April 19, 2024

ఆకుదొక కథ!

రచన:లక్ష్మీదేవి

నేనిక్కడికెప్పుడు వచ్చానో, ఇంత అందమైన ప్రపంచంలోకి ఎలా చేరానో మరి, చల్లగాలిలో అమ్మ కొమ్మ తాను ఊగుతూ నన్ను ఉయ్యాలలూపుతోంది. నా చుట్టూ నా తోబుట్టువులు సంతోషంగా కనిపిస్తున్నారు. అప్పుడే రాలిన చినుకులలో తడిసి మరింత కొత్తగా మెరిసి పోతున్నారు. ఎన్ని ముఖాలో, ఎన్ని ఆకారాలో, వాటిల్లో ఎన్ని వికారాలో! చుట్టూ జరిగేదాన్ని గమనిస్తూ , ఆలోచిస్తూ ఉండడమే నా స్వభావం.
ఆకాశపుటంచులనుండి నా స్నేహితులు మమ్మల్నంతా ఆనందతరంగాల్లో ముంచేయడానికి అప్పుడప్పుడూ వస్తుంటారు. వారికోసమే మా ఎదురుచూపులు. సంవత్సరమంతా ఎదురుచూసేది ఒక్క శలవుల పండగల కోసమే. వారికి శలవు దొరికినపుడు వచ్చేస్తారు. ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక్కోసారి మేమంతా అందులో మునిగే పోతాము. ఇంకోసారి లోకాన్ని మరచి తేలే పోతాము.
ఏమైనా మా ఎదురుచూపులు ఆగవు. ఊపిరి ఆగేవరకూ ఆగవు. ఒక్కసారి వారు వస్తున్న బండ్ల దీపాలు, మ్రోతలు పైనుంచీ వినపడగానే, కనపడగానే మా గుండెలు మ్రోగుతాయి, ప్రతిస్పందనగా. అందరం చేతులూ ఆడిస్తూ, నాట్యాలాడుతూ స్వాగతం పలుకుతాము మా మిత్రులకు.
ఒక్కోసారి ఇంకెక్కడికో వెళుతూ చుట్టపుచూపుగా అలా చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు కూడా మేం వారిని నిందించము. ప్రతీసారీ సరిక్రొత్తగా అనిపించే మరిచిపోలేని పరిమళాలతో స్వాగతాలు పలుకుతాము.
మా స్నేహితులు ఒక్కొక్క సారి ఎన్ని రోజులో ఉంటారు మాతోపాటు. ఆడుతూ, పాడుతూ, దోబూచు లాడుతూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ మాతో కలిసి చేసే అల్లర్ల కోసం లోకమే ఎదురుచూస్తుంది. నిజానికి మేముంటేనే వాళ్ళు, వాళ్ళుంటేనే మేము ఉండగలిగేది. వాళ్ళెప్పటికీ రానిచోట్ల మేం జీవించనేలేము. మా ఉనికే లేనిచోటకు వాళ్ళు రమ్మన్నా రారు. తెలుసా! అంత గొప్ప స్నేహబంధం మాది. అంతులేని దూరాలున్న నింగిని , నేలను కలిపే బాంధవ్యం మాది. ఆ కర్తవ్యమూ మాదే.
అరె, అదేమిటి ఆ చివరనున్న మా పెద్దన్న అలా పాలిపోయిన ముఖంతో దీనంగా కనిపిస్తున్నాడే? ఏమయిందో తనకు? చలేస్తుందేమో చినుకులలో తడిసి వీస్తున్న గాలివల్ల! అయ్యో , నేను చూస్తూ ఉండిపోతున్నానే ఏమీ చేయలేకపోతున్నానే, తన కెంత బాధగా ఉందో తనూ మాతో పాటు ఆటపాటలలో పాల్గొనలేకపోతున్నందుకు. నాకైతే తననూ చేయి పట్టుకొని లాక్కొని రావాలనుంది.
మా చిన్ని తమ్మునికివేమీ పట్టవు. తన లోకమే తనది. అక్కచెల్లెళ్ళతో దోబూచులాటలు, వాళ్ళకు కావలసినవి ఎండల్లో వానల్లో కూడా తెచ్చివ్వడం , అమ్మకొమ్మను మురిపించడమే వాడి ప్రపంచం.
అల్లంత దూరంలో ఉన్న మా అన్నకు నేనే సాయమూ చేయలేకపోతున్నాను. ఏమవుతుందో ! ఏమయిపోతాడో! ఎవరు నాకు సరైన సలహా ఇవ్వగలరు? నేనెవర్ని అడగగలను? ఎవర్ని నమ్మగలను? అయ్యో, సమయము మించిపోతున్నది. అల్లల్లాడి పోతుంటే చూడలేకపోతున్నాను.
అన్నా, నిన్ను చూసే నేను పెరిగాను. నీతోనే ఆటపాటలు నేర్చుకున్నాను. నాకే సందేహం వచ్చినా భయపడినా నా దిక్కు నీవేనని నీవైపు చూస్తుంటాను. మరి ఈ పొద్దు నీకే ఇంత కష్టం వచ్చిందే? నేనేమి చెయ్యాలి? నా వల్ల ఏమవుతుంది? ఈ రోజు నా స్నేహితుల పలకరింపులు కూడా నాకు ఉల్లాసం కలిగించలేకపోతున్నాయి. నా దృష్టి అంతా నీమీదే ఉంది.
ఆ..అయ్యయ్యో! అయ్యో! ఏమవుతోంది! అమ్మ కొమ్మను వీడి, మా అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? అంతేనా, ఇలా రాలిపోవడమే జీవితానికి ముగింపా? ఇందుకోసమేనా ఇన్ని మురిపాలు, ముచ్చట్లు! ఒకనాడంతా ముగిసిపోతుందా? ఈ లోకమంతా నాదేనంటూ, నేను లేకపోతే లోకానికే ఉనికి లేకుండా పోతుందేమో నన్నంతగా ఈ లోకాన్ని ప్రేమించానే? చుట్టూ ఉన్నవాళ్ళంతా నాకోసమే, నేను వాళ్ళ కోసమే అనుకున్నానే. ఇదంతా నాటకం ముగిసినట్టు ఒకనాడు ముగిసిపోతుందా? ఇలాగే తెరపడిపోతుందా?
గాలిలో తేలుతూ రాలుతూన్న అన్న గొంతు గాలివాటుగా వినిపిస్తోంది.
“లేదు తమ్ముడూ! ఈ నాటకానికి ఆది, అంతూ ఉండవు. తెర పడడం మళ్ళీ లేవడానికే. లేచిన కెరటాలు పడక మానవు, పడిన కెరటాలు ఉవ్వెత్తున లేవకా మానవు. కేవలం ఒకరి తర్వాత ఒకరు పాత్రలుగా వచ్చి వారి వంతు నాటకం పోషించి తెరవెనక్కు వెళ్తుంటాము.
అంతేకాదు. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని బాధపడకు. అమ్మ కొమ్మను వీడుతున్నానని బెంగపెట్టుకోకు. వీడితే ఎక్కడికెళతాను? అమ్మలనందరినీ గన్న అమ్మ ఈ భూమమ్మ ఒడిలోకే కదా చేరుతున్నాను. మళ్ళీ వస్తాను. ఈ భూమమ్మ నన్ను, నాలాంటి తన మనవళ్ళను,మనవరాళ్ళను అందరినీ చూడాలనిపించి పిలిపించుకుంటుంది. ఎప్పుడో అమ్మకు పురుడు పోసినపుడు కదా చూడడం! మరి చూడాలని ఉండదూ మనవలను?
మన అన్న దమ్ములను, అక్కచెల్లెండ్రను పిలిపించుకొని, ముద్దుమురిపాలతో తన దగ్గర ఉంచుకొని, మళ్ళీ సుష్ఠు గా మనలను తయారుచేసి మళ్ళీ ఇక్కడికే గదా పంపుతుంది? నీకు నాపై, నాకు నీపై మనకు మన లోకం అన్న మోహాలున్నంత వరకూ ఇలాగే వచ్చిపోతుంటాము.
ఈ సత్యాన్ని తెలుసుకోవడం కాక ఆకళింపు కూడా చేసుకొన్న రోజున ఇక భూమమ్మ తనలోనే కలిపేసుకుంటుంది. కొండలుగా, బండలుగా, మట్టిలో మట్టిగా కలిపేసుకుంటుంది. అప్పుడు నీవు, నేను అనే కాదు మొత్తం విశ్వమే మనము, మనమే విశ్వము అన్న పెద్ద మాటలు కూడా అర్థమౌతాయి. “
మాటలన్నీ ముగిసిన వేళ భూమమ్మ ఒడిలో గెంతులేస్తూ ఆడుతున్న అన్న కనిపించాడు.

—–అంతే——-

కథకుడు – పచ్చటి లేతాకు.

ఆకాశపుటంచు నుంచి వచ్చే స్నేహితులు—చినుకులు.
బండ్ల మ్రోతలు, దీపాలు- ఉరుములు, మెరుపులు.
మరిచిపోలేని పరిమళాలు- తొలకరిలో మట్టి పరిమళాలు.
పెద్దన్న—రాలబోయే పండుటాకు/ఎండుటాకు.
చిన్ని తమ్ముడు –చిగురుటాకు.
అక్కచెల్లెళ్ళు—పువ్వులు,మొగ్గలు.
కావలసినవన్నీ తెచ్చివ్వడం—పత్రహరితపు ఆహారం.
అమ్మ—కొమ్మ
అమ్మలందరినీ గన్న అమ్మ-భూమమ్మ- భూమి
*****

2 thoughts on “ఆకుదొక కథ!

  1. బాగుందండి ఆకు కథ. పెద్దన్న పండుటాకు..చిన్నన్న చిగురుటాకు – కవితలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *