March 28, 2024

‘వేయి పడగలు’ అక్షర యాత్రకు దారి

రచన: విజయలక్ష్మీ పండిట్

 

“విశ్వనాథ ‘వేయిపడగలు’ లోని కొన్ని ముఖ్యాంశాలు, విశ్వనాథ గురించి కొందరు ప్రముఖుల భావాలు” అనే డా.వెల్చాల కొండలరావుగారి సంకలనం ఈ తరం కవులు, రచయితలు చదవవలసిన సంకలనం.
వివిథ వర్ణాల సుగంథభరిత పూలతో, వైవిధ్యభరిత వృక్షాలతో మనోహరంగా ఉండే దట్టమైన ఒక అందమైన అడవిలో మనిషి ప్రయాణించడానికి ఆ అడవి అందాలను పూర్తిగా అనుభవించడానికి, దారి తెన్ను తెలపడానికి ఒక నావిగేషన్ మ్యాప్ (navigation map) కావాలి.
అలాగే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ బృహత్ నవలలోకి సామాన్య పాఠకులను చేయిపట్టి నడిపిస్తూ అందమైన వర్ణనలు, కథలు, జానపద గాథలు, అలౌకిక ఉపమానాలతో వైవిధ్యభరిత పాత్రలతో కూర్చిన బృహత్ ఇతిహాస నవలలో అక్షరయాత్ర చేయడానికి ఒక గైడ్, మార్గదర్శిగా ఉపయోగపడుతుందీ సంకలనం.
ఈ సంకలనంలో ‘వేయి పడగలు’లోని కొన్ని ముఖ్యాంశాలు అనే ఔపోద్ఘాత శీర్షికలో కొండలరావుగారు ‘వేయిపడగలు’నవల గురించి అన్న ముఖ్యమైన మాటలు వారి మాటల్లో…
“వేయిపడగలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చదవవలసిన గొప్ప నవల, గొప్పతనం గురించి మంచితనం గురించి సవివరంగా, సందర్భోచితంగా, తరువాత వృత్తాంతాల ద్వారా, కథల ద్వారా, పాత్రలద్వారా, ఉదాహరణల ద్వారా రచించిన నవల”.
“మనిషి మానవుడు ఎలా కావాలో, ఎలా కావడంలేదో చెపుతారు వేయిపడగలలో, నిజమయిన గొప్పవాడే నిజమయిన మంచివాడని అంటారు విశ్వనాథ”.
తరువాత “వేయిపడగలు ఎందుకు చదవాలి?” అనే శీర్షికతో ‘వేయిపడగలు’ నవల గురించి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యగారి తొమ్మిది పేజీల అభిప్రాయం చదవడంతో ‘వేయి పడగలు’ నవల గురించి ఒక సమగ్ర అవగాహన, ఆ నవల హృదయం, ఏ ఎఱుకతో ఆ నవలను పరిశీలించాలో వివరిస్తారు.
కోవెల సుప్రసన్నాచార్య ఒక కవి/రచయిత మనస్సులో ఒక వస్తువు గురించి జరిగే పరివర్తనా క్రమాన్ని గురించి వ్రాస్తూ.. విశ్వనాథవారు ఈ నవలలో ఏ ఏ దశలుగా పరివర్తనం చెందుతూ నవలను వ్రాశారో చెపుతారు.
సుప్రసన్నాచార్య మాటల్లో..
“కవి రచనావేళ ఒకానొక వ్యక్తావ్యక్త స్థితిలో సంధి దశలో విశ్వ చైతన్య గర్భం నుంచి ఎన్నుకున్న అంశాలు, ప్రతీకలై బింబాలై ఉపమానాది అలంకారాలై శిల్ప మార్గాన పయనించి లౌకిక స్థితిని అలౌకిక స్థితిగా పరిణమింపజేస్తాయి. అందువల్లే రచయిత (విశ్వనాథ) ఆ తాదాత్మ్యస్థితిలో నుంచే “వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నదీ కలలలోన రాజునూ” అని ప్రారంభించారు నవలని.
కథాకథన దశలో ఆ మొత్తం నవలలోనూ రచయిత (విశ్వనాథ) ఒక పారవశ్య స్థితికి, స్వప్నస్థితికి తిరిగి ప్రయాణం చేస్తుంటారు. ఈ భూమిక మీద ఈ నవలలో రచయిత సూత్రధారుడవుతాడు, కథానాయకుడవుతాడు. కథ చెప్పుతూ, చెప్పుతూ తన ఆత్మకథలోకి వెళ్లిపోతాడు. ఆత్మకథలోంచి సాగి, జగత్మథనం, ఇహపరలోకాల అనుబంధాన్ని వాటి అవినాభావ స్థితినీ వ్యాఖ్యానిస్తాడు” అని అంటారు. ఆలోచిస్తే ఇది ప్రతి కవి/రచయితకు అన్వయిస్తుంది. కవులు/ రచయితలు తమ రచనలలో వస్తువును విశదపరిచే క్రమంలో తమను తాము వివిథ అవస్థలలో వ్యక్తపరచుకోవడం అనేది సర్వసాధారణం. కవితలు, కథలు, నవలలు, ఆయా కవుల, రచయితల మనోప్రపంచ ఆలోచనల, అనుభవాల అనుభూతుల మథనంలో అక్షరరూపం దాల్చినవే క దా!
“కోవెల సుప్రసన్నాచార్య” వేయిపడగలు నవల గురించి వివరిస్తూ..
“వేయిపడగలు”ఇతిహాసం తాళం తెరిచేందుకు కావలసింది జానపద గాథావిజ్ఞానం అంటారు. జానపద గాధాప్రవృత్తిని ప్రవేశపెట్టడంతో ఈ ఇతిహాసం భూమ్యాకాశాల మధ్య సేతువుగా నిలువబడ్డది” అని వ్యాఖ్యానించారు.
వారు “వేయిపడగల”లోని వివిధ పాత్రల ప్రాముఖ్యతను, కథాసారాంశాన్ని వివిధ విష్యాలపై సంక్షిప్తంగా చెపుతూ “వేయిపడగలు”లో గ్రామీణ ఆర్ధికవ్యవస్థ శైథిల్యం చెప్పడం ఎంత ముఖ్యమైన అంశమో , కుటుంబ వ్యవస్థకు మూలమైన దాంపత్య జీవనం, వివాహ వ్యవస్థ శిథిలమైన సంగతి చెప్పటమూ ముఖ్యాంశమే అంటారు. సమాజంలోని అన్ని వ్యవస్థలకు అన్ని థర్మాలకు, అన్ని పురోగామి శక్తులకు, అన్ని జీవన మాధుత్యాలకు, అన్ని పరలోక సంభావనలకు, అన్ని విశ్వకుటుంబ తత్వములకు, ఈ వివ్వాహవ్యవస్థే మూలమని, ఈ దాంపత్యమే మూలమని రచయిత గాఢంగా విశ్వసించాడు. అందుకే సమాజ వ్యవస్థ ఆధారంగా చేసుకున్న ఒక వివాహాన్నీ, ప్రణయం మూలాధారంగా ఉన్న మరొక వివాహాన్ని శరీరాలకు అతీతంగా జీవాత్మ, పరమాత్మల సంయోగ హేతువుగా సంసిద్ధిగా మరొక వివాహాన్ని ఆయన మూడు కేంద్రాలుగా నిర్మించి ఈ త్రిభుజం చుట్టూ పరిక్రమించవలసిన మానవ జీవన ధర్మచక్రాన్ని “వేయిపడగల”పేర ఆయన నిర్మించాడు” అని అంటారు.

సుప్రసన్నాచార్య మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసిమ్హారావుగారు (1982)లో విశ్వనాథగారిని గురించి ప్రసంగంలోని వాక్యాలను మననం చేసుకొన్నారు. “విశ్వనాథ తన రచన ద్వారా పాశ్చాత్య, సాంస్కృతిక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసి ఉన్నది. మన చరిత్రలో వ్యక్తిత్వం లేనివారుగా చిత్రించి, ఆర్య ద్రావిడులుగా విభజించి మన మతాలను, అపరిణత వ్యవహారాలుగా ప్రదర్శించి, మన వేదాలను ప్రకృతికి భయపడ్డ మానవుని ఆర్తగీతాలుగా చిత్రించి, మనల్ని మన మూలాల నుంచి దూరంగా విసిరివేసే ప్రయత్నం చెసిన మహాప్రయత్నం నుంచి మనం విముక్తులం కాలేదు. విశ్వనాథ తనకు పూర్వం హెన్రీ డిరేజియో, రాజా రామ్మోహనరాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీ అరబిందో మొదలైనవారు సాగించిన ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పార్ష్వాలన్నింటినీ సమన్వించుకుని భారతీయ సమాజాన్ని పునరున్మిలితం చేయటానికి వాజ్మయం ద్వారా ఉద్యమం సాగించాడు. ఈ గొప్ప ఉద్యమం సందర్భంలోని కొన్ని కొన్ని అవగాహనలు ఈనాడు మనకు సమంజసంగా కానరాకపోవచ్చు. కానీ సమగ్ర దృష్టితో చూస్తే ఆయన ప్రాణాలు దేశంకోసం, సంస్కృతి కోసం, భాషలకోసం, నిరంతర జాగరూకత కోసం ప్రయత్నించబడ్డవి” అని అన్నారని వ్రాశారు.
భారతజాతి శక్తి చావరాదన్నది విశ్వనాథగారి ప్రతిపాదన. అదే స్ఫూర్తితో “ఒక జాతి సర్వత ఉన్మీలితమైనా గావచ్చు కాని శక్తి చావరాదు” (25 అధ్యాయం) వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలము నుంచి పెళ్లగించడం జరిగిన సహజంగా అంతరికమైన ప్రాణశక్తి నిలిచివుంటే దాన్ని పునరుజ్జీవింపజేసుకొనవచ్చును”.
ఈ శక్తిధీరుడు మొదటి ఆధ్యాయం, చివర దర్సనమిచ్చిన ‘మహాపురుషుడు’ ధర్మారావు. అతడు చివరి అధ్యాయంలో అరుంధతిని చూచి “నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి” అంటాడు. ఈ విధంగా వేయిపడగలు మొత్తం గ్రంధం ఈ శక్తి ఉద్యమాన్ని నశించకుండా నిలబెట్టడాన్ని సూచిస్తూ ఉన్నది.
పర్యావరణ పరిరక్షణ గురించి ఎనభై ఏళ్ళ క్రితమే విశ్వనాథ ఈ నవలలో చర్చించారన్నారు సుప్రసన్నాచార్య. వారి మాటల్లో.
“ఈనాడు పర్యావరణ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఏయే అంశాలను గూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు ఎనభై ఏళ్ళ క్రితమే చర్చించింది. ప్రకృతిలో ఉండే సంతులనాన్ని భంగం చేయడం వల్ల మానవ జీవితం ఎంత దుఃఖభాజన మవుతున్నదో ఇంతటి అభినివేశంతో చర్చించిన నవల మన దేశంలోనే అరుదైనది. చెట్లను నిర్మూలించడం, మెట్ట పొలాలను లేకుండా చేయడం, వాణిజ్య సస్యాలకు ప్రాధాన్యం వచ్చి తిండి గింజలు తగ్గిపోవడం, ఇవన్నీ పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన ఇబ్బంది. ఇంతేకాక సృష్టి అంతా మానవుడి సుఖభోగాల కోసమే ఏర్పడిందని భావించినట్లు ఈ నాగరికత ప్రవర్తిస్తుంది. మిగిలిన జీవకోటికి ఆశ్రయభూతమైన ప్రకృతి అంతా వికవికలు చేయబడింది. ఇరువదవ అధ్యాయంలో ఈ కల్లోలం ఆశ్చర్యకరమైన విధంగా చిత్రింపబడింది. వృషన్నిది అన్న మేఘ వృత్తాంతం. ఈ మేఘం ఆదివటం మీద నిలుస్తుంది. ఆ చెట్టు, ఆ మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటినుండి కొనసాగుతున్నది. అంటే అనంతకాలం నుండి కొనసాగుతున్నది. అది ఈ క్రొత్త నాగరికత వల్ల విశదమయింది. ఆదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్చేదమైపోవడం వల్ల ఆ మేఘానికి ఆ గ్రామాన్ని గుర్తుపట్టడం కష్టమయింది. వృషన్నిధి అక్కడ కురియలేదు. అయితే వృషన్నిధికి కూడా ఒక తుపాకీ గుండు తగిలింది. ఈ గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూ వున్న నాగరికత, ఈ గుండు వల్ల నాగరికతా మోహంలో ఆత్మ విస్మృతి పొందిన ప్రజల నూతన భావఝరుల వల్ల ఈ మేఘము ఏదో నీరక్కరలేది ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయింది. మేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి ఈ వృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ” అంటారు సుప్రసన్నాచార్య.
“ఇన్ని కథన పార్ష్వాలను ఇముడ్చుకున్న ఈ ఇతిహాసం, ఈ మహాకావ్యం, ఈ నవల బహిరూపాన్ని బట్టి అదేమిటొ గుర్తించటం సులభ సాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీనికంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు” అంటూ. “వేయిపడగలు” రచించిన విశ్వనాథ సత్యనారాయన తెలుగు వాజ్మయ పరిమితులను, భారతీయ వాజ్మయ పరిమితులను దాటి ఈ ఆంగ్ల పరివర్తనతో విశ్వసాహిత్య పరిధులలోనికి ప్రవేశిస్తున్నాడు అని ఆయనకు స్వాగతం పలుకుతున్నాడు సుప్రసన్నాచార్య.
ఈ సంకలనంలో వున్న /చర్చించిన వివిథ శీర్షికలు..
1. విద్య గురించి విశ్వనాథ,
2. భాష, సాహిత్యం – కావ్యం, వాజ్మయం, రసం గురించి విశ్వనాథ,
3. మతం – సంప్రదాయం, ప్రేమ వివాహ వ్యవస్థ తదితరాల గురించి విశ్వనాథ.
4. విశ్వనాథగారి కొన్ని వర్ణనలు,
5. కొన్ని కథలు, కొన్ని సామెతలు,
6. “Some Valuable Views on Vishwanatha” అనే శీర్షికతో ఆంగ్లములో ప్రముఖ కవులు, రచయితలు, విద్యావేత్తలు, మేధావుల పరిశీలనలు వున్నాయి.

ఈ సంకలనం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి, వారి సాహిత్య రచనా వ్యాసంగాల గురించి అన్ని కోణాలలొ దర్శించడానికి, ఆ ఎఱుకతో “వేయి పడగలు” నవలలో ప్రవేశించి చదివి అర్ధం చేసుకొని ఆనందించడానికి దోహదం చేసే ఒక మంచి సంకలనం.

3 thoughts on “‘వేయి పడగలు’ అక్షర యాత్రకు దారి

  1. ఈ సమీక్ష వేయిపడగలకు ప్రతిబింబంగా నిలవడమే కాకుండా అనేక విషయాలను సూక్ష్మంగా విశదీకరించినది అనడంలో ఏమాత్రం సంశయం లేదు. పాఠకులను వేయిపడగలు చదివి అందులోని విషయాల పట్ల కుతూహలం కలిగిస్తుంది

Leave a Reply to P.vijayalakshmiPandit Cancel reply

Your email address will not be published. Required fields are marked *