March 29, 2024

బ్రహ్మలిఖితం 9

రచన: మన్నెం శారద

“లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత.
చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది.
శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది.
ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని నిముషంలో ఈ చదువుకున్న గొర్రెల మందకి అమ్మి డబ్బు చేసుకోవడం చాలా చిత్రంగా అనిపించింది.
మనిషి తన చదువుకున్న చదువుని పరీక్షా పత్రాల వరకే పరిమితం చేస్తున్నాడా? అందులోంచి మధించిన విజ్ఞానాన్ని జీవితానికన్వయించుకోలేనంత దీన హీనస్థితిలో వున్నాడా?
దేశానికి ప్రజలకి చీకటిలో జరిగే దారుణాల్ని ఉన్నదున్నట్లుగా తెలియజేసే బాధ్యత వున్న జర్నలిస్టు, అడవిలో అజ్ఞానంలో బ్రతికే ఒక కోయవాణ్ణి మహత్తర శక్తులున్న మనిషిగా చిత్రించి ప్రచారం చెయ్యడం ఎంతవరకు సమంజసం.
తన చేతిలో ఒక పేపరుందని కలముందని తన బుర్రలో పేరుకున్న అజ్ఞానన్ని వేలాదిమందికి పంచడం ఎంతవరకు క్షమార్హం.
అయితే జ్యోతి ఎలా నడిచినట్లు!
ఆలోచిస్తూనే పడుకుంది లిఖిత.
అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువొచ్చి బెర్త్ మీద నుండి వంగి చూసింది. తెలతెలవారుతోంది. చలిగాలి జివ్వున వీస్తోంది.
అందరూ అప్పుడే లేచి కూర్చుని తర్జన భర్జన పడుతున్నాడు.
“ఏం చేస్తాం! చచ్చినట్లిక్కడ కూర్చోవాల్సిందే. సాయంత్రం కాని తిరిగి బయల్దేరదంట!” అంటున్నారెవరో.
“ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది లిఖిత.
“తమిళనాడు బందట. రైలిక్కడాపేసేరు. తిరిగి సాయంత్రం వరకు ఇక్కడే మన జాగారం.” అన్నాడా జర్నలిస్టు.
లిఖిత నవనాడులూ కృంగిపోయినట్లయింది.
చాలామంది రైలు దిగి రిటైరింగ్ రూమ్స్‌కి వెళ్తున్నారు.
“ఏ వూరిది?”
జాలారిపేట అని చెప్పేడు జర్నలిస్టు.
లిఖిత ఉసూరుమంటూ బెర్త్ దిగింది.
తన తండ్రిని ఎంత తొందరగా కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నదో అంతగానూ ఆలస్యమవుతోంది. ఇదంతా వెంకట్ చలవ. ఏడుస్తూ ట్రెయిన్ దగ్గర కొచ్చేడు. తన డబ్బు తీసుకుంటూ మరీ శాపాలు పెడ్తాడు. అని విసుక్కుంటూ బాగ్ తగిలించుకొని రైలు దిగింది లిఖిత.
ఏం చేయాలో తోచక నిస్సత్తువుగా ప్లాట్‌ఫాం మీదున్న బెంచి మీద కూర్చుంది.
ఇంతలో ఒక కానిస్టేబుల్ ఆమె దగ్గర కొచ్చి “మే అయ్ నో యువర్ నేం ప్లీజ్?” అనడిగేడు.
“లిఖిత”
“ఎక్కడ బయల్దేరేరు. ఎక్కడికెల్తున్నారు?”
“ఫ్రం సికిందరాబాద్ టు కొచ్చిన్”
“పర్పస్ అఫ్ ద జర్నీ?”
“టు విజిట్ కేరళ”
“అయిసీ! మీ ఫాదర్ పేరు?”
లిఖితకీసారి నిజంగానే కోపమొచ్చింది.
“అవన్నీ చాలా అవసరమా?” అనడిగింది విసుగ్గా.
“అవసరమే మాడం. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే మొదట మీరు దుయ్యబెట్టేది పోలీసు డిపార్టుమెంటునేగా!” అంటూ నవ్వాడతను.
“అయితే బాగా రాసుకోండి. మా ఫాదర్ పేరు కార్తికేయన్. సైంటిస్టు. నా తల్లి పేరు కేయూరవల్లి. నా తాతగారి పేరు లేట్ భాస్కరన్. ఐ.జి ఆఫ్ ది పోలీస్.”
ఆ మాట విని అదిరిపడ్డట్టుగా చూసేడు కానిస్టేబుల్. వెంటనే గబగబా రైల్వే పోలీస్ స్టేషన్‌లో కెళ్ళేడు.
కాస్సేపటీలో ఒక అరడజనుమంది యూనీఫారంలో వున్న ఇన్స్పెక్టరుతో పాటు ఎస్పీ, రైల్వేస్ ఆమె దగ్గరగా వచ్చి సెల్యూట్ చేసేరు.
ఆ హఠాత్ చర్యకి లిఖిత తెల్లబోయి లేచి నిలబడింది. ప్రయాణికులంతా వింతగా చూస్తున్నారు.
“వీళ్లందరికీ మూకుమ్మడిగా పిచ్చిగానెక్కలేదు కదా” అనుకుంది మనసులో.
“నా పేరు హరిహరన్. మీ తాతగారే నన్నీ డిపార్టుమెంటులో రిక్రూట్ చేసింది. ఆయన చలవ వల్లనే ప్రమోషన్ సంపాదించేను. ఆయన్ పోయేక మీ వివరాలు తెలియలేదు. మీ అమ్మగారు బాగున్నారామ్మా” అనడిగేడూ వినయంగా.
లిఖిత తలూపింది.
“పదండి. మిమ్మల్నిక్కడ ఆర్ అండ్ బి గెస్త్ హౌస్‌లో వుంచుతాను. రెస్టు తీసుకుందురుగాని” అన్నారాయన.
“ఎందుకండి మీకు శ్రమ” అంది లిఖిత.
“నోనో! నాటెటాల్. ఇటీజే గ్రేట్ ఆపర్చునిటీ టు గెటే చాన్స్ టు సర్వ్ యూ. కమాన్ బేబీ!” అన్నారాయన లిఖిత భుజం చరుస్తూ.
ఇదంతా చూస్తున్న జర్నలిస్టు గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి.”నేనూ మీతో వస్తాను మాడం. నేను మీ ఫ్రెండ్‌నని చెప్పండి” అనడిగేడు.
లిఖిత తలూపి “హీవిల్ ఆల్సో ఫాలో అజ్. ఎనీ అబ్జెక్షన్?” అడిగింది.
“లెట్ హిమ్ కమ్” అన్నారాయన ముందుకి నడుస్తూ.
అందరూ ఫ్లయోవర్ మీద నుండి దిగేరు.
అక్కడున్న అంబాసిడర్‌లో లిఖిత, జర్నలిస్టు ఎక్కేరు. డ్రైవరు పక్కన ఒక ఇన్స్పెక్టరెక్కేడు.
అందరు పోలీస్ ఆఫీసర్సు తమిళ సినిమాల్లో చూపించించే పోలీసాఫిసర్లలానే పెద్ద పెద్ద మీసాలతో వున్నారు.
కారు ముందుకి సాగిపోతుండగా జర్నలిస్టు కారు వెనుక గ్లాసులోంచి చూసి తెల్లబోతూ “మాడం! వెనక్కి చూడండి” అన్నాడు.
లిఖిత వెనక్కి తిరిగి చూసింది.
ఒక మెటడోర్ నిండా పోలీసులు తమ కారుని ఫాలో చేస్తున్నారు.
లిఖిత ఆశ్చర్యపోతూ “వాళ్లంతా ఎక్కడికొస్తున్నారు?” అనడిగింది ముందు సీట్లో కూర్చున్న ఇన్స్పెక్టర్ని.
“మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలని చెప్పేరు ఎస్పీ సార్!” అన్నాడతను వినయంగా.
“నేను మీ గెస్టునా? క్రిమినల్నా?” అంది లిఖిత.
ఆ మాట విని జోక్‌గా తీసుకొని పెద్దగా నవ్వేడు ఇన్స్పెక్టర్.
“ఈ రోజు బంద్. ప్రభుత్వానికనుకూలంగా జరుగుతోంది. అందుకే ఎక్కడి రైళ్లక్కడాగిపోయేయి. మీకే ప్రమాదం జరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేరు సార్!”
లిఖిత మరేం మాట్లాడలేదు.
కారు ఒక ప్రశాంతంగా చాలా పెద్ద గ్రవుండ్‌లో వున్న గెస్ట్ హౌస్ పోర్టికోలో కెళ్లి ఆగింది.
లిల్ఖిత, జర్నలిస్టు కారు దిగేరు. స్నానాలు ముగించగానే టిఫిన్స్ వచ్చేయి. ఇంతలో ఇన్స్పెక్తర్ వచ్చి ఒక కలర్ టీవీ అరేంజ్ చేసి క్రికెట్ మాచ్ వస్తోంది చూడండమ్మా” అన్నాడు.
“నాకు చాలా అయిష్టమైన ఆటల్లో మొదటిది క్రికెట్!” అంది లిఖిత.
అతను తెల్లబోయి చూసి “వ్వాట్ మాడం. ప్రపంచంలో తొంభయిశాతం క్రికెట్ అంటే పడి చస్తారు. క్రికెట్ మాచ్ చూడడం ఒక క్రెడిట్‌గా ఫీలవుతారు” అన్నాడు.
లిఖిత నవ్వి “నేను మిగతా పది శాతంలోకి వస్తాను. ఎక్కువమంది ఇష్టపడేదాన్ని నేను మనసులో ఇష్టం లేకున్నా ఇష్టమని చెప్పలేను” అంది.
“అయితే ఏదన్నా సైట్ సీయింగ్ చేస్తారా” దగ్గర్లో జలబంధారి అని వాటర్ ఫాల్స్ వుంది. అక్కడ మురుగన్ కోవెలుంది. రొంబ వ్యూటిఫుల్ ప్లేస్” అన్నాడతను.
లిఖిత కన్నా జర్నలిస్టు ఉత్సాహం చూపిస్తూ “వస్తాం. వస్తాం. సాయంత్రం వరకు ఇక్కడేం చేస్తాం?” అన్నడు.
అతను లిఖిత అనుమతి కోసం చూసేడు.
“చెప్పండి మాడం. వస్తామని” అని బ్రతిమాలేడు జర్నలిస్టు.
లిఖిత సరేనంది.

*******

సంపెంగి అందించిన కబాబులు తింటూ, కల్లు తాగుతూ “మనం అనుకున్న దానికంటే బాగుంది మన గిరాకీ. కాని నువ్వప్పుడే చాలా తొందపడిపోతున్నావు నారాయణా! కొత్తమతం తీసుకుంటే గుర్తులెక్కువని ఆ బాంక్ పిల్లకేంటి.. రెండ్రోజుల్లో దాని పూర్వజన్మలోని మొగుడొచ్చి డబ్బిస్తాడని చెప్పేవు. నాటకమాడిద్దామన్నా మన దగ్గరంత డబ్బెక్కడిది? ఇవ్వకపోతే ఓంకారస్వామి ఉత్త నాటకాలరాయుడని పదిమందికి చెప్పి రామక్రిష్ణా బీచ్‌లోని ఇసకంతా మన నెత్తిన పోయిస్తది” అన్నాడూ రాజు విసుక్కుంటూ.
ఓంకార స్వామిగా అవతారమెత్తిన నారాయణ విలాసంగా నవ్వి సంపెంగి వైపు చూసేడు. సంపెంగి మొహం చిటపటలాడుతున్నట్లుగానే వుంది. మైక్రోస్కోపు పెట్టి పరీక్షించినా ఆవిడ మొహంలో నవ్వు మచ్చుకైనా కనిపించదు. కాని.. ఇదివరకులా చిరాకు పడకుండా వాళ్లడిగినంత కల్లు పోస్తున్నది. కారణం.. వాళ్లు ఆడుతున్న కొత్త నాటకం భవిష్యత్తులో బాగా లాభాలు సంపాదించి పెట్టగలదనే ఆశతో మాత్రమే.
“మరీ నన్ను సన్నాసోడిగా జమ కట్టేయకు. దానికి అగిన ఎరేంజ్‌మెంట్లు చేసేనేనప్పుడే. నిన్న వెంకట్ అని ఒక ఆడదాని సొమ్ము తిని బతికే ఏబ్రాసోడొకడు నా దగ్గరకొచ్చేడు. వాడు ప్రేమించిన పిల్ల వీడి ప్రేమని ఎడం కాలితో తన్ని కేరళ వెళ్ళిందంట. అదింక తిరిగి రాకూడదని వీడి ప్లాన్. అంతే కాదు ఆ పిల్ల అమ్మకున్న బట్టల మిల్లు వీడి చేతిలోకి రావాలని దానికి తనే వారసుడు కావాలని నా దగ్గర కొచ్చేడు. వాణ్ణి బుటలో పెట్టేను.
“ఎలా?” కుతూహలంగా అడిగేడు రాజు. నారాయణలో కొంత ఫోజు పెరిగింది.
గర్వంగా సంపెంగి వైపు చూసేడు.
సంపెంగి అర్ధం చేసుకున్న దాన్లా గూళ్ళెత్తి నడుస్తూ వెళ్లి మరొక కల్లు ముంత తెచ్చి నారాయణ కందించింది.
“కబాబులు?” అనడిగేడు నారయణ గర్వంగా.
సంపెంగి మళ్లీ వెళ్ళింది.
“నీ తస్సదియ్యా! రేగి కంపలాంటి నా పెళ్ళాం చేత పనులు చేయిస్తున్నవు. నువ్విన్ని పెళ్ళిళ్ళెలా మానేజ్ చేసేవో నాకర్ధమవుతున్నదిప్పుడు” అన్నాడు రాజు నవ్వుతూ.
“ఎవరికే బలహీనతలున్నదో దాని మీద ఆశ రేకెత్తిస్తే వాళ్లు కుక్కల్లా తోకలూపుతూ మన వెంబడి తిరుగుతారు. నీ పెళ్లానికి డబ్బు పిచ్చి. పూరి గుడిసె లెవలయినా ప్రీమియర్ పద్మినిలో తిరగాలని కలలు కంటుంటుంది. అద్సరే. ఆవిడ కబాబులు కాల్చుకొచ్చేలోపునే అసలు విషయం చెబుతాను. కొన్నావిడ వినకపోవడమే మంచిది. లేకపోతే నిముషానికోసారి మన గుట్టు బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంది.”
“అవునవును” అన్నాడు రాజు.
” ఆ వెంకట్ గాడికి రేపొక ఇరవైవేలు తీసుకెళ్ళి బాంక్‌లో ఈశ్వరి అనే పిల్లకివ్వమని, ఆ పిల్ల ముందు జన్మలో నీ భార్యని చెప్పేను”.
“వాడు నమ్మాడా?”
నారాయణ విలాసంగా నవ్వాడు.
“మన దగ్గర కొచ్చేరంటేనే సగం మానసికంగా మన మాటలు నమ్మడానికి సిద్ధపడొస్తారు. ఇక మనం సాగదీస్తూ, సంశయంగా కాకుండా దైవం పూని మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాలి. అలౌకికంగా చూడాలి. చిరునవ్వులొలికించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. వారి ఎదుట నున్నవాడు వాళ్లలాంటి మనిషి కాదని గొప్ప అద్భుత శక్తులున్న దైవాంశ సంభూతుడనే అభిప్రాయం కల్గించహలి. అప్పుడు మనం కొన్ని తప్పులు చెప్పినా వాళ్లు పదిమందిలో బయటపెట్టే సాహసం చెయ్యరు. మొన్నేం జరిగిందో తెలుసా?” అంటూ నవ్వేడు నారాయణ.
రాజులో ఉత్సాహం ద్విగుణీకృతమైంది.
“ఏం జరిగింది?” అనడిగేడూ.
“మల్లన్నని ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసరట. దేవుడు లేదు. దయ్యం లేదని… మాయలూ మంత్రాలూ మోసమని, చేతబడులు, సింగినాదాలూ చీటింగని పాతికేళ్ళూ పుంఖాను పుంఖాలు కనిపించిన ప్రతి పేపర్లోనూ కలం తీసుకుని దూదేకినట్లు ఏకి పారేసేడు. కాని ఇప్పుడేం జరిగిందో సింహంలాంటి మనిషి చెవులేలాడేసుకొని పిల్లిలా మన వరండాలో మూడుగంటల సేపు నా దర్శనం కోసం పడిగాపులు పడ్డాడు.
వాది కులగోత్రలు, పుట్టు పూర్వొత్తరాలూ, మనవాళ్ళొచ్చి నా చెవిలో ఊదెళ్ళి పోయేరు. నేను చేతిలో ఒక ఏపిల్ తీసుకుని పైకెగరేసి పట్టుకుంటూ హాల్లో భక్తుల ముందు ఈ లోకంలో లేనట్లుగా నదుచుకుంటూ వాణ్ణి గమనించినట్లుగా వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేసేను. భక్తులతోపాటు వాడు లేచి ఆశీర్వాదం కోసం ఆరాటపడటం నేను క్రీగంట గమనించేను.
నేను తిరిగొచ్చి మన ఓలంటీరుని పంపించి మల్లన్నని లోపలికి పంపమని చెప్పేను. మల్లన్న వెన్నెముకలేని మనిషిలా అతని వెంబడొచ్చి నా కాళ్ల మీద పడ్డాడు”.
“నిజంగానా?” ఆశ్చర్యపోతూ అడిగేడు రాజు.
“కావాలంటే మన ఓలంటీర్లనడుగు. మల్లన్నని పేరుతో పిలవగానే వాడు ఫ్లాటయిపోయేడూ. నీకేం సమస్యలున్నాయని వచ్చావు. అంతా బాగానే వుందిగా. ఆరోగ్యం కూడా ఫర్వాలేదు” అన్నాను.
“మీరన్నట్లు నాకేం లోటు లేదు. ఇల్లు కట్టేను. పిల్లల పెళ్ళిళ్ళు చేసేను. మనశ్శాంతి లేదు. ఇక ఆరోగ్యమంటారా.. మొన్నీమధ్యన కేన్సరొచ్చి తగ్గింది” అన్నాడతను.
“అదే చెబుతుంట. ఇంకే పెద్ద జబ్బులూ రావు నీకు. మొదట్నుంచీ దేవుణ్ణి తూలనాడేవు. అదే నీ అశాంతికి మూలమని చెప్పేను. ఇంకేం ఉంది. లైబ్రరీల్లో వేలాది పుస్తకాలు చదివిన మనిషి నా కాళ్ల మీద కుక్కపిల్లలా పడ్డాడు. వాడలాంటి ట్రాన్స్‌లో వుండగా నేను తగరపు వలసనుండి వచ్చి నాకు ముత్యం వుంగరం యిచ్చిన పాకాల సుబ్బమ్మగారి ఉంగరం గాల్లోంచి తెప్పించినట్లుగా తెప్పించి వాడిని పెట్టుకోమన్నాను. వాడికి మతి పోయింది. కాని దురదృష్టం. ఆ రింగు వాడి ఏ వేలికీ పట్టలేదు. నేనది తిరిగి తీసుకొని అటూ ఇటూ తిప్పి “నీ అదృష్టానికిది కుదరడం లేదు” అని చెప్పి ఇది అసలైన ముత్యమేనా, చూడు!” అంటూ మన ఓలంటీరుకిచ్చేను.
అతను “ఇది మేలిమి బంగారంలో ఇమిడిన స్వాతి ముత్యం స్వామి!” అంటూ దాన్ని తిరిగిస్తున్నట్లుగా కొంచెం పెద్ద సైజులో నా ఆకృతి గుద్దిన రాగి ఉంగరం నా చేతికిచ్చేడు. నేను గాలిలో చేతులు తిప్పి రాగి ఉంగరం తెప్పించినట్లు తెప్పించి అతనికిచ్చేను.
మల్లన్న మొహంలో ఆనందం తాండవించింది.
ఆ ఉంగరాన్ని మహాప్రసాదంగా స్వీకరించి నా ఫోటోలు అడిగి పట్టుకెళ్ళేడు. వచ్చే పౌర్ణమినాడు నా పుట్టినరోజు ప్రకటిస్తున్నాను. ఆ రోజుకి మల్లన్న నా మహత్యాల గురించి అన్ని పేపర్లలోనూ రాసేస్తాడు” అన్నాడు నారాయణ గర్వంగా.
రాజు నిజంగానే నారాయణ తెలివితేటలు చూసి చకితుడయ్యేడు.
విత్తనం నాటిన మూడో నాటికే పందిరంతా అల్లుకుపోయిన గుమ్మడి పాదులా అనిపించేడు నారాయణ అతని కళ్ళకి.
“నిజంగా నువ్వు చాలా తెలివ్వైనవాడివే నారాయణా! నీ మొహంలో ఆ పీడ కళ పోయి తేజస్సు వచ్చింది. కొంపదీసి దేవుడు నిన్ను నిజంగా ఆవహించలేదు కదా!” అన్నాడు సంభ్రమంగా చూస్తూ.
” నా బొంద! భక్తులు తెచ్చిన పళ్ళు, మిఠాయిలు, పంచామృతాలు తాగి నా బుగ్గలు వూరి రంగొచ్చింది. ఇలాంటి ఆహారం తినే పూర్వం మునీశ్వరులు దివ్యకాంతితో వెలిగిపోయేవారు. దాన్నే బ్రహ్మతేజస్సు అనుకునేవారు పిచ్చి ప్రజలు.” అంటూ నవ్వేడు నారాయణ.
“ఇంతకీ ఆ వెంకట్ గాడి సంగేంటి?”
“ఏవుంది. ఎక్కడో రేపటికల్లా ఆ డబ్బు సంపాదిస్తాడు వాడు. చూస్తుండు. అందులో కొంత డబ్బు బాంక్ పిల్ల కృతజ్ఞతతో మనకి సమర్పించుకుంటుంది. కథ అంతటితో ఆగదు. అద్సరే గానీ, రేపణ్ణుంచి నేనీ గుడిసెల దగ్గరకి రాను. మన రహస్యం బట్టబయలైపోతుంది. ఇప్పటికే తగినంత ప్రచారం జరిగింది కాబట్టి నువ్వా చిలకని గాలి కొదిలి నా దగ్గరే పి.ఏ గా చేరు” అన్నాడు నారాయణ.
రాజు సరేనన్నట్లుగా తల పంకించేడు.
“నువ్వు చెప్పిన సలహా బాగుంది. పరమాన్నం పెడతానంతే గంజికాసుకోటానికి గింజలడిగిపెట్టినట్లుగా.. ఆ ఎండలో నాకీ తిప్పలు దేనికి?” అంటూ రయ్యిన లేచి పంజరంలోని చిలకని బయటకొదిలేసేడు రాజు.
అది నిస్సహాయంగా కుంటుతూ బయటకొచ్చింది. చాలా సంవత్సరాలుగా యజమాని పంజరపు తలుపు తెరవగానే వచ్చి కొన్ని కార్డులు కెలికి ఒక కార్డు ముక్కును కరచి అతనికివ్వదానికి అలవాటుపడ్డది కావడంతో చుట్టూ కార్డుల కేసి చూసింది.
“నీ యవ్వ! నీతో నాకింక పని లేదు. ఎగిరిపో” అంటూ రాజు కల్లు తాగిన నిషాతో దాన్ని పట్టుకుని ఎగరేసాడు.
కాని చిలుక దబ్బున క్రిందపడింది.
ఎన్నో రోజులు మంచం మీద తీసుకున్న రోగిష్టి మనిషి లేచి నడవడానికి ప్రయత్నిస్తే ఎలా తూలిపోతాడో అలాగే చిలుక తన రెక్కల్ని సాచి ఎగరలేక నిస్సహాయంగా కూలబడిపోయింది.
అనేక సంవత్సరాలుగా అతనితోనే కలిసి బతుకుతున్నందువలన దాని మూగ హృదయంలో యజమాని పట్ల నమ్మకము, ప్రేమ కూడా బలంగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇతనే తన బ్రతుకు తెరవు కోసం, హాయిగా పసిడి రెక్కలు పరచి ఆకాశంలో ఎగిరే తనని నిర్దాక్షిణ్యంగా పట్టి రెక్కలు కత్తిరించి పంజరపు పాలు చేసేడన్న ఉక్రోషం, కక్ష మచ్చుకైనా లేవా మూగజీవిలో.
పైపెచ్చు అతన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు దాని హృదయం. తనని నమ్ముకొని అతను పొట్ట పోసుకుంటున్నాడన్న నిజం తెలీని ఆ అమాయకపు పక్షి అతను వేసే గింజలు తిన్నందుకే అతని మీద ప్రేమ పెంచుకుంది. ఒక్కసారిగా తన అవసరానికి వాడుకొని పని తీరేక పొమ్మని వదిలేసిన యజమానిని వదులుకోలేక దాని కంటిలో నీరు గిర్రున తిరిగింది.
కాని..దాని కన్నీరు చూసి కరిగిపోయే మానవత్వం అక్కడున్న ఇద్దరికీ లేదని దానికి తెలియదు.
“థూట్! పొమ్మంటే ఇక్కడే చస్తుంది. పాడు ముండ!” అంటూ ఒక కర్ర పుల్ల తీసుకొని అదిలించబోయేడు రాజు.
అప్పుడే కబాబులు తీసుకొస్తున్న సంపెంగి ఆ దృశ్యం చూసి తెల్లబోతూ “దాన్నొదిలేసేవేంటి?” అంది కంగారుగా.
“ఇక దాంతో పన్లేదే పిచ్చిముండా! మనం పట్టిందంతా బంగారమయ్యే రోజులు దగ్గరకొచ్చేసేయి!” అన్నాడు కర్రతో దాన్ని కొడుతూ.
సంపెంగి కబాబులు వాళ్ల మీదకిసిరి కొట్టి చిలకని ఒడిసిపట్టుకొని “నీకేవన్నా పిచ్చెక్కిందా? జోస్యాలు మానేసినంత మాత్రాన దీన్నొదిలేసుకుంటారా?” అంది కోపంగా మొగుడివైపు చూస్తూ.
నారాయణతో పాటు రాజుకూడా బ్రహ్మరాక్షసిలాంటి ఆ మనిషిలో ప్రేమ, దయ వున్నాయనే విషయం గ్రహించి ఆశ్చర్యపోయేరు.
“చిలక మాంసం ఎంత రుచిగా ఉంటుందో మీరెప్పుడైనా తిని చూశారా? దీన్నిప్పుడే బొచ్చు పీకి కాల్చుకొస్తాను. చూద్దురుగాని” అంది సంపెంగి దాన్ని తీసుకొని లోనికెల్తూ.
ఆ మాట విని నారాయణ ఉలిక్కిపడ్డాడు.
ఎన్నో మోసాలు చేసి అవినీతిగా బ్రతికే అతను కూడా చిలకని చంపబోతున్నదని తెలిసి చలించిపోయేడు.
“వద్దు సంపెంగీ దాన్ని చంపకు”అనరిచేడు కీచుగా.
సంపెంగి వెనక్కి తిరిగి నవ్వింది క్రూరంగా.
“ఏం జాలా?”
“పాపమది మూగజీవి!”
“ఏం కోడి మూగజీవి కాదా? మేకపోతు మూగ జీవి కాదా? వాటితో తయారుచేసిన కబాబులు చప్పరించి తినగా లేంది. చిలక మాంసం తింటే తప్పా! ఎదవ నీతులు చెప్పబోకు.” అంటూ రయ్యిన లోనికెళ్ళిపోయింది.
మరి కాస్సేపటిలో కత్తికి ఎరవుతూ చిలక చేసిన చివరి రొద వాళ్ల చెవిలో పడింది.
నారాయణ “హరిహరి” అంటూ చెవులు మూసుకున్నాడు. అవసరం తీరేక తోటి మనిషిని కూడా మానసికంగా కత్తి లేకుండానే హత్య చేసి అవతలకి విసిరేయగల శక్తి ఈ సృష్టిలో నికృష్టమైన మనిషికి మాత్రమే వుందని గ్రహించే శక్తి నారాయణలాంటి వాళ్లకుండదు.

***********

కారు మెల్లగా వెళ్తోంది.
రోడ్డు కిరువైపులా పెద్ద పెద్ద మర్రి, మారేడు, రావి వృక్షాలు చేతులు పెనవేసుకుని షేక్‌హేండిస్తున్నట్లుగా దట్టంగా పెరిగి దారిన వెళ్ళేవారికి చల్లని గాలిని, నీడని ఇస్తున్నాయి. రోడ్డు పక్కన పెరిగిన చెరకు తోట్టల్లోంచి తియ్యని వాసనలొస్తున్నాయి.
దూరంగా వలయాకారంలో వున్న కొండలు వాటి వెనుక దట్టమైన నీలి రంగులో క్రమ్ముకొన్న మేఘాల పంక్తులు , వాటి కావల దుప్పటిలో దాక్కున్న సూర్యుదు తన ఉనికి చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనంగా మేఘాల కొసల్ని వెండి అంచులు ఎంతో హృద్యంగా వుందా ప్రాంతం.
కృత్రిమంగా ఎత్తయిన కాంక్రీటు కట్టడాలతో క్రిక్కిరిసి పోతున్న జనారణ్యం నుండి కాలుష్యమెరుగని ఆ ప్రకృతి కాంత వడిలో పయనించడం మనసుకి ఎంతో సుఖాన్నిస్తోంది లిఖితకి.
తండ్రి గురించి తాత్కాలికంగా మరచిపోయి ఆ అరుదయిన అందమయిన దృశ్యాల్ని కంటి ఫ్రేములో కమనీయంగా బిగించే ప్రయత్నం చేస్తుందామె మనసు.
“మాడం!”
“నే రాసిన ఆర్టికలొకసారి చదువుతారా?”
“ఇప్పుడు కాదు” ఆమె చూపు తిప్పకుండానే జవాబు చెప్పింది జర్నలిస్టుకి.
మరో అరగంటలో కారు జలబంధారి చేరింది.
కారు దిగకుండానే లిఖిత చూపులు గుడి మీద పడ్డాయి.
ఆ గుడిని చూడగానే లిఖిత మనసు ఆనందంతో గండులేసింది.
కొండవాలులో కొంత ఎత్తునున్నదా దేవాలయం.
క్రింద విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి కోవెలలున్నాయి.
కొద్దిగా మెట్లెక్కేక హెక్టాగన్ షేపులో (పంచముఖాలు) వున్న మంటపం, అక్కణ్ణుంచి మరి కొన్ని మెట్లెక్కితే శివలింగాకృతిలో వున్న సుబ్రమణ్యస్వామి కోవెల, ఆ కోవెలకి నీడపడుతూ వేయి తలల శేషేంద్రుడి శిల్పం. తలతలకి ఎర్రని దీపాలు, చాలా గమ్మత్తుగా కట్టేరా గుడిని. గుడి వెనుక కొండమీద నుండి నాలుగయిదు ధారలలో జలపాతం క్రింది జారుతున్నది. దూరం నుండి చూస్తే రాతి కొంతమీద గట్టిగా నామసుద్దతో రాసినట్లు నిశ్చలంగా కనిపిస్తున్నాయి నీటి ధారలు.
“ముందు గుడిలో దర్శనం చేసుకుందాం” అన్నాడు ఇన్‌స్పెక్టర్.
లిఖిత తల పంకించింది.
ముగ్గురూ దేవుడికి అర్చన చేయించేరు
తులసి మాలలతో, గన్నేరు పూలదండలతో శోభాయమానంగా వున్నాడు శ్రీవళ్లీ సమేతుడయిన సుబ్రమణ్యస్వామి.
ఇన్‌స్పెక్టర్ బూట్ సాక్సు తీసి ఇన్‌షర్ట్ బయటికి లాగి చాలా వినయంగా లెంపలేసుకుని ముగురన్‌కి మొక్కుకున్నాడు.
పూజయ్యేక మంటపం దగ్గర కూర్చున్నారు. ఇన్‌స్పెక్టర్ బూట్లు వేసుకుని మళ్లీ టక్ చేసుకుంటుంటే “ఇందాక దేవుడి దగ్గర లెంపలేసుకున్నారెందుకు?” అని కొబ్బరి ముక్క తింటూ చిలిపిగా అదిగింది లిఖిత.
“తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా మాడం!” అన్నాడతను నవ్వుతూ.
“అంటే తెలిసేం చెయ్యరన్న మాట!”
లిఖిత ప్రశ్నకతను ఇబ్బందిగా నవ్వేడు.
“మీతో మాటలడటం రొంబ కష్టం!” అన్నాడు అరవ యాసతో.
“మీ పోలీసు డిపార్టుమెంటు వాళ్లు తెలిసే చేస్తారు. నా ఫ్రెండ్ బస్సెక్కుతుంటే ఒకడు గొలుసు లాగేసేడు. ఆమె వెళ్ళి దగ్గరలో వున్న పోలీసు స్టేషనులో రిపోర్టిచ్చింది. ఆ గొలుసు లాగిన వాడెవరో, ఆ ఏరియాలో ఎవరా పనులు చేస్తారో వాళ్లకి తెలుసు. గొలుసు వెంటనే దొరికిపోయింది. నా ఫ్రెండ్ ఆ సంగతి తెలిసి తన అదృష్టానికి పొంగిపోతూ పోలీసు స్టేషనుకెళ్లింది. ఈ గొలుసు మీదేనా అంటూ ఆ గొలుసుని ఆవిడ మొహం మీడ ఆడించడమే గాని గొలుసు నా ఫ్రెండ్‌కివ్వలేదా ఇన్‌స్పెక్టరు. ఆవిడ విసిగి విసిగి చివరికి ఎవర్నో పట్టుకొని ఒక ఐ.జి.గారి చేత ఆ ఇన్‌స్పెక్టరుకి ఫోను చేయించింది. ఐ.జి.గారు చెప్పినప్పుడల్లా వాళ్లు ఫోనులోనే సాల్యూట్ కొట్టి ఇస్తాననడం, ఈవిడ వెళ్తే ఇవ్వకపోవడం. చివరికి ఆమె విసిగి వదిలేసింది. ఇలాంటివి తెలిసి చేసిన తప్పులు కావా?” అనదిగింది సూటిగా లిఖిత.
ఇన్‌స్పెక్టరు వెర్రిగా నవ్వాడు.
“అయిజీగారు చెప్పినా ఇవ్వలేదా మాడం!” ఆశ్చర్యంగా అడిగేడు జర్నలిస్టు.
“లేదు. కారణం ఆయన వీళ్లకి డైరెక్ట్ హెడ్ కాకపోవడమే. ఈ డిపార్టుమెంటులో హయ్య ర్ అథారిటీ పట్ల విపరీతమైన వినయవిధేయతలు చూపిస్తారు. సాల్యూట్స్ కొటడం, గంటలు గంటలు నిలబడడం, .. కాని ఇవన్నీ కేవలం వీళ్ల ఆఫీసర్సుగా ఉన్నంతవరకే!” అంది లిఖిత.
“ఎక్కడో కొంతమంది అలా ప్రవర్తించినంత మాత్రాన మొత్తం డిపార్టుమెంటుననడం భవ్యం కాదు మాడం!” అన్నాదు జర్నలిస్టు ఇన్‌స్పెక్టరుని వెనకేసుకొస్తూ.
లిఖిత నవ్వింది.
“నిజమే! ఒక లీటరు నీళ్లలో ఒక గ్లాసు పాలు కలిపితే నీళ్ళలో పాలు కలిపేరంటాం కాని పాలలో నీళ్ళు కలిపేరనం. అలానే వుంది. మన దేశంలో అవినీతి పర్సంటేజీ. ఇలాంటి విషయాలు రాయరు మీలాంటి జర్నలిస్టులు. ఏ తార ఏ తారడుతో తిరుగుతుందో, ఏ తార ముసల్దయిపోయిందో, అర్ధం లేని వ్యర్ధపు మాటల్ని బాక్స్‌లు కట్టి మరీ రాస్తారు పెద్ద డిస్కవరీ చేసినట్లుగా” అంది.
జర్నలిస్టు మొహం మాడింది.
లిఖిత అదేం పట్టించుకోనట్లుగా లేచి నిలబడి “పదండి ఆ జలపాతాన్ని దగ్గరగా చూద్దాం!” అంది.
అందరూ కొండెక్కేరు..
దూరం నుండి స్తబ్దంగా చలనం లేనట్లుగా కనిపించిన జలపాతం దగ్గరకు వెళ్తుంటే హోరున శబ్దంతో, తుళ్ళుతూ శక్తిలా క్రిందకి దూకుతోంది. సన్నని పాయలా కనిపించే ఆ జలపాతంలోని నీరు కొండ దిగువున ఒక పెద్ద టాంక్‌లా తయారయింది. దాని నుండి తీసిన కాలువలతో ఆ ప్రాంతంలోని పంటలన్నీ పండుతాయని తెలిసి లిఖిత ఆశ్చర్యపోయింది. రాయికి రాయికి మధ్య చెమ్మలా కనిపించే ఈ నీరెక్కడినుండి ఉద్భవిస్తుంది అనే నిజం సరిగ్గా ఎవరికీ తెలియదు.
కాస్సేపు నీటితో ఆడుకుని తిరిగి బయల్దేరేరు ముగ్గురూ. కారులో తిరిగి “నా ఆర్టికల్ చదవండి మాడం” అంటూ వెంటపడ్డాడు జర్నలిస్టు.
అతని పోరు భరించలేక ఆర్టికల్ తీసుకుని టైటిల్ చూసి మొహం చిట్లించింది లిఖిత.
“అక్షరం తెలీని అడవి మనిషి దగ్గరున్న అద్భుత శక్తులు” అని టైటిల్ పెట్టేడతను.
“ఇదంతా కోయదొర గురించేనా?”
“అవును మాడం. చదవండి.”
“అక్కర్లేదు. టైటిల్ చూస్తేనే పాఠకులకేం చెప్పదలుచుకున్నావో తెలుస్తున్నది. ఏ అద్భుత శక్తి చూశావ్ నువ్వు!”
“అదేంటి? మీరూ చూశారుగా జ్యోతి నడవటం”
“చూశాను.”
“మరింకేమిటి, అదద్భుత శక్తి కాదా? మీరు నడిపించండి చూద్దాం.”
“నడిపిస్తాను. కాస్త ఆముదం, ఒక రాగి బిళ్ళ, కర్పూరం తీసుకురా!” అంది లిఖిత.
“ఊరుకోండి. మీవల్ల కాదు”
“నా వల్లనే కాదు నీ వలన కూడా అవుతుంది కాస్త ఆలోచిస్తే”
“ఎలా?” ఆశ్చర్యపోతూ అడిగేడు జర్నలిస్టు.

ఇంకా వుంది..

1 thought on “బ్రహ్మలిఖితం 9

  1. అవసరం తీరేక తోటి మనిషిని కూడా మానసికంగా కత్తి లేకుండానే హత్య చేసి అవతలకి విసిరేయగల శక్తి ఈ సృష్టిలో నికృష్టమైన మనిషికి మాత్రమే వుందని గ్రహించే శక్తి నారాయణలాంటి వాళ్లకుండదు…so true.సీరియల్ చాలా ఆసక్తి కరంగా సాగుతుంది…తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ..రచయిత్రికి అభినందనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *