March 29, 2024

స్త్రీ ఎందుకు బానిసైంది? – ముళ్ళ కంచెల మూలాలు

రచన: జ్వలిత

భార‌తదేశానికి స్వాతంత్య్రం రాక ముందు, స్త్రీవాదం గురించిన ఆలోచ‌న భార‌త‌దేశంలో మొల‌కెత్త‌క ముందే 1942లోనే “స్త్రీ ఎందుకు బానిసైంది”. అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తి చ‌ర్చించి వివ‌ర‌ణనిచ్చారు “ఆత్మ గౌర‌వ ఉద్య‌మకారుడు” యాక్టివిస్ట్ ఈరోడ్ వెంక‌ట‌ప్ప రామ‌స్వామి పెరియార్‌.
వారు ఆంగ్లంలో రాసిన “Why were women Enslaved” ర‌చ‌న‌కు తెలుగు సేత ఎ.జి. య‌తిరాజులు చేయ‌గా ప్ర‌జాశ‌క్తి బుక్ హౌస్ వారు 2010లో ప్ర‌చురించారు. క‌వ‌రు పేజీతో క‌లిపి 52పేజీల పుస్త‌కం. ఇందులో మొత్తం ప‌ది అధ్యాయాలు ఉన్నాయి.

మొద‌టి అధ్యాయంలో “శీలం పాతివ్ర‌త్యం”
‘శీలం’ అనే ప‌దానికి నాశ‌నం లేనిది దృఢ‌మైన‌ది అనే నిఘంటు అర్థాలున్నాయి. కానీ, శీలం అనే ప‌దాన్ని కేవ‌లం స్త్రీల‌కు మాత్ర‌మే సంబంధించిన‌దిగా వాడ‌టాన్ని ప్ర‌స్తావిస్తారు ర‌చ‌యిత‌. ‘చెస్టిటీ’, ‘వ‌ర్జినిటీ’వంటి స‌మానార్థాల ప‌రిశీల‌న‌తో ఆడ మ‌గ క‌లియిక‌కు సంబంధంలేని ప‌రిశుభ్ర‌త‌, ప‌విత్ర‌త‌కే ఈ ప‌దానికున్న విస్తృతార్థంగా చెప్పారు. అయితే సంస్కృత భాషా ప‌దాల‌ను ప‌రిశీలించిన‌పుడు శీలానికి బానిస అనే భావం క‌లిగేట్లు వ్యాప్తి చేశార‌ని ర‌చ‌యిత త‌మ అభిప్రాయం వెలిబుచ్చారు. త‌మిళులు ప్రాచీన క‌వి తిరువ‌ళ్లువ‌ర్ ర‌చించిన ‘తిరుక్కుర‌ళ్’ వేదంగా ప‌విత్ర‌ ఉద్గ్రంథ‌గా భావిస్తారు. కాని మ‌హిళ‌ల ప‌ట్ల అందులోని అభిప్రాయాల‌ను తాను అంగీక‌రించ‌ను అంటారు పెరియార్‌. భ‌ర్త‌కు భార్య‌ బానిస‌నే భావాన్ని తిరువ‌ళ్ళువ‌ర్ అనేక ప‌ద్యాల‌లో వ్య‌క్త‌ప‌రిచాడంటారు. మ‌న భాష‌ల్లో “శీల‌వంతుడు”“ప‌త్నీవ్ర‌తుడు” అనే ప‌దాలు ప్రాచూర్యంలో లేక‌పోవ‌డానికి పురుషాధిక్య‌మే కార‌ణ‌మంటారు. యూర‌ప్ దేశాల్లో మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ ఉన్న‌ద‌నిపించినా అక్క‌డి రాజ శాస‌నాలు కూడా భ‌ర్త‌కు భార్య అణ‌గి ఉండాల‌నే ఆదేశిస్తాయ‌ని వివ‌రించారు.
స్వాతంత్రానికి ముందు భార‌త‌దేశంలో హిందూ వివాహ చ‌ట్టం లేనందువ‌ల్ల హిందూ పురుషుడు ఒక‌టి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేవాడు అని అనువాద‌కుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు చ‌ట్టం ఉన్నా బ‌హు భార్య‌త్వం మ‌న స‌మాజంలో ఇంకా కొన‌సాగుతూనే ఉందంటాను నేను. నిజ‌మైన స్త్రీ విముక్తి జ‌ర‌గాలంటే శీలం, పాతివ్ర‌త్య‌మ‌నే భావాలు న‌శించి స్త్రీ పురుషుల‌కు స‌మాన‌మైన శీలం సుస్థిరం కావాల‌న్నారు పెరియార్‌. నిర్బంధాల వ‌ల్ల‌, జ‌న్మ కార‌ణంగా వివ‌క్ష‌త వ‌ల్ల‌, బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుడిని బాధించే ప‌రిస్థితి పోద‌న్నారు. నిర్బంధ శీలం, నిర్బంధ పాతివ్ర‌త్యాన్ని మించిన ఘోరం మాన‌వ స‌మాజంలో లేద‌ని వారి అభిప్రాయం.

రెండ‌వ అధ్యాయం తిరువ‌ళ్ళువ‌ర్ – శీలం, పాతివ్ర‌త్యం
ఇందులో మొద‌టి అధ్యాయం పై వ‌చ్చిన ఒక లేఖ‌ను గురించి చ‌ర్చించారు పెరియార్ రామ‌స్వామి. ఏ కాలంలో ద‌ళితుల‌ను అంట‌రానివారిగా చేసి అప్పుడే బౌద్దికంగా వారిని ఎద‌గ‌టానిక‌వ‌స‌రమైన సాధ‌నాలు లేకుండా చేశారు. దీనిని చేసిన వారే మ‌హిళ‌ల‌కు జ్ఞానసంప‌ద‌కు అవ‌కాశం లేకుండా చేసి ద‌ళితుల‌ను స్త్రీల‌ను త‌క్కువ స్థాయి అని నిర్ణ‌యించారంటారు. ఈ అధ్యాయంలో అవ్వ‌యీర్‌ నీతి గ్రంథం“అత్తిచూడి” తిరువ‌ళ్లువ‌ర్ వేదం “తిరుక్కుర‌ళ్‌”లో స్త్రీల‌కు పూర్తి న్యాయం క‌లిగించలేదంటారు. పై ర‌చ‌యిత‌లిద్ద‌రిపై ఆర్య వ్య‌వ‌స్థ ప్ర‌భావం ఉందంటారాయ‌న‌. నాటి త‌మిళ క‌వి ‘కొంబ‌న్‌’ పై కూడా ఆర్య ప్ర‌భావం ఉంద‌న్నారు.
ఈ అధ్యాయం ముఖ్య ఉద్దేశం స్త్రీ పురుషుల హ‌క్కుల మ‌ధ్య తేడా ఎందుకుండాలి అనే అంశాన్ని వివ‌రించ‌డ‌మే. మాన‌వ జాతి ప్ర‌గ‌తికి స్త్రీ పురుషుల గుణ‌గ‌ణాలు, స్వ‌భావ ల‌క్ష‌ణాలు ఒకే విధంగా ఉండాలంటారు పెరియార్‌. కానీ, పురుషులు కృత్రిమంగా, స్వార్థ‌ప‌రంగా కుట్ర‌తో స్త్రీల‌ను బానిస‌లుగా చేసుకున్నార‌న్న‌ది మ‌రో ఆరోప‌ణ‌. గ‌ర్భ‌ధార‌ణ – పిల్ల‌లు క‌న‌డం లేనంత మాత్రాన పురుషుల‌కు ప్రేమాభిమానాలు శాంత స్వ‌భావం ఉండ‌వ‌ని అనుకోవ‌ల‌సిన ప‌ని లేదు. తిరువ‌ళ్ళువ‌ర్ చెప్పిన‌ట్టు ఎక్కువ మంది అంగీక‌రించిన త‌ప్పుడు అభిప్రాయాన్ని మ‌నం అంగీక‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని పెరియార్ వివ‌రించారు.

మూడో అధ్య‌యం – ప్రేమ‌
స్త్రీ పురుషుల మ‌ధ్య ఉన్న‌ట్టు చెప్పే ప్రేమ‌కు ప్ర‌త్యేక‌మైన స్వ‌భ‌వం లేదంటారు. ప్రేమలో స్నేహం, ఆశ‌, ఆద‌ర‌ణ వంటి భావాలే ఎక్కువ అని వివ‌రించారు.తొలిచూపు ప్రేమ వంటి ప్రేమ ఒక్క‌రికే సొంతం అనేది అబ‌ద్దం అని చెబుతూ, ప్రేమ గురించి ఉప‌న్యాసాలిచ్చే వారికి మాన‌వ ప్ర‌వృత్తులు తెలియ‌వ‌ని, ఒక వేళ స‌త్యం తెలిసిన ఏదో ఒక కార‌ణంతో అంగీక‌రించ‌ర‌ని అంటారు.ప్రేమ‌కు లేనిపోని గౌర‌వం విలువ ఆపాదించింద‌ని అంటారు పెరియార్ రామ‌స్వామి. ప్రేమ‌కు ప్ర‌తి భాష‌లోను అనేక ప‌ర్యాయ ప‌దాలున్నా అవ‌న్నీ ఆడ‌, మగ మ‌ధ్య స్నేహం, కామం, ఇచ్ఛ‌, ఆశ‌, ఉత్సుక‌త వంటి వాటినే తెలియ‌జేస్తాయి.
ఏ ప్రేమ‌యినా స‌రే త‌న స్వీయ ల‌క్ష్యం సాధించేందుకే కాని వేరే కార‌ణం లేదంటారు పెరియార్‌. మ‌న స‌మాజంలో స్త్రీల‌ను ద్వీతీయ శ్రేణి పౌరులుగా మార్చినందువ‌ల్ల త‌లెత్త‌క నేల‌చూపు స్త్రీలు ప‌తివ్ర‌త‌లు అనే భావాల‌ను న‌ర‌న‌రాల్లో నింపారు పురుషులు. అంతేకాని, జ‌నాల్లో నిర్జీవ‌, స‌జీవ ప్రాణుల ప‌ట్ల ఆక‌ర్ష‌ణ వంటిదే ప్రేమ‌. అయితే ప్రేమరాహిత్య‌మే అనేక అరాచ‌కాల‌కు కార‌ణం. ప్రేమ‌లో స్వార్థం ఉండ‌దు, విశ్వ‌ప్రేమ భావ‌న గురించి నాటి స‌మాజంలో తావు లేక‌పోవ‌చ్చ‌ని నా అభిప్రాయం.

నాలుగో అధ్యాయం – వివాహం నుండి విముక్తి
వివాహం, కుటుంబ జీవితం విష‌యంలో మ‌న దేశంలో అనేక అన్యాయాలు అఘాయిత్యాలు జ‌రుగుతున్న‌వ‌ని పెరియార్ రామ‌స్వామి వివ‌రిస్తారు. వివాహ వ్య‌వ‌స్థ మ‌హిళ‌ల‌ను మ‌గ‌వారికి బానిస‌లుగా చేయ‌డం కోస‌మే ఏర్ప‌డింది అంటారు. ప‌విత్ర‌మైన వివాహాలు, దేవ‌త‌లు చేసిన పెళ్ళిళ్ళు అంటూ వేల సంవ‌త్స‌రాల నుండి మ‌హిళ‌ల‌ను మోస‌పుచ్చుతున్నాము అంటారు. చెంగ‌ల్ ప‌ట్టు న‌గ‌రంలో జ‌రిగిన ఆత్మగౌర‌వ మ‌హాస‌భ‌లో విడాకులు తీసుకునే హ‌క్కు కావాల‌ని తీర్మానించినందుకు సంస్క‌ర‌ణ వాదులు వ్య‌తిరేకించార‌నీ, త‌రువాత దేశంలో ప‌లు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచంలో ప‌లు దేశాల్లోను విడాకులు తీసుకునే హ‌క్కును చ‌ట్టంగా చేసింది. ‘శీలం’ విష‌యంలో అనుమానంతో ఎంద‌రో భ‌ర్త‌లు త‌మ భార్య‌ల‌ను దారుణంగా చంపుతున్న‌ట్టు ఆనాడే వారు చెప్పారు. మ‌హిళ‌లు అభివృద్ధి చెందాలంటే మ‌నుషులుగా మాన‌వ‌హ‌క్కులు, ఆత్మ‌గౌర‌వంతో జీవించాలంటే, పురుషులు కూడా సంతోషం, నైతిక విలువ‌ల‌తో ఉండాలంటే విడాకుల హ‌క్కు కావాలంటారు. దైవికం, విడ‌దీయ‌లేనిది అనేది కేవ‌లం బూట‌క‌మంటారు. స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ స‌హ‌చ‌ర్యం అత్యంత అవ‌స‌రం అయితే, అందులో ఉన్న అభ్యంత‌రాలు బాధ‌లు తొల‌గించుకోవ‌ల‌సిన క‌ర్త‌వ్యం జ్ఞాన సంప‌న్న‌డైన మ‌నిషిది అంటారు.

ఐదో అధ్యాయం -త‌ప్పుకాని పున‌ర్వివాహం
పురుషుడు ఏఏ సంద‌ర్భాల్లో పున‌ర్వివాహం త‌ప్పు కాద‌ని భావించాలో పెరియార్ రామ‌స్వామి గారు వివ‌రించారు.
(1) భార్య మ‌ర‌ణించిన‌పుడు (2)భార్య వేరొక‌రితో లేచిపోయిన‌పుడు (3)భార్య దీర్ఘ రోగంతో ఉన్న‌పుడు (4) భార్య అజ్ఞానం, అహంకారంతో వివాహ బంధాన్ని గౌర‌వించ‌న‌పుడు (5) భ‌ర్త నిరాద‌ర‌ణ‌ను, హింస‌ను భ‌రించ‌లేక శాశ్వ‌తంగా పుట్టింటికి వెళ్ళిన‌పుడు (6)భ‌ర్త స్వ‌భావానికి వ్య‌తిరేకంగా న‌డుచుకునే భార్య నుండి విడిపోయిన‌పుడు (7) ధ‌నిక కుటుంబం నుండి వ‌చ్చిన భార్య భ‌ర్త‌ను తిర‌స్క‌రిస్తున్న‌పుడు. పై సంద‌ర్భాలేవి స్త్రీకి ఆ హ‌క్కును ప్ర‌క‌టించ‌లేదు. ఎవ‌రైనా వాదించేట‌పుడు శృతి, యుక్తి, అనుభ‌వం అనే మూడు అంశాల‌ను దృష్టిలో ఉంచుకోవాలంటారు.
పెరియార్ రామ‌స్వామి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఆత్మగౌర‌వ ఉద్య‌మం ఆ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించి స్త్రీ పురుషుల‌కు ఆనందాన్ని అందించి సామాజిక బంధాల నుండి విముక్తి క‌లిగించే ప్ర‌య‌త్నం చేసింద‌ని వివ‌రించారు. భార్య‌కు ఏ కారణంగా విడాకులు ఇవ్వ‌కుండా మ‌రో పెళ్ళి చేసుకోకూడ‌దు. ఇది ఆత్మ‌గౌర‌వ కార్య‌క‌ర్త‌లు త‌ప్ప‌క పాటించాలి అన్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల స్త్రీ పురుషుల క‌ర్త‌వ్యాలు ఎలా ఉన్నాయో పురుషుల ప‌ట్ల స్త్రీల బాధ్య‌త‌లు కూడా అని చెప్పి అధ్యాయం ముగుస్తుంది.

ఆరో అధ్యాయం – వ్య‌భిచారం
‘వ్య‌భిచారం’ అనే ప‌దాన్ని సూక్ష్మంగా ప‌రిశీలిస్తే ఇది కుట్ర‌పూరితంగా మ‌హిళ‌ల‌ను క‌ల‌కాలం బానిస‌లుగా ఉంచేందుకు ప్ర‌యోగించ‌బ‌డిన‌ది అని స్ప‌ష్ట‌మ‌వుతుంది. మ‌హిళ‌ల అనైతిక‌త‌ను ప్ర‌శ్నిస్తూ పురుషుడిని నేర‌స్తునిగా చూడ‌టం లేదు.
శీలం పాతివ్ర‌త్యం, వ్య‌భిచారం అనే మాట‌లు స్వేచ్ఛా స‌మాన‌త్వం క‌ల‌గ‌ల‌సిన మాన‌వ జీవితానికి అవ‌స‌ర‌మైన‌వి. ఇవ‌న్నీ స్త్రీల‌కు పురుషుల‌కు స‌మానం. కానీ, అది జ‌ర‌గ‌డం లేదు. స్త్రీల‌ను భార్య‌ల‌ను ఆస్తులుగా ప‌రిగ‌ణిస్తూ మ‌హిళ‌లు త‌ప్ప‌ట‌డుగులు వేసిన‌ప్పుడు అతి భయంకరంగా శిక్షించింది సమాజం.

ఏడో అధ్యాయం వితంతు వివాహం: నాటి జనాభ లెక్కల ప్రకారం వితంతువుల సంఖ్య కింది విధంగా ఉన్నది
ఒక సంవ‌త్స‌రం వ‌య‌స్సు గ‌ల వితంతువులు 597
ఒక‌టి నుండి రెండు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వితంతువులు 494
రెండు నుండి మూడు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వితంతువులు 1,257
మూడు నుండి నాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వితంతువులు 2, 837
నాలుగు నుండి ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వితంతువులు 6, 707
ఐదు నుండి ప‌ది సంవ‌త్స‌రాల ప్రాయం గ‌ల వితంతువులు 85, 937
ప‌ది నుండి ప‌దిహేను సంవ‌త్స‌రాల ప్రాయం గ‌ల వితంతువులు 2, 32, 147
15 నుండి 20 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు గ‌ల వితంతువులు 3, 96, 172
20 నుండి 25 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు గ‌ల వితంతువులు 7, 42, 820
25 నుండి 30 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు గ‌ల వితంతువులు 11, 63, 720
మొత్తం వితంతువుల సంఖ్య 26, 31, 788

దీనిని బ‌ట్టి వితంతు స‌మ‌స్య ఎంత తీవ్ర‌మైందో గ్ర‌హించి రాజ‌రామ్ మోహ‌న్ రాయ్‌, ఈశ్వ‌ర‌చంద్ర విద్యాసాగ‌ర్‌, సురేంద్ర‌నాథ్ బెన‌ర్జీ, వీరేశ‌లింగం పంతులు, గోవింద రాన‌డే వంటివారు కృషి చేశారు అంటారు. (వీరు జ్యోతిరావు పూలే ప్ర‌స్థావ‌న తేలేదు) వీరి మాట‌ల‌ను బ‌ట్టి పైన సంస్క‌ర్త‌లు స్త్రీల పై మాన‌వీయ‌త కాక హిందూ జ‌నాబా త‌గ్గ‌డం అనే దానికి ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

ఎనిమిదో అధ్యాయం – ఆస్తి హ‌క్కు
ఈ అధ్యాయంలో ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా త‌ర‌త‌రాలుగా భార‌త‌దేశంలో రెండు ధారుణాలు కొన‌సాగుతున్నాయంటారు.
మ‌హాధారుణంలో మొద‌టిది:
దేశ ప్ర‌జ‌ల్లో ఒక భాగాన్ని అంట‌రానివారిగా ఊరికి దూరంగా జంతువుల క‌న్నా హీనంగా, ఎటువంటి భావోద్వేగాలు లేని ప్రాణులుగా చూడ‌డం.
రెండ‌వ‌ది: భార‌తీయ స్త్రీల‌ను పుట్టు బానిస‌లుగా, రెండో శ్రేణి పౌరులుగా, న‌డుస్తున్న శ‌వాలుగా ప‌రిగ‌ణించ‌డం.
మొద‌టి అంటే కుల వివ‌క్ష రూపుమాప‌నిదే స్వాతంత్య్ర పోరాటం స‌ముచితం, అంట‌రానిత‌నం తీవ్ర‌మైన జాతీయ స‌మ‌స్య‌, అది చిన్న‌దే ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు అన‌డం మూర్ఖ‌త్వం.
మ‌హిళ‌ల‌ను బానిస‌లుగా భావించినంత కాలం మ‌నం బానిస బిడ్డ‌ల‌మే అని చెప్ప‌కోవాలంటారాయ‌న‌. జాతీయోద్య‌మ నాయ‌కులు దీనిని ప‌ట్టించుకోక పోయినా స్వ‌దేశీ సంస్థానాల‌లో కొన్ని సంస్క‌ర‌ణ‌లు చేశారు. మైసూరు, బ‌రోడా, క‌శ్మీర్‌, తిరువాన్కూర్ సంస్థానాల‌లో బ్రిటీష్ ఇండియా క‌న్నా సామాజిక సంస్క‌ర‌ణ‌లు వేగాన్నందుకున్నాయి.
బ్రిటీష్ ప్ర‌భుత్వం బాల్య వివాహాల‌ను నిషేధించే‘శార‌దా చ‌ట్టం’ చేసినా మ‌న జాతీయ నాయ‌కులు స‌హ‌క‌రించ‌క అది పూర్తిగా అమ‌లు కావ‌డం లేద‌న్నారు.
దేశంలో మార్పులు చోటు చేసుకోవాలంటే కేవ‌లం మ‌గ‌వారిపై ఆధార‌ప‌డితే ప్ర‌యోజ‌నం లేద‌నే స‌త్యాన్ని మ‌హిళ‌లు గ్ర‌హించాలి. త‌మ కోసం పురుషులు ఏమీ చేయ‌ర‌ని త‌మ‌కు తామే ఉద్య‌మాల్లో ముందుండాల‌ని గ్ర‌హించాలి అంటారు పెరియారు. మ‌హిళ‌లు మొద‌ట త‌ల్లిదండ్రుల నుండి, భ‌ర్త‌ల నుండి ఆస్తి హ‌క్కును సాధించేందుకు ఉద్య‌మించాలి అంటారు. ఆస్తి హ‌క్కు పొంద‌నంత వ‌ర‌కు బానిస‌లుగానే లెక్క‌. క‌నుక ఆస్తి హ‌క్కు కోసం, స‌మాన‌త్వం కోసం మ‌హిళ‌లు కృషి చేయాల‌న్నారు.

తొమ్మిదో అధ్యాయం – గ‌ర్భ‌నిరోధం
మొద‌టిసారి గ‌ర్భ‌నిరోధం గురించి మాట్లాడిన‌పుడు ఉలిక్కిప‌డిన స‌మాజం త‌రువాత కొంత మారింది. మ‌ద్రాసు శాస‌న‌స‌భ‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య గ‌ర్భ నిరోధ ప్ర‌చారాన్ని విస్తృతం చేయాల‌ని చ‌ర్చించింది. అయితే, గ‌ర్భ నిరోధం గురించి ఇత‌రుల వాద‌న‌కు మ‌న వాద‌న‌కు తేడా ఉంది. ఆ తేడా అత్యంత ముఖ్య‌మైన‌ది. స్త్రీలు స్వేచ్ఛ పొందాలంటే గ‌ర్భ నిరోధం అవ‌స‌రం. న‌న్న‌డిగితే ప్రస్తుతం ఉన్న మ‌హిళ‌లు బిడ్డ‌ల‌ను క‌న‌డ‌మే మానెయ్యాల‌ని చెబుతాను. బిడ్డ‌ల‌ను క‌ని వారిని పెంచి పోషించ‌డంలోనే వారి శ‌క్తి సామ‌ర్థ్యాలు క‌రిగిపోతాయి అంటారు పెరియార్‌. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఒక పురుషుడు నాకు న‌లుగురు పిల్ల‌లు. వారి పోష‌ణ‌కే నా స్వేచ్ఛ హ‌రించుకు పోతుందంటాడు. అదే ఒక మ‌హిళ అయితే ‘పిల్ల‌లు లేక‌పోతే ఏ బాయో ఏ నుయ్యో చూసుకొందును’అంటుంది.
దీనిని బ‌ట్టి స్త్రీ పురుషుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సంతానోత్ప‌త్తి క‌ట్ట‌డి చేస్తుంది. మ‌హిళ‌లు మ‌రింత బందీలు, బాధ్యులు అవుతున్నారు. సామాన్యంగా మ‌హిళ‌లు ఉద్యోగాలు ఆస్తులు ఉండ‌నందువ‌ల్ల మ‌రింత‌గా పురుషుల‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు. అయితే, మ‌ద్రాసు రాష్ట్రంలో గ‌ర్భ నిరోధం గురించి రాష్ట్రమంతా విస్తృత ప్ర‌చారానికి ఏర్పాటు చేస్తామ‌న్న‌పుడు శాస‌న‌స‌భ‌కు మ‌హిళ‌ల త‌ర‌పున ఎన్నికైన డాక్ట‌ర్ ముత్తు ల‌క్ష్మి మాత్రం తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇది చాలా విచార‌క‌రం అని పెరియార్ ఆవేద‌న వ్య‌క్త ప‌రిచారు. మ‌ద్య నిషేద ప్ర‌చారం కంటే, అంటు రోగాల నిరోధ ప్ర‌చారం కంటే, గ‌ర్భ నిరోధ ప్ర‌చార‌మే అత్యంత ముఖ్య‌మ‌ని ఈ అధ్యాయంలో పెరియార్ వివ‌రించారు.

ప‌దో అధ్యాయం – స్త్రీల విముక్తికి పురుషాహంకారం న‌శించాలి
పురుషస్వామ్య పితృత‌స్వామ్య స‌మాజంలో మ‌హిళ‌ల విముక్తిని మ‌హిళ‌లే సాధించుకోవాలి. పురుషుల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని స్త్రీలు గ్ర‌హించాలి. ఈ ఉద్య‌మాల్లో పురుషులు భాగ‌స్వాముల‌యితే ఉద్య‌మ ల‌క్ష్య‌మే దెబ్బ తింటుంద‌న్న‌ది వారి అభిప్రాయం. స‌మాజంలో కొద్ది మంది ధ‌న‌వంతులైన కార‌ణంగా బ‌ల‌వంతులు అత్య‌ధికులైన బ‌ల‌హీనుల‌ను త‌మ గుప్పెట‌లో శాశ్వ‌తంగా ఉంచుకునేందుకు బ‌ల‌హీనుల విముక్తికి ప‌ని చేస్తున్న‌ట్లు న‌టిస్తారు. పిల్లులు ఎలుక‌లకు విముక్తి సాధిస్తాయా? న‌క్క‌ల వ‌ల‌న కోళ్ళ‌కు విముక్తి ల‌భిస్తుందా?అందుకే స్త్రీలు జాగ్ర‌త్త‌గా ఉండాలి అంటారాయ‌న‌.
మ‌గ‌త‌నం, పితృస్వామ్యం, పురుష‌హంకారం వంటి ప‌దాలు స్త్రీల‌ను బానిస‌లుగా నిర్ధారించేవి. మ‌రి పురుషాహంకారం ఉన్న పురుషులు స్త్రీ విముక్తికి కృషి చేయరు. వివేకం, జ్ఞానం, స్వేచ్ఛ‌, సాహ‌సం వంటి గుణాలు క‌లిగిన పురుషుల‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని మ‌గ‌వారు భావిస్తారు అని ఆయ‌న తేల్చి చెప్పారు. హిందూ మ‌తం బోధించినది ఏమిటంటే స్త్రీలు పుట్టుక‌తో బానిస‌లు, వారు బాల్యంలో తండ్రి పైన, య‌వ్వ‌నంలో భ‌ర్త పైన‌, వృద్ధాప్యంలో కొడుకు య‌పైన ఆధార‌ప‌డాల‌ని శాసించింది. ఇంకా ఇటువంటి చాలా ప్ర‌స్తావించారు. చివ‌ర‌గా, “మ‌హిళ‌ల బానిస‌త్వం కేవ‌లం మ‌హిళ‌ల‌ను మాత్ర‌మే బాధించ‌దు. దీనివ‌ల్ల పురుషులు కూడా ఎన్నో బాధ‌ల‌కు లోన‌వుతారు. ఇది పురుషులు గ్ర‌హించ‌లేదు. స్త్రీలు త‌మ స్వేచ్ఛ కొరకు చిన్న చిన్న ప్ర‌య‌త్నాలు చేసిన అవి పురుషులకు ఇబ్బంది క‌లిగించ‌వ‌చ్చు. అయితే, గ‌ర్భ నిరోధ‌కం, ఆరోగ్య ర‌క్ష‌ణ‌, సంక్షేమ విష‌యాల‌లో మ‌హిళ‌లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తే పురుషుల‌కు న‌ష్ట‌మేమీ లేదు. వాస్త‌వానికి పురుషులు కూడా మ‌త సాంప్ర‌దాయాల నుండి విముక్తి పొందాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది” అనే పేరాతో పుస్త‌క‌ము ముగుస్తుంది.

పెరియార్ రామ‌స్వామి మాట‌ల్లో ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌ల సూచ‌న మేర‌కు ఆ పుస్త‌కంలో ఏమున్న‌ది సంక్షిప్తంగా ముందు మాటల్లో రాశాన‌న్నారు. ముందు మాట చివ‌ర ఉన్న పేరు, తేది, స‌మాచారం..ప్రకారం జనవరి మొదటి తేదీ 1942 అని రాయబడింది.
ఇటువంటి చైతన్య వంతమైన పుస్తకం అందరూ చదవతగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *