March 29, 2024

ఇద్దరు మనుషులు

రచన:- రామా చంద్రమౌళి

ఆ రోజు ఆదివారం.. మధ్యాహ్నం పన్నెండు దాటిందేమో
పొద్దటినుండీ .. మబ్బు పట్టిన ఆకాశం ఒకటే ఉరుములు .. గర్జనలు
వర్షం ఎప్ప్పుడు మొదలౌతుందో తెలియదు
అతను ఫ్రిజ్ మీది అందమైన బుద్ధుని గాజుబొమ్మను కోపంతో విసిరేసాడు.
భళ్ళున పగిలి అన్నీ గాజు ముక్కలు .. తళతళా మెరుస్తూ
పిల్లలిద్దరూ బెడ్రూంలో నక్కి నక్కి ముడుచుకుపోయి.. నోళ్ళు మూసుకుని,
ఆమె.. చేతిలోని టీ కప్పును నేలకేసి కొట్టింది. ఫెడేల్మని.. పగిలి.. అన్నీ పింగాణీ ముక్కలు
నేలనిండా.. వేడి చాయ్.. పొగలు కక్కుతూ.. అలుక్కుపోయి
అప్పుడప్పుడంతే.. మనుషులు వికటిస్తారు.
ఎండిన పుల్లల్లా విరిగిపోతారు.
ఏకులోనుండి దారమై అవిచ్చిన్నంగా ప్రవహించవలసినవాళ్లు
తెగిపోతుంటారు.

2
ఇద్దరు మనుషులు కలిసి నడవడం .. నీటిలో నీరు కలిసినట్టు జీవించడం అంత సుళువుకాదు
నీటిలో నుంచే పుడుతుంది నీటిబుడగ
క్షణకాలం పొంగిపొంగి భళ్ళున పగిలి పుట్టినచోటనే
మళ్లీ అదే నీటిలో అంతర్ధానం .. జాడే మిగలదు.. అంతా క్షణికం అన్న భావన తప్పితే
ప్రవాహమే జీవితమైన చోట నీటిబుడగలూ.. కెరటాలై విరిగి పడడాలూ.. మామూలే
అతనూ.. ఆమే.. వాళ్లు కూడ అంతే
రెండు వేర్వేరు దారపు పురులు
పెనవేసుకుని తాడుగా మారి . జీవితపు భారాన్ని లాగుతూ
గాలీ, రెక్కా.. రెండింటిలో కదలిక ఎటునుండి ఎటో తెలియదు
అప్పుడప్పుడు .. పయనం సాగుతూ సాగుతూ.. ఏదో చిట్లిపోతుంది.
చెంబులు సొట్లు పోవడమో.. పళ్ళెలు గాలిలోకి ఎగిరి శబ్దించడమో
పిల్లలు బిక్కముఖాలతో మూలలకు నక్కి నిశ్శబ్దమై
కళ్లనిండా .. భయం.. ఆశ్చర్యం.. విభ్రమం.
గలగలా జారే గాజుగోళీల్లా ఉండే అమ్మానాన్న ఎందుకిలా.. అప్పుడప్పుడు
నిప్పు మీద ఉప్పై.. చిచ్చుబుడ్లై .. చిరిగిపోయిన పతంగులౌతారో తెలియదు

అతననుకుంటాడు. ‘ సింక్రనైజ్ ‘ కావట్లేదు.. ఎలక్ట్రికల్ భాష
ఫ్రీక్వెన్సీ వేరూ, తరంగ ధైర్యం వేరు.. వేవ్ లెంత్ వేరు. ఊహూ కలవవు
జీవితం గురించి లక్ష్యాలూ.. గమ్యాలూ.. చింతనా.. వేరు
తననీ ఆమెనీ
చెరువు ప్రశాంతంగానే ఉంది.
అతనే రాళ్ళు విసుర్తాడు అప్పుడప్పుడు
నువ్వు గాత్రమై సాగుతుంటే నేను అ ప్రాధాన్యమే ఐన శృతిలా ధ్వనిస్తున్నాను గదా
రెండెడ్లు .. చెరోవేపు లాగడం వద్దు.. X+X = 2X .. X-X = 0 గదా అంటుందామె
‘ జీవితం లెక్కలు కావు ‘ అని అతడు.. ‘ జీవితమంటే లెక్కలే గదా ‘ అని ఆమె
పురులు పురులుగా తాడు విచ్చుకుంటున్నప్పుడు
వెంటనే ఒక ముడెయ్యాలి
తాడు తెగిపోతోందేమో అని స్పృహించిన మరుక్షణం
మనిషి నిష్క్రమించాలి .. సరిహద్దురేఖ అవతలకు

3
బెడ్రూంలో పాప అంది అన్నయ్యతో
‘ కీర్తన ‘ వినిపిద్దామా అని
వాడు తలూపాడు. మెల్లగా పిల్లిలా నడిచి.. మీట నొక్కి
‘శాంతము లేక సౌఖ్యము లేదు..’ అని శ్రావ్యమైన గొంతు
సన్నని ఒక స్తబ్ద నిశ్శబ్ద జీర తర్వాత
అతను గబగబా బట్టలేసుకుని . కోపంగా బయటికి .. మెట్ల వైపు నడుస్తూ
‘ తన కోపమే తన శత్రువు ‘ అని పాప సన్నగా గొణుక్కుంటున్న సంగతి
ఆమె వినలేదు.
ఆమె ఆ క్షణం పగిలిపోయిన బుద్ధుని వైపు చూస్తోంది
సరిగ్గా అప్పుడే బయట వర్షం మొదలై
ఒకటే ఈదురుగాలి ,
నాన్న బయటికి పోగానే పాప వచ్చి అమ్మ మోకాళ్ళకు చుట్టుకుంది
ఆమె రెండు చేతులూ.. పక్షికూనను పొదుముకున్నట్టు
నిట్టూర్పు ఒకటి తెగిన గాలిపటంలా
కళ్ళు మూసుకుందామె … అలసటగా –

4
పొద్దంతా వర్షమే ఎడతెగకుండా
రాత్రి.. ఎనిమిది దాటి.. అంతా తేమ తేమ.. తడి తడి..
అప్పుడు వినబడింది అతను వస్తున్న అడుగుల చప్పుడు .. మెలమెల్లగా
ఆమె చటుక్కున వెళ్ళి తలుపులు తెరిచింది
కళ్లలోకి చూశాడతడు
తడి.
లోపలికి నడిచాడు .. పిల్లలు దీనంగా చూస్తూ
కళ్లనిండా తడి
తనలో కూడా తడి ఉందా.. వెదుక్కుంటున్నాడతడు
బయట వర్షం కురవడం ఆగిపోయి
అతనాలోచిస్తున్నాడు .. సంయమనంతో
మనుషుల మధ్య కొంచెం ఎడబాటు .. కొంచెం దూరం.. కొంచెం ఖాళీ
పశ్చాత్తాపాన్ని హృదయానికి లేపనంగా పూస్తూ.. కాలం గాయాలను మాన్పుతుందా –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *