March 29, 2024

తిక్క కుదిరింది… గొలుసు కథ

తిక్క కుదిరింది.. గొలుసు కథ

1

రచన: రజనీ శకుంతల

సుమలత మంచి సింగర్ ” ఎంత అంటే పుట్టిన వెంటనే తన ఏడుపు కూడా స—-రి— గ—మ –ప —లానే రాగయుక్తంగా ఏడిచిందని ఆమె తల్లి అరుంధతి ఇప్పటికి ఏడు లక్షల ఒకటోసారి చెప్పింది. ఇంకా చెప్తోనే ఉంది. ప్యూచర్ లో కూడా చెప్తూనే ఉంటుంది.
ఇంత రిధమిక్ గా ఏడవబట్టే మూడో సంవత్సరానికే సంగీతం క్లాస్ కి పంపింది.తల్లి. అలా అలా స్వరాలు వగైరా నేర్చేసుకుని మంచి సింగర్ అయింది.
అయితే ఇటీవల కాలంలో టీవీ షోలు వచ్చేసి ప్రతీ ఛానల్ లోనూ గంట సేపు చిన్నపిల్లల దగ్గరనుండి పాడించేస్తున్నారు..
మన సుమలత కూడా ట్రై చేద్దామనుకుంది. కానీ అవన్నీ హైదరాబాద్ ఛానల్స్ అవడంతో అందరూ పాల్గోవడానికి హైదరాబాదే రావాలన్నారు.
వీళ్లుండేది రావులపాలెం. ట్రైన్ ఖర్చులు, హొటల్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు అన్నీ లెక్కవేసుకున్న అరుంధతి “వామ్మో! “ఇంత ఖర్చా?” అంటూ వెనకంజ వేసింది.
దాంతో సుమలత పాటలు బాగానే పాడగలిగింది. కాని టీవీ షోల లో పాల్గొనలేక పోయింది. ఏవో బర్త్ డే పార్టీలకి, గుళ్ల ల్లోనూ చిన్న చిన్న ఫంక్షన్స్ లలోను కచేరీలు చేసేది.
ఇలా ఉండగా యుక్తవయసు రాగానే సుమలతకు పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి. హైదరాబాద్ సంబంధం అనగానే ఎగిరి గంతేసింది సుమలత. పెళ్లికొడుకు గంగిరెద్దులా ఉన్నాకూడా ఒప్పేసుకోవాలని డిసైడ్ అయింది.
నిజానికి మన హీరో గిరీశం అనాకారేమి కాదు. నల్లని క్రాఫ్ నవ్వితే సెక్రటరీలో రాజశేఖర్ లా గిలిగింతలు పెట్టే నవ్వు…… అయిదంకెల జీతం… అన్నీ ప్లస్ పాయింట్సే
ఇంకేంటీ!
మన సుమలత తలాడించడం మెళ్లో మూడుముళ్లు వేయించుకోవడం ఠకఠకా పెళ్లి, ఆ తర్వాత తంతూ అన్నీ చకచకా జరిగిపోయాయి.

——— ——— ———- ———- —–

పెళ్లయిన నెలా, రెండు నెలలు తనసలు సింగర్ అన్న విషయమే మరిచిపోయింది సుమలత.
హనీమూన్ ,సినిమాలు, హొటల్స్ —అనే భర్తే తన ప్రపంచం.
ఒక రోజు టీవీ లో “పాడుతా తీయగా” ప్రోగ్రామ్ చూసి మర్చిపోయిన కోరిక రెట్టింపు అయింది సుమలత మదిలో
ఆ రాత్రి భర్తను గోకింది ” ఏమండీ! నేను టీవీలో పాడతానండీ! అని,
గిరీశం ఒకే అన్బాడు
ఇక మర్నాటినుండే సుమలత ఆడిషన్స్ కి వెళ్లడం మొదలెట్టింది. అలా అలా అలా మొత్తానికి
సుమలత సింగరై వెలిగింది.
అప్పుడప్పుడు టీవీ షో లే కాదు. ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చే స్థాయికి ఎదిగింది.
అప్పుడే
సరిగ్గా — అప్పుడే — సుమలత మదిలో ఓ కోరిక తొలవడం మొదలయింది.
అది పెరిగి పెరిగి పెద్దదయింది.
అదే — సన్మానం—
తను ఇంత చక్కగా పాడుతోంది. తనకెవరూ సన్మానం చేయరేంటి? సన్మానాలు అవార్డులు వస్తే ఇంకా పేరొస్తుంది కదా ! అనుకుంది.
అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాలనుకుంది.
వివరాలు సేకరించింది
అయితే చిత్ర విచిత్రమయిన. సంగతులు తెలిసొచ్చాయి మన సుమలత కి

——- ——- ———– ———
ఓ రోజు ఫలానా “కళాపీఠం” సంస్థ నుండి వాసుదేవరావు వచ్చాడు. మేడమ్! మీకు సన్మానం చేస్తాము అంటూ..
” ఓ! నిజమా!” ఎగిరి గంతేయాలనుకున్నా బాగోదనుకుని తలాడించింది .
అతను అన్నీ కనుక్కుని, ఫలానా తేదీన రవీంధ్ర భారతిలో ఉంటుంది తప్పకరండి” అన్నాడు.
ఓ! యస్! అందామనుకుని, మరీ బాగోదని— వస్తా! అని సింపుల్ గా చెప్పింది.
అయినా అతను వెళ్లకుండా చేతులు నలుపుకుంటూ అక్కడే ఉన్నాడు.
“ఏంటయ్యా–? అంది అయోమయంగా అర్ధంకాక
“మరీ ” మరీ—! సన్మానం అంటే చాలా ఖర్చులుంటాయి కదా! మేడమ్! — అందుకని –అందుకని నసుగుతున్బాడు.
“ఆ! అందుకని? “మొహం క్వొశ్చన్ మార్క్ లా పెట్టి అడిగింది సుమలత.
“”ఓ అయిదు వేలు సర్దితే! –అసలు విషయం బయట పెట్డాడు.
“అయిదు వేలా? — తెల్లబోయింది సుమలత
“అవునండి! — మరి దండలు తేవాలి, షీల్డులు కొనాలి, శాలువాలు, బొకేలు కొనాలి, వెన్యూకి హాలు బుక్ చేయాలి. అద్దె కట్టాలి కదండి..”
“”ఆపు!” అని గట్టిగా అరిచింది సుమలత.

***********

2
జ్యోతి వలబోజు

కళ్లు ఎర్రబడి, కోపం, ఆవేశంతో గట్టిగా అరిచింది సుమలత వాసుదేవరావు మీద.
“అసలు నేను నిన్ను పిలిచానా నాకు సన్మానం చేయమని? నీ అంతట నువ్వే వచ్చి సన్మానం చేస్తా అని వీటన్నింటికి డబ్బులు నన్నే ఇమ్మంటావా? గెటవుట్. నా డబ్బులెట్టి వేరేవాళ్లతో సన్మానం చేయించుకోవాల్సిన ఖర్మ కాని, దురద కాని నాకు లేవు. పో” అంది.
సుమలత కోపం చూసి భయపడిపోయిన వాసుదేవరావు బ్రతుకుజీవుడా అనుకుంటూ తన బాగు పట్టుకుని లగెత్తుకున్నాడు.
కోపంతో, ఆయాసంతో సోఫాలో కూర్చున్న సుమలత అరగంటకు కాని మామూలు మనిషి కాలేదు. భర్త గిరీశం ఆఫీసునుండి వచ్చి తెరిచి వుంచిన తలుపులు చూసి పరుగుపరుగున లోపలికి వచ్చి సుమలతను చూసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు.
“సుమా డార్లింగ్.. ఏమైందిరా? ఏం జరిగింది? ఎవరేమన్నారు?” అంటూ ప్రేమగా అడిగాడు.
అప్పటికి కాస్త తేరుకున్న సుమలత జరిగింది చెప్పింది.
“యావండీ! మీరే చెప్పండి. నాకు టాలెంట్ లేదా? చిన్నప్పటినుండి ఎంత ఇష్టంగా సంగీతం నేర్చుకున్నాను. ఎన్ని కచేరీలు చేసాను. పెళ్లయ్యాక కూడా ఎన్ని టీవీ ప్రోగ్రాములు చేసాను. మీరు కూడా చూసారు కదా. ఇప్పుడు నాకు సన్మానం చేస్తామని వచ్చి నన్నే డబ్బులు పెట్టమంటున్నారు. ఇంత అవమానమా? “ అంటూ కొంచెం కోపంగానే చెప్పింది.
“పోనీలేవే వాళ్లకు అలా డబ్బులు తీసుకుని సన్మానాలు చేయడమే ఒక వ్యాపారం. దానిమీద వచ్చిన డబ్బులతోనే వాళ్ల కుటుంబాలు గడిచేది. చాలామంది డబ్బులిచ్చే సన్మానాలు చేయించుకుంటారు. నువ్వెందుకు అలా ఫీల్ అవుతావు. పద సినిమాకు వెళదాం” అనునయిస్తూ అన్నాడు.
“ సినిమా వద్దులెంఢి. నేను బానే ఉన్నాను. పదండి కాఫీ తీసుకొస్తాను. మీరు ఫ్రెష్ అయ్యి రండి” అంటూ లేచి కిచెన్ లోకి వెళ్లింది.
ఆరోజు , మరునాడు , ఆ మరునాడు కూడా సుమలత తన పని చేసుకుంటూనే తీవ్రంగా ఆలోచించసాగింది. గిరీశం గమనించి తనే చెప్తుందిలే అని ఊరకున్నాడు.
నాలుగోరోజు ఆదివారం పొద్దున్నే అయిదుగంటలకు భర్తను తడుతూ లేపింది సుమలత.
ఎలాగూ ఆఫీసు లేదు కదా అని హాయిగా గుర్రుపడుతూ నిద్రపోతున్న గిరీశం ఉలిక్కిపడి లేచాడు.
“ఎందుకే ఆదివారం పూట ఇంత పొద్దున్నే లేపుతావు. నన్ను పడుకోని తొమ్మిదిగంటలకు లేచాక మాట్లాడుకుందాం ఏదైనా” అని మళ్లీ పడుకుండిపోయాడు.
“ యావండి! యావండి! తొందరగా లేవండి. అర్జెంటుగా మీకో విషయం చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. నిద్ర తర్వాత . లేవండి.” అంటూ దుప్పటి లాగేసి చేయిపట్టి లేపి కూర్చోబెట్టింది.
“ఏంటే నీ గోల? సరే చెప్పు” తప్పనిసరై వినడానికి తయారయ్యాడు గిరీశం.
“నేను చిన్నప్పటినుండి మంచి మేష్టారు దగ్గర సంగీతం నేర్చుకున్నాను. కచేరీలు చేసాను. పెళ్లయ్యాక టీవీ ప్రోగ్రాములు కూడా చేసాను. అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి కదా. మరి ఇంత టాలెంట్ ఉన్నా నన్ను గుర్తించి ఎవరూ సన్మానం చేయడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా.” అంది సుమలత.
“ఏంటి పాటలు పాడ్డం మానేస్తున్నావా? వంటలు చేయడం నేర్చుకుంటావా?” అన్నాడు ఆశగా. ఈ పాటల గోలలో పడి సరిగ్గా వంట కూడా చేయడం లేదు. రుచీపచీ లేని వంటలు తిని బేజారెత్తిపోయాడు గిరీశం. కోప్పడితే ఫీలవుతుందేమో పాపం అని ఇంతకాలంగా సర్దుకుపోతున్నాడు.
“నేనెందుకు మానేస్తాను. ఇన్నేళ్లనుండి పాటలు పాడుతున్నా కదా. నాకు సంగీతం కూడా బాగా వచ్చు. నా వాయిస్ కూడా బావుంటుందనే ఎన్నో బహుమతులు, అవార్డులు ఇచ్చారు కదా. మీరు కూడా చూసారు. అదిగో హాల్లో షెల్ఫ్ లో గ్లాసులు, కప్పులు, డిన్నర్ సెట్లు తీసేసి పెట్టినవన్నీ అలా వచ్చిన షీల్డులు, ట్రోఫీలు. ఇంత చేసినా నాకు సన్మానం చేయడం లేదు ఎవరూ. అందుకే ఓ కొత్త ఆలోచన వచ్చింది. “ అంది
“ఏంటది?” గిరీశం మొహం మీద ఎటువంటి భావం లేకున్నా ఏం ఉపద్రవం తెచ్చిపెడుతుందో అని మనసులో పీకుతూనే ఉంది.
“మరేమో! నేను కవితలు, పాటలు రాయాలనుకుంటున్నాను. సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి అవి ఎలా ఉండాలో బాగా తెలుసు. వేరేవాళ్లు రాసినవి నేను పాడే బదులు, నేనే రాసుకుని, నేనే స్వరపరుచుకుని పాడితే ఇంకా పెద్ద పేరొస్తుంది. ఆ వెంటనే సన్మానం చేస్తామని మనం నిద్ర లేవకముందే జనాలు మనింటిముందు క్యూలు కడతారు చూడండి.” హుషారుగా చెప్పింది సుమలత.
కాని గిరీశం మొహం మాత్రం మాడిపోయిన పెసరట్టులా మారింది.
అది గమనించినా పట్టించుకోనట్టే “ మీరు తొందరగా స్నానం చేసేసి, టిఫిన్ చేసి కాస్త బజారులన్నీ తిరిగి పాత తెలుగు, హిందీ పాటల పుస్తకాలన్నీ కొనుక్కురండి.. ఇదిగోండి నా ATM కార్డు.” అంటూ చేతిలో పెట్టింది.
“వార్నీ! ఇన్ని రోజులనుండి నా సొమ్ముతో ప్రోగ్రాములు చేసి, ఖర్చులన్నీ నాతో పెట్టించి ఇప్పుడు కార్డు బయటకు తీసింది. ఇందులో ఎంత సొమ్ముందో. కట్నం ఇవ్వలేమని చెప్పిన అత్తగారు ఎన్ని లక్షలు దాచారో చూడాల్సిందే.” అనుకున్నాడు.
“బంగారం! ఇప్పుడు అయిదున్నరే అయింది. ఇంకా చీకటిగానే ఉంది. ఇంత పొద్దున్నే స్నానం చేసి పుస్తకాలకోసం వెళ్లడం అవసరమా? అసలు ఇంత పొద్దున్నే కాకున్నా ఇంకో గంటకు కాని కిరాణాషాపు వాడు మాత్రం తెరుస్తాడు, పుస్తకాల షాపులవాళ్లు ఎందుకొస్తారే పిచ్చిదానా?” అన్నాడు కాస్సపు పడుకుందామని.
సుమలత వినే రకమేనా?. పట్టువదలని విక్రమార్కుని నాలుగో బామ్మరిది తమ్ముడి కూతురాయే.
“మీరు ఇప్పుడు లేచి స్నానం చేసి టిపిన్ కాఫీలు చేసుకునేసరికి తొమ్మిదీ పది అవ్వొచ్చు. దుకాణాలు మూసి ఉన్నా ఫుట్ పాత్ పుస్తకాల షాపులు మాత్రం ఇవాళే తెరిచి ఉంటాయి కదా. స్కూటర్ మీద అన్ని వీధులు తిరగండి. పాత హిందీ తెలుగు పాటల పుస్తకాలు తీసుకురండి” అని చెప్పింది నిక్కచ్చిగా.
“పాత పాటల పుస్తకాలేం చేస్తావే. కొంపదీసి ఎవరికీ తెలియని పాటలు తీసుకుని నువ్వే రాసా అంటావా ఏంటి?” అన్నాడు అర్ధం కాక.
“నేనలా ఎందుకు చేస్తాను?. ప్రతీ పాట నుండి ఒకో లైన్ తీసుకుని ఒక్కచోట చేరిస్తే మరో అద్భుతమైన పాట తయారవ్వదా? సింపుల్.. మీరు తొందరగా లేచి వెళ్లండి. నేను మీ కిష్టమైన పెసరట్టు ఉప్మా చేస్తున్నా. ఎప్పట్లా మాడ్చకుండా దోరగా, కరకరలాడేట్టు రోస్టు చేసి పెడతానులెండి” అంటూ ప్రసన్నమైన మొహంతో బెడ్ రూమ్ నుండి వెళ్లింది.
తప్పదన్నట్టు లేచి స్నానం కానిచ్చి, టిఫిన్ పూర్తి చేసి తన స్కూటర్ తీసి హైదరాబాదు, సికిందరాబాదులో ఉన్న వీధులన్నీ తిరిగి ఫుట్ పాత్ దుకాణాలన్నీ వెతికి వెతికి పదికిలోల పుస్తకాలు పట్టుకొచ్చి ఉస్సూరుమంటూ ఇంట్లో పడేసాడు గిరీశం.
అప్పటికే ఒక రూమ్ శుభ్రం చేసి ఒక టేబుల్, కుర్చీ, పెన్ను పేపర్ వగైరాలు కూడా రెడీ చేసుకుంది సుమలత. తలారా స్నానం చేసి తయారై అదే రూమ్ లో ఒక పక్క సొరుగులో సరస్వతిదేవి మట్టి విగ్రహం పెట్టి దీపం, అగరుబత్తీ కూడా పెట్టి పూజ కూడా చేసింది. భర్త మీద అంత నమ్మకం మరి.
భర్త నిద్రపోయినా లేపకుండా ఆరుగంటలకే రాత్రి వంట పూర్తి చేసుకుని “జై శ్రీరాం” అనుకుంటూ రాయడానికి ఉపక్రమించింది సుమలత….

**********

3
ఉమాదేవి కల్వకోట


ముందు దేవుడికి ప్రార్థన చేసి కవితలు రాయడం మొదలెట్టాలనుకుంది సుమలత. మొదట విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి కదా అనుకొని హు. . . హుహూ అని ఒకసారి గొంతు సవరించుకుంది. ఒకసారి దగ్గింది. మరి ఎంతైనా సంగీత విధ్వాంసురాలు కదా!”శుక్లాంబరధరం విష్ణుం “అంటూ ప్రార్థన ప్రారంభించింది సుమలత. . . కాబోయే గొప్ప కవయిత్రి ఆల్రెడీ గొప్ప సంగీత విధ్వాంసురాలు. ఇక మన గిరీశం పాపం ప్రొద్దునంతా పాటల పుస్తకాల వేటలో ఊరంతా తిరిగొచ్చాడేమో ఎండలో. . ఒళ్ళెరక్కుండా నిద్రపోయాడు. ఎక్కడినుండో చక్కని గొంతుతో పాడుతున్న పాట విని గబాల్న లేచి కూర్చున్నాడు. ఎవరబ్బా ఇంత చక్కగా పాడేది అనుకునే లోపల “సరస్వతీ నమస్తుభ్యం”” అంటూ రికార్డు మారిపోయింది. “ఓ! ఇది మా సుమా డార్లింగ్ గొంతే” అనుకున్నాడు. కవితలు రాయాలనే ఆలోచన మానుకొని ఎంచక్కా సంగీత సాధన చేస్తున్నట్లుంది”అని ఆనందపడుతూ. . . లేస్తూ గది బయటకు వచ్చి ఇంకో గదిలోకి తొంగి చూసాడు.
సుమలత అరమోడ్పు కన్నులతో, తన్మయత్వంతో పాడుతోంది. “ఏంటి డార్లింగ్! ఛాలా రోజులకు మళ్ళీ సంగీత సాధన మొదలెట్టినాట్లున్నవ్. వెరీగుడ్”అంటూ భుజం మీద చెయ్యేసాడు గిరీశం. ” సంగీతసాధన కాదూ , ఏంకాదు కవితలు రాయడం మొదలెట్టేముందు దేవుడిని ప్రర్ధిస్తున్నానంతే. ఓ రెండుమూడు గంటలు నన్నుడిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి” అంటూ గిరీశం చెయ్యి విసిరికొట్టింది సుమలత.
“హు. . . అనుకున్నది చెయ్యడమే కానీ,ఇదెక్కడ మానుతుందీ. . అసలే పట్టు వదలని విక్రమార్కుడి నాలుగో బామ్మర్ది తమ్ముడి కూతురాయె, ఇక ఇక్కడ వుండకపోవడమే బెటర్ ” అనుకొని బయటకు వెళ్ళిపొయాడు గిరీశం.
తిరిగి తొమ్మిదింటికి ఇంటికొచ్చాడు. అమ్మగారింకా గదిలోనే వుంది. గిరీశం కడుపులో ఎలుకలేకాదు. . . ఏనుగులు, ఒంటెలు కూడా పరుగెత్తుతున్నాయి. మెల్లిగా సుమలత దగ్గరికి వెళ్ళాడు. “సుమా! పాపం చాలా అలసిపోయినట్లున్నావు. భోంచేద్దామా!”అడిగాడు గిరీశం భయం భయంగా. నిజంగానే సుమలతకు ఆకలి గుర్తొచ్చింది. “సరే పదండి”అంటూ కాగితాలబొత్తి పక్కకు పెట్టి,లేచి, అలసటతో ఒళ్ళు విరుచుకుంది. ఒక్కసారి గదంతా చూసాడు గిరీశం. గది నిండా కాగితపు వుండలే. సినిమాలలో హిరో,హీరోయిన్ కి మొదటిసారి ప్రేమలేఖలు రాసి పడేసినట్లున్నాయి. “కవితలు చాలానే రాసినట్లున్నావ్. “అన్నాడు.
“ఆ. . . ఏవో కొన్ని రాసానుకానీ,అన్నం తినగానే మంచమెక్కకండి. కవితలు విందురుగానీ. మధ్యాహ్నం బాగా పడుకోనిచ్చానందుకే. “అన్నది సుమలత.
“ష్!!! దేవుడా! మళ్లీ ఇదొకటా! ” అని మనసులో అనుకొని “ముందు పద! భోంచేద్దాం” అని ఇద్దరూ గది బయటకు వచ్చారు. మొత్తానికి భోజనాలు ముగించారు. గిరీశం హాల్లోకి వచ్చి, టీవీ పెట్టుక్కూర్చున్నాడు. ఇక సుమలత గబగబా తోమడానికి వెయ్యాల్సిన గిన్నెలు ఫ్రిజ్ లోకి, ఫ్రిజ్లో పెట్టాల్సిన గిన్నెలు వాష్ ఏరియాలో పాడేసి, వంటిల్లు సర్దాననిపించి, తాను రాసిన కవితలతో హాల్లో కి వచ్చింది. భర్తకు ఎదురుగా సింగిల్ సోఫాలో కూర్చొని మొదలెట్టింది కవితలు చదవడం. మొదటిది దేశభక్తి కవిత. “పాడవోయి భారతీయుడా” అనే పాటలోనివి కొన్ని లైన్లు, “దేశమ్ము మారిందోయ్,కాలమ్ము మారిందోయ్”పాటలో కొన్ని లైన్లు, “వుందిలే మంచీ కాలం ముందూముందునా” అనే పాటలోనివి కొన్నిలైన్లు కలిపి ఓ పేద్ద కవిత రాసింది. . . . . . కాదు కాదు తయారు చేసింది.
ఆ కవిత చదవడం పూర్తి కాగానే, “ఎలావుంది” అని అడిగి గిరీశం సమాధానం చెప్పేలోగానే,”నాకెందుకో ఈ నా కవిత ఏదైనా సినిమాలో పెడ్తే, జనగణమన లాగా ఒకగొప్ప జాతీయగీతం స్థాయికి చేరుకుంటుందేమో ననిపిస్తోందండీ!”అన్నది సుమలత ఆనందంగా. “ఆఆ” హాశ్చర్యంగా నోరు తెరవబోయి,”నా కవిత బాలేదన్న వాణ్ణి కత్తితో పొడుస్తా, నాది కవితే కాదన్నవాణ్ణి తెగేసి నరుకుతా”అని శ్రీలక్ష్మి డైలాగు కొడ్తుందేమోనని గట్టిగా తన నోరు అదిమిపట్టాడు పాపం గిరీశం. ఇలాంటివే ఇంకోరెండు ప్రేమ కవితలు తయారు చేసింది. అవి విన్నాక ఇక వూరుకోవడం గిరీశం వల్ల కాలేదు. ఎంతైనా తన అందాల భార్య నలుగురిలో నవ్వుల పాలవడం భరించలేడు కదా! చివరకు “బాగున్నాయాండీ” అని అడిగిన భార్యతో,”చూడు సుమా! నీకెందుకీ కష్టాలు చెప్పు. . . ఏ కళలో ప్రావిణ్యం వుంటే దానినే అభివృధ్ధి చేసుకోవాలి. లతా మంగేష్కర్ గారు, మన సుశీలమ్మగారు పాటలు బ్రహ్మాండంగా పాడతారు, మరి వాళ్ళని బొమ్మలు వేయమంటే వెయ్యగలరా చెప్పు!అలాగే ఎమ్.ఎఫ్. హుస్సేన్ గారిని, బాపు గారిని పాటలు పాడమంటే పాడేవారా చెప్పు. అలాగే నువ్వూ నీ సంగీతాన్ని ఇంకా సాధన చెయ్యి. ప్రతిభకి ఎప్పుడూ గుర్తింపు వుంటుంది. నువ్వు కోరుకునే సన్మానాలు వాటంతట అనే జరుగుతాయి”అని సుదీర్ఘ డైలాగు కొట్టి, చాలా మంచి మాటలు చెప్పానని సంతోషంగా గాట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు గిరీశం.
“చాల్లెండి!ఇక ఆపుతారా! అయినా మొరటోడికేం తెలుసు మొగలిపూల వాసన అన్నట్లు, మీకేం తెలుసు కవిత్వం గురించి, అయినా మీలాంటి వాళ్ళకు నా కవితలు వినిపించాలనుకోవడం నాదే నాదే బుధ్ధి తక్కువ”అంటూ ఆ కాగితాలబొత్తి తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళి కోపంగా, గట్టిగా తలుపేసుకుంది సుమలత.
“హమ్మా హమ్మ! ఎన్నేసి మాటలంది తనని,అదీ మొగుణ్ణి పట్టుకొని. ఇక నా పని సుమాపతీ! నీకిక సోఫాయే గతీ”అనుకుంటూ హాల్లోనే పడుకుండిపోయాడు పాపం ఆ మానవుడు.
తెల్లవారిన తరువాత టిఫిన్ అవీ కూడా కూడా వుండవేమో అనుకున్నాడు కానీ,టిఫిన్ , లంచ్ బాక్స్ అన్నీ సిద్ధం చేసింది సుమ. “ఏమాటకా మాట, ఏ గొడవలెలా వున్న తనని కావాల్సినవన్నీబానే సమకూరుస్తుంది నా సుమ”అని మనసులోనే బోల్డు ఆనందపడిపోయాడు గిరీశం.
టిఫిన్ తింటున్న గిరీశంతో సుమలత”మీరు వెళ్ళెప్పుడు ఓ రెండో మూడో వేలు నా మొహాన కొట్టి వెళ్ళండి, పత్రిక ఆఫీసులకెళ్ళి రావాలి”అన్నది సుమలత.
“నిన్న నీ ఏటిఎం కార్డు ఇచ్చావుకానీ, పిన్ నంబర్ చెప్పనేలేదు. నా ఎకౌంట్ నుండే తెచ్చాను డబ్బు “అన్నాడు గిరీశం.
“అమ్మయ్య చెప్పలేదుకదూ! కార్డ్ ఎందుకిచ్చావని తిట్టింది మా బామ్మ” అన్నది సుమలత సంతోషంగా.
“ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు గిరీశం.
“ఎందుకంటే . . . అసలూ భర్త అంటే ఎవరు చెప్పండి” అడిగింది సుమలత.
“భర్త అంటే బాధ పడేవాడు”అని గబాల్న నాలుక కరచుకున్నాడు గిరీశం.
“ఏమన్నారూ?” ఆడిగింది సుమలత. గిరీశం అదృష్టంకొద్దీ సుమకి ఆ మాటలు సరిగ్గా వినబడలేదు.
“అదే!! భరిచేవాడు అని అర్థం”అని ఉఫ్ అని ఊపిరి బయటకు వదిలాడు గిరీశం.
“మరి నా ఖర్చులూ,వెచ్చాలు అన్నీ మీరేగా భరించాలి మరి, ఏదీ నా ఏటీఎం కార్ద్? నాకిచ్చెయ్యండి. ” అన్నది సుమలత.
“హమ్మా బామ్మా!ఈ కుట్రలూ ,కుతంత్రాలు అన్నీ నీవేనన్నమాట” మనసులోనే ఊరిలో వున్న బామ్మ మీద పళ్ళు నూరాడు గిరీశం.
“సరే! మరి నేను వెళ్ళొస్తాను. డబ్బు టీవీ మీద పెట్టాను”అని బయలుదేరాడు గిరీశం.
గిరీశం వెళ్ళగానే టిఫిన్ చేసి రెడీ అయ్యి, ఆటో తీసుకొని “తొలిజాము”పత్రిక ఆఫీసుకి బయలుదేరింది సుమలత.
ఎడిటర్ ని కలవడం కుదరదు, సబ్ ఎడిటర్ ని కలవమన్నాడు ఓ శాల్తీ. సబ్ ఏడిటర్ దగ్గరికెళ్ళి తాను వచ్చిన పని చెప్పింది. ఇప్పటికే చాలా కవితలు ఉన్నాయి. టైం పడుతుంది. ఇచ్చి వెళ్ళమన్నాడు సదరు సబ్ ఎడిటర్.
“మరీ పాతబడిపోతే ట్రెండు మారిపోతుంది. తొందరగా అచ్చయ్యేలా చూడండి. ఈ నా కవితలతో మీ పత్రిక దశే మారిపోతుంది. మీరొకసారి చదివి చూడండి” అని అక్కడే కూర్చుండిపోయింది సుమలత.
“తల్లీ! నేను తరువాత చదువుతాను తప్పకుండా” అని ఎలాగోలా సుమలతని పంపిచేసాడు అతను.
బయట బాగా ఎండగా వుండడంతో వరండాలో వేసివున్న కుర్చీలో కాస్సేపు కూర్చొని, ఆ సబ్ ఎడిటర్ కి మరోసారి గుర్తు చేద్దామని లోపలికి వెళ్ళింది సుమలత. అతను బిజీగా పని చేసుకుంటున్నాడు. ప్రక్కనే ఓ చెత్త బుట్ట వుంది. అనుకోకుండా దానివైపు చూసిన సుమలత కెవ్వుమని అరిచింది. ఆ హాల్లో వున్న వాళ్ళంతా ఆ కేకకి వులిక్కిపడి లేచి నించున్నారు.
“నువ్వు మళ్ళీ వచ్చావేంటమ్మా. . . అయినా ఆ కేకలేంటి? గుండె జబ్బున్న వాళ్ళెవరైనా వుంటే, టపా కట్టేసేట్టు”అరిచాడు సబ్ ఎడిటర్.
“అసలు మీకు కొంచెమైనా కళాభిమానం వుందా? వుంటే నేనలా వెళ్లగానే నా కవితలు అలా చెత్తబుట్ట పాలు చేస్తారా!అసలు ఒక కవి కష్టం మీకు తెలుసా? ఓక స్త్రీ ప్రసవవేదన పడి, తన బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావడానికి ఎంత యాతన పడుతుందో, అంతకంటే ఎక్కువ కష్టపడితేనే ఓ కవి కలం లోనుండి ఓ కవిత పుడుతుందని మీకు తెలుసా?”అంటూ అపర కాళికలా విరుచుకుపడింది సుమలత. అంతటితో ఊరుకోలేదు. తనక వచ్చిన తిట్లూ,వాళ్ళ బామ్మకి కోపం వచ్చినప్పుడు తిట్టే తిట్లన్నీగుర్తు చేసుకుని మరీ తిట్టింది. ఆ ధాటికి తట్టుకోలేక ఆ సబ్ ఎడిటర్ సొమ్మసిల్లి, టేబుల్ మీద తల వాల్చేసాడు. చెత్తబుట్టలోనుండి తన కవితల కాగితాల బొత్తి తీసుకొని,”అసలు ఇలాంటి చీప్ పత్రికకు నా కవితలు ఇవ్వనే ఇవ్వను “అంటూ బయటకు వచ్చింది మన అపర కాళిక. . . . అదే మన సుమలత.
**********

4
చెంగల్వల కామేశ్వరి

బయటకు రానైతే వచ్చింది కాని సుమలతకు చాలా అవమానంగా అనిపించింది.
తను ఎంత కష్టపడి రాసింది? ఎన్ని పాటలు రిఫర్ చేసింది? అయినా తను సాధించాల్సిన లక్ష్యం నెరవేరలేదు
అనుకుంటూ వాడిపోయిన మొహంతో ఇల్లు చేరింది.
ఇంటికి వచ్చేసరికి గిరీశం తన కోసమే ఎదురు చూస్తున్నాడు.
సుమలతని చూడగానే ” సుమా సుమా! అంటూ దగ్గరికి వచ్చి ఆమెను గాల్లోకి అమాంతం లేపి గిర గిరా తిప్పాడు ఆ తిప్పడంలో పట్టుతప్పి ఇద్దరూ కిందపడ్డారు.
మొగుడి మోట సరసానికి ఒళ్లు మండింది.
“ఏమిటండీ !” అని ఏడుపు గొంతుతో అడిగిన సుమలత మాటకి “పూవునంటిన తావిలా మన ఇంటిలో పనిమనుషులు కూడా కవయిత్రులు అయిపోతున్నారు.
“మన పనిమనిషి గౌరికి సన్మానం చేస్తారుట ” మన కాలనీవాళ్లు” అది నీ పేరే చెప్పిందిట దాని అభివృద్ది కారణం” అన్నభర్త మాటలకి పిచ్చెక్కినట్లయింది.
“దా —” ని— “కి” సన్మానమా? ఎందుకు? అనడిగింది. అయోమయంగా.
దానికి జవాబుగా “నువ్వు రాసి పడేసిన కవితలు, పాటలు ఏరుకునెళ్లి అది పాడుతూ పనిచేస్తుంటే ఆ రామారావుగారి అబ్బాయి విని వీడియో తీసి అది యూట్యూబ్ లో పెట్టాడుట! బాహుబలి ముప్పయ్యో భాగంలో పాటలు అదే పాడుతోందిట! అలా అది ఫేమస్ అయిపోయిందని కాలనీవాళ్లు దానికి పట్టుచీర వెండికిరీటం చేయించి సన్మానం చేస్తారుట! నన్ను కూడా చందా వెయ్యి ఇవ్వమన్నారు “.
అది వినగానే సుమలతకి తల్లో చీమలు కుట్టినట్లు అయింది.
“అయితే నన్నెందుకు ఎత్తుకు తిప్పి కింద పడేసారు” ఉక్రోషంగా అర్చింది.
“మరి— దాన్నెలా ఎత్తుకు తిప్పుతాను?
వాళ్లాయన చంపుతాడు కదా! అందుకే ఒక పనిమనిషిని అంతదాన్ని చేసిన నీ సహృదయానికి
మెచ్చి ఎత్తాను కాని మోయలేకపోయాను” సారీ! అని అంటున్న గిరీశం మాటలు ఇంకా
చిర్రెత్తించాయి.
అసలే పత్రికాఫీసులో జరిగినదానికే బాధపడుతుంటే, తన రాతలు పట్టుకుపోయి, పాడేసి సన్మానం చేయించుకుంటున్న గౌరి అదృష్టానికి ఏమనుకోవాలో ! అర్ధం కాలేదు.
గిరీశానికి కూడా భార్యని చూసి జాలేసింది.
లోపలికి వెళ్లి మంచినీళ్లు పట్టుకొచ్చి ఇచ్చాడు.
ఆ నీళ్లు గటగటా త్రాగేసి గ్లాసు కింద పెడుతుండగా సుమలతకి ఒక ఆలోచన వచ్చింది. ఆ పిచ్చి గౌరికి సన్మానం యూట్యూబ్ వీడియోలో ఎవరో ఎక్కిస్తే కదా అది పాపులర్ అయింది.
తను ఇలా వీడియోలో మంచి మంచి రిస్సార్ట్స్ లో అందమయిన చీరలు కట్టుకుని, తన పాటలు ఒక వీడియో కవితలు ఒక వీడియోలోను తీయించి అన్ని టీవీ ఛానల్స్ లోను టెలికాస్ట్ చేయిస్తే! ఆ ఛానల్స్ ఎలాగు చెరకు పిప్పి నమిలినట్లు మాటి మాటికి తన ప్రొమోస్ చూపిస్తుంటే తను ఫేమస్ అవడం ఖాయం.,! విదేశాలలో ఉన్న తెలుగువారు తనకి వీసా టికెట్స్ బుక్ చేయించి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ పెట్టిస్తారు. ఈ ఆలోచన రాగానే తన తెలివికి తానే మురిసిపోతూ పకపకా నవ్వుతూ గిరీశాన్ని పట్టుకుని పైకి ఎత్తేసి గిరగిరా తిప్పేసింది. ఆ అదుటికి పడబోయి తప్పించుకున్నగిరీశం హడలిపోయాడు.
కంగారు అణచుకొని భయంగా సుమలతని” చూస్తూ”నీకేమయిందే! పిచ్చి గాని ఎక్కలేదు కదా! నీ సన్మానం పిచ్చి మండినట్లే ఉంది “ అని అంటున్న గిరీశాన్ని కొంచెం ముద్దు చేస్తూ గెడ్డం పట్టుకుని అతని క్రాఫ్ చెరిపేస్తూ, మెల్లగా తనకొచ్చిన ఆలోచన చెప్పింది.
అది విన్న గిరీశం నువ్వు చెప్పింది బాగానే ఉంది. బోలెడు డబ్బు ఖర్చు కదా,! అంతకన్నా నేనే అరేంజ్ చేస్తాను నీకు సన్మానం అన్నాడు.
అలా కాదండీ! నాకు పేరు రావాలి . ఫోన్ కాల్స్ వచ్చేస్తూ నా టైమ్ కోసం తిరిగి తిరిగి, ఘనంగా వేలమంది జనాలలో సన్మానాలు పొందాలి. నా మొగుడిగా మీరే ఆ కోరిక తీర్చాలి కదా! డబ్బు ఖర్చు అని నా ఆశలు అడియాసలు చేస్తారా! రాని దుఃఖః అభినయించింది సుమలత.
ఇంకేముంది కలాస్ ! గిరీశం నిలువెల్లా కరిగిపోయి “అవసరమైతే ఒక ఫ్లాట్ అమ్మేసయినా నీ కోరిక తీరుస్తాను” అని మాటిచ్చాడు.
ఆమర్నాడే ఒక వీడియో గ్రాఫర్ ని, ఒక మేకప్ మాన్ ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పిలిపించాడు
వాళ్లకి డేట్స్ ఇచ్చి వీడియోఎక్కడ షూట్ చేస్తే బాగుంటుందో ప్లేస్ చెప్పమంటే వాళ్లు ముందే నిర్మాతలను ఆర్పేసే డైరెక్టర్ దగ్గర పనిచేసిన బాపతు అందుకే ఒకోపాట ఒకోదగ్గర అని ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారిలో ఒక పదిహేను పాటలు విదేశాలలో ఒక ఇరవయిపాటలు షూట్ చేయొచ్చు. మళ్లీ వాటిని మిక్సింగ్ కి లాబ్స్ బుక్ చేయాలని, గ్రాఫిక్స్ కోసం ఒకరని ఇలా బడ్జెట్ పెంచేసి ఏభయి లక్షలకు ఎక్కువ కోటికి తక్కువగా రేట్స్, డేట్స్ ఫిక్స్ చేసారు.
అంత డబ్బు అనగానే పాపం గిరీశం కి కళ్లు తిరిగాయి. మళ్లీ తానిచ్చిన మాట సుమలత అభిలాష ఆమె కన్నీరు గుర్తొచ్చి ఏమో క్వాలిటీ క్లిక్ అయి లాభాలొస్తాయేమో” అనుకొని ఒకే అన్నాడు గిరీశం.
సుమలత తను రాసిన పాటలు అన్నిటికి రాగాలు కట్టుకోవడంలో బిజీ!
మొత్తానికి రకరకాల ప్రదేశాలలో కొత్త గ్రాఫిక్స్ లతో రణగొణ ధ్వనుల మ్యూజిక్ తో వీడియో తయారయింది. కాని
వీడియో లాంచింగ్ రోజుకి మేకప్ మ్యాన్ తప్ప మిగతా వాళ్లు పిచ్చాసుపత్రిలో చేరటానికి రెడీగా ఉన్నారు ఎర్రబడిన కళ్లు, రేగిపోయిన జుట్టు మెదడువాపు వచ్చిన వాళ్ల లాగా అయిపోయారు.
“ఏమయిందీ?” అనడిగిన గిరీశం ప్రశ్నకు
కాళ్ల మీద పడినంత పనిచేసారు.
ఏమయిందయ్యా అని మళ్లీ డిగిన గిరీశం ప్రశ్నకి
మీ ఆవిడ పాటలేందయా బాబూ!
మేలుకోవయ్యా కావేటి రాయా” పాటలో” లేవనంటావా నిద్దుర లేపనంటావా కలిపేస్తుంది. దానికి రాగాలు ఎలా కట్టాలి?
పూజలు చేయా పూలు తెచ్చాను అంటూనే వస్తా నీ వెనకా ఎటయినా కాదనకా పాడతానంటుంది.
అహ నాపెళ్ణంట పాటలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం కలిపింది.
రసజ్ఞమయిన సంగీతాన్ని ఇంత దరిద్రంగా పాడు చేసి, అంత మధురంగా పాడినందుకు మీ ఆవిడకు తప్పకుండా సన్మానం చేసి కాల్మొక్కాలి అన్న మాట వినగానే గిరీశం అయితే మీరు కష్టపడినదానికి ఫలితం దక్కిందన్న మాట!
మా ఆవిడకు జరిగే ప్రతి సన్మానంలోను మీరంతా ముందుమాటలు చెప్పాలి. అని గిరీశం అన్నాడో లేదో
వామ్మో మాకొద్దీ పంచాయితీ!
హమ్మో! బుద్ది గడ్డి తిని ఈ పనికొప్పుకున్నాము ఇంకెంత డబ్బుఇచ్చినా
ఈ టార్చర్ మేము భరించకేము బ్రతికుంటే డబ్బు రాకున్నా ఆర్ట్ ఫిల్మ్ తీసుకుంటాము.
ఈ అందాల రాక్షసి మీకెక్కడ దొరికిందండీ బాబోయ్! ఆవిడో సినిమా శ్రీలక్ష్మి టైప్ అని చెప్పకుండా ఇలా చేస్తారా అని చొక్కాలు చింపేసుకుని వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లాక ఏమయిందే అని సుమలతని అడిగితే,
శుధ్ధ వేస్ట్ గాళ్లు. నాకొచ్చినంత కూడా రాదు అని పెదవి విరిచింది సుమలత
ఇంక బంక టీవీ జీడి టీవీ చెరకుపిప్పి టీవీలు…..
“మీరేదిచ్చినా వందసార్లు చెప్తాము చూపిస్తాము ముల్లోకాల్లో ఎక్కడున్నా ఈ వీడియో కొనుక్కోకుండా చూడకుండా ఉండలేనంత పిచ్చి పట్టించేస్తాము “అని
ఒక ఫ్లాట్ రేటు డబ్బు పట్డుకెళ్లిపోయారు.
టీవీలలో ప్రొమోలు మొదలయ్యాయి.
సంచలనం మొదలయింది . అమ్మకాలు కూడా మొదలయ్యాయి.
ఫోన్లు కూడా మొదలయ్యాయి…

**********

5

రజనీ శకుంతల

అలా అలా తన పాపులారిటీ రాను రాను పెరిగిపోయింది ( అని సుమలత అనుకుంటోంది)
లక్షలు లక్షలు యాడ్స్ కి , ప్రొమోకి, స్క్రోలింగ్ కి అన్ని ఛానల్స్ కి గిరీశం ఇచ్చేయడం వలన సుమలత ప్రొమో పబ్లిసిటీకి జనాలకు దిమ్మ తిరిగింది.
అవి చూసి “వామ్మో! ఎంత డబ్బా ఛానల్ అయినా మరీ ఇంతగా దిగజారాలా! కాపీ ట్యూన్స్ కాపీ లిరిక్స్ తో హడలగొట్టేస్తోంది కదా! “అనుకున్న మహిళా సంఘాలన్నీఆ ప్రోమోస్ ని, స్క్రోలింగ్స్ ని ఆపమని గొడవ చేయడం
మొదలు పెట్టాయి.
ఛానల్స్ కి కావల్సింది కాంట్రవర్సీయే కాబట్టి అవి కూడా టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టాయి.
మొదటి రోజంతా సుమలత, డబ్బు ఖర్చు పెట్టిన గిరీశం ప్రొమోస్ చూసి సంతోషంగా ప్రెండ్స్ చుట్టాలు ఫోన్స్ మీద ఫోన్స్ చేసారు.
ఒక్క నిముషం కూడా ఖాళీ లేకుండా పోయింది. దాంతో సుమలత భర్తని ఆఫీసుకు లీవ్ పెట్టి మరీ తనకొచ్చే ఫోన్స్ ద్వారా వచ్చే రెస్పాన్స్ చూడమంది.
అప్పటికే తన లీవ్స్ అన్నీ వాడేసుకోవడం వల్ల లాసాఫ్ పే అయినా భార్య కోసం లీవు పెట్టేసాడు గిరీశం.
ఆ రేంజ్ లో రెండో రోజునుండి అసలు టార్చర్ మొదలయింది. వాడి పాడేసిన లిరిక్స్ కలగాపులగం చేసిన
మ్యూజిక్ మిక్సింగ్, దానికి సుమలతని వీర గ్రాఫిక్స్ లో చూపించడం చూడలేక జనం తిరగబడ్డారు.
సుమలతకి షాక్ ఇదేంటి?
తను ఎంతో తెలివిగా ఏభైల నాటి పాటల లిరిక్స్ ని పెట్టి నేటి పాటలలో మేళవిస్తే జనం దాన్ని ఎలా తెలుసుకున్నారో అర్ధం కాలేదామె చిట్టి బుర్రకి.
ఇక ఇవన్నీ చూసి చూసి విసిగిపోయిన గిరీశం
“ఆపవే బాబూ! నీ కవిత్వాలు, పాటలు, సంగీతం… జనాలు మరీ అంత తెలివితక్కువ వాళ్లనుకున్నావా! మనం చేసిన మోసం తెల్సిపోయింది. మన ఎడ్రస్ కనుక్కుని వచ్చి మరీ తంతారు నీఇష్టం”—- అన్నాడు.
సుమలతకు చర్రున కోపం వచ్చింది..
“మీ మగాళ్లే మా ఆడవాళ్ల మనశ్శాంతికి హానికరం” అంది చటుక్కున.
“ ఊరుకోవే బాబూ! అసలే ఇప్పటికే ఇలాంటి డైలాగ్ రాసిన రచయితని , ట్యాగ్ లైన్ గా తన సినిమాకి వాడిన నిర్మాతను ఉతికి ఆరేస్తున్నారు. ఆడాళ్లు నీ మాట వింటే మగాళ్లందరూ ఉద్యమ బాట పడతారు. నీ పని పడతారు నోర్మూసుకో! చేసింది చాలు “ భార్యమీద మొదటిసారిగా విసుక్కున్నాడు గిరీశం.
“నేనిది తాడోపేడో తేల్చుకోకుండా వదలను ఇంత కష్టపడింది, ఇంత డబ్బు ఖర్చు పెట్టింది ఇందుకా?” అరిచింది సుమలత.
రేపే ఆ ఛానల్స్ వాళ్లకి చెప్పేస్తా! ఆ ప్రొమోస్ వేయొద్దని ఆపేయమని. నా నిర్ణయానికి తిరుగులేదు “అని నిక్కచ్చిగా
చెప్పి అటు తిరిగి పడుకున్నాడు గిరీశం
“నేనూ చూస్తా” అలా ఎలా చేస్తారో!” అని ఇటు తిరిగి పడుకుంది సుమలత
“మేడమ్ నేను యుఎస్ నుండి మాట్లాడుతున్నాను.”తోమనా” అధ్యక్షుడుని. మీ కవితలు, పాటలు సూపర్ ఇక్కడ టీవీ ఛానల్స్ లో కూడా అదరగొట్టేస్తున్నారు. రానున్న “తోమనా” సభలకు మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నాము. మీరు తప్పక రావాలి ఈ సభలో మీకు సన్మానం ఏభయి వేల డాలర్లు బహుమానం,
సైట్ సీయింగ్, అకామడేషన్ అన్నీ ఫ్రీ — బి — రెడీ.” అని అవతల వారు ఫోన్ పెట్టేయగానే ఒక్క నిమిషం షాకులో ఉండిపోయింది సుమలత.
” ఓ మైగాడ్! ఇండియాలోనన్నుగుర్తించకున్నా, అమెరికాలో తెలుగువారు గుర్తించారు నన్ను సో– హేపీ—“అనుకుంది సుమలత
అమెరికాకి ఏ ఏ చీరలు తీసుకెళ్లాలి? డ్రెస్సులు కుట్టించుకోవాలి. జీన్స్ అవీ కొనాలా? వద్దా? ఏ ఏ జ్యూయలరీ వేసుకెళ్లాలి?” అని ఆలోచిస్తూ —-ఆలోచిస్తూ —- ఢామ్మని మంచం మీద నుండి పడింది సుమలత.
నడుముకు గట్టిగా తగలడంతో ” వామ్మో! అని కెవ్వున అరిచింది సుమలత.
“ఏమయిందే!– అంటూ లేచి భార్యని లేవదీసి మంచం మీద కూర్చోపెట్టాడు
భర్తని అయోమయంగా చూస్తూ ” అయ్యో! ఇదంతా కలా! “ అని ఓరి దేముడా! అనుకుని నిరాశపడుతూ—– అయినా ఏమో కల నిజమవదా! నేనయితే పట్టు వదలను” అనుకుంది నిరాశగా వెనక్కు వాలి పడుకుంటూ.
తెల్లవారు ఝాముతోనే ఇంకా ఆరుగంటలు కాకముందే ఇంటి ముందు ఏదో హడావిడి, గొడవగొడవగా మాటలు వినిపించి గిరీశానికి, సుమలతకు మెలకువ వచ్చింది.
ఏమిటో గోల అనుకుంటూ తలుపు తీసి బయటకు చూసి తెల్లబోయారు ఇద్దరూ.
సుమారు యాభైమంది మహిళలు చీపుర్లు, మగాళ్లు కర్రలతో నిలబడి ఉన్నారు
సుమా కో.”ప్రక్షాళన” కరో” “స్వచ్ఛ భారత్” రెహనా హై!”అ,టో వీళ్లని చూడగానే గట్టిగా స్లోగన్స్ మొదలెట్టారు.
సుమలత కంగారుగా “ఎవరు మీరంతా?” అనడిగింది.
దానికి జవాబుగా ఒకామె ముందుకి వచ్చి “ఏమ్మా! మేమెవరం బ్రతకాలనుకోవడంలేదా! ఏమిటా కవిత్వం ? ఏమిటా పాటలు ? ఏమిటా మ్యూజిక్? అస్తమాను నీ మొహానికి పిచ్చిగ్రాఫిక్స్ చూడలేక ఛస్తున్నాము.” అని గట్టిగా అరిచింది.
ఆమె అరుపులకి మరికొందరు వత్తాసుగా అవే అరుపులు.
కొంచెం బెరుగ్గా ” మా ఇల్లు మీకెలా తెలిసింది?” అనడిగింది సుమలత
“ఆ బంక టీవీ వాడిని నాల్గు పీకితే చెప్పాడు. నువ్వు ఈ పిచ్చి రాతలు పాటలు మానేస్తావా లేదా? అరిచింది. మళ్లీ వంతరుపులు.
,”ఇంతకీ మీరెవరు కొంచెం భయంగా అడిగాడు గిరీశం.
మేము “ప్రమదాక్షరి సభ్యులం” చెప్పిందొకావిడ
మేము “అచ్చతెలుగు సభ్యులం,” అని ఒకాయన చెప్పారు
మేమంతా నీ ఫేస్ బుక్ ఫాలోయర్స్ మి
మేము గ్రూప్ మేము ఫీల్ గుడ్ మీడియా, మేము కొండవీటిసత్యవతి గ్రూప్, మేం సంధ్యగారి గ్రూప్, మేము మాలతిగారి గ్రూప్ అంటూ అన్నిదిక్కులనుండి టకటకా వివరించారు.
వాళ్లందరి గ్రూప్ లలో తానుంది
“హోరి దేముడా! వీళ్లందరికీ ఎలా నచ్చచెప్పాలి” ఇప్పుడెలా! హఠాత్తుగా దేముడు గుర్తొచ్చాడు సుమలతకు

**********

6
జ్యోతి వలబోజు

ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి వీడియోలు, ప్రొమోలు చేయిస్తే అవి తనకే గొప్ప పేరు తెచ్చిపెడతాయని, అవి చూసిన ప్రేక్షకులు తనని ఎంతో ఆదరిస్తారు. మెచ్చుకుంటారు. తనకు అమాంతం అవార్డుల పరంపర మొదలవుతుంది, సన్మానాల వెల్లువ తట్టుకోలేనేమో అన్న పిచ్చిభ్రమలో ఉన్న సుమలత ఇలాటి స్పందన, తిరుగుబాటు చూసి షాక్ అయింది.. ఇంటిముందు ఉన్న మహిళాసంఘాలు, వివిధ ఫేస్బుక్ గ్రూపులవారిని చూసి స్పృహ తప్పి పడిపోయింది. అది చూసి వారంతా మళ్లీ తెల్లారి సాయంత్రం వస్తామని గిరీశాన్ని బెదిరించి వెళ్లిపోయారు.
తెలివిలేకుండా ఉన్న సుమలతని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఏ.సి ఆన్ చేసి వచ్చి హాల్లో కూర్చుని ఎవరికో కాల్ చేసాడు.
సుమలతకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఒకవేళ మాగన్నుగా నిద్రపట్టినా ఇంటిముందు జరిగిన గొడవ, కేకలు, వాళ్ల చేతుల్లో ఉన్న కర్రలు కలలో కూడా బెదిరించడంతో చప్పున లేచి కూర్చునేది.
తెల్లవారుఝాము 5 గంటలకు నిద్రపోయింది.
గిరీశం తనని ఏమీ అనలేదు. అతనికి కూడా ఏం చేయాలో తోచలేదు.
*******
ట్రింగ్ .. ట్రింగ్.. ట్రింగ్… బెల్ మ్రోగింది.
సుమలత కళ్లు తెరిచి వాచ్ చూసింది. అప్పుడే ఏడున్నర అవుతోంది. ఇంత ప్రొద్దున్నే ఎవరొచ్చారా అనుకుంటూ లేచి వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా సుమలత తల్లి నిలబడి వుంది.
ముందురోజు జరిగిన గొడవమూలంగా అయ్యో దేవుడా అనుకుంటూ అయోమయంలో ఉన్న సుమలత ఆ దేవుడే తను రాలేక అమ్మను పంపినట్టుగా భావించింది. సంతోషమో, బాధో తెలీక గుమ్మంలోనే తల్లిని కావలించుకుని గట్టిగా ఏడ్చేసింది. తల్లి కూడా అదే రేంజ్ లో శోకాలు.
డోర్ బెల్ కంటే గట్టిగా ఏడుపులు వినిపించేసరికి గిరీశం టక్కున లేచి కూర్చున్నాడు.
“ఏమైంది??? ఎవరు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు?” అనుకుంటూ బెడ్ రూమ్ నుండి బయటకు పరుగెత్తుకు వచ్చాడు.
గుమ్మం బయట తల్లి, గుమ్మం లోపల కూతురు కలిసి టాప్ పిచ్ లో ఏడుపులు. అది కూడా రాగయుక్తంగా చేస్తున్న జుగల్‌బందీ…
వాళ్లని చూసి , ఆ ఏడుపులు విని మళ్లీ చుట్టుపక్కలవాళ్లు కొట్టడానికి వస్తారేమో అని ఖంగారుగా వెళ్లి “ ముందు లోపలికి రండి ఇద్దరూ” అంటూ సుమలత చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. వెనకే తల్లి కూడా తన బాగు తీసుకుని లోపలికి వచ్చింది కొంగుతో కళ్లు తుడుచుకుంటూ.
గిరీశం వెంటనే తలుపులు, కిటికీలు అన్నీ మూసేసాడు.
ఇద్దరినీ సోఫాలో కూర్చోమని చెప్పి కిచెన్ లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చాడు అత్తగారికి.
అవి త్రాగిన తర్వాత సుమలత, గిరీశం నేనంటే నేనంటూ పోటీపడుతున్నట్టుగా జరిగిన సంగతంతా వివరించారు.
వాళ్లు ఎంత ఖంగారుగా, హడావిడిగా చెప్పారో సుమలత తల్లి అంత నింపాదిగా అన్నీ విన్నది.
“ఓస్! ఇంతేనా??? దీనికింత ఖంగారెందుకు? వాళ్ల సంగతి నేను చూసుకుంటా మీరు వెళ్లి పడుకోండి. నేను స్నానం చేసి వంట సంగతి చూస్తా..” అంది.
ఆ మాటకు గిరీశం, సుమలత కాస్త తెప్పరిల్లినా అంతమంది మళ్లీ వచ్చి గొడవ చేస్తే ఎలా అని గుబులుగానే ఉంది.
మధ్యాహ్నం ముగ్గురూ సుష్టుగా భోజనం చేసి , తీరిగ్గా ముచ్చట్లలో పడ్డారు. చాలా రోజుల తర్వాత కడుపునిండా రుచికరమైన భోజనం దొరికిందేమో గిరిశానికి కూడా సంతోషంగా ఉంది. సుమలత సన్మానం, రాతల, పాటల పిచ్చిలో ఇంట్లో వంట సంగతి అస్సలు పట్టించుకోలేదు మరి.
సాయంత్రం నాలుగైంది. ఇంటిముందు హడావిడి మొదలైంది.
సుమలత, గిరీశం ఇద్దరికీ కూడా కాళ్లలో వణుకు మొదలైంది.
పది నిమిషాల తర్వాత బయట గోల ఎక్కువైంది. ఎవరో తలుపు కొట్టారు.
మీరుండండి అంటూ సుమలత తల్లి లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మళ్లీ ఓ యాభై మంది స్త్రీలు, పురుషులు నిలబడ్డారు. కొందరి చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి.
“ఏంటి సంగతి? మీకు పనీపాటా లేదా? మా ఇంటిమీదకు వచ్చి పడ్డారు. నిన్న కూడా వచ్చారంట?” తలుపు ముందు అడ్డంగా, ధైర్యంగా నిలబడి అడిగింది సుమలత తల్లి..
సుమా కో.”ప్రక్షాళన” కరో” “స్వచ్ఛ భారత్” రెహనా హై!”అంటూ నిన్నటి స్లోగన్స్ మళ్లీ మొదలెట్టారు.
“ఎహే! ముందా హిందీ కూతలు ఆపండి. మా అమ్మాయి పాటలు తెలుగులోనే చూసారు కదా. మీకందరికీ తెలుగువచ్చు కదా. సుబ్బరంగా తెలుగులో మాట్లాడండి. “ అని గద్దించింది సుమలత తల్లి.
“నీ కూతురు చేసే ఘనకార్యం తెలుసా అసలు. ఏమిటా కవిత్వం ? ఏమిటా పాటలు ? ఏమిటా మ్యూజిక్? అస్తమాను ఆమె మొహానికి పిచ్చిగ్రాఫిక్స్, పిచ్చి వీడియోలు చూడలేక ఛస్తున్నాము.” అని గట్టిగా అరిచింది ఒకావిడ మళ్లీ కొత్త డైలాగ్ ఎందుకని నిన్నటి స్లోగన్ మళ్లీ చెప్తూ.
“నా కూతురు సంగతి నాకు తెలుసు. అయినా నా కూతురు తన మొగుడి డబ్బుతో తనకిష్టమొచ్చినట్టుగా చేసుకుంటుంది. ఎవరినీ మోసం చేయలేదే. తన వీడియోలు చూడమని మిమ్మల్ని బెదిరించిందా? ప్రీగా సిడీలు పంపించిందా? ఆ చానెళ్లు, వీడియోలు చూడమని కాల్స్ చేసి విసిగించిందా? మీరే కదా ఇంట్లోవాళ్లని పట్టించుకోకుండా టీవీల్లో, ఫోన్లలో వీడియోలు, టీవీ చానెళ్లు చూసేది. “ అని గట్టిగా దబాయించింది సుమలత తల్లి.
“మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు. ఆ డొక్కు చానెళ్లవాళ్లు నా కూతురు, అల్లుడి దగ్గర డబ్బులు తీసుకుని ఆ యాడ్లు, ప్రోమోలు వేస్తున్నారు. ఇచ్చేవాళ్లు ఇస్తారు, తీసుకునేవాళ్లు తీసుకుంటారు. మధ్యలో మీకేంటి నొప్పి? వేరే చానెళ్లు చూసుకోండి. ఎవరొద్దన్నారు. లేదా మీ మొబైల్లు, టీవీలు ఆపేసుకోండి”.
నాకు తెలుసు. నా కూతురు ఎక్కడ పెద్దపేరు తెచ్చుకుంటుందో? ఎన్ని అవార్డులు తీసుకుంటుందో, ఎన్ని సన్మానాలు చేయించుకుంటుందో అని కుళ్లుకునేవారే మిమ్మల్ని రెచ్చగొట్టారని తెలుసుకోలేనంత అమాయకులం కాదు. వెళ్లండి వెళ్లండి.
మా ఇష్టమొచ్చింది మేము చేసుకుంటాం. పది నిమిషాల్లో మీరంతా వెళ్లకపోయారో మామీద దాడి చేయడానికి వచ్చారని పోలీసులను, మీడియావాళ్లని పిలుస్తా.“ అంటూ తన మొబైల్ చేతులోకి తీసుకుంది.
అది విన్న ఆ జనాలంతా ఒకరిమొహాలొకరు చూసుకుని చల్లగా జారుకున్నారు.
ఇదంతా జరుగుతుందని తెలిసిన సుమలత తల్లి తలుపు మూసేసి చిన్నగా నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చింది.
“అమ్మాయ్ సుమా!! నువ్వేం భయపడకు. నీకు బోల్డు పేరు, అవార్డులు రావాలి, సన్మానాలు చేయాలి. నీకోసం ఫోన్లు విరామం లేకుండా మోగుతూ ఉండాలి. అంతేగా..”
“దాని సంగతి నాకొదిలేయ్. నేను చూసుకుంటా. అల్లుడుగారు. మీరు నిశ్చింతగా ఆపీసుకెళ్లండి రేపటినుండి..”

**********

7

ఉమాదేవి కల్వకోట


వ్యవహారమంతా చక్కపెడతాననీ. నిశ్చింతగా వుండమని కూతురుకీ, అల్లుడికీ మాటైతే ఇచ్చింది కానీ, ఆ సమస్యని ఎలా ఓ కొలిక్కి తేవాలో అస్సలు పాలుపోలేదు కాంతమ్మకి, అదే మన సుమలత తల్లికి. ఆలోచించీ…. చించీ…చించీ బుర్ర వేడెక్కింది కానీ ఉపాయం మాత్రం దొరకలేదు. కాస్సేపలా బయటకు వెళ్ళొస్తే గానీ లాభం లేదనుకొని “అమ్మాయ్! నేనలా గుడిదాకా వెళ్ళొస్తాను. ఏ సమస్యైనా దైవకటాక్షం లేనిదే పరిష్కారం కాదు”అన్నది సుమలతతో.
“అల్లుడుగారు ఇంటికొచ్చేప్పటికి ఇంటికి తాళం వుంటే బాగోదు. నువ్వు ఇంట్లోనే వుండి , అబ్బాయికి కాఫీ అదీ ఇవ్వు. నేను త్వరగానే వచ్చేస్తాను అని గుడికి బయలుదేరింది కాంతమ్మ.
గుళ్ళో జనం పెద్దగా లేరు. ప్రదక్షిణలు చేసి వేంకటేశ్వర స్వామిని, తన కూతురి సమస్యనుండి గట్టెక్కించే మార్గం చూపించమని గట్టిగా వేడుకుంది. వేడుకోవడమే కాదు ఎన్నో మొక్కులు మొక్కుకొని, తన కూతురు ఆ సమస్య నుండి బయటపడితే అతిత్వరగా ఆ మొక్కులన్నీ తీరుస్తానని కూడా కూడా వేడుకుంది. ఏదో చిన్న సమస్య, ఆ మాత్రం తన నోటిబలంతో చక్కబెట్టలేనా అనుకొని, బయలుదేరింది వచ్చింది కానీ, మరీ ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందనుకోలేదు పాపం కాంతమ్మ.
ఇంటికి వచ్చేసరికి, కూతురూ అల్లుడూ కాఫీలు త్రాగుతూ మాట్లాడుకుంటున్నారు.
“అమ్మ!వచ్చేసావా!” అని కూతురూ, “అత్తయ్యా! జనం ఎక్కువగా వున్నారా!”అంటూ అల్లుడూ పలకరించారు.
“అబ్బే. . . జనం అట్టే లేరు బాబూ! నేనే ఆ స్వామికి మీ సమస్య విన్నవించి, అది తీరిపోతే చెల్లిస్తానని మొక్కుబడులు కూడా మొక్కుకొని వచ్చాను. “అన్నది కాంతమ్మ.
“బాబోయ్! ఈఇవిడ మళ్ళీ నా కొంపమీదికి ఏంతెచ్చిందో” అని మనసులో భయపడుతూనే, ఏదో ప్రమాదం రానున్నదని తన సిక్స్త్ సెన్సు చెప్తుంటే “మొక్కుబడులా? అవేంటీ?” భయంభయంగా అడిగాడు గిరీశం.
“అబ్బే, పెద్దగా ఏం లేదల్లుడుగారూ! మీరూ అమ్మాయీ ఈ గొడవల నుండి బయటపడితే మీచేత ఆ ఏడుకొండలూ కాలినడకన ఎక్కించి, మీ తలనీలాలిప్పిస్తానని మొక్కానంతే”తేలికగా చెప్పేసింది కాంతమ్మ.
“”వ్వాట్! ఏంటీ! నా తలనీలాలిప్పిస్తానని మొక్కుకున్నారా? మీవో మీ అమ్మాయివో తలనీలాలైతే మీ ఇష్టం కానీ. . . నా జుట్టిస్తానని మీరు మొక్కుకోవడమేంటండీ!”గాట్టిగా అరిచేసాడు మన పరమ శాంతమూర్తి గిరీశం.
“అదేంటల్లుడుగారూ అలా అంటారూ! ఆదేదోఆ పాటలవ్యవహారమంతా సజావుగా సాగితే మీరిలా అనేవారేనా! గొప్ప గాయని భర్తగా దర్జాగా ఎలావుండేవారూ. భార్యాభర్తలంటే మంచీచెడూ రెండూ కలిసి పంచుకోవాలంతే”ఇక ఇదే ఫిక్స్ అన్నంత గట్టిగా చెప్పింది కాంతమ్మ.
“అయ్యో! ఆదికాదే అమ్మా! మా ఆయనకి అసలే తన క్రాఫంటే చచ్చేంత ఇష్టం. నేనూ కాస్త ఆ క్రాఫన్నాబాగుందనే కదా చేసుకున్నది ఈయన్ని. నువ్వలా ఎందుకు మొక్కావూ!”దీర్ఘాలు తీసింది సుమలత.
“చాల్లేవే. . . అక్కడికి నీ మొగుడొక్కడిమీదే నాకేదో కక్ష అన్నట్లు మాట్లాడుతున్నావూ. మీ ఆయనకి తోడుగా మా ఆయనని కూడా కాలినడకన ఏడుకొండలూ ఎక్కిస్తాననీ, ఆయనకి జుట్టు కూడా ఇప్పిస్తానని మొక్కానని మీకు తెలుసా!”ఎంతో ఉదారంగా చెప్పింది కాంతమ్మ.
“మీతో ఇన్నేళ్ళూ కాపురం చేసాక ఆయనకి ఇంకేం వున్నాయి తల వెనకాల నాలుగు వెంట్రుకలు తప్ప ఇవ్వడానికి” అనుకున్నాడు కాదు కాదు ఉడుక్కున్నాడు ఉక్రోషంగా మనసులోన గిరీశం.
గిరీశంకి తన నల్లని ఉంగరాల జుట్టంటే ఎంతో ఇష్టం. గిరీశం , మనిషి సాధారణంగావున్నా అతని ఉంగరాల జుట్టే అతనిలోవున్న ఆకర్షణ అని అంటుంటారంతా. ఆతని క్రాఫు చూసి కాలేజి రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు అతనివెంట పడ్డారు కూడా. అంత అందమైన క్రాఫు లేకుండా ఎలా వుండేది, ఈ సుమలత సన్మానాల పిచ్చివల్ల వల్ల డబ్బుకి డబ్బూ క్షవరమైపోయిందీ. . . అందమైన జుట్టూ క్షవరం కాబోతోంది. గిరీశంకి దుఃఖం తన్నుకొచ్చింది. భార్యారూపవతీ శత్రు అన్నది ఇలా కూడా అన్వయిస్తుందన్నమాట. అనుకుంటూ ఎలాగోలా తనని తాను తమాయించుకున్నాడు గిరీశం. ఆ రాత్రి భోంచెయ్యకుండానే పడుకుండిపోయాడు గిరీశం. ఉదయాన్నే ఏవో గట్టిగా మాటలు వినిపించి మెలుకువ వచ్చింది గిరీశానికి.
అది పనమ్మాయి పుష్ప గొంతు” ఆంటీ! నా జీతమియ్యిండ్రి”. తనను ఆంటీ అంటుందని సుమకి కోపం. తానే పొనిద్దూ ఊరుకొమ్మంటుంటాడు.
“అదేంటీ ఫస్టుకి ఇంకా పదిరోజులుందిగా! అప్పుడే జీతమంటావేంటీ?”సుమ గొంతు.
” మొన్న మీ ఇంటిముంగటా మస్తుమంది ఒచ్చి లొల్లిలొల్లి జేసిన్రంట గదా!మస్తు గడబడయిందటగదా! గసొంటోల్లింట్ల పనిజెయ్యొద్దు, బందు పెట్టమంటుండు నా పెనిమిటి” అంటోంది పుష్ప.
“వాళ్ళ ఏదో బుద్ధిలేక గొడవ చేస్తే నీకేంటీ? అయినా దానికీ , నీ పనికీ ఏం సంబంధం? అయినా పాత పనమ్మాయి మా అమ్మాయినుండి పాటలవల్ల గొప్పదైపోయింది తెలుసా! నువ్వూ అలాగే గొప్పదనివైపోతావేమొ ఎవరికి
తెలుసు?” నచ్చజెప్పబోయింది కాంతమ్మ.
“అమ్మా! ఏవిటే ఆ పిచ్చిమాటలు? పైన తధాస్తు దేవతలుంటారు. నా గతి ఇంతేనా ఇక” ఏడుపు గొంతుకతో అన్నది సుమ.
“నువ్వుండవే! ఇప్పుడిది పనిమానేస్తే మనింట్లో ఇక ఎవ్వరూ పని చెయ్యరు. పనిచేసుకోలేక ఉత్తపుణ్యానికి చస్తామిద్దరమూ”కూతురిని సముదాయించింది కాంతమ్మ.
“అయితే నాకు రొండువందలు జీతం బెంచితే నా పెనిమిటికి ఏదో చెప్పి పనిజేస్త” దయతలచి బంపర్ అఫర్ ఇచ్చింది ఫుష్ప.
“సరేలే పెంచుతాం కానీ, నువ్వు ఎవ్వరూ చెప్పుడు మాటలూ వినకు. అందరూ మేమంటే కుళ్ళి చస్తున్నారు”అన్నాది కాంతమ్మ.
“హతవిధీ! ఏంతలా దిగజారిపోయింది నా పరువు. ఛీ! నాబ్రతుకు తగలడా!” తననితానే తిట్టుకున్నాడు గిరీశం, ఇంకెవరినీ ఏమీ అనలేక. మనసు బాగోలేక, ఆఫీసుకీ వెళ్ళాలనిపించక ఫోనుచేసి చెప్పాడు రెండురోజులు సెలవు
కావాలని.
టిఫిన్ చేసి పేపర్ చదువుతూ కూర్చున్నాడు గిరీశం బెడ్రూంలో. ఇంతలో లాండుఫోను మోగింది. ఫోనెత్తాడు గిరీశం. “ఎవ్వరూ మాట్లాడేది, గిరీశమేనా?నేను కాలనీ ప్రెసిడెంటుని మాట్లాడుతున్నాను”అన్నది అవతలి గొంతు.
గిరీశం మాట్లాడేలోగానే, హాల్లోవున్న మరో ఫోను ఎత్తి, “గిరీశం కాదు, నేను వాళ్ళత్తగారిని మాట్లాడుతున్నాను. ఏంకావాలి? ఎందుకు ఫోనుచేసావు?” కొట్టినట్లే అడిగింది కాంతమ్మ.
“మొన్న మీ ఇంటికి, మహిళా సంఘాలవాళ్ళు వచ్చి , ఆందోళన చేసారట. మీరుకూడా వాళ్ళని నానా మాటలూ అన్నారట. ఏదో సర్దిచెప్పాలికానీ, ఇదేం పద్ధతండీ! చూడండీ! మా కాలనీ పేరు”ప్రశాంతినగర్ కాలనీ. ఇక్కడ ఇలాంటి గొడవలు పనికిరావు. ఇంకోసారి ఇలాంటి గొడవలు జరక్కుండా చూసుకొండి”ఛడామడా అడిగేసాడు ఆ పెద్దమమిషి.
“ఏయ్! ఆపవయ్యా ఆపు. చాల్లే మా బాగా చెప్పొచ్చావు. మా ఇల్లు. . . మా జీవితం, మా ఇష్టం. వాళ్ళెవరో వచ్చి మా అమ్మాయిని పాడడం మానెయ్యమంటే , నోరు మూసుకు కూర్చోవాలా! మేమేం అద్దెకున్నవాళ్ళం కాదు. ఇది మా సొంతిల్లు. మా ఇష్టమొచ్చినట్లుంటాము. అయినా నువ్వేం కాలనీ ప్రెసిడెంటువయ్యా! ఒకే కాలనీ లో వుండేవాళ్ళం. మాకు సపోర్టు ఇవ్వడం మానేసి, మాదే తప్పంటున్నావ్. ఈసారి కాలనీ ఎలెక్షన్లలో గెలవాలని లేదా?” పెద్దమనిషి గొంతుతో దబాయించింది కాంతమ్మ.
ఆ దెబ్బకి దడుసుకుని మరోమాట మాట్లాడక ఫోన్ కట్ చేసాడు కాలనీ ప్రెసిడెంట్.
“బాబోయ్! ఈవిడ కాంతమ్మా. . . సూర్యకాంతమ్మా. . హమ్మా! హమ్మా!ఎలా మాట్లాడిందీ” గుండెలు బాదుకున్నాడు గిరీశం.
మధ్యాహ్నం భోంచేసి టీవీ చూస్తూ కూర్చున్నారు ముగ్గురూ. “కొరియర్” అన్న కేక వినిపించింది గుమ్మం ముందునుండి.
“ఎవరైనా తమ మీద కోపంతో బాంబేమైనా పంపించారేమో”గుండె దడదడలాడింది గిరీశానికి.
“మొన్న అమ్మ అన్నమాటలకి ఎవరైనా లాయర్ నోటీసు పంపించారేమో”భయంతో బిక్కచచ్చిపోయింది సుమలత.
“ఎవ్వరూ వెళ్ళరేంటర్రా! పిరికి మనుషులానీ. . . . నేనే వెళ్ళి తెస్తానుండండీ”అంటూ వెళ్ళి, సంతకం పెట్టి, ఓ కవర్ తీసుకొచ్చింది కాంతమ్మ.
“అమ్మాయ్! ఏంటోచూడూ! అంటూ సుమలతకిచ్చింది. తెరిచిచూసిన సుమలత”అమ్మా!, ఏమండీ!”అని ఒక్కసారిగా బిగుసుకు పోయింది. ఏమైంది దీనికీ అనుకుంటూ, సుమలత చేతిలోని కాగితం తీసుకొని చూసిన గిరీశం పరిస్థితీ అంతే. వీళ్ళిద్దరినీ చూసి ఏమీ అర్థంకాక కాంతమ్మ ఆలా నిలుచుండిపోయింది.

**********

8
చెంగల్వల కామేశ్వరి

కొరియర్లో వచ్చిన పేపర్లో ఏముందో తెలియదు కాని అలా బిగుసుకుపోయినట్లున్న సుమలతని గిరీశాన్ని చూసి ఏమయిందర్రా “ఆనందమా! విషాదమా” అంటూ ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ అనుకుని బిస్లెరీ సోడా నీళ్లు చల్లింది కాంతమ్మ.
సోడానీళ్లకి కళ్లు మండి “ఏంటమ్మా!” అనరిచి, స్పృహలోకి వచ్చి కళ్లు నులుముకుంటున్న గిరీశానికి తన కొంగు అందించి
“కళ్లు బాగా తుడుచుకుని చూడండి. ఇవన్నీ కట్టిపడేయి అన్నారు. ఏదో కొందరు గోల చేసారని నాలోని కళలను నాశనం చేసేద్దామనుకున్నారు. ఇప్పుడేమయింది?”అని గర్వంగా అంటూ కాంతమ్మను చుట్టేసుకుని “అమ్మా మన కలలు నిజమయ్యాయి. నీ కూతురు పేరు ప్రఖ్యాతులు మన ఎల్లలు దాటాయి. నాకు అవార్డ్ ఇస్తున్నారమ్మా! అదికూడా కేంద్ర ప్రభుత్వం వాళ్లు..”
“అదేంటే వాళ్లకేం అర్ధం అయిందే ! అయోమయంగా అడిగింది కాంతమ్మ
దానికి గిరీశం “అసలు అర్ధం కాని వాటికే అవార్డులొస్తాయి అత్తయ్య గారూ! మోడరన్ ఆర్ట్ లాగా శ్యాన్ బెనెగల్ ఆర్ట్ సినిమాల లాగా మన సుమ రాసి పాడిన కవితలు పాటలు ఆ గ్రాఫిక్స్ అంతర్జాతీయ ప్రేక్షకులను అల్లకల్లోలం చేసాయి కదా! ఎన్నో గొడవలు జరిగాయి కదా అవన్నీ భరించి ఓర్చుకున్నందుకు అలా పాపులర్ అయిన సహన శీలి అవార్డ్ ఈ ఏడాది మన సుమకు ప్రకటించారు.” సంతోషంతో కంట నీరు చిప్పిల్లుతుండగా ఒకింత ఉద్వేగంతో అన్నాడు.
“అంతేనా! మధుర గాయని అని కాదా! కవికోకిల అని కాదా?” బాధగా అడుగుతున్న సుమలతని చూసి “అవన్నీ అయితే ఇక్కడే వచ్చును కదే! పర్వాలేదే మనవాళ్లకి అన్నీ పోటీలే కదా. ఈ విషయం బయటికి రాగానే ఇంకెందరో వస్తారు నీకు సన్మానం చేసి అవార్డులు ఇవ్వడానికి” అనంటుండగానే సుమలత ఫోన్ మోగింది.
“హలో!” అన్న సుమలతకు అమెరికన్ యాక్సెంట్లో ఎవరో ఏదో అంటుంటే ఏమీ అర్ధంకాక భర్తకు ఇచ్చింది. అవతలివైపు సమాచారం తెలిసి, సంభ్రమాశ్చర్యాలతో ఏదో మాట్లాడేసిన గిరీశం, ఫోన్ పెట్టేసాక తల పట్టుకున్నాడు.
“ఏమయింది అల్లుడుగారూ?” అని కాంతమ్మ ఒకవైపు.
“ఏమయింది అని సుమలత మరోవైపు అడుగుతుంటే,
“అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు, నిన్నేదో మధుర గాయనిగా సంగీత సరస్వతిగా ప్రమోట్ చేసి సంతోషిద్దామంటే అదేదో కంట్రీవాళ్లు వరస్ట్ ది బెస్ట్ అవార్డ్ నాన్సెన్స్ గ్రూప్ వాళ్లు ఇస్తారుట, ఖర్మ” అని అన్న. భర్త మాటలకి రోషంగా ఏదో అందామనుకునేలోగా లాండ్ లైన్ ఫోన్ మోగింది.
కాంతమ్మ ఆ ఫోన్ తీసేలోగా సుమలత ఫోన్, గిరీశం ఫోన్ కూడా మోగేసరికి ముగ్గురూ కంగారుగా, అయోమయంగా ఫోన్స్ ఎటెండ్ కావటం మొదలుపెట్టారు.
అలా అలా అలా రాత్రి వరకూ నిర్విరామంగా ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నారు అవతల వాళ్లు చెప్తున్న వివరాలు విని విని చెవులు ఎర్రబారాయి.
రాసి రాసి చేతులు పట్టేసాయి కళ్లల్లో ఆనంద భాష్పాలో, విలాపాలో ! కాని సమయం గడుస్తూనే ఉంది.
—++++++——+++++++————-
తెల్లవారింది. ఐదుగంటలవుతోంది.అందరూ గాఢనిద్రలో ఉండగా మళ్లీ ఫోన్ మోగింది.
అది వినగానే టక్కున లేచి కోపంగా, కసిగా వైర్ తెంపేసింది కాంతమ్మ
సుమలత తన ఫోన్ స్విచ్చ్ ఆఫ్ చేసింది. సుమలత గిరీశం కూడా తన ఫోన్ స్విచ్చ్ ఆఫ్ చేస్తూ ” నిజంగా నీ నిర్ణయం మళ్లీ మారదు కదా!” అనడిగాడు సందేహంగానే.
“మారదు” అంది ఖచ్చితంగా సుమలత.
“అయితే రేపటి పేపర్లో నువ్విచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తాను ” అన్నాడు
“ఇచ్చెయ్యి బాబూ! మాయదారి గోల పట్టెడు అన్నం కూడా తిననీయకుండా కాల్చుకు తినేసారు వీళ్ల మొహాలు మండా! అదేదో కర్నాటకా కాట్రవల్లి అవార్డ్ ట, తమిళ్ తాటకి “ట,’ కేరళ కొరివి “ట”, మహారాష్ట్ర “మాయావి “ట”, బెంగాలీ బొమ్మాళి… ఒక్క బిరుదు కూడా మంచిది లేకుండా మేమిస్తాము, మేమిస్తాము అని అవార్డులివ్బడానికి ఎగబడుతున్నారు వీళ్ల సంఘాలు మండ ఎక్కడ చూసినా తెలుగువాళ్లందరూ కలిసి అవార్డుల ఫంక్షన్స్ చేయడాలే పని పెట్టుకున్నట్టున్నారు. ఇలా పేటకో అవార్డు లెక్కన దేశాలన్ని తిరగడానికి టైముందా? మళ్లీ షరతులొకటి వాళ్లు అవార్డు ఇచ్చేవరకు ఎక్కడా తీసుకోరాదని, వసతి, రానూపోనూ చార్జీలు మనమే పెట్టుకోవాలి, ఇలా అయితే ఎక్కడ తీసుకుంటుంది? అందుకే ఏ అవార్డు వద్దు అని “అవార్డులకి దూరం నిరాడంబరతే నా లక్ష్యం” అని పేపర్ స్టేట్మెంట్ టీవీలలో కూడా వేయించి కొన్నాళ్లు ఈ ఫోన్లకి దూరముండాలి అని మా అమ్మాయి మంచి నిర్ణయమే తీసుకుంది”
అన్న అత్తగారి మాటలకు చెవులు గోక్కుంటూ పోనీ కనీసం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డయినా! అని అంటున్న భర్త మాటలకి ” వద్దూ ! నాకే సన్మానాలు వద్దు ఏ అవార్డులు వద్దు! కేవలం పబ్లిసిటీకి పట్టం కట్టే సన్మానాలు నాకొద్దే వద్దు! మధుర గాయని అనిపించుకోలేని నాకు ఏ అవార్డులు వద్దు! కళలున్నా కీర్తి కండూతి లేని కళాకారిణిగానే కొనసాగుతాను” అని ఆవేశంగా అంటున్న సుమలత మాటలకి
గిరీశం మనసులోనే తిట్టుకున్నాడు. “ నన్ను ఇంత తిప్పలు పెట్టినందుకు నీకు ఇలా జరగాల్సిందే. ఇప్పటికి నీ “ తిక్క కుదిరింది.”
********

సమాప్తం

4 thoughts on “తిక్క కుదిరింది… గొలుసు కథ

  1. చాలా బాగుంది..నిజంగానే తిక్క కుదిరింది…అదేదో సహజంగా రావాలిగానీ అవార్డులు, రివార్డులూ ఇలా కొనుక్కోవడం ఎంత అవివేకమో చెప్పక చెప్పినట్లయింది….అంతా ఒక్కళ్లే రాసినట్లున్నది!

  2. చాలా మంచి హాస్య కధ గులుసు కట్టుగా అందించిన రచయిత్రులు అభినందనలు

  3. చాలా బాగుందండీ .ఆరోగ్యకరమైన హాస్యంతో చాలాబాగుంది.

Leave a Reply to Rama Sandilya Cancel reply

Your email address will not be published. Required fields are marked *