March 29, 2024

నీటిని పొదుపుగా వాడుకుందాం!

రచన: శారదాప్రసాద్ (టీవీయస్. శాస్త్రి)

నీటిని పొదుపుగా వాడేవారు ధనాన్ని కూడా పొదుపుగా వాడుతారట!నీటిని దుబారా చేసే వారు డబ్బును కూడా అలానే దుబారా చేస్తారట. ఈ భూమి మీద లభిస్తున్న మొత్తం నీటిలో 97 శాతానికి పైగా సముద్రజలం. అది ప్రాణులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేది కాదు. మరో రెండు శాతానికి పైగా మంచు రూపంలో ఉంది. మిగిలిన ఒక్క శాతంకన్నా తక్కువే ప్రాణులకు పనికివచ్చేది. అదే మంచినీరన్న మాట! ఇప్పుడా మంచినీటికి పెద్ద ముప్పు ఏర్పండింది. అధిక జనాభా తదితర వాస్తవాల వల్ల నీటి వినియోగం పెరిగి చాలీచాలని పరిస్థితి ఒకటైతే, దారుణమైన కాలుష్యం మరొకటి!వాతావరణం కాలుష్యం పెరిగి మంచుమీద ఒత్తిడి మొదలైంది. భూగోళం మీది సమతుల్యానికి మంచు కూడా ఒక ఆధారం. అది కాస్తా కరిగిపోతే, జలప్రళయం సంభవించి నేల తుడిచిపెట్టుకు పోతుంది. నీరే మన జీవనానికి ఆధారం. నదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత, సంస్కృతీ అభివృద్ధి చెందటం మనకు తెలిసిన విషయమే! నీరు మనకు ఆహారం. నీరే మనకు ఆధారం. రవాణా వ్యవస్థకు కూడా మనం నీటిని వాడుకుంటున్నాం. నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తున్నాం. రాబోయే కాలంలో వచ్చేవి ‘జలయుద్ధాలే’! ప్రకృతితో ఇకనైనా పరిహాసాలు ఆపేసి, ప్రకృతి వనరులను అతి పవిత్రంగా చూసుకోవటం నేటి మన తక్షణ కర్తవ్యం. అడవులను ఆక్రమించుకుంటున్నాం. స్మశానాలను ఆక్రమించుకుంటున్నాం. చెరువులు ఇతర జలాశయాలను నగరాల్లో ఎప్పుడో ఆక్రమించారు హిరణ్యాక్షుడివర ప్రసాదులు! నిజం చెప్పాలంటే మనమే నీటిని తరిమివేసాం . చాలా నదులు అంతర్ధానం అయిపోయి, అంతర్వాహినులుగా ఉన్నాయి. వాటిలో మన రాష్ట్రంలోని శ్రీ కాళహస్తిలోని సువర్ణముఖి నది ఒకటి.

ఇటువంటి నదులు మనదేశంలో షుమారు 50 కి పైగా ఉన్నాయని అంచనా!భూమిలోకి వెళ్ళిపోయిన ఆరావళీ పర్వత ప్రాంతాలలో శుష్కించిపోయిన అయిదు నదులను బతికించిన ‘జలబ్రహ్మ’ జలభాష, ఘోషను అర్ధం చేసుకోగల మహామనీషి, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, తరుణ్ భారత్ సంఘ్ అధినేత అయిన శ్రీ రాజేంద్రసింగ్ ను గురించి మనలో ఎంతమందికి తెలుసు? క్షామపీడిత గ్రామసీమలకు నీటిని రప్పించి సస్యశ్యామలం చేసిన జలదాత ఆ మహానుభావుడు!ఆయన స్ఫూర్తితో తెలుగులో ‘జలగీతం’ అనే 110 పుటల దీర్ఘ కవితను(తెలుగులో వచ్చిన మొదటి దీర్ఘ కవిత ఇదే!) అద్భుతంగా వ్రాసి నాలాంటి ఎందరినో ఉత్తేజపరచిన డాక్టర్. యన్. గోపి గారికి అభినందనలు తెలియచేసుకుంటున్నాను. మనకు రోజుకి కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కానీ ఇప్పటికీ 88. 4 కోట్ల మంది ( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.

ఉన్న మంచినీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. అరకిలో కాఫీ తయారవడానికి 11, 000 లీటర్ల నీరు అవసరం. కార్పొరేట్ కంపెనీలు ఆరోగ్యానికి హాని కలిగించే శీతల పానీయాల కోసం వృధా చేస్తున్న మంచి నీటికి ఇక లెక్కే లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ శీతల పానీయాలను నిషేధించాలని కూడా చూస్తున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 16 శాతంగా ఉంది. కానీ ప్రపంచ నీటి వనరుల్లో భారత నీటి వనరులు కేవలం నాలుగు శాతంగానే ఉన్నాయి. ప్రస్తుతమున్న వెయ్యి మిలియన్ల జనాభాకు తలసరి నీటి లభ్యత సంవత్సరానికి ఒక్కో వ్యక్తికి 1. 170 క్యూబిక్ మీటర్లుగా ఉంది. తీవ్రంగా ఉన్న నీటికొరత అవసరాలకు వాడుకునే వారి మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో నీటి యుద్ధాలు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన దేశంలో మాత్రం ఇప్పటికే నదీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. జల వివాదాలకు పెరుగుతున్న నీటి వినియోగమే ప్రధాన కారణం. వర్షాలు తగ్గడం, నదీ ప్రవాహంలో తేడా, అనుమతులు లేకుండా డ్యామ్ల నిర్మాణానికి ప్రయత్నించడం మరి కొన్ని కారణాలు. 2050 నాటికి బ్రహ్మపుత్ర, బారక్, తపతి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ దిశలోకి ప్రవహించే నదుల్లో మాత్రమే తగినంత నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు . నీటి విలువను తెలిపే పవర్ పాయంట్ ప్రజంటేషన్ ను మరో మహామనీషి, మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాంగారు తయారు చేసి ఎప్పుడో present చేసారు.

జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది!
నా ఈ చిన్ని వ్యాసం శ్రీ రాజేంద్రసింగ్ గారికే అంకితం!

18 thoughts on “నీటిని పొదుపుగా వాడుకుందాం!

  1. మంచి వ్యాసం . అందరూ అంగీకరించెదే. అయినా కూడా ఏమి మార్పు రాదు . మారిన వారు , తాము తమ ఆలావాట్లను ఎలా మార్చుకొన్నది , నీటివాడకములో —- చెప్తే బాగుంటుంది . మన నిస్సహాయతకు , మన బలహీనతలే కారణం అని తెలిసినప్పుడు జరిగే అంతర్మధనం దయనీయం గా ఉంటుంది . టి‌వి చానెల్ల్స్ , మీడియా ఎప్పుడో పూర్తి వ్యాపారమైపోయింది . అయితే పర్వాలేదు . ఏదన్నా సమస్య వస్తే , ప్రెస్ హక్కులు , జర్నలిస్టుల స్వాతంత్ర్యం , కళాకారులు అంతో ఏమేమో మాట్లాడతారు .ఏమైనా , ఇది మంచి వ్యాసం . నాకు కొంత కొత్త విషయాలు తెలిసాయి .

  2. చాలా చక్కని వ్యాసం..నీటి వినియోగం ఎక్కువ అయిపోయి..నీటి కొరత ఎక్కువయిపోయింది.జల వనరులని నాశనం చేసుకుంటున్న ఈ తరుణం లో ఇలాటి వ్యాసాల అవసరం చాలా ఉంది సర్..regards

  3. విశ్లేషణ చాల బాగుంది. నీటివిషయమేగాదు ఆహార పదార్థాల విషయంలోకూడా పొదుపు పాటించడం చాల అవసరం

  4. మంచి వ్యాసం. రాజేంద్ర సింగ్ గారి గురించి నాకు తెలియదు . .అది ఒక చదువరి గా నా అల్పత్వమ్ . ఇటువంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావటానికి పూనుకోవాలిసీనా మీడియా సాధనాలు , ఎక్కువ భాగం రాజకీయాలు , సినిమాలు , కాకమ్మ కబుర్లతో పబ్బం గదుపుకుంటున్నాయి . సరస్వతి నది , అంతర్వాహిని . ఇలాంటివి మనదేశంలో 50 కి పైగా ఉన్నాయంటే ఆశ్చర్యం . పరిశ్రమలు ప్రకృతి వనరుల మీద , విశ్లేహనాత్మకమైన , పరిశోధన చేస్తే , చాలా పరిశ్రమల గూర్చి మనం ఇంత వెంపర్లాడమ్. అలానే ధనవంతులు కట్టే టాక్స్ కన్నా , వనరుల దుర్వినియోగం వారిలోనే ఎక్కువ . ఏమైనా శాస్త్రి గారు , మనలీని ఆలోచింపచేసే ఇలాంటి వ్యాసం రాసినందుకు అభినం దనీయులు…………..sambasiva

  5. మంచి వ్యాసం. రాజేంద్ర సింగ్ గారి గురించి నాకు తెలియదు . .అది ఒక చదువరి గా నా అల్పత్వమ్ . ఇటువంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావటానికి పూనుకోవాలిసీనా మీడియా సాధనాలు , ఎక్కువ భాగం రాజకీయాలు , సినిమాలు , కాకమ్మ కబుర్లతో పబ్బం గదుపుకుంటున్నాయి . సరస్వతి నది , అంతర్వాహిని . ఇలాంటివి మనదేశంలో 50 కి పైగా ఉన్నాయంటే ఆశ్చర్యం . పరిశ్రమలు ప్రకృతి వనరుల మీద , విశ్లేహనాత్మకమైన , పరిశోధన చేస్తే , చాలా పరిశ్రమల గూర్చి మనం ఇంత వెంపర్లాడమ్. అలానే ధనవంతులు కట్టే టాక్స్ కన్నా , వనరుల దుర్వినియోగం వారిలోనే ఎక్కువ . ఏమైనా శాస్త్రి గారు , మనలీని ఆలోచింపచేసే ఇలాంటి వ్యాసం రాసినందుకు అభినం దనీయులు.

  6. చక్కటి వ్యాసం, పాటించేవారు తక్కువ. కుంటలను, చెరువులను ఆక్రమించే ప్రబుద్దులను ఉరి తీయాలి.
    శాస్త్రి గారికి ధన్యవాదాలు.
    నాగయ్య

  7. ప్రభుత్వాలు నీటి పొదుపు గురించి కోట్లు వెచ్చించి ప్రకటనలు గుప్పిస్తాయి కానీ, క్షేత్ర స్థాయి జలసంరక్షణలో మాత్రం సరైన కార్యాచరణ ఉండదు. అడ్డంగా అడవులను నరికి వేయడం వలన కూడా జల వనరులకు ఆటంకం ఏర్పడుతోంది. నీరే ప్రాణాధారం. నీటిని కలుషితం చేసుకుని ఇప్పుడు మినరల్ వాటర్ బాటిళ్ల వెంట పడ్డాం. పై వ్యాసంలో నీటి ఆవస్యకత గురించి శాస్త్రి గారు చక్కగా వివరించారు. వారన్నట్లు- “జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది!” ఇది అక్షర సత్యం..

  8. మైళ్ళకొలది నడిచివెళ్లి నీళ్లు తెచ్చుకొనే బడుగు ప్రజలు ఎల్లాగ నీటిని పొదుపుగా వాడుకుంటారు . వాళ్లతో సమస్య లేదు . ఎటొచ్చి మధ్యతరగతి , ధనవంతు లే సామా జిక స్పృహ కలిగి పొదుపు పాటించాలి . సామజిక సమస్యలకి , కొరత లకి కారణాలలో
    అదిలేకపోవడమే. ముఖ్యమైనది . నీరే కాదు ఏవ్యాసం విద్యుత్ కి కూడా వర్తిస్తుంది .

  9. మీరు చెప్పింది అక్షరాల సత్యము.శాస్ట్రీగారు.

  10. ​నమస్కారమంది, నీటి పొదుపు, ఆ అపర భగీరథుని గురించి అందరికి తెలియచెప్పారు ఎంతో విలువైనడి ఈ సమాచారం , ధన్యవాదాలు

    బాలు

  11. జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది!

  12. ప్రస్తుత తరుణంలో వచ్చిన చక్కని వ్యాసం!

  13. చక్కగా వుంది శాస్త్రి గారు. నా చిన్నతనంలో వీధిలోని మునిసిపల్ కొళాయిలో 24 గం.మంచినీరు వచ్చేది.ఇప్పుడు నీరుకొంటున్నాము.భవిష్యత్తులో మనం వుండకపోవచ్చు.కానీ ఆ పరిస్థితి ఊహిస్తేనే భయంగా , ఆందోళనగా వుంది

  14. మంచి వ్యాసం. నీటినే కాదు, పర్యావరణం యావత్తుని చాలా భద్రంగా చూసుకుంటూ.. అందులోని ప్రతి అంశాన్ని, మూలకాన్ని పొదుపుగా వాడుకోవాలి. లేకపోతే మనకి నిష్కృతి లేదు.

Leave a Reply to p samba siva rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *