March 28, 2024

వీరు…

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

పిల్లల ఎన్ని ఆగడాలనైనా భరిస్తారు,
వారి ఎన్ని తప్పులనైనా క్షమిస్తారు,
వారి ఎన్ని అవివేకాలనైనా హర్షిస్తారు,
ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక!
సదా వారి సేవలో తరిస్తారు,
ఎప్పుడూ వారి క్షేమాన్నే కాంక్షిస్తారు,
వారి సుఖాన్వేషణలోనే చరిస్తారు,
ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక!
వారితో చీవాట్లు వీరి అలవాట్లుగా చేసుకుంటూ,
వారితో చెప్పుదెబ్బలు వీరి పొరపాట్లుగా చెప్పుకుంటూ,
వారితో అగచాట్లు తెరచాట్లుగా ఉంచుకుంటూ ఉంటారు,
ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక!
వారు దూషించినా వారిని దీవిస్తూ,
వారు ద్వేషించినా వారికై జీవిస్తూ,
వారు పొమ్మన్నా వారినే ప్రేమిస్తూ ఉంటారు,
ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక!
మాయలు చేస్తున్నా మమతలు చూపుతారు,
లోయలో పడవేసినా వారి హాయి కోరుతారు,
గాలికి వదిలేసినా వారిపై జాలి చూపుతారు,
ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులే కనుక!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *