March 29, 2024

బ్రాహ్మణుడంటే ఎవరు?

రచన: శారదా ప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

రాజకీయాలలోనే కాదు అన్ని వేదికలమీద కూడా కొందరు తామే హిందూ మతోద్ధారకులమని చెప్పుకుంటూ ఒకరినొకరు అభినిందించుకునేవారున్నారు. వారికివారే డబ్బాలు కొంటుకుంటారు! హిందూమతం ఎవరూ ఉద్ధరించే నీచస్థితిలో ఇప్పుడూ లేదు,ఇక ముందు కూడా ఉండబోదు! భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు హిందూమతంలో ఉండటమే, హిందూమతం యొక్క విశిష్టత, ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఉండబట్టే హిందూమతం నిరంతరం ప్రవహిస్తుంది! మతోద్ధారకులమని చెప్పుకునే వారికి ఇతరుల భావాలను గౌరవించటం చేతకాదు! వారి భావాలకు భిన్నమైన భావాలను వ్యక్తపరిస్తే వారు సహించలేరు! అందరికీ వారికున్న అభిప్రాయాలే ఉండాలని అనుకోవటం వారి అజ్ఞానం! అంతేకాదు బాగా చదువుకున్నామని(?) అనుకునే సంస్కార విహీనులు వ్యక్తిగత దూషణకు, ఎదురుదాడికి కూడా దిగుతారు! ఈ మధ్య సమాజంలో ఈ దాడులు మరీ ఎక్కువయ్యాయి! వారి కుసంస్కారానికి చింతించటం తప్ప మరి ఏమీ చేయలేం! ఈ హిట్లర్ సంస్కృతికి మూలాలు ఎక్కడివో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు! వీరు గాంధీ,నెహ్రూలను దూషిస్తారు.అది వారికి ఫాషన్ అయిపొయింది.ఎవరైనా హిందూ మతానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులను విమర్శిస్తే,


విమర్శించే పత్రికలకు జాతీయత లేదని భాష్యం చెబుతారు! కొంతమంది ఇతర మతస్తులను ‘బైబిల్ అన్నలని’, ‘దేవపుత్రులని’ ….మతం పేరుతో వారిని దూషిస్తారు! కులమతాలతో వ్యక్తులను దూషించేవారు భావదాస్య సంకెళ్లను వారికి వారే వేసుకుని ఉంటారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవరో నిరక్షరాస్యులు కాదు,బాగా చదుకున్నామని అహంకరించేవారే ! వీరిలో ప్రొఫెసర్స్ కూడా ఉండటం దారుణం! వీరు నకిలీస్వామి నిత్యానందను కూడా పొగుడుతారు.అదీ వారి విజ్ఞత! ఇతర మతాలను గౌరవించటం తెలిసిన వారే,తమ మతాన్ని కూడా గౌరవించుకోగలరు! ఎందుకంటే గౌరవించటం అనే మౌలిక సూత్రం వారి నైజం కాబట్టి! ఇతర మతాలను, మతస్తులను మతం పేరుతో ద్వేషిస్తే హిందూమతం ఔన్నత్యం పెరుగుతుందా? వారి భావాలకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే ,దానికి ఒకాయన సమాధానం ……. “మనవాళ్లే ఇలా అంటే ఎలా?”అని! ఇక్కడ మనవాళ్లే అంటే బ్రాహ్మణులు అనే అర్ధాన్ని మీకు విడమరచి చెప్పనవసరం లేదనుకుంటాను! వారి భావన ప్రకారం ఎవరైనా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే వారు బ్రాహ్మణులు కారనేది వారి భావన,అవగాహనారాహిత్యం! ఈ సమాజాన్ని సంస్కరించిన బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు. కందుకూరి, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిలాంటి వారే నాలాంటి వారికి స్ఫూర్తిప్రదాతలు. ఇప్పుడు మతోద్ధారకులమని చెప్పుకుంటున్న బ్రాహ్మణులు కుహనా బ్రాహ్మణాలు! నిజమైన బ్రాహ్మణుడిని అందరూ గౌరవిస్తారు.మనమధ్యనే నివచించిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితం ,మరికొందరి జీవితాలే ఇందుకు నిదర్శనం. ఆయన నివసించిన చందోలులో ముస్లిములు ఎక్కువ.వారు కూడా ఆయన ఆశ్రమానికి తలా ఒక బస్తా ధాన్యం ఇచ్చేవారు.ఆయన ఎవరినీ ఎప్పుడూ ఏదీ అడగలేదు, గౌరవంతో సహా.ఆయన చందోలులో నడచి వెళుతుంటే అందరూ కులమతాలకు అతీతంగా లేచి నిలుచుంటారు.Respect should be commanded, not demanded! ఇప్పుడు కొందరు అహంకారులు అన్నీ వారికే తెలుసని అనుకుంటారు.అన్నీ తెలుసని అనుకునే వారే అసలైన మూర్ఖులు. తెలుసుకోవలసింది చాలావుంది, తెలిసింది చాలా సూక్షం అనుకునే వారు నిజమైన జ్ఞానులు.డంబం,దర్పం ప్రదర్శించే వారికి కనీస జ్ఞానం కూడా ఉండదని చెప్పటానికి చింతిస్తున్నాను! ఇటువంటి డంబాలు ప్రదర్శించే వారిని గురించేనేమో ‘నడమంత్రపు వైష్ణవానికి నామాలెక్కువ! ‘అనే సామెత వచ్చింది.అసలు,”నువ్వు బ్రాహ్మణుడివే కాదు”అని నన్ను అన్నారు కొందరు! కాకపోతే ఫరవాలేదు,నేను ఇలాగే ఉంటాను.నిజానికి వారితో పోలిస్తే నేను నిస్సందేహంగా నిజమైన ‘బ్రాహ్మణుణ్ణి’ ! భావదారిద్య్రం ఉన్నవాళ్లు మతోన్మాదులు చెప్పిన ప్రతిదానికి చప్పట్లు కొడుతారు! నాకు అటువంటి భావదారిద్య్రం లేదు.ఎవరి భావాలనో మోసుకుని తిరిగే కట్టుబానిసను కాను! అటువంటి మాటలు విని చెవుల్లో పూలు పెట్టుకోవటానికి నేను ఏ కాబేజీ శాస్త్రినో కాదు! నేను ఇంతకు ముందు తెలియచేసిన భారతంలోని అరణ్యపర్వంలోని నహుషుడి కథ, ధర్మవ్యాదుడి కథ,యక్ష ప్రశ్నలు మరియూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’అనే కథలోనూ బ్రాహ్మణుల కుల ప్రస్తావన వచ్చింది. బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించేది కులమా? గుణమా? అని ఎవరైనా నన్నడిగితే గుణమే అని నిస్సందేహంగా చెబుతాను.ఒక వ్యక్తి పుట్టుకతో బ్ర్రాహ్మణుడై ఉండవచ్చు. కాని అతనిలో అహంకారం,దర్పం,విచ్చలవిడి జీవితం,విలాసాల మీద కోరికలు,అబద్దపు నడవడిక ఉంటే అతడు బ్రాహ్మణుడుగా పరిగణించబడడు. ఇంకొకడు ఇతరకులాలలో పుట్టినప్పటికీ, అతనిలో ఈ లక్షణాలు లేకపోతే అతన్ని బ్రాహ్మణుడుగానే పరిగణించవచ్చు. ఇక బ్రాహ్మణకులంలో పుట్టి, పై దుర్గుణాలు లేనివాని మాట చెప్పేదేమున్నది?అతను అత్యుత్తముడు! “జన్మనా జాయతే శూద్ర:సంస్కారాద్ ద్విజ ఉచ్యతే,వేదపాఠీ భవేద్విప్ర:బ్రహ్మ జానాతి బ్రాహ్మణ : “అని స్మృతులు చెబుతున్నాయి.దీని అర్ధం ఏమిటంటే,పుట్టుకతో అందరూ శూద్రులే. అనగా అజ్ఞానంతోనే అందరూ జన్మిస్తారు.సత్కర్మల ద్వారా, తపస్సాధనల సంస్కారాల ద్వారా వారు ద్విజులవుతారు. వేద గ్రంధ పఠనం వలన జ్ఞానాన్ని పొంది విప్రులవుతారు.

విప్రులలో కూడా పరబ్రహ్మను సాక్షాత్కరించుకున్న వారు మాత్రమే బ్రాహ్మణులు లేదా బ్రహ్మజ్ఞానులు అనబడుతారు.బ్రాహ్మణత్వం అనేది కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి నిర్ణయించబడుతుందని అరణ్యపర్వంలోని కథల ద్వారా తెలుసుకున్నాం! పుట్టుకతో వచ్చిన ఈ లక్షణాలను వారు అభ్యాసం ద్వారా చక్కగా వృద్ధిచేసుకోకపోతే అవి దుస్సాంగత్యదోషంవల్లా, కుహనాగురువుల వల్ల క్రమేణా నశించిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిని ప్రస్తుతం కొంతమందిని మనం చూస్తున్నాం! Emergency విధించిన తరుణంలో శ్రీమతి ఇందిరా గాంధికి శ్రీ చంద్రశేఖరసరస్వతీ స్వామి వారు దర్శనం ఇవ్వలేదు.మరి నేటి చాలామంది పీఠాధిపతులు ‘అనుగ్రహభాషణం’ చేసేది(అవినీతిపరులైన) రాజకీయ నాయకులతోనే! చాలామంది స్వాములు, పీఠాధిపతులు అవధూతలు వచ్చారు. కానీ వారు వివేకానందుని లాగా,రామతీర్థ లాగా–ప్రజలలోకి చొచ్చుకొని పోయి ప్రజలను జాగృత పరచటంలో పూర్తిగా వైఫల్యం చెందారు అని చెప్పటంలో నాకు ఎటువంటి దురుద్దేశ్యం లేదు.వేదికనెక్కి గంటలకొద్దీ ఏది పడితే అది అనర్గళంగా మాట్లాడే ఈ సాధుపుంగవులు ప్రజలను ఎందుకు చైతన్యవంతులను చెయ్యటానికి ప్రయత్నించరు?125 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రపంచపు గొప్ప నాటకాలలో ఒకటైన ‘కన్యాశుల్కం’ లో అనేకమైన బ్రాహ్మణ పాత్రలు ఉన్నాయి. అగ్నిహోత్రావధాన్లు, బుచ్చమ్మ, లుబ్ధావధానులు, రామప్ప పంతులు,గిరీశం, సౌజన్యారావు పంతులు గారు మొదలైన ముఖ్య పాత్రలను తీసుకొని విశ్లేషించుకుందాం!
అగ్నిహోత్రావధాన్లు–పిలక పెట్టుకొని విభూతి రాసుకొని త్రికాల సంధ్యలు, అగ్నిహోత్రం చేస్తాడు ఈయన.నిత్య నైమిత్తిక కర్మలను యధావిధిగా ఆచరిస్తూ ఉంటాడు. ఇంటిలో ఒక బాలవితంతువైన ఒక కూతురిని పెట్టుకొని, మరో కూతురిని
(బాలికను)డబ్బులకు అమ్ముకునే దౌర్భాగ్యుడు అయిన అగ్నిహోత్రావధానులు బ్రాహ్మణుడా?
లుబ్ధావధానులు-చావుకు కాళ్ళు చాచుకొని,జ్యోతిష్యాన్ని నమ్ముకొని నాలుగో పెళ్ళికి సిద్ధపడి ,డబ్బులిచ్చి ఒక బాలికను వివాహ మాడటానికి సిద్ధపడ్డ,ఇతనూ బ్రాహ్మణుడేనా? ఇతని ఇంటిలో కూడా ఒక బాల వితంతువైన కూతురు ఉంది.
రామప్ప పంతులు–లౌక్యానికి,మోసానికి తేడాను తెలిపిన ఘనుడు ఈయన.అందిన చోటల్లా కమీషన్ రాబట్టుకుంటాడు. వేశ్యాలోలుడు.ఆ వేశ్యలకు డబ్బులు కూడా ఇవ్వడు.లుబ్ధావధానులు యొక్క విధవకూతురితోనూ,పూటకూళ్ళమ్మతోనూ,మధురవాణితోనూ ..ఇలా చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు గలవాడు ఇతడు. ఆ మాటకొస్తే,పురుషులతో కూడా సక్రమమైన సంబంధాలు ఉండవు ఇతగాడికి.మరి,ఇతడు కూడా బ్రాహ్మణుడేనా?
గిరీశం–శీలంలేని ఒక ఆషాఢభూతి ఇతడు! మరి ఇతడూ బ్రాహ్మణుడేనా?
సౌజన్యారావు పంతులు గారు–సంస్కరణాభిలాషి,నిజాయితీపరుడు,శీలవంతుడు.నిత్య నైమిత్తిక కర్మలను వేటినీ ఆచరించడు.జీవితమే ఒక యోగం,యాగంగా గడిపిన మహనీయుడు.సహజంగా జీవించటం,అందరినీ సమదృష్టితో చూడటం తెలిసిన ఈ మహనీయుడే నిజమైన బ్రాహ్మణుడు.శ్రీ గురజాడ వారు ,ఆనాటి కొంతమంది జాతి బ్రాహ్మణులకు
ఉన్న అహంకారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వేశ్య అయిన మధురవాణి చేత సౌజన్యారావు పంతులు గారిని ఉద్దేశించి, ఇలా అనిపిస్తారు—“బ్రాహ్మణులలో కూడా గొప్ప వారుంటారన్న మాట! ”ఎంత వ్యంగ్యంగా చెప్పి కొరడా ఝళిపించి ‘కుహనా బ్రాహ్మణులకు’దేహశుద్ధి చేసారు!
అయినా నేటికీ కొంతమందికి ఇంకా దురాహంకారం పోలేదు. అన్నట్లు మరిచాను,ఇంత గొప్ప నాటకం వ్రాసిన శ్రీ గురజాడ వారిని మించిన ‘బ్రాహ్మణుడు’ వేరే ఉంటాడా?’ఇలాంటి తవ్వాయి వస్తే’కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు నిజమైన బ్రాహ్మణుడు.అంతదాకా ఎందుకు సంస్కరణాభిలాష కల ప్రతివాడు బ్రాహ్మణుడే! ఒకసారి చరిత్రను పరిశీలించండి, బ్రాహ్మణుడంటే ఎవరో మీకే తెలుస్తుంది! ఈ వ్యాసం నా ఆవేదనలో నుంచి పుట్టింది! మీ ఆశిస్సులుంటే ఇటువంటి మరెన్నో వ్యాసాలను ఇక ముందు కూడా వ్రాయగలను!
సర్వే జనా: సుఖినోభవంతు!
(ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు.నన్ను బ్రాహ్మణుడు కాదన్న వారికి ఇది సమాధానం! ఇది నా ఆవేదన ! నా కలానికి,గళానికి వాడి, వేడి,పదును ఎక్కువ! ! అనవసరంగా ఎవరైనా భుజాలు తముఁడుకుంటే నేనేమీ చేయలేను! )
నేనొక దుర్గం…
నాదొక స్వర్గం…
అనర్గళం… అనితరసాధ్యం… నా మార్గం!
అన్న శ్రీశ్రీ కవితా వాక్యాలతో దీన్ని ముగిస్తున్నాను!

33 thoughts on “బ్రాహ్మణుడంటే ఎవరు?

  1. నా feelings మాటల్లో చెప్పలేను.మీకు నా హృదయపూర్వక అభినందనలు .

  2. Alochnatmaka” vishayam annadi nijame….. kani… Brahman twam “kulam a leka ‘gunama” ante ‘gunam ‘ e ani cheppa daniki kaaranam okkataite….. ‘kulam’ e annadi matram nijam.

    Kulam” annadi blood related… edaina …raktam lo ninchi vachhinade asalu ‘gunam’ .
    Actor ki puttina vadu acting talent to vuntaadu.. alaage….. e vruttiki chendina vaadaina aa vrutti talent …. vadi tadupari puttina vadiki … aa gunam vuntundi… adiye ‘kulam’ lakhanam.
    Anduke … kulam e mukhyam ” annadi na abhiprayam.

  3. జన్మనా జాయతే శూద్ర: చక్కగా విశ్లేషించారు. ఒక జగమెరిగిన బ్రాహ్మణుడు “బ్రాహ్మణుడంటే ఎవరు?” అని రాయడమే సాహసం. అలా రాయడానికి దమ్ము, ధైర్యం కావాలి. చాలా మంది ఛాందస బ్రాహ్మణోత్తములు మీతో ఏకీభవించక పోవచ్చేమో గానీ మీరు వ్రాసింది యదార్ధం.కన్యా శుల్కం పాత్రలతో విశ్లేషణ అమోఘం ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా మీ విశ్లేషణ నూటికి నూరుపాళ్ళు వాస్తవం. ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం వుంది

  4. “అశనాచ్ఛాదన శయన ములందు గుణదోషముల నాలోచింపక, దైవ ప్రాప్తములగు నశనాదుల చేత తృప్తుడగు చుండువాడు బ్రాహ్మణుడని” పారమార్ధిక పదకోశంలో ఉటంకించారు. ఈ లక్షణాలున్న ప్రతియొకడు బ్రాహ్మణునిగా మన్ననలందవచ్చును. అవి లేనినాడు, ఏ కులమైతేనేమి?

    ఈ మధ్య కులమత ప్రస్తావనలు, అందునా బ్రాహ్మణజాతి గురించి, టీవి మరియు సాంఘిక మాధ్యమంలో జరిగే చర్చాగోష్టులు ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధమైనవే కాని, మామూలు సమాజంలో అంత తీరికగా వీటిపై తర్జనభర్జనలు జరిపే అవకాశం అంతగా కనబడదు. సమాజం రోజూ మారుతూనే ఉంటుంది. నేడు మనం ఇచ్చుకునే నిర్వచనాలు రేపు అన్వయం కాకపోవచ్చును. కొన్ని కలలో కూడా ఊహించనవి జరగడం మనం చూసాం. జరిగితీరుతుందని భావించినవి ఎటువంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోయాయి కూడా.

  5. విశ్లేషణ చాలా బాగుంది రామారావు. ఇంత లోతుగా అధ్యయనం చెయ్యడం నిజం గా మెచ్చుకో వల్సిన విశేషం.

    1. నా పేరు శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)అండి !

  6. శాస్త్రిగారికి నమస్కారములు. నిజమే బ్రాహ్మణత్వం లేనివాడు, జన్మత: బ్రాహ్మణడైనా , బ్రాహ్మణుడిగా పరిగణించబడడు, ఇదే సూత్రం అందరికి వర్తిస్తుంది. ఆయావృత్తులవారు వారివారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తేనే వారిని, ఉపాధ్యాయుడని, వైద్యుడని ఇత్యాదిగా పరిగణించబడతారు. బ్రాహ్మణుడిగా చెప్పుకొనేవారు “విధిగా” తన విధ్యుత్ ధర్మాన్ని ఆచరించవలసినదే, ఇందుకు ఏ మినహాయింపు లేదు. పైన శ్రీ బాబూరావుగారు చెప్పినట్లు. కన్యాశుల్కంలోని సౌజన్యారావుపంతులుగారు, తన కాలధర్మాన్ని ఆచరించక కేవలం “సంఘసంస్కర్తగా” వుంటే వారు వ్యక్తిగా మంచివారు మాత్రమే, బ్రాహ్మణుడిగా పరిగణించలేము. ఇదే నవలలోని ఇతర పాత్రలైన, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు, రామప్పపంతులు, గిరీశం వంటివారు అన్నికులాలు ప్రాంతాలు మతాలలోనూ కనిపిస్తారు దానికి ప్రత్యేకించి బ్రాహ్మణున్నిమాత్రమే ఎంచనఖర్లేదనుకుంటా. మీరన్నట్లు , చింతచచ్చినా పులుపు చావనట్లు , అసలు బ్రాహ్మణకులాన్ని నేటి భారతంలో అంతగా లెక్కచేయనిస్ధితి. నేడు 90% బ్రాహ్మణులు “నేతి బీర” లాంటివారే. మనకుమనం గొప్ప అనుకోవటం తప్ప ఇంకేమిలేదు. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరసరస్వతి స్వామివారురు లోగడ విజయవాడ శివరామకృష్ణక్షేత్రంలో పుర పెద్దలు నేటిసమాజంలో బ్రాహ్మటణులని అగౌరవించుటగురించి అడిగినదానికి స్వామివారు “మీలోమీధర్మాన్నెంతమంది ఆచరిస్తున్నారు?

    1. మీ వ్యాఖ్యకు నాదొక్కటే సమాధానం–మీరన్నట్లుగా కన్యాశుల్కంలోని పాత్రలు లాంటి వ్యక్తులు అన్ని కులాల్లో ఉండవచ్చు!కానీ సంస్కర్తలు ఉండకపోవచ్చు.సంస్కరణాభిలాష కలిగిన ప్రతి వాడూ బ్రాహ్మణుడే!అటువంటి వారు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించకపోయినా వారు నిస్సందేహంగా బ్రాహ్మణులే!ఆ విధంగా ,సౌజన్యారావు పంతులుగారు నిజమైన బ్రాహ్మణుడే!గురజాడ ,వీరేశలింగం గారు చాలా గొప్ప బ్రాహ్మణులు!

    2. మీ వ్యాఖ్యకు నాదొక్కటే సమాధానం–మీరన్నట్లుగా కన్యాశుల్కంలోని పాత్రలు లాంటి వ్యక్తులు అన్ని కులాల్లో ఉండవచ్చు!కానీ సంస్కర్తలు ఉండకపోవచ్చు.సంస్కరణాభిలాష కలిగిన ప్రతి వాడూ బ్రాహ్మణుడే!అటువంటి వారు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించకపోయినా వారు నిస్సందేహంగా బ్రాహ్మణులే!ఆ విధంగా ,సౌజన్యారావు పంతులుగారు నిజమైన బ్రాహ్మణుడే!గురజాడ ,వీరేశలింగం గారు చాలా గొప్ప బ్రాహ్మణులు!

  7. మీ విషయ పరిజ్ఞానం అద్భుతంగా ఉంది.మీకు ధన్యవాదములు.

  8. చాతుర్ వర్ణం మాయా స్రుష్ట్వా గుణకర్మ విభగతః అణా గీత వాక్యానికి..నిక్కమైన నిదర్శనం…మీరు ఉటంకించిన బ్రహ్మణత్వం..పుట్టుకతో అందరం సూద్రులమే… అజ్ఞానులమే..సాధన తో,ఆచరణ తో బ్రహ్మణత్వం సాధించు కోవాలి…చక్కని సందేశం..ఈ అవగాహన మన దేశ పౌరులకు ఎంతో అవసరం.చాలా మంచి వ్యాసం..మీకు నా పాదాభి వందనం

  9. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కర్మణా జాయతే ద్విజః; వేదపాఠం తు విప్రాణాం, బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణః: మన గ్రంధాలలో ఏమి వ్రాసి వున్నా మన దైనందిన ఆలోచనలలో, ఆచరణలో అందరిలోనూ కులతత్వం జీర్ణించుకొని పోయింది. ఈ మనః పరిమితులను దాటే వారు, దాటగలిగే వారు చాలా తక్కువ. సూటిగా వున్న మాటలు చెప్పినందుకు అభినందనలు.

  10. కుల, మతాల కొరకు కుమ్ములాడే మనుషులు, దేవునికి కూడా కుల, మతాలు అంటగట్టడం కన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా?
    సర్వులను సృష్టించిన సృష్టికర్త అందరికి దేవుడినని, తండ్రినని చెప్పి …..మన శరీరాలు తయారు చేసిన ప్రకృతి మనకు తల్లి అని చెప్పిన పరమాత్మ బోధ ఎంతమందికి అర్థం ఐయింది?
    భగవద్గీత లో ఉన్నదే బైబిల్ లో ఉన్నది అనీ, ఆ రెంటినీ దృవీపరచేందుకే ఖురాన్ దేవుడు మనకు అందించాడని మనలో ఎంతమంది కి తెలుసు?
    ఆ మూడు గ్రంథాల సారమే బ్రహ్మవిద్యాశాస్త్రం అనీ మనలో ఎంతమందికి తెలుసు? ఆ సారం తెలిసినవాడే నిజమైన బ్రాహ్మణుడు.
    సర్వులను అడించే ఆత్మ యొక్క జ్ఞానం పొంది, యోగం లో ఉండేవాడే బ్రాహ్మణుడు.
    కర్మయోగం, బ్రహ్మయోగం, భక్తి యోగం మనకు ఉన్న మార్గాలు. వీటి గూర్చి మూడు దైవ గ్రంథాలలో ఉన్నది. అది గ్రహించలేక పోవడం మన అజ్ఞానము. ఈ అజ్ఞానములో వున్నవాడు ఎవరైనా ఎన్నటికీ మోక్షం పొందడు.
    పరమాత్మ = యెహోవా = అల్లాహ్

  11. ఏమిటి మిత్రమా ఇంత లోతుగా విషయంలోనికి వెళ్లిపోయావు. చాలా బాగ నిర్భయంగా విశ్లేషించావు. ‘జన్మనా జాయతే శూద్ర’ ఇది ఎంత మందికి తెలుసు

  12. ఏమిటి మిత్రమా ఇంత లోతుగా విషయంలోనికి వెళ్లిపోయావు. చాలా బాగ నిర్భయంగా విశ్లేషించావు. ‘జన్మనా జాయతే శూద్ర ‘ఇది ఎంత మందికి తెలుసు.

  13. నా పాట బహుశః వినే ఉంటారుమనీషా పంపకం ఆధారంగా రాశాను.అది సినిమాకు రాయడము కాదు అది నా ఆచరణాత్మక అభిప్రాయం కూడా
    “చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీష మమ”

  14. మీరు వ్రాసిన అంశాలతో ఏకీభవిస్తాను. ఎవరు ఏ కులం వారైనా మంచి తనానికి, దాతృత్వానికి మించింది లేదు. నరులలో నారాయణుడిని చూడగలిగినప్పుడే ఏ వ్యక్తి వ్యక్తిత్వం అయినా చంద్రుడిలా కలకాలం ప్రకాశిస్తుంది. నేను ఎక్కడో వుదాహరించినట్టు మనం తినగలిగేది తింటే అది ప్రకృతి, తినవల్సిన దానికన్నా ఎక్కువ తింటే అది వికృతి , మనం తిన దల్చు కున్న దాన్ని ఇతరులతో పంచుకుంటే అది సంస్కృతి అని పెద్దలు చెప్పిన దాన్ని రాసాను. దురదృష్ట వశాత్తు ఇప్పటి టీవీల్లో చర్చా కార్యక్రమాలు, కొంతమంది స్వార్ధ ప్రయోజనాలు చాలా మందిని తప్పు దోవ పట్టిస్తున్నాయి. విజ్ఞత కోల్పోయి అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాయి. ముందు అటువంటి పరిస్తితుల నుండి బయటపడాలి. మనలో అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజోపకరమైన కార్యక్రమాలలో స్వార్ధ చింతన వీడి విరివిగా పాల్గొంటే ఈ కులమతాల ప్రసక్తి రానే రాదు. సర్వమానవ సౌబ్రాతత్వం వెల్లి విరుస్తుంది. మీ వ్యాసం పలువురిలో మార్పు తీసుకు రాగలదని ఆశిస్తున్నాను.

  15. మరో ఆలోచన రేకెత్తించే రచనను అందించినందుకు అభినందనలు.

  16. పుట్టుకతో ఎవరూ బ్రాహ్మణుడు కాదని మీరన్నదానితో ఏకీభవిస్తున్నాను!

  17. సంస్కరణాభిలాష కల ప్రతి వాడూ బ్రాహ్మణుడే!ఇది ముమ్మాటికీ నిజం!

  18. బ్రాహ్మణ్యం ఒక కులంగా పరిగణించడం వేరు, నిజమైన బ్రాహ్మణ్యం ఒక తత్వం, యోగం, సంపూర్ణత్వం. దాన్ని కుల ప్రాతిపదికన పొందడం సాధ్యం కాగు, గుణశీలాలద్వారానే అది సాధ్యం.
    -ఈ విషయాన్ని మీరు పై వ్యాసంలో విపులంగా విశ్లేషంచారు. కుండ బ్రద్దలు కొట్టడానికి ఏమాత్రం సంకోచించని మీ తెగువకు భుజాలు తముడుకునే వాళ్ల నోట మాట రావడం కష్టమే..

  19. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను

  20. .ద్విజాత్యగ్రజన్మ,భూదేవ,బాడబాః|విప్రశ్చ,బ్రాహ్మణో2(సౌ)షట్కర్మాయాగాదిభిర్యుతః–A manof the sacerodotal class
    ద్విజఃద్విజన్మాయజనsacrifice–యాజనassisting to sacrifice–అధ్యయన, study-అధ్యాపన teachingదాన benefaction-,ప్రతిగ్రహ accepting alms- యుతః కూడిన అసౌ = బ్రాహ్మణుడు అనేపదానికి నిర్వచనార్ధాలు.రెండుసార్లు జన్మ ఎత్తుతాడు కనుక ద్విజః అని అనబడుతాడు బ్రాహ్మణుడు. ఉపనయనంఉ ఐన తర్వాతనే ,నిత్యకర్మానుష్టాను సారి ఐన నే బ్రాహ్మణుడు గాచలామణీవుతాడు. బ్రాహ్మణ అంశ వేరు బ్రాహ్మణుడువేరు. ప్రస్తుతకాలానుసారముగాదీన్నీ అన్వయించుకొని మనంవిశ్లేషించుకొంటే ఏవ్యక్తి ఐనా తనస్వధర్మాన్ని ఆచరించినపుడే అతనికి అతనివర్ణతత్వపు ఉనికి ఉంటుంది.లేనియెడల ఫలానావ్యక్తి ఫలానా అని ఉనికినిచెప్పడానికి ఆధారందొరకదు. ఉదాహరణకు ఒకరు విద్యార్ధులకు బోధనచేయు వృ త్తిలోఉన్నట్లైతే అతనుబోధించడమేలక్ష్యం,గమ్యం,జీవనవిధానం .అట్లు గాకాతడొకవ్యాపారాన్ని చేస్తుంటె అతదు ఉపాధాడనేఉనికిని ఎట్లాకలిగిఉంటాడు? కావున మాశాస్త్రి ఉటంకించిన విషయం చాల విషయవిష్లేషణాత్మకం. తప్పక అందరం అలోచించాల్సిన సమకాలీనముగాచర్చించదగిన అంశం. మంచి అలోచనాత్మక విషయాంశాన్నిమనకు అందించిన మామిత్రుడు శాస్త్రికి ధన్యవాదములు.

  21. రచన నా మనోభావాలను ప్రతిబింబించింది. నామనసులో మాటలు. నేను రాయలేను. కుతూహలం ఉన్నా ఓపిక లేదు. సౌజన్యా రావు పంతులు గురించి ముప్పాళ్ళ రంగనాయకమ్మ విమర్శ. ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది లో సంస్కరణలు గుడిలో పూజారి ఉథ్థరణితో పోసే తీర్థం లాంటిది. గొంతు తడుస్తుంది దాహం తీరదు. సంస్కర్త తన తో ఏకీభవించిన వారు సరైన మార్గంలో ఉన్నారు ఏకీభవించని వారు వెనుకబడిన వారు ముందు నడిచే వారు భ్రష్టు లు అనుకొంటారు. సతీసహగమనం నిరోథించే సమయానికి విథవావివాహాలు ఊహించని విషయం. అలాగే మధుర వాణి సౌజన్యా రావు పంతులు గారి ని తనకూ వివాహం చేయించి ఉథ్దరించమంటే ఆయన నిర్ఘాంతపోయి వేశ్య లకు వివాహం ఏమిటి అంటారు. వాళ్ళు మనుషులు కానట్టు. అప్పటి కి అది ఊహకందని విషయం. కాలక్రమేణ అదీ సాథ్యపడింది. ఈ రోజు ఊహ కందని విషయం రేపు సంస్కరణలద్వారా సాథ్యపఢవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *