April 19, 2024

జీవన వారధులు

రచన: డా.విజయలక్ష్మీ పండిట్

”అమ్మా.. ఆత్మహత్య అంటే ఏంటి? ఎందుకు చేసుకుంటారు?”
ఈనాడు న్యూస్‌ పేపర్‌ మధ్య పేజీలను పక్కన పెట్టి అక్కడే కాఫీ తాగుతున్న వాళ్ళమ్మనడిగింది పన్నెండేళ్ళ దివ్య.
ఈనాడు మెయిన్‌ పేపర్‌ చదువుతూ కాఫీ తాగుతున్న సునీత, కూతురు ప్రశ్నకు కండ్లు పెద్దవి చేసి దివ్యను చూస్తూ వెంటనే ఏం జవాబు చెప్పాలో తోచలేదు సునీతకు. జవాబుకోసం దివ్య వాళ్ళ అమ్మ మొహంలోకి చూస్తూ కూర్చుంది.
” ఆత్మహత్య అంటే మనల్ని మనం చంపుకోవడం అంటే. మనం ధైర్యాన్ని కోల్పోయి పిరికితనంతో మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకోవడం. సమస్యను ఎదుర్కొనే నేర్పు ఓర్పు లేక తొందరపాటు నిర్ణయం తీసుకుని మన నిండు జీవితాన్ని మన చేతులారా బలి చేసుకోవడం” అని జవాబు చెప్పింది.
కూతురిలో ధైర్యాన్ని పెంచాలనే ఆవేశంతో సునీత చెప్పుకుపోతున్న చాలా పెద్ద జవాబును విన్న దివ్య తలలో ఇంకా ఎన్నో ప్రశ్నలు మొలకెత్తాయి.
ఆరో క్లాస్‌ చదువుతున్న దివ్య తెలుగు కొంచెం బాగానే చదవగలుగుతుంది. ఇంట్లో అమ్మ కూడా తెలుగు భాష అక్షరాలు, గుణింతాలు నేర్పించడం వల్ల, కూడబలుక్కుని చదవడానికి ప్రయత్నిస్తూంది. రోజు న్యూస్‌ పేపర్‌ హెడ్‌లైన్స్‌ నీకు తోచినవి చదువుతూండు తెలుగు భాష ఇంప్రూవ్ అవుతుందని అమ్మ నాన్న చెప్పినప్పటినుండి టైం దొరికినప్పుడు న్యూస్‌ పేపర్‌ తిరగేయడం మొదలు పెట్టింది. తెలుగుభాష అర్థాలు తెలుసుకోవడానికి ఇంగ్లీషులో కూడా అడుగుతూంటుంది.
”అమ్మా.. పిరికితనం అంటే బోల్డుగా లేకపోవడమా? పిరికితనం అంటే కవడిష్‌ అని అర్థమా!” అని అడిగింది దివ్య.
”అవును నాన్నా.. పిరికితనం అంటే కవడిష్‌.. అంటే బోల్డుగా లేకపోవడం.” మన తెలుగు భాషకు ఇంగ్లీషులో అర్థాలు చెప్పాల్సిన గతి పట్టింది మన పిల్లలకని మనసులో అనుకుంటూ జవాబిచ్చింది సునీత.
” ఓర్పు నేర్పు అంటే ఏమిటి”అని మరలా ప్రశ్నించింది దివ్య.
” ఓర్పు.. అంటేనే ఓపిక.. పేషన్స్‌. నేర్పు అంటే ఓపికతో ఏదైనా ఒక సమస్య వస్తే ఎమోషనల్‌ అయిపోకుండా.. కొంచెం ఆలోచించి, ఆ సమస్య ఎందుకొచ్చింది? ఆ సమస్యకు పరిష్కారాలేమి? అంటే ప్రాబ్లమ్‌కు సొల్యూషన్‌ ఏమిటి అని అనలైస్‌ చేసుకొని పరిష్కరించుకోవడానికి, సాల్వ్‌ చేసుకోవడానికి తెలివితో ప్రయత్నించాలి, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా.. అంటే ప్రాబ్లమ్‌గా చిత్రించుకోవడమే అసలు సమస్య. మన జీవితం జీవించడానికి కాని, మన జీవితాన్ని మనమే అంతం చేసుకోడానికి కాదు.. అనే ఆలోచనా విధానాన్ని, ధైర్యాన్ని చిన్నతనం నుండి అలవరచుకొంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనము నేర్పుతో పరిష్కరించుకుంటూ ఆనందంగా జీవించవచ్చు..” అని చిన్న ఉపన్యాసమిచ్చింది సునీత.
అమ్మ మాటలు విన్న దివ్య నిటారుగా కూర్చుని.. ”ధైర్యంగా వుండడం చాలా అవసరం కదమ్మా.” అని అడిగింది.
”అవును ఆడపిల్లకైనా, మగ పిల్లలకైనా ధైర్యం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యం, ఆత్మస్థైర్యంతో పెరగాలి. మన చరిత్రలో ఎంతో మంది మహిళలు.. అంటే ఆడవాళ్ళు ఝూన్సీ లక్ష్మీ బాయి, రుద్రమదేవి రాణులుగా రాజ్యాలు ఏలినారు, ఎంతో మంది మహిళలు మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, నెహ్రూజీ కూతురు ప్రధానిమంత్రి అంటే ప్రైమ్‌ మినిష్టరుగా దాదాపు రెండు దశాబ్దాలు పాలించారు” అనింది కూతురును దగ్గర కూర్చోబెట్టుకుంటూ.
విన్న తరువాత దివ్య ఇంకో ప్రశ్న వేసింది..
”పేపర్‌లో ఆ అమ్మాయి ఇంటర్‌ మీడియట్ పరీక్ష బాగా రాయలేదని, వాళ్ళ నాన్న తిట్టాడని ఆత్మహత్య చేసుకునింది.. కదా? వాళ్ళ నాన్న తిట్టకూడదు కదా!”
”నిజమే.. వాళ్ళ నాన్న అలా తిట్టుండకూడదు.. పరీక్ష సరిగా రాయలేదని బాధ ఒకవైపు, నాన్న తిట్టాడనే బాధ, అవమానం ఇంకోవైపు ఆ అమ్మాయిని మనస్తాపానికి గురి చేసుంటాయి.. బాగా చదివే అమ్మాయి పరీక్ష సరిగా రాయకపోయినందుకు కారణాలేవో తెలుసుకోవాలి.. ఆ సందర్భంలో కూతురుని ఓదార్చి, మరలా గట్టి ప్రయత్నం చేయవచ్చులే అని ధైర్యం చెప్పి ఆ బాధ తగ్గించాలి. చదువులో ఆ సబ్జక్టులో కూతురు ఎందుకు వెనకపడిందో తెలుసుకొని ట్యూషన్‌ పెట్టి కావాల్సిన సపోర్ట్‌ ఇవ్వాలి” అని ఆగి మరలా ”చదువుకంటే ముందు పిల్లల్లో ధైర్యాన్ని, జీవితం, సమస్యల పట్ల కాలం తెచ్చే మార్పుల పట్ల అవగాహన కలిగించాలి. చావు సమస్యలకు పరిష్కారం కాదు అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో జీవితంపట్ల ఓ ఆశావాదాన్ని పెంపొందించే ప్రయత్నం జరగడం లేదు”అని అనింది సునీత.
దివ్య ఎంతో ఆరాధనా భావంతో అమ్మ మొహంలోకి చూస్తూ.. చటుక్కున లేచి అమ్మ మెడను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది.
తన మాటలు దివ్యకు ఎంతో ధైర్యాన్ని, రిలీఫ్‌ని ఇచ్చాయని సునీత గ్రహించింది. తనూ కూతురుని దగ్గరకు తీసుకుని చెంపలపై ముద్దాడింది.
”నీలాగ, నాన్నలాగా ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్నా అర్థం చేసుకుని ధైర్యం చెప్పుకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది కాదు కదమ్మా!…” అని అనింది దివ్య.
”అవును’.. అని సమాధానమిచ్చింది సునీత. అంతలో తన ఆఫీస్ రూమ్‌లో నుంచి వాళ్ళ నాన్న ‘దివ్యా..” అని పిలవడంతో ” ఏం. నాన్నా..” అని లోపలికి పరుగుతీసింది.
వాళ్ళ సంభాషణ విన్న రామకృష్ణ, కూతురి సున్నితమైన మనస్సు ఆ ఆత్మహత్యల న్యూస్‌తో ఎంత గాయపడిందో ఊహించి ఓదార్పు మాటలు, నవ్వించే మాటలు చెప్పి డైవర్ట్‌ చేయడానికి పిలిచుంటాడని సునీత ఊహించింది. జీవితం పట్ల రామకృష్ణకున్న పాజివ్‌ ఆటిట్యూడ్‌ సునీతకు తెలుసు. పిల్లలను అర్థం చేసుకుని సున్నితమైన మనసులు గాయపడకుండా.. వాళ్ళతో రోజు కొంత సమయం గడుపుతూ జీవితం పట్ల.. సమస్యల పట్ల అవగాహన కలిగించే కబుర్లు, కథలు చెబుతూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని చెపుతుంటాడు. తల్లిదండ్రులు మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకుంటూ సమాజంలో సంస్కృతిలో వచ్చే మార్పుల దుష్ప్రభావాలనుండి పిల్లలను కాపాడుకుంటూ వారికి వాస్తవాల పట్ల అవగాహన కలిగిస్తూ మంచి నడవడిక, ఆత్మస్థైర్యంతో కూడిన వ్యక్తిత్వానికి బాటలు వేయాలంటాడు.
అతనిలో ఆ ఆశావాద దృక్పథంతోపాటు కూతురు పెంపకం పట్ల అంత శ్రద్ధ తీసుకోడానికి కారణం అతని చెల్లెలు రాధ మరణం.. కాదు, ఆత్మహత్య..
సునీత ఆలోచనలు గతంలోకి పయనించడం మొదలుపెట్టాయి.
అది సునీత పెండ్లయి దాదాపు ఒకటిన్నర సంవత్సరం. సునీత చెన్నైలో ఒక కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తూంది. కాలేజీకి తయారయి బ్యాగ్‌ సర్దుకుంటున్న సునీత ఫోన్‌ రింగ్‌ అవ్వడంతో హాల్‌లోకి వెళ్ళి ఫోన్‌ ఎత్తి ‘హల్లో..” అంది.
ఆ వైపు రామకృష్ణ వాళ్ళ పిన్నమ్మ, అన్నపూర్ణమ్మ చెల్లెలు అనసూయ ఏడుస్తూ.. ”రాధ చనిపోయింది సునీత.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.” అని ఏడుస్తూ చెపుతుంటే సునీత కాళ్ళు చేతులు అదిరాయి.
”అయ్యో.. ఎట్లయింది? ఎందుకు చేసుకుంది?”అని కంగారుగా ప్రశ్నల వర్షం కురిపిస్తూండగా ఫోన్‌ డిస్‌ కనెక్ట్‌ అయింది.
” ఏమండీ రాధ చనిపోయిందట ఆత్మహత్య చేసుకుంది. చిన్నత్తమ్మ ఫోన్‌ చేశారు” అంటూ.. ఆఫీసుకు తయారవుతున్న భర్తకు చెప్పింది.
”ఆ…” అంటూ హతాశుడై నిలబడిపోయిన రామకృష్ణ ప్రక్కనే వున్న బెడ్‌పై కూర్చొని.. భోరున ఏడ్వడం మొదలు పెట్టాడు.
సునీత రామకృష్ణ దగ్గరకు వచ్చి ఎదుట నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ అతని తలను తనకు అదుముకుని తలపై చేయివేసింది సముదాయిస్తూ.
చెల్లెలంటే రామకృష్ణకు చాలా ఇష్టం. ఇద్దరికీ వయసులో ఐదు సంవత్సరాలు తేడా.
రామకృష్ణ, తనూ చెన్నై నుండి రెండు గంటల ప్రయాణం దూరంలో నెల్లూరు దగ్గర ఉన్న వాళ్ళ సొంతూరుకు కారులో బయలు దేరారు డ్రైవర్‌ని మాట్లాడుకుని.
రాధ హైదరాబాదులో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఒక సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తూంది. ఈ మధ్యనే రాధకు పెండ్లి చేయాలని రెండు సంబంధాలు చూశారు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న వెంకటరామయ్యకు రాధ పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇంటర్‌ మీడియట్ అవగానే పెండ్లి చేయాలనుకున్నాడు. అతను నెల్లూరు జిల్లాలో ఇరవై ఎకరాల మంచి మోతుబరి రైతు, బి.ఏ చదివినా.. ముందు కాలం మనిషి. సాంప్రదాయాలని, ఆడపిల్లలకు పెద్ద చదువెందుకు పిల్లలకు చదువు చెప్పుకొనే వరకు చదివితే చాలనుకునేవాడు. కూతురికి ఆస్తి, అంతస్తు వుండి, తమ కులంలో సాంప్రదాయమైన కుటుంబంలో ఇవ్వాలని ఇంటర్‌ మీడియట్ అయిపోగానే సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. కాని రాధ తాను బి.టెక్‌. చేస్తానని పట్టుదల పట్టింది. అన్నతో చెప్పించుకుని నాన్నను ఒప్పించుకుని ఎమ్సెట్ పరీక్షరాసి మంచి ర్యాంక్‌తో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ సీటు తెచ్చుకుంది. కష్టపడి చదువుకుని, మంచి మార్కులతో పాసయి, హైదరాబాద్‌లో క్యాంపస్‌ సెలక్షన్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని చేరింది.
ఆ మధ్య ఒకసారి మేమంతా కలిసినప్పుడు రాధ తాను తన కొలీగ్‌ శ్రీధర్‌ను ఇష్టపడుతున్నట్టు, అతనికి తనంటే ఇష్టమని, మంచివాడని మాతో చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న స్కూల్‌ టీచర్స్‌ అని, వాళ్ళది ఇంటర్‌ కాస్ట్‌ మ్యారేజ్‌ అని, తండ్రి ఎస్‌.సి., తల్లి ఓ.సి. అని చెప్పింది. అతనికి ఇంటర్‌ చదువుతున్న తమ్ముడు వున్నట్టు చెప్పింది. ఇద్దరం పెండ్లి చేసుకోవాలనుకుంటున్నామని మాతో అంది.
రామకృష్ణ వెంటనే ”అమ్మా నాన్నతో చెప్పావా”అని అడిగాడు.
”అమ్మతో అన్నాను కాని అమ్మ మీ నాన్న ఒప్పుకోడు వేరే కులమని తొందరపడొద్దు ఆలోచించుకోమ్మా”అని అనిందని చెప్పింది.
రామకృష్ణకు వాళ్ళ నాన్న తత్వం తెలుసు. అమ్మ ఆ తరానికే చెందినదయినా కాలంతోపాటు వస్తున్న మార్పులు పిల్లలపై వాటి ప్రభావాన్ని గమనిస్తూ పిల్లల భవిష్యత్తును మంచి చెడులను దృష్టిలో పెట్టుకుని కాలానికనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఫ్లెక్సిబిలిటీ అమ్మలో వుంది. కాని నాన్నకు కొన్ని నిర్దిష్టమయిన ఇష్టా అయిష్టాలు వున్నాయి. తన పట్టుదల పర్యవసానాల గురించి పట్టించుకోడు.
సునీత వెంకటరామయ్యకు చిన్నప్పటి స్నేహితుడి కూతురు. స్నేహితుని ఇంట్లో సునీతను చూసి వచ్చిన వెంకటరామయ్యకు కోడలిగా చేసుకోవాలనిపించింది. అన్నపూర్ణమ్మ, రామకృష్ణలతో మాట్లాడి రామకృష్ణకు పెండ్లి చేశాడు. సునీతను చూసిన తరువాత రామకృష్ణకు కూడా నచ్చడంతో పెండ్లి జరిగిపోయింది. వెంకట రామయ్య ఎంతో సంతోషంగా ఘనంగా చేశాడు పెండ్లి వాళ్ళదగ్గర కట్నం ఆశించకుండా.
రామకృష్ణకు వాళ్ళ నాన్న గురించి బాగా తెలుసు కాబట్టి ఆలోచిస్తూ వెంటనే ఏమీ మాట్లాడలేదు.
కొంత సేపయినాక, ”రాధా! శ్రీధర్‌ను, వారి కుటుంబాన్ని గురించి ఇంకా వివరాలు తీసుకుని నేను సునీత మేమిద్దరం ఒకసారి కలిసి మాట్లాడి తరువాత ఆలోచిద్దాం. తొందరపడి నిర్ణయం తీసుకోకు”అని చెప్పాడు.
రాధ సరే అన్నట్టు తలవూపింది.
అంతా నెల ముందు జరిగిందీ సంభాషణ.
నిన్ననే రాధ ఫోన్‌ చేసిందని చెప్పాడు రామకృష్ణ తన పెండ్లి విషయం గురించి. రెండు రోజులు సెలవు పెట్టి వెళ్ళి శ్రీధర్‌ను, వాళ్ళ అమ్మ నాన్నను కలవాలని అనుకున్నాము. ఇంతలోనే రాధ అలా జీవితాన్ని అంతం చేసుకోడానికి కారణమేమి? అనే ఆలోచనలు సునీత మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి.
*****

ఇల్లు చేరేటప్పటికి ఇంట్లో బంధుమిత్రులు, పొరుగువారు పోగయినారు. విషయం తెలిసి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని వెళ్ళినట్టు రామకృష్ణ వాళ్ళ పిన్నమ్మ, చిన్నాన్న చెప్పారు.
హాల్లో రాధ శవాన్ని చూసి రామకృష్ణకు దుఃఖం ఆగలేదు. రాధ తలపై చేయివేసి భోరున ఏడ్చాడు. అర్థగంట తరువాత నెమ్మదిగా దుఃఖాన్ని తమాయించుకుని ప్రక్క రూములో గోడకానుకుని ఏడుస్తున్న అమ్మ దగ్గరకు పోయి ప్రక్కన కూర్చుని “అమ్మా ఏం జరిగిందసలు”అని అడిగాడు. అన్నపూర్ణమ్మ వెంటనే ఏమీ మాట్లాడలేదు. అమ్మ ఇంకా చెల్లి హఠాత్‌ మరణంతో షాక్‌లో ఏమి జవాబు చెప్పలేదని గ్రహించాడు. రామకృష్ణ వాళ్ళ చిన్నాన్న వచ్చి రామకృష్ణను చేయిపట్టుకుని మిద్దెపైకెళ్ళాడు. వారితో కూడా వాళ్ళ పిన్నమ్మా, తనూ వెళ్ళాము.
మిద్దెపైన వెనుకవైపు బాల్కనీలో ఈజీ చైర్‌లో వెనక్కివాలి కండ్లు మూసుకుని వున్నాడు రామకృష్ణ వాళ్ళ నాన్న. మొహంలో దిగులు, అలసట. అలికిడి అవ్వడంతో కండ్లు తెరచి మా వైపు చూసి, కొడుకును చూడగానే చేతులు చాచి ”రామూ! రాధ చూడరా మనల్ని వదలి పోయింది. ఎంత పని చేసిందో, నేను అలా చేస్తుందనుకోలేదురా”.. అంటూ చిన్న పిల్లవాడిలా ఏడ్వడం మొదలు పెట్టాడు. కుర్చీలోనుండి లేవబోతుంటే రామకృష్ణ వాళ్ళ నాన్నను పొదిమిపట్టుకున్నాడు. మాకూ ఏడుపాగలేదు. ఆ వయసులో పెండ్లి కావాల్సిన కూతురును పోగొట్టుకుని, కూతురుపై ప్రేమంతా కట్టలు తెంచుకుని ఏడుపై పైకుబికిందనిపించింది. తనూ మామయ్య కుర్చీ పక్కన కూర్చుంది. తన ఆలోచనలు పిల్లల పెంపకంపై వెళ్ళాయి…
” పిల్లలెంత ఎదిగినా, వాళ్ళు తమ పిల్లలే, చిన్నవాళ్ళనుకుంటూ చిన్నప్పుడు ఆట వస్తువులో, చాక్లెట్లో ఇచ్చి మనసు మళ్ళించినట్టే పెండ్లీడు వచ్చినా.. కూడా అట్లే తలపోసే తండ్రి ఆయన. మామయ్య కరుడు కట్టిన సాంప్రదాయ ఆలోచనా విధానం ఆయన్ని కాలంతోపాటు పిల్లల మనస్తత్వంలో వచ్చిన మార్పులను గమనించి, వాటికి విలువనీయకుండా చేసింది. అందుకు కారణం శతాబ్దాలుగా సంఘంలో జీర్ణించుకుపోయిన స్త్రీల పట్ల నిరాదరణే కదా!”అని అనిపించింది సునీతకు…
కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మగబిడ్డలు పుట్టకుంటే ఆడవాళ్ళే బాధ్యులని, మగపిల్లలను కనేంతవరకు కోడళ్లను మానసికంగా, శారీరకంగా బాధలు పెట్టడం. ఆడ, మగ బిడ్డలను నిర్ణయించే క్రోమోసోమ్‌ దాత మగవాడే అనే అవగాహనాలోపం వల్ల, మగబిడ్డయితే పున్నామ నరకం నుండి రక్షిస్తాడనే తరతరాల గుడ్డినమ్మకం, ఆడబిడ్డ ఎప్పటికి ఆ యింటి బిడ్డ (అత్తగారింటి బిడ్డ) అని, మగవాడు మన బిడ్డ అనే బూజుపట్టిన ఆలోచనలతో పుట్టినప్పటి నుండి ఆడపిల్లలకు ఇంట్లో మగ బిడ్డల తరువాత రెండవ స్థానాన్ని ఇస్తూ, ఇంటి పనులు, వంటపనులు, పిల్లలను పెంచే పనులన్నీ ఆడవారివే అనే ఆలోచనా విధానం. పుట్టినప్పటినుండి ఆ వివక్షతో కూడిన పెంపకం ప్రతి అమ్మాయి, అబ్బాయిలో జీర్ణించుకొని పోయి అదే సాంప్రదాయానికి, కట్టుబాట్లకు ప్రాధాన్యతనిస్తూ తరతరాలుగా ఆ సాంప్రదాయాల, కట్టుబాట్ల చాలలో బంధింపబడ్డాయి. ఆ తరాలలో వారి ఆలోచనలు, స్త్రీలకు చదువు లేకపోవడం, పురుషాధిక్య సమాజ ప్రభావంలో అదే మన జీవన విధానం అనే భ్రమలో ఆ రెండు మూడు తరాల తల్లితండ్రులు మూసపోసిన ఆ భావజాలం పిల్లల పెంపకంపై, వారి ముఖ్యమయిన జీవిత మలుపులు; విద్య, వివాహంపై తలితండ్రులు తీసుకునే నిర్ణయాలన్నికీ ఆ సాంప్రదాయ ఆలోచనా విధానమే కారణం. కాలానుగుణంగా సుమారు ఓ రెండు తరాల చదువుకున్న తల్లిదండ్రుల అవగాహనల్లో కొంచెం మార్పు వున్నా, వచ్చే అల్లుడు, అత్తింటి వారి ఆలోచనలూ కూడా అదే విధంగా వుంటాయన్న ఆలోచనతో వుంటూ ఆడపిల్లల పెంపకంలో పాత భావాలను వదులుకోలేకున్నారు” అని ఆలోచించుకుంటూ కూర్చుంది తాను.
*****

రాధ దహన సంస్కారాలన్నీ ముగిశాక రామకృష్ణ చిన్నాన్న, పిన్నమ్మ, అత్తమ్మలద్వారా తెలిసింది సునీతకు. రాధ వారం రోజుల క్రితం ఒక వారం శని ఆదివారాలతో కలుపుకుని లీవు పెట్టి ఇంటికి వచ్చింది అమ్మ నాన్నతో గడపాలని. వచ్చిన రోజు రాత్రి భోజనాల సమయంలో వాళ్ళ నాన్న తాను విచారించిన రెండు సంబంధాలను గురించి రాధతో చెప్పాడు. చదువు, ఉద్యోగం ఉండి ఆస్తిపాస్తులు బాగా వున్న కుటుంబాలు, మీ అన్న వదినలను కూడా రమ్మని వెళ్ళి చూసి వద్దామని. రాధ ఏమి సమాధానం చెప్పకుండా వాళ్ళమ్మవైపు చూస్తూంది. అన్నపూర్ణమ్మ కండ్లతోనే ఏమి మాట్లాడవద్దని సైగ చేయడంతో రాధ ఏమీ మాట్లాడలేదు. వెంకటరామయ్యకు రాధ ప్రేమ విషయం తెలియదు. ఆడపిల్లలకు సహజంగా వుండే బిడియం అనుకుని రాధ మౌనాన్ని అంగీకారంగా అనుకుని భోజనం ముగించి లేచి వెళ్ళాడు వెంకట రామయ్య. రాధ, అన్నపూర్ణమ్మ వంటింట్లో అన్ని సర్దుకుని ఇద్దరు మిద్దెమీదకు వెళ్ళారు.
రాధ తన మనసులోని భావాల్ని వాళ్ళమ్మకు ఏకరువు పెట్టుకుంటూంది, ”నేను శ్రీధర్‌నే పెండ్లి చేసుకుంటానమ్మా.. మంచి వాడు. నాన్నని ఒప్పించండమ్మా” అంటూ బ్రతిమాలుకుంటూంది.
” ఎట్లా చెప్పమంటావు రాధా! వేరే కులం, ఆస్తులు లేవంటే మీ నాన్న అసలిష్టపడడు. నాకు భయంగా వుంది మీ నాన్నకు చెప్పాలంటే” అని ముగిస్తుండగా అప్పుడే కూతురు, భార్య మిద్దెపైనున్నారని వారితో కూడా కాసేపు కూర్చుందామని పైకి వస్తూ తలుపు దగ్గరకు రాగానే రాధ వాళ్ళ మాటలు వెంకటరామయ్య విన్న సంగతి వారికి తెలియదు.
వారి ముందుకు వచ్చి ”రాధా ఏమంటున్నావు ప్రేమించావా? వేరే కులంవాడా? ఏమంటున్నావే” అని కోపంగా అడిగాడు.
రాధ మొదలు భయపడిపోయి.. కాస్త తమాయించుకుని తన వయసు, చదువు, బయటి ప్రపంచం పోకడలతో, కాలంతో వచ్చిన స్వంతత్ర భావాలతో, వాళ్ళ నాన్న మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోని స్థితిలో, నాన్నకు తనపైనున్న ప్రేమతో నాన్నను ఒప్పించుకోవచ్చనే ధైర్యంతో, తను శ్రీధర్‌ ప్రేమించుకున్న విషయం, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ వాళ్ళ నాన్నతో చెప్పి శ్రీధర్‌తో పెండ్లి జరిపించమని వాళ్ళ నాన్ననడిగింది. మరుక్షణమే రాధ చెంప ఛెళ్ళుమనింది.
రాధ చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ క్రిందకు వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ ఏడుస్తూ, ” ఏంటండీ ఇది, రాధ చిన్నపిల్ల కాదుకదా కొట్టడానికి. మెల్లగా నచ్చ చెప్పాలి కాని,”అని ముగించకముందే..
”నీవు నోరు మూసుకుని వుండు. అదంటే చిన్నపిల్ల, తల్లిగా నీవెందుకు ముందే కూతురిని విచారిస్తూ అలాంటి ఆలోచనలు మానుకోమని చెప్పలేదు. అందుకే ఆడపిల్లలకు పై చదువులు, ఉద్యోగాలు వద్దన్నాను. ప్రేమంటూ.. ముందు చూపు లేకుండా, కులము సాంప్రదాయాన్ని వదిలి, ఆడపిల్ల వెనకపడి నాలుగు ప్రేమ మాటలు చెపుతూనే అన్ని మరచిపోయి, ఆకర్షణకు లోనయి వాడి వెనకాల పడతారు. నాకు ఇష్టం లేదు ఆ ఆలోచన వదులుకోమను”అని చరచర వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మకు ఆ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియలేదు. కండ్లు తుడుచుకుంటూ మిద్దె దిగి రాధ రూముకు వెళ్ళింది. రాధ మెల్లగా ఏడుస్తూ పడుకుని వుంది.
రాధ దగ్గరికెళ్లి భుజం మీద చేయివేసి” ఊరుకో రాధ, మీ నాయన సంగతి తెలిసి ఎందుకు అలా నిర్ణయించుకున్నావు. నీవు కూడా ఆలోచించుకోమ్మా: మీ నాన్నను కాదని ఏమి చేయగలం”అన నచ్చ చెప్పాటానికి ప్రయత్నించింది.
రాధ ఏమీ మాట్లాడ లేదు.
రాధ అమ్మా, నాన్నా ఎక్కువ చదువుకోలేదు. అన్నపూర్ణమ్మ స్కూలు ఫైనల్‌లో వున్నప్పుడు మంచి సంబంధమని వాళ్ళ నాన్న పెండ్లి చేశారు. వెంకామయ్య బి. ఏ. పాస్‌ అయి వ్యవసాయంపై మక్కువతో వాళ్ళ నాన్నకు సహాయం చేస్తూ, డైరీ ఫామ్‌ చూసుకుంటూ ఉండిపోయాడు. వాళ్ళ నాన్నకు ఒక్క కొడుకు కావడం వల్ల, వ్యవసాయం స్వంత మనిషి పట్టించుకుంటేనే సాగుతుందని ఆయనకు తెలుసు కాబట్టి పై చదువు గురించి ఆలోచించకుండా కొడుక్కు పెండ్లి చేశాడు. అన్నపూర్ణ దూరము చుట్టపు సంబంధమే.
వారిరువురికి, బయటి ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పుల గురించి అవగాహన తక్కువే, ప్రపంచీకరణ ప్రభావంతో సాంకేతిక, సమాచార అభివృద్ధి, అంతర్జాల యుగంలో యువతపై సోషియల్‌ మీడియా ప్రభావం, వేగంగా విరుచుకుపడుతున్న పాశ్చాత్య సంస్కృతి, స్వతంత్ర భావజాలము, తాము చదువుకుని ఉద్యోగాలు చేయాలనే ఆడపిల్లల తపన, వైవాహిక జీవితంపై వారి ఆలోచనల్లో వచ్చిన మార్పులు, ఇవి పెద్దగా గమనించడం, వాటిగురించి సీరియస్‌గా ఆలోచించే తత్వం కాదు వెంకటరామయ్యది. కాలంతో పాటు మారే సాంఘిక పరిణామాలను బేరీజు వేసుకుంటూ, పిల్లలను గమనించుకుంటూ, వారి ఆలోచనలను పట్టించుకుని మంచి చెడ్డల గురించి వారితో మాట్లాడే టైము, ఆలోచన లేని వెంకామయ్య తత్వం అన్నపూర్ణమ్మకు బాగా తెలుసు. అందుకే ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలిరా దేవుడా అనుకుంటూ బాధపడింది.
రామకృష్ణను రమ్మని రాధ పెండ్లి విషయం మాట్లాడాలని మనసులో అనుకుంటూ, తాను కూడా రాధ గదిలోనే పడుకుంది.
మరుసటి రోజు అన్నపూర్ణమ్మ కొడుకుకు ఫోన్‌ చేసి రమ్మనమని వెంకటరామయ్యతో అనింది.
”వాడినెందుకు రమ్మనడం. నేను ఆ పెండ్లి వీలుకాదంటున్నాను కదా! వాడొచ్చి నాకు నచ్చచెబుతే నేను మారిపోతానా, అంతా పిల్లచేష్టలుగా ఉన్నాయి. ఏమి అవసరం లేదు”అని కొట్టిపారేశాడు. మరలా ”నేను వీలు చూసుకుని వాడిని రమ్మంటాను. నేను చూసిన ఆ సంబంధాల గురించి మాట్లాడి రాధకు నచ్చచెప్పమని”, అని టిఫిన్ తినటం ముగించి చేతులు కడుక్కుని పొలం దగ్గర పనుందని వెళ్ళిపోయాడు.
అన్నపూర్ణమ్మ రాధతో ‘అన్న రానీయమ్మా మాట్లాడుదాము” అని అప్పటికి రాధను సమ్మతపరిచే మాటలు అంటూ, ”రాధా టిఫిన్ తీసుకుందాము రా” అంటూ పిలిచింది.
రాధ ఏమీ మాట్లాడకుండా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి కూర్చొని అమ్మ పెట్టన నాలుగు ఇడ్లీలలో రెండు తీసి పెట్టి నెమ్మదిగా తినసాగింది. అమ్మ నాన్న సంభాషణ విన్న రాధకు వాళ్ళ నాన్న ఎంత పట్టుదల మనిషో అర్థం కాసాగింది. ఇంజనీరింగ్‌ చేస్తానంటే నాన్న వద్దన్నప్పుడు అన్నతో చెప్పి నాన్నను ఒప్పించుకుని చదివి, ఉద్యోగం చేస్తున్నట్లే పెండ్లి విషయంలో కూడా నాన్నను ఒప్పించ వచ్చనే ఆలోచనలో వున్న రాధకు తన పెండ్లి విషయంలో వాళ్ళ నాన్న వద్దని తెగేసి చెప్పేయడం, ఆ విషయంపై ఇంకేమీ తర్జన, బర్జనలొద్దని, రామకృష్ణను పిలిపించి ఈ విషయమై మ్లాడాల్సిన అవసరం లేదని వాళ్ళ నాన్న కచ్చితంగా అన్నపూర్ణమ్మతో చెప్పడంతో తన అన్న రామకృష్ణ మాటలు, సపోర్ట్‌ నాన్న దగ్గర పనిచేయవని తెలిసొచ్చింది. అయినా.. రామకృష్ణకు ఫోను చేసి రమ్మని చెప్పాలని అనుకుంటూ అదే విషయం వాళ్ళ అమ్మతో అనింది.
”అమ్మా! అన్నకు ఫోన్‌లో విషయం చెప్పి రమ్మని చెప్తాను”అని. అన్నపూర్ణమ్మకు ఏమి చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో, రాబోయే ఉపద్రవాన్ని భరించే శక్తి లేకో.. ” ఎందుకు ఆలోచించకుండా, మాతో ముందే విషయాలు చర్చించకుండా పెండ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నావు రాధా! ఇప్పుడు చూడు మీ నాయనేమో ఆయన మొండి పట్టుదల వదలడు. మీ అన్న వచ్చి ఏమి నచ్చచెపుతాడు అలాంటి మనిషికి. అయినా ఆ అబ్బాయి ఎలాంటి వాడో, వాళ్ళ విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా, ముఖ్యంగా వేరే కులంలో ఇచ్చి చేయడం మీ నాన్న ససేమిరా అంటాడు. ఏమి చేయాలిప్పుడు”అని నిస్సహాయంగా బాధపడింది అన్నపూర్ణమ్మ.
రాధకు వాళ్ళమ్మ పరిస్థితి కూడా అర్థమయ్యింది. కులాలు, మతాలు, పాతుకుపోయిన సంస్కృతి, సంప్రదాయాలను దాటిపోయి ఆహ్వానించేంత విశాల భావాలతో, ఆ భావజాల వాతావరణంలో అమ్మ నాన్న పెరగలేదు. నేనే తొందరపడి నిర్ణయించుకున్నానా! అని ఒకసారి ఆలోచించసాగింది. రెండు తరాల మధ్య ఆలోచన, అవగాహన అంతరాల వల్ల ఇలాంటి ప్రేమ వివాహాలు అంత సులభంగా జరగవన్న వాస్తవం గోచరమవుతూంది రాధకు.
అమ్మ నాన్నలను ఒప్పించి పెండ్లి చేసుకోవాలా! వద్దంటే … శ్రీధర్‌ను పెండ్లి చేసుకొనే ఆలోచన మానుకోవడమా! అనే మానసిక సంఘర్షణలో పడిపోయింది రాధ. ఇంట్లో అందరినీ కాదని వెళ్ళిపోయి పెండ్లి చేసుకునే ధైర్యం లేదు. అలా అని అమ్మా నాన్నను కాదని పెళ్ళి చేసుకోవడం రాధకు ఇష్టం లేదు. శ్రీధర్‌ పట్ల ఆకర్షితురాలై వీటన్నింటిని గురించి లోతుగా ఆలోచించలేదు. అందుకే అన్నారు ‘ప్రేమ గుడ్డిదని’ అని తలపోసింది.
ఆ రోజు రాధ, ‘రామకృష్ణకు ఫోన్‌ చేసింది. విషయం చెప్పి నాన్నతో మాట్లాడమని. రామకృష్ణ ”మేము, నేను మీ వదిన రెండు రోజుల్లో ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ ని కలిసి, చూసి, వాళ్ళతో మాట్లాడి వస్తామని చెప్పాము కదా రాధా, మేమెవరు చూడకుండా నాన్నతో ఎట్లా మాట్లాడేది”అని ఆగి ‘నీవు హైదరాబాద్‌ వెళ్ళిపో మేము వెళ్ళి శ్రీధర్‌తో మాట్లాడిన తరువాత మాట్లాడుదాం నాన్నతో సరేనా” అని పెట్టేశాడు ఫోన్‌ రామకృష్ణ. రాధ మనస్సులో నిస్పృహ, నిరుత్సాహం, నిస్సహాయత! ఈ విషయం ఇంత జఠిలమయిందా! అని తనను తానే ప్రశ్నించుకుంది. ఏమి చేయాలో తెలియన అయోమయ పరిస్థితిలో పడిపోయింది రాధ.
నేను ఇవన్నీ ఆలోచించకుండా శ్రీధర్‌పట్ల ఆకర్షితురాలయి, పరిచయాన్ని పెంచుకుని అమ్మ నాన్నను ఒప్పించి పెండ్లి చేసుకోవచ్చనే ధీమాతో ఎందుకిలా నిర్ణయం తీసుకున్నాను? నాన్నకు కులం పట్టింపు ఇంత గాఢంగా వుంటుందని ఊహించలేదు అని తనలో తర్కించుకోవడం మొదలు పెట్టింది. వేరే సంబంధం, నాన్న చూపెట్టిన మనిషిని పెండ్లి చేసుకోవడానికి మనసొప్పడం లేదు.
తన మనస్సులోని సంఘర్షణను ఆ రాత్రి వాళ్ళమ్మ ముందు పెట్టింది.
”ఈ ఆలోచన ముందే చేయాల్సింది రాధా, మేమంతా మా అమ్మ నాన్న కుదిర్చిన వ్యక్తులను పెండ్లి చేసుకుని సంసారం చేయడం లేదా”! అని అంది అన్నపూర్ణమ్మ.
రాధకు ఏమనాలో అర్థం కాలేదు. అమ్మ నాన్న పుట్టి పెరిగిన ఆ తరం ఆలోచనా విధానం అది అనే విషయం రాధకు స్పష్టమయింది. వారు ఆ సాంప్రదాయ ఆలోచనా చట్రం నుండి బయటపడి పెండ్లికి ఒప్పుకోవడం కష్టమనేది కూడా గ్రహించింది. తాను ఒక అగాధంలో పడిపోయి బయటపడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ.
”కాలంతోపాటు పెద్దలందరి మనసులు, ఆలోచనలూ మార్పు చెందవు. ఆ మార్పుకు దోహదం చేసే కారకాలు, కారణాలు, నేపద్యం అందరికి ఒకేలాగుండవని, సంఘంలో పాతుకు పోయిన కుల, మత హోదా, ఆస్తులు ఇవన్నీ ఆడపిల్లల వివాహాలకు ముఖ్యమయిన నిర్ణయాత్మ కారకాలనేది నాకు ఇప్పుడు అర్థమవుతూందమ్మా. వాటి ప్రభంజనానికి ప్రేమ గాలిలో కొట్టుకు పోవాల్సిందేనా?” అని రాధ నిరాశగా మాట్లాడిందని అత్తమ్మ చెప్పారు.
అన్నపూర్ణమ్మకు రాధ అంత ఆలోచించి, విడమర్చి వాళ్ళమ్మతో మాట్లాడడం ఆమెకు సంతోషమేసింది. రాధ మనసు మార్చుకుంటుందిలే, నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయనుకుంది. అదే విషయం ఆ రోజు రాత్రి అన్నపూర్ణమ్మ భర్తతో, ”రాధ ఆలోచిస్తూంది, మనసు మార్చుకుంటుందిలేండి, చూద్దాము,”అని అక్కడే పడుకుంది.
మరుసటి రోజు తెల్లవారే సమయానికి అన్నపూర్ణమ్మకు మెలకువ వచ్చి రాధ రూమ్‌లోకి పోయింది పలకరిద్దామని.
పైన ఫ్యాన్‌కు ఉరివేసుకుని వ్రేలాడుతున్న రాధను చూసి ” ఏమండీ రాధ…” గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి క్రింద పడిపోయింది అన్నపూర్ణమ్మ. వెంకటరామయ్య వచ్చి నిశ్చేష్టుడై నిలబడి పోయాడు.
*****

అంతా విన్న సునీతకు మనసులో బాధ, ఆందోళన, ఆలోచన సంఘంలో కాలం మోసుకొస్తున్న వేగవంతమయిన మార్పులకు తల్లిదండ్రులు, రాధలాంటి యువత ఎంతమంది ఎదుర్కొంటున్నారో ఇలాంటి సమస్యలు. సమస్యల నెదుర్కొనే ధైర్యం, నేర్పు, ఓర్పు లేకపోవడం. తల్లితండ్రుల అవగాహన, ఆలంబన కొరవడి ఇలాంటి
ఆత్మహత్యలు ఎక్కువవడం. దీనికి పరిష్కారమేది?”అని ఆలోచించసాగింది సునీత.
ఈ తరం యువతను ఎంతగానో ప్రభావితం చేస్తుంది సోషల్‌ మీడియా. ప్రపంచంలో యువత ఆలోచనలు, నడవడిక, చదువు, ఉద్యోగం, వివాహ విషయాలలో అంతర్జాలం అందించే సమాచారాలతో సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా వారొక ప్రత్యేకమయిన తరంగా తయారవుతున్నారు. ఇదొక విపరీత కాలదోషంగా తోచింది సునీతకు. ఈ కాల మార్పుల్లోని సాధక బాధకాలను తల్లి తండ్రులు కూడా పరిశీలించాలి, పిల్లల క్రొత్త ఆలోచనలను, వ్యక్తిత్వాలను గౌరవించి వారి జీవిత నిర్ణయాలు వాళ్ళు తీసుకునే విధంగా పిల్లల వ్యక్తిత్వాలను మలచుకోవాలి. ఈ కాలానుగుణంగా పిల్లల పెంపకంపై ఒక ప్రణాళికాబద్ధమయిన ఆలోచన ఈ తరం తల్లిదండ్రులు చేయాల్సి వుంది, లేకపోతే తరాల ఆలోచనాంతరాలు రాను రాను యువతను, తల్లిదండ్రులను చాలా మానసిక సంఘర్షణలకు లోను చేసి ఎటూ నిర్ణయించుకోలేక, పరిస్థితులతో రాజీ పడలేక ఆత్మహత్యే మార్గమని యువత మనో దౌర్బల్యానికి గురవుతున్నారు. తల్లితండ్రుల్లో ఈ అవగాహనా రాహిత్యంతో పిల్లల చదువు, వివాహం విషయాలలో తల్లితండ్రుల మోరల్‌ సపోర్టు లేకపోవడం వల్లనే ఈ ఆత్మహత్యలన్నీ. ఇవి ఈ కాలం, సంఘం చేస్తున్న హత్యలా…? అనే ప్రశ్న ఉదయించింది సునీత మనస్సులో. ఉదృత కాల ప్రవావహంలో నిర్జీవంగా కొట్టుకుపోతున్న యువత కండ్ల ముందు మెదిలారు సునీతకు.
ఆ ఉధృత నదీ ప్రవాహానికి కొట్టుకొని పోకుండా తట్టుకొని నిలబడి ప్రజలను ఆవలిగట్టుకు చేర్చే దృఢమైన వంతెనలాగ, తల్లితండ్రులు పాత, కొత్త తరాల మధ్య కాలప్రవాహ ఒడుదుడుకులను తట్టుకుని తమ పిల్లలను ఆవలి తరానికి క్షేమంగా చేరవేసే బలమైన జీవన వారధులు కావాలనిపించింది సునీతకు.
అంతలో దివ్య ”అమ్మా.. టిఫిన్ పెట్టు” అంటూ దగ్గరకు రావడంతో సునీత ఆలోచనలకు తెరపడింది. దివ్యను ప్రేమతో పొదివి పట్టుకుని కూతురితో కూడా డైనింగ్‌ హాల్‌లోకి నడిచింది సునీత.

1 thought on “జీవన వారధులు

  1. ప్రస్తుత కాలానికి అవసరమైన కథ. చాలా చక్కగా చెప్పారండీ విజయలక్ష్మిగారూ..

Leave a Reply to G.S.Lakshmi Cancel reply

Your email address will not be published. Required fields are marked *