సామాజిక స్పృహ నేపధ్యం

రచన: డా. నాగపద్మిని పుట్టపర్తి

మానవుడు సంఘజీవి. అంతే కాదు మేధోజీవి కూడా. సమాజంలో ఇరుగుపొరుగు వారితోనే కాదు, జంతువులూ, మొక్కలతోనూ సహజీవనం చక్కగా చేయగల నేర్పు, ఓర్పూ గలవాడని, తరతరాల చరిత్ర చెబుతున్నది.తన హక్కులూ బాధ్యతలేకాక, ఇతరుల హక్కులూ బాధ్యతలను గౌరవించటమన్న సర్దుబాటును అలవరచుకోవటమే అంచెలంచెలుగా మానవేతిహాసమైంది.

అసలిలా మానవుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించిన స్పృహతో జీవించటాన్నే సామాజిక స్పృహ అన్న పేరుతో పిలుస్తున్నారు ఇటీవలి కాలంలో. కానీ యీ స్పృహ చాలా పాతకాలంలోనే మనిషిలో ఉండేదనటనికి ఉదాహరణలు, అప్పట్లో వెలసిన సాహిత్యమేనని ఘంటాపథంగా చెప్పవచ్చును. ఈ క్రమ వికాసాన్ని, మనుస్మృతి మొదలు రామాయణ, మహాభారత కథాక్రమంలో చూడగలం. స్త్రీ పురుష బంధం, ప్రకృతితో మెలగాల్సిన పద్ధతీ, ప్రభుత్వంతో వ్యవహరించవలసిన తీరూ, భగవంతుని పట్ల విశ్వాసం. ఇవన్నీ వివరంగా కథల్లో జోడించి చెప్పిన తీరు అద్భుతం. ఇవన్నీ సక్రమంగా మనిషి ఆచరిస్తూ ఉంటేనే, సకల సృష్టీ సుఖ శాంతులతో విలసిల్లుతుందని అలనాటి ఋషులూ, ఋషులైన కావ్యకర్తలూ కూడా భావించినట్టు విశదమౌతున్నది. ఈ సామాజిక బాధ్యత అన్న స్పృహను మన ప్రాచీన గ్రంధాల్లో యెలా విశ్లేషించారో చూద్దామా !

గౌతమముని తన ధర్మ సూత్రాలలో, సర్వ భూతదయ, అసూయను నియంత్రించుకోవటం, మనోవాక్కాయ కర్మలలో పరిశుద్ధత, మన శక్తికి మించిన పనులజోలికి వెళ్ళక సంయమనం పాటించటం, మాటల్లోనూ, చేష్టల్లోనూ ఆలోచనల్లోనూ అమంగళకరమైనవి దరిచేరకుండా జాగ్రత్త పడటం, దైన్యం లేకుండా ధైర్యంగా ఉండటం, దురాశ నుంచీ దూరంగా ఉండటం – యీ యెనిమిది గుణాలనూ ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని చెబుతూ, వీటినే ‘ఆత్మగుణాలు ‘ అన్నాడు. (గౌ. భ.సూ.23-26)

మను స్మృతిలో (6-92) స్థిర చిత్తం, క్షమ, దయ, ఇతరుల వస్తువులను అపహరించకపోవటం, మనో వాక్ కాయాల పరిశుద్ధత, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసం, విద్య, సత్యం, కోపానికి దూరంగా ఉండటం ఇవన్నీ ధర్మస్వరూపమనబడతాయని చెప్పాడు. స్త్రీని గౌరవించవలసిన పద్ధతిని మనువు యెంతో బాగా విశ్లేషించాడు కూడా ! ప్రకృతిలోని జీవరాసులన్నింటితోనూ సమరస భావంతో ఉండాలనీ మనువన్నాడు. (మను 1-49) అంతే కాదు, గార్హస్త్యంలో చీపురు, రోలు, రోకలి,నీళ్ళ బిందె వంటివి ఉపయోగించే సమయాల్లో మనకు తెలియకుండానే కొన్నిజీవులను బాధపెడుతుంటాము. దానికి ప్రాయశ్చిత్తం కూడా మనువు సూచించాడు.

తైత్తరీయ బ్రాహ్మణంలో (3.7.5) వివాహమైన మరు క్షణం నుండే భార్యాభర్తలిరువురూ ధార్మిక కార్యాలు కలిసి ఆచరిస్తూ వాటి ఫలితాలనూ కలిసి అనుభవించవలెనని ఉంది. తన కుటుంబానికి అవసరమయ్యేంత ధనం ఉంచుకొని, తక్కినదంతా ఇతరులకూ, పశుపక్ష్యాదులకూ ఉపయోగపడేలా వెచ్చించాలనీ, బావులూ చెరువులూ తవ్వించాలనీ,ఆకలిగొన్నవాళ్ళకు అన్నదానం చేసే సత్రాలు కట్టించాలనీ అందరూ సామూహికంగా ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా దేవాలయాలు కట్టించాలనీ (తైత్త. 10.63) కూడా ఉంది. సుఖ దు:ఖాలు మనకెలా ఉంటాయో, ఇతరులకూ అలాగే ఉంటాయని గుర్తించి నడచుకునే వ్యక్తే యోగి అంటుంది గీత. (6/32) గృహస్థాశ్రమంలో సమాజంలో అన్ని వర్గాలకూ ఉపయోగపడుతూ, చివరికి కాకులకూ శునకాలకూ కూడా ఆహారం వేయమని హెచ్చరిస్తుంది పద్మపురాణం. యాజ్ఞవల్క్య ముని, రోగికి సేవచేస్తే గోదాన ఫలం అభిస్తుందంటే, గీతాకారుడు, తన పొట్టపోసుకోవటానికి అవసరమయ్యేంత ధనాన్ని మాత్రమే కాక, అంతకుమించి కూడబెట్టుకున్నవాడు, శిక్షార్హుడైన దొంగేనంటాడు. దుర్మార్గుడైన రాజు పట్ల క్రూరంగా వ్యవహరించే హక్కునిచ్చేశాడు మహాభారత కర్త. (61/32.33) ఇక 11వ శతాబ్దానికి చెందిన గోరఖ్నాథ్, మాంస భక్షణవల్ల దయ నశిస్తుందనీ, మదిరాపానం వల్ల నిరాశ పెరుగుతుందనీ, ఇంద్రియ నిగహం, సత్యభాషణం అతణ్ణి ఉత్తముణ్ణి చేస్తాయనీ హెచ్చరించారు. ( గోరఖ్ బానీ 165/166) హితోపదేశ సూత్రాలన్నీ, మానవ సమాజ సుఖ జీవనోపదేశాలే కదా మరి !!

ఆధునిక యుగంలో ఎటు విన్నా వినిపిస్తున్న సామాజిక స్పృహ అన్న అంశానికి పునాదులు ప్రాచీన కాలం నుంచే ఉన్నాయనేందుకు పై ఉదాహరణలన్నీ ఆధారాలేకదా !

మమ్మటుడు తన కావ్య ప్రకాశంలో కావ్య ప్రయోజనాలుగా ఈ క్రింది వానిని వివరించాడు.

కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేస యుజే.

కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మితమైన ప్రభోధం కొరకు అని మమ్మటుని అభిప్రాయము.

కావ్య రచన వెనుక ఇన్ని కాణాలుంటాయని ఆనాడే సూచించిన అంశాలలో, సమాజ శ్రేయస్సూ ప్రధానంగా ఉంది. దీన్నే ‘ కమిట్ మెంట్ టు సొసైటీ ‘ అంటున్నారీకాలంలో !

నిజానికీ సామాజిక స్పృహ అన్నది మౌఖిక సాహిత్యంగా వ్యాప్తి చెంది, ఇప్పుడు నగరీకరణలో మసకబారుతున్న జానపద కళల్లో యెలా వ్యక్తీకరింపబడిందో, దానివల్ల సమజానికి చేకూరిన లాభమేమిటో వివరించటానికీ ఉదాహరణ ఉపయోగపడుతుంది.

అది క్రీ.శ. 1502 నాటి మాట.విజయనగర రాజు వీర నరసింహరాయలవారి అంత:పురంలో యేర్పాటు చేయబడిన కూచిపూడి భాగవతుల ప్రదర్శన రసవత్తరంగా సాగుతోంది. (రాజు కూచిపూడి భాగవతులు చక్కటి విద్యావంతులని విని, అంత:పుర స్త్రీలు కూడా వారి ప్రదర్శనను చూసి ఆనందించాలనే ఉద్దేశం తో యేర్పాటు చేశాడిలా) ప్రదర్శనలోని ఒక ఘట్టం, ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. కథలో ఒక నటుడు, ప్రజలనుండీ పన్నులు రాబట్టే అధికారి వేషం వేశాడు. పాత్రననుసరించి చాలా క్రూరంగా నటిస్తూ, కొందరు స్త్రీ పాత్రధారిణుల స్తనాలకు చిడతలు బలవంతంగా తగిలించి, వాళ్ళు దయనీయంగా యేడుస్తుంటే చూడలేక కాళ్ళా వేళ్ళా పడుతున్న వాళ్ళ భర్తలను..’మీరు పన్నులు సకాలానికి చెల్లించక పోతే, పాలకులం మేము ఊరికే కూర్చుంటామనుకున్నారా? మీనుంచీ పన్నులు రాబట్టే మార్గం మాకు తెలుసు బాగా…’ అని మరింత వికటంగా నవ్వుతున్నాడు. ఈ దృశ్యం, చూస్తూ, వీర నరసింహరాయలు ఉడికిపోతున్నాడు. ‘ఆపండి మీ ప్రదర్శన.. ఇదెక్కడి న్యాయం? ఇదేమి కల్పన? ఇలా ప్రదర్సించి పాలకులను అవమానపరుస్తారా మీ భాగవతులు? మీరేదో బాగా చదువుకున్నారని, మా అంత:పురంలో ప్రదర్శన యేర్పాటు చేస్తే, మీరు మా రాజులనే అవమానపరచే కల్పనలిలా చేస్తూ, నా యెదుటే నిలబడిఉన్నారా ఇంకా? ‘ అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ప్రదర్శన ఆగిపోయింది. కూచిపూడి భాగవతుల నాయకుడు ముకుళిత హస్తాలతో రాయలవారి ముందు నిల్చున్నాడు. ‘ప్రభూ ! మిమ్ములనవమానపరచే ఉద్దేశం లేదు మాకు..కనీ ఇది వాస్తవం. సిద్ధవటం (కడప జిల్లా) సీమలో సమ్మెట గురవరాజు అనే పరిపాలకుడున్నాడు మహారాజా! అతను ఇలాంటి క్రూర విధానాలతో ప్రజలను పీడిస్తూ, పన్నులు రాబడుతున్నాడు. మేము ఇక్కడికొచ్చేముందు అక్కడి ప్రజల ఇక్కట్లను చూసి ఎంతో బాధపడ్డాం. ఆ ప్రాంతంలోని అన్యాయాన్ని మీ దృష్టికి తెచ్చేందుకే, మ ప్రదర్శనలో ఆ అంశాన్ని చేర్చాము ప్రభూ..మాది నేరమైతే. మమ్మల్ని శిక్షించండి. కళలు కేవలం మనోరంజనానికెే కాక, సమజ హితవుకోసమని కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకే మీ యెదుట ఇలా అక్కడి పరిస్థితిని ప్రదర్శించాము. ఇక అక్కడి ప్రజలను ఆ దుష్ట పాలకుని కబంధ హస్తలనుంచీ యెల మీరు కాపాడుతారో, మీ ఇష్టం..’ అని చేతులు జోడించి నిలబడ్డాడు. ఇంకేముంది? కూచిపూడి భాగవతుల సమయస్ఫూతికి వీర నరసింహరాయలు మెచ్చుకుని, తగురీతిని గౌరవించి, వెంటనేసమ్మెట గురవరాజు మీద దండెత్తి, అతన్ని శిక్షించి, ప్రజలను రక్షించాడు. ఇది అలనాటి కైఫియత్తులోనూ ఉటంకించబడింది. (వాగ్గేయకారులు – పదకృతి సాహిత్యం.డా.పుట్టపర్తి నారాయణాచార్యులు – 63వ పుట)

కవులనేవారు, సమాజంలోనివారే! వేరెక్కడినుండో ఊడిపడరు కదా ! సమాజంలో తమ దృష్టిని ఆకర్షించినవాటికి కూడా చోటిస్తారు తమ నిశిత దృష్టిని ఋజువు చేసుకుంటూ!! ప్రాకృతసాహిత్యంలోని యీ ఉదాహరణ మచ్చుకు:

‘దుగ్గ అ అట్ఠీ కహణు మే ధో ఇ యేణ సోఢవ్వా

దసి ఓసరంత సలిలేణ ఉ అ హ దుణ్ణం వ పడయేణ ‘

ఒక బీద వ్యక్తి చిరిగి పీలికలైపోయిన పాత పంచెను చెరువు గట్టున ఉతుక్కుంటున్నాడు. అసలే చిరిగిపోయి ఉంది. మరీమరీ బండకేసి బాదుతున్నాడా వ్యక్తి. దానిలోంచీ నీళ్ళు కారుతున్నాయి. గట్టున నిల్చునివున్న ఒక ప్రాకృత కవికీ దృశ్యం కనిపించింది. వెంటనే ఓ కవిత స్ఫురించిందిలా ‘ఎన్నిమార్లు నన్ను బండకేసి ఉతుకుతావయ్యా బాబూ ! చిరిగి పీలికలైపోయాను కదా ! నన్నొదిలిపెట్టు మహాప్రభో ! ‘ అంటూ ఒక బీదవాని పాత పంచె యేడుస్తున్నదేమో అన్నట్టు,ఆ పాత పంచె నుంచీ నీళ్ళు కారుతున్నాయి ‘ అనేశాడు. యెంతటి సహజాలంకారం ! ఎంత వేదనాభరిత వర్ణన! ఎప్పటి హాలుడు? ఎప్పటి గాధాసప్తశతి ? ఆనాడూ కడు దారిద్ర్యాన్ని అనుభవించే వర్గాలవారున్నారనేందుకీ గాధే జీవంతమైన ఉదాహరణ కాదూ? అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళాయే కాదు, పాత పంచె కూడా కవితావస్తువేనని రెండువేల ప్రాకృత కవో చెప్పేశాడిలా. హాలుడు సేకరించి కూర్చిన 200బీసీ నాటి ఆర్యా వృత్త రచనల్లో ఇలాంటి రచనలు కోకొల్లలు.

సాహిత్య చరిత్రలో కాస్త అడుగు ముందుకేద్దాం. తెలంగాణా ప్రాంతం గేయసాహిత్యానికి పునాది వేసింది. బానిసత్వం, వెట్టి చాకిరీ లాంటి దురాచారాలను తలంగాణావాడైన పాల్కురికి తన బసవపురాణంలో ఉటంకించాడు. (బసవ-పుట 309) బానిసలను కాపలా కుక్కల్లా చూసేవారనీ, వివిధ మతానుయాయుల మధ్య వాదోపవాదాలు నడిచేవనీ,అప్పట్లో దొంగతనాలు చేసేవారీ వస్తువులు వాడేవారనీ కూడా పాల్కురికి వర్ణించాడు. అంటే, పాల్కురికిలో సామాజిక దృష్టికోణం పుష్కలంగా ఉండేదన్నమాటే కదా !

‘పరబ్రహ్మమొక్కటే, మాది గొప్ప, మాది గొప్ప అని కొట్టుకు చావకండహో ‘ అన్న అన్నమయ్యా, ‘ఎప్పుడూ పాలూ, వెన్నముద్దలేకాదు, నలా రాగిసంగటినీ తిని చూడు, అప్పుడు చూస్తానీ నీల్గు ‘అని తన బీదరికాన్ని పదాల్లో పొదివిన సారంగపాణీ, సాలెవారి వృత్తిని తన స్వామికి సరదా పాటగా పరిచయం చేసిన రాకమచెర్లా…ఇంకా చాలామంది రచనల్లో సామాజిక స్పృహ, వర్షాకాల నదిలా పరవళ్ళు తొక్కుతూ దర్శనమిస్తుంది. వాళ్ళెవరూ, దండోరావేస్తూ చాటించుకోలేదు, ‘మా నిశితదృష్టి ఇలా ఉంది, గమనించండి ‘ అని. మాణీక్యాలూ, వజ్రాలను మనమే వాటి విలువ తెలిసి గుర్తించి గౌరవించాలి. లేదా నష్టం మనకేనని గుర్తించాలి. ఏమంటారు?

…………………..

Leave a Comment