April 19, 2024

బ్రహ్మలిఖితం – 7

రచన: మన్నెం శారద

తాత్కాలికంగా వచ్చిన పని మరచిపోయి లిఖిత దాని దగ్గర కెళ్లి మోకాళ్ల మీద కూర్చుని దాన్ని నిమరసాగింది.
పామరిన్ కుక్కపిల్ల లిఖిత ఏనాటి నుండో తెలిసినట్లుగా లిఖితని ఆనుకొని కూర్చుని ఆమె చేతుల్ని ఆబగా నాకుతూ తన ప్రేమని ప్రకటించుకోసాగింది. బహుశ గత జన్మలో ప్రేమరాహిత్యానికి గురయిన వ్యక్తులు పామరిన్ కుక్కలుగా పుడ్తారేమోననిపించింది లిఖితకి. ఎలాంటి కరకురాతి మనిషయినా వాటిని దగ్గరకు తీయకుండా వుండలేడు.
లిఖిత దాన్ని లాలిస్తుండగా పక్క గోడ మీంచి “డాలీ” అంటూ ఒక స్త్రీ గొంతు వినిపించింది.
లిఖిత ఉలిక్కిపడినట్లుగా లేచి నిలబడింది.
ఆవిడ ఆశ్చర్యపోతున్నట్లుగా చూసి “మీరు?” అంది.
“మీనన్ గారి గురించి” అంది లిఖిత.
“అయాన హాస్పిటల్లో వున్నారు. మీరేమవుతారాయనకి?”
“ఏం కాను. ఆయన ఫ్రెండ్ కూతుర్ని. ఆయనతో పనుండి..”
“సరే! అలా తిరిగి మా ఇంట్లోకి రండి” అందావిడ.
లిఖిత బాగ్ తీసుకుని పామరిన్‌ని మరోసారి బుజ్జగించి గేటు తీసుకుని ఆవిడింట్లోకి నడిచింది.
ఆవిద హాలు తలుపు తెరచి “రండి.. చూస్తే ఇప్పుడే వూరు నుండి వచ్చినట్లున్నారు. మొహం కడుక్కోండి. కాఫీ ఇస్తాను” అంది.
లిఖిత వెళ్ళి మొహం కడుక్కుని రాగానే ఆవిడ టవలందించింది. మొహం తుడుచుకుంటుండగానే ఆవిడ వేడి కాఫీ అందిస్తూ “నా పేరు శ్రీవల్లి. మావారు విజయబాంక్ మానేజరు. మీనన్‌గారు మా నైబర్. చాలా మంచి మనిషి. ఆయన భార్య కుట్టి కూడా మాకు బాగా తెలుసు. చాలా కలుపుగోలు మనిషి. కాని.. పాపం అనారోగ్యంతో పోయేరు. మీనన్‌గారికి ఆవిడంటే చాలా ప్రేమ. ఆవిడ చాలాకాలంగా మంచం మీదనే వుంటున్నా. అదే పదివేలనుకొని ఆవిణ్ణి కంటికి రెప్పలా చూసుకునేవారు. అవిడ పోయేక ఆయన చాలా డిప్రెస్సయ్యేరు. దానికి తోడు ఆయన స్నేహితుడు కూడా వెళ్ళిపోవడంతో..”
“ఎవరాయన?”
“కార్తికేయన్”
“ఆయనెక్కడికెళ్ళేరో తెలుసా?”
“కేరళ అడవులకని విన్నాను. వివరాలు సరిగ్గా తెలియవు. మీనన్‌గారికే తెలుసు.”
“ఆయనకిప్పుడెలా వుంది? అసలేంటి జబ్బు?” అని ఆత్రంగా అడిగింది లిఖిత.
“హార్టెటాక్. ఇంటెన్సివ్ కేర్‌లో వున్నారు”
“ఆయనతో ఒకసారి మాట్లాడవచ్చా?”
“లాభం లేదు. ఆయనకసలు స్పృహ రానేలేదు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? ” అంటూ శ్రీవల్లి భర్త శ్రీనివాస్ వచ్చేడక్కడికి.
“నా పేరు లిఖిత. మీరంటున్న కార్తికేయన్ కూతుర్ని నేనే” అంది లిఖిత.
వాళ్లిద్దరూ మొహమొహాలు చూసుకుని “అయితే మీరర్జంటుగా బయల్దేరండి” అన్నారు వాళ్లు.
లిఖిత వాళ్లవైపు అయోమయంగా చూసి”ఎక్కడికి?” అంది.
“కొచ్చిన్. మీరొస్తే ఆ మాటే చెప్పమన్నారు మీనన్ మొన్న కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు. కొచ్చిన్ దగ్గర చోటా నికరా అనే ఊరుంది. అక్కడ భగవతి ఆలయ ప్రధాన పూజారిని కలిసి మీనన్ పేరు చెబితే ఆయన కొన్ని వివరాలందిస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. డబ్బు కావాలంటే నేనిస్తాను. పదకొండున్నరకి కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ సికిందరాబాదులో బయల్దేరుతుంది క్విక్!” అన్నాడాయన.
“మీనన్‌గారిని ఒక్కసారి చూడొచ్చా?”
“ప్రయోజనం లేదు. ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు. చూసి ఏం చేస్తారు? ఆయన మన లోకంలో ఉంటే కదా!”
“వల్లీ! ఆవిడకి భోజనమేర్పాటు చూడు. నే వెళ్లి ఒక టిక్కెట్ సంపాదించుకొస్తాను” అంటూ బయట కెళ్ళిపోయేడు శ్రీనివాస్ కారులో.
“భయపడకండి. మీ నాన్నగారికేం జరగదు. మీరు వెంటనే బయల్దేరుతున్నారు కదా!” అంది శ్రీవల్లి ఊరడింపుగా.
లిఖిత తేరుకున్నట్లుగా నవ్వి లేచి స్నానానికెళ్ళింది.
ఆసీల మెట్ట జంక్షన్‌లో అలవాటు ప్రకారం చిలక జోస్యం చెబుతున్న రాజు తన దగ్గరున్న కార్డుల్లో మరో వంద కార్డులు హెచ్చుగా కలిపాడు.
బాంక్‌కి వెళ్లడానికి బస్టాపు కొచ్చిన ఈశ్వరి ఎంతసేపు నిలబడ్డా తన బస్సు రాకపోవడంతో తనలోని చిరాకునణచుకుంటూ రాజు దగ్గరున్న చిలక కేసి చూసింది కాలక్షేపంగా.
చిలక కుంటుతూ పెట్టెలోంచి బయటకొచ్చి ముక్కుతో కొన్ని కార్డుల్ని తోసి ఒక కార్డుని బయటికి లాగి రాజు చేతికందించింది.
రాజు కార్డు చదివి “నీ రోజులు బాగున్నాయి. నువ్వెంటనే ఓంకారస్వామిని కలువు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.” అన్నాడు.
“ఓంకార స్వామా?” అన్నాడా జాతకం చూపించుకోడానికొచ్చిన వ్యక్తి.
“ఓంకారస్వామి తెల్దా? బీవుడిపట్నం ఎల్లే దార్లో మర్రిసెట్టు కిందుంటాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మగానుభావుడు. ఎవులికి పుట్టాడో తెల్దు. ఏ వూరో తెల్దు!” అన్నాదు మరో వ్యక్తి.
ఇంతలో ఒకతను వగర్చుకుంటూ వచ్చి “అయ్యా తవరన్నట్టుగా ఓంకారస్వామి దగ్గరకెళ్ళేను. ఆయన చెప్పినట్టే జరిగింది. మీ రుణం తీర్చుకోలేను. ఈ డబ్బుంచండి.” అంటూ కొన్ని వందల రూపాయల నోట్లు రాజు చేతిలో కుక్కి పరిగెత్తినట్లుగా వెళ్లిపోయేడు.
ఈశ్వరి అదంతా గమనిస్తూనే ఉంది.
నిన్న తన కాషియర్ శెలవు పెడితే ఆ సీట్లో కూర్చుంది. కొంత కాష్ మిస్సయింది. బాధ్యత తన మీదే నెట్టేసాడు మానేజరు. మర్యాదగా కట్టేస్తే పోలీసు రిపోర్టివ్వనని బెదిరించేడు. నిజానికి తనకేం తెలీదు. అతన్నడిగితే?
కొంచెం సిగ్గుగా అనిపించినా ఇది తన ఉద్యోగ సమస్య. అడిగితే తప్పేముందని మనసు మొండికేసింది.
తన బస్సొచ్చింది
అయినా ఈశ్వరి ఎక్కలేదు.
జనం రద్దీ తగ్గేక మెల్లిగా ఆమె అడుగులు రాజు దగ్గరకు పడ్డాయి.
రాజు ఆమెని క్రీగంట చూసి “చెప్పవే చిలకమ్మా కష్టాల్లో యిరుక్కున సీతమ్మొచ్చింది. దారి చూపించు” అన్నాడు చిలకని హుషారు చేస్తూ.
చిలక మాత్రం నీరసంగా బయటకొచ్చి ఒక కార్డు తీసి రాజు మొహాన విసిరి వెళ్లిపోయింది.
రాజు కార్డు చదివి “వెళ్లి ఓంకార స్వామిని కలవ్వే తల్లీ! నీ సమస్య పరిష్కారమవుతుంది” అన్నాదు రాగాలు తీస్తూ.
“ఆయనెక్కడుంటాడు?”
“బీవుడి పట్నం దారిలో, సాక్షాత్తు దేవుడాయన”.
ఈశ్వరి పర్సులో డబ్బు చూసుకుని ఆటో ఎక్కింది. యాంత్రికంగా వెళ్తున్నదన్నమాటే కాని మనసంతా గందరగోళంగా వుంది. ఈ సాముల్ని నమ్ముతున్నదేంటి తనింత చదువుకుని. వీళ్లలో చాలా మోసగాళ్లుంటారంటారు. బాంక్‌లో డబ్బు పోతే తనేం చేస్తాడు” వెయ్యి అనుమానాలతో మర్రిచెట్టు దగ్గరికి చేరుకుంది.
అక్కడ ఓ పాతిక ఆటోలున్నాయి. రెండు మూడు పందిళ్లు వెలిసేయి. జనం గుంపులు గుంపులుగా వచ్చి ఓంకారస్వామిని దర్శించి వెళ్తున్నారు.
ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు, మంచినీళ్లు పోసేవారు, సోడా కొట్టులు, స్వామి తాయెత్తులు ఇచ్చేవాళ్లు, స్వామి పటాలు అమ్మేవాళ్లు, అదొక తీర్థంలా అనిపించింది ఈశ్వరికి.
టికెట్టు కొనుక్కుని కొబ్బరికాయ, పూలు తీసుకొని తన వంతు వచ్చేక లోనికెళ్ళింది ఈశ్వరి. “స్వామి ఎక్కువగా మాట్లాడరు. వెంటనే నీ సమస్య చెపుకో. పరిష్కారం చెబుతారు” అంది ఒకావిడ.
ఈశ్వరి ఆకుపచ్చ డ్రస్సులో వున్న ఆయన కాళ్లకి మొక్కింది. ఆయన తలంతా నిమిరేరు.
ఈశ్వరి దూరంగా జరిగి “బాంక్‌లో పని చేస్తున్నాను. డబ్బు పోయింది. నా మీద పెట్టేరు. నాకేం తెలియదు” అంది.
అలా చెబుతున్నప్పుడు కళ్ళు ఆత్మాభిమానంతో వర్షించేయి.
ఓంకారస్వామి చిరునవ్వు నవ్వేడు.
ఈశ్వరి అర్ధం కానట్టు చూసింది.
“గత జన్మ బంధం గట్టిగా పట్టుకొని లాగుతుంది. నీ జాడ కోసం నీ భర్త పూజలు చేస్తున్నాదు. రెండ్రోజుల్లో నీ దగ్గరకో మనిషొస్తాడు. వచ్చి నువ్వడక్కుండానే డబ్బిచ్చి వెళ్తాడు. అతనే నీ భర. కానుకో!” అన్నాదు.
ఈశ్వరి అతనివంక అయోమయంగా చూసి “నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. ఇతను నా భర్తేంటి?” అంది.
ఓంకారస్వామి ఫక్కున నవ్వేడు.
“నే మాట్లాడేది పూర్వజన్మ గురించి. పూర్వజన్మలో నీ భర్త నిన్ను చాలా ప్రేమించేడు గాని పైకి పట్టించుకునేవాడు కాదు. దాంతో నువ్వు నీ ఇంటి పెంపుడు కుక్కని బాగా చేరదీసేవు. అది నిన్ను ప్రేమించింది. వచ్చే జన్మలో నీ భర్త కావాలని ఆశించింది. ఫలితంగా నీ మేనమామ నీ భర్తయ్యేడు. ఇప్పుడు నీ అసలు భర్తకి తన పూర్వజన్మ గురించి తెలిసి నీకోసం తిరుగుతున్నాదు. నిన్నేవిధంగా గుర్తుపట్టాలో తెలియక అవస్థ పడుతున్నాడు. రెండ్రోజుల్లో నువ్వు తప్పు లెక్కపెట్టి ఎక్కువ ఇచ్చిన డబ్బు తీసుకొచ్చినవాడే నీ భర్త!”
ఓంకారస్వామి మాటలకి తల తిరిగిపోయింది ఈశ్వరికి. అతను చెప్పిన ఒక్క మాట కూడా నమ్మబుద్ధి కాలేదు. జన్మలేమిటీ, కుక్కలేవిటీ. అంతా కట్టుకథ. అని విసుక్కుంటూ బయటకొచ్చేసింది.
ఓంకార స్వామి మాత్రం చిద్విలాసంగా నవ్వి కళ్లు మూసుకున్నాడు.

*******
లిఖిత ఎక్కిన కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వదిలి అతివేగంగా ముందుకి పరుగెడుతోంది. ఆమె ఆలోచనలతో పోటీ పడుతూ. తను చాలా దురదృష్టవంతురాలు. తండ్రి వుండి కూడా అతని ప్రేమకి దాదాపు తండ్రి లేనట్లుగానే బ్రతికింది.
అకస్మాత్తుగా తన తండ్రి బ్రతికే వున్నాడని, అదీ అతనొక గొప్ప సైంటిస్టని తెలిసి తన మనసు ఉప్పొంగిపోయింది.
అతను కృతకృత్యుడు కావొచ్చు… కాకపోవచ్చు. కాని మనిషి జీవితంలో ఆఖరి విషాద ఘట్టమైన మృత్యువుని ఒక పెన్సిల్ గీతలా తుడిచేయాలని అతని స్వమకాల్ని, సంసారాన్ని దూరంగా నెట్టి తన జీవితాన్నే పణంగా పెట్టి ఒక ఘోర తపస్సులా నిరంతర కృషి చేసేడు.
కాని ఇపుడు అంత చదువుకున్న మనిషి.. అన్నీ తెలిసిన శాస్త్రవేత్త ఒక అతి సామాన్యుడిలా మాయలు, మంత్రాలతో మరణాన్ని అరికట్టాలనే విశ్వప్రయత్నంతో ఏ చదువూరాని వ్యక్తుల చేతుల్లో ఇరుక్కోబోతున్నాడు.
దీని అజ్ఞానమనాలా, అతి తెలివనాలా?
బహుశ మనిషి తన ప్రయత్నాల్లో అపజయం ఎదురై కృంగిపోయినప్పుడే తన మీద తనకి నమ్మకం పోయినప్పుడే జాతకాల్ని, బాబాల్ని, మాయల్ని, మంత్రాల్ని నమ్ముతాడేమో! శారీరకంగా మనిషి బలహీనంగా వున్నప్పుడే రోగాలు మన శరీరంలోకి తేలిగ్గా ప్రవేశించినట్లుగా మానసికంగా బలహీనులైన మనుషుల్నే ఈ మోసగాళ్ళు వశం చేసుకుంటారు.
“టికెట్ ప్లీజ్!” అనగానే లిఖిత ఈ లోకంలో కొచ్చి బాగ్‌లోంచి టీకెట్ తీసి టి.సి. కి అందించింది.
టి.సి సైన్ చెసి పక్క బెర్తుల వాళ్ల టికెట్స్ చెక్ చేస్తున్నాడు. ఆ బెర్త్ చివరికి వున్న కోయదొరని కూడా టికెట్ అడిగేడు యధాలాపంగా టి.సి.
“మాకు టికటేంటి దొరా.. లోకమంతా ఏకం చేసి తిరిగేటోల్లము” అన్నాడు కోయదొర నవ్వుతూ.
“నువ్వే లోకాలన్నా తిరుగు టికెట్టు కొని. లేకపోతే వచ్చే స్టేషన్‌లో దిగిపో” అంటూ ముందుకు సాగిపోయాదు టి.సి.
“సార్‌కి ముక్కుమీదుంది కోపం. మనసు మాత్రం ఎన్నపూసె. పెట్టల పెళ్ళిగాక దిగులేసుకున్నాడు.” అన్నాడు కోయదొర వెళ్తున్న టి.సి వైపు చూస్తూ.
వెంటనే అతని పక్కన కూర్చున్న వ్యక్తి కోయదొరతో మాటలు కలిపేడు.
“ఏ వూరు మీది?”
“ఖమ్మం దగ్గర”
“మీకివన్నీ ఎలా తెలుస్తాయి?”
“చెప్పకూడదు దొరా. చెబితే తల్లి పల్కదు”
“తల్లెవరు?”
“సమ్మక్క మా కులదేవత. మొన్నమాసకి వెయ్యి కోళ్ళు, వెయ్యి మేకపోతులు బలిచెసి రక్తం లేదూ, రక్తంతో అమ్మకి తానం జేయించేం. తానమంటె ఏంటనుకున్నావు. మీరు గుళ్లలో పాలతో జెయ్యరూ అభిషేకమని గట్లే మేమూ రక్తంతో జేస్తాం. గూడెంలో పిల్లా పాపా భయం లేకుండా జూస్తారు. ఇంక చాల చేస్తంలే. అవన్నీ జెప్పకూడదు. చెబితే పవర్ బోతది”
“అయితే నా చెయ్యి జూడు” అంటూ అతను తన చేతిని అందించేడు.
“చెయ్యి తిరగదిప్పు”
అతను వెనక్కి తిప్పేడు.
“కోయదొరలు రేకలు జూసి జెప్పరు. మణికట్టు ఎనక భాగంలో మాకు మీ జాతకం గీత గీసినట్లుగా కనిపిస్తుంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ ఇసాలాక్షి, కోనలపాడు సమ్మక్క మీన ఆన. నీకిద్దరు పెట్టలు ఒక పుంజు.. అర్ధం కాలే..” అన్నాడు.
“లేదయ్యా నాకు ఒక కూతురు.. ఒక కొడుకే.”
“అది నిజమే. నే జెప్పేది నీ చేతిలో వున్న సంతానం. నువ్వు బలవంతంగా కత్తిరేసి కనకపోతే నేనేం జేస్తాను”
అతను అవునన్నట్లుగా ఒప్పుకొని నవ్వాడు.
“పెట్టకి అక్షింతలేద్దామని అదే మ్యారేజి చెయ్యాలని తన్నుకులాడుతున్నవు. సంబంధాలొస్తున్నాయి గాని. కారణం లేకుండానే పుటుక్కుమని తుస్సుమంటున్నాయి. పెట్ట దిష్టి నీళ్లు తొక్కింది. అందుకే నువ్వు తలపెట్టిన పని జరగడంలేదు. సమ్మక్కని నమ్మితే ఒక పూజ చెసి తాయెత్తిస్తా. ఏంటి నమ్ముతావా?” అన్నాడు కోయదొర.
అతను సందిగ్ధంగా చూసేడు.
మనసులో పూజ చెయించుకోవాలని వున్నా చుట్టూ జనం ఏమనుకుంటారోనని కొద్దిగా సిగ్గు పడుతున్నాడు.
అదే బెర్తు మీద శబరిమలై వెళ్టున్న అయిదారుగురు అయ్యప్ప స్వాములున్నారు.
“చేయించుకోండి. వాళ్లకి చాలా మహిమలుంటాయి. ఇందులో పోయేదేముంది?” అన్నారు వాళ్లు. వాళ్లకి ఆ దూర ప్రయాణంలో కాస్త కాలక్షేపం కావాలి.
కోయదొర సంచిలోంచి ఒక ఫైలు తీసి బెర్త్ మీద పెట్టి తెరిచేడు. అందులో దుర్గాదేవిలాంటి ఆకారంలో ఒక ఫోటో వుంది. దాని మీద పసుపు, కుంకుమలు జల్లి వున్నాయి.
“అమ్మకి దణ్ణం పెట్టుకో . నమ్ముతాను తల్లి అను” అన్నాడు.
అతనలాగే అని దణ్ణం పెట్టుకున్నాడు.
వెంటనే కోయదొర జోలెలోంచి ఒక చిన్న చెక్కపీటలాంటిది తీసి దాని మీద ఆముదం రాశాడు. దాని మీద ఒక రాగి బిళ్ల వుంచి దానిపై కర్పూరపు బిళ్లలు , కేరం బోర్డు కాయిన్స్‌లా పేర్చేడు. వాటిని అగ్గిపుల్లతో వెలిగించేడు. జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది.
“సరిగ్గా జ్యోతివైపే చూడు. చెంపలు వాయించుకో. సమ్మక్కని తల్చుకో” అన్నాడు అతన్ని కంగారు పరుస్తూ.
అందరూ రెప్పవేయకుండా జ్యోతినే చూస్తున్నారు.
లిఖిత కూడా తాత్కాలికంగా తన తండ్రి గురించి మర్చిపోయి జ్యోతి వంకే ఆసక్తిగా చూసింది.
ఆశ్చర్యంగా జ్యోతి నడవడం ప్రారంభించింది.
“ఏం జరుగుతోంది?” అన్నాడు కోయదొర.
“జ్యోతి నడుస్తోంది” అన్నారంతా ముక్తకంఠంతో.
“నిజవేనా?”
“నిజమే,.”
“సమ్మక్కని నమ్ముతారా?”
“నమ్ముతాం”
“నీ పెట్టకి పెళ్ళికొడుకు జ్యోతి నడిచిన వైపునుండి వచ్చె మాఘమాసం లోపు నొస్తాడు. ఈ పూజ పదకొందువేలకి చేస్తాను. నువ్వు చిక్కుల్లో వున్నావు. వెంటనే వెయ్యి నూటపదార్లు పెట్తు. సమ్మక్కకి జాతర చెయిస్తాను” అన్నాదు కోయదొర దదదడా ఫైలు మీద కొడుతూ.
అతని గుండె గుభేలుమంది.'”అంతా?” అన్నాదు బాధగా.
“బేరాలాడకు తల్లిక్కోపమొస్తుంది. రోజులు బాగుంటే వచ్చే యీనాటికి లక్షలు జూస్తావు. దొంతర్లు దొంతర్లేరుకుంటావు డబ్బు” అన్నాడు కోయదొర.
అతను జేబులు తడుముకొని “అయిదొందలుంచు. ప్రయాణంలో వున్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. మా యింటికి రా. నువ్వడిగినంతా యిస్తాను” అన్నాడు బ్రతిమాలె ధోరణిలో.
కోయదొర అయిష్టంగానే అయిదొందలు తీసుకొని “సరే! శబరిమలై అయ్యప్ప దర్శనం తర్వాత తిరిగొస్తా. పిల్ల పెళ్లి కుదిరితే అయిదు వేలివ్వాలి. ఇస్తావుగా?” అన్నాడు.
అతను సరేనని తలూపేడు.
జ్యోతి నడవడంతో అందరికీ అతనిమీద చెప్పలేని గురి కుదిరింది.
అతని దగ్గర నిజంగానే మహత్తుందని నమ్మి తమ తమ బాధలు చెప్పుకోసాగేరు. అందులో టి.సి కూడా చేరేడు.
ప్రతి మనిషికి రకరకాల అనుమానాలు.. ఆశలు.
వాళ్ల వాళ్ల సైకాలజీని స్టడీ చేస్తూ వాళ్లాశించేది ఫలానా పూజ చేస్తే జరుగుతుందని అతను చెబుతున్నాడు. వాళ్లందరూ గొర్రెల్లా తలలాడిస్తున్నారు. చిత్రమేమిటంటే వారిలో డాక్టర్లు, ప్లీడర్లు, జర్నలిస్టులు, వ్యాపారస్థులూ అందరూ వున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక జర్నలిస్టు తన దగ్గరున్న కెమెరాతో కోయదొర ఫోటో తీసి అతన్ని ఇంటర్వ్యూ చేసేడు. తను పని చేస్తున్న ఒక దినపత్రికలో ప్రచురించేందుకు.
టి.సి అతనికి ప్రత్యేకమైన బెర్తు కేటాయించేడు టిక్కెట్టు లేకుండానే.

(సశేషం)

1 thought on “బ్రహ్మలిఖితం – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *