April 18, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా??? 10

రచన: అంగులూరి అంజనీదేవి

”అవి వాడి లోపల వున్న బేబీకి లంగ్స్‌ పెరిగేలా చేస్తారట. లంగ్స్‌ పెరిగితే బ్లెడ్‌ సర్కులేషన్‌ ప్రాపర్‌గా వుండి బాడీ పెరిగే అవకాశాలు వున్నాయంట…”
”అలా ఎన్ని వాడాలి?”
”ముందు ఒకటి వాడి రెండు వారాల తర్వాత స్కాన్‌ తీసి అవసరమైతే మళ్లీ ఇంకో ఇంజక్షన్‌ ఇస్తారట”
”మరి వాడారా?”
”అది నాకు ఇంకా చెప్పలేదు. హాస్పిటల్‌ నుండి రాగానే అమ్మ గొడవ పెట్టుకుందట. ఆ హడావుడిలో అంతవరకే చెప్పాడు నాన్న. స్టెరాయిడ్‌ వాడారో లేదో చెప్పలేదు!”
”వెంటనే వాడమని చెప్పు సతీష్‌! నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆ మధ్యన నేనో పేపర్‌ న్యూస్‌ చూశాను. మనదేశ జనాభా ఒక బిలియన్‌ కంటే ఎక్కువగానే వుందట. ఇంతమందికి సరిపడే భూమి, నీరు, పర్వతాలు, ఆకాశం వుందో లేదో తెలియదు కాని పల్లెటూర్లలో వుండే 60% కంటే ఎక్కువ మందికి శరీర నిర్మాణం సరిగా వుండటం లేదట. వారి శరీరం, మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదట. ఇదంతా గర్భస్థ శిశువు స్థాయి నుండే వారికి తగిన పోషణ అందకపోవడమేనట. దీనివల్ల కొంతమంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారట. అలా పుట్టిన వాళ్లు ఎప్పటికీ సరిగా ఎదగలేరట. పిండంలో పోషకాహార సమతుల్యత లేక, సరైన బరువుతో పుట్టని వాళ్లకి తర్వాత ఏమి చేసినా వాళ్ళ జీవితంలో వాళ్ల శరీరాలు, మెదడు పరిపూర్ణంగా ఎదగదట” అన్నాడు నరేంద్ర.
అంతా విని ”ఓ మైగాడ్‌! నాలాంటి వాళ్లు పిల్లల్ని కనేకన్నా సరైన పోషణలేని పిల్లల్ని ఆదుకోవడం బెటరేమో” అనుకున్నాడు సతీష్‌.
”నువ్వింకేం ఆలోచించకుండా ఒక్కపని చేయమని చెప్పు సతీష్‌”
”ఏంటాపని? త్వరగా చెప్పు నరేంద్రా!” తొందరపడుతున్న వాడిలా అడిగాడు సతీష్‌.
”మీ నాన్నగారితో చెప్పి ధృతికి వెంటనే స్టెరాయిడ్‌ ఇప్పించమను… ఆ తర్వాత ధృతిని తీసికెళ్లి ఏదైనా లేడీస్‌ హాస్టల్లో జాయిన్‌ చెయ్యమని చెప్పు!” అన్నాడు.
”అలాగే నరేంద్రా! ఇప్పుడే చెబుతాను” అంటూ కాల్‌ కట్ చేసి తండ్రికి ఫోన్‌ చేసి తండ్రితో మాట్లాడాడు సతీష్‌చంద్ర.
”నేను బాగా ఆలోచించే చెబుతున్నాను నాన్నా! నేను వచ్చే వరకు ధృతిని ఏదైనా అమ్మాయిల హాస్టల్లో వుంచు. అమ్మను మాత్రం ఇంట్లోంచి వెళ్లిపోవద్దని చెప్పు!” అన్నాడు.
అంకిరెడ్డి ఎటూ మాట్లాడలేకపోతున్నాడు. ధృతిని లేడిస్‌ హాస్టల్లో చేర్పించటం సులభమే. కానీ అక్కడ ఆమెకు పురుడెవరు పోస్తారు? ఇది చెబితే సతీష్‌ ఇంకా భయపడతాడని ”నేను ఏదో ఒక నిర్ణయం తీసుకొన్నాక నీకు మళ్లీ కాల్‌ చేసి మాట్లాడతాను సతీష్‌! నువ్వేం టెన్షన్‌ పడకు. నేనున్నాను కదా!” అంటూ కాల్‌ క్‌ చేశాడు అంకిరెడ్డి.
చాలాసేపు చూశాడు అంకిరెడ్డి భార్యలో మార్పు వస్తుందే మోనని… రాలేదు. అలాగే మాట్లాడుతోంది. గదిలో పడుకొని బుసలు కొడుతోంది.
”అదే మన కూతురైతే నువ్వింత కఠినంగా వుంటావా?” అన్నాడు.
ఆమె కరగలేదు. ”హితబోధలు చెయ్యకండి! మరీ అంత దిగజారి నేను బ్రతకలేను” అంది.
”అది దిగజారడమా! యాదృచ్చికంగా ఎన్నో జరుగుతుంటాయి. క్షమించలేవా? అయినా నిండు గర్భిణి మీదనా నీ ప్రతాపం? కడుపులో వున్నది నీ మనవరాలో, మనవడో అన్నది మరచిపోతున్నావా?” అన్నాడు.
”ప్రశ్నలు వేసి నన్ను పక్కదారి పట్టించనవసరం లేదు… తక్షణ కర్తవ్యం ఏమిటో చూడు” అన్నట్లు చూసింది. ఆ చూపులు మామూలుగా లేవు. గడ్డపారతో మట్టిని పెకలించినట్లున్నాయి.
ఇక లాభం లేదనుకొని ఒక గంట తరువాత దృతి గది దగ్గరకెళ్లి ”ధృతీ! తలుపు తియ్యమ్మా!” అన్నాడు. ఆమె హాస్పిటల్‌ నుండి రాగానే పండ్లు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టి తన గదిలోకి వెళ్లి పడుకొంది. ఈ మధ్యన ఎంత ప్రయత్నించినా పడుకోకుండా వుండలేకపోతోంది.
ధృతి తలుపు తీసి బయటకొచ్చి
”చెప్పండి మామయ్యా! కాఫీ కలిపి ఇవ్వనా” అంటూ వంటగదివైపు వెళ్లబోయింది.
”వద్దమ్మా! నువ్వు నీ బట్టలు సర్దుకో! నిన్నో చోటుకి తీసికెళ్తాను”
”ఎందుకు మామయ్యా! మీ అబ్బాయి తీసికెళ్లమన్నాడా? అలా తీసికెళ్తానని మీ అబ్బాయితో చెప్పారా?”
”చెప్పానమ్మా! ఇప్పుడే కాల్‌ చేసి మాట్లాడాను. కావాలంటే నువ్వుకూడా కాల్‌ చేసి మాట్లాడు”
”అవసరం లేదు మామయ్యా! పెద్దవారు, మీరు చెప్పాక మళ్లీ ఆయనకు కాల్‌ చెయ్యటం దేనికి… ఆయన ఒక్కడికే నామీద రెస్పాన్స్‌బులిటి వుంటుందని నేననుకోవడం లేదు. అందుకే ఆయన అంత దూరంగా వున్నా నేనిక్కడ ఇంత నిశ్చింతగా వున్నాను” అంటూ ఆమె లోపలకెళ్లి తన బట్టలన్నీ ఓ బ్యాగ్‌లో సర్దుకొని రెడీ అయింది.
”అత్తయ్యతో చెప్పి వస్తాను మామయ్యా” అంది.
”అవసరం లేదులేమ్మా! తలనొప్పిగా వుందని బాధపడుతోంది. అలాంటప్పుడు మనం వెళ్లి కదిలిస్తే ఆ నొప్పి ఇంకా ఎక్కువవుతోంది. ఆ పాపం మనకెందుకు?” అంటూ కారువైపు నడిచాడు అంకిరెడ్డి.
అంకిరెడ్డి కారులో కూర్చున్నాక, కారు వెనక డోర్‌ ఓపెన్‌ అయింది. ధృతి కూర్చోగానే కారు కదిలి గేటు దాటింది.
అంకిరెడ్డి కారును రోడ్డుమీద నడుపుతున్న విధానం చూస్తుంటేనే ధృతికి అర్థమైంది. ఆయన తనను చాలా జాగ్రత్తగా తీసికెళ్తున్నాడని. ఎంతమంది మామలు కోడళ్లనింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? ఈ విషయంలో తను నిజంగానే అదృష్టవంతురాలు. గాలికి నుదుిమీద పడుతున్న కురులను వెనక్కు నెట్టుకుంటూ బయటకు చూస్తోంది.
”అమ్మా! దృతీ” అంటూ పిలిచాడు అంకిరెడ్డి.
వెంటనే కాస్త ముందుకు వంగి ”పిలిచారా మామయ్యా!” అంది.
ఆయన కారు నడపడం కొంచెం స్లో చేసి అవునన్నట్లు తలవూపాడు.
ఆయన ఏం మాట్లాడతాడో వినాలని ఆయనవైపు చూస్తూ ”చెప్పండి! మామయ్యా!” అంది.
”రామాయణంలో సీతమ్మతల్లిని లక్ష్మణుడు అడవులకి తీసికెళ్తున్నప్పుడు ‘నన్నెక్కడికి తీసుకెళ్తున్నావయ్యా!’ అని అడిగిందో లేదో తెలియదు కాని నువ్వు నన్ను ‘ఎక్కడికి తీసికెళ్తున్నారు మామయ్యా!’ అని అడగలేదు. ఈ జర్నీ నీకు బాధగా లేదా?” అన్నాడు.
ఆమెకు ఏమాత్రం బాధగా లేదు. ఆ ఇంట్లోంచి బయటకి వచ్చాక ఆమె మనసు, శరీరం ఊహాతీతంగా మారిపోయాయి. అనుకోకుండా ఒక పిల్లతెమ్మెర వచ్చి చెంపల్ని, కనురెప్పల్ని తాకినంత హాయిగా వుంది. ఆయనకు వెంటనే సమాధానం చెప్పకుండా కారులోకి చొచ్చుకువస్తున్న గాలిని ఆస్వాదిస్తూ బయటకు చూడసాగింది.
”బాధ వుంటుందమ్మా! ఎందుకుండదు. కానీ కుటుంబంలో నలుగురం వున్నాక చిన్నచిన్న తేడాలు, బేదాభిప్రాయాలు రావడం సహజం. అవి ఏ రోజుల్లో అయినా తప్పవు. ఇప్పుడు మరీ చిన్నచిన్న విషయాలకే వాదోపవాదాలు ఎక్కువవుతున్నాయి. ఒకరిమీద ఒకరు అరుచుకుంటూ వివాదం పెంచుకోవటం కూడా ఎక్కువైంది. కోపతాపాలతో, రోషావేశాలతో మాటకు మాట అనుకోవటమే కాని ఆలోచించటం లేదు. ఇలాంటి స్థితిలో నువ్వెందుకింత మౌనంగా నీలో నువ్వే బ్రతుకుతున్నట్లు నిశ్శబ్దంగా వుండిపోయావు? ఏది వున్నా మనసులోనే దాచుకుంటున్నావు. ఎందుకిలా?” అన్నాడు.
”నాకు కుటుంబ జీవనం ఎలా వుంటుందో తెలియదు మామయ్యా! నా చిన్నప్పటి నుండి నా వయసు పిల్లలతో కలిసి హాస్టల్లో వుండి పెరిగాను. అందుకే పెద్దవాళ్ల మధ్యలో వుండి ఎలా మసలుకోవాలో తెలియలేదు. దానివల్ల మీ అందరికి ఇబ్బంది కల్గించి వుంటాను. అదే నా భయం. అందుకే నా ఈ మౌనం…”
”ఈరోజుల్లో ఎవరుంటారమ్మా ఇలా…! వున్నారన్నా నమ్ముతారా?”
”వున్నాను కాబట్టే నాకు మీ ఆదరణ, అభిమానం వున్నాయి. లేకుంటే ఎవరికెవరు మామయ్యా! ఒంటరి జర్నీ ఊహించగలమా!”
”ఊహాతీతంగా వున్నావమ్మా! నీలాంటి వాళ్ల జీవితాలకు కాలమే పరిష్కారం చూపాలి” అన్నాడు.
”ఏమో మామయ్యా! నాకైతే భయంగా వుంది. అత్తయ్యగారు, మోక్ష అక్క నాతో మాట్లాడడం మానేశారు ఎందుకో తెలియదు. అత్తయ్యగారు నన్ను మొదట్లో చాలా బాగా చూశారు. ఇంట్లో ఏ స్వీటు చేసినా ముందుగా తెచ్చి కొంత నా గదిలో పెట్టేది తినమని… పాలమీద మీగడ నాకు ఇష్టమని చక్కర కలిపి మరీ ఇచ్చేది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు…”
”ఇలా ఎన్ని రోజుల నుండి?”
”చాలా రోజులైంది మామయ్యా!”
”అయితే నేను వూహించిందే నిజమైంది. మీ ముగ్గురి మధ్యన చాలా రోజులుగా గొడవలు వున్నాయి…”
”గొడవలేం లేవు మామయ్యా!”
”పైకి లేవులేమ్మా! నువ్వు పెట్టుకుంటే కదా వుండేది. నీలాంటివాళ్లు కొన్ని కుటుంబాల్లో ఇమడాలంటే అంత తేలిక కాదులే!”
”నా వల్ల పొరపాటు జరిగి వుంటే నన్ను ఎక్స్‌క్యూజ్‌ చెయ్యమని అత్తగారితో చెప్పండి మామయ్యా!” అంది.
అంకిరెడ్డి మాట్లాడలేదు. ధృతి మానసిక స్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు. కొన్ని కుటుంబాలకి అడవులకి పెద్ద తేడా వుండదని తెలుసుకోలేని చిన్నపిల్ల దృతి. అందుకే అక్కడ వుండే పులులను, సింహాలను, తోడేళ్లను కనిపెట్టలేకపోయింది. ముఖ్యంగా సాధుజీవుల మాస్కుల్ని తొడుక్కుని వుండే క్రూరమృగాలను అసలే తెలుసుకోలేక పోతోంది… బాంధవ్యాల నడుమ కూరుకుపోయి చేయని తప్పులకి కూడా శిక్షను అనుభవిస్తోంది.
కారు నెమ్మదిగా వెళ్లి తారమ్మ ఇంటి ముందు ఆగింది. వెనక డోర్‌ ఓపెన్‌ చేసి ”దిగమ్మా!” అన్నాడు అంకిరెడ్డి.
ఒక్కక్షణం తనెక్కడికి వచ్చిందో అర్థమై ఆనందంతో కారు దిగింది ధృతి.
కష్టజీవి తారమ్మ అప్పుడే పొలం నుండి వచ్చినట్లుంది. కాళ్లు, చేతులు కడుక్కుంటూ పంపు దగ్గర వుంది. కారుని కాని, కారులోంచి వాళ్లు దిగడం కాని గమనించలేదు.
అంకిరెడ్డి పంపు దగ్గరకి వెళ్లి ”అమ్మా! తారమ్మా!” అంటూ చాలా దయనీయంగా పిలిచాడు.
తారమ్మ తిరిగి చూసి ”బాబుగారు! మీరా?” అంది.
ఆయన మాట్లాడేలోపలే కారు దగ్గర వున్న ధృతిని చూసి ఆమె దగ్గరకి వెళ్లి ”రా తల్లీ! అక్కడే నిలబడ్డావేం!” అంటూ ప్రేమగా నిమిరి ”బాగున్నావా అమ్మా!” అంది. ఆనందమో, ఆవేదనో తెలియదు తారమ్మ అలా అడగ్గానే ఒక్కసారి కళ్లనిండా కన్నీళ్లు వూరాయి ధృతికి. బేలతనంగా అన్పించే భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. అయినా వాటిని అతికష్టంగా అదుపులోకి తెచ్చుకొని
”మీరెలా వున్నారు ఆంటీ!” అడిగింది ప్రేమగా ధృతి.
”నాకేం తల్లీ! చూడు ఎలా వున్నానో!” అంటూ నవ్వి వాళ్లను లోపలకు తీసికెళ్లి దండెం మీద వున్న దుప్పటి దులిపి నవారు మంచంపై పరచి చాలా గౌరవంగా కూర్చోబెట్టింది. వాళ్లు కూర్చున్నాక… ”ఎటైనా వెళ్తున్నారా బాబు ఇటొచ్చారు?” అంటూ అభిమానంగా అడిగింది. ఆయన మాట్లాడే లోపలే మంచినీళ్లు తెచ్చి చెరొక గ్లాసు ఇచ్చింది.
ఆయన మంచినీళ్లు తాగుతూ అటుఇటూ చూస్తూ ”వీళ్లేరమ్మా?” అన్నాడు.
”మేకల దొడ్లో మేక ఈనిందని మా శేషయ్య, సౌమ్య అక్కడే వున్నారు బాబుగారు దాన్ని చూసుకుంటూ… మేకలకి గాని, ఆవులకి గేదెలకి గాని మనిషికి పురుడు పోసినట్లే పొయ్యాలి. నోరు లేదని వాటిని అలాగే వదిలెయ్య కూడదు. మీరు వచ్చారని చెప్పి వస్తాను” అంటూ ఆమె వెళ్లబోయింది.
”వద్దులేమ్మా! నువ్వు కూర్చో! నేను నీతోనే మాట్లాడాలి” అన్నాడు అంకిరెడ్డి.
తారమ్మ దొడ్లవైపు వెళ్లకుండా ఆగి కూర్చుంది. వాళ్లకు అతిధి మర్యాదలు చెయ్యాలన్న కంగారులో వుందామె… సిటీవాళ్లు కాబట్టి వాళ్లకు సౌమ్య అయితేనే బాగా చేస్తుంది. అందులో వాళ్లు మామూలు వాళ్లు కాదు. ఈ మధ్యన ఇంటిముందు పచ్చగడ్డి (కార్పెట్ గ్రాస్‌) వేయించారు. దానికి వేల రూపాయల్లో ఖర్చు అయిందట. మొన్న వెళ్లినప్పుడు మాధవీలత చెప్పింది. ఇంటికెంత ఇంపుగా వుందో! సిటీలో పెద్ద బంగ్లా, కారు, ఆ బంగ్లాలో వుండే వాళ్లందరికి పెద్దపెద్ద ఉద్యోగాలు… ఒక్క ధృతికి, మాధవీలతకు తప్ప. అమ్మో తలుచుకుంటేనే బిత్తరపోయే జీవితాలు వాళ్లవి… అలాంటి వాళ్లొచ్చి ఎంతో సాదారణంగా తన నట్టింట్లో కూర్చోవటం మాటలా! పైగా తనతో మాట్లాడాలట…
”వుండండి బాబుగారు! నా కోడల్ని, శేషయ్యను పిలుచుకొస్తాను!” అంటూ మళ్లీ లేవబోయింది.
”వద్దు. నువ్వు కూర్చో తారమ్మా!” అన్నాడు.
ఆమె కూర్చుని ”చెప్పండి బాబుగారు” అంది వినయంగా.
”నా కోడల్ని కొద్దిరోజులు నీ ఇంట్లో వుంచుకోగలవా తారమ్మా! నువ్వు కాదనవన్న నమ్మకంతోనే వచ్చాను”
”అదేంటి బాబుగారు?” ఆమె నమ్మలేకపోతోంది.
”పరిస్థితులు అలా వచ్చాయి తారమ్మా! ఏం చేయను చెప్పు! ప్రేమానురాగాలు పలచబడితే చిన్న పొరపాట్లే పెద్ద తప్పులుగా కనబడతాయి కదా!”
”తప్పొప్పుల్ని ఎంచుకునే సమయమా బాబు ఇది? గర్భవతిగా వున్న కోడల్ని పరాయి ఇంట్లో వదలడమేంటి? ఇది తగునా? న్యాయాన్యాయాలు తెలిసినవారు, సతీష్‌ బాధపడడా?”
”నువ్వు అడుగుతున్నది సరియైనదే తారమ్మా! కానీ దేశానికి దేశానికి మధ్య యుద్ధం కన్నా మనిషికీ, మనిషికీ మధ్యన జరిగే మానసిక యుద్ధం భయంకరంగా వుంటుంది. దాన్ని తట్టుకోవడం మామూలు విషయం కాదు. అందుకే కొద్దిరోజులు ధృతికి మానసిక ప్రశాంతతను ఇవ్వటం నా ధర్మంగా, బాధ్యతగా భావించి నీ దగ్గరకి తీసుకొచ్చాను. కాదనకు!” అన్నాడు.
”కాదాంటానా బాబు! కడుపులో పెట్టుకోనూ!!”
”అలా అంటావన్న ధైర్యంతోనే తీసుకొచ్చానమ్మా! లేకుంటే నాకు ఎంతమంది బంధువులు లేరు. వాళ్ల దగ్గరకేమైనా తీసికెళ్లానా?” అన్నాడు.
”ఎవరో అంటే విన్నాను బాబు! మీలాంటి గొప్పవాళ్ల బంధువుల ఇళ్లలో సొంతమనుషులకన్నా పని మనుషులు, బొచ్చుకుక్కలు ఎక్కువగా వుంటాయని. ఉద్యానవనాలు, ఈతకొలనులు చాలా విశాలంగా వుంటాయని. నిజమేనా?” ఆసక్తిగా అడిగింది.
”నిజమే తారమ్మా! మనసు మాత్రం మీ అంత విశాలంగా అయితే ఉండదు. లేకుంటే నేను అడగ్గానే ధృతిని వుంచమనేదానివా? ఎంతమంది వున్నారమ్మా నీలాగ?”
”మనదేముంది బాబు! అంతా ఆ దేవుని దయ. పొలాలు పండిస్తాం కాబ్టి ఇంటినిండా ఆహార ధాన్యం వుంది. ఆవులు పాలిస్తాయి. నాటుకోళ్లు గుడ్లు పెడతాయి. అన్నిరకాల కూరగాయలు పండుతాయి. తిండికి తక్కువేం లేదు. ధృతి కూడా మాలో మనిషే అనుకుంటాం. జాగ్రత్తగా చూసుకుంటాం. సౌమ్య వుంది కాబట్టి ఇద్దరు తోడుగా వుంటారు” అంది.
ఆమె అలా అంటుంటే ఆయనకు సంతోషం వేసింది. మాటల మధ్యలో ”సతీష్‌ హాస్టల్లో వుంచమన్నాడు. పిల్లలు, వాళ్లకేం తెలుసు. హాస్టల్స్‌లో పురుళ్లు పొయ్యరని…” అంటూ ధృతి గురించి డాక్టర్‌ ఏం చెప్పిందో తారమ్మకు చెప్పాడు.
ధృతి శ్రోతలా వింటూ కూర్చుంది.
”డాక్టర్‌ చెప్పకముందే ధృతి పరిస్థితి నేను తెలుసుకున్నాను బాబు! వెంటనే నరేంద్రకి ఫోన్‌ చేసి సతీష్‌చంద్రతో చెప్పమని చెప్పాను. ఆరోజు నేను ఫోన్‌ చెయ్యకపోతే దృతిని గురించి ఎవరూ ఏమీ ఆలోచించేవాళ్లు కాదేమో!” అంది. ధృతి ఆశ్చర్యపోయి విన్నది.
అలా ఆమె అంటుండగానే ప్రవీణ్‌ తన స్నేహితులతో వచ్చాడు. స్నేహితులంటే ఒకరో ఇద్దరో కాదు. పదిమంది వచ్చారు. కొంతమంది షూస్‌ బయట విప్పి లోపలికి వస్తే, కొంతమంది బయట అంకిరెడ్డి కారు ముందు నిలబడ్డారు.
తారమ్మకు తెలియక ”వీళ్లంతా ఎవరు?” అన్నట్లు చూస్తోంది.
”కూర్చో ప్రవీణ్‌!” అన్నాడు అంకిరెడ్డి.
ప్రవీణ్‌ అంకిరెడ్డి ముందు చాలా వినయంగా నిలబడి ”అంకుల్‌! మీరు కాల్‌ చేసినప్పుడు మేమంతా ఇదే ఏరియాలో వున్నాం. కలిసిపోదామని వచ్చాం” అంటూ ధృతి వైపు చూశాడు. అతని కళ్లకు ధృతి పెళ్లికి ముందున్నట్లు లేదు. అప్పటి తేజస్సు అంతా పోయి వాడిపోయిన పువ్వులా వుంది. ఎందుకింత మారిపోయింది. పెళ్లియితే ఆడపిల్లలు ఇలాగే వుంటారా అనుకున్నాడు.
కారెక్కే ముందు అంకిరెడ్డి ఫోన్‌ చేసి ”ప్రవీణ్‌! మీ అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదు. ధృతిని చూసుకోలేకపోతోంది. తారమ్మ అని మనకు తెలిసినామె వుంది. ఆమె దగ్గరకి తీసికెళ్తున్నాను. పలానా ఊరు, పలానా చోట ఇల్లు… సతీష్‌కి కూడా చెప్పాను. సంతోషించాడు” అని చెప్పాడు.
తారమ్మ అంటే ఈమేనా అన్నట్లు తారమ్మవైపు చూశాడు ప్రవీణ్‌.
అది గమనించి అంకిరెడ్డి ”తారమ్మ అంటే ఈవిడే ప్రవీణ్‌! ఈ రోజు నుండి ధృతి ఇక్కడే వుంటుంది. తారమ్మ చూసుకుంటుంది. ఈ తారమ్మ ఎవరో కాదు సతీష్‌ స్నేహితుని తల్లి” అంటూ తారమ్మను ప్రవీణ్‌కి, ప్రవీణ్‌ని తారమ్మకి పరిచయం చేశాడు. ప్రవీణ్‌ వెంటనే వంగి తారమ్మ పాదాలను తాకి ”నమస్తే అమ్మా!” అన్నాడు.
ఆమెకు ప్రవీణ్‌ని చూస్తుంటే నరేంద్రను చూసినట్లే అన్పించింది. ప్రవీణ్‌ వైపే చూస్తూ ”కూర్చో నాయనా!” అంది. ప్రవీణ్‌ కూర్చుని ”మీరేం భయపడకండమ్మా! మేమున్నాం కదా! అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాం!” అన్నాడు. ధృతి దగ్గరకి వెళ్లి ఆమె తలమీద చేయివేసి ప్రేమగా నిమిరి ”ధైర్యంగా వుండు” అన్నాడు.
”అలాగే అన్నయ్యా!” అంది ధృతి.
ధృతిని పెళ్లిరోజు చూసిందే. మళ్లీ చూడలేదు. కారణం ఆనంద్‌ మాటలు నచ్చక. ఈ విషయం ధృతికి కూడా తెలుసు. ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా ”నేను బాగున్నాను అన్నయ్యా!” అనేది. ఇదేనా బాగుండటమంటే అనుకున్నాడు మనసులో…
అక్కడే నిలబడి వున్న అతని స్నేహితుల్లో ఒకతను ప్రవీణ్‌ చెవి దగ్గరగా వంగి ”అన్నా! పండ్లు లోపలికి తేనా?” అన్నాడు. ప్రవీణ్‌ తెమ్మనగానే పెద్దపెద్ద అడుగులేసుకుంటూ తామొచ్చిన జీపు దగ్గరకి వెళ్లి ఓ క్యారీబ్యాగ్‌ నిండా పండ్లు, పూలు తెచ్చి తారమ్మ చేతికి ఇచ్చాడు. ఆమె ఆ బ్యాగ్‌ని సంతోషంగా అందుకొని పక్కన పెట్టింది.
అంకిరెడ్డికి సడన్‌గా ఏదో గుర్తొచ్చిన్నట్లు లేచి నిలబడి ప్యాంటు జేబులోంచి డాక్టర్‌గారి ప్రిస్క్రిప్షన్‌ బయటకు తీసి ”ఇది నీ దగ్గర వుంచు ప్రవీణ్‌! కోడలికి స్టెరాయిడ్‌ వాడాలని డాక్టర్‌ చెప్పినట్లు మీ అత్తగారికి తెలిస్తే భయపడుతుంది. అందుకే తనకి చెప్పలేదు… ఇది నువ్వు చూసుకో! ధృతిని వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసికెళ్లు” అంటూ ఆయన మీద ఉన్న బాధ్యతను ప్రవీణ్‌ మీద ప్టోడు.
”అలాగే అంకుల్‌!” అంటూ ఆ ప్రిస్క్రిప్షన్‌ తీసుకున్నాడు ప్రవీణ్‌.
అంతలో సౌమ్య, శేషేంద్ర మేకల దొడ్ల దగ్గర నుండి వచ్చి, పంపు దగ్గర కాళ్లు, చేతులు కడుక్కుని లోపలికి వచ్చారు. ‘ఎవరు వీళ్లంతా’ అన్నట్లు వాళ్లు చూస్తుంటే తారమ్మ అర్థం చేసుకుని ప్రవీణ్‌ బృందాన్ని భర్తకి, కోడలికి పరిచయం చేసింది. అంకిరెడ్డి, ధృతి వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్లని వదిలేసింది.
”ఈరోజు నుండి ధృతి మన ఇంట్లోనే వుంటుంది. ఆమె మన ఇంటి ఆడపడుచు. మనమే పురుడు పోయాలి” అంది పెద్దమనసుతో తారమ్మ. ఆమె మాటకు ఆ ఇంట్లో తిరుగు వుండదు. శేషేంద్ర, సౌమ్య ‘అలాగే’ అన్నట్లు ఆనందంగా తల వూపారు. సౌమ్య వెళ్లి ధృతి చేతుల్ని పట్టుకొని ప్రేమగా, స్నేహంగా నొక్కింది.
”ఇక నేను వెళ్లొస్తాను తారమ్మా!” అంటూ అంకిరెడ్డి లేచి నిలబడ్డాడు.
”సరే! బాబు” అని తారమ్మ కూడా లేచి నిలబడింది.
ధృతి మామగారి కాళ్లకు మొక్కాలని వంగబోయింది. తారమ్మ వెంటనే ధృతిని పట్టుకొని ”వద్దు తల్లీ! ఈ టైంలో నువ్వలా వంగ కూడదు. ఆయన ఆశీస్సులు నీకెప్పుడూ వుంటాయి” అంది.
ప్రవీణ్‌కి ఆ దృశ్యం చూస్తేనే తారమ్మ తన చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలదో అర్థమైంది. మనిషిని మనిషి ప్రేమగా చూసుకోటానికి బంధుత్వమే అవసరం లేదు. కష్టజీవిలా కన్పిస్తున్న తారమ్మలో కరుణ వుంది. కరిగే తత్వం వుంది. ప్రకృతి స్వభావం లాగే ఆమె స్వభావం కూడా అందమైనదే. అది చాలు. ఇక బంధుత్వం ఎందుకు?
అంకిరెడ్డి అక్కడ నుండి కదిలి గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. ఆయన వెంట ప్రవీణ్‌ ఒక్కడే వెళ్లి కారు కదిలి వెళ్లేంత వరకు వుండి లోపలకొచ్చాడు.
లోపల కొచ్చాక తారమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతని స్నేహితులు బయట జీపు దగ్గర వున్నారు. సౌమ్య అందరికీ కాఫీ పెట్టింది. శేషయ్య అందరికన్నా ముందు జీపు దగ్గర వున్న ప్రవీణ్‌ స్నేహితులకి కాఫీ పట్టుకెళ్లి ఇచ్చి వచ్చాడు. సౌమ్య, ధృతి కాఫీలు తాగాక వంటపనిలో మునిగిపోయారు.
ఒక గంట తరువాత తారమ్మ, శేషేంద్ర కోరినట్లు ప్రవీణ్‌ బృందం భోం చేసింది.
భోజనాలయ్యాక దూరంగా వుండే దుకాణం దగ్గరకి వెళ్లి అందరికి కూల్‌డ్రింక్స్‌ తెచ్చి ఇచ్చాడు శేషేంద్ర. ప్రవీణ్‌ తారమ్మతో ”మీ ఆతిథ్యాన్ని మరచిపోలేం ఆంటీ! మీరు మాకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు…” అంటూ మరోమారు వంగి ఆమె కాళ్లను తాకాడు.
ఆమె కదిలిపోతూ ”సహాయం చేసే అవకాశం కాని, సమర్ధత కాని దేవుడిచ్చేదే ప్రవీణ్‌! మన చేతిలో ఏమీలేదు” అంది.
”ధృతిని హాస్పిటల్‌కి తీసికెళ్లి డాక్టర్‌ గారికి చూపించి తీసుకొస్తాను ఆంటీ!” అన్నాడు ప్రవీణ్‌.
”నేను కూడా వస్తాను ప్రవీణ్‌! ధృతిని ఎలా చూసుకోవాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకుంటాను. కాన్పు అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవలసి వస్తుంది” అంది తారమ్మ.
”సరే! ఆంటీ! రండి!” అంటూ ధృతితో పాటు తారమ్మను కూడా జీపులో ఎక్కించుకొని హాస్పిటల్‌కు వెళ్లాడు ప్రవీణ్‌.

ధృతి ఇంట్లోంచి వెళ్లాక మాధవీలతకు చాలా హాయిగా వుంది. పనిమనిషి కీరమ్మను మళ్లీ పనిలో పెట్టుకుంది. కీరమ్మకు వేరే ఎక్కడా పని దొరకక మళ్లీ వచ్చిందే కాని కోడళ్లను చూసుకొని పనోళ్లను మాన్పించేసే మాధవీలత లాంటి వాళ్లు వీధికొకరు వుంటే భూమ్మీద వానలే పడవని ఆమె పనికోసం తిరిగినచోటంతా చెప్పుకుంది. మాధవీలత పనిలోంచి తీసేశాక చాలారోజులు పస్తులతోనే గడిపింది. పని విలువ తెలుసు కాబట్టే మళ్లీ వచ్చి పనిలో చేరింది.
మోక్ష అనడం వల్లనో లేక తన శరీరం మీద నిజంగానే ముడతలు వస్తుండడం వల్లనో తెలియదు కాని మాధవీలతకు తన చర్మాన్ని నున్నగా మార్చుకోవాలన్న కాంక్ష పెరిగింది. దాని వల్ల ఉదయం లేవగానే ఒకటి ఏదో రకం ప్యాక్‌ చేసుకొని స్నానం చేశాకనే ప్రశాంతంగా తిరుగుతుంది. ఒక రోజు ఉదయాన్నే పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పచ్చి పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని పొడిచేసి తగినన్ని నీళ్లు కలిపి ముఖానికి, శరీరానికి పట్టిస్తే అదేరోజు రాత్రికి అరటీస్పూన్‌ వైట్ పెట్రోలియం జెల్లీలో రెండు టీస్పూన్ల గ్లిజరిన్‌ రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేసి చర్మం మీద అప్లై చేస్తుంది… మళ్లీ రోజు ఉదయం సగభాగం ఆపిల్‌ని చెక్కు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దానిలో 5 టీ స్పూన్ల పాలు, ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తుంది. 20 నిముషాలు ఆగి కడిగేస్తుంది. అదేరోజు రాత్రికి క్యార్‌ట్ గుజ్జును కురులకు పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తుంది.
ఇంకోరోజు అరటీస్పూన్‌ ఆవాల నూనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి దాన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకొని పది నిముసాల పాటు మసాజ్‌ చేసి గోరువెచ్చని నీటితో కడిగేస్తుంది. ఆ రాత్రికి పాలమీద మీగడ ఒక టీ స్పూన్‌ బాగా పండిన రెండు స్ట్రాబెరీలు కలిపి పేస్ట్‌ చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తుంది… మళ్లీ రోజూ ఉదయాన్నే నిద్రలేచాక టేబుల్‌ స్పూన్‌ అరిపండు గుజ్జులో అరటేబుల్‌ స్పూన్‌ టోమాటో రసం కలిపి ఆ పేస్ట్‌ను మెడకు, ముఖానికి, చేతులకు పట్టించి 20 నిమిషాలు ఆగి కడిగేస్తుంది. ఆ రాత్రికి టేబుల్‌ స్పూన్‌ శెనగపిండిలో టేబుల్‌స్పూన్‌ పెరుగు, టేబుల్‌స్పూన్‌ పచ్చిపాలు, టీస్పూన్‌ నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేస్తుంది… మళ్లీ తెల్లవారగానే ఉసిరికాయ పేస్టు, గోరింటాకు పొడి, మెంతిపొడి సమానంగా తీసుకొని రెండు టేబుల్‌ స్పూన్ల పచ్చిపాలను చేర్చి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంది. ఇదంతా ఆమెకు మోక్షనే చెయ్యాలి. రోజురోజుకి మోక్షలో అసహనం పెరుగుతోంది.
”రాత్రేగా అత్తయ్యా జుట్టుకి అప్లై చేసింది. మళ్లీ ఉదయాన్నే ఎందుకు?” అని అన్నా వినదు. వద్దంటున్నా వినకుండా కీరమ్మ చేత కారెట్ లను ఉడకబెట్టించి అందులో తేనె కలిపి ఒంటికి పూయమని కోడల్ని పిలిచి కుర్చీలో కూర్చుంది మాధవీలత.
అత్తగారు చెప్పినట్టే మోక్ష పూస్తూ నిలబడింది. పూసిపూసి ఎంత పూసినా ఆ గిన్నెలో గుజ్జు తగ్గడం లేదు. కీరమ్మ మీద కోపంగా వుంది. వుడికించే ముందు రెండు కేరట్లు తక్కువ వేసి ఉడికిస్తే దాని సొమ్మేం పోయింది అని అనుకుంది.
ఆనంద్‌ గట్టిగా కేకేశాడు ”మోక్షా! ఎక్కడున్నావే?” అని…
మోక్ష ఉలిక్కిపడి ”చూడండి! అత్తయ్యా ఆ కేక… మనిద్దరం దడుసుకున్నామా లేదా?” అంది.
”వాడు అంతేలే మోక్షా! నువ్వు కానియ్‌!” అంది.
”ఏం కానియ్యాలో ఏమో! పిలిచిన వెంటనే వెళ్లకుంటే ఉద్యోగం చేస్తున్నానని పొగరే నీకు అంటాడు. వెళ్తాను అత్తయ్యా!”
”ఆ కొంచెం పూసి వెళ్లు. అదంతా పూస్తేనే ముడతలు తగ్గుతాయేమో! పడేస్తే ఏమొస్తుంది?”
”ఎవరంత కలపమన్నారు? యేబై దాక వచ్చిన ముడతలు ఈ గుజ్జంతా పూయగానే పోతాయా? పూసిపూసి నా చేతులు పీకుతున్నాయత్తయ్యా!! ఆ కొంచెం మీరే పూసుకోండి!” అంటూ ఆ గుజ్జున్న బౌల్‌ను కింద పడేసి వెళ్లింది మోక్ష.
అది చూసి కీరమ్మ ‘ఏదో వారానికో, నాలుగు రోజులకో అయితే పర్వాలేదు కాని రోజుకి రెండుసార్లు ప్యాక్‌ చెయ్యాలంటే ఎవరివల్ల అవుతుంది’ అని మనసులో అనుకుంది.
మోక్ష సడన్‌గా బౌల్‌ను కింద పడేసి వెళ్లిందని మాధవీలత బిత్తరపోలేదు. బాధ పడలేదు. మోక్ష ఈ మధ్యన ఒక చిట్కా చెప్పిందామెకు. మనసును ప్రశాంతంగా వుంచుకొని కోపం లేకుండా వుంటే ముఖం మీద ముడతలు పోతాయని… ఎప్పుడూ నవ్వుతూ వుండటం కూడా సౌందర్య రహసంలో ఒక భాగమని… అప్పి నుండి ఏ మాట విన్నా, ఏ చర్య చూసినా పాజిటివ్ గా ఉండటానికే ప్రయత్నిస్తుంది. వెంటనే ఆ గిన్నెను అందుకుని అందులో మిగిలివున్న గుజ్జును తీసి దట్టంగా రుద్దుకుంది. ఓ గంట ఆగి స్నానం చేసి వచ్చింది. జుట్టు ఆరబెట్టుకుంటూ సోఫాలో కూర్చుంది.
కీరమ్మ పనంతా అయ్యాక ”వచ్చేటప్పుడు రాత్రికి కూరగాయలు పట్టుకొస్తాను డబ్బులియ్యండమ్మా!” అంటూ మాధవీలత దగ్గరకి వెళ్లింది.
”సరే!” అంటూ పర్స్‌లోంచి డబ్బులు తీసి కీరమ్మకి ఇచ్చింది.
కీరమ్మ డబ్బులు తీసుకొని మాధవీలత వైపు పరిశీలనగా చూసి ”అదేంటమ్మా! మీ ముఖం అలా వుంది?” అంది.
”ఎలా వుందే! నిన్న కన్నా బాగుందా?” అంది ఉత్సాహంగా.
”లేదమ్మా! వాచినట్లు, పాచినట్లు, కాస్త ఎర్రబడి వుంది. ఎందుకయినా మంచిది అద్దంలో చూసుకోండి!” అంది.
ఆమె ఉలిక్కిపడి ”ఎందుకుందే అలా?” అంది.
”ఏమో నాకేం తెలుసమ్మా! రాత్రికి మీ ముఖానికి ఏమేమి పూయాలో కాగితం మీద రాసివ్వండి! కూరగాయలతో పాటు అవి కూడా పట్టుకొస్తాను. నాకసలే మతిమరుపు. నోటితో చెబితే అసలే గుర్తుండి చావటం లేదు” అంది ఎదురుగా వచ్చి నిలబడి.
”నువ్వెళ్లవే! నాకేంటో ముఖమంతా మండుతున్నట్లుంది” అంటూ లేచి అద్దం దగ్గరకి వెళ్లింది.
ఆమె వెళ్తుంటే వెనక నుండి కీరమ్మ ”మీ ముఖంలో దద్దుర్లే కాదమ్మా రెండు మచ్చలు కూడా కన్పించాయి. అద్దాలు పెట్టుకొని చూసుకోండి! ఎందుకయినా మంచిది. ఇప్పటికే జుట్టు పలచబడి పోయిందని బాధ పడుతున్నారు. దానికి తోడుగా మచ్చలెక్కువైతే ఇంకా బాధపడతారు” అంటూ వెళ్లిపోయింది.
ఇప్పుడు నిజంగానే బిత్తరపోయింది మాధవీలత. ”నా ముఖానికి మచ్చలు కూడా వచ్చాయా? అసలు చిన్నప్పటి నుండి ఒక్క మచ్చ కూడా లేని ముఖం నాది… ఇప్పుడు మచ్చలెందుకొచ్చాయి?” అని మనసులో అనుకుంటూ వెళ్లి డ్రస్సింగ్‌ టేబుల్‌ ముందు నిలబడింది. చేతుల్ని, ముఖాన్ని గుచ్చిగుచ్చి చూసుకుంది… ఆమె కళ్లకి అద్దాలు పెట్టుకున్నా మంచు వాలినట్లు మసక మసగ్గానే వుంది. మచ్చలు వున్నట్లున్నాయి. వెంటనే లేనట్లున్నాయి. లోపలంతా కంగారు. మోక్ష చెప్పినట్లు ఎంత పాజివ్‌గా ఆలోచిస్తూ ప్రశాంతంగా వుందామన్నా వుండలేకపోతోంది. కీరమ్మ అలా అనడం వల్లనో ఏమో భయంతో దిగులుతో ముఖమంతా ముడుచుకుపోయింది. కీరమ్మ చెప్పిన ఆ రెండు మచ్చల్ని వెతుక్కుంటూ అక్కడే నిలబడింది మాధవీలత.
****

….ఎప్పుడైనా మోక్ష ఆఫీసుకి తీసికెళ్లే లంచ్‌బాక్స్‌లో ప్రతిరోజు ఒక బాయిల్డ్‌ఎగ్‌ పెడుతుంది మాధవీలత. ఆఫీసులో ఎంత వర్క్‌ చేసినా తిండి బాగా తింటే అలసట అన్పించదని మంచి పోషకాహారంతో కూడిన పదార్థాలనే బాక్స్‌లో పెడుతుంటుంది. మోక్ష తింటున్నప్పుడు ఆమె కొలీగ్స్‌ కూడా ఆమె టిఫిన్‌బాక్స్‌లోకి తొంగిచూసి ‘మీ అత్తగారు ఎప్పికప్పుడు అప్‌డేట్ అవుతూ ఫుడ్‌చార్ట్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేలా వున్నారు కదా! ఇన్నిరోజులు అర్థం కాలేదు కాని ఇప్పుడర్థమైంది. నువ్వెందుకింత పుష్టిగా వున్నావో’ అని అంటుంటారు. వాళ్ల మాటలు చాలా వరకు నిజమే అన్పిస్తాయి మోక్షకు… ఎక్కువగా మోక్ష పక్కసీటు అమ్మాయినే లంచ్‌టైంలో మోక్ష దగ్గర కూర్చుంటుంది.
ఇవాళ కూడా అలాగే కూర్చుని తింటున్నారు.
”మోక్షా! ఇవాళేంటి నీ లంచ్‌బాక్స్‌లో ఎగ్‌ లేదు. మీ హబ్బీ స్వామిమాల ఏమైనా వేసుకున్నాడా?” అంది కొలీగ్‌.
”నీకొచ్చిన డౌట్ నాకు అర్థమైందిలే… క్లియర్‌ చెయ్యనా?”
”చెయ్యి!”
”మా అత్తగారి ముఖంమ్మీద రెండు మచ్చలొచ్చాయని ఎవరు చెప్పారో తెలియదు కాని అవి నా వల్లనే వచ్చాయని ఆమె అనుమానం. పక్కనుండే అపార్ట్‌మెంటులో ఆమె స్నేహితురాళ్లుంటే అక్కడికి కూడా వెళ్లి అడిగిందట. మచ్చలున్నాయా లేవా? అని వాళ్లు లేవని చెప్పినా నమ్మటం లేదు. అయినా ఆ రెండు మచ్చలు ఇప్పటివి కావు. అవి ఎప్పటి నుండో వున్నాయి. ఈ మధ్యన ఓవర్‌గా ఫేషియల్‌, ఫేస్‌ప్యాకప్‌లు అయినందు వల్ల అవి స్పష్టంగా బయటపడ్డాయేమో. అప్పటికి చెప్పాను. నారింజరసంలో పాలు కలిపి నెలరోజుల పాటు క్రమం తప్పకుండా ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయని. వినటం లేదు. నా మీద కోప్పడుతోంది. ఇక నా లంచ్‌బాక్స్‌లో ఎగ్‌ కూడానా” అంది.
”ఇదేం కర్మ! అనవసరంగా నోటికాడి ఫుడ్‌ పోగొట్టుకున్నావ్‌!” అంది కొలీగ్‌.
”నాక్కూడా అదే అన్పిస్తోంది. ఆవిడ కోసం నేనెంత కష్టపడ్డానో మీకు తెలియదా? ఎంతమంది బ్యూటీషియన్లను కలిశాను. ఎన్ని ఫోన్‌కాల్స్‌ చేశాను. ఆవిడ ముఖం మీద ముడతలు రాకుండా, మచ్చలు పోతాయనేగా ఫేషియల్‌ చేసేదాన్ని… ముఖం తాజాగా, చర్మం మృదువుగా వుండాలని, వదులవకుండా వుండాలని, మృత కణాలు తొలగిపోవాలనేగా మసాజ్‌ చేసేదాన్ని… జుట్టు ముఖం మీద పడకుండా, ఏది పూసినా జుట్టుకి అంటకుండా వుండాలనేగా హెడ్‌బ్యాండ్‌ తెచ్చాను. అంతేనా ఏప్రాన్‌, బౌల్స్‌, బ్రష్‌, క్రీమ్‌, స్టీమర్‌, ఎక్స్‌ాక్టర్‌, టవల్‌, ఎన్ని తేలేదు. వీికోసం ఎన్నిసార్లు షాపింగ్‌ కెళ్లలేదు. కొంచెం కూడా కృతజ్ఞత వుందా? వుంటే నీవల్లనే మచ్చలొచ్చాయి అంటుందా?” అంది.
కొలీగ్‌ వెంటనే మోక్ష చేయి మీద తట్టి ”బాధపడకు. మీ అత్తగారికి చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ సర్వీస్‌ చేశావు. ఇక అలాంటి సర్వీసేం చెయ్యకుండా సైలెంట్ అయిపో… లేకుంటే నువ్వు డాక్టర్‌ దగ్గరకెళ్లి విటమిన్స్‌ బిళ్లలు మింగాల్సి వస్తుంది” అంది.
”అది కాదువే నా బాధ. ఆవిడను నేనెంత బాగా చూసుకున్నానో తెలుసా? ఇంటికెళ్లాక నాకుండే టైమంతా ఆవిడతోనే గడిపేదాన్ని. మూడు రకాల స్ట్రోక్స్‌తో మసాజ్‌ చేసేదాన్ని. మసాజ్‌ పూర్తయ్యాక ముఖాన్ని కాటన్‌తో తుడిచి ఆవిరి పట్టేదాన్ని… మెత్తి టవల్‌తో చిన్నపిల్లను తుడిచినట్లు తుడిచేదాన్ని… నా బిడ్డ పూర్వికి కూడా నేనలా చేయలేదు, చూసుకోలేదు. చివరకి నావల్లనే మచ్చలొచ్చాయని నాతో మాట్లాడటం మానేసింది. అసలు ఆవిడ ముఖానికేదో అయినట్లు దాచుకొని, దాచుకొని తిరుగుతోంది తెలుసా?” అంది మోక్ష.
”ఖర్మ….” అంది కొలీగ్‌.
మోక్ష అదే విషయంపై చాలాసేపు బాధపడింది. పూర్విని తలచుకుని కళ్లనీళ్లు పెట్టుకుంది.
”నువ్వలా కళ్లనీళ్లు పెట్టుకుంటే చూడబుద్ది కావటం లేదు. నువ్వేనా అన్పిస్తోంది. అయినా నీకేం తక్కువ. జాబ్‌ వుంది హాయిగా తిని హాయిగా వుండు. కాకుంటే పూర్విని తెచ్చుకొని నీ దగ్గరే వుంచుకో. ఆయాను పెట్టుకో. మీ ఇద్దరికి జాబ్స్‌ వున్నాయిగా. కొంతకాలం ఆ ముసలోళ్లకి దూరంగా వుండండి. అలా దూరంగా వుంటే మీరు బ్రతకలేరా? వాళ్లు బ్రతకలేరా? ఇలాంటి తిండి తింటూ ఎన్నిరోజులు బ్రతుకుతావ్‌? దేవుడు మనకు జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ఉద్యోగాన్ని ఇచ్చింది ఎందుకు? కడుపు నిండా తిండి తినకుండా డయాబెటిక్‌ పేషంట్లలా బ్రతకమనా?” అంది ఆవేశంగా.
ఆశ్చర్యపోయింది మోక్ష. తనకంటూ ఒక స్నేహితురాలు వుంది కాబట్టి ఇలా మాట్లాడుతోంది. అదే దృతి తరుపున ఎవరు మాట్లాడారు? ఎవరు ఆలోచించారు? తీసికెళ్లి పరాయి ఇంట్లో వదిలేసి వచ్చారు. అత్తమామలు ఎక్కడైనా ఇంత దుర్మార్గంగా వుంటారా? ఏదీ జీర్ణించుకోలేరా? ఇప్పుడు తన పరిస్థితి ఏమి? అప్పుడు అత్తగారు మాట్లాడకపోతే దృతి ఎలా వుండగలిగిందో కాని తను మాత్రం వుండలేకపోతోంది. ఆలోచిస్తూ కూర్చుంది మోక్ష.
”నువ్వేం ఆలోచించకు. పెద్దవాళ్లతో కలిసి వున్నంత వరకు చాలు. ఇంకా ఎందుకు? అసలు రాత్రి సమయంలో కలిసి వుండే భార్యాభర్తలే ఎవరి జీతం డబ్బులు వాళ్లు ఖర్చుపెట్టుకుంటూ ఒకరి బరువు ఒకరి మీద పడకుండా ఎవరి పర్సనాలిటీని వాళ్లు నిలబెట్టుకుంటున్నారు. షేరింగ్‌ అనేది మాటల్లో వుండొచ్చు, మభ్యపెట్టుకోవటంలో వుండొచ్చు కాని మరీ సొంత సంపాదన మీద కూడా అధికారం లేకుండా కనీసం తిండికి కూడా డిపెండ్‌ కావటం టూమచ్‌ పనిష్‌మెంట్. ఏ రిలేషన్‌లో కూడా ఇది మంచి షేరింగ్‌ కాదు. గుడ్‌ రిలేషన్‌ అంతకన్నా కాదు” అంది.
”బరువుగా మాట్లాడి నన్ను భయపెట్టకు… ఇవాళ ఇంటికెళ్లాక ఏదో ఒకి ఆలోచిస్తాను” అంది మోక్ష.
కష్టమర్లు రావడంతో ఇద్దరు వెళ్లి ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్నారు.
*****

సతీష్‌చంద్ర తండ్రికి ఫోన్‌ చేసి ”కోపతాపాలను తగ్గించుకొని అమ్మా నువ్వూ వెళ్లి దృతిని చూసిరండి నాన్నా! తను ఎలా వుందో ఎలా తెలుస్తుంది? నేనేమి అడిగినా హ్యాపీగా వున్నట్లే మాట్లాడుతోంది. మీరు వెళ్లి చూసి వస్తే నాక్కూడా ధైర్యంగా వుంటుంది. మీరున్నారన్న నమ్మకంతోనే నేనిక్కడ ప్రశాంతంగా వుండగలుగుతున్నాను. ఒకసారి వెళ్లి చూసి రాండి!” అన్నాడు.
లౌడ్‌ స్పీకర్‌లో నుండి కొడుకు మాటలు విన్న మాధవీలత ”ఈ కళ్లతో దాని ముఖం ఎవరు చూడమన్నా చూడను. వాడేదో పెద్ద ఆఫీసరైనట్లు అక్కడుండి ఆర్డర్లు వేస్తే మనమిక్కడ కీ ఇచ్చి వదిలిన బొమ్మల్లా ఆడతామనుకుంటున్నాడేమో! అది జరిగే పని కాదు” అని దృతిని చూడానికి వెళ్లలేదు. సతీష్‌ని కూడా అవమానించినట్లు మాట్లాడింది.
అంకిరెడ్డి ఒకి రెండుసార్లు వెళ్లి చూసి వచ్చాడు.
*****

ఆఫీసులో కొలీగ్‌ మాట్లాడినప్పి నుండి మోక్షలో మార్పు వచ్చింది. భర్తను తీసుకొని పక్కకెళ్లి పోవాలనుకుంది. అప్పుడు అత్తగారు మాట్లాడకపోయినా బాధలేదు. ఎవరెలా పోయినా చింతలేదు. తనూ, తన భర్త, పూర్వి రెంటెడ్‌ హౌస్‌లో వుండొచ్చు. కీరమ్మలాంటి పనిమనిషిని పెట్టుకుంటే ఉదయాన్నే వంట చేసుకొని పూర్విని స్కూల్‌కి పంపి, తనూ, ఆనంద్‌ ఆఫీసుకి వెళ్లొచ్చు… అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే ఆలోచన కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా మోక్షలో…
ఆనంద్‌తో చెప్పింది. ఆనంద్‌ విన్నాడు కాని వెంటనే సమాధానం చెప్పలేదు.
”మాట్లాడరేమండీ! నాకు ఈ ఇంట్లో వుండాలనిపించటం లేదు. మనకేం తక్కువ. బయటకెళ్లి బ్రతకలేమా?”
”ఇప్పట్లో బ్రతకలేం. దానికి కొద్దిగా టైం కావాలి”
”ఎందుకు?”
”మన డబ్బు మొత్తం వేరేచోట ఇన్వెస్ట్‌ చేశాను. ఇప్పుడు మనకు వస్తున్న రెండు జీతాల డబ్బంతా లోన్‌కెళ్లిపోతోంది”
షాకై చూసింది. ”డబ్బేంటి? లోనేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు?”
”నీకు తెలియదులే! నువ్వేం ఆవేశపడకు. నేనీమధ్యన నీకు తెలియకుండా ఓ మంచి పని చేశాను”
”మంచిపనా?”
”అవును”
”ఏంటండీ అది?”
”కమలనాథ్‌ అనే కాంట్రాక్టర్‌కి పదిలక్షలు పెట్టుబడి పెట్టాను. అదంతా ఎలా వచ్చిందనుకున్నావ్‌! లోన్‌ తీసుకుని కొంత, ఇంత వరకు మనం కట్టిన చిట్టీల మీద వచ్చింది కొంత…. ఏదో ఒకటి చెయ్యకపోతే డబ్బులెలా వస్తాయి?”
”ఉద్యోగం చేసుకుంటున్నాం కదా? ఇంకా ఏం చెయ్యాలి డబ్బుల కోసం?”
”ఆ డబ్బులేం సరిపోతాయి మోక్షా? నెలంతా తింటే ఒక్క రూపాయి కూడా మిగలదు. ఇప్పుడేదో మా నాన్న మనకు తిండి పెడుతున్నాడు కాబ్టి ఇద్దరి జీతాలు చిట్టీలకు కట్టి సేఫ్‌సైడ్‌లో వున్నాం. లేకుంటే ఏముంది?”
”అలాగే వుంటే సరిపోయేదిగా! కొత్తగా ఈ లోన్లెందుకు? ఆ చిట్టీ డబ్బులన్నీ తీసుకోవడం ఎందుకు? కాంట్రాక్టర్‌కి ఇవ్వడం ఎందుకు? అయినా ఇంతపని చేస్తూ నాకెందుకు చెప్పలేదు?”
”చెబితే మీ ఆడవాళ్లు ఇలాంటి వ్యాపారాలు చెయ్యనిస్తారా? అన్నీ భయాలేగా మీకు? భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం. నేను పెట్టిన పది లక్షలకి తొందరలోనే ఇరవై లక్షలు వస్తుంది. అలా ఏ రంగంలో వస్తుంది చెప్పు. అందుకే నీకు చెప్పకుండా నీ సంతకాన్ని నేనే చేసి నీ పేరుతో లోన్‌ తీసుకున్నాను. నీ జీతం మొత్తం ఇప్పుడు చిట్టీకి పోదు. ఆ లోన్‌కి పోతుంది. అయినా ఒక నెల దాక దాని మీద వచ్చే లాభం మొత్తం మన పేరుతో బ్యాంక్‌లో వేసుకొని మిగతాది లోన్‌కి కట్టేద్దాం! ఓ.కె.నా! ఇక భయపడకు!” అన్నాడు.
పిచ్చిచూపులు చూస్తోంది మోక్ష.
పక్కనే వుండి వాళ్ల మాటలు విన్న అంకిరెడ్డి వెంటనే వచ్చి వాళ్ల దగ్గర కూర్చున్నాడు. మోక్ష ముఖంలోకి చూశాడు.
”ఆనంద్‌ చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. నువ్వేం కంగారు పడకు మోక్షా!” అన్నాడు అంకిరెడ్డి.
”ఇది మీకు తెలుసా మామయ్యా! మీరు కూడా ఆయన మాటలకే సపోర్టు చేస్తున్నారు? ఆయన చేసిన పని మీకు నచ్చుతోందా?” అంది మోక్ష.
”ఆ కాంట్రాక్టర్‌ మంచివాడేనమ్మా! మన డబ్బుకేం ఢోకా లేదు”
”డబ్బులు పోతాయని నేను అనటం లేదు మామయ్యా! లోన్లు తీసుకోవడం ఎందుకు? అదీ నాకు చెప్పకుండా, నేను సంతకం పెట్టకుండా…”
”నీ సంతకం ఆనంద్‌ పెట్టాడు మోక్షా!”
”అది మీక్కూడా తెలుసా మామయ్యా?” అంది. ఆశ్చర్యపోయే ఓపికలేనట్లు చూసింది.
”ఆ…” అన్నాడు అంకిరెడ్డి.
”ఆ… నా! ఏం మాట్లాడుతున్నారు మామయ్యా? మీరు మీరేనా?”
”ఇందులో తప్పేముందమ్మా! నువ్వు నీ ఆఫీసు వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగలేవని నీ కంఫర్ట్‌ కోసం నీ సంతకం ఆనంద్‌ చేశాడు. ఇంత మాత్రానికే ‘మీరు మీరేనా!’ అంటూ నన్ను ప్రశ్నిస్తావెందుకు? అంత పెద్దపెద్ద కళ్లు చేసి చూడానికి ఇప్పుడేం జరిగిందని…?”
మోక్ష తలవంచుకుని కళ్లు మూసుకొని ఒక్క క్షణం పిడికిళ్లు బిగించి ఊపిరి బిగబ్టింది.
ఆనంద్‌ ఆమెను చూసి ”హిస్టీరియా వచ్చిన దానిలా ఎందుకే అలా బిగుసుకుపోయావ్‌?”
ఆమె ఉలిక్కిపడి ”నేను బిగుసుకుపోయానా?”
”కాదా! ఆమాత్రం తెలుసుకోలేనా! నేను ఏది చేసినా నచ్చదు. ఇందుకే ఏం చేయాలన్నా నాకు భయం”
”నువ్వేం భయపడకురా! అసలేంటమ్మా నీ ప్రాబ్లమ్‌?”
”పెద్దవారు. నా సంతకం ఆయన పెడుతున్నప్పుడు మీరు ఆపవద్దా మామయ్యా? అంతా జరిగాక అసలేంటమ్మా నీ ప్రాబ్లమ్‌ అంటే నేనేం చెయ్యగలను. మీరేకదా మాకు కంచెలా వుండాల్సింది”
”తెలివిగా మాట్లాడి మా నాన్నను కించపరిస్తే పెట్టిన సంతకం ఎరేజ్‌ అవుతుందా?” కోపంగా అన్నాడు ఆనంద్‌.
”నువ్వుండరా! దీనివల్ల లాభాలు వస్తాయి కదమ్మా!” అన్నాడు.
”లాభాలు కాదు మామయ్యా! నాకు వేరే ఇల్లు అద్దెకు తీసుకొని వెళ్లాలని వుంది. పూర్విని ఇంకా ఎన్నిరోజులు వాళ్ల దగ్గర వుంచుతాం”
”ఎవరుంచమన్నారు? తీసుకొచ్చుకోమ్మా! ఇక్కడ పూర్వి వుండానికి అభ్యంతరమేంటి? మనతో పాటు వుంటుంది. ఇంత చిన్న విషయానికే వేరే వెళ్లడం ఎందుకు?” అన్నాడు అంకిరెడ్డి.
మోక్షకి ఏం చేయాలో తోచనట్లు పిడికిళ్లు బిగించి చెవుల దగ్గర పెట్టుకుని అటు ఇటూ చూస్తూ కోపంగా ”ఛఛ… నాకు అన్నీ సంకెళ్లే! ఇప్పటికే నా ఇబ్బందులు నాకున్నాయి. అవి చాలక ఈయనగారు నా జీతం మొత్తం లోనుకు కట్టేలా చేసిపెట్టాడు. ఇన్నిరోజులు కట్టిన చీటీ డబ్బులు కూడా లేకుండా చేశాడు. ఈయన వల్ల నాకెప్పుడూ కష్టాలే!” అంటూ అక్కడ నుండి లేచి వెళ్లిపోయింది మోక్ష.
ఆమె అలా వెళ్లగానే కొడుకు వైపు తిరిగి
”ఏంటిరా అలా అంటోంది? నువ్వు చేసిన పని మోక్షకి నచ్చలేదా? ఆ కాంట్రాక్టర్‌ మంచివాడే కదరా! ఎందుకలా భయపడుతోంది. అసలు కమలనాథ్‌ గురించి ఎవరిని అడిగినా మంచివాడనే చెబుతున్నారు. రోడ్డు కాంట్రాక్ట్‌, రైల్వే కాంట్రాక్ట్‌, చెరువుల కాంట్రాక్ట్‌, బిల్డింగుల కాంట్రాక్ట్‌ ఒకటేమిటి ఇప్పటికే అతను చాలా కాంట్రాక్ట్‌లు చేసి వున్నాడు. నేను కూడా అతనితో మాట్లాడాను. అతని మాటల్ని బట్టి చూస్తే ఇది నీకు మంచి ఆపర్చ్యూనిటీ అనిపిస్తోంది. ఇదంతా మోక్షకు నువ్వు ముందే చెప్పాల్సింది. అయినా అంత కోపంగా వెళ్లిపోయిందేం రా?”
”అదెప్పుడూ అంతే నాన్నా! చెప్పింది వినదు. దానికి మనందరం కలిసి వుండటం ఇష్టం లేదు. ఒక్కతే వెళ్లి పక్కనుండాలట… వచ్చిన జీతం మొత్తం నెలంతా ఖర్చు పెట్టుకోవాలట. అదీ దాని సరదా! బాధ్యత తెలిస్తే కదా!” అన్నాడు.
”సరేలే! కమలనాథ్‌ మళ్లీ కలిస్తే చెప్పు! అవసరమైతే ఇంకో 5 లక్షలయినా ఇవ్వానికి సిద్ధంగా వున్నాడు నా స్నేహితుడు? వడ్డీ తక్కువే తీసుకుంటానంటున్నాడు. అవసరమైతే తెచ్చి ఇద్దాం! ఇలాంటి వ్యవహారాల్లో పెట్టుబడి ఎంత ఎక్కువ అయితే లాభాలు అంత అధికంగా వుంటాయి. నువ్వన్నట్లు ఇప్పుడు మన చుట్టూ ఖరీదైన ఇల్లు, కార్లు వున్నవాళ్లంతా ఇలాంటి వ్యాపార లావాదేవీల వల్ల పైకి వచ్చినవాళ్లే!” అన్నాడు.
”సరే! నాన్నా! ఇవాళే ఫోన్‌ చేసి అడుగుతాను” అన్నాడు.
”కాస్త జాగ్రత్తగా మాట్లాడు”
అలాగే అన్నట్లు తల వూపాడు ఆనంద్‌.

మోక్షకు ఈ మధ్యన మనసు బాగుండక తల్లికి ఫోన్‌ చెయ్యలేదు. పూర్వి ఎలా వుందో ఏమో!! ఆఫీసులో కూడా వారం రోజుల నుండి పని బాగా ఎక్కువైంది. ఇంటికొచ్చాక అలసిపోయినట్లయి త్వరగానే నిద్రపోతోంది. ఇవాళ నిద్రపోకుండా ఫోన్‌ చేసింది. పూర్వి లిఫ్ట్‌ చేసి ”మమ్మీ! ఫోన్‌ అమ్మమ్మకివ్వనా?” అంది వచ్చీరాని మాటలతో ముద్దుముద్దుగా.
”వద్దులే నాన్నా! నువ్వు మాట్లాడు. తర్వాత అమ్మమ్మకు ఇద్దువు గాని… ఎలా వున్నావ్‌ నువ్వు?”
”బాగున్నా మమ్మీ! మొన్న డాడీ వచ్చాడు. నువ్వు రాలేదేం?”
”డాడీ వచ్చాడా? ఎప్పుడు?” ఆశ్చర్యపోయింది మోక్ష.
”తాతయ్యతో, మామయ్యతో తగాదా పెట్టుకొని డబ్బులు పట్టుకెళ్లాడు. నువ్వు రాలేదేం మమ్మీ?” అంది. తల్లిని చూడాలన్న తపన పూర్వి గొంతులో స్పష్టంగా విన్పిస్తోంది.
మోక్ష అదేం ప్టించుకోకుండా ”ఫోన్‌ అమ్మమ్మకివ్వు…” అంది.
అక్కడ నుండి కదలకుండానే ”అమ్మామ్మా!!” అంటూ పెద్దగా కేకేసింది పూర్వి.
”వెళ్లవే! అమ్మమ్మ దగ్గరకెళ్లి ఫోన్‌ ఇవ్వు” తొందరపెట్టింది మోక్ష.
పూర్వి పరిగెత్తుకుంటూ వెళ్లి ”అమ్మమ్మా! నీ కూతురు ఫోన్‌” అంటూ మొబైల్‌ని అమ్మమ్మ చెవి దగ్గర పెట్టింది పెద్ద ఆరిందలా.
ఆమె ‘హలో!’ అనగానే ”అమ్మా! ఆయన అక్కడకొచ్చారా?” అడిగింది మోక్ష.
ఆమె ఒక్కక్షణం ఆగి ”వచ్చాడు. నీకు చెప్పి వచ్చి వుండడని మాకు అప్పుడే అన్పించింది. అందుకే అల్లుడుగారు వచ్చినట్టు నీకు చెప్పలేదు.”
”ఏమన్నారు. నాన్నతో అన్నయ్యతో తగాదా పెట్టుకున్నాడా?”
”అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వెలా వున్నావ్‌? వేళకి తింటున్నావా?” అడిగింది ఆమె.
వెంటనే మోక్ష కళ్లలో కన్నీళ్లు ఉప్పెనలా ఉబికాయి.
”నువ్వేదో దాస్తున్నావ్‌! చెప్పమ్మా! అసలేం జరిగింది?” అడిగింది మోక్ష.
”ఏం లేదులే మోక్షా! దాని గురించి ఇప్పుడెందుకు? అయినా అతనికి ఇస్తానని ఒప్పుకున్న డబ్బులు ఎప్పుడైనా ఇచ్చేదేగా! అన్నయ్య వెంటనే వదిన నగలు అమ్మి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు”
”అంత జరిగిందా?” నివ్వెరపోతూ అడిగింది.
”నువ్వలా అంటావనే నీకు చెప్పలేదు”
గాలి తీసిన బెలూన్‌లా అయి ”చెప్పినా నేనేం చెయ్యగలనులే! నేను ఎవరిక్కావాలి?” అంది.
”అలా అనకు మోక్షా! నువ్వు కాక మాకు ఇంకెవరు కావాలి? మేము ఏది చేసినా నీకోసమేగా! నువ్వు బాగుండాలనేగా!”
”బాగుండాలంటే వదిన నగలు అమ్మాలా?”
”సందర్భం అలా వచ్చింది. తప్పలేదు” అందామె.
”నాతో ఒక్క మాటయినా చెప్పాల్సింది”
”చెబితే నువ్వు వదిన నగలు అమ్మనిస్తావా? దానివల్ల నీకూ ఆనంద్‌కు విభేదాలు రావా? అందుకే చెప్పలేదు”
”ఈ విషయంలో మీరు చాలా తొందరపడ్డారు. ఆ డబ్బు ఆయనకు ఇవ్వకుండా పూర్వి కోసం వుంచితే బాగుండేది…”

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *