March 30, 2023

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 18

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

జీవన సంగ్రామంలో పరుగులు పెడుతున్నాం. ఎందుకో తెలియదు. పరుగులే పరుగులు. ఈ ఉరుకులు పరుగులు అనేవి, జంతువులకే తప్ప, మానవులకు కాదు. ఒక మానవునిగా, సమాజ నిర్బంధతలకు, బలహీనతలకు లొంగకుండా ఎవరికి కావలసిన మార్గాన్ని వారు విఙ్ఞతతో సమకూర్చుకోవచ్చు. మనిషి తన జీవితకాల జీవనసౌందర్యాన్ని తిరస్కరిస్తున్నాడని, ఒక ఆనందమయ జీవన విధానానానికి తెరలు దించి, దారిమూసివేసి పక్క దారి పడుతున్నాడని, ధన భోషాణంలో దూరి తలుపు గడియ వేసుకుంటున్నాడని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఎన్నాళ్ళీ పరుగులు? శరీరం ఒకనాటికి పడిపోతుందని గ్రహించండి అంటున్నాడు అన్నమయ్య. “పారేటి జీవులు” అనే అద్భుత ప్రయోగంతో ప్రారంభం జేసి జనులకు ఉపదేశం చేస్తున్నాడు అన్నమయ్య. అదేమిటో విందాం.
పారేటి జీవులు అంటే మానవకోటి, ఎందుకో తెలియని పరుగులు…. స్త్రీకోసం, భూమి కోసం, ఎన్ని తరాలు తిన్నా తరగని సంపదకోసమేనా? పరుగులు. అంతులేని భ్రమకు లోనై చేసే పనులు ఇవి. నేను, నావాళ్ళు, నా సంపద ఇవే మాటలు. అశాశ్వతమైన ఈ తోలుతిత్తి దేహంకోసం, అన్నీ వదిలేస్తున్నాడు. అవసరమైన మార్గాన్ని ఆలశ్యంగా తెలుసుకుంటున్నాడు. చమురు ఆవిరై, దీపం కొడి గట్టాక అంతా శూన్యం. ముందుగా మేల్కొని “నారాయణా!” అని ఒక్కసారి మనసారా ప్రార్ధిస్తే చాలు. పాపపంకిలమైన ఈ జీవితం సుమార్గం పడుతుంది. నారాయణా! గోవిందా! నీ నామం ఒక్కసారి మంత్రించి భూలోకంపై వదలి జనుల భ్రమ తొలిగించలేవా? జన్మ రాహిత్యాన్ని జయించే మార్గం సుగమం చెయ్యలేవా తండ్రీ! అని ఆవేదన చెందుతున్నాడు అన్నమయ్య.
పారేటి జీవుల భ్రమలు తొలిగి మనమెవరమో…ఆ నారాయణుడెవరో తెలుసుకోగలుగుతారు. స్వామీ శ్రీవేంకటేశ్వరా! అనుగ్రహించు.

కీర్తన:
పల్లవి: నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి
పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే ॥పల్లవి॥

చ.1 మదనభూతము సోకి మగువలు బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళ జించుకొంటా
కొదలు కుత్తికలను గూసేరు జీవులు ॥ పారేటి ॥

చ.2 పంచభూతములు సోకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుబూసు కొంటాను
అంచెల వీడెపురస మందునిందు గిరియుచు
యెంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు ॥ పారేటి ॥

చ. 3 తమితోడ మాయాభూతము సోకి బహుజాతి
యెముకలు దోలు నరాలిరవు చేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్ను జేర కెక్కడైన
తాము దా మెరగరింతటా జూడు జీవులు
(రాగం: సామంతం; ఆ.సం. సం.3; 286 వ రేకు; కీ.సం.494)

విశ్లేషణ:
పల్లవి: నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి
పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే
ఓ శ్రీవేంకటేశ్వరా! ఒక్కసారి నీ నారాయణ మంత్రాన్ని మంత్రించి జీవులపై వదలినట్లైతే జీవన వ్యాపారాలలో, అనేక మోహాలలో, అనేక అనవసర వ్యాసంగాలతో ఉండే మనుష్యులు తమ తమ భ్రమలను వీడి నీశరణు వేడి కైవల్యం పొందరా! కానివ్వండి…. నారాయణమంత్రరాజాన్ని వదలండి అని జీవులజీవితోద్ధరణకై అన్నమయ్య స్వామిని శరణువేడి ప్రార్ధిస్తున్నాడు.
చ.1. మదనభూతము సోకి మగువలు బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళ జించుకొంటా
కొదలు కుత్తికలను గూసేరు జీవులు
ఓ శ్రీనివాసుడా! ఈ జీవులకు మదనభూతం సోకింది. తత్కారణంగా పురుషులు, స్త్రీలు వివశులై విచక్షణ నశించి దిగంబరులై, పెదవులలో రక్తము చిమ్మే దాకా, గోళ్ళతో శరీరంపై గోట్లు పడేదాకా రక్కుకుంటూ, అతిశయించిన మదనోత్సాహంతో అవతలి వారి కుత్తుకలు తెగే వరకూ తెగిస్తున్నారు. దంతక్షతాలు నఖక్షతాలు అనే శృంగార క్రీడ బరితెగించినదని, బజారున పడిందని..వాపోతూ… నిరశిస్తున్నాడు అన్నమయ్య. ఎంత ఘోరం! ఎంత దారుణం! ఎంత దౌర్భాగ్య స్థితి.

చ.2. పంచభూతములు సోకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుబూసు కొంటాను
అంచెల వీడెపురస మందునిందు గిరియుచు
యెంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు
ఓ పరంధామా! ఈ సృష్టిలోని పంచభూతములు వీరిని పూర్తిగా వశపరచుకొన్నవి. బయటపడలేని భ్రమలలో మునిగి కన్నుమిన్ను గానక కొట్టుమిట్టాడుతున్నారు. ఎంత హేయమో చూసారా! ఒడలికి మట్టిని పూసుకుని వెర్రి ఆనందంపొందేవాడు ఒకడు. తాంబూల సేవనమే ముఖ్యం అని తలుస్తూ ఆ రసాస్వాదనే జీవిత పరమార్ధం అనుకునేవారు మరికొందరు. జీవులందరికీ ధనపిశాచము పట్టింది. ఉఛ్చనీచాలు పుడమిలో నశించాయి. ధనసంపాదనకు ఏపనికైనా సిద్ధపడుతున్నారు. ఇక మీరు నారాయణ మంత్రం వదలవలసినదే!
చ.3. తమితోడ మాయాభూతము సోకి బహుజాతి
యెముకలు దోలు నరాలిరవు చేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్ను జేర కెక్కడైన
తాము దా మెరగరింతటా జూడు జీవులు
ఓ పరాత్పరా! పరంధామా! విపరీతమైన ధనదాహం, కామదాహం కారణంగా జీవులకు మాయా భూతం సోకింది. తద్వారా “తానెవరో!” తెలిసికోలేని స్థితికి దిగజారాడు. నేను అంటే ఎముకలు…తోలు… ఇదే… ఇదే నాజాతి…ఇదే నేనంటే అనే భ్రమ సోకింది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమనే విషయం విస్మరణకు గురి అయినది. అందువల్ల అరిషడ్వర్గాల వలలో చిక్కాడు. జననమరణ చక్రంలో పడి తిరుగుతున్నాడు. వేల సంవత్సరాలు ఇదే తంతు కొనసాగుతోంది. దీని నుంచి “నారాయణ మంత్రం” ప్రసాదించి జీవులను బయటపడవేయ వలసినదిగా ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.
.
ముఖ్యమైన అర్ధాలు:
పారేటి జీవులు = జీవనయానంలో పరుగులుపెట్టే మనుష్యులు; మదనభూతము= మన్మధుడు జీవులను పట్టుకోవడం వలన కలిగే దురవస్థ; విరిదలు = ఎడబాటు (ఇక్కడ విచక్షణ నశించినది అన్న అర్ధం తీసుకోవాలి); అంగమొలలు = దిగంబరులు, వివస్త్రలు; వీర్చి = చిమ్ము; కొదలి = అతిశయము, గొప్ప; కుత్తుకలు = గొంతులు; వీడెపురసము = తమలపాకు రసము; తమి = ఆసక్తి; ఇరవు = నిలయము, స్థానము; నెమకు = వెదకు, అన్వేషించు.
విశేషము: ఇందులో అన్నమయ్య “పారేటి జీవులు” అని ఒక అద్భుత ప్రయోగం చేశాడు. “ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే” అన్న కీర్తనలో చేరి “పారేటి” నదులు శ్రీపాద తీర్థమే! అనడం వేరు. ఇక్కడ పారేటి అనడం వేరు. ఇక్కడ జీవన సంగ్రామం, పెనుగులాట, వదలలేని దుస్థితి. ప్రవాహంలో ఎలా పడితే అలా దారీ తెన్నూ గానక కొట్టుకుపోయే జీవులపై ప్రయోగించిన అందమైన పదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2017
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031