March 29, 2024

ఇస్లాం మతం

రచన: శారదా ప్రసాద్

భారతదేశంలో హిందూమతం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది . 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు ఉన్నారు.ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు. ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది.ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త (ఆఖరి ప్రవక్త) స్థాపించిన మతం కాదు ఇది . ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం.140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం.ఇస్లాం అనే పదానికి మూలం అరబ్బీ భాషాపదం ‘సిల్మ్’, అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సచ్ఛీలత.ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం
అనగా భగవంతునికి సర్వ సమర్పణ.అంతేకాదు,ధర్మానికి అనుగుణంగా నడచుకోవటం.ముస్లిం అనగా శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు.మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించేవాడు ముస్లిం.వీరికి పరమ పవిత్రం అయినవి దేవుని (అల్లాహ్) వాక్కు,ఆదేశము ఖురాన్,మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు. అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడు (అల్లాహ్) తన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ ను ఉపదేశకుడుగా పంపాడు, ఖురాను (పవిత్ర గ్రంథం) అవతరింపజేశాడు. ఇస్లాం ఐదు మూలస్తంభాలుగా పరిగణించబడే నమ్మకాలు–షహాద (విశ్వాసం),సలాహ్ (నమాజ్ లేదా ప్రార్థన),సౌమ్ (ఉపవాసం),జకాత్ (దాన ధర్మం),హజ్ (పుణ్య యాత్ర). అల్లాహ్ ఆ సర్వేశ్వరుడి నామం. సకల చరాచర జగత్తును సృష్టించిన మహాసృష్టికర్త.ఇస్లాంలో ఏకేశ్వరోపాసన కఠోర నియమము. వీరిలో విగ్రహారాధన లేదు. ఈ ఒక్క కారణంగా రాజారాంమోహన్ రాయ్ లాంటి బ్రహ్మసమాజీకులు ఇస్లాం మతాన్ని గౌరవించారు.అల్లాహ్ పై
విశ్వాసప్రకటనను షహాద అని,ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అంటారు.అల్లాహ్ యొక్క 99 విశేషణాత్మక నామవాచకాలు కలవు. ముస్లింలు భగవన్నామస్మరణ చేయునపుడు ఈనామాలన్నీ స్మరిస్తారు.ఇస్లాం ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త ముహమ్మద్ క్రీ.శ. 570 ఏప్రిల్ 20 న మక్కా నగరంలో జన్మించారు. తండ్రి ‘అబ్దుల్లా’ తల్లి ‘ఆమినా’. తన 40 యేట వరకూ సాధారణ జీవితం గడిపిన ముహమ్మద్ ప్రవక్తకు, హిరా గుహ యందు ధ్యానంలో ఉండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ ఆదేశాలను మరియు ఖురాన్ యొక్క మొదటి సూరాను అవతరింపజేశారు. ఈ సూరా ‘ఇఖ్రా బిస్మి రబ్బుకల్లజి ఖలఖ్’ అనే ఆయత్ తో ప్రారంభమైనది. దీనర్థం “(ఇఖ్రా) చదువు, అల్లాహ్ ఒక్కడేనని, అతడే సర్వాన్నీ సృష్టించాడని….”. ఈ అవతరణ పొందిన ముహమ్మద్ తన ప్రవక్త జీవితం ప్రారంభించారు. బహుఈశ్వరాధకులైన అరబ్ పాగన్లు ముహమ్మద్ ని నానా కష్టాలు పెట్టారు.క్రీ.శ. 622 లోమక్కా నుండి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళారు.ఈ సంవత్సరం నుండే ఇస్లామీయ కేలండర్ ఆరంభమైనది. మదీనాలో స్థిరపడిన ముహమ్మద్ కు మక్కా వాసులనుండి అగచాట్లు తప్పలేదు. ఇస్లామీయ రీతి నచ్చని మక్కావాసులు మదీనా వాసులపై అనేక యుద్దాలు చేశారు.ఈ యుద్ధాలకు నాయకత్వం వహించిన ముహమ్మద్ ఒకటీ రెండూ యుద్ధాలు తప్ప అన్నింటిలోనూ విజయాలను చవిచూసారు.ఆఖరికి ముస్లిం సమూహాలు మక్కానూ కైవసం చేసుకున్నారు.క్రీ.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త పరమదించారు. ముహమ్మద్ ప్రవక్త ఆచరణలను సున్నహ్ అనీ ఉపదేశాలను హదీసులు అనీ వ్యవహరిస్తారు. ఖురాన్ ఆదేశాల తరువాత సున్నహ్ మరియు హదీసులే ముస్లింలకు ప్రామాణిక ఆదేశాలు.ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రతీ ఒక్కరు ముస్లిం కాలేరు. ఒక డాక్టర్ ఇంట జన్మించిన వారిని ఏవిధంగానైతే డాక్టర్ అనరో , అదే విధంగా ముస్లిం ఇంట జన్మించిన వారిని ముస్లిం అనరు.నిజ దేవుడు ఒక్కడు అని నమ్మి , అ నిజ దేవుడు పంపిన అంతిమ ప్రవక్తను(మహమ్మద్) విశ్వసిస్తే, అతనిని ముస్లిం (దైవ విధేయుడు) అని పిలువవచ్చు.ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ నిజ దేవుడైన అల్లాహ్ ను కాకుండా దర్గానో లేక ఇతర సృష్టితాలనో పూజిస్తే అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం దైవ విధేయుడు కాదు. అతని పేరు, అతని వేషధారణ ముస్లింగా ఉన్నప్పటికీ అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం (దైవ విధేయుడు ) కాదు. అతను అల్లాహ్ దృష్టిలో ముషిర్క్(దైవ అవిధేయుడు, బహుదేవారాధకుడు). ఇస్లాం ప్రకారం అల్లాః ఒకడే దేవుడు, ఆయనకు సమానముగా ఎవరిని చూడరాదు. ఆయనకు సమానముగా ఎవరికీ దైవత్వం
అపాదించరాదు.అల్లాః మాత్రమే ప్రార్థనలను స్వీకరించును.ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు.దురదృష్టవశాత్తు నేడు కొంతమంది ముస్లిం యువకులు తప్పుడు బోధనలకు ప్రభావితులై ‘జిహాదీ’ పేరుతో విధ్వంస కాండను సృష్టిస్తున్నారు.నిజానికి ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదు.ఇస్లాం మతంలో మానవతా విలువలు,శాంతి, సద్భావనలు ఉన్నాయని, ఉగ్రవాదాన్ని ఈ మతం తిరస్కరిస్తుందని మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ బహిరంగంగా చేసిన ప్రకటనను మన దేశంలోని ముస్లింలు, మైనారిటీ పార్టీల నేతలు, ముస్లిం మతపెద్దలు గమనించాలి. ప్రపంచంలోని మత పెద్దలంతా ఉగ్రవాదాన్ని ఖండించాలి. ఉగ్రవాదాన్ని తమ మతం అంగీకరించదంటూ ఇస్లాం మతపెద్దలు ప్రకటిస్తే మంచి స్పందన వస్తుంది. అలా ప్రకటిస్తే, ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదన్న సందేశం సమాజంలోకి వెళుతుంది.ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుంది.ముస్లిములలో సున్నీలు,షియాలు అనే రెండు ప్రధాన తెగలు ఉన్నాయి.వీరు కొన్ని సందర్భాల్లో (చాలా సందర్భాల్లో)ఒకరినొకరు ద్వేషించుకున్న సంఘటనలు ఉన్నాయి. భారతదేశంలో ముస్లింలు ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ ఆక్టు 1937, (షరియా చట్టాలు) ద్వారా తమ సాంఘీక జీవితాలు గడుపుతారు.ఈ చట్టం ముస్లింల వ్యక్తిగత విషయాలైన నికాహ్, మహర్, తలాక్ (విడాకులు), నాన్-నుఫ్ఖా (విడాకులు తరువాత జీవనభృతి), బహుమానాలు, వక్ఫ్, వీలునామా మరియు వారసత్వాలు, అన్నీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అమలుపరచ బడుతాయి. భారతదేశంలోని న్యాయస్థానాలన్నీ ఈ షరియా నియమాలను ముస్లింలందరికీ వర్తింపజేస్తాయి. ఈ ముస్లిం పర్సనల్ లా ను సమీక్షించేందుకు, పరిరక్షించేందుకు, ప్రాతినిధ్యం వహించేందుకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్థాపించబడింది.ఇస్లామీయ సమాజంలో మూలవ్యవస్థ విషయం “కుటుంబం”. ఇస్లామ్ ఈ కుటుంబ సభ్యులందరికీ తగురీతిలో హక్కులను కల్పిస్తున్నది. కుటుంబ వ్యవస్థలో యజమాని ‘తండ్రి’. ఇతను కుటుంబపు బరువు బాధ్యతలు, ఆర్థిక విషయాలను,ఆలన పాలన పోషణలు చూస్తాడు. ఖురాన్ లో వారసత్వపు విషయాలన్నీ క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి.కుటుంబంలోని ఆస్తిలో స్త్రీహక్కు, పురుషుడి హక్కుతో సమానం.అనగా సగం ఆస్తి స్త్రీకి చెందుతుంది. అన్ని హక్కులూ సగం కల్పించబడ్డాయి. ఇస్లాంలో పెళ్ళి లేదా నికాహ్ అనునది, పౌర-ఒడంబడిక. ఈ నికాహ్ కొరకు, ఇద్దరు సాక్షులు అవసరం. పెళ్ళికొడుకు పెళ్ళికుమార్తెకు భరణం
“మహర్” చెల్లించాలి. మహర్ అనునది, పెళ్ళికుమారిడి తరపున పెళ్ళికుమార్తెకు ఇచ్చే ఒక బహుమతి.ఈవిషయం “నికాహ్ నామా”లో వ్రాయవలసి ఉంటుంది.ఒక పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. కానీ వారికి సమాన హక్కులు, పోషించగలిగే స్థితిని పురుషుడు కలిగి ఉండాలి. స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా కలిగి ఉండాలి. భర్తతో విడాకులు పొంది ఇంకో పెళ్ళి చేసుకొనవచ్చు. ఇస్లాంలో విడాకులుకు “తలాఖ్” అని వ్యవహరిస్తారు.స్త్రీలు హిజాబ్ లేదా పరదా పద్దతిని పాటించాలి. దీనినే “ఘోషా” పద్దతి అని వ్యవహరిస్తారు,ఈ పద్దతి స్త్రీలను హుందాగా జీవించేందుకు దోహదపడుతుందని భావిస్తారు.ఈ నియమంపై పలు వివాదాలు ఉన్నాయి. అంగీకారాలు కూడా ఉన్నాయి . కానీ అంగీకారాల శాతమే ఎక్కువ. నగర ప్రాంతాలలో ఈ ఘోషాపద్దతి కొద్ది తక్కువ కానవస్తుంది. చాలామంది ముస్లిం మహిళలకు బయటి ప్రపంచం తెలియదు.వారి జీవితం నాలుగు గోడలకే పరిమితం.దారుణం ఏమిటంటే ఇదంతా ఇస్లాం పేరుమీద నిరాటంకంగా కొనసాగుతోంది.నేటి ముస్లిం సమాజంలో స్త్రీలను కనీసం ప్రార్ధనా స్థలాలకు కూడా అనుమతించరు.ఇస్లాం గతాన్ని గనుక మనం ఒకసారి నిశితంగా పరిశీలించి చూస్తే పురుషులతో సరిసమానంగా మహిళలూ వివిధ రంగాల్లో పాల్గొన్నారన్న వాస్తవాన్ని తెలుసుకోగలం.మహిళల సహకారంలేని ఏ జాతి విముక్తి సాధించలేదు. స్త్రీలను కేవలం వంటగదులకు,పడకగదులకే పరిమితం చేయడంవల్ల ఇస్లాం కానీ, మరే ఇతర మతమైనా కానీ వారు ఆశించిన సామాజిక విప్లవాన్ని సాధించలేదు.ఇక బహుభార్యత్వం,’తలాక్'(విడాకులు)– దీనికి కూడా ముస్లిం మత పెద్దలు ఒక పరిష్కారాన్ని కనుగొంటే ,సాధారణ ముస్లిం స్త్రీలకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని చాలామంది అభిప్రాయం.ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు క్రైస్తవుల, యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు.కానీ నిజానికి ఇదంతా ఒక అపోహ మాత్రమే.ఎందుకంటే “అల్లాహ్”అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే. అల్లాహ్ మానవులకు అనుగ్రహించిన వరాలు అనంతం. వాటిని గురించి వర్ణించడం, ఊహించడం అసాధ్యం. అలాంటి అసంఖ్యాక వరాల్లో ‘నోరు’ (నాలుక) కూడా ఒకటి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే, అమృతపు జల్లు కురుస్తుంది. అల్లాహ్ దృష్టిలో నోటి దురుసుతనం , దుర్భాషణ,అశ్లీలమైన పనులు తీవ్రమైన నేరాలు. వీటి ఫలితంగా ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరకశిక్ష అనుభవిస్తారనేది ముస్లిముల నమ్మకం .ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పాడు,” ‘ప్రళయదినాన విశ్వాసి త్రాసులో ఉంచబడే అత్యంత బరువైన, విలువైన వస్తువు అతని సుత్ప్రవర్తనే! నోటితో అశ్లీల మాటలు పలికేవారిని, దుర్భాషలాడేవారిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు.” అందుకే దేహంలోని అవయవాలన్నీ ఉదయం లేవగానే నోటితో(నాలుకతో)ఇలా మొరపెట్టుకుంటాయట,”నాలుక తల్లీ! నువ్వు ఆచి తూచి జాగ్రత్తగా ఉండు. దైవానికి భయపడుతూ ఉండు!నీవు దైవానికి భయపడుతూ ఆచితూచి మాట్లాడాలి . లేకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి!”భక్తులు అన్ని విధాలా ఉత్తమంగా మసలుకుంటారు. నలుగురికి ఉపయోగపడే మంచిపనులను చేస్తారు.మానసికంగానూ, భౌతికంగానూ పరిశుద్ధంగా ఉంటారు.తప్పు చేస్తే దాన్ని గుర్తించి పశ్చాత్తాప పడుతుంటారు.ధర్మం, న్యాయాలను అనుసరిస్తుంటారు. సహనం వహిస్తారు. ఏదైనా తలకు మించిన భారమైన పని గురించి అల్లాహ్‌ మీదనే భారం వేస్తారు.తనను నమ్ముకున్న వారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.మోసం చేసేవారిని, అధర్మ పరులను,అహంకారం, గర్వం గలవారిని, అల్లాహ్‌ ప్రేమించడు. దుబారా ఖర్చులు చేసేవారిని కూడా అల్లాహ్‌ ప్రేమింపడు.దానధర్మాలు చేయడంలో కూడా కూడా హద్దుమీర కూడదు. అల్లాహ్‌కు ఇష్టం కానివారు ముగ్గురున్నారు. 1. పనికి రాని ప్రశ్నలు వేసేవారు. 2. జ్ఞానం లేని మాటలు పలికేవారు. 3. దుబారా ఖర్చు చేసేవారు. దివ్యఖుర్‌ఆన్‌ బనీ ఇస్రాయీల్‌ సూరా 27వ వాక్యంలో దుబారా ఖర్చుచేసేవారు షైతాను సోదరులు.
“అల్లాహ్” దయకు అందరూ పాత్రులు అగుదురుగాక!
శారదాప్రసాద్

14 thoughts on “ఇస్లాం మతం

  1. ప్రియమైన శాస్త్రీ! ఇస్లాం గురించి నీ విస్లేషణ అద్భుతం.ముస్లిములకు సైతం తెలియని విషయాలు పొందుపర్చావు.‌బురఖా పండుకు తోలు( తొక్క) లాంటది.పండుకు తోలు ఎంత రక్షణ ఇస్తుందో మనకు
    తెలుసు.ముస్లిం మహిళ ఇంటి మహారాణి.అ
    వసరమైతే తప్ప అదీ భర్తగాని,సోదరుడు గాని,తండ్రి
    గాని ,బాధ్యతగల అతి దగ్గరబంధువు( వివాహానికి
    వరసగాని) లతో మాత్రమే బయటకు వెళ్ళేఅనుమతి
    వుంది.ముహమ్మద్( స.అ.స) గారి భార్య,ఆయేషా( రజి) గారు యుధ్దాలు కూడా చేశారు.వారి భార్యలలో
    కొందరు అడవి( పొలము) కెళ్ళి ఒంటెలకు మేత తెచ్చు
    కునేవారు.మహిళలు ముహమ్మద్( స) గారి కాలము
    లో మసీదులో నమాజు చేసేవారు.హిందూ సనాతన
    కుటుంబాలలో పూర్వం మహిళలు బయటకు వచ్చే
    వారు కాదు.రాజస్థాన్ మహిళలు ఇప్పటికీ మేలి
    ముసుగు ధరిస్తారు.విలువైన వాటిని పదిలంగా
    దాచుకోవాలిగదా.మక్కామసీదులో,మదీనా మసీదులో ఇప్పుడుగూడా మహిళలు నమాజు చేస్తున్నారు.చైనా,హాంకాంగ్,మలేషియా,ఇండోేేనేషియా తదితర అనేక దేశాలలో మహిళలు మసీదులలో
    నమాజు చేస్తున్నారు.భార్య బానిస కాదని ఖురాన్
    నొక్కి చెబుతుంది.అనుమతి ఉన్నా ” తలాఖ్” ,దేవుని దృష్డిలో అత్యంత హేయమైనది.

  2. వ్యాసం విశ్లేషణతో కూడి బావుంది. ప్రవక్త చెప్పింది చివరిదాకా సరిగ్గా ప్రసారం అయ్యిందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఆయన చెప్పింది వక్రీకరించి, ప్రచారలోపం వలన యువకులు తప్పుదారి బట్టి అశాంతి, కల్లోలం సృష్టిస్తూ .. మొత్తం ఇస్లాం మతంపట్ల యావత్ ప్రపంచము వ్యతిరేకత ప్రదర్శించేలా చేస్తున్నారు. వీరందరినీ అల్లా క్షమించి సరియైన దారిలో నడిపించాలని కోరుకోవడం తప్ప చేసేదేముంది.

  3. ఇస్లాం మీద మంచి వివరణాత్మక రచన అందించారు సర్..మీకు abhivadamulu

  4. Thanks Sri Sarada Prasad garu for this good and informative article on Islam . I request Sri Sarada Prasad garu to clarify M.Murthy gari doubt.

    1. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం.అది ఇస్లాం మతస్తుల నమ్మకం.ఎవరి మతాన్ని గురించి వారికి ఇటువంటి భావనలే ఉండటం సహజం.ఇది రచయిత భావం కాదు!

    2. రచయిత భావాన్ని చక్కగా వివరించిన వ్యాసమూర్తి గారికి ధన్యవాదాలు

  5. మతాలు అన్నీ హితమునే కోరుతాయి. మనషులే హితరాహిత్యంతో హింసకు పూనుకుంటారు. ఇస్లాం మత ఆవిర్భావం నుంచి ఆ మత ధర్మాలను, సాంప్రదాయాలను అందరికీ అర్ధమయ్యే తీరున చాలా చక్కగా వివరించారు..

  6. తెలియని ఎన్నో విషయాలను చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు!

  7. మిత్రమా ఇస్లాం హిందూ ధర్మం కన్నా పురాతనమైనదా. భారత దేశంలో ఆ ధర్మం వేనూళ్ల టానికి కారణం ఏమిటి. మీ విశ్లేషణ బాగుంది. ఈ విషయంలో నాకు అవగాహన లేదు

    1. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం.అది ఇస్లాం మతస్తుల నమ్మకం.ఎవరి మతాన్ని గురించి వారికి ఇటువంటి భావనలే ఉండటం సహజం.ఇది రచయిత భావం కాదు!

      1. చయిత భావాన్ని చక్కగా వివరించిన వ్యాసమూర్తి గారికి ధన్యవాదాలు

Leave a Reply to సావిత్రి Cancel reply

Your email address will not be published. Required fields are marked *