదేవి స్కూటరు ఆపి లోపలికి వచ్చిన రాజారాంని కూడా గమనించకపోవడఃతో రెండు నిముషాలు చూసి అతనే పలకరించాడు. రాధాదేవి ఉలిక్కిపడి తేరుకుని పేపరు మడిచి దీర్ఘంగా నిట్టూర్చి “రా కూర్చో.. ఏముంది. ఎక్కడ చూసినా ఆడవాళ్లకి జరిగే అన్యాయాలే. పేపరు తెరిస్తే చాలు.. మానభంగాలు, కట్నాలు తేలేదని భర్త, అత్తగారు హింసిస్తే భరించలేక ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు. కనీసం ఒక రేప్‌కేసైనా లేని రోజుండదు పేపరులో. ఏమిటో రాను రాను మనం పురోగమిస్తున్నామో, తిరోగమిస్తున్నామో అర్ధం కావడం లేదు. స్త్రీ చదువుకుంది, ఉద్యోగాలు చేస్తుంది. యీ ఆధునిక యుగంలో కూడా స్త్రీని కించపరిచే సంఘటనలు రోజుకు ఇన్ని కబుర్లు అన్నీ కాగితాలమీదనేనా? స్త్రీకి ఈనాటికీ రక్షణలేని మన సమాజం సాధించిన ప్రగతి ఏమిటి?” ఆవేశంగా, ఆవేదనగా అంది రాధాదేవి.
“రాధా! నీ పిచ్చిగాని యీ స్త్రీ, పురుష రెండు తెగలు వున్నంతవరకు ఇలాంటివి తప్పవు. ఏ చట్టాలూ ఏమీ చెయ్యలేవు. అయినా యివన్నీ చదివి మనసెందుకు పాడు చేసుకుంటావు? బాధపడి నీవేం చెయ్యగలవు? నీ చేతిలో వున్నది నీవు చేసావూ. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా సహృదయంతో ఆమెని కోడలిగా తెచ్చుకునే ఏర్పాటు చేశావు. ఈ లోకంలో అందరికీ మనం సాయపడలేం గదా”
“అవుననుకో.. కానీ యీ వార్తలు చదువుతుంటే ఆవేశం వస్తుంది. ఏదో చెయ్యాలన్న ఆరాటం కలుగుతుంది. పాపం మరీ చదువు సంధ్యలు లేని తక్కువ కులాల స్త్రీలు బలి అవుతున్నారు. రోజుకి ఎన్ని కేసులు జరుగుతున్నాయో పల్లెలనిండా, ఆ స్త్రీల గోడు వినిపించుకునే వారెవరు? న్యాయం చేకూర్చవలసిన పోలీసులే, రక్షించవలసినవారే భక్షిస్తున్నారు. కంచె చేను మేసినట్లు పోలీసులే యిళ్ళల్లో జొరపడి పబ్లిక్‌గా ఆడవాళ్లమీద అత్యాచారాలు చేస్తుంటే ఇంక ఆ స్త్రీలకి రక్షణ ఎక్కడుంది? చెప్పినా వారి గోడు వినేవారు లేరు. న్యాయంకోసం పోరాడడానికి అర్ధబలం, అంగబలం రెండూ లేనివారికి దిక్కెవరు?
యిలా ఇద్దరి మధ్య చాలా సేపు ఈ విషయం మీదే చర్చ జరిగింది.
“రాధా! నీది ఉత్తి ఆవేశం కాదని రేఖని నీ కోడలిగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాప్పుడే అర్ధం అయింది. ప్రతీ ఆడది నీలాగే ఆలోచిస్తే మీ ఆడవాళ్ల కథలు మారేవి. నీవు పురుషులనే ఎందుకు నిందిస్తావు? శీలం పోయిన స్త్రీని కోడలిగా అంగీకరించే స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పు? నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒకరన్నా నీలా వుంటే, మరుతరంలోనే కాదు. యీ తరంలోనే స్త్రీల చీకటి జీవితాలకి “శుభోదయం” కలుగుతుంది. ఆ .. యింక ఈ ఉపన్యాసాలు చాలుగాని చూడు, శుభలేఖలకి ఈ కార్డులు నచ్చాయేమో చూడు ఆర్డరిస్తా..” అన్నాడు.
“రాజారాం. నీక్ నచ్చితే నన్ను వేరే అడగాలా? పిల్లవాడి మేనమామవి. నీదే పెద్దరికం. నీవెలా చెపితే అలా చేస్తాను” రాధాదేవి రాజారాంని చూస్తూ తృప్తిగా అంది.
నెల తరువాత శ్యాం, రేఖల వివాహం జరిగింది. ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేశారు. సాయంత్రం రిసెప్షన్. ఊర్లో చాలామంది మిత్రులు వచ్చారు. ఇదేదో ఆదర్శవివాహం అని చూడడానికి కొందరు కుతూహలంగా వచ్చారు.
“నిజంగా మీది చాల పెద్ద మనసండి. నిజంగా మీరు సహృదయులు. తప్పకుండా అభినందించాలి” అని కొందరు ఆమెని పొగుడుతుంటె..
“ఎందుకండి మధ్య నాకు అభినందన. చక్కటి భార్యని తెచ్చుకున్నందుకు మా అబ్బాయిని అభినందించండి” అంటూ రేఖ భుజం చుట్టూ చెయ్యి వేసి వారి మాటల కర్ధాన్ని మళ్లించింది.
మాధవరావు ఆఖరికి రేఖ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పలేదు. రేఖ ఏమయినా సరే చేసుకుంటానంది. శారద కూడా ఎంతో నచ్చచెప్పింది. కోపం తగ్గాక పది రోజులు రాత్రింబగల్లు ఆలోచించాక తన అహం చంపుకుని శ్యాంని అంగీకరించడం మినహా గత్యంతరం లేదని తెలుసుకున్నాడు. రేఖకి అబార్షనయింది. ఆమె పూర్తిగా కోలుకున్నాక నెలా యిరవై రోజుల తర్వాత పెళ్లి నిర్ణయించారు. ఈ పెళ్లిలో మాధవరావు మనస్ఫూర్తిగా పాల్గొనేటట్టు చెయ్యడానికి రాధాదేవి అనేకసార్లు కలిసి మాట్లాడి వొప్పించింది. రేఖ ఆమెపట్ల కృతజ్ఞత చూపుతూ పదే పదే ఆ మాట అంటుంటే రాధాదేవి ఆమెని మందలించింది. “రేఖా.. శ్యామ్ పట్ల నీకుండాల్సింది ప్రేమగాని, కృతజ్ఞత కాదు. నా పట్ల వుండాల్సింది గౌరవం అభిమానం కాని కృతజ్ఞత కాదు. నీవు మరోసారి అలా మాట్లాడి నిన్ను నువ్వు కించపరుచుకోకు” అని మందలించింది. రాధాదేవి మాటలు విన్నాక మాధవరావు ఆమె సహృదయతని మనసులో అంగీకరించక తప్పలేదు.
రిసెప్షన్ అయి.. అందరూ యింటికి వచ్చి కూర్చున్నారు. “అమ్మా .. నీకు ఓ మంచి శుభవార్త. మంచి బహుమానం యిస్తాను. కళ్ళు మూసుకో” అన్నాదు సంతోషంగా శ్యాం.
“నీ పెళ్లికి మించిన శుభవార్త, రేఖని మించిన బహుమతి యింకేం వుందిరా..” అంటూ నవ్వుతూనే కళ్ళు మూసుకుని కుతూహలంగా చేయి చాచింది. ఆ చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు శ్యాం. “అమ్మా.. మన ప్రధానమంత్రి ఇందిరాగాంధి స్వయంగా రాసిన ఉత్తరం. యింతకంటే పెద్ద శుభవార్త యింకేం కావాలమ్మా” అన్నాడు ఆనందంగా.
రాధాదేవి కళ్ళు విప్పి సంభ్రమాశ్చర్యాలతో ఇంగ్లీషులో వున్న ఉత్తరం చదువుకుంది. స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వారి రక్షణకు తీసుకోవాల్సిన అంశాల గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలూచించిన ఒక కొత్త న్యాయసూత్రాల బిల్లును ప్రవేశపెట్టబోతున్న విషయం తెలుసుకుని ఎంతో సంతోషించింది.రాధాదేవిని అభినందిస్తూ రాసిన ఆ లేఖని ఆనందంగా చదువుకుంది. చదివినప్పుడల్లా కళ్లు చెమ్మగిల్లేవి. ఆ నీటిపొరల మధ్య “శుభోదయం”లో మెరిసే తొలికిరణాలు తళుక్కుమనేవి..

సమాప్తం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *