April 16, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 17

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య


మానవ జన్మ ఎక్కువ కాలం నిలిచి వుండదు. లభించిన కాలాన్ని అంటే జీవించియున్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. “దుర్లభో మానుషోదేహః” శరీరం లభించడమే చాలా కష్టం, “దేహినాం క్షణ భంగురః” లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. “మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్” అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా దానికోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారే! పోయేదే అని ఖచ్చితంగా మనకు తెలిసినా కేవలం శరీరంకోసం బ్రతుకుతున్నాం అంటే ఇది ఎంత ప్రమాదమైనదో గుర్తించాలి. తెలియని శత్రువువంటిది అని చెబుతాడు నమ్మాళ్వార్. శ్రీవైష్ణవ మతమునకు చెందిన పండ్రెండుమంది ఆళ్వార్ల యొక్క “నాలాయిర దివ్య ప్రబంధము”లో నున్న భావనలకు అన్నమయ్య అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. గురువుల యొద్ద నేర్చిన వేదాంతము, ఆళ్వారుల చరిత్రలు, భాగవత, విష్ణుపురాణములలో, నారద, శాండిల్యాది భక్తి సూత్రములలోనూ వివరింపబడిన ఆధ్యాత్మికత అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనా రచనకు ప్రేరణ అని చెప్పవచ్చు.

మనం ఎన్నో జన్మలలో ఒక సారి మాత్రమే మనిషిగా జన్మిస్తామని తెలిస్నప్పటికీ దైవాన్ని గురించి ఆలోచించి తగినట్లు బతుక గలుగుతున్నామా? “తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం” మానవ జన్మలభించడమే గొప్ప అంటే, అట్లాంటి మానవ జన్మలో దైవాన్ని గుర్తించి బ్రతకడం, ఆ దేవదేవునికి దగ్గరకావడం ఎంత గొప్ప. మానవులు ఎన్ని జన్మలెత్తినా, సంసారం అనే సముద్రంలో తీరం కనిపించక, దాని పరిధి ఇదీ అని తెలియక జీవుడు నిరంతరం తపించవలసిందే. అందుకే సంసార జలధిని దాటడానికి ఒక నౌక కావాలి. ఆ నౌక మన చేయి పట్టి ముక్తివైపు నడిపించగలదు. ఇంతకీ ఆ నౌక ఎక్కడ దొరుకుతుంది? అన్నమయ్య ” హరిభక్తి ఓడ” గురించి చెప్తున్నాడు వినండి.

కీర్తన:
పల్లవి: హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
తరఁగు మొరఁగులను దాఁటలే రెవ్వరును ॥పల్లవి॥
చ.1 నిండుఁ జింతాజలధికి నీళ్లు దనచిత్తమే
దండి పుణ్యపాపాలే దరులు
కొండలవంటి కరళ్లు కోరికె లెందు చూచినా
తండుముండుపడేవారే దాఁటలే రెవ్వరును ॥హరి॥
చ.2 ఆపదలు సంపదలు అందులోని మకరాలు
కాఁపురపు లంపటాలే కైయొత్తులు
చాపలపు గుణములే సరిఁజొచ్చే యేరులు
దాపుదండ చేకొని దాఁటలే రెవ్వరును ॥హరి॥
చ. 3 నెలవై వుబ్బుసగ్గులే నిచ్చలుఁబోటునుఁ బాటు
బలువైన యాశే బడబాగ్ని
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ
తలఁచి యితరులెల్ల దాఁటలే రెవ్వరును ॥హరి॥
(రాగం: గుండక్రియ; ఆ.సం. సం.2; 110 వ రేకు; కీ.సం.56)
విశ్లేషణ:
పల్లవి: హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
తరఁగు మొరఁగులను దాఁటలే రెవ్వరును
ఓ మానవులారా! ఈ సంసారం ఒక పెద్ద జలధి. దీన్ని దాటడం అంత సులభంకాదు. హరిభక్తి అనే ఓడ మాత్రమే ఈ సాగరాన్ని దాటించగల శక్తిని కలిగియున్నది. అయితే అందరూ ఆ ఓడను పట్టుకుని యెక్క గలరు కానీ తద్వారా జరామరణాలను దాటగలవారెవ్వరునూ లేరు. అంటే భక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు. పరిపూర్ణ భక్తి అనేది అవసరం. ఆ భక్తి భగవంతునితో నిరంతరం పెనవేసుకుని పోయేది అవిభక్తమైనదీ అయిఉండాలి. కష్టం వచ్చినప్పుడు భగవంతుని ప్రార్ధించడం లేనప్పుడు మిన్నకుండుట గాక ఆ పరమాత్మతో విదదీయలేని అనుబంధాన్ని నవవిధ భక్తిమార్గాల ద్వారా ఏర్పరుచుకోకపోతే నావలోనుండి పడిపోయి మళ్ళీ మళ్ళీ ఈ జననమరణ చక్రంలో పడి పరిభ్రమించే స్థితి వస్తుంది అని చెప్తున్నాడు.
చ.1. నిండుఁ జింతాజలధికి నీళ్లు దనచిత్తమే
దండి పుణ్యపాపాలే దరులు
కొండలవంటి కరళ్లు కోరికె లెందు చూచినా
తండుముండుపడేవారే దాఁటలే రెవ్వరును
ఆ పరంధాముడు మనలను పుట్టుకతోనే సంసారమనే ఒక పెద్ద మహాసముద్రంలో పడవేశాడు. ఈ జలధిలో ఉన్న నీరు మనుషుల చిత్తాలే! దీనికి ఒక ఒడ్డున పుణ్యం ఉంటే మరో ఒడ్డున పాపం ఉంటుంది. మానవుల కోర్కెలు మరి కొండలవంటి అలలు గా ఉంటాయి. ఇందులో పడి అందరూ తన్మయావస్థ చెందే వారే తప్ప దాటగలవారెవరూ లేరు. అంటే ఈ జలధిని దాటాలంటే మానవునికి భగవంతునిపై అచంచల భక్తి విశ్వాసాలు కావాలి అని అర్ధం.
చ.2. ఆపదలు సంపదలు అందులోని మకరాలు
కాఁపురపు లంపటాలే కైయొత్తులు
చాపలపు గుణములే సరిఁజొచ్చే యేరులు
దాపుదండ చేకొని దాఁటలే రెవ్వరును
ఈ భయంకర మహాజలధిలో మొసళ్ళు ఉన్నాయి. అవి క్షణక్షణం మానవులకు మరణహేతువైన ఆపదలను కొని తెస్తూ ఉంటాయి. అవన్నీ ప్రాణాలను హరించేవి అయినా కేవలo తాత్కాలికమైన ఆపదలని భ్రమసి జీవనయానం సాగిస్తున్నాడు మానవుడు. స్త్రీ చేతిలో కలిగే కాపురపు లంపటాలే శాశ్వతమని భావిస్తున్నాడు. అవి చిత్త చాంచల్యాన్ని కలిగించి మంచి చెడులకు బేధం తెలీకుండా చేస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉన్నవారెవరూ మంచి చెడులు తెలుసుకుని సంసార సాగరాన్ని సులభంగా దాటగలేరని చెప్తున్నాడు.
చ.3. నెలవై వుబ్బుసగ్గులే నిచ్చలుఁబోటునుఁ బాటు
బలువైన యాశే బడబాగ్ని
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ
తలఁచి యితరులెల్ల దాఁటలే రెవ్వరును
ఈ సంసార సాగరంలో ఉన్న హెచ్చు తగ్గులు నిరంతరం మనకు జలనిధిలో ఆటుపోట్లవలె తప్పవు కదా! మనకు ఒక్కో సమయంలో కోరరాని కోర్కెలు కలిగించేవి బడబాగ్నులు. ఇంత భయంకరమైన సంసార జధి మాత్రం శ్రీవేంకటేశ్వరుని నమ్మి కొలిచే వారికి మాత్రమే దాటగలరు వారికి మాత్రమే పాదములు కూడా మునగని చిన్న గుంట రీతిగా తోస్తుంది, అన్యులు దాటగలేనిది. అంటే భగవంతుని త్రికరణశుద్ధిగా నమ్మినవారికి మహోగ్రజలనిధిని సైతం అంత చిన్న గుంటతో సమానంగా భావించగలుగుతారని అర్ధంతో చెప్పాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు: తరగు మొరగు = హెచ్చు తగ్గులు అని అర్ధం, కానీ జరామరణాలు అనే అర్ధంతో వాడినట్లు తోస్తున్నది; కరళ్ళు = అలలు; తండుముండు = తొట్రుపాటు, తడబడు, దుందుడుకుగా ముందు వెనుక అలోచించక చేసే పనులు; మకరము = మొసలి; లంపటము = బంధనము, శ్రమ; కై = చెయ్యి (తమిళం); చాపలపు = అస్థిరపు; దాపుదండ = తోడునీడ; ఉబ్బుసగ్గులు = హెచ్చుతగ్గులు; బడబాగ్ని = నీటిలో పుట్టు అగ్ని; కాల్నడ = కాలినడక.
విశేషము: ఇందులో అన్నమయ్య “కాల్నడ” అని ఒక గొప్ప ప్రయోగం చేశాడు. భాస్కర శతకంలో ఒక పద్యంలో “రాజకుమారుడైన రఘురాముడు కాల్నడ గాయ లాకులున్ భోజనమై తగన్వినికి బోయి చరింపడె మున్ను భాస్కరా!” అన్నాడు. అంటే శ్రీరాముడు వనవాసం చేస్తూ కాయలు, ఆకులను ఆహారంగా చేసుకుని పాదచారియై తిరుగలేదా!. కాల్నడ అంటే కాలినడకన తిరిగే పాదచారి అని అర్ధం. అలాగే శ్రీవేంకటేశ్వరుని నమ్మిన వానికి ఈ భయంకరమైన జలనిధి కాలినడకన దాటగలిగేది అని చెప్పడం అక్కడ కవి సమయం అని నా భావన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *