April 20, 2024

నాదీ అద్దె మనసే

రచన: నూవుశెట్టి కృష్ణకిషోర్

అలా కుర్చీలో నిస్సత్తువగా కూర్చుని నావైపు దీనంగా చూస్తున్న నాన్నని చూస్తుంటే తనని నేను ఎలాంటి ప్రశ్న అడిగానో నాకు అర్ధం అయింది. అలాగే తన ముఖం చూసి తను చెప్పకుండానే నాకు జవాబు కూడా తెలిసి పోయింది, నా అనుమానం నిజమే అని కూడా అర్ధం అయింది. రాత్రి నుంచి ఎదో మూల కొద్దిగా ఆశగా ఉండేది, నేను విన్నది నిజం కాదేమోనని కాని తనని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఒక్కసారిగా నా నవనాడులు కృంగిపోయాయి, ఎందుకో ఆ ఇంటినుంచి నన్ను నేను బయటకు విసిరేసుకున్నట్లుగా అనిపించి మనసు మొత్తం మొద్దుబారి పోయింది. తను ఊగుతున్న రాకింగ్ కుర్చీ చిన్నగా చేస్తున్నశబ్దం తప్ప రూం అంతా నిశ్శబ్దంగా ఉంది. అయినా నేను అలా తనని నేరుగా అడగకుండా ఉండాల్సింది, నా ప్రశ్న తన మనసును చాలా బలంగా తాకి ఉంటుందని తెలుసు ….అయినా అడగక తప్పలేదు.
నేనడిగింది “నాన్నా! నేను అమ్మ కడుపులో పెరిగి పుట్టలేదా?” అన్న ఒకే ఒక ప్రశ్న.
ప్రశ్న చిన్నదే కాని జవాబు నా జీవితం అంత పెద్దది.
కొద్ది క్షణాలు గడిచాయి, ఆ కొద్దిసేపు మా మధ్యలో మౌనమే మాటగా మారింది. చిన్నగా తలెత్తి తన వైపు చూశాను, తన చూపు ఎదురుగా ఉన్న నా చిన్నప్పటి ఫోటో మీద ఉంది. అది నా రెండో సంవత్సరం పుట్టినరోజు తీసిన ఫొటో ఎందుకో అదంటే తనకి చాలా ఇష్టం . నేను తనవైపే చూస్తున్నాను. నేను తననే చూస్తున్నానని తనకి తెలుసు కాని తను నా వైపు చూడకుండా కళ్ళు మూసుకున్నాడు, తన కళ్ళల్లో తడి తెలుస్తుందనేమో మరి . ఈ పరిస్థితి నాకూ ఇబ్బందిగానే ఉంది. ఆ నిశబ్దాన్ని చంపుతూ చిన్న గొంతుతో తనే చెప్పాడు.
అవును నిజమే. నువ్వు సరోగేట్ బేబివి, అయినా అదేమీ నేరంకాదే. దాచిపెట్టాలని అనుకోలేదు, అలాగని ప్రత్యేకంగా పిలిచి చెప్పాలని కూడా అనుకోలేదు , అలా రోజులు గడిచి సంవత్సరాలు అయ్యాయి అంతే. నా వైపు చూడకుండానే చెప్పాడు.
అయినా ఇప్పుడు నీకిది…చివరలో మాట మింగేశాడు.
రాత్రి…నిన్న రాత్రి అమ్మ నువ్వు నా గురించి వాదులాడుకుంటుండగా కొన్నిమాటలు వినపడ్డాయి. అప్పుడు అర్ధమైంది . చెప్పాను.
అప్పటికి నువ్వు ఇంటికి వచ్చేశావా ?
అప్పుడే వచ్చాను.
మీ మాటల ద్వారా అర్ధం అయింది మీరు బాగా డ్రింక్ చేసి ఉన్నారని.. అందుకే అప్పుడు మాటలాడలేకపోయాను, అడగలేకపోయాను .
అవును నిజమే రాత్రి కొద్దిగా ఎక్కువే తాగాను , నిన్న నీ పుట్టిన రోజు.
“నీ పుట్టిన రోజు అని కూడా మర్చిపోయి తను క్లబ్ మీటింగ్స్ అంటూ వెళ్లి ఎప్పుడో వచ్చింది అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను, కాని నీ దాకా వస్తుందనుకోలేదు, అసలు చిన్నప్పుడే నీకు చెప్పి ఉంటే సరి పోయేది ఇప్పుడు అది ఆరడుగుల ప్రశ్నగా మారింది జవాబు చెప్పాలంటే కష్టంగా ఉంది “అంటూ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు.
“నువ్వు మోసి కని ఉంటే వాడి పుట్టిన రోజున ఇలా క్లబ్ మీటింగ్స్ కి వెళ్లి ఇప్పుడు వస్తావా” అని అమ్మతో అన్నట్లున్నారు? పక్కనున్న మంచినీళ్ళ బాటిల్ తన చేతికిస్తూ అడిగాను .
బాటిల్ తీసుకుని తాగకుండా పక్కన పెట్టి అవును అన్నాను.. చెప్పానుగా కొద్దిగా డ్రింక్ ఎక్కువైంది అని అయినా అది మందు ఎక్కువైనప్పుడు అన్న మాట. నిజానికి నువ్వు తన బిడ్డవే, తన ప్రేమలో కూడా తేడాలేదు, పైకి చూపించదు అంతే , దానికి తోడు కొద్దిగా తనకి కీర్తి కండూతి ఎక్కువే , అందుకే అన్ని పైనేసుకుని క్లబ్బులు మహిళా మండళ్ళు అంటూ ఇంటిపట్టున ఉండకుండా తిరుగుతూ ఈ స్థాయికి వచ్చింది.ఇంత బిజి అయింది.
ఈ బిజీలోనేనా నన్ను ఓ తొమ్మిది నెలలు మోయలేక అద్దె మనిషిని ఎంచుకుంది ? కాస్త కసిగా అడిగాను.
అటునుంచి జవాబులేదు వెంటనే, కళ్ళు తెరిచి ఈసారి నావైపు చూసి చెప్పాడు చిన్నగా గొణిగినట్లుగా, అదేంలేదు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం కూడా, అన్ని కలిసొచ్చాయి. కాని నువ్వు.. నువ్వు మా రక్తానివే ఆ మాట చెబుతున్నప్పుడు ఇబ్బందిగా కుర్చీలో అటూఇటూ కదిలి పక్కనున్న నీళ్ళ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగి పక్కన పెట్టాడు .
నిజానికి నాకూ ఇష్టం లేదు ఇంతకంటే పొడిగించటానికి అందుకే వాతావరణం చల్లబరచడానికి చిన్నగా నవ్వాను. అవతలివారితో వాదించడం ఇష్టం లేకపోతే కూడా ఇలా నవ్వుతానని తనకి తెలుసు. అందుకేనేమో తరువాత తనేమి ఎక్కువగా మాట్లాడలేదు.
ఇంతకీ తన పేరు ఏమిటి? అదే నన్ను ఆ తొమ్మిది నెలలు మోసిన అద్దె అమ్మ పేరు ? నా గొంతు కొద్దిగా వణికింది, అద్దె అమ్మ అంటున్నప్పుడు.
ఆమె పేరు వందన . తరువాత ఎప్పుడూ కలవలేదు.
ఎంత తీసుకుంది నన్ను మోయటానికి?
ఎం మాట్లాడకుండా మౌనంగా నా వైపు అదోలా చూసాడు , ఈ సారి ఆ చూపులో తను గెలిచిన ఆనందం ఉంది. ఒక్క నిమిషం అంటూ పైకి లేచి తన రూమ్ లోకి వెళ్లి కొద్దిసేపటి తరువాత బయటకు వచ్చాడు, చేతిలో ఓ కవర్ ఉంది. చాలా పాతదిలా ఉంది.
ఓపన్ చేసి చూడు ఎంత తీసుకుందో నీకే తెలుస్తుంది. కవర్ చేతికిస్తూ చెప్పాడు.
ఓపన్ చేసి చూశా, లక్ష రూపాయలకు వందన అనే పేరు మీదున్న చెక్ క్రింద నాన్న సంతకం. నే పుట్టిన రోజున తనకి ఇచ్చిన చెక్ లాగా ఉంది సంతకం క్రింద ఉన్న డేట్ నా పుట్టినరోజు డేట్ ఒకటే . వెనక్కి తిప్పి చూసాను చిన్నాకి అమ్మ అని రాసి క్రింద వందన అని తన సంతకం ఉంది. అసంకల్పితంగా చేతితో ఆ సంతకం మీద అలా తడిమాను ఏదో తెలియని ఆనందం, నన్ను తను మోస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఇలా తన పొట్టపై నుంచి నన్ను తడుముకుందో ..ఎందుకో తనని ఎలాగైనా ఒక్కసారి చూడాలనిపించింది.
అది తనకి నేనిచ్చిన లక్షరూపాయలు, పైసా కూడా తీసుకోకుండా తన గుర్తుగా ఆ డబ్బులు నీ పేరు మీద బాంక్ లో వేయమని చెప్పి వెళ్ళిపోయింది.
క్రింద కారు చప్పుడు అమ్మ వచ్చినట్లు ఉంది., నాకు నిజం తెలిసిన విషయం అమ్మకి తెలియాల్సిన అవసరం లేదనిపించింది.
చివరగా అడిగాను తను ఇప్పుడు ఎక్కడ ఉంది?
తెలియదు.
కనీసం ఆ హాస్పిటల్ పేరు డాక్టర్ పేరు అయినా గుర్తు వుందా?
ఉంది, అమృత హాస్పిటల్, డాక్టర్ అమృత. వైజాగ్ యం వి పి కాలని . వందన తన దగ్గరే పనిచేసేది తను చాల మంచిదనే తనని వప్పించింది డాక్టర్. ఒకప్పుడు ఆ డాక్టర్ మీ అమ్మ ఫ్రెండ్.
మెట్ల దగ్గర చప్పుడు అమ్మ పైకి వస్తున్నట్లుగా, నాన్న కళ్ళు తుడుచుకున్నాడు. నేను నా రూం లోకి వెళ్లి పోయాను. నాకు తెలుసు నాన్నకూడా అమ్మకి ఈ విషయం చెప్పడని, నేనూ తనని అడగదలుచుకోలేదు.
అలా ఓ పది పదిహేను రోజులు గడిచాయి. రాను రాను ఆ ఇంట్లో ఉంది నేను కాదు అనిపించసాగింది, నన్ను నేను కోల్పోయినట్లు ఫీలింగ్. ఎందుకో తెలియదు ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా నాన్నకి నాకూ మాటల దూరం పెరిగింది, అది ఇద్దరికీ స్పష్టంగా అర్ధమవుతుంది. అమ్మ మామూలే తన బిజిలో తను ఉంది.
ఓ రోజు ఇద్దరూ ఉన్నప్పుడు సడన్ గా చెప్పాను కంపెనీ పనిమీద అమెరికా వెళుతున్నానని, ఓ మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ అని.
నాన్న మౌనంగా నా వైపు చూసాడు. కళ్ళలో ఏ భావాలూ లేవు సరే అన్నట్లుగా తలూపాడు తనకీ నేను కొద్దిరోజులు దూరంగా ఉండటం మంచిదనిపించిందేమో. అమ్మ మామూలే అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ లిస్ట్ చేతిలో పెట్టింది ఏదైనా సమస్య వస్తే కలవమని చిటికలో చేసి పెడతారని, తన మాటలలో తనకున్న పరపతి పవర్ తనకి తెలియకుండానే బయటకొచ్చేస్తుంటుంది.
అమెరికా వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది ఈ లోగా నాకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకున్నాను, అమ్మ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే డిల్లీ వెళ్ళింది . నాన్న ఎయిర్ పోర్ట్ దాకా వస్తానంటే బలవంతంగా ఆపాను. చేతిలో చేయివేసి వీడ్కోలు యిచ్చాడు, ఎందుకో నాలో ఏ భావం లేదు మౌనంగా బయటకి నడిచాను. బయటకి వచ్చి ఇంటిని ఓ సారి బాగా చూసుకున్నాను మళ్ళీ ఎప్పుడో మరి.
రాగానే సేఫ్ గా చేరాను అని కాల్ చేసి చెప్పాను . నిదానంగా రోజులు నెలలయ్యాయి అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేవాడిని కాని ఆ తరువాత ఆ అప్పుడప్పుడు కూడా ఎప్పుడో అయిపోయింది. ఎక్కడో ఏదో తెలియని దారం తెగి పోయినట్లనిపించింది. రొటీన్ లైఫ్ లో పడి పోయాను. నెలలు సంవత్సరాలు గా మారాయి.
కాలం కొన్నిటిని బలపరిస్తే కొన్నిటిని బలహీన పరుస్తుంది. అమ్మ శారీరకంగా బలహీన పడింది , ఇల్లు గుర్తుకొచ్చినట్లుంది. దానితోపాటు బంధాలు అనుబంధాలు కూడా, ఇప్పుడు తనే ఫోన్ చేస్తూ తరుచుగా ఇంటికి రమ్మని పిలవడం మొదలుపెట్టింది. ఓ రోజు సడన్ గా లీవ్ పెట్టిరా అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము అంది. ఆలోచించకుండా చెప్పేసాను కసిగా ఓ అబద్దం నాకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఓ బాబు అని డీటైల్స్ చెప్పి ఫోన్ పెట్టేసాను.
అంతే ఓ మూడు నెలలు ఏ ఫోనూ లేదు ఊహించగలను వాళ్ళ కలలసౌధం పూర్తిగా కూలిపోయి ఉంటుందని, నాకు కావాలిసింది కూడా అదే. . ఎందుకంటే నా దృష్టిలో వారు చేసింది నేరం.
ఓ రోజు నాన్న నుంచి కాల్, బాగోగులు మాట్లాడాక చిన్నగా చెప్పాడు అమ్మకి పరాల్సిస్ స్ట్రోక్ వచ్చిందని వచ్చి కూడా రెండు నెలలు దాటిందని బెడ్ మీదే ఉందని, అందుకే ఎక్కువగా ఫోన్ చేయలేదని, భావరహితంగా విన్నాను. గొంతు బొంగురు పోతుంటే చెప్పాడు ఒక్కసారి నిన్ను, కోడలిని, మనవడిని చూడాలనుకుంటుంది వచ్చి ఓ నాలుగు రోజులు ఉండి పొండి తనూ సంతోషంగా వెళ్ళిపోతుంది, తనకి అత్తయ్యా, నానమ్మా అని పిలిపించుకోవాలని బాగా కోరికగా ఉంది. బహుశా ఇదే తన చివరి కోరిక కూడా కావచ్చు గొంతు బొంగురులో ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పక్కన పెట్టి నేనూ ఓ క్షణం కళ్ళు మూసుకున్నాను. వంటింట్లో తను గిన్నెలు సర్దుతున్న చప్పుడు. ఎందుకో ఆ చప్పుడంటే నాకు చాలా ఇష్టం .
బాగా ఆలోచించి వెళదామని మనసులో నిర్ణయం తీసుకున్నా, కాని ఎలా? ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నా, నా మనసంతా నాన్న చెప్పిన మాట మీదే తిరుగుతుంది “తనకి అత్తయ్యా, నానమ్మా అని పిలిపించు కోవాలని బాగా కోరికగా ఉంది” ఆ మాట దగ్గర వచ్చిన చిన్న ఆలోచన కొద్దిసేపటికి పెద్దదై నాకు తెలియకుండానే నిర్ణయంగా మారింది. అవును అద్దె తల్లులే దొరకంగా అద్దె కోడలు, మనవడు దొరకరా? కాస్త ప్రయత్నించాలి అంతే, అతి కొద్ది ఖర్చుతో సులభంగానే దొరికారు.
ఓ నాలుగు రోజులు కోడలిని మనవడిని దగ్గరకు తీసిన తరువాత వాళ్ళిద్దరూ తన కోడలు, మనవడు కాదు అని తెలిసిన క్షణం వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో చూడాలని కసితో కూడిన చిన్న కోరిక. వెంటనే నాన్నకి కాల్ చేసి చెప్పాను అందరం వస్తున్నట్లుగా.
కాని ఊహించినవన్ని జరగవు అని నాకు వారం తరువాత తెలిసింది.
ఇద్దరూ కాలం కొలిమిలో బాగా కాలి పోయినట్లుగా ఉన్నారు. వారిని చూడగానే షాక్. అమ్మ దగ్గర అప్పటి రూపుగాని మాటగాని లేవు. చిన్నపిల్లలకి బొమ్మలిస్తే ఆనందపడినట్లు ఆనందపడింది మమ్మల్ని చూసి. నన్ను, తన మనవడిని వళ్ళంతా తడుముకుంది. కోడలిని దగ్గర కూర్చుండ పెట్టుకుని మురిపంగా చూసుకుంది. నాన్నఆనందం అయితే చెప్పనవసరం లేదు హడావుడి అంతా తనదే. బాగా కలిసి పోయారు కోడలితో, మనవడిని అయితే క్రిందకి దించడం లేదు . వారి ఆనందం చూస్తుంటే ఒక్క క్షణం మనసులో ముళ్ళు గుచ్చినట్లుగా అయిపోయింది ఇద్దరూ బాగా ముసలివాళ్ళలాగా ఉన్నారు క్రమంగా ఇప్పటి రూపు అప్పటి వారి రూపుని నా మనసులో నుంచి తుడిపేయ సాగింది, దానితో పాటు నా ఆలోచనలు కూడా తుడిచి పెట్టుకొని పోతున్నాయి ఒక్కొక్కటిగా.
అప్పటి నా మానసిక పరిస్థితి వీరికి శిక్షగా మారి వీళ్ళని త్వరగా ముసలోళ్ళను చేసిందా అనిపించసాగింది. ఆలోచనల స్నానం మొదలైంది . ఎక్కడో ఏదో తప్పు చేసిన భావన శత్రువు ఎవరో తెలియకుండా పొరాడానా అని అనిపించింది. విచిత్రంగా ఒకప్పటి నా మానసిక పరిస్థితి ఇప్పుడు దూరంగా నిలబడి నువ్వు నువ్వేనా అని నన్నే ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. నీదీ అద్దె మనసే రా అని వెక్కిరిస్తోంది.
ఓ నాలుగు రోజులు ఇట్టే గడిచి పోయాయి. ఇక బయలు దేరాల్సిన రోజు రానే వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చాను, వాళ్ళు తమ కోడలు మనవడే అన్న భావన వాళ్లకి అలాగే ఉంచేసి ఏమి చెప్పకుండానే అందరం బయలుదేరాము . ఎందుకో ఆ ఆనందాన్ని ఇప్పుడు వారికి దూరం చేయాలనిపించలేదు.
వీధి మలుపులో తల వెనక్కి తిప్పి చూశాను నాన్న తన చేయి ఊపుతూ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. అమ్మ కిటికీలోనుంచి చూస్తూ ఉంది , వారిద్దరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయని తెలుసు, వాళ్ళ కన్నీళ్ళు తుడవలేని నా చేతితో నా కళ్ళు తుడుచుకుంటూ చేయి బయట పెట్టి బై చెప్పాను. కారు ముందుకు సాగింది.
నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది, ఆ తృప్తి వాళ్ళిద్దరిని అద్దెకు తెచ్చానని చెప్పనందుకు వచ్చింది మాత్రమే కాదు, నన్ను నవమాసాలు మోసిన అద్దె అమ్మ వందనమ్మ ఎప్పటినుంచో నాతో పాటు అమెరికాలో ఉన్న విషయం కూడా చెప్పనందుకు వచ్చిన తృప్తి .
అమ్మా! నీ మీద కోపంతో నీ అమ్మతనాన్ని సగం చేసి అమెరికాలో ఉంచాను అని చెప్పనందుకు వచ్చిన తృప్తి.
ఎందుకో ఇప్పుడు వంట రూములో ఆ అమ్మ చేసే నా కిష్టమైన గిన్నెల చప్పుడులో ఈ అమ్మ చేయి కూడా కనిపించసాగింది.
కారు వేగంగా వెళుతుంది విమానాశ్రయం వైపు, దూరమైన నా అద్దె మనసును ఇక్కడే వదిలేసి.

________

8 thoughts on “నాదీ అద్దె మనసే

  1. చాలా బావుంది …తనను తొమ్మిది నెలలు మోసిన తల్లిని తనతో అమెరికా తీసుకెళ్ళి తను సాంత్వన పొందటం…కానీ కేవలం ఒక్క పుట్టినరోజుకు తనని పట్టించుకోలేదని , అన్నాళ్ళు పెంచిన తల్లిని దూరం గా ఉంచటం…కొంచెం బాధ అనిపించింది …కథ చాలా బావుంది

  2. ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్న ఇతివృత్తం అవడం వల్ల ఆసక్తి కలిగించింది, కథను నడిపిన తీరు చాలా బాగున్నది.
    ‘కన్న’ తల్లిని తన వెంట తీసుకెళ్ళి ఉంచుకోవడం, ఊహించలేకపోయాను.
    మొత్తానికి కథ నచ్చింది.

Leave a Reply to Kishore Cancel reply

Your email address will not be published. Required fields are marked *