March 29, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 16

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఓ దేవ దేవా! నీ లీలలు మాకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మాలాంటి సామాన్యులకు నీ మాయలు అర్ధం కానే కావు. పరమాత్మ గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు, కేవలం ఆయన గుణాలను కీర్తించటం తప్ప మనం ఏం చెయ్యలేమని అన్నమయ్యకు అర్థం అయ్యింది. ఆ విషయాన్నే చెప్తున్నాడు. మనకు రుక్మాంగద, ధర్మాంగద, హరిశ్చంద్రుడు, గజేంద్రమోక్ష గాధలను ప్రస్తావిస్తూ శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని చాటుతున్నాడు.` ఆ గాధల ద్వారా పరంధాముని కరుణ “ధర్మం చర – సత్యం వద” అని భావించి జీవించే సత్యవాక్పరిపాలకులమీద, ధర్మాన్నే కాంక్షించే వారిమీద ఏవిధంగా ప్రసరిస్తుందో మనమూ తెలుసుకొందాం. ఆ బాటలో నడిచి జీవితాన్ని సుఖమయం చేసుకుందాం.
నారాయణా అంటే సకల చరాచర వస్తువులకు లోపల బయట వ్యాపించి వాటికి ఆధారమైన స్వామిని కీర్తించడం. అంటే ఆయన లోపల మరియూ బయట సర్వత్రా వ్యాపించి ఉంటాడని. “అయణ” అనే శబ్దం ద్వారా ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు భక్తకోటికి సులభంగా అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు అన్నీ ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు. అందుచే పరత్వం సౌలభ్యం లాంటి సుగుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక జ్ఞానం కల్గి ఉంటారు. కానీ మనకు అంత జ్ఞానం సిద్ధించేదెలా? ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యోగ్యత సకల చరాచర వస్తువులకు లోపల బయట వ్యాపించి వాటికి ఆధారమైన వాడిని మనం నారాయణ అంటాం. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు. పరత్వం సౌలభ్య గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటారు. మరి మనలాంటి అజ్ఞానులకు దారి ఏది? ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం, సర్వజ్ఞత్వం, పూర్ణత్వం అన్నీ కలగలపి శ్రీలనిచ్చే శ్రీనివాసుడు ఆయన.
కీర్తన:
పల్లవి: నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త
నాటకపు దైవమవు నమో నమో!

చ.1 సిరుల రుక్మాంగదు చేతి కత్తిధార దొల్లి
వరుస ధర్మాంగదుపై వనమాలాయ
హరినీ కృప కలిమి నట్లనే అరులచే
కరి ఖడ్గ ధార నాకు గలువ దండాయ || నాటికి ||

చ.2. మునుప హరిశ్చంద్రు మొనకత్తిధార దొల్లి
పొనిగి చంద్రమతికి బూవు దండాయ
వనజాక్ష నీ కృపను వరశత్రులెత్తినట్టి
ఘన ఖడ్గధార నాకు గస్తూరి వాటాయ || నాటికి ||

చ.3. చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి
కలుషము బెడబాపి కాచినట్టు
అలర శ్రీవేంకటేశ ఆపదలిన్నియు బాపి
యిల నన్ను గాచినది యెన్న గతలాయ || నాటికి ||
(రాగం శంకరాభరణం; ఆ.సం. సం.2; 115వ రేకు; కీ.సం.85)
విశ్లేషణ:
పల్లవి: నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త
నాటకపు దైవమవు నమో నమో!
ఓ దేవదేవా! నీవు నాటకాల దేవుడివి, జగన్నాటక సూత్రధారివి, నీ లీలలు కనుగొనడం చాలా క్లిష్టతరం. అవి ఏనాటికి ఆనాడు కొత్తే! నిన్నటికి నిన్న కొత్త. ఈ నాటికి ఈ నాడు కొత్త. నమో నమో (నమస్కారం చేస్తూ పలికేమాట. నమోనమః అనడం) దేవాతి దేవా! పరంధామా! నిత్య నూతనంగా సాక్షాత్కరిస్తూ ఉంటాయి నాకు నీ లీలలు అంటున్నాడు అన్నమయ్య.
చ.1 సిరుల రుక్మాంగదు చేతి కత్తిధార దొల్లి
వరుస ధర్మాంగదుపై వనమాలాయ
హరినీ కృప కలిమి నట్లనే అరులచే
కరి ఖడ్గ ధార నాకు గలువ దండాయ
నీ భక్తుడైన రుక్మాంగద మహారాజు తన కర్తవ్య పాలనలో తన స్వంత కుమారుడైన ధర్మాంగదుని, ధర్మనిరతుడై శిరఛ్చేధానికి సిద్ధపడ్డాడు. ఆ భక్తుని ధర్మదీక్షకు మెచ్చి నీవు ఆ కత్తిధారను ఒక తులసిమాలగా మార్చివేశావు. ఆ విధంగా నీ కృప పొందిన నేను నీ కరఖడ్గధార నాకు కలువదండగా మారితీరుతుంది అని తన నమ్మికను భగవంతుని యెదుట నివేదిస్తున్నాడు అన్నమయ్య.
చ.2. మునుప హరిశ్చంద్రు మొనకత్తిధార దొల్లి
పొనిగి చంద్రమతికి బూవు దండాయ
వనజాక్ష నీ కృపను వరశత్రులెత్తినట్టి
ఘన ఖడ్గధార నాకు గస్తూరి వాటాయ
సత్య సంధత వల్ల కలిగే లాభమూ, ఎన్ని కష్టములు వచ్చిననూ తొణకని బెణకని సత్యవాక్పరిపాలకుడైన హరిశ్చంద్రుని కధ గురించి చెప్తున్నాడు అన్నమయ్య. సుతుడు మరణించినా, భార్యతల తనే స్వయంగా నరకవలసిన సందర్భం వచ్చినా వెనుకాడని ధీరుడు హరిశ్చంద్రుడు. హే! భగవాన్! సత్యదీక్షకు మెచ్చి ఎత్తిన కత్తిధారను పూదండవలె మారిపోయేట్టు చేశావు. వనజాక్షా! నీ కరుణ ఉంటే చాలదా! శతృవుల కరవాలాలు సైతం నాకు కస్తూరి పూతలవుతాయి అనే “సంపూర్ణశరణాగతి” తత్త్వాన్ని మనకు ప్రభోదిస్తున్నాడు అన్నమయ్య.
చ.3. చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి
కలుషము బెడబాపి కాచినట్టు
అలర శ్రీవేంకటేశ ఆపదలిన్నియు బాపి
యిల నన్ను గాచినది యెన్న గతలాయ
గజేంద్ర మోక్షం గురించి చెప్తూ “నీవు తప్ప వేరే గతిలేదు రక్షించు” అని కోరగా నీవు హడావుడిగా వచ్చి మొసలిని చక్రంచే దునిమి ఏనుగును రక్షించలేదా? ఆవిధంగా కరిరాజ వరదుడవు గాలేదా? ఆ విధంగా.. శ్రీవేంకటేశ్వరా! నన్ను నీవు గాచినది సైతమూ ఈ యిలలో కధలుగా నిలిచిపోతాయి రక్షించు స్వామీ! కాపాడు మోక్షమివ్వు అని వేడుకుంటున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధములు : నాటకపు దేవుడు = జగన్నాటక సూత్రధారి; నాడు = నిన్న, నేడు = ఈరోజు; నమో = వందనములు, నమస్కారములు; ఖడ్గధార = పదునైన కత్తియొక్క అంచు; వనమాల = తులసి దండ; మొనకత్తిధార = వాడియైన కత్తి మొన; వనజాక్ష = పద్మముల వంటి కన్నులు గలవాడు; కస్తూరి వాటు = కస్తూరి పూత లేక అచ్చు; చలపట్టి = కోపగించి; కలుషము = పాపము; అలరిన = వికశించిన; బాపి = పోగొట్టి; గాచు = రక్షించు; కతలాయ = కధలు గాధలుగా మారినవి.
విశేషాంశములు:
విశ్వామిత్రుడు ఇంద్ర సభలో “ఈ లోకములో సత్య నిష్ఠ వీడని వారు ఎవ్వరైనా ఉన్నారా?” అనే విషయం నిరూపించదలచగా, షట్చక్రవర్తులలో ఒకరైన హరిశ్చంద్రుడు అనేక బాధలను పడినా సత్యదీక్ష వీడడు. చివరలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు సొమ్ములపహరించి చంద్రమతిపై పడవేసి మాయమగుదురు. దొంగలను వెంబడించు రాజభటులు ఆమెనే దొంగగా, హంతుకురాలిగా భావించి రాజు వద్దకు కొనిపోగా, ఆమెను దోషిగా నిర్ధాకరించి శిరచ్చేదము శిక్షగా విధించును. ఆమెను వధించు బాధ్యత కాటికాపరి కావున హరిశ్చంద్రున వద్దకు కొనితెత్తురు. ఆమెను రాజాజ్ఞ ప్రకారము పధించబోవగా, విశ్వామిత్రుడు వచ్చి ప్రలోభ పెట్టును. కానీ, స్ధిరచిత్తుడైన హరిశ్చంద్రుడు చంద్రమతిని వధింపబోవగా, పార్వతీ పరమేశ్వరులు ప్రతక్ష్యమై హరిశ్చంద్రుని సత్యసంధతకు ప్రసన్నులగుదురు. విశ్వామిత్రుడు ఇది హరిశ్చంద్రుని సత్యసంధతను లోకులకు ఎరిగించుటకు పరీక్షించితినని పలికి తన తపఃఫలమును హరిశ్చంద్రునికి ధారపోయును.
ఇక్కడి విశేషం ఏమిటంటే చివరలో పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై హరిశ్చంద్రునికి సత్యసంధత కొనియాడడం జరిగింది. అన్నమయ్య ఈ గాధను శ్రీవేంకటేశ్వరుని పరంగా చెప్పడం “శివకేశవులకు బేధమే లేదు” అని చెప్పడంగా భావించ వచ్చు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగ్o శివః|| శివ కేశవుల అభేదాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నట్లే అన్నమయ్య మనకు శ్రీవేంకటేశ్వరునికి పరమశివునికి బేధంలేదని భక్తకోటికి తెలియజేస్తున్నాడు.
-o0o-

3 thoughts on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 16

  1. అన్నమయ్య ఆధ్యాత్మికానంద లహరి సీరీస్ లో మీరు వ్రాస్తున్న ప్రతి వ్యాసమూ ఒక ఆణిముత్యం !అభినందన పూర్వక నమస్కారాలు!

Leave a Reply to Tekumalla venkat Cancel reply

Your email address will not be published. Required fields are marked *